చిరు ధాన్యాలతో ఆరోగ్యం
సాక్షి, హైదరాబాద్: చిరుధాన్యాలతోనే మనిషి ఆరోగ్యవంతుడిగా ఉంటాడని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఏవి తింటే ఆరోగ్యంగా ఉంటామో వాటినే ఎంచుకొని తినాలని హితవు పలికారు. నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్‌ప్లాజాలో శుక్రవారం ‘చిరుధాన్యాల ప్రదర్శన-2015’ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. చిరుధాన్యాలైన జొన్న, సజ్జ, రాగి తదితర ధాన్యాల్లో మరింత శక్తి ఉందని, ఇవి రోగ నివారణకు ఎంతో ప్రయోజకరమన్నారు. ప్రస్తుతం తింటున్న ఆహారంలో పోషకాలు ఉండటంలేదని... కలుషిత ఆహారం తింటున్న పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తంచేశారు.
ఫలితంగా ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. శనివారం మహిళలు చిరుధాన్యాలతో అనేక వంటకాలు చేసి చూపుతారని, వారికి అందులో పోటీలు నిర్వహిస్తామన్నారు. ఆదివారం ఔత్సాహికులు, రైతులతో ప్రత్యేక చర్చ జరుగుతుందన్నారు. ప్రదర్శనలో ప్రభుత్వ, ప్రైవేటు ఔత్సాహికులు స్టాళ్లు ఏర్పాటు చేశారన్నారు. జిల్లా స్థాయిలోనూ ఇటువంటి ప్రదర్శనలు ఏర్పాటు చేసే యోచన ఉందన్నారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, కమిషనర్ ప్రియదర్శిని, డిప్యూటీ డెరైక్టర్ రాములు, ఉద్యానశాఖ కమిషనర్ వెంకట్రామిరెడ్డి, వ్యవసాయ వర్సిటీ ప్రత్యేకాధికారి ప్రవీణ్‌రావు పాల్గొన్నారు.
రాగి, జొన్న, సజ్జలతో దోసెలు, పూరీలు, నూడుల్స్
ప్రదర్శనలో చిరుధాన్యాలతో ఫుడ్‌కోర్టును ఏర్పాటు చేశారు. అక్కడ రాగి, జొన్న, సజ్జ తదితర చిరుధాన్యాలతో చేసిన వంటకాలను వండుతున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ, హోంసైన్స్, వ్యవసాయశాఖలకు చెందిన నిపుణులు, విద్యార్థులు వీటిని ఎలా చేయాలో చెబుతున్నారు. సజ్జలతో పూరీలు, రాగులతో దోసెలు, జొన్నలతో మురుకులు, ఇతర తినుబండారాలు తయారుచేస్తున్నారు. ఇక జొన్న, సజ్జ రొట్టెలు ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నారు. రొట్టెలకు చికెన్ కూర ప్రత్యేకంగా వండిస్తున్నారు. జొన్నలు, నువ్వులతో చేసిన రొట్టెలు ఏడాది వరకు కూడా ఏమాత్రం పాడవకుండా ఉండేలా చేశారు. గంటకు 60 రొట్టెలు చేసే యంత్రాన్ని ప్రదర్శనలో ఉంచారు. అయితే పెద్ద ఎత్తున చేపట్టిన ఈ ప్రదర్శనకు ప్రచారం కరువైంది. వ్యవసాయశాఖ, వ్యవసాయ వర్సిటీ, హోంసైన్స్ కలసి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో లోపం కనిపించింది.