Women's Day 2025
-
వయసుతో ముసిరే సమస్యలు..!
చాలా సమస్యలు స్త్రీ, పురుషులిద్దరిలోనూ కామన్‌గానే ఉన్నా... కొన్ని సమస్యలు మాత్రం మహిళల్లో చాలా ప్రత్యేకం. వాళ్లలో స్రవించే హార్మోన్లూ, సంక్లిష్టమైన సైకిళ్ల వల్ల వాళ్లకు కొన్ని సమస్యలిలా ప్రత్యేకంగా వస్తుంటాయి. ఈ నెల 8న ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలూ, పరిష్కారాలను సూచించే ఈ ప్రత్యేక కథనమిది...రుతుస్రావం మొదలుకాగానే ఓ బాలిక బాలుర నుంచి వేరుగా కనిపించడం మొదలువుతుంది.రుతుస్రావం నుంచే అమ్మాయిల్లో కొన్ని సమస్యలు కనిపించడం మొదలువుతుంది. చాలామంది అమ్మాయిలు ఇంకా ఈ విషయమై మాట్లాడటానికి ఇబ్బంది పడుతుంటారు. ఇందులో బిడియపడాల్సిందేమీ లేదు. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు డాక్టర్‌ను సంప్రదించి తగిన సూచనలతోపాటు అవసరమైతే తగిన వైద్య చికిత్స కూడా తీసుకోవాలి.తొలుత యువతల్లో కనిపించే రుతుసంబంధమైన సమస్యలను తెలుసుకుందాం.రుతుసంబంధిత సమస్యలను ఇంగ్లిష్‌లో మెన్స్ట్రువల్ డిజార్డర్స్‌గా చెబుతారు. వీటిల్లో కొన్ని ప్రధాన సమస్యలిలా ఉంటాయి. ప్రైమరీ అమెనోరియా : సాధారణంగా అమ్మాయిల్లో 12 నుంచి 16 ఏళ్ల మధ్య రుతుస్రావం మొదలువుతుంది. కానీ కొందరు యువతుల్లో 16 ఏళ్లు దాటినా రుతుక్రమం మొదలుకాదు. ఈ కండిషన్‌ను ‘ప్రైమరీ అమెనోరియా’ అంటారు. ఇందుకు చాలా కారణాలుంటాయి. వీళ్లు డాక్టర్‌ను సంప్రదించి, తగిన పరీక్షలు చేయించి, కారణాలు తెలుసుకోవాలి. ఆ కారణాన్ని బట్టి చికిత్స అందించాల్సి ఉంటుంది. డిస్మెనూరియా: రుతుసంబంధిత సమస్యల్లో ప్రధానమైనదీ, దాదాపు 80 శాతం మంది అమ్మాయిల్లో కనిపించేది రుతు సమయాల్లో నొప్పి. దీన్నే ‘డిస్మెనూరియా’ అంటారు. వీళ్లు ఒకసారి డాక్టర్‌ను సంప్రదించాక, వారి సలహాతో రుతుసమయంలో నొప్పి వచ్చినప్పుడల్లా వారు సూచించిన మోతాదులో నొప్పి నివారణ మందులు వాడుకోవచ్చు. అయితే వీటిని ఎక్కువగా వాడటం వల్ల మరికొన్ని ఆరోగ్య సమస్యలు రావచ్చు. కాబట్టి డాక్టర్ సూచించిన మోతాదుకు మించకుండా వాడాలి. పరిష్కారం : రుతు సమయంలో వచ్చే ఈ నొప్పి ఒక వయసుకు వచ్చాక చాలామందిలో దానంతట అదే తగ్గిపోతుంది. ఇలాంటివారికి డాక్టర్లు కొన్ని న్యూట్రిషనల్ సప్లిమెంట్లు కూడా సూచిస్తారు. సంతానం కలిగిన తర్వాత చాలామందిలో ఈ నొప్పి రావడం ఆగిపోతుంది. కొందరిలో నొప్పి రావడం ఆగకపోవచ్చు. వాళ్లు డాక్టర్‌ను సంప్రదించి, తగిన మందులు వాడాలి. మెనొరేజియా: కొంతమంది యువతుల్లో రుతు సమయంలో రక్తస్రావం చాలా ఎక్కువగా అవుతుంటుంది. ప్రధానంగా చిన్న వయసు (తరుణ వయస్కులైన అడాలసెంట్) బాలికల్లో అలాగే పాతిక ముఫ్ఫై ఏళ్లు వరకు యువతుల్లోనూ ఈ సమస్య కాస్త ఎక్కువే. ఇలా ఎక్కువ మోతాదులో రక్తం పోతుండటం వల్ల రక్తహీనతతో పాటు మరెన్నో ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. పరీక్షలూ, పరిష్కారం: ఈ సమస్య ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు కొన్ని హార్మోనుల పరీక్షలు చేయించుకొని, అవసరాన్ని బట్టి మందులు వాడాల్సి ఉంటుంది. కొన్ని సార్లు ఈ రక్తస్రావం ఫైబ్రాయిడ్స్ వల్ల కావచ్చు. వైద్యపరీక్షల ఫలితాలను బట్టి చికిత్స ఉంటుంది. ప్రి మెనుస్ట్రువల్ సిండ్రోమ్ : కొంతమంది మహిళల్లో రుతుస్రావం మొదలు కావడానికి కొద్ది రోజులు ముందర నుంచే కొన్ని శారీరక సమస్యలు కనిపిస్తుంటాయి. ఉదాహరణకు... ఆ సమయంలో వాళ్లకు రొమ్ముల్లో సలపరం, బాధ /నొప్పి, భావోద్వేగాలు వెంటవెంటనే మారి΄ోవడం (మూడ్స్ స్వింగ్స్) వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సమస్యను ప్రీ–మెనుస్ట్రువల్ సిండ్రోమ్ అంటారు. పరిష్కారం : ఈ సమయంలో కలిగే బాధల నివారణ కోసం తగినన్ని నీళ్లు తాగుతుండాలి. అలాగే ద్రవాహారం ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఆకుకూరలు, కాయగూరలతో కూడిన పౌష్టికాహారం ఎక్కువగా తీసుకోవాలి. ఒత్తిడికి లోనుకాకూడదు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఎండార్ఫిన్ అనే హార్మోన్లు విడుదలై, మంచి ఉపశమనం కలగజేస్తాయి. ఈ సమస్య ఉన్నవారు పొగతాగడం, కెఫిన్ డ్రింక్స్ (కాఫీ, కూల్‌డ్రింక్స్‌లో కోలా డ్రింక్స్ వంటివి), ఆల్కహాల్ వంటి వాటికి దూరంగా ఉండాలి. ఆహారంలో ఉప్పు బాగా తగ్గించాలి. ఉప్పు ఎక్కువగా ఉండే బేకరీ ఐటమ్స్‌కు దూరంగా ఉండాలి. కొవ్వులు, చక్కెరలు ఎక్కువగా ఉండే ఆహారాలను చాలా పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. అప్పటికీ ప్రయోజనం కనిపించక΄ోతే డాక్టర్‌ను సంప్రదించి, కొన్ని హార్మోన్ పరీక్షలు చేయించుకుని, ఆ వైద్య పరీక్షల ఫలితాలను బట్టి అవసరమైన చికిత్స తీసుకోవాలి. మూత్ర సంబంధ సమస్యలుమహిళల శరీర నిర్మాణం కారణంగా పురుషులతో ΄ోలిస్తే... మహిళల్లో మూత్రసంబంధమైన ఇన్ఫెక్షన్లు చాలా ఎక్కువ. మూత్రసంబంధమైన ఇన్ఫెక్షన్స్తో తరచూ వస్తుండేవారు నీళ్లూ, ద్రవాహారం ఎక్కువగా తీసుకుంటూ ఉండటం, ప్రతి మూడు గంటలకోసారి మూత్రవిసర్జనకు వెళ్లి, మూత్రాశయాన్ని పూర్తిగా ఖాళీ అయ్యేలా జాగ్రత్త తీసుకోవడం, భార్యాభర్త కలయిక తర్వాత మూత్ర విసర్జనకు వెళ్లడం (ఈ సమయంలో కాస్త వేగంగా మూత్రవిసర్జన చేయాలి), ప్రైవేటు పార్ట్స్ శుభ్రంగా కడుక్కోవడం, ప్రైవేట్ పార్ట్స్ దగ్గర ఎప్పుడూ పొడిగా ఉంచుకోవడం వంటి జాగ్రత్తలతో ఈ సమస్యను నివారించవచ్చు. యూరినరీ ఇన్‌కాంటినెన్స్: కొందరు మహిళల్లో మూత్రంపై నియంత్రణ అంతగా ఉండదు. ఈ సమస్య ఉన్నవారు దగ్గినా, తుమ్మినా, ఏదైనా వస్తువును అకస్మాత్తుగా ఎత్తినా, కొందరిలో నవ్వినా వారి పొట్టపై కండరాలు మూత్రాశయంపై ఒత్తిడి కలిగించి... మూత్రం చుక్కలు, చుక్కలుగా పడేలా చేస్తాయి. సాధారణంగా ప్రసవం తర్వాత ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ప్రసవమైన తర్వాత మహిళల పొట్ట కండరాలు బలహీనం కావడంతో మూత్ర విసర్జన స్ఫింక్టర్‌పై వారు నియంత్రణ కోల్పోయేందుకు అవకాశమెక్కువ. దాంతో ఈ సమస్య కనిపిస్తుంది. పరిష్కారాలు: డాక్టర్‌ను సంప్రదించి, వారు సూచించిన విధంగా కొన్ని ప్రసవానంతర వ్యాయామాలూ, కెగెల్స్ ఎక్సర్సైజ్ల ద్వారా మూత్రవిసర్జనపై నియంత్రణ సాధించవచ్చు లేదా వారు సూచించిన విధంగా చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది కొందరిలో శస్త్రచికిత్స కూడా అవసరమవుతుంది. మహిళల్లో కనిపించే కొన్ని సాధారణ గైనిక్ సమస్యలు..పీసీఓఎస్ / పీసీఓడీ : అండాశయంలో అనేక నీటితిత్తులు పెరిగే ఈ సమస్యను వైద్యపరిభాషలో పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ లేదా డిజార్డర్ అంటారు. చాలావరకు అవి హానికరం కాకపోవచ్చు. అలాగే గర్భధారణకూ పెద్దగా అంతరాయం కలిగించకపోవచ్చు. పీసీఓఎస్ / పీసీఓడీకి కారణాలు : మహిళల అండాశయం నుంచి ప్రతి నెలా ఒక ఫాలికిల్ (అండం పెరిగే నీటి తిత్తి) కనిపిస్తుంది. దీని పరిమాణం 18 నుంచి 20 మిల్లీమీటర్లకు చేరాక ఇది పగిలి దాని నుంచి అండం విడుదల అవుతుంది. అయితే కొంతమందిలో ఫాలికిల్స్ 5–10 మిల్లీమీటర్లకు చేరగానే అంతకు మించి అది పెరగకుండా చిన్న చిన్న నీటి బుడగలాగా పెరుగుతాయి. అవి పది, పన్నెండు కంటే ఎక్కువగా ఉన్న కండిషన్‌ను పాలిసిస్టిక్ ఓవరీస్ అంటారు. ఇవి ఏర్పడానికి స్పష్టమైన కారణం తెలియదుగానీ... మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్లు, కొన్ని మానసిక, శారీరక సమస్యలతో పాటు హార్లోన్లలో అసమతౌల్యత, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వంటి సమస్యలు ఉన్నప్పుడు ఇవి వస్తుండటం పరిశోధకులు గమనించారు. ఈ సమస్య ఉన్న మహిళల్లో బరువు పెరగడం, అవాంఛిత రోమాలు, పీరియడ్స్ సక్రమంగా లేకపోవడంతో పాటు కొంతమందిలో సంతానలేమి, గర్భధారణ సమస్యలు కనిపించవచ్చు. పరీక్షలు/పరిష్కారాలు : కొన్ని రక్తపరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షలతో సమస్యను నిర్ధారణ చేస్తారు. ఈ సమస్య ఉన్న మహిళలందరికీ ఒకేలాంటి చికిత్స ఉండదు. వారిలో కనిపించే లక్షణాలు, రక్తపరీక్షలు తేలిన అంశాలను బట్టి చికిత్స మారుతుంది. బరువు తగ్గించుకోవడం, అవసరాన్ని బట్టి మెట్ఫార్మిన్ వంటి మందులు, హార్మోన్లు వాడాల్సి ఉంటుంది. సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే అవసరాన్ని బట్టి ల్యాపరోస్కోపిక్ శస్త్రచికిత్స చేయాల్సి రావచ్చు. ఎండోమెట్రియాసిస్ : గర్భాశయం లోపలి పొరను ఎండోమెట్రియమ్ అంటారు. రుతుస్రావం తర్వాత ఈస్ట్రోజెన్ హార్మోన్ గర్భాశయం లోపలి గోడలపై ప్రభావం చూపడంతో అక్కడ ఎండోమెట్రియమ్ అనే పొర మొదటి 14 రోజులపాటు వృద్ధి చెంది, 15వ రోజున విడుదల అయ్యే ప్రోజెస్టెరాన్ అనే హార్మోన్ వల్ల ఆ పొర మరింత మందమవుతుంది. అక్కడ సన్నటి రక్తనాళాలు కూడా అభివృద్ధి చెందుతాయి. అప్పుడు ఓవరీస్‌లో విడుదలైన అండం శుక్రకణంతో కలవకపోతే 14 రోజుల తర్వాత ప్రొజెస్టెరాన్ ఉత్పత్తి ఆగిపోతుంది. దాంతో ఎండోమెట్రియమ్‌లో అభివృద్ధి చెందిన రక్తనాళాలు కుంచించుకుపోతాయి. ఫలితంగా ఎండోమెట్రియమ్ పొర... గర్భాశయం గోడ నుంచి ఊడిపోయి సన్నటి ముక్కలుగా రక్తంలో కలిసి బ్లీడింగ్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. మహిళల్లో ప్రతినెలా అయ్యే రుతుస్రావం ఇదే. అయితే కొందరిలో ఎండోమెట్రియమ్ కణాలు గర్భాశయంలోపలి వైపునకు కాకుండా, కొన్ని కారణాల వల్ల కడుపులోకి వివిధ అవయవాలపైన అంటే... అండాశయాలపైనా, ట్యూబ్స్‌పై, గర్భాశయం పై పొరపై, కత్తికడుపులోని గోడలపై, పేగులపై, మూత్రాశయంపై, ఇంకా చాలా అరుదుగా ఊపిరితిత్తుల్లో, మెదడులోకి పెరుగుతాయి. హార్మోన్ల ప్రభావం వల్ల అవి రుతుచక్రంలో ఎలాంటి మార్పులు చెందుతాయో... బయట పెరిగిన ఆ కణాల్లోనూ అలాంటి మార్పులే జరుగుతూ అవి పెరిగిన చోట కూడా వృద్ధి చెందుతుంటాయి. వాటినే ఎండోమెట్రియల్ ఇంప్లాంట్స్ అంటారు. రుతుస్రావం సమయంలో ఆ అవయవాల్లో కూడా కొద్దిగా బ్లీడింగ్ అవుతుంటుంది. ఈ సమస్యనే ఎండోమెట్రియాసిస్ అంటారు. వివిధ అవయవాలపై ఉన్న ఎండోమెట్రియమ్ ఇంప్లాంట్స్‌లో రక్తస్రావం జరిగాక... అది బయటకు వెళ్లడానికి దారి లేక రక్తం అక్కడిక్కడే ఇంకిపోతుంది. అయితే కొందరిలో రక్తం ఇంకకుండా అది గూడు కట్టడం జరగవచ్చు. కొందరిలో ఒక అవయవానికి, మరో అవయవానికి మధ్య ఈ రక్తపు కణాలు గూడుకట్టడం వల్ల కండ పెరగడమూ జరగవచ్చు. ఇలా జరగడం వల్ల పెరిగిన కండను అడ్హెషన్స్ లేదా ఫైబ్రోసిస్ బ్యాండ్స్ అంటారు. అలా పెరిగిన కణజాలం నుంచి విడుదల అయ్యే ప్రోస్టాగ్లాండిన్స్ హార్మోన్స్తోపాటు ఇతర రసాయన పదార్థాల వల్ల ఒక్కొక్కరిలో ఒక్కోలాంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో నడుం, పొత్తికడుపులో నొప్పి, సంతానం కలగకపోవడం, పేగులు అతుక్కు΄ోవడం, మూత్రనాళాలు, పేగుల్లో అడ్డంకులు ఏర్పడటం వంటి సమస్యలు రావచ్చు. పరిష్కారం : ఈ సమస్యకు ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్ వంటి హార్మోన్ మాత్రలతో చికిత్స అందిస్తారు. కొందరిలో శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం రావచ్చు.చర్మ సమస్యలు..మహిళల్లో బిగుతైన వస్త్రధారణ కారణంగా వారిలో చర్మానికి సంబంధించిన కొన్ని సమస్యలు కనిపించేందుకు అవకాశాలెక్కువ. అందులో ముఖ్యమైనవి... క్యాండిడియాసిస్ / ఫంగల్ ఇన్ఫెక్షన్స్: ఇది మహిళల్లో కనిపించే చాలా సాధారణ సమస్య. వాళ్లకు చెమట విపరీతంగా పట్టే ప్రదేశాల్లోనూ, అలాగే చర్మంలోని ముడతలుండే ప్రాంతాల్లో తగినంత గాలి, వెలుతురు సోకే అవకాశాలు తక్కువ. దాంతో అక్కడ ఉక్క΄ోతలతో చెమట తాలూకు చెమ్మ పెరగడంతో క్యాండిడియాసిస్ వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశమెక్కువ. ఇక కొందరిలో వాళ్లు గర్భం దాల్చినప్పుడూ ఈ సమస్యలు కనిపించడం మామూలే. అలాగే డయాబెటిస్ ఉన్నవారిలోనూ, రోగనిరోధక శక్తి తగ్గిన వారిలో, యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడే వారిలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తరచూ కనిపిస్తుంటాయి. పరీక్షలు / పరిష్కారాలు: సాధారణ ఫిజికల్ ఎగ్జామినేషన్‌తోనే ఈ సమస్యను తెలుసుకోవచ్చు. చర్మంపై వచ్చిన ఫంగస్ తాలూకు రకాన్ని బట్టి కొన్ని చర్మంపై పూసేందుకు కొన్ని పూతమందులూ (టాపికల్ మెడిసిన్స్), నోటి ద్వారా తీసుకోవాల్సిన యాంటీఫంగల్ మందులు వాడాల్సి ఉంటుంది. ఎండోక్రైన్ సమస్యలు : ఇది హార్మోన్ల స్రావాల్లో వచ్చే తేడాల వల్ల వచ్చే సమస్యలు. ఇందులో ప్రధానంగా రెండు రకాలు కనిపించేందుకు అవకాశాలెక్కువ. మొదటిది థైరాయిడ్ గ్రంథి చాలా తక్కువగా లేదా అస్సలు పనిచేయకపోవడం వల్ల వచ్చే సమస్య అయిన హైపోథైరాయిడిజమ్.ఈ సమస్య స్త్రీ, పురుషులిద్దరిలోనూ కనిపించినా సాధారణంగా మహిళల్లోనే కాస్త ఎక్కువ. రోగనిరోధక వ్యవస్థలో వచ్చే లోపాల వల్ల హై΄ోథైరాయిడిజమ్ రావచ్చు. తీవ్రమైన అలసట / మందకొడిగా ఉండటం, డిప్రెషన్, బరువు పెరగడం, చర్మం పొడిగా మారడం, మలబద్దకం, రుతుక్రమం సక్రమంగా రాకపోవడం వంటి లక్షణాలతో ఇది కనిపిస్తుంది. కొందరిలో ఈ కండిషన్ వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ మోతాదులు పెరిగి అవి హృద్రోగాలకు దారితీయవచ్చు. ఒక్కోసారి మైక్సిడిమా కోమా అన్న కండిషన్‌కు దారితీసి ప్రాణాపాయం కూడా సంభవించే అవకాశం ఉంది. గర్భిణుల విషయంలో థైరాక్సిన్ మోతాదులు తగ్గుతున్నాయేమో జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ పరీక్షలు చాలా అవసరం. గర్భిణుల్లో హై΄ోథైరాయిడిజం అన్నది బిడ్డ మానసిక వికాసానికి కొద్దిగా అంతరాయం కలిగించవచ్చు. అందుకే గర్భిణుల విషయంలో హైపోథైరాయిడిజమ్ లేకుండా జాగ్రత్త తీసుకోవాలి. లెవో థైరాక్సిన్ సోడియమ్ వంటి మందుల ద్వారా దీనికి చికిత్స చేస్తారు. హైపర్ థైరాయిడిజమ్ : రక్తంలో థైరాయిడ్ హార్మోన్లు (టీ3, టీ4) పెరగడం వల్ల వచ్చే సమస్యను హైపర్ థైరాయిడిజమ్ లేదా థైరోటాక్సికోసిస్ అంటారు. దీని లక్షణాలన్నీ హైపోథైరాయిడిజమ్ లక్షణాలకు పూర్తిగా విరుద్ధంగా ఉంటాయి. గుండెదడ చేతులు వణకడం బరువు తగ్గిపోవడం ∙నీరసం ∙విరేచనాలు ∙ రుతుక్రమానికి సంబంధించిన సమస్యలు థైరాయిడ్ గ్రంథి వాపు (గాయిటర్) వంటి లక్షణాలు కనిపిస్తాయి. హైపర్‌థైరాయిడిజమ్‌ను రక్త పరీక్ష ద్వారా గుర్తిస్తారు. ఈ పరీక్షలో రక్తంలో టీ3, టీ4 మోతాదు ఎక్కు కావడం, టీఎస్‌హెచ్ మోతాదు బాగా తగ్గి΄ోవడం కనిపిస్తుంది. దీనికి చికిత్సగా యాంటీ థైరాయిడ్ మందులు ఉపయోగిస్తారు. ఈ మందులను డాక్టర్ సలహా మేరకు తీసుకోవాలి. కొన్ని నెలల వ్యవధిలోనే ఈ సమస్య పూర్తిగా తగ్గుతుంది. చాలామందిలో ఈ యాంటీథైరాయిడ్ మందులు ఆపిన తర్వాత మళ్లీ థైరాయిడ్ హార్మోన్ మోతాదులు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ముందుగా యాంటీ థైరాయిడ్ మందుల ద్వారా హార్మోన్‌ని తగ్గించి, ఆ తర్వాత ఈ సమస్య శాశ్వత పరిష్కారం కోసం రెండు పద్థతులు అనుసరిస్తారు. మొదటి దానిలో రేడియో ఆక్టివ్ అయోడిన్ మందును ఎక్కువ మోతాదులో ఇవ్వడం ద్వారా థైరాయిడ్ గ్రంథిలో హార్మోన్ తయారు చేసే కణాలను నాశనం చేయడం ద్వారా హార్మోన్ స్రావాన్ని తగ్గిస్తారు. ఇక రెండో పద్ధతిలో ఆపరేషన్ ద్వారా థైరాయిడ్ గ్రంథిని తొలగించడం ద్వారా హార్మోన్ స్రావాన్ని తగ్గిస్తారు. ఈ రెండు పద్ధతుల్లోనూ హార్మోన్ స్రావం బాగా తగ్గిపోయి, చివరకు హార్మోన్ లోపానికి దారితీస్తుంది. అప్పుడుహైపోథైరాయిడిజమ్లో మాదిరిగానే జీవితాంతం థైరాక్సిన్ మాత్రలు వాడాల్సి ఉంటుంది. మధ్య వయసులో వచ్చేవి..మధ్యవయసు నాటికి మహిళల్లో కనిపించే సమస్యల్లో ముఖ్యమైనవి ఇవి... మెనోపాజ్ సమస్యలు : రుతుక్రమం రావడంతో సమస్యలు మొదలవుతాయంటే... తమకు 45 ఏళ్లు వచ్చాక అదే రుతుక్రమం ఆగి΄ోవడం కూడా మహిళల్లో ఒక సమస్యాత్మక అంశంగానే ఉంటుంది. రుతుక్రమం ఆగే సమయంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గినందున వారికి ఒంట్లోంచి వెచ్చటి ఆవిర్లు రావడం, భావోద్వేగాల్లో వేగంగా మార్పులు (మూడ్స్ స్వింగ్స్), ఆస్టియో΄ోరోసిస్తో ఎముకలు బలహీనం కావడం, ఈస్ట్రోజెన్ వల్ల గుండెకు కలిగే సహజ రక్షణ తొలగిపోవడం వల్ల గుండెజబ్బులకు తేలిగ్గా గురికావడం, యోని పొడిగా మారడం, గర్భసంచి కిందికి జారడం వంటి అనేక సమస్యలు కనిపిస్తాయి. పరిష్కారం : రుతుక్రమం ఆగిన (మెనోపాజ్) మహిళల్లో సంబంధిత లక్షణాలేవైనా కనిపిస్తే తక్షణం డాక్టర్‌ను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. లక్షణాలను బట్టి డాక్టర్లు హెచ్ఆర్టీ వంటి చికిత్సలను సూచిస్తారు. క్యాల్షియమ్, విటమిన్ ’డి’ ఇవ్వడం వల్ల మెనోపాజ్ వచ్చిన మహిళల్లో ఎముకల ఆరోగ్యం పటిష్టంగా ఉండటమే కాకుండా ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలను నివారించవచ్చు. అలాగే ఆహారంలో క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే పాల వంటివి తీసుకోవడంతోపాటు దేహానికి తగినంత వ్యాయామం కూడా అందేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆస్టియోపోరోసిస్... మహిళల్లో ఈ ఎముకలకు గుల్లబారి΄ోయే ఈ వ్యాధి చాలా ఎక్కువ. పైగా మన దేశ మహిళలు (ముఖ్యంగా చిన్నపిల్లల నుంచి యువతుల వరకు) క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే పాలు క్రమం తప్పకుండా తాగడం చాలా తక్కువ. ఇటీవల చాలామంది సూర్యకాంతికి ఎక్స్పోజ్ కాకపోవడంతో ఎముకలకు బలం చేకూర్చే విటమిన్ డీ3 పాళ్లూ తగ్గుతాయి. పైగా మహిళలకు వ్యాయామ అలవాట్లూ తక్కువే. వీటిన్నింటి ఫలితంగా మహిళల్లో ఎముక సాంద్రతా, బలం క్రమంగా తగ్గుతూ పోతుంది. ఇక తమ వ్యాధినిరోధక శక్తి తమపైనే ప్రతికూల ప్రభావం చూపే ఎముక సంబంధితమైన రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఎస్‌ఎల్‌ఈ వంటి వ్యాధులు మహిళ్లోనే ఎక్కువ. అందుకే మహిళల్లో ఎముకల బలాన్ని పెంచడానికి పొట్టుతో ఉంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఇచ్చే ధాన్యాలైన (గోధువు, జొన్న, మెుక్కజొన్న, రాగులు, ఓట్స్)తో చేసిన పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే పొట్టుతీసిన కార్బోహైడ్రేట్స్ నివారించాలి. తాజా పండ్లు, క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే రాగులు, తాజా ఆకుపచ్చ కూరలు (గ్రీన్ లీఫీ వెజిటబుల్స్) తీసుకోవడం చాలా మంచిది. ఇటీవలి ఆధునిక మహిళలు ఇంటిపనులతోపాటు బయట ఉద్యోగాలూ చేస్తున్నారు. అందుకే వారిపై పనిఒత్తిడి తోపాటు మానసిక ఒత్తిడీ ఎక్కువే. ఫలితంగా ఆరోగ్య సమస్యలూ ఎక్కువే. అందుకే ఆమెకు కుటుంబం నుంచీ, అందునా మరీ ముఖ్యంగా భర్త నుంచి తగిన సహాయ సహకారాలు అవసరమని అందరూ తెలుసుకోవాలి.డాక్టర్ చల్మేడ నివేదిత, సీనియర్ ఫిజీషియన్, డయాబెటాలజిస్ట్ (చదవండి: అరుదైన శసస్త్ర చికిత్స: దంతంతో కంటి చూపు..!) -
International Women's Day: సినీ మేడమ్స్
కథానాయికలు(Heroines) కనిపిస్తేనే వెండితెరకు నిండుదనం. సినిమాల ఘనవిజయాల్లో వారి పాత్ర గణనీయం దర్శకత్వం, రచన, నిర్మాణ నిర్వహణ, సినిమాటోగ్రఫీ.. వంటి తెరవెనుక పాత్రల్లోనూ కొందరు మహిళలు రాణిస్తున్నారు. తెరపైనా, తెరవెనుకా రాణించే సినీ మేడమ్స్ ముచ్చట్లు.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం(International Women's Day) సందర్భంగా...దీపిక కొండిమన సమాజంలో పురుషాధిక్యత, లింగ వివక్ష, అసమానతలు వంటి రకరకాల అవరోధాలు మహిళల అభివృద్ధికి సవాలుగా నిలుస్తున్నాయి. ఈ సమస్యలు అన్ని రంగాల్లోనూ ఉన్నాయి. వెండితెరపై కథానాయికలుగా మహిళలు వెలుగొందే సినీరంగం కూడా ఈ సామాజిక రుగ్మతలకు అతీతం కాదు. ఎన్ని సమస్యలు ఉన్నా, ఏటికి ఎదురీదుతూ ఎప్పటికప్పుడు తమ సత్తా చాటుకుంటున్న మహిళలు కూడా సినీరంగంలో ఉన్నారు. వారే నేటితరాలకు స్ఫూర్తి ప్రదాతలు. తాజాగా ఆర్మాక్స్ మీడియా భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని మహిళా ప్రాతినిధ్యంపై ఓ వుమానియా! 2024 నివేదిక విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, సినిమాలను ప్రేమించి, సినిమాల కోసం పనిచేసే సినీ మేడమ్స్ గురించిన ప్రత్యేక కథనం..‘ఓ వుమానియా!’... భారతీయ చలన చిత్రపరిశ్రమలోని మహిళా ప్రాతినిధ్యంపై వెలువడిన నివేదిక. గత నాలుగేళ్లుగా ప్రముఖ మీడియా కన్సల్టింగ్ సంస్థ ‘ఆర్మాక్స్ మీడియా’ ఏటా ఈ నివేదికను విడుదల చేస్తూ వస్తోంది. ఈ నివేదికను ఫిల్మ్ కంపానియన్ స్టూడియోస్ వీడియో రూపంలో నిర్మించగా, ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ‘అమెజాన్ ప్రైమ్’ విడుదల చేసింది. తాజాగా ‘ఓ ఉమానియా–2024’ నివేదిక ప్రస్తుత ధోరణులపై మరింత లోతైన వివరాలను అందించింది. సినిమా నిర్మాణం, సినీ నిర్మాణ సంస్థల్లోని కార్పొరేట్ నాయకత్వం, మార్కెటింగ్ వంటి కీలక రంగాలలో మహిళా ప్రాతినిధ్యంలోని అసమానతలను గుర్తించింది.2023లో మొత్తం తొమ్మిది (తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, పంజాబీ, బెంగాలీ, గుజరాతీ) భారతీయ భాషలలో విడుదల చేసిన 169 సినిమాలు, సిరీస్‌లను విశ్లేషించింది. వీటిని మళ్లీ థియేట్రికల్ సినిమాలు (70), డిజిటల్ స్ట్రీమింగ్ సినిమాలు (30), సిరీస్(69)లుగా విభజించింది.ఇందులో మన దక్షిణాది నుంచి లియో, జవాన్, ఆదిపురుష్, వాల్తేరు వీరయ్య, పొన్నియిన్ సెల్వన్ 2, భగవంత్ కేసరి, 2018, దసరా, విరూపాక్ష, సార్, హాయ్ నాన్న, భోళాశంకర్, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి, ఇంటింటి రామాయణం సహా పలు సినిమాలు ఎంపికయ్యాయి. బాలీవుడ్ నుంచి జైలర్, ఓ మై డాడ్ 2, మిషన్ మజ్ను, ది ఆర్చీస్, లస్ట్ స్టోరీస్ 2 వంటి పలు చిత్రాలున్నాయి. స్వీట్ కారం కాఫీ, మోడర్న్ లవ్ చెన్నై, షైతాన్, దూత, సేవ్ ది టైగర్స్, కుమారి శ్రీమతి సిరీస్‌లు సిరీస్ విభాగంలో సెలెక్ట్ అయి, మంచి మార్కులు సాధించాయి. ట్రైలర్ టాక్‌టైమ్‘ఓ వుమానియా’ నివేదిక ప్రకారం, మహిళలు ట్రైలర్లలో 29 శాతం టాక్‌టైమ్‌కు పరిమితమయ్యారు. గత రెండేళ్లలో ఇది నామమాత్రంగా పెరిగినప్పటికీ, ఓటీటీ స్ట్రీమింగ్ సినిమాలు ప్రమోషనల్ ట్రైలర్లలో మహిళలకు ఎక్కువ టాక్‌టైమ్ కేటాయించే ధోరణిని చూపిస్తున్నాయి. వీటిల్లో కొన్ని 55 శాతం ట్రైలర్ టాక్‌టైమ్‌తో అగ్రస్థానంలో ఉన్నాయి.తెలుగు: బూ, హాయ్ నాన్న; హిందీ: మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 2, వెడ్డింగ్.కాన్, సాస్ బహు ఔర్ ఫ్లెమింగో, జానే జాన్, రెయిన్బో రిష్ట, తాలీ; మరాఠీ: జిమ్మ; తమిళం: స్వీట్ కారమ్ కాఫీపాత బెచ్‌డెల్ పరీక్షసినిమాల్లో స్త్రీలను ఎలా ప్రదర్శిస్తున్నారో కొలిచే కొలమానం ‘బెచ్‌డెల్’ పరీక్ష. దీనిని 1985లో కార్టూనిస్ట్ అలిసన్ బెచ్‌డెల్ రూపొందించారు. అప్పటి నుంచి దశాబ్దాలుగా ఈ పరీక్షను చిత్రపరిశ్రమలో లింగవివక్షపై అంతర్జాతీయ కొలమానంగా పరిగణించారు. ఒక సినిమాలో కనీసం ప్రతి రెండు సన్నివేశాల్లో ఇద్దరు పేరున్న మహిళలు మాట్లాడుతుంటే, ఆ సినిమా బెచ్‌డెల్ టెస్ట్‌లో నెగ్గినట్లు పరిగణిస్తారు. అయితే, సినిమాల కంటే సిరీస్‌లకు ఎక్కువ రన్‌టైమ్ ఉంటుంది. కాబట్టి దానిని దృష్టిలో ఉంచుకొని, ఆ ప్రమాణాన్ని ప్రస్తుతం సిరీస్‌లకు రెండు నుంచి మూడు సన్నివేశాలుగా మార్చారు.నవరత్నాలుచలనచిత్ర పరిశ్రమలోని మొత్తం తొమ్మిది విభాగాల్లో పనిచేసే మహిళల స్థితిగతులను ఈ నివేదిక విశ్లేషించింది. దర్శకత్వం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, రైటింగ్, ప్రొడక్షన్, డిజైనింగ్, సంగీతం వంటి కీలక విభాగాలలో 15 శాతం మాత్రమే మహిళలు ఉన్నారు. దీన్ని ఓటీటీ, థియేట్రికల్‌గా విభజిస్తే థియేట్రికల్‌కు 6 శాతం మాత్రమే! దక్షిణాదిలో ఈ సంఖ్య చాలా తక్కువ. గత ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య ఒక శాతం తగ్గింది. ఓటీటీలో మాత్రం పరిస్థితి మెరుగ్గా ఉంది. స్ట్రీమింగ్ సినిమాలు, సిరీస్ రెండింటిలోనూ 20 శాతం కంటే ఎక్కువ స్థానాల్లో మహిళలు నాయకత్వం వహిస్తున్నారు. 18 శాతం కంటే ఎక్కువగా మహిళా నాయకత్వం ఉన్న విభాగాలలో ఎడిటింగ్ ముందంజలో ఉంది. డైరెక్టర్ స్థానాల్లో 8 శాతం మాత్రమే మహిళలు ఉన్నారు, గత సంవత్సరంతో పోలిస్తే ఇది కొంచెం తగ్గింది.టూల్‌కిట్ టెస్ట్మహిళల ప్రాతినిధ్యంపై ప్రశ్నావళినాలుగు భిన్నమైన ప్రశ్నలతో తయారుచేసిన ఒక టూల్‌కిట్‌ను కూడా ఈ నివేదిక విడుదల చేసింది. ఈ టూల్‌కిట్ ఆధారంగా విశ్లేషించిన స్ట్రీమింగ్ సినిమాల్లో కేవలం 31శాతం మాత్రమే లింగ సమానత్వ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాయి. వీటిలో సిరీస్‌లు ముందంజలో ఉన్నాయి, వాటిలో 45 శాతం పరీక్షలో ఉత్తీర్ణత సాధించాయి. సినిమాలు, సిరీస్‌లు తదితరమైన వాటి నిర్మాణంలో వివిధ విభాగాలకు మహిళలు నాయకత్వం వహించినప్పుడు వాటిలో మహిళలకు సముచిత ప్రాతినిధ్యం లభించిందని, అవి బాగా విజయవంతమయ్యాయని ఈ నివేదిక వెల్లడించింది. థియేట్రికల్ సినిమాల్లో 18 శాతం మాత్రమే మహిళల నాయకత్వంలో రూపొందాయి.పురుషులు లేని సంభాషణ, డైలాగ్ కనీసం ఒకటైనా ఉందా? కథానాయకుడితో ప్రేమ లేదా కుటుంబ సంబంధం లేని పాత్రను పోషించిన ఒక మహిళా పాత్ర ఉందా?2. షో/సినిమా కథకు కీలకమైన ఆర్థిక, గృహసంబంధ, సామాజిక నిర్ణయాలను తీసుకోవడంలో, కనీసం ఒక్కరైనా చురుకైన మహిళ పాత్రను పోషిస్తున్నారా? కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాలు, సిరీస్‌లలో పురుష పాత్రలపై వ్యతిరేక దృక్పథాన్ని వ్యక్తపరచే అంశం ఉందా?షో/సినిమా స్త్రీలను లైంగికంగా చిత్రీకరించడం లేదా మహిళలపై హింసను సాధారణంగా లేదా ఆమోదయోగ్యంగా చిత్రీకరిస్తుందా?మొదటి మూడు ప్రశ్నలకు సానుకూల సమాధానం ‘అవును’, అయితే నాల్గవ ప్రశ్నకు అది ‘లేదు’ అని సమాధానాలు వచ్చినట్లయితేనే, తమ సినిమాలో లేదా సిరీస్‌లో మహిళలకు సముచిత ప్రాతినిధ్యం దక్కుతున్నట్లు నిర్మాతలు ఎవరికి వారే తేల్చుకోవచ్చు. అందుకు ఈ ప్రశ్నావళి ఉపయోగపడుతుంది.మహిళా జట్టు సినిమాల హిట్టుపూర్తి మహిళా బృందంతో చిత్రీకరించిన తొలిచిత్రం ‘ది మైడెన్’. 2018లో అలెక్స్ హూమ్స్ రచించి, దర్శకత్వం వహించిన ఈ సినిమాను విక్టోరియా గ్రెగరీ ‘న్యూ బ్లాక్ ఫిల్మ్స్’ నిర్మించింది. ఇందులో ఒక అమ్మాయి సెకండ్ హ్యాండ్ నౌకను కొని, నౌకాయానం నేర్చుకొని, రేసులో ఎలా గెలుస్తుందో చూపించారు. ఇదేవిధంగా మహిళలు ప్రధానంగా, ఎక్కువ సంఖ్యలో ఉండి ఎన్నో సినిమాలు తీశారు. వాటిల్లో ముఖ్యమైనవి, చెప్పుకోదగినవి ‘ది వుమెన్’. 1939లో విడుదలైన ఈ సినిమాలో ఒక్క పురుషుడు కూడా కనిపించడు. మొత్తం 130 మంది మహిళలు ఇందులో నటించారు.అలాగే ‘స్టీల్ మాగ్నోలియాస్’ సినిమాలో లూసియానా పట్టణంలోని ఒక స్త్రీల బృందం జీవితం, ప్రేమను చూపిస్తుంది. ‘ఎ లీగ్ ఆఫ్ దేర్ ఓన్’ ఇదొక బేస్‌బాల్ బృందం కథ. తక్కువ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఎంతోమంది చేత కంటతడి పెట్టిస్తుంది. 1993లో విడుదలైన ‘ది జాయ్ లక్ క్లబ్’ సినిమా చైనీస్ మహిళల వలసలు, తల్లుల మధ్య సంబంధాలను అద్భుతంగా చిత్రీకరించింది. 2018లో విడుదలైన ‘ఓసెన్స్ 8’ చిత్రం, మహిళలు దోపిడీలు చేస్తే ఎలా ఉంటుందో కాస్త నవ్విస్తూనే అందరినీ ఆశ్చర్యపరచేలా చూపించింది.తెలుగు తెర మెరుపులు..మహానటి సావిత్రిమహానటి సావిత్రి గొప్ప నటిగానే కాకుండా, దర్శకురాలిగానూ పేరు సంపాదించుకున్నారు. హీరోయిన్గా కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే ఆమె దర్శకత్వంలో ప్రయోగం చేశారు. సావిత్రి దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘చిన్నారి పాపలు’. 1968లో ‘శ్రీమాతా పిక్చర్స్’ నిర్మాణ సంస్థ విడుదల చేసిన ఈ చిత్రానికి సావిత్రి స్వయంగా కథారచన చేశారు. వాణిజ్యపరంగా ఇది విఫలమైనప్పటికీ, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ‘మాతృదేవత’, ‘వింత సంసారం’ వంటి సినిమాలకు కూడా ఆమె దర్శకత్వం వహించారు. బహుముఖ ప్రజ్ఞశాలి భానుమతి తెరపై కథానాయికగానే కాదు, తెర వెనుక అనేక విభాగాల్లోనూ పనిచేసిన నటి భానుమతి రామకృష్ణ. ‘చండీరాణి’ సినిమాతో డైరెక్టర్‌గా మారిన ఆమె, ‘నాలో నేను’ అనే పుస్తకంతో పాటు, మరెన్నో పాటలకు రచన, గాత్రం అందించారు. భర్త రామకృష్ణతో కలసి చిత్ర నిర్మాణంలోనూ పాలు పంచుకున్నారు. కళారంగంలో ఆమె చేసిన కృషికి జాతీయ చలనచిత్ర అవార్డుతోపాటు, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులను అందుకున్నారు. రికార్డు నెలకొల్పిన విజయనిర్మల సినీ ప్రపంచంలోకి ఒంటరిగా అడుగుపెట్టి, తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మహిళ విజయనిర్మల. కేవలం నటిగానే కాదు, నిర్మాతగా, దర్శకురాలిగా వెండితెరపై తన పేరుకు తగ్గట్లుగానే ఎన్నో విజయాలు సాధించారు. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్ట్స్‌లో స్థానం సంపాదించుకున్నారు. సినీ సీతమ్మ అంజలీదేవిసీతాదేవి అనగానే ఠక్కుమని గుర్తొచ్చే నటి అంజలీదేవి. అభినయ సీతమ్మగా పాపులర్ అయిన ఆమె నటిగా, డ్యాన్సర్‌గానే కాదు, నిర్మాతగానూ చేశారు. తన భర్త ఆదినారాయణరావుతో కలసి నెలకొల్పిన ‘అంజలీ పిక్చర్స్’ నిర్మాణ సంస్థ ద్వారా ‘భక్త తుకారం’, ‘చండీప్రియ’ సహా మొత్తం 27 సినిమాలను నిర్మించారు. కృష్ణవేణి ఎన్టీఆర్‌లాంటి మహానటుడిని చిత్రసీమకు పరిచయం చేసిన, ప్రముఖ నిర్మాత చిత్తజల్లు కృష్ణవేణి బాలనటిగా రంగప్రవేశం చేశారు. ఇటీవల మరణించిన ఆమె, మీర్జాపురం రాజావారితో వివాహం అనంతరం ‘జయా పిక్చర్స్’ బాధ్యతలనూ తీసుకున్నారు. తర్వాత ‘శోభనాచల స్టూడియోస్’గా పేరు మార్చి ఎన్నో చిత్రాలను నిర్మించారు. ఆమె కుమార్తె అనురాధ కూడా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 17 సినిమాలు నిర్మించి, అత్యధిక చిత్రాలను నిర్మించిన మహిళా నిర్మాతగా లిమ్కా బుక్ రికార్డ్స్ సాధించారు. కృష్ణవేణి తన 98 ఏళ్ల వయసులో 2022లో ‘సాక్షి ఎక్సలెన్స్’ అవార్డుల్లో భాగంగా ‘జీవిత సాఫల్య పురస్కారం’ అందుకున్నారు. మరెందరో!నటి జీవితా రాజశేఖర్ ‘శేషు’ సినిమాతో దర్శకురాలిగా మారి, ‘సత్యమేవజయతే’, ‘మహంకాళి’ వంటి సినిమాలను రూపొందించారు. సూపర్‌స్టార్ కృష్ణ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంజుల ఘట్టమనేని ‘మనసుకు నచ్చింది’ సినిమాకు దర్శకత్వం వహించారు. మరెన్నో సినిమాలకు నిర్మాతగానూ వ్యవహరించారు. తొలి చిత్రం ‘ఆంధ్రా అందగాడు’ సినిమాతో విమర్శలు అందుకున్న సుధ కొంగర, తాజాగా ఆకాశమే హద్దు అనిపించారు.‘ద్రోహి’, ‘గురు’ చిత్రాలతో పాటు, ‘ఆకాశమే నీ హద్దు రా’ సినిమాతో వరుస విజయాలు అందుకున్నారు. ‘అలా మొదలైంది’ చిత్రంతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన నందినిరెడ్డి, ‘కళ్యాణ వైభోగమే’, ‘ఓ బేబీ’ మరెన్నో విజయవంతమైన చిత్రాలను చిత్రీకరించారు. దశాబ్దంపాటు, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచే సి, తొలిచిత్రం ‘పెళ్లి సందడి’తో విజయం సాధించారు డైరెక్టర్ గౌరీ రోణంకి. నిర్మాణ రారాణులుసినీ ప్రపంచంలో నిర్మాతలుగా రాణిస్తున్న రాణులు కూడా లేకపోలేదు. దిల్‌రాజు కుమార్తె హన్షితా రెడ్డి, తండ్రి బాటలోనే సుమారు 50కి పైగా సినిమాలు నిర్మించారు. మెగా కుటుంబం నుంచి వచ్చిన నిహారిక కొణిదెల కూడా ఇటు ప్రొడక్షన్ రంగంలో గుర్తింపు తెచ్చుకున్నారు. పలు వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిల్మ్స్ నిర్మించారు. చిన్న సినిమాలే కాదు, భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించారు, నిర్మాత అశ్వనీ దత్ కూతుర్లు అయిన స్వప్న దత్, ప్రియాంక దత్. అన్నపూర్ణ స్టూడియోస్ సీఈఓ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుప్రియ యార్లగడ్డ కూడా ఎన్నో చిత్రాలను నిర్మించింది. వీరితో పాటు నటి సమంత ‘ట్రలాలా మూవింగ్ పిక్చర్స్’ , నయనతార ‘రౌడీ పిక్చర్స్’, జ్యోతికలు వివిధ ప్రొడక్షన్ హౌస్‌లు స్థాపించి, తమదైన రీతిలో రాణిస్తున్నారు. చిత్రపరిశ్రమలో వైవిధ్యం, స్త్రీ పురుష సమానత్వం ఉన్నట్లయితే, సమాజంలో సానుకూల మార్పులకు అవి దోహదపడతాయి. వినోదరంగంలో మహిళలకు మరిన్ని అవకాశాలను సృష్టిస్తూ, వైవిధ్యభరితమైన, సమ్మిళితమైన, సమానమైన పరిస్థితులను కల్పించాలి. ప్రతి ఒక్కరూ స్త్రీలను చూసేలా, వినగలిగేలా, సానుకూలంగా చెప్పుకునేలా చేయాలి. అప్పుడే సినిమా బతుకుతూ, మరెందరినో బతికిస్తుంది. -
ఆ ‘సగమే’ అసలు బలం
శరీరంలో ఐరన్ లేమి స్త్రీలను బాధిస్తూ ఉంటుంది. గర్భధారణ, ప్రసవ సమయాలలో ఎంతో కీలకమైన ఐరన్ కోసం స్త్రీలు ఆహారం, మందుల మీద ఆధారపడుతుంటారు. ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ అంచనా ప్రకారం నేడు ప్రపంచ వ్యాప్తంగా 15 నుంచి 49 ఏళ్ల మధ్య ఉన్న స్త్రీలు 50 కోట్ల మంది ఐరన్ డెఫిషియెన్సీతో బాధ పడుతున్నారు.కాని వీరు తమ స్వభావంలో ఉక్కుగుణాన్ని మాత్రం ఎన్నడూ వదులుకోరు. వీరు మాత్రమే కాదు ప్రతి స్త్రీ తన జీవనంలో, పరిస్థితులను ఎదుర్కొనడంలో ఉక్కు మహిళే. ఆ మహిళ తెలుగు నాట మారుమూల పల్లెలో ఉండొచ్చు. ప్రపంచంలో వేరే మూలన మరో గూడెంలో ఉండొచ్చు. మహిళా దినోత్సవం ‘స్థానికం’గా నిర్వహించే తంతు కాదు.ఇది అంతర్జాతీయ వేడుక. ప్రపంచ మహిళలను ఏకం కావాలని కోరే సందేశ సందర్భం. 1910లో కోపెన్‌హెగెన్‌లో 17 దేశాల నుంచి వచ్చిన 99 మంది మహిళలు ‘శ్రామిక మహిళల హక్కుల దినోత్సవం’ కోసం పిలుపు ఇచ్చినప్పుడు అది అంతర్జాతీయ మహిళా దినోత్సవం కావాలనే కోరుకున్నారు. కారణం భూమ్మీద ఏ మూలన ఉన్న స్త్రీ అయినా స్థూలంగా ఎదుర్కొనే సమస్యలు ఒకటేనని భావించడం. అందరూ కలిసి సమస్యల పై పోరాడాలని కోరుకోవడం.ఇన్నేళ్లు గడిచినా రూపంలో, సారంలో స్త్రీలు అనేక సవాళ్లను ఎదుర్కొంటూనే ఉన్నారు. యుద్ధాలు వస్తే వారు తమ ఇంటిని, భర్తను, సంతానాన్ని కోల్పోతున్నారు. ప్రభుత్వాలు అభివృద్ధి పేరుతో చేసే తవ్వకాలు, కట్టే పెను కట్టడాలు, ప్రకటించే సుందరీకరణాలు మొదటగా స్త్రీలు శ్రమపడి అల్లిన గూళ్లనే ధ్వంసం చేస్తున్నాయి. చట్టపరమైన అనుమతి కలిగిన వ్యసనాలు... మద్యపానం, ధూమపానం పురుషుల ఆరోగ్యాన్ని దెబ్బ తీసి స్త్రీల మీద పెను ఒత్తిడి పెడుతున్నాయి. తాజాగా ఆన్లైన్ ట్రేడింగ్ అడిక్షన్ లక్షల కొద్ది అప్పును కుటుంబం మీద కుమ్మరించేలా చేస్తోంది. కడుపున పుట్టిన సంతానం పాలిట డ్రగ్స్, గంజాయి పెను పడగలు విప్పి ఉన్నాయి. స్త్రీ తన చేతులతో ఒండి పెట్టాల్సిన ఆహారం కలుషితాలను కలిగి బతుక్కు ఏమాత్రం గ్యారంటీ ఇవ్వలేకపోతోంది. నిత్యావసర ఖర్చులను స్త్రీయే అజమాయిషీ చేసి ఎంత పొదుపు చేయాలనుకున్నా అనారోగ్య ఖర్చు, చదువు ఖర్చు స్త్రీల ప్రధాన కార్యక్షేత్రమైన ‘ఇంటిని’ పూర్తిగా సంక్షోభంలో పడేస్తున్నాయి.దేశం సరిహద్దులోని సైన్యం, కేంద్ర, రాష్ట్రాలలో ప్రభుత్వ యంత్రాంగం వల్ల మాత్రమే నడుస్తోంది అనుకుంటే పొరపాటు. వీటన్నింటి మధ్య ఉక్కుగుణాన్ని వదుల్చుకోని స్త్రీలే దేశాన్ని నడుపుతున్నారు. అయినప్పటికీ వీరి స్థయిర్యాన్ని దెబ్బ తీయడానికి తగిన పీడనలను ఈ సమాజం వదులుతూనే ఉంది. లైంగిక వేధింపులు, సామూహిక అత్యాచారాలు, యాసిడ్ దాడులు, ప్రేమకు ‘నో’ చెప్తే హత్యలు, ఉద్యోగ ఉపాధి రంగాల్లో జీతభత్యాల వివక్ష, చట్ట సభల్లో ఇంకా దొరకని వాటా, గృహ హింస, వరకట్నం, తీరికే ఇవ్వని ఇంటి చాకిరి, పిల్లల పెంపకం, ఆడపిల్ల జననానికి అననుకూలత... ఇవన్నీ ప్రపంచవ్యాప్త స్త్రీలతో పాటు భారతీయ మహిళలకు మూగదెబ్బలుగా మారుతున్నాయి.నిజానికి ఇప్పుడు వారి బాధ్యత ఇంకా పెరిగింది. స్త్రీలు ముందుకు వస్తే తప్ప సరికాని సమస్యలు పెరుగుతున్నాయి. పురుషులు తెస్తున్న దేశాల మధ్య యుద్ధం, పర్యావరణ విధ్వంసం, ΄పౌర హక్కుల విఘాతం, న్యాయ వివక్ష, మత విద్వేషం, తప్పుడు వాట్సప్ సమాచారాల పంపిణి, బలహీనులపై బెదిరింపు... ఇవన్నీ మొదట ఎవరో మనకు తెలియని స్త్రీ ఇంటికే హాని కలిగించవచ్చుగాని కాలక్రమంలో అవి ప్రతి ఇంటికీ చేరుతాయి.స్త్రీలు తాము నివసించే ఇంటి లోపలి, బయటి ఆవరణాలను ప్రజాస్వామ్య స్వభావంతో ఉంచడానికి... సుహృద్భావన పెంచడానికి... పిల్లలకు అందరూ కలిసి ఆడే ఆటస్థలాలు ఇవ్వడానికి... సంపద కాస్తయినా దిగువ వర్గాలకు అందేలా చూడటానికి... విద్య, వైద్యంలో అతి డబ్బు ప్రమేయాన్ని నిరోధించడానికి.... ఆచార వ్యవహారాలు గుదిబండలుగా మారకుండా, రాజ్యాంగస్ఫూర్తిని రక్షించుకోవడానికి మరింత ఆలోచన, చైతన్యం కలిగించుకోవాలి. మరింత ఉక్కుగుణం సముపార్జించుకోవాలి.ప్రతి స్త్రీకి తను, తన కుటుంబం, తన సమాజం, తన దేశం, తన ప్రపంచం... ఇవన్నీ ముఖ్యం. దుర్మార్గం అనేది కేవలం ఇతరుల పాలిట జరిగితే ఊరుకోగలిగేది కాదు. దుర్మార్గం అందరూ ఖండించదగ్గది. పురుష సమాజం తన దుర్మార్గాలకు అడ్డెవరు నిలుస్తారులే అనుకుంటే జవాబు స్త్రీల నుంచే వస్తుంది. స్త్రీలకు ఇంటిని చక్కదిద్దుకోవడమే కాదు... పరిస్థితులను చక్కదిద్దడం కూడా తెలుసు. ఉక్కు మహిళలకు స్వాగతం.అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా నేటి నుంచి సాక్షి ఫ్యామిలీలో వారం రోజుల పాటు విశిష్ట కథనాలను అందించనున్నాం. -
మా అమ్మ మాకు ఇన్స్పిరేషన్
-
International Women's Day 2025 : మీకు స్ఫూర్తినిచ్చిన వనితను గుర్తు చేసుకోండి!
ప్రతీ ఏడాది మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటాం. మహిళల హక్కులను గుర్తించడం, వారి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక విజయాలను,గౌరవించడమే దీని లక్ష్యం. ఈ సందర్భంగా లింగ సమానత్వం, పునరుత్పత్తి హక్కులు, మహిళలపై హింసపై పోరాటం, సమాన హక్కులు అంశాలపై విస్తృతంగా చర్చించుకోవడం అవసరం. తల్లిగా, సోదరిగా, భార్యగా, కుమార్తెగా మహిళ పాత్ర మన జీవితాల్లో చాలా కీలకమైంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మీ జీవితంలో ప్రభావం చూపిన, లేదా మీరు మెచ్చిన నచ్చిన మహిళ గురించి ఒక నిమిషం వీడియో చేయండి. ఆమెతో మీ అనుబంధాన్ని మరోసారి గుర్తుచేసుకోండి. దీనికి #VanithaVandanam యాడ్ చేయడం మర్చిపోద్దు!