millet
-
మలేషియా ప్రధానికి స్పెషల్ మిల్లెట్ లంచ్..మెనూలో ఏం ఉన్నాయంటే..!
మలేషియా ప్రధాని అన్వర్ బిన్ ఇబ్రహీం మూడు రోజుల భారత పర్యటన నిమిత్తం సోమవారం సాయంత్రానికి ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం రాష్ట్రపతి భవన్లో ప్రధాని నరేంద్ర మోదీ అన్వర్బిన్కి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు ప్రధానుల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఆ తర్వాత ప్రధాని మోదీ భారతీయ మలయ్ వంటకాల తోపాటు మిల్లెట్లను హైలెట్ చేసేలా గ్రాండ్ లంచ్‌ను ఏర్పాటు చేశారు. మెనూలో ఏం ఉన్నాయంటే..మెనూలో భారతీయ, ఆగ్నేయాసియా రుచులను అందంగా మిళితం చేసేలా విభిన్న వంటకాలను అందించింది. ఇందులో నూడుల్స్, కూరగాయలు, స్పైసి వంటకాలు, కొబ్బరితో చేసినవి ఉన్నాయి. ఇక తీపి, కారంతో మిళితం చేసే పెర్ల్ మఖానీ వొంటన్, పెర్ల్ మిల్లెట్, కాటేజ్ చీజ్ తదితరాలు ఉన్నాయి. అలాగే మిక్స్డ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్‌తో తయారు చేసినన సలాడ్, రుచికరమైన కబాబ్‌లకు రిఫ్రెష్ బ్యాలెన్స్‌లో ఉల్లిపాయలు, బెంగాలీ పంచ్ ఫోరాన్ మసాలాలు, జీలకర్రతో వండిన బ్రెజ్డ్, బటన్ మష్రూమ్‌లు ఉన్నాయి. ఇవికాక మిల్లెట్కి సంబంధించి రాగి, బచ్చలి, జీడిపప్పతో చేసిన కుడుములు, బంగాళదుంప జీడిపప్పుతో చేసిన మిల్లెట్ కుడుము విత్ బచ్చలి కూర గ్రేవీ, గుజరాతీ ఖట్టి మీథీ దాల్, పులిహోర తదితరాలతో మలేషియా ప్రధానికి గొప్ప విందును ఏర్పాటు చేశారు మోదీ. కాగా, 2023 అధికారికంగా మిల్లెట్ సంవత్సరంగా ప్రకటించినప్పటి నుంచి అంతర్జాతీయ ఆదరణ లభించేలా మెల్లెట్స్తో ఎలాంటి వైవిధ్యమైన వంటకాలు చేయొచ్చు తెలిపేలా భారతీయ వంటకాలతో చాటి చెబుతోంది. (చదవండి: బ్రెయిన్ సర్జరీలో వైద్యుల తప్పిదం..పాపం ఆ రోగి..!) -
మిల్లెట్ మీల్‌తో ఆరోగ్యం..
ఒకప్పుడు గ్రామీణ ప్రాంత్రాలకే పరిమితమైన చిరుధాన్యాల వంటలు నేడు పట్టణ ప్రాంతాల్లో బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో వాటికి బాగా డిమాండ్ పెరిగింది. ఒకప్పుడు సంప్రదాయ వంటలైన అన్నం, రొట్టెలకే పరిమితమైన చిరుధాన్యాల (మిల్లెట్స్)తో ఇప్పుడు వివిధ రకాల తినుబండారాల ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు అనేక చిరుతిండ్లను తీసుకుంటుంటాం. ప్రస్తుతం నగరవాసులు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నగర వాసులు వాటి స్థానంలో ఈ ఆహారాన్ని తీసుకుంటున్నారు. దీంతో పాటు నగరవాసుల సమయాన్ని దృష్టిలో ఉంచుకుని పలువురు ఉత్పత్తిదారులు.. రెడీ–టు ఈట్, రెడీ–టు కుక్ ఉత్పత్తులను అందుబాటులోకి తెస్తున్నారు.. ఈ చిరుధాన్యాల కథేంటి? వాటితో ఎలాంటి ఆహారాన్ని తయారు చేస్తున్నారు? తదితర వివరాలు తెలుసుకుందాం.. రోనా పుణ్యమా అని నేడు చాలామంది ఆరోగ్యంపై దృష్టిసారిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇది కేవలం పట్టణ ప్రాంతాలకే కాకుండా గ్రామీణ ప్రాంతాలకూ పాకగా, చిరుధాన్యాల పంటలు, వంటకాలకు డిమాండ్ పెరిగింది. ప్రతిదీ కాలుష్యానికి గురవ్వడం, కల్తీ అవ్వడంతో ఆరోగ్యకరమైన ఆహారానికే మొగ్గుచూపుతున్నారు ప్రజలు. ఆరోగ్యకరమైన ఆహారం ప్రస్తుత పరిస్థితుల్లో మిల్లెట్లు, చిరుధాన్యాలతోనే సాధ్యమని భావించి ఆ తరహా వంటకాలకు ప్రాధాన్యతనిస్తున్నారు.ఐకరాజ్యసమితి గుర్తింపు... మిల్లెట్స్‌కి ఉన్న ప్రాధాన్యతను భారతదేశం ఐక్యరాజ్యసమితి ముందు పెట్టగా 2023ను అంతర్జాతీయ మిల్లెట్స్ డేగా ప్రకటించింది. భారత్‌ను మిల్లెట్స్ దేశంగా 74 దేశాలు గుర్తించాయి. దీనికి ముందే భారత్ 2023ను అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా గుర్తించింది. అంతకుమునుపు 2018లో జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించి, ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలకు దీనిపై అవగాహన కలి్పంచడం ప్రారంభించింది. ఆ కార్యక్రమం విజయవంతం కావడంతో 2023ను అంతర్జాతీయ సంవత్సరంగా గుర్తించాలని ఐక్యరాజ్యసమితిని కోరగా 74 దేశాలు గుర్తించాయి. దీంతో ప్రపంచ దేశాల్లో కూడా మిల్లెట్స్‌కు డిమాండ్ పెరిగింది.పాత పంటలు.. కొత్త వంటలుమిల్లెట్స్ పాత తరం పంటలైనా వాటితో కొత్త రకం వంటలు చేసి.. న్యూట్రిషనల్ వ్యాల్యూస్‌తో ఈ తినుబండారాలు రూపొందిస్తున్నారు. మిల్లెట్స్‌ను ద్వితీయ పద్ధతల్లో ప్రాసెసింగ్ చేసి ఈ ఉత్పత్తులను సిద్ధం చేస్తున్నారు. దీంతో పాటు రెడీ–టు– ఈట్, రెడీ–టు–కుక్ అనే పద్ధతుల్లో కొత్త వంటకాల ఉత్పత్తులను మార్కెట్లోకి తెస్తున్నారు. 400 అంకుర సంస్థలు దేశ వ్యాప్తంగా ప్రస్తుతం మిల్లెట్స్‌తో వివిధ రకాల తినే వస్తువులను తయారు చేయడానికి 400 రకాల కంపెనీలు పనిచేస్తున్నాయి. చిరుధాన్యాల విలు వలతో కూడిన పలు ఆహార ఉత్పత్తులు తయారు చేస్తున్నారు.ఏవి చిరుధాన్యాలు... జొన్నలు, రాగులు, సజ్జలు, సామలు, హరికలు, కొర్రలు, అండు కొర్రలు, ఊదలు మొదలైన వాటిని భారత దేశంలోనే సంప్రదాయ పంటలుగా పండిస్తుంటారు. గతంలో వీటినే ఎక్కువగా ఆహారంగా వాడేవారు.. అయితే నూతన వంగడాలు అందబాటులోకి రావడంతో వాటిపై దృష్టి మరల్చారు. అవగాహన పెరగడంతో ప్రస్తుతం సంప్రదాయ పంటలవైపే చూపు మరల్చి నూతన పద్ధతుల ద్వారా అధిక దిగుబడులు రాబడుతున్నారు రైతులు. తీనికితోడు ఈ పంటలకు డిమాండ్ పెరగడంతో అదే పద్ధతులను అవలంభిస్తున్నారు. మార్కెట్లో మిల్లెట్స్ ఉత్పత్తులు.. రాగి నుండి మాల్ట్, చిరుధాన్యాల నుంచి పఫ్స్, స్నాక్స్, జొన్న ఇడ్లీమిక్స్, ఉప్మా, దోస, పొంగల్, లడ్డూ మిక్స్, జొన్న ముయోస్లీ, పాస్తా, కుకీలు, బ్రెడ్, బన్, కేక్, పిజ్జా, ఐస్‌క్రీం, జొన్న పేలాలతో పాటు, జొన్న పంటలో అనేక రకాల వంటకాలను తయారు చేస్తున్నారు.జొన్న ముడి పదార్థాలలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. కాబట్టి ఇది అన్ని వయస్సుల వారికీ అనుకూలమైన ఆహారం. జొన్నలో మెగ్నీషియం, ఐరన్, జింక్, పీచుతో కూడిన ప్రొటీన్ అధికంగా ఉంటుంది. జొన్న రోల్స్, జొన్న బూందీ లడ్డు, సమోస, వడ, అరిసెలు, షర్బత్ కూడ తయారు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ గణాంకాల ప్రకారం 12,600 టన్నుల చిరుధాన్యాల పదార్థాలు ప్రతి రోజు ప్రజలు తింటున్నారు.చిరు«ధాన్యాల ఉత్పత్తులకు డిమాండ్ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ఐసీఎఆర్, భారతీయ చిరుధాన్యాల పరిశోధన సంస్థ లాంటివి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి. దీంతో వీటికి భారీగా డిమాండ్ పెరిగింది. ముందు ముందు చిరుధాన్యాలు, మిటెల్స్కు మంచి ఆదరణ ఉంటుంది. అనేక రకాల స్నాక్స్ తయారు చేసి రెడీగా ఉంచుతున్నాం. అప్పటికప్పుడు తినడానికి, వండుకోవడానికీ అనుకూలంగా ఉత్పత్తులను అందుబాటులోకి తెస్తున్నాం.. – డాక్టర్ బి.దయాకర్ రావు, సీఈఓ న్యూట్రీహబ్, ఐఏఎంఆర్ రాజేంద్రనగర్ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం.. ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో చిరుధాన్యాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. దీనికితోడు నూతన పద్ధతుల్లో వీటిని పండించడానికి ప్రభుత్వం పోత్సాహం అందిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అంకుర సంస్థలు అందుబాటులోకి వస్తున్నాయి. వీటి ద్వారా చిరుధాన్యాలతో న్యూట్రిషన్ ఫుడ్ తయారు చేస్తూ ప్రజలకు అందుబాటులో, రైతులు పండించిన పంటలకు మార్కెట్లో డిమాండ్ కలి్పస్తున్నారు. పలు స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంలో చిరుధాన్యాల ఉత్పత్తులు తయారువుతున్నాయి. -
మిల్లెట్స్ తింటున్నారా? ఆ వ్యాధులను పూర్తిగా మాయం చేయగలదు!
సాక్షి సాగుబడి, హైదరాబాద్: చిరుధాన్యాలను రోజువారీ ప్రధాన ఆహారంగా తీసుకోవటానికి అలవాటు పడితే యావత్ మానవాళికి ఆహార /పౌష్టికాహార భద్రతతో పాటు ఆరోగ్య/ పర్యావరణ భరోసా దొరుకుతుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. ‘చిరుధాన్యాలతో ప్రపంచ ప్రజలకు ఆహార భద్రత’ అనే అంశంపై రాజేంద్రనగర్‌లోని జాతీయ వ్యవసాయ విస్తరణ యాజమాన్య సంస్థ (మేనేజ్)లో మంగళవారం ప్రారంభమైన మూడు రోజుల అంతర్జాతీ రౌండ్‌టేబుల్ సమావేశంలో 31 దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. ‘మేనేజ్’తో కలసి ఆఫ్రికా ఆసియా గ్రామీణాభివృద్ధి సంస్థ (ఎఎఆర్‌డిఓ) నిర్వహిస్తున్న ఈ రౌండ్‌టేబుల్ ప్రారంభ సమావేశంలో మిల్లెట్ మాన్ ఆఫ్ ఇండియా, పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. ఖాదర్ వలితో పాటు ప్రకృతి వ్యవసాయ పితామహుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత సుభాష్ పాలేకర్ ప్రధాన స్రవంతి వ్యవసాయ శాస్త్రవేత్తలతో కలసి తొలిసారి వేదికను పంచుకోవటం విశేషం. డా. ఖాదర్ వలి కీలకోపన్యాసం చేస్తూ, భూగోళంపై వేల ఏళ్లుగా ప్రజలు ప్రధాన ఆహారంగా తింటున్న చిరుధాన్యాలే అసలైన ఆహారమన్నారు. అయినప్పటికీ.. ఆంగ్లేయులు, పాశ్చాత్యులు ఇది మనుషుల ఆహారం కాదని చెప్పటం ప్రారంభించి గోధుమలు, వరి బియ్యాన్ని హరిత విప్లవం పేరుతో ప్రోత్సహిస్తూ కేంద్రీకృత వ్యవస్థ ద్వారా పారిశ్రామిక ఆహారోత్పత్తులను ముందుకు తేవటం వల్ల చిరుధాన్యాలు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొన్నదని, ఇందువల్లనే ఆహార భద్రత సమస్య ఉత్పన్నమైందన్నారు. పారిశ్రామిక ఆహారం కారణంగానే మానవాళి ఎన్నో జబ్బుల పాలవుతున్నదని మానవాళి, శాస్త్రవేత్తలు, పాలకులు గుర్తెరగాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. మనుషులను రోగగ్రస్థంగా మార్చుతున్న కార్పొరేట్ ఆహారాన్ని వదిలించుకుంటేనే మానవాళికి జబ్బుల నుంచి, ఎడతెగని ఔషధాల వాడకం నుంచి సంపూర్ణ విముక్తి దొరుకుతుందన్నారు. సిరిధాన్యాలు (స్మాల్ మిల్లెట్స్) దివ్యౌషధాలుగా పనిచేస్తున్నాయని 8 ఏళ్లుగా తాను వందలాది మంది రోగులతో కలసి చేసిన అధ్యయనంలో వెల్లడైందని డా. ఖాదర్ వలి పేర్కొన్నారు. శాస్త్రీయంగా ఫలితాలను నమోదు చేశామని, 140 రకాల జబ్బుల్ని ఆరు నెలల నుంచి 2 ఏళ్లలోపు నయం చేయటమే కాదు పూర్తిగా మాయం చేస్తున్నట్లు గుర్తించామన్నారు. సిరిధాన్యాలను రోజువారీ ప్రధాన ఆహారంగా తీసుకుంటూ ఉంటే డయాబెటిస్, బీపీ, ఊబకాయం, కేన్సర్ వంటి జబ్బులకు వాడుతున్న మందులను క్రమంగా మానివేస్తూ పూర్తి ఆరోగ్యాన్ని సంతరించుకోవచ్చన్నారు. సిరిధాన్యాలు సకల పోషకాలను అందించటంతోపాటు దేహంలో నుంచి కలుషితాలను బయటకు పంపటంలోనూ కీలకపాత్రపోషిస్తున్నాయన్నారు. ఇవి వర్షాధారంగా పండే అద్భుత ఆహార ధాన్యాలని అంటూ సాగు నీటితో పండించే ఆహారం అనారోగ్య కారకమనటంలో ఏ సందేహమూ లేదని డా. ఖాదర్ వలి తెలిపారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత సుభాష్ పాలేకర్ ప్రసంగిస్తూ పోషకాల గనులైన చిరుధాన్యాలను రసాయనాలతో సాగు చేయటం విచారకరమన్నారు. రసాయనాలతో పండించటం వల్ల చిరుధాన్యాల్లో పోషకాలు తగ్గిపోవటమే కాకుండా, రసాయనిక అవశేషాల వల్ల ప్రజలకు హాని కలుగుతుందన్నారు. చిరుధాన్యాల వేలాది వంగడాలను అనాదిగా ఆదివాసులు సంరక్షిస్తున్నారని, మనకు తెలియని చిరుధాన్య రకాలు ఇప్పటికీ వారి వద్ద ఉన్నాయన్నారు. శాస్త్రవేత్తలు వాటిపై దృష్టి కేంద్రీకరిస్తే మరింత ఎక్కువ పోషకాలున్న చిరుధాన్యాలు వెలుగులోకి రావచ్చన్నారు. ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లో ప్రకృతి వ్యవసాయం ద్వారా చిరుధాన్యాల సాగును, వినియోగాన్ని ప్రోత్సహించటంపై పాలకులు దృష్టి కేంద్రీకరిస్తే ఆహార భద్రత సమస్య, పర్యావరణ సమస్య కూడా తీరిపోతుందని పాలేకర్ సూచించారు. భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ (ఐఐఎంఆర్) సంచాలకులు డా. సి.తార సత్యవతి ప్రసంగిస్తూ చిరుధాన్యాల సాగును విస్తృతంగా చేయాలన్నారు. వరి కోతల తర్వాత ఆ పొలాల్లో జొన్న తదితర చిరుధాన్యాలను సాగు చేసి అధిక దిగుబడి సాధించవచ్చని తమ అధ్యయనంలో రుజువైందన్నారు. చిరుధాన్యాలను అన్నం, రొట్టెలతో పాటు 300 రకాల ఉత్పత్తులుగా మార్చి తినవచ్చన్నారు. ఐఐఎంఆర్ ప్రపంచ దేశాలకు ఆధునిక చిరుధాన్య ఉత్పత్తులకు సంబంధించిన సాంకేతికతను అందిస్తోందన్నారు. ‘మేనేజ్’ డైరెక్టర్ జనరల్ డా. పి. చంద్రశేఖర ప్రసంగిస్తూ ఆహార భద్రత సాధించాలంటే చిరుధాన్యాల ఉత్పత్తిని పెంపొందించడానికి అందరూ సమన్వయంతో కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎఎఆర్‌డిఓ ప్రధాన కార్యదర్శి మనోజ్ నర్దేవ్సింగ్, డా.సంజీవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
Vishala Reddy Vuyyala: విశాల ప్రపంచం
ఈ ఏడాది మనదేశంలో జీ 20 సదస్సులు జరిగాయి. దేశదేశాల ప్రతినిధులు మనదేశంలో అడుగుపెట్టారు. వారికి మనదేశం గురించి సరళంగా వివరించాలి. ఆ వివరణ మనకు గర్వకారణంగా సమగ్రంగా ఉండి తీరాలి. అందుకు ఒక గిఫ్ట్ బాక్స్‌ను రూపొందించారు విశాల రెడ్డి. మిల్లెట్ బ్యాంకు స్థాపకురాలిగా తన అనుభవాన్ని జోడించారు. మన జాతీయ పతాకాన్ని గర్వంగా రెపరెపలాడించారు. విశాలాక్షి ఉయ్యాల. చిత్తూరు జిల్లాలో ముల్లూరు కృష్ణాపురం అనే చిన్న గ్రామం ఆమెది. ప్రపంచ దేశాల ప్రతినిధులు హాజరైన జీ 20 సదస్సులో సమన్వయకర్తగా వ్యవహరించారు. మనదేశంలో విస్తరించిన అగ్రికల్చర్, కల్చర్, ఆర్ట్, క్రాఫ్ట్, కళావారసత్వాలను కళ్లకు కట్టారు. అంత గొప్ప అవకాశం ఆమెకు బంగారు పళ్లెంలో పెట్టి ఎవ్వరూ ఇవ్వలేదు. తనకు తానుగా సాధించుకున్నారు. ‘ఆడపిల్లకు సంగటి కెలకడం వస్తే చాలు, చదువెందుకు’ అనే నేపథ్యం నుంచి వచ్చారామె. ‘నేను బడికెళ్తాను’ పోరాట జీవితంలో ఆ గొంతు తొలిసారి పెగిలిన సమయమది. సొంతూరిలో ఐదవ తరగతి పూర్తయిన తర్వాత మండల కేంద్రంలో ఉన్న హైస్కూల్‌కి వెళ్లడానికి ఓ పోరాటం. కాళ్లకు చెప్పుల్లేకుండా పదికిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి చదువుకున్నారు. ఆ తర్వాత కాలేజ్... కుప్పంలో ఉంది. రోజూ ఇరవై– ఇరవై నలభై కిలోమీటర్ల ప్రయాణం. డిగ్రీ కర్నాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లో. అప్పటికి ఇంట్లో పోరాడి కాలేజ్‌కి వెళ్లడానికి ఒక సైకిల్ కొనిపించుకోగలిగారామె. ప్రయాణ దూరం ఇంకా పెరిగింది. మొండితనంతో అన్నింటినీ గెలుస్తూ వస్తున్నప్పటికీ విధి ఇంకా పెద్ద విషమ పరీక్ష పెట్టింది. తల్లికి అనారోగ్యం. క్యాన్సర్‌కి వైద్యం చేయించడానికి బెంగుళూరుకు తీసుకువెళ్లడం, డాక్టర్లతో ఇంగ్లిష్‌లో మాట్లాడగలిగిన చదువు ఉన్నది ఇంట్లో తనకే. బీఎస్సీ సెరికల్చర్ డిస్కంటిన్యూ చేసి అమ్మను చూసుకుంటూ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ డిస్టెన్స్‌లో బీఏ చేశారు. అమ్మ ఆరోగ్యం కోసం పోరాటమే మిగిలింది, అమ్మ దక్కలేదు. ఆమె పోయిన తర్వాత ఇంట్లో వాళ్లు ఏడాది తిరక్కుండా పెళ్లి చేసేశారు. మూడవ నెల గర్భిణిగా పుట్టింటికి రావాల్సి వచ్చింది. ఎనిమిది నెలల బాబుని అక్క చేతిలో పెట్టి హైదరాబాద్‌కు బయలుదేరారు విశాలాక్షి ఉయ్యాల. ‘తొలి ఇరవై ఏళ్లలో నా జీవితం అది’... అంటారామె. ‘మరో ఇరవై ఏళ్లలో వ్యక్తిగా ఎదిగాను, మూడవ ఇరవైలో వ్యవస్థగా ఎదుగుతున్నా’నని చెప్పారామె. హైదరాబాద్ నిలబెట్టింది! ‘‘చేతిలో పదివేల రూపాయలతో నేను హైదరాబాద్‌లో అడుగు పెట్టిన నాటికి ఈవెంట్స్ రంగం వ్యవస్థీకృతమవుతోంది. ఈవెంట్స్ ఇండస్ట్రీస్ కోర్సులో చేరిపోయాను. ఇంగ్లిష్ భాష మీద పట్టుకోసం బ్రిటిష్ లైబ్రరీ, రామకృష్ణ మఠం నుంచి పుస్తకాలు తెచ్చుకుని చదివేదాన్ని. మొత్తానికి 2004లో నెలకు మూడు వేల జీతంతో ఈవెంట్ మేనేజర్‌గా ఉద్యోగంలో చేరాను. ఆ తర్వాత నోవాటెల్‌లో ఉద్యోగం నా జీవితానికి గొప్ప మలుపు. ప్రపంచస్థాయి కంపెనీలలో ఇరవైకి పైగా దేశాల్లో పని చేయగలిగాను. నా పేరుకు కూడా విశాలత వచ్చింది చేసుకున్నాను. హైదరాబాద్‌లో రహగిరి డే, కార్ ఫ్రీ డే, వన్ లాక్ హ్యాండ్స్ వంటి సామాజిక కార్యక్రమాలు నిర్వహించాను. ప్రదేశాలను మార్కెట్ చేయడంలో భాగంగా హైదరాబాద్‌ని మార్కెట్ చేయడంలో భాగస్వామినయ్యాను. ఒక ప్రదేశాన్ని మార్కెట్ చేయడం అంటే ఆ ప్రదేశంలో విలసిల్లిన కల్చర్, ఆర్ట్, క్రాఫ్ట్ అన్నింటినీ తెలుసుకోవాలి, వచ్చిన అతిథులకు తెలియచెప్పాలి. అలాగే రోడ్ల మీద ఉమ్మడం, కొత్తవారి పట్ల దురుసుగా ప్రవర్తించడం వంటి పనులతో మన ప్రదేశానికి వచ్చిన వ్యక్తికి చేదు అనుభవాలు మిగల్చకుండా పౌరులను సెన్సిటైజ్ చేయాలి. ఇవన్నీ చేస్తూ నా రెండవ ఇరవై ముగిసింది. అప్పుడు కోవిడ్ వచ్చింది. హాలిడే తీసుకుని మా ఊరికి వెళ్లాలనిపించింది. అప్పుడు నా దగ్గరున్నది పదివేలు మాత్రమే. నాకు అక్కలు, అన్నలు ఏడుగురు. నా కొడుకుతోపాటు వాళ్ల పిల్లలందరినీ చదివించాను. అప్పటికి నేను పెట్టిన స్టార్టప్ మనుగడ కూడా ప్రశ్నార్థకమైంది. పదివేలతో వచ్చాను, ఇరవై ఏళ్ల తర్వాత పదివేలతోనే వెళ్తున్నాను... అనుకుంటూ మా ఊరికెళ్లాను. ఊరు కొత్త దారిలో నడిపించింది! నా మిల్లెట్ జర్నీ మా ఊరి నుంచే మొదలైంది. మా అక్క కేజీ మిల్లెట్స్ 15 రూపాయలకు అమ్మడం నా కళ్ల ముందే జరిగింది. అవే మిల్లెట్స్ నగరంలో యాభై రూపాయలు, వాటిని కొంత ప్రాసెస్ చేస్తే వంద నుంచి రెండు– మూడు వందలు, వాటిని రెడీ టూ కుక్‌గా మారిస్తే గ్రాములకే వందలు పలుకుతాయి. తినే వాళ్లకు పండించే వాళ్లకు మధ్య ఇంత అగాథం ఎందుకుంది... అని ఆ అఖాతాన్ని భర్తీ చేయడానికి నేను చేసిన ప్రయత్నమే మిల్లెట్ బ్యాంక్. ఈ బ్యాంక్‌ను మా ఊరిలో మొదలు పెట్టాను. ఒక ప్రదేశం గురించి అక్కడి అగ్రికల్చర్, కల్చర్, ఆర్ట్, క్రాఫ్ట్ అన్నీ కలిస్తేనే సమగ్ర స్వరూపం అవగతమవుతుంది. నేను చేసింది అదే. మా మిల్లెట్ బ్యాంకు జీ 20 సదస్సుల వరకు దానంతట అదే విస్తరించుకుంటూ ఎదిగింది. ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు, చేర్యాల పెయింటింగ్స్, ఉత్తరాది కళలు, మన రంగవల్లిక... అన్నింటినీ కలుపుతూ ఒక గిఫ్ట్ బాక్స్ తయారు చేశాను. ప్రతినిధులకు, వారి భాగస్వాములకు భారతదేశం గురించి సమగ్రంగా వివరించగలిగాను. జీ20 ద్వారా ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చుకున్న నా మిల్లెట్ బ్యాంకు మరింతగా వ్యవస్థీకృతమై ఒక అమూల్లాగా ఉత్పత్తిదారుల సహకారంతో వందేళ్ల తర్వాత కూడా మనగలగాలనేది నా ఆకాంక్ష. మిల్లెట్ బ్యాంకుకు అనుబంధంగా ఓ ఇరవై గ్రీన్ బాక్స్‌లు, సీడ్ బ్యాంకులు కూడా ఏర్పాటు చేయాలి. రైతును తన గింజలు తానే సిద్ధం చేసుకోగలిగినట్లు స్వయంపోషకంగా మార్చాలనేది రైతు బిడ్డగా నా కోరిక’’ అని మిల్లెట్ బ్యాంకు, సీడ్ బ్యాంకు స్థాపన గురించి వివరించారు విశాలరెడ్డి. స్త్రీ ‘శక్తి’కి పురస్కారం టీసీఈఐ (తెలంగాణ చాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ) నిర్వహిస్తున్న ‘స్త్రీ శక్తి అవార్డ్స్ 2023’ అవార్డు కమిటీకి గౌరవ సభ్యురాలిని. ఈ నెల 17వ తేదీన హైదరాబాద్, గచ్చిబౌలిలో పురస్కార ప్రదానం జరుగుతుంది. గడచిన ఐదేళ్లుగా స్త్రీ శక్తి అవార్డ్స్ ప్రదానం జరగనుంది. ఇప్పటి వరకు తెలంగాణకు పరిమితమైన ఈ అవార్డులను ఈ ఏడాది జాతీయస్థాయికి విస్తరించాం. పదిహేనుకు పైగా రాష్ట్రాలతోపాటు మలేసియా, యూఎస్‌లలో ఉన్న భారతీయ మహిళల నుంచి కూడా ఎంట్రీలు వచ్చాయి. అర్హత కలిగిన ఎంట్రీలు 250కి పైగా ఉండగా వాటిలో నుంచి 50 మంది అవుట్ స్టాండింగ్ ఉమెన్ లీడర్స్ పురస్కారాలందుకుంటారు. జీవితంలో ఎదురైన సవాళ్లను ఎలా ఎదుర్కొన్నారు, ఆత్మస్థయిర్యం కోల్పోకుండా ముందుకు సాగిన వైనం, వారు సాధించిన విజయాలు– చేరుకున్న లక్ష్యాలు, ఎంతమందికి ఉపాధినిస్తున్నారు, వారి భవిష్యత్తు ప్రణాళికలు కార్యాచరణ ఎలా ఉన్నాయనే ప్రమాణాల ఆధారంగా విజేతల ఎంపిక ఉంటుంది. – విశాల రెడ్డి ఉయ్యాల ఫౌండర్, మిల్లెట్ బ్యాంకు – వాకా మంజులారెడ్డి ఫొటోలు: ఎస్. ఎస్. ఠాకూర్ -
రోజూ మిల్లెట్స్ తింటున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి
తెలుగు రాష్ట్రాలు వేగంగా మిల్లెట్స్ గొడుగు కిందకు చేరుతున్నాయి. ఇది అన్ని ట్రెండ్స్‌లా ఇలాగ వచ్చి అలాగ వెళ్లిపోరాదు.ఎన్నో వసంతాల పాటు మనతో పాటు చిగురించాలి. మిల్లెట్స్ ఆహారంలో భాగమవుతున్నంత వేగంగా కనుమరుగయ్యే ప్రమాదమూ ఉంది. ఎందుకంటే మనం మిల్లెట్స్ వాడకంలో చూపిస్తున్న అత్యుత్సాహం వాటిని అర్థం చేసుకోవడంలో చూపించడం లేదంటున్నారు ఇక్రిశాట్లో అగ్రానమిస్ట్గా ఉద్యోగవిరమణ చేసి, హైదరాబాద్, బోయిన్పల్లి, ఇక్రిశాట్ కాలనీలో విశ్రాంత జీవనం గడుపుతున్నసీనియర్ సైంటిస్ట్ మేకా రామ్మోహన్ రావు. ఇదీ నా పరిచయం! మాది కృష్ణాజిల్లా, పాగోలు గ్రామం పరిధిలోని మేకావారి పాలెం. బాపట్ల అగ్రికల్చరల్ కాలేజ్‌లో ఏజీ బీఎస్సీ. హైదరాబాద్, రాజేంద్రనగర్‌లోని ఆచార్య ఎన్జీ రంగా (ఇప్పుడది ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ) అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ. ఢిల్లీలోని ఐఏఆర్ఐ (ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్)లో వ్యవసాయ పద్ధతుల మీద పరిశోధన చేశాను. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఇక్రిశాట్లో ఒకడినయ్యాను. ఒక మోస్తరు వ్యవసాయ కుటుంబం మాది. మా కుటుంబంలో తొలితరం విద్యావంతుడిని కావడంతో ఏ కోర్సులు చదివితే ఎలాంటి ఉన్నత స్థితికి చేరవచ్చని మార్గదర్శనం చేయగలిగిన వాళ్లెవరూ లేరు. ఢిల్లీకి వెళ్లి పీహెచ్డీ చేయడం కూడా మా ప్రొఫెసర్ గారి సూచనతోనే. మా నాన్న చెప్పిన మాట నాకిప్పటికీ గుర్తే. కాలేజ్ ఖర్చులు భరించి చదివించగలనంతే. డొనేషన్లు కట్టి చదివించాలని కోరుకోవద్దు’ అన్నారాయన. ఆ మాట గుర్తు పెట్టుకుని విస్తరణకు ఉన్న అవకాశాలను వెతుక్కుంటూ సాగిపోయాను. నా ప్రాథమిక విద్య ఏ మాత్రం స్థిరంగా సాగలేదంటే నమ్ముతారా! ఐదవ తరగతి లోపు మూడుసార్లు స్కూళ్లు మారాను. హైస్కూల్ కూడా అంతే. చల్లపల్లి స్కూల్లో పన్నెండవ తరగతి వరకు చదివాను. జాతీయ పతాక ఆవిష్కర్త పింగళి వెంకయ్యగారు కూడా చల్లపల్లి స్కూల్లోనే చదివారు. – మేకా రామ్మోహన్రావు, సీనియర్ సైంటిస్ట్ (రిటైర్డ్), ఇక్రిశాట్ జ్ఞానాన్ని ఇచ్చి పుచ్చుకున్నాం! ‘‘ఇప్పుడు నేను చిరుధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవడం గురించి పని చేస్తున్నాను. కానీ నా అసలు వృత్తి చిరుధాన్యాల సాగు. పటాన్చెరులో మా పరిశోధన క్షేత్రం. మనదేశంలో వర్షాధార నేలలను సమర్థంగా సాగులోకి తీసుకురావడానికి మిల్లెట్స్ మీద విస్తృతంగా పరిశోధనలు చేశాను. ఆ తర్వాత కామెరూన్, బ్రెజిల్, నైజీరియా, కెన్యాల్లో పని చేశాను. ప్రధాన పంటతో పాటు అంతర పంటగా మిల్లెట్స్‌ను సాగు చేయడం, అలాగే మిశ్రమ సాగు విధానాన్ని వాళ్లకు అలవాటు చేశాం. మన మిల్లెట్స్‌ని ఆయా దేశాలకు పరిచయం చేశాం. ఆ దేశాలు సమర్థంగా అనుసరిస్తున్నాయి. ఇన్ని దేశాలూ తిరిగి మన జ్ఞానాన్ని వాళ్లకు పంచి, వాళ్ల నుంచి నేర్చుకోవాల్సిన మెళకువలను మనదేశానికి తీసుకు వచ్చిన తర్వాత పరిశీలిస్తే... మనదేశంలో వ్యవసాయం సరికొత్త రూపు సంతరించుకుని ఉంది. ఒకప్పుడు పాడి–పంట కలగలిసి సమాంతరంగా సాగుతుండేవి. పంట సాగు చేసే రైతు ఇంట్లో పాడి కూడా ఉండేది. ఆ పశువుల ఎరువుతో సాగు చేసుకుంటూ అవసరానికి కొంత మేర పై నుంచి రసాయన ఎరువులను వాడేవాళ్లు. ఇప్పుడు పాడి రైతు వేరు, పంట రైతు వేరయ్యారు. దాంతో పంట సాగు ఆరోగ్యంగా లేదు, పాడి రైతు కూడా సౌకర్యంగా లేడు. జరిగిన పొరపాటును సరి చేసుకోవడానికి సేంద్రియ సాగును వెనక్కి తెచ్చుకుంటున్నాం. అలాగే ఆహారంలో కూడా ఇప్పుడు మిల్లెట్స్ రూపంలో ఆరోగ్యాన్ని వెతుక్కుంటున్నాం. చిరుధాన్యాలు, వరిధాన్యం తగు పాళ్లలో తీసుకునే రోజుల నుంచి జొన్నలు, రాగులను పూర్తిగా మర్చిపోయాం. ఇప్పుడు చిరుధాన్యాల పరుగులో వరిధాన్యాన్ని వదిలేస్తున్నారు. మిల్లెట్ మెనూ ప్రాక్టీస్‌లో మనవాళ్లు చేస్తున్న పొరపాట్లు చూస్తుంటే వాటిని అలవాటు చేసుకున్న నెల రోజుల్లోనే మిల్లెట్స్‌కు దూరమైపోతారేమోననే ఆందోళన కూడా కలుగుతోంది. అందుకే అవగాహన కల్పించే బాధ్యతను నాకు చేతనైనంత చేస్తున్నాను. టేబుల్ మార్చినంత సులువు కాదు! పుట్టినప్పటి నుంచి కొన్ని దశాబ్దాలుగా అన్నం తినడానికి అలవాటు పడిన దేహాన్ని ఒక్కసారిగా మారమంటే సాధ్యం కాదు. మనం డైనింగ్ టేబుల్ మీద పదార్థాలను మార్చేసినంత సులువుగా మన జీర్ణవ్యవస్థ మారదు, మారలేదు కూడా. అందుకే మొదటగా రోజులో ఒక ఆహారంలో మాత్రమే మిల్లెట్స్ తీసుకోవాలి. జొన్న ఇడ్లీ లేదా రాగి ఇడ్లీతో మొదలు పెట్టాలి. ఒక పూట అన్నం తప్పకుండా తినాలి. రాత్రికి రొట్టె లేదా సంగటి రూపంలో మిల్లెట్స్ అలవాటు చేసుకుంటే ఈ తరహా జీవనశైలిని కలకాలం కొనసాగించడం సాధ్యమవుతుంది. దేహం మొదట మిల్లెట్స్‌ను అడాప్ట్ చేసుకోవాలి, ఆ తర్వాత వాటిని అబ్జార్బ్ చేసుకోవడం మొదలవుతుంది. దేహానికి ఆ టైమ్ కూడా ఇవ్వకుండా ఆవకాయతో అన్న్రప్రాశన చేసినట్లు మెనూ మొత్తం మార్చేస్తే ఓ నెల తర్వాత ఆ ఇంటి టేబుల్ మీద మిల్లెట్స్ మాయమవుతాయనడం లో సందేహం లేదు. మరో విషయం... వరి అన్నం తీసుకున్నంత మోతాదులో మిల్లెట్ ఆహారాన్ని తీసుకోకూడదు. పావు వంతుతో సరిపెట్టాలి. అలాగే అరవై దాటిన వాళ్లు జావ రూపంలో అలవాటు చేసుకోవాలి. సాయంత్రం మిల్లెట్ బిస్కట్లను తీసుకోవాలి. ఇక అనారోగ్యానికి గురయిన వాళ్లు తిరిగి కోలుకునే వరకు మిల్లెట్స్‌కి దూరంగా ఉండడమే మంచిది. ఈ సందర్భంగా ప్రముఖ జర్నలిస్ట్ కుష్వంత్ సింగ్ అనుభవాన్నే ఉదాహరిస్తాను. గట్టి ఆహారం తీసుకునే పంజాబీ కుటుంబంలో పుట్టిన ఆయన వార్ధక్యంలో ‘దక్షిణాది ఆహారం సులువుగా జీర్ణమవుతోందని, ఇడ్లీ, అన్నానికి మారినట్లు’ రాసుకున్నారు. మిల్లెట్స్ మనదేహానికి సమగ్రమైన ఆరోగ్యాన్ని చేకూరుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. నిదానంగా జీర్ణమవుతూ, నెమ్మదిగా శక్తిని విడుదల చేస్తుంది. ఊబకాయం సమస్య ఉండదు. ఈ వివరాలన్నీ చెబుతూ మెనూతో పాటు మోతాదును కూడా గమనింపులో పెట్టుకోవాలని మహిళలకు వివరిస్తున్నాను. వాళ్లకు చక్కగా అర్థమైతే చాలు, ఇక ఆ వంటగది నుంచి మిల్లెట్ ఎప్పటికీ దూరం కాదు’’ అన్నారు రామ్మోహన్రావు. రోజూ ఓ గంటసేపు నడక, పాలిష్ చేయని బియ్యంతో అన్నం, మిల్లెట్ బిస్కట్ తీసుకుంటారు. ‘మిల్లెట్స్‌తో ఎన్ని రకాల వంటలు చేసుకోవచ్చో వివరించడానికి కాలనీల్లో మిల్లెట్ మేళాలు నిర్వహిస్తుంటాం. కానీ నేను మాత్రం వాటిలో ఒక్క రకమే తింటాను’’ అన్నారాయన నవ్వుతూ. – వాకా మంజులారెడ్డి, ఫొటోలు : మోర్ల అనిల్ కుమార్ -
మిల్లెట్స్ తింటే ఏమవుతుంది? బీపీ, షుగర్‌ను కంట్రోల్ చేస్తుందా?
కొర్రలు.. సామలు.. అండుకొర్రలు.. అరికెలు.. ఊదలు.. వరిగ.. ఈ పేర్లు ఒకప్పుడు ప్రతి ఇంట్లో వినిపించినా, కొన్నేళ్ల క్రితం కనుమరుగయ్యాయి. ఆధునిక జీవనశైలితో ఈ పంటలు ఎక్కడో కానీ కనిపించని పరిస్థితి. ఉరుకులు పరుగుల జీవితంలో వ్యాధులు చుట్టుముట్టడంతో జీవితం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మారిన వాతావరణం, పరిస్థితుల్లో ఆరోగ్యం, ఆహార అలవాట్లపై దృష్టి సారిస్తున్న నేపథ్యంలో సంప్రదాయ పంటలకు ఇప్పుడిప్పుడే ప్రాధాన్యత పెరుగుతోంది. అనారోగ్య సమస్యలను అడ్డుకునేందుకు సరిధాన్యాల వాడకం అధికమవుతోంది. ప్రభుత్వం కూడా సాగును ప్రోత్సహిస్తూ పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇస్తుండటం విశేషం. 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ మిల్లెట్ ఇయర్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మిల్లెట్ సాగుకు ప్రోత్సాహం, చిరుధాన్యాల వినియోగాన్ని పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించడం విశేషం. అందులో భాగంగా గత ఏడాది ఖరీఫ్‌లో 7,012 ఎకరాల్లో చిరుధాన్యాల పంటలు సాగయ్యాయి. 2023 ఖరీఫ్‌లో చిరుధాన్యాల సాగు 21,825 ఎకరాలకు పెరిగినట్లు తెలుస్తోంది. ధర లేనప్పుడు రైతులు నష్టపోకుండా ప్రభుత్వం మద్దతు ధర కూడా నిర్ణయిస్తోంది. సబ్సిడీపై విత్తనాలను పంపిణీ చేస్తోంది. రాయితీతో ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తోంది. పదేళ్ల క్రితం చిరుధాన్యాల వినియోగం 10 శాతం వరకు ఉండగా.. మారుతున్న పరిస్థితులతో వీటి వినియోగం 40–50 శాతం పైగా పెరిగింది. చిరుధాన్యాల సాగుకు చేయూత ∙ ఆహార, పోషక భద్రత(ఫుడ్ అండ్ న్యూట్రీషియన్ సెక్యూరిటీ) కింద కొర్ర, సజ్జ, జొన్న, వరిగ సాగును ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా ప్రదర్శన క్షేత్రాలు ఏర్పాటు చేస్తున్నారు. 3,450 ఎకరాలకు ప్రభుత్వం రూ.82.80 లక్షల విలువైన ఇన్పుట్స్ సరఫరా చేస్తోంది. ∙ రూ.1.25 లక్షల సబ్సిడీతో ఏడు మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటికి అదనంగా వర్షాధార ప్రాంత అభివృద్ధి కింద రూ.2 లక్షల సబ్సిడీతో దాదాపు 15 మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటవుతున్నాయి. ఇప్పటికే కర్నూలు, నంద్యాల తదితర ప్రాంతాల్లో ప్రాసెసింగ్ సెంటర్లు ఏర్పాటు కావడం విశేషం. షాపింగ్ మాల్స్ సిరిధ్యాన్యాలను ప్రత్యేకంగా విక్రయిస్తున్నాయి. వరి బియ్యంతో పోలిస్తే మిల్లెట్ రైస్ ధరలు కూడా ఎక్కువే. కిలో అండుకొర్రల(వాక్యుమ్ ప్యాకింగ్) ధర రూ.289 పలుకుతోంది. మిల్లెట్ కేఫ్‌కు విశేష స్పందన సిరిధాన్యాలు పోషకాలను అందించడమే కాకుండా రోగ కారకాలను శరీరంలో నుంచి తొలగించి దేహాన్ని శుద్ధి చేస్తాయి. ఈ నేపథ్యంలో కలెక్టరేట్ ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ విత్తన రైతు సేవా సంఘం ఏర్పాటు చేసిన మిల్లెట్ కేప్‌కు విశేషమైన స్పందన లభిస్తోంది. రోజు 160 మందికిపైగా మిల్లెట్ కేఫ్‌ను సందర్శిస్తున్నారు. ఇక్కడ చిరుధాన్యాల అన్నం, మిక్చర్, మురుకులు, లడ్డు, బిస్కెట్లు, చిరుధాన్యాల ఇడ్లీరవ్వ లభిస్తాయి. చిరుధాన్యాల బ్రెడ్‌కు ప్రత్యేక ఆదరణ ఉంటోంది. సిరిధాన్యాల విశిష్టత తక్కువ నీటితో రసాయన ఎరువులు, పురుగుమందుల అవసరం లేకుండా పండగలిగిన అత్యుత్తమ పోషక విలువలు కలిగిన పంటలు సిరిధాన్యాలు. మూడుపూటలా తిన్నప్పుడు, ఆ రోజుకు మనిషికి అవసరమైన పీచుపదార్థం ( ప్రతి ఒక్కరికి రోజుకు 38 గ్రాముల పీచుపదార్థం కావాలి) ఈ ధాన్యాల నుంచే లభిస్తుంది. తక్కిన 10 గ్రాములు కూరగాయలు, ఆకు కూరల నుంచి పొందవచ్చు. 25 ఎకరాల్లో చిరుధాన్యాల సాగు చిరుధాన్యాల సాగును ప్రోత్సహించడం లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ విత్తన రైతు సేవా సంఘాన్ని ఏర్పాటు చేశాం. కొర్రలు, సామలు, ఊదలు, అరికలు, అండుకొర్రలు 25 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయంలో సాగు చేసు చేసున్నాం. పంటను ఆంధ్రప్రదేశ్ విత్తన రైతు సేవా సంఘం ద్వారా కొనుగోలు చేస్తాం. ఇప్పటికి చిరుధాన్యాల ప్రాసెసింగ్ సెంటర్ కూడ ఏర్పాటు చేశాం. కలెక్టరేట్ ప్రాంగణంలో మిల్లెట్ కేఫ్ కూడా నిర్వహిస్తున్నాం. – వేణుబాబు, చిరుధాన్యాల రైతు బీపీ, షుగర్ తగ్గాయి నాకు 79 ఏళ్లు. గతంలో ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. బీపీ, షుగర్ కూడా ఉండింది. బరువు 65 కిలోలు. ఏడాదిన్నరగా కేవలం సిరిధాన్యాలైన సామలు, అరికలు, అప్పుడప్పుడు ఊదల ఆహారం తీసుకుంటున్నా. వీటికి తోడు జొన్న రొట్టె తింటున్నా. ప్రస్తుతం ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. బీపీ, షుగర్ కంట్రోల్లో ఉన్నాయి. – పిచ్చిరెడ్డి, విశ్రాంత ఏడీఏ, వెంకటరమణ కాలనీ, కర్నూలు చిరుధాన్యాల సాగును ప్రోత్సహిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం చిరుధాన్యాలకు మద్దతు ధర ప్రకటించింది. ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తోంది. ఈ పంటల సాగులో పెట్టుబడి వ్యయం తక్కువగా ఉంటుంది. రసాయన ఎరువులు వాడాల్సిన అవసరం ఉండదు. డయాబెటిస్ తదితర వ్యాధులకు చిరుధాన్యల ఆహారం దివ్య ఔషధం. గతంతో పోలిస్తే ఈ ఏడాది మిల్లెట్ సాగు భారీగా పెరుగుతోంది. – పీఎల్ వరలక్ష్మి, డీఏఓ, కర్నూలు -
చిరుధాన్యాల దిగుబడులు పెంచేలా సైంటిస్టులు పరిశోధనలు..!
-
మిల్లెట్ ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు
-
మిల్లెట్ డైట్ పై డాక్టర్ ఖాదర్ వలీ ప్రత్యేక ఇంటర్వ్యూ
-
మిల్లెట్ సాగుకు అనుకూల వాతావరణం
సాక్షి, హైదరాబాద్: దేశంలో మిల్లెట్ సాగుకు అనుకూలమైన వాతావర ణం ఉందని నాబార్డ్ చైర్మన్ షాజీ కేవీ అన్నారు. శుక్రవారం హైదరా బాద్‌లో ‘మిల్లెట్ కాంక్లేవ్– 2023’ని జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా షాజీ మాట్లాడు తూ మిల్లెట్ వాల్యూ చైన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అద్భుత మైన ఫలితాలు అందించిందని చెప్పారు. గ్రామీణ–పట్టణ ఆదాయ అసమానతలు తగ్గించడం, సహకార ఉద్యమాన్ని బలోపేతం చేయడం తమ కర్తవ్యమన్నారు. ఐక్యరాజ్యసమి తి 2023ని మిల్లెట్ సంవత్సరంగా ప్రకటించడానికి మన దేశమే కారణమని, మిల్లెట్లను మరింత ముందుకు తీసుకెళ్ల డానికి ఇది భారతదేశానికి ఒక సువర్ణావకాశాన్ని అందిస్తుందని చెప్పారు. భారత్‌ను మిల్లెట్ గ్లోబల్ హబ్‌గా మార్చ డానికి హైదరాబాద్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ అత్యుత్తమ కేంద్రంగా ఉందన్నారు. ఈ సందర్భంగా మిల్లెట్‌పై వ్యవసాయ, వివిధ రంగాల ప్రముఖు లు చర్చించారు. అపెడా చైర్మన్ అభిషేక్ దేవ్ వర్చువల్ పద్ధతిలో మాట్లాడారు. నాబార్డు సీజీఎంలు మోనోమోయ్ ముఖర్జీ, ఉదయ్ భాస్కర్ తదితరులు మాట్లాడారు. -
మిల్లెట్స్‌తో మస్త్ బెనిఫిట్స్, బీపీ, షుగర్ ఉన్నవాళ్లు తింటే..
మిల్లెట్ డైట్.. ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్ అవుతోంది. వీటిలో ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, ఐరన్, విటమిన్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.ఇందులో పిండి పదార్థాలు, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. దీంతో ఎన్నో వ్యాధులకి దివ్య ఔషధం అని చెప్పొచ్చు.విభిన్న రంగులు,రుచులు,రూపాల్లో ఇవి దొరుకుతాయి. ఇందులో ఫాస్పరస్, కాల్షియం కూడా ఎక్కువగా ఉంటాయి. పురాతన కాలంలో వీటిని ఎక్కువగా వాడేవాళ్లు.. మళ్లీ సోషల్ మీడియా పుణ్యమా అని జనాలకు ఆరోగ్యంపై గత 3-4 ఏళ్లుగా మరింత శ్రద్ధ పెరిగింది. ఇప్పుడు హెల్తీ డైట్ అంటూ మిల్లెట్స్ అనేంతగా జనాల్లో ప్రాచుర్యం పొందింది. చిరుధాన్యాలు.. సిరిధాన్యాలు.. చిన్న చిన్న విత్తనాలతో కూడిన గడ్డి జాతి పంటల సమూహానికి చెందిన పంటలే ఈ చిరుధాన్యాలు. మనుషుల ఆహార అవసరాలతో పాటు పశువులు, చిన్న జీవాలకు మేత కోసం వీటిని ప్రపంచం అంతటా పండిస్తారు. ఇవి చాలా ప్రాచీనమైన పంటలు. మన పూర్వీకులు మొట్టమొదటిగా సాగు చేసిన పంటలు చిరుధాన్యాలే. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కొద్దిపాటి వర్షాలకే పండే పంటలివి. వీటిని మొట్టమొదటగా భారత్‌లో సాగైన అనేక రకాల చిరుధాన్యాలు తదనంతరం పశ్చిమ ఆఫ్రికాతోపాటు చైనా, జపాన్ తదితర 130 దేశాలకు విస్తరించాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక నాగరికతల్లో ఆహార ధాన్యపు పంటలుగా విస్తరించాయి. ప్రాచీన సాహిత్యంలో కూడా వీటి ప్రస్తావన ఉంది. మన దేశంలో చిరుధాన్యాల వినియోగం కాంస్య యుగం కన్నా ముందు నుంచే ఉన్నదని చరిత్ర చెబుతోంది. మిల్లెట్స్ రకాలు.. పోషకాల గనులైన చిరుధాన్యాలను ప్రాథమికంగా రెండు విధాలుగా విభజించ వచ్చు. జొన్నలు, సజ్జలు, రాగులు.. గింజలపై పొట్టు తియ్యాల్సిన అవసరం లేని పెద్ద గింజల పంటలు. మేజర్ మిల్లెట్స్. కొర్రలు, సామలు, అరికెలు, ఊదలు, ఒరిగలు, అండుకొర్రలు.. గింజలపై నుంచి పొట్టు తీసి వాడుకోవాల్సిన చిన్న గింజల పంటలు. మైనర్ మిల్లెట్స్. పొట్టు తీసి బియ్యం తయారు చేసుకోవాల్సి రావటం వల్ల మైనర్ మిల్లెట్స్ ప్రాసెసింగ్ క్లిష్టతరమైన పనిగా మారింది. అందువల్లనే ఇవి కాలక్రమంలో చాలా వరకు మరుగున పడిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా అధికంగా సాగవుతున్న పంట జొన్న. డయాబెటిస్, బీపీలకు చెక్ ►ప్రొటీన్లు, ఎసెన్షియల్ అమినో ఆమ్లాలు, ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉండటం వల్ల చిరుధాన్యాలు పోషక సంపన్న ఆహారంగా గుర్తింపు పొందాయి. వరి, గోధుమలతో పోల్చితే డైటరీ ఫైబర్, ప్రొటీన్లు అధికంగా ఉండటం వల్ల డయాబెటిస్, గుండె జబ్బులతో బాధపడే వారికి చిరుధాన్యాలు అనువైనవి. ► ఆరోగ్యాన్ని పెంపొందించే ఫెనోలిక్ కాంపౌండ్స్‌తో కూడి ఉన్నందున అనేక జీవన శైలి సంబంధమైన వ్యాధులను ఎదుర్కోవడానికి మిల్లెట్స్‌కు మించిన ఆహారం లేదంటే అతిశయోక్తి కాదు. మైనర్ మిల్లెట్స్‌ను రోజువారీ ప్రధాన ఆహారంగా తినగలిగితే ఏ జబ్బయినా కొద్ది కాలంలో తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ► వీటిని ఆహారంగా తీసుకుంటే రక్తంలో గ్లూకోస్ శాతం తగ్గుముఖం పడుతుంది. దీని వల్ల మధుమేహ వ్యాధి నియంత్రణలో ఉంటుంది. క్రమంగా ఆరోగ్యం మెరుగుపడుతుంది. ► కాల్షియం వీటిలో చాలా అధికంగా ఉంటుంది. దీని వల్ల దంతాలు, ఎముకలు గట్టిగా ఉంటాయి. సిరిధాన్యాలు పీచుని అధికంగా కలిగి ఉంటాయి. ► వీటిలో యాంటి ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. కొవ్వు తగ్గుతుంది. ఇప్పటికే అసిడిటీ ఉన్నవారు వీటిని తింటే చాలా మంచిది. ► ఊబకాయం, కాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు వీటిని రోజు తింటే మంచిది. కాన్సర్ వ్యాధి బారిన పడకుండా మనల్ని కాపాడుతాయి. రక్త పోటు ఉన్నవారు వీటిని తీసుకోవటం వల్ల అది అదుపులో ఉంటుంది. శ్వాసకోశ సమస్యలు సైతం తగ్గుతాయి. -
జీ20 సదస్సుకు ఇద్దరు గిరిజన మహిళలు..ఆ కారణంగానే ఆహ్వానం
దేశాధినేతలు, పలువురు అధికారుల హాజరయ్యే జీ20 శిఖరాగ్ర సదస్సుకు సామాన్య గిరిజన మహిళలకు ఆహ్వానం లభించింది. గిట్టుబాటు ధరలేక, సకాలంలో వర్షాలు పడక తదితర కారణాల రీత్యా వ్యవసాయాన్ని వదిలేస్తున్న ఈ తరుణంలో సంప్రదాయరీతిలో తృణధాన్యాలను పండించి చూపించారు. ఎందరో రైతులకు మార్గం చూపించారు. వారి విజయగాథను జీ20లో వినిపించేందకు ఈ ఇద్దరికి ఆహ్వానించారు. వ్యవసాయరంగానికి సంబంధించిన ప్రదర్శనలో భారత్ తరుఫున ఒడిశా నుంచి ఈ ఇద్దరు మహిళలు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ ఇద్దరు సంప్రదాయ పద్ధతిలో తృణధాన్యాల సాగు గురించి ఆ సదస్సులో పాల్గొనే ప్రపంచనాయకులకు వివరిస్తారు. వాటి ప్రయోజనాలు, పోషక విలువలు గురించి కూడా వివరిస్తారు. ఇంతకీ అసలు ఈ ఇద్దరు మహిళలు ఎవరు?వారి విజయ గాథ ఏంటంటే.. రాయిమతి ఘివురియా కోరాపుట్ జిల్లాలోని కుంద్ర బ్లాక్‌కి చెందని రాయిమితి ఘివురియా 124 రకాల తృణధాన్యాలను భద్రపరిచారు. ప్రపంచ స్థాయి శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యి..తాను ఈ రంగంలో ఎలా విజయం సాధించిందో వివరించేందుకు జైపూర్‌లోని ఎంఎస్ స్వామినాథన్ పరిశోధనా కేంద్రం నుంచి శిక్షణ తీసుకుంది. ఆమె దాదాపు 72 రకాల దేశీ వరి వంగడాలను, ఆరు రకాల వివిధ తృణధాన్యాలను సంరక్షించి విజయవంతమైన మహిళగా నిరూపించుకుంది. సేంద్రియ వ్యవసాయం ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ.. దాదాపు 2500 రైతులను ఈ వ్యవసాయంలోకి తీసుకొచ్చారు. ఈ వ్యవసాయంపై రైతులకు శిక్షణ ఇవ్వడం కోసం 2012లో తన భూమిలోనే అగ్రికల్చర్ స్కూల్‌ని కూడా ప్రారంభించారు. సంప్రదాయ వ్యవసాయ పద్ధతులను మరింత ముందుకు తీసుకువెళ్లడానికి ఆమె చేసిన కృషికిగానూ ఆమెకు ఎన్నో సత్కారాలు, అవార్డులు వచ్చాయి. ఇప్పుడూ ఈ ప్రతిష్టాత్మక జీ20 సదస్సుకు ఆమెకు ఆహ్వానం లభించింది. ఈ మేరకు మహిళా రైతు రాయిమితి ఘివురియా మాట్లాడుతూ..ఈ సదస్సులో పాల్గొనే అదృష్టం రావడం చాలా సంతోషంగా ఉంది. సేంద్రియ వ్యవసాయం దాని ప్రయోజనాలు గురించి వివరిస్తాను. గిరిజన మహిళగా ఈ శిఖరాగ్ర సమావేశంలో భాగం కావడం చాలా సంతోషం ఉందన్నారు రాయిమతి మరో మహిళా రైతు సుబాస మెహనత మయూర్భంజ్ జిల్లాలోని జాషిపూర్ బ్లాక్ పరిధిలోని గోయిలీ గ్రామంలో నివసించే సుబాస మోహనత కూడా ఆదివాసీ తెగకు చెందిన నిరుపేద మహిళ. ఒకప్పుడూ ఆమె గ్రామంలో వరి సాగు చేసేవారు. ప్రకృతి వైపరిత్యాల వల్ల, ఇతర కారణాల వల్ల ఆ పంటలో విపరీతమైన నష్టాలను చూశారు అక్కడి ప్రజలు. ఇక వ్యవసాయ రంగాన్ని వదిలేద్దాం అనుకున్న సమయంలో ఒడిశా ప్రభుత్వం మిల్లెట్ మిషన్ తీసుకొచ్చింది. చాలమంది మిల్లెట్ సేద్యం పట్ల ఆసక్తి కనబర్చ లేదు అయినప్పటికి సుబాస వెనక్కి తగ్గలేదు. ప్రభుత్వం ఇచ్చిన మిల్లెట్ మిషన్ పథకంలో పాల్గొని తృణధాన్యాలను పండించి ఇతర మహిళలకు ఆదర్శవంతంగా నిలిచేలా విజయం సాధించింది. 2018 నుంచి తృణ ధాన్యాలను సేంద్రియ పద్ధతుల్లో పండించడం ప్రారంభించారు. మంచి లాభాలు వచ్చాయి ఇక అప్పటి నుంచి ఆమె వెనుదిరిగి చూడలేదు. ఆమె ఎకరం భూమిలో 250 గ్రాముల రాగులను విత్తించి, ఎనిమిది క్వింటాళ్లను పండించింది. అంతేగాదు ఆమె 2023 కల్లా ఆమె ఎనిమిది ఎకరాల భూమిని లీజుకు తీసుకుని 60 క్వింటాళ్ల రాగులను పండించాలని భావిస్తోంది. ఈ ఏడాది మార్చిలో తృణధాన్యాలపై జరిగిన ప్రపంచ సదస్సులో మొహంత కూడా పాల్గొన్నారు. ఆ సందర్భంగా ప్రధాని మోదీతో ఆమె కొంతసేపు మాట్లాడే అరుదైన అవకాశం వచ్చింది. తాజాగా జీ-20 సదస్సులో పాల్గొనేందుకు ఆహ్వనం వచ్చింది. కాగా, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్యసమితి ఈ ఏడాదిని అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరంగా గుర్తించింది. ఈ నేపథ్యంలో జీ-20 సదస్సులో మిల్లెట్స్‌కు ప్రాధాన్యం కల్పించడంతో అందులో విజయవంతమైన ఈ గిరిజన మహిళా రైతులిద్దర్నీ ఆహ్వానించారు. (చదవండి: ఎడారి ప్రాంతంలో సాగు...‘జాయ్’ఫుల్‌గా కరువుకు చెక్!) -
మార్కెట్లోకి కొత్త విత్తనాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని రైతులకు కొత్త వంగడాలు అందుబాటులోకి వచ్చాయి. వరిలో 4, మినుములో 2, వేరుశనగ, పెసర, పొగాకులలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 9 వంగడాలను బుధవారం వ్యవసాయ శాఖ స్పెషల్ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది మార్కెట్లోకి విడుదల చేశారు. వీటిని ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న నెల్లూరు, బాపట్ల, తిరుపతి, మారుటేరు, నంద్యాల, గుంటూరు లాం పరిశోధనా కేంద్రాల శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. వీటి ప్రత్యేకతలను ఆర్బీకేల్లో ప్రదర్శించడంతో పాటు వీటి వినియోగాన్ని పెంచేలా రైతులను ప్రోత్సహించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ సి.హరికిరణ్, వీసీ విష్ణువర్థన్‌రెడ్డి, ఏపీ సీడ్స్ ఎండీ డాక్టర్ గెడ్డం శేఖర్‌బాబు, వర్సిటీ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ ఎల్.ప్రశాంతి, డైరెక్టర్ ఆఫ్ సీడ్స్ ఎ.సుబ్బరావిురెడ్డి తదితరులు పాల్గొన్నారు. వేరుశనగలో.. టీసీజీఎస్ 1522: ఈ వంగడం కదిరి–6కు ప్రత్యామ్నాయం. తిరుపతి 4 ఎక్స్, కదిరి 9 రకాల నుంచి అభివృద్ధి చేశారు. పంటకాలం ఖరీఫ్‌లో 100 నుంచి 103 రోజులు, రబీలో 103 నుంచి 106 రోజులు. దిగుబడి హెక్టార్‌కు ఖరీఫ్‌లో 3.328 టన్నులు, రబీలో 4.031 టన్నులు. ఆకుమచ్చ, తుప్పు తెగులును కొంత మేర తట్టుకుంటుంది. కాయ నుంచి పప్పు దిగుబడి 75–76 శాతం, నూనె 48.5 శాతం, 100 గింజల బరువు 45–47 గ్రాములు, గింజలు లేతగులాబీ రంగులో ఉంటాయి. కాయలన్నీ ఒకేసారి పక్వానికి వస్తాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఖరీఫ్, రబీ సీజన్లకు అనుకూలం. పొగాకులో.. ఏబీడీ 132(నంద్యాల పొగాకు–2): ఈ వంగడం నంద్యాల పొగాకు–1కు ప్రత్యామ్నాయం. లైన్ 3–58–38, ఎక్స్ లైన్ (190–27–5–7–32), ఎక్స్ (303–3–38–13–11–40) రకాల నుంచి అభివృద్ధి చేశారు. ఇది తక్కువ హాని కారకాలను కలిగి ఉంటుంది. కిలో ఆకు ధర రూ.85 నుంచి రూ.90 పలుకుతుంది. ఒరోబాంకీని మధ్యస్థంగా తట్టుకోవడమేకాదు.. ఆకు కోత వరకు పచ్చగా ఉండి.. అధిక వర్షపాత పరిస్థితులను తట్టుకుంటుంది. నంద్యాల, కర్నూలు జిల్లాల్లో బీడీ పొగాకు సాగు చేసే అన్ని ప్రాంతాల్లో ఖరీఫ్‌లో సాగుకు అనుకూలం. పెసరలో.. ఎల్జీజీ 630: ఈ వంగడం ఎల్జీజీ 460, ఐపీఎం 2–14, టీఎం 96–2 రకాలకు ప్రత్యామ్నాయం. ఎల్జీజీ 460 ఎక్స్ పీ 109 రకాల నుంచి అభివృద్ధి చేశారు. పంట కాలం 65 నుంచి 70 రోజులు. దిగుబడి హెక్టార్‌కు 1.60 నుంచి 1.80 టన్నులు. పల్లాకు తెగులను పూర్తిగా తట్టుకునే రకం. ఒకేసారి కోత కోయటానికి అనువైనది. గింజలు మధ్యస్థ లావుకలిగి మెరుస్తుంటాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఖరీఫ్, రబీ సీజన్లకు అనుకూలం. మినుములో.. టీబీజీ 129: ఈ వంగడం ఎల్బీజీ 752కు ప్రత్యామ్నాయం. దీనిని పీయూ 31 ఎక్స్ ఎల్బీజీ 752 నుంచి అభివృద్ధి చేశారు. పంటకాలం 85 నుంచి 90 రోజులు. దిగుబడి హెక్టార్‌కు 1.60 నుంచి 1.80 టన్నులు. పల్లాకు తెగులును తట్టుకుంటుంది. గింజలు లావుగా ఉండి మెరుస్తుంటాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఖరీఫ్, రబీ సీజన్లకు అనుకూలం. ఎల్బీజీ 904: ఈ వంగడం ఎల్బీజీ 752, 787, పీయూ 31, టీబీజీ 104, జీబీజీ 1 రకాలకు ప్రత్యామ్నాయం. ఎల్బీజీ 645 ఎక్స్ టీయూ 94–2 రకాల నుంచి అభివృద్ధి చేశారు. పంట కాలం 85 నుంచి 90 రోజులు. దిగుబడి హెక్టార్‌కు 2.20 నుంచి 2.50 టన్నులు. పల్లాకు తెగులుతో పాటు కొంత మేర తలమాడుతట్టుకునే రకం. గింజలు మధ్యస్థ లావుకలిగి మెరుస్తుంటాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఖరీఫ్, రబీ సీజన్లకు అనుకూలం. నూతన వంగడాలు.. వాటి ప్రత్యేకతలు బీపీటీ 2841: ఈ వంగడం బర్మా బ్లాక్, కాలాబట్టి సాంప్రదాయ బ్లాక్ రైస్‌కు ప్రత్యామ్నాయం. ఎంటీయూ–7029, ఐఆర్జీసీ 18195, ఎంటీయూ–1081 రకాల నుంచి అభివృద్ధి చేశారు. పంటకాలం 130 నుంచి 135 రోజులు. దిగుబడి హెక్టార్‌కు 5.50 నుంచి 6 టన్నులు. అగ్గితెగులు, మెడవిరుపుతో పాటు దోమపోటును కొంతమేర తట్టుకుంటుంది. గింజలు పగిలిపోవడం తక్కువ. ముడి బియ్యానికి అనుకూలం. మధ్యస్థ సన్న గింజ రకం. కాండం దృఢంగా ఉండి చేనుపై వాలిపోదు. ఏపీలోని అన్ని ప్రాంతాల్లో ఖరీఫ్ సాగుకు అనుకూలం. బీపీటీ 2846: ఈ వంగడం బీపీటీ 5204కు ప్రత్యామ్నాయం. ఎంటీయూ–1061, ఐఆర్ 78585–64–2–4–3–1 రకాల నుంచి అభివృద్ధి చేశారు. పంటకాలం 140 నుంచి 150 రోజులు. దిగుబడి హెక్టార్‌కు 6.50 నుంచి 7 టన్నులు. అగ్గితెగులు, మెడవిరుపు, దోమపోటు, ఎండాకు తెగులును కొంతమేర తట్టుకుంటుంది. కాండం దృఢంగా ఉండి చేనుపై వాలిపోదు. మధ్యస్థ సన్న గింజ రకం. నిండు గింజల శాతం ఎక్కువ. ఏపీలో కృష్ణా, సదరన్ జోన్లలో ఖరీఫ్ సాగుకు అనుకూలం. ఎన్‌ఎల్‌ఆర్ 3238: బయో ఫోర్టిఫైడ్ స్వల్పకాలిక వరి రకమిది. బీపీటీ–5204, ఎంటీయూ 1010 రకాల నుంచి అభివృద్ధి చేశారు. పంటకాలం 120 నుంచి 125 రోజులు. దిగుబడి హెక్టార్‌కు 6.50 నుంచి 7 టన్నులు. ఇది కూడా చేనుపై వాలిపోదు. పాలిష్ చేసిన బియ్యంలో జింక్ మోతాదు 27–72 పీపీఎంగా ఉంటుంది. బియ్యం పారదర్శకంగా ఉండి నాణ్యతతో ఉంటాయి. అగ్గితెగులు, మెడవిరుపులను కొంత మేర తట్టుకుంటుంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఖరీఫ్, రబీ సీజన్లలో సాగుకు అనుకూలం. ఎంటీయూ 1271: ఈ వంగడం బీపీటీ 5204కు ప్రత్యామ్నాయం. ఎంటీయూ–1075, 1081 రకాల నుంచి అభివృద్ధి చేశారు. పంటకాలం 140 రోజులు. దిగుబడి హెక్టార్‌కు 6.50 నుంచి 7 టన్నులు. దోమ, ఎండాకు తెగులును కొంత మేర తట్టుకుంటుంది. మధ్యస్థ సన్న గింజ రకం. ఇది కూడా చేనుపై వాలిపోదు. నిండు గింజల శాతం ఎక్కువ. సాగునీటి వసతులున్న లోతట్టు, అప్ల్యాండ్స్లో ఖరీఫ్ సాగుకు అనుకూలం. -
200 ఎకరాల్లో మిల్లెట్స్ మోడల్ ఫార్మ్ - ఒప్పందానికి గ్రీన్ సిగ్నెల్
హైదరాబాద్: యూపీఎల్ కంపెనీ గయానా ప్రభుత్వంతో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. రిపబ్లిక్ ఆఫ్ గయానా సహకారంతో 200 ఎకరాల్లో ‘మిల్లెట్స్ మోడల్ ఫార్మ్’’ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఒప్పందంపై యూపీఎల్ గ్రూప్ సీఈవో జైష్రాఫ్, గయానా వ్యవసాయ శాఖ మంత్రి జుల్ఫికర్ ముస్తఫా ఏప్రిల్ 21న అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసినట్టు తెలిపింది. ఈ పార్క్‌లో మిల్లెట్స్ సాగుకు కావాల్సిన సాంకేతిక సహకారం, వ్యవసాయ ముడి సరుకులను యూపీఎల్ అందించనుంది. సాగుకు కావాల్సిన 200 ఎకరాల భూమి, కార్మికులను గయానా ప్రభుత్వం సమకూర్చనుంది. -
రోజంతా తిట్టుకున్నారు.. ఆపై సరదాగా ఇలా..!
న్యూఢిల్లీ: భారత్ సూచనల మేరకు 2023 ఏడాదిని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని పురస్కరించుకుని కేంద్రం ప్రభుత్వం ఎంపీలందరికీ పార్లమెంట్ ఆవరణలో మంగళవారం మిల్లెట్ లంచ్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లు ఒకే డైనింగ్ టేబుల్‌పై మిల్లెట్ లంచ్ చేశారు. ప్రఖ్యాత చెఫ్‌లతో తయారు చేసిన చిరుధాన్యాల ప్రత్యేక వంటకాలను నెతలంతా ఇష్టంగా తిన్నారు. ఈ సందర్భంగా మిల్లెట్ లంచ్‌పై ట్వీట్ చేశారు ప్రధాని మోదీ.‘ 2023 ఏడాదిని అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరంగా నిర్వహించబోతున్న తరుణంలో పార్లమెంట్లో నిర్వహించిన మిల్లెట్ లంచ్‌కు హాజరయ్యాము. పార్టీలకతీతంగా నేతలు హాజరవటం చాలా సంతోషంగా ఉంది.’అని పేర్కొన్నారు. మరోవైపు.. ఈ లంచ్‌లో బజ్రే కా రబ్డీ సూప్, రాగి దోస, యుచెల్ చట్నీ, కలుహులి, లేహ్‌సన్ చట్నీ, చట్నీ పౌడర్, జోల్దా రోటీ, గ్రీన్ సలడాా వంటివి ప్రత్యేకంగా నిలిచినట్లు నేతలు పేర్కొన్నారు. As we prepare to mark 2023 as the International Year of Millets, attended a sumptuous lunch in Parliament where millet dishes were served. Good to see participation from across party lines. pic.twitter.com/PjU1mQh0F3 — Narendra Modi (@narendramodi) December 20, 2022 ఆసక్తికరం.. ఇక్కడ ఓ ఆసక్తికర సంఘటన నెలకొంది. రాజస్థాన్ అల్వార్ ర్యాలీలో కాంగ్రెస్ అధ్యక్షుడు శునకం, ఎలుకలు అంటూ చేసిన వ్యాఖ్యలపై మంగళవారం రాజ్యసభ అట్టుడుకింది. ఆయన క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ అధికార బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఛైర్మన్ ధన్‌ఖడ్ ఎంత చెప్పినా వినకుండా ఆందోళనకు దిగడంతో కొద్ది సమయంలో సభలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అధికార, విపక్షాలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్న తర్వాత సాయంత్రం ఈ మిల్లెట్ లంచ్ ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతా సంతోషంతో కలిసి లంచ్‌లో పాల్గొనటం ఆసక్తికరంగా మారింది. A millet special lunch was organised today for all the MPs in Parliament by union government. Enjoyed this healthy & delicious meal with my colleagues. @narendramodi @nstomar @nitin_gadkari @PiyushGoyal @kharge @supriya_sule @adhirrcinc @SaugataRoyMP #IMY2023 #MilletsLunch pic.twitter.com/Qk88m5Mxpj — Praful Patel (@praful_patel) December 20, 2022 ఇదీ చదవండి: ‘శునకం’ వ్యాఖ్యలపై దద్దరిల్లిన రాజ్యసభ.. క్షమాపణలకు ఖర్గే ససేమిరా -
‘మిల్లెటు’ బండెక్కి వచ్చేత్తమూ..
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఆహారమే ఔషధం.. ఇది ఆయుర్వేదానికి సంబంధించిన ఒక నానుడి. ఔషధం లాంటి ఆహారాన్ని ‘ఔరా’అనిపించే విధంగా ఓ బువ్వబండి అందిస్తోంది. ‘తింటే గారెలే తినాలి..’అంటారు కదా! ఈ బువ్వబండిని చూస్తే, ‘తింటే.. చిరుధాన్యాల బువ్వే తినాలి’అని అనిపిస్తుంది. సామల అన్నం, నోరూరించే టమాటా పచ్చడి, పసందైన ఆకుకూర పప్పు, గంజి సూప్.. ఇది బువ్వబండి మెనూ. ఇది గుడ్‌ఫుడ్ మాత్రమేకాదు, హెల్దీ ఫుడ్ కూడా. సంపూర్ణ ఆరోగ్యాన్ని పంచే చిరుధాన్యాల ప్రాధాన్యం తెలియజేసేందుకు ప్రతిరోజూ ఉచితంగా మిల్లెట్ భోజనాన్ని వడ్డిస్తున్నారు సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌కు చెందిన కొల్లూరు సత్తయ్య, అమృతమ్మ దంపతులు. సామలు, అరికెలు, కొర్రలు, అండుకొర్రలు, ఊదలు వంటి చిరుధాన్యాలతో ఆహారం అందిస్తున్నారు. ఇందుకోసం ఆయన ‘బువ్వబండి’ని తయారుచేశారు. ఈ బువ్వబండిని రోజూ ఉద యం 8.30 నుంచి 10.30 గంటల వరకు తెల్లాపూర్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఉంచుతారు. వందలాది మంది నిరుపేదలు, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు ఈ బండి వద్ద ‘చిరు’బు వ్వ తింటారు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. రోజూ రూ.4 వేలు.. ఐదు రకాల చిరుధాన్యాలు ఒక్కో రకం చిరుధాన్యం భోజనం ఐదు రోజుల చొప్పున వడ్డిస్తుంటారు. ఈ చిరుధాన్యాలను మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతం నుంచి కొనుగోలు చేస్తున్నారు. రోజూ 25 కిలోల చిరుధాన్యంతో చేసిన భోజనం వడ్డిస్తున్నారు. ఈ మిల్లెట్ భోజనంలో రోజూ ఒక రోటి పచ్చడి కూడా ఉంటుంది. టమాటా, పుంటికూర (గోంగూర), మెంతికూర, కొత్తిమీర వంటి వాటితో రోటిపచ్చడి వడ్డిస్తున్నారు. ఈ ఆహారంలో ఆకుకూర పప్పు కూడా ఉంటుంది. ఒక్కో ఆకుకూర ఒక్కోరోజు అందిస్తున్నారు. వీటితోపాటు గంజి సూప్ ఇస్తున్నారు. ఈ బువ్వబండిని సత్తయ్య 2021 నవంబర్‌లో ప్రారంభించారు. సత్తయ్య కుటుంబసభ్యులు ఉదయం 5 గంటలకే లేచి ఈ బువ్వబండి పనులు మొదలుపెడుతుంటారు. బువ్వబండి నిర్వహణ కోసం ప్రతిరోజూ కనీసం రూ.4 వేల ఖర్చు అవుతోందని సత్తయ్య పేర్కొంటున్నారు. -
‘చిరు’కు జైకొడుతున్నారు.. కారణాలు ఇవే! ..మంచి పరిణామం
సాక్షి, అమరావతి: కరోనా కారణంతో ఆహారపు అలవాట్లలో బాగా మార్పులొచ్చాయి. ఎన్నో పోషక విలువలున్న చిరుధాన్యాలు, వాటి అనుబంధ ఉత్పత్తుల వినియోగం రాష్ట్రంలో బాగా పెరిగింది. సంప్రదాయ అల్పాహారాలైన ఉప్మా–పెసరట్టు, మసాలా దోశ, ఇడ్లీ, ఊతప్పం తదితరాల స్థానంలో ఇప్పుడు చిరుధాన్యాలతో తయారుచేసే కొర్రల ఉప్మా, పుట్టగొడుగుల దోశ, కొర్ర ఇడ్లీ, రాగి ఇడ్లీ, జొన్నట్టు ఉప్మా, కొర్ర పాయసం, రాగి జావ వంటివి వచ్చి వచ్చాయి. ఇది సేంద్రీయ వ్యవసాయ రైతులో లేక ప్రకృతి సేద్యం చేస్తున్న వారో చెబుతోంది కాదు.. కార్పొరేట్ సంస్థలే స్పష్టంచేస్తున్న వాస్తవం. 2020 మార్చి నుంచి ఇప్పటివరకు చేసిన ఓ సర్వే ప్రకారం.. లాక్డౌన్ అనంతర కాలంలో పోషక విలువలున్న ఆహారానికి ఎక్కడలేని గిరాకీ పెరిగింది. కరోనా సమయంలో ఇంటి వద్ద ఉన్న చిన్నాపెద్ద అందరూ చిరుతిళ్ల వైపు ఎక్కువ మొగ్గు చూపారు. ప్యాక్ చేసిన చిరు ధాన్యాలు, వాటి అనుబంధ ఉత్పత్తులపై ఆసక్తి చూపారు. దీన్ని ఆసరా చేసుకున్న వాటి తయారీ సంస్థలు, పేరున్న మల్టీచైన్ కంపెనీలు చిరుధాన్యాలతో తయారుచేసిన రెడీ టూ కుక్, రెడీ టూ ఈట్ పదార్థాలపై ఎక్కువ దృష్టిపెట్టాయి. కొత్త పదార్థాలను మార్కెట్లోకి ప్రవేశపెట్టాయి. లాక్డౌన్ అనంతరం కూడా చిరుధాన్యాల వినియోగం పెరిగింది. అల్పాహారంలో ఎక్కువ వినియోగం ప్రస్తుతం చిరు ధాన్యాలను ఎక్కువగా అల్పాహారంలో తీసుకుంటున్నట్లు అమెరికాకు చెందిన కెల్లాగ్స్ ఫ్రూట్ లూప్స్ కంపెనీ వెల్లడించింది. కార్న్‌ఫ్లేక్స్ మాదిరే చిరు ధాన్యాల ఫ్లేక్స్ ప్రస్తుతం మార్కెట్లో బాగా దొరుకుతున్నాయి. వీటిని పాలల్లో కలుపుకుని తీసుకుంటున్నారు. ఇక జొన్న రవ్వ ఇడ్లీలు, కొర్ర, ఆండ్రు కొర్రలు, రాగి ఇడ్లీల పిండిని ప్యాక్‌చేసి రెడీ టూ కుక్‌గా విక్రయిస్తున్నారు. అటుకులు సరేసరి. చిరుధాన్యాలతో తయారైన పరోటా, చపాతీలు.. వాటిల్లోకి కూరలు కూడా ప్యాకింగ్‌లో దొరుకుతున్నాయి. ఉప్మా, ఇడ్లీ, ఓట్స్, దోశ మిక్స్ వంటివీ తయారుచేస్తున్నాయి. మరోవైపు.. దేశవ్యాప్తంగా చిరుధాన్యాలు, ఓట్స్ వ్యాపారం గత ఏడాది కాలంలో 300 మిలియన్ డాలర్లకు చేరింది. ఏడాది కిందట 11–12 శాతంగా ఉన్న వీటి వినియోగం ఇప్పుడు 18–20 శాతానికి పెరిగింది. చిరుధాన్యాలతో తయారుచేసిన ఉప్మా రవ్వ ఇప్పుడు ఎక్కువగా అమ్ముడవుతోంది. ఇంటికి తీసుకువెళ్లి నీళ్లలో ఉడికించి తినడమే. -
అరిక అదను దాటింది!
చిరుధాన్య పంటల్లో 180 రోజుల పంట అరిక. అరికను ఆరుద్ర కార్తెలో విత్తుకుంటే మేలని చెబుతారు. పుష్యమి కార్తె వచ్చి కూడా వారమైంది. చలికాలానికి ముందే అరిక పంట నూర్పిడి చేయాలి. లేదంటే మంచుకు బూజు తెగులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహించాలి. తగినంత వర్షం పడి, దుక్కి చేసి సిద్ధంగా ఉన్న భూమిలో అయితే ఒకటి, రెండు రోజుల్లో అయితే అరిక విత్తుకోవచ్చు. ఇంకా ఆలస్యమైతే అరిక విత్తుకోకుండా ఉంటేనే మంచిదని వైఎస్సార్ జిల్లాకు చెందిన రైతు శాస్త్రవేత్త కొమ్మూరి విజయకుమార్ తెలిపారు. అరిక విత్తనాలు ఉంటే గుడ్డ/గోనె సంచిలో కట్టి భద్రంగా దాచుకుంటే వచ్చే ఏడాది విత్తుకోవచ్చన్నారు. కొర్ర, సామ, ఊద, అండుకొర్ర వంటి సిరిధాన్యాలు స్వల్పకాలిక పంటలు కాబట్టి ఇప్పుడు నిస్సందేహంగా విత్తుకోవచ్చని ఆయన తెలిపారు. ఈ పంటలు కోసిన తర్వాత గూడు వేసి.. కనీసం 20 రోజుల నుంచి 2 నెలల వరకు మాగనిచ్చిన తర్వాతే నూర్చుకోవాలని ఆయన సూచించారు. ఇలా చేయడం ద్వారా కర్రలో బలాన్ని కూడా పీల్చుకోవడం వల్ల సిరిధాన్యాల నాణ్యత, బరువు కూడా పెరుగుతుందని, గడ్డి సైతం పశువులు తినడానికి బాగుంటుందని విజయకుమార్ (98496 48498) చెప్పారు. -
చిరు'చి '
సజ్జలు, జొన్నలు, రాగులు... ఇవి చిరుధాన్యాలు. చిరకాలం తినే రుచినిచ్చే ఆరోగ్యాన్ని సంరక్షించే.. ఆనందాన్ని అందించే కొన్ని చిరుధాన్యాలతో.. కొన్ని వంటకాలు ఈ చిరుచులు ఆస్వాదించండి. సజ్జ టిక్కా కావలసినవి: సజ్జలు – అర కప్పు; ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు; తరిగిన క్యారెట్ – అర కప్పు; పచ్చి బఠానీలు – పావు కప్పు; కారం – అర టీ స్పూన్; జీలకర్ర పొడి – పావు టీ స్పూన్; చాట్ మసాలా – పావు టీ స్పూన్; గరమ్ మసాలా – చిటికెడు; తరిగిన కొత్తిమీర – కొంచెం; నూనె – తగినంత; ఉప్పు – సరిపడా. తయారి :సజ్జలను బాగా కడిగి 15–20 నిమిషాలు నాననివ్వాలి ∙బాణనిలో నూనె వేసి వేడయ్యాక ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి. తరిగిన ఉల్లిపాయముక్కలు, క్యారెట్, బఠానీలు వేసి కాసేపు వేగనివ్వాలి. దీనికి 1 కప్పు నీళ్లను పోసి సరిపడా ఉప్పు వేసుకోవాలి ∙నానపెట్టుకున్న సజ్జలను వేసి మూతపెట్టి చిన్న మంట మీద నీరు పూర్తిగా ఆవిరయ్యేంత వరకు ఉడకనివ్వాలి ∙పొడిపొడిగా వచ్చేలా చూసుకోవాలి. ఒకవేళ ఇంకా నీళ్లు ఉన్నట్టయితే ఇంకాసేపు మూతపెట్టి సన్నమంట మీద ఉంచుకోవాలి ∙కారం, జీలకర్రపొడి, చాట్ మసాలా, గరం మసాలా కొత్తిమీర వేసి కలుపుకోవాలి ∙ఇలా తయారుచేసుకున్న దానిని ఉండలుగా చేసి అరచేతిలో టిక్కా మాదిరిగా ఒత్తుకోవాలి. (ఈ టిక్కాను బ్రెడ్ పొడిలో అద్దుకోవచ్చు) ∙స్టౌ మీద పెనం పెట్టి వేడయ్యాక నూనె వేసి ఒక్కొక్క టిక్కాను పెనం మీద వేసి సన్న మంట మీద బంగారు రంగు వచ్చేవరకు రెండు వైపులా కాలనివ్వాలి ∙వీటిని టమోటో కెచెప్తో లేదా గ్రీన్ చట్నీతో సర్వ్ చేయాలి. మిల్లెట్ స్వీట్ పొంగల్ కావలసినవి : వరిగెలు – పావు కప్పు; సామలు – పావు కప్పు; పెసరపప్పు – 3 టేబుల్ స్పూన్లు; పాలు – పావు కప్పు; తరిగిన బెల్లం – అర కప్పు, లేదా బెల్లం పాకం – అర కప్పు; తురిమిన కొబ్బరి – 2 టేబుల్ స్పూన్లు; జీడిపప్పు – 10; కిస్మిస్ – 15; యాలకులు – 6 (పొడి చేసుకోవాలి); నెయ్యి – 10 టేబుల్ స్పూన్లు తయారి: ∙బెల్లంలో కొంచెం నీళ్లు పోసి స్టౌ మీద పెట్టి కలుపుతూ ఉండాలి. తీగ పాకానికి దగ్గరగా ఉండగానే స్టౌ ఆఫ్ చేసి వడపోసి పక్కన పెట్టుకోవాలి ∙నెయ్యి వేడిచేసి జీడిపప్పు, కిస్మిస్ను వేయించుకోవాలి ∙వరిగెలు, సామలు, పెసరపప్పు ఈ మూడింటిని కలిపి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకొని తగినన్ని నీళ్లు పోసి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ∙ఉడికిన ఈ మిశ్రమానికి బెల్లం పాకం, కొబ్బరి తురుము, యాలకుల పొడి, పాలు పోసి మరో పది నిమిషాలు ఉడికించాలి ∙చివరగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్, నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి ∙ఈ పొంగలి వేడిగా కంటే చల్లారిన తర్వాత ఇంకా రుచిగా ఉంటుంది. మిల్లెట్ లడ్డు కావలసినవి: కొర్రలు – 3 టేబుల్ స్పూన్లు; సజ్జలు – 3 టేబుల్ స్పూన్లు; రాగులు – 3 టేబుల్ స్పూన్లు; సామలు – 3 టేబుల్ స్పూన్లు; జీడిపప్పు – 10; పెసరపప్పు – 3 టేబుల్ స్పూన్లు, బార్లీ – 1 టేబుల్ స్పూను; తరిగిన బెల్లం – 1 కప్పు; యాలకులు – 4; నెయ్యి – 10 టేబుల్ స్పూన్లు (కలపడానికి తగినంత). తయారి: ∙చిరుధాన్యాలు, పెసరపప్పు, బార్లీ, యాలకులు వేసి 10 నిమిషాల సేపు చిన్న మంటపై కమ్మటి వాసన వచ్చేవరకు వేయించాలి ∙అన్నీ కలిపి కాకుండా ఒక్కొక్కటిగా కూడా వేయించుకోవచ్చు ∙ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మరీ మెత్తగా కాకుండా సన్న రవ్వలా పట్టుకోవాలి ∙చిన్న బాణలిలో నెయ్యి వేడిచేసి జీడిపప్పు వేయించాలి ∙పిండి ఉన్న జార్లో బెల్లం, జీడిపప్పు, నెయ్యి వేసి మళ్లీ ఒక్కసారి మిక్సీ పట్టాలి ∙ఈ పిండిని వెడల్పాటి గిన్నెలోకి తీసుకుని కొంచెం కొంచెం నెయ్యి కలుపుతూ లడ్డూలు చేసుకోవాలి. (నెయ్యి వాడని వారు గోరు వెచ్చటి పాలతో కూడా లడ్డూలు చేసుకోవచ్చు. కానీ ఎక్కువ రోజులు నిల్వ ఉండవు) ∙వీటిని ఎయిర్‌టైట్ కంటెయినర్లో పెట్టుకోవాలి. వారం రోజుల పాటు నిల్వ ఉంటాయి జొన్న ఉప్మా కావలసినవి: జొన్న రవ్వ 1 కప్పు; కరివేపాకు – 1 రెమ్మ; ఉడికించిన కూరగాయ ముక్కలు – 1 కప్పు (క్యారెట్, బీన్స్); ఉల్లి తరుగు – పావు కప్పు; పచ్చిమిర్చి – 2; అల్లం తరుగు – 1 చెంచా; నూనె – 2 చెంచాలు; కొత్తిమీర తరుగు – 2 చెంచాలు; ఆవాలు – 1 చెంచా; జీలకర్ర – అర చెంచా; శనగపప్పు – 2 చెంచాలు; మినప్పప్పు – 1 చెంచా; ఇంగువ – చిటికెడు; ఎండుమిర్చి – 2, జీడిపప్పు – 10. తయారి: ∙జొన్న రవ్వ దోరగా వేపుకుని పెట్టుకోవాలి ∙బాణలిలో నూనె తీసుకుని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపపప్పు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువతో పోపు పెట్టుకుని, దీనికి ఉడికించి పెట్టుకున్న కూరగాయ ముక్కలు చేర్చి, మూడు కప్పుల నీళ్లు పోసుకుని, తగినంత ఉప్పు చేర్చి, బాగా మరగనివ్వాలి ∙నీళ్లు బాగా మరిగేటప్పుడు, రవ్వ చేర్చి బాగా కలియపెట్టుకుని, మూత పెట్టు్టకుని, సన్నని సెగమీద బాగా ఉడికేవరకు ఉడకపెట్టుకోవాలి. నిమ్మరసం, కొత్తిమీర చల్లుకుంటే కమ్మదనం పెరుగుతుంది. వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేయండి. ఈ ఉప్మా ఏ చట్నీతోనైనా తినవచ్చు. మార్పుచేర్పులు: పోపులో ఆకుకూర కూడా వేసుకోవచ్చు. కావాలకునేవాళ్లు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. దించబోయేముందు ఒక చెంచా నెయ్యి కలుపుకుంటే ఉప్మా రుచి పెరుగుతుంది. అన్ని రకాల చిరుధాన్యాల రవ్వలతో ఈ ఉప్మా తయారు చేసుకోవచ్చు. రాగి రొట్టె కావలసినవి: రాగుల పిండి – 1 1/2 కప్పు; ఉల్లిపాయ – 1; పచ్చిమిరపకాయలు – 2; కొత్తిమీర – 1 చిన్న కట్ట; ఆవాలు – 1 స్పూన్, జీలకర్ర – 1 స్పూన్; ఉప్పు – రుచికి సరిపడ, నూనె – తగినంత. తయారి : ముందుగా రాగుల పిండిని బాణలిలో వేసి పచ్చివాసన పోయేవరకు వేయించి ఒక బౌల్లోకి తీసుకోవాలి ∙అదే బాణలిలో కొంచెం నూనె వేసి ఆవాలు, జీలకర్ర, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించిన తర్వాత ఈ మిశ్రమాన్ని, ఉప్పును పిండిలో కలుపుకోవాలి ∙ఇప్పుడు వేరే గిన్నెలో నీళ్లు పోసి బాగా మరగనివ్వాలి ఈ వేడి నీళ్లను కొంచెం కొంచెంగా పిండిలో పోస్తూ గరిటెతో కలుపుకోవాలి. మరీ పలుచగా కాకుండా చేతితో రొట్టెలా ఒత్తడానికి వీలుగా ఉండే విధంగా కలుపుకోవాలి ∙ఈ పిండిని మనకు కావలసిన సైజులో ఉండలుగా చేసుకుని ఒక ప్లాస్టిక్ కవరుపై నూనె రాసి చేతితో రొట్టెలా చేసుకోవాలి ∙స్టౌ పైన పెనం పెట్టి వేడయ్యాక, 1 స్పూన్ నూనె వేసి, కవరుపై చేసిన రాగి రొట్టెను జాగ్రత్తగా పెనంపై వేసి రెండు వైపులా కాలనివ్వాలి ∙వేడి వేడి రాగి రొట్టెలకు కొత్తిమీర పచ్చడి లేదా కొబ్బరి పచ్చడి మంచి కాంబినేషన్. -
శాస్త్రవేత్త లక్ష్మీప్రియకు అవార్డు
బనగానపల్లె : చిరుధాన్యాలపై విలువాధారిత ఉత్పత్తుల తయారీ కేంద్రాలను ప్రోత్సహించినందుకు యాగంటిపల్లె కృషివిజ్ఞాన కేంద్రం గృహవిజ్ఞాన శాస్త్రవేత్త లక్ష్మిప్రియకు గురువారం అవార్డు అందజేశారు. జాతీయ చిరుధాన్యాల పరిశోధన సంస్థ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ అడిషనల్ సెక్రటరీ అశోక్ దల్వాయి చేతుల మీదుగా అవార్డును లక్ష్మిప్రియకు అందజేశారు. ఈ సందర్భంగా కృషివిజ్ఞాన కేంద్రం ప్రధాన అధికారి, సీనియర్ శాస్త్రవేత్త ధనలక్ష్మితోపాటు ఇక్కడి శాస్త్రవేత్తలు సుధాకర్, బాలరాజు, రమణయ్య, రాజేశ్వరరెడ్డిలు లక్ష్మిప్రియను అభినందించారు. -
చిరు ధాన్యాలతో ఆరోగ్యం
సాక్షి, హైదరాబాద్: చిరుధాన్యాలతోనే మనిషి ఆరోగ్యవంతుడిగా ఉంటాడని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఏవి తింటే ఆరోగ్యంగా ఉంటామో వాటినే ఎంచుకొని తినాలని హితవు పలికారు. నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్‌ప్లాజాలో శుక్రవారం ‘చిరుధాన్యాల ప్రదర్శన-2015’ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. చిరుధాన్యాలైన జొన్న, సజ్జ, రాగి తదితర ధాన్యాల్లో మరింత శక్తి ఉందని, ఇవి రోగ నివారణకు ఎంతో ప్రయోజకరమన్నారు. ప్రస్తుతం తింటున్న ఆహారంలో పోషకాలు ఉండటంలేదని... కలుషిత ఆహారం తింటున్న పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. ఫలితంగా ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. శనివారం మహిళలు చిరుధాన్యాలతో అనేక వంటకాలు చేసి చూపుతారని, వారికి అందులో పోటీలు నిర్వహిస్తామన్నారు. ఆదివారం ఔత్సాహికులు, రైతులతో ప్రత్యేక చర్చ జరుగుతుందన్నారు. ప్రదర్శనలో ప్రభుత్వ, ప్రైవేటు ఔత్సాహికులు స్టాళ్లు ఏర్పాటు చేశారన్నారు. జిల్లా స్థాయిలోనూ ఇటువంటి ప్రదర్శనలు ఏర్పాటు చేసే యోచన ఉందన్నారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, కమిషనర్ ప్రియదర్శిని, డిప్యూటీ డెరైక్టర్ రాములు, ఉద్యానశాఖ కమిషనర్ వెంకట్రామిరెడ్డి, వ్యవసాయ వర్సిటీ ప్రత్యేకాధికారి ప్రవీణ్‌రావు పాల్గొన్నారు. రాగి, జొన్న, సజ్జలతో దోసెలు, పూరీలు, నూడుల్స్ ప్రదర్శనలో చిరుధాన్యాలతో ఫుడ్‌కోర్టును ఏర్పాటు చేశారు. అక్కడ రాగి, జొన్న, సజ్జ తదితర చిరుధాన్యాలతో చేసిన వంటకాలను వండుతున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ, హోంసైన్స్, వ్యవసాయశాఖలకు చెందిన నిపుణులు, విద్యార్థులు వీటిని ఎలా చేయాలో చెబుతున్నారు. సజ్జలతో పూరీలు, రాగులతో దోసెలు, జొన్నలతో మురుకులు, ఇతర తినుబండారాలు తయారుచేస్తున్నారు. ఇక జొన్న, సజ్జ రొట్టెలు ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నారు. రొట్టెలకు చికెన్ కూర ప్రత్యేకంగా వండిస్తున్నారు. జొన్నలు, నువ్వులతో చేసిన రొట్టెలు ఏడాది వరకు కూడా ఏమాత్రం పాడవకుండా ఉండేలా చేశారు. గంటకు 60 రొట్టెలు చేసే యంత్రాన్ని ప్రదర్శనలో ఉంచారు. అయితే పెద్ద ఎత్తున చేపట్టిన ఈ ప్రదర్శనకు ప్రచారం కరువైంది. వ్యవసాయశాఖ, వ్యవసాయ వర్సిటీ, హోంసైన్స్ కలసి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో లోపం కనిపించింది.