
నళిని ఓ ఫుడ్‌ప్రెన్యూర్. జంషెడ్‌పూర్, టాటానగర్‌లో పుట్టారు. ప్లస్ టూ వరకు అక్కడే చదివారు. ఆ తర్వాత ఒడిశా, భువనేశ్వర్‌లో డిగ్రీ, ఎంబీఏ చేశారు. బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేశారు. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీద కలిగిన ఆసక్తి ఆమెను మార్కెటింగ్ వైపు అడుగులు వేయించింది. పాలు, పాల ఉత్పత్తుల మార్కెటింగ్‌లో సక్సెస్ అయ్యారు. కరోనా పాండమిక్ ఆమె కెరీర్‌ని మలుపు తిప్పింది. సొంతంగా ఏదైనా చేయాలనే ఆసక్తి ఆమెతో మిల్లెట్ మిరకిల్ చేయించింది. బ్రెడ్ తయారీలో ఉన్న ఆసక్తి కొద్దీ ఆ ఫార్ములాని మిల్లెట్స్ మీద ప్రయోగం చేశారు. అగ్రికల్చర్, ఫుడ్ సైంటిస్టుల పరీక్షలను నెగ్గిన నళిని విజయవంతమైన తన ప్రయోగానికి పేటెంట్ ఫైల్ చేశారు. మహిళాదినోత్సవం సందర్భంగా ఆమె ‘సాక్షి’తో పంచుకున్న వివరాలివి.
ఇది నా పేటెంట్ ప్రోడక్ట్!
చపాతీ అంటే ప్రకటనలో చూపించినట్లు మూడువేళ్లతో తుంచేటంత మృదువుగా ఉండాలి. మిల్లెట్స్ ఆరోగ్యానికి మంచివని చపాతీ చేస్తే తినడం కష్టంగా ఉంటోంది. పరిష్కారం ఏమిటి? దీనిని ఛేదించగలిగితే సక్సెస్ చేతికందినట్లే. ఇందుకోసం నళిని తన ఆలోచనకు పదును పెట్టారు. తన సాధన ఫలించి ఆమె సాధన ఫలించి, ఇంట్లో వాళ్లు సంతృప్తిగా తిన్నారూ.. తిన్నారు. దీనినే తన ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కి మార్గం చేసుకోవచ్చు కదా!
అనుకోవడంతోనే సంబంధిత అనుమతుల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఆమె చేసిన రెడీ టూ కుక్, రెడీ టూ ఈట్ మిల్లెట్ చపాతీలు ఆ పరీక్షల్లో నెగ్గాయి. నిల్వ ఉండడానికి ఆర్టిఫీషియల్ ప్రిజర్వేటివ్స్ ఏమీ వాడడం లేదని, పోషకాల లభ్యత బాగుందని హైదరాబాద్, రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఫుడ్æ సైంటిస్టులు నిర్ధారించారు. పరీక్షలలో నెగ్గిన తర్వాత తన ఫార్ములాను పరిరక్షించుకోవడం కోసం పేటెంట్ ఫైల్ చేశారు నళిని.
అగ్రికల్చరల్ యూనివర్సిటీ... ఫుడ్ డెవలప్‌మెంట్ విభాగంలోని ఇన్‌క్యుబేటర్‌లో ప్రయోగదశలను నిర్వహించడానికి అవకాశం ఇవ్వడంతోపాటు అగ్–హబ్, నిధి ప్రయాస్ గ్రాంట్‌లు ఇచ్చి ప్రోత్సహించింది. తన ఆలోచన, ప్రభుత్వం నుంచి అందినప్రోత్సాహంతో పరిశ్రమ స్థాపించగలిగానని చెప్పారు నళిని. ‘‘రెండు–మూడు సంవత్సరాల గ్రౌండ్ వర్క్ తర్వాత తెరమీదకు వచ్చాను. ప్రస్తుతం పరిమితంగానే ఉత్పత్తి చేస్తూ నగరంలోని క్యూ మార్ట్, స్టార్ హోటళ్లకు అందిస్తున్నాను. పేటెంట్ వచ్చిన తర్వాత మార్కెటింగ్ మీద దృష్టి పెడతాను. ఒక కొత్త ఉత్పత్తిని ఊహించుకుని, నా జ్ఞానాన్ని మేళవించి, నిరంతరాయంగా శ్రమించి సాధించుకున్న విజయం ఇది. నా ఆలోచన, ప్రయోగానికి పేటెంట్ సాధించుకోవడం అనే ఊహే ఆనందంగా ఉంది’’ అన్నారు నళిని.
మల్టీ టాస్కింగ్ మహిళలకు కొత్త కాదు!
మల్టీ టాస్కింగ్‌లో మహిళలు సిద్ధహస్తులు. ఇంటి బాధ్యతలను నిర్వహించడమే అందుకు నిదర్శనం. గృహిణి బాధ్యతలకే పరిమితం కాకుండా ఇంకా ఏదైనా చేయాలనే ఆసక్తి ఉన్న వాళ్లు చాలామంది ఉన్నారు. కానీ వాళ్లలో ఎక్కువ మంది అలా అనుకుంటూనే రోజులు గడిపేస్తుంటారు. ధైర్యం చేసి తొలి అడుగు వేస్తే నడక దానంతట అదే కొనసాగుతుంది. అయితే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో అడుగుపెట్టేముందు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే... మరుసటి రోజు నుంచే లాభాల కోసం చూడరాదు. రాబడి పెరిగి ఆదాయం వచ్చే వరకు శ్రమించగలిగిన సహనం ఉండాలి. లాభాల బాట పట్టిన తర్వాత కూడా అలాగే శ్రమను కొనసాగించాలి.
– నళిని, ఫౌండర్, కిబేస్, హైదరాబాద్
– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment