సాక్షి సాగుబడి, హైదరాబాద్: చిరుధాన్యాలను రోజువారీ ప్రధాన ఆహారంగా తీసుకోవటానికి అలవాటు పడితే యావత్ మానవాళికి ఆహార /పౌష్టికాహార భద్రతతో పాటు ఆరోగ్య/ పర్యావరణ భరోసా దొరుకుతుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. ‘చిరుధాన్యాలతో ప్రపంచ ప్రజలకు ఆహార భద్రత’ అనే అంశంపై రాజేంద్రనగర్‌లోని జాతీయ వ్యవసాయ విస్తరణ యాజమాన్య సంస్థ (మేనేజ్)లో మంగళవారం ప్రారంభమైన మూడు రోజుల అంతర్జాతీ రౌండ్‌టేబుల్ సమావేశంలో 31 దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. ‘మేనేజ్’తో కలసి ఆఫ్రికా ఆసియా గ్రామీణాభివృద్ధి సంస్థ (ఎఎఆర్‌డిఓ) నిర్వహిస్తున్న ఈ రౌండ్‌టేబుల్ ప్రారంభ సమావేశంలో మిల్లెట్ మాన్ ఆఫ్ ఇండియా, పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. ఖాదర్ వలితో పాటు ప్రకృతి వ్యవసాయ పితామహుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత సుభాష్ పాలేకర్ ప్రధాన స్రవంతి వ్యవసాయ శాస్త్రవేత్తలతో కలసి తొలిసారి వేదికను పంచుకోవటం విశేషం.
డా. ఖాదర్ వలి కీలకోపన్యాసం చేస్తూ, భూగోళంపై వేల ఏళ్లుగా ప్రజలు ప్రధాన ఆహారంగా తింటున్న చిరుధాన్యాలే అసలైన ఆహారమన్నారు. అయినప్పటికీ.. ఆంగ్లేయులు, పాశ్చాత్యులు ఇది మనుషుల ఆహారం కాదని చెప్పటం ప్రారంభించి గోధుమలు, వరి బియ్యాన్ని హరిత విప్లవం పేరుతో ప్రోత్సహిస్తూ కేంద్రీకృత వ్యవస్థ ద్వారా పారిశ్రామిక ఆహారోత్పత్తులను ముందుకు తేవటం వల్ల చిరుధాన్యాలు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొన్నదని, ఇందువల్లనే ఆహార భద్రత సమస్య ఉత్పన్నమైందన్నారు. పారిశ్రామిక ఆహారం కారణంగానే మానవాళి ఎన్నో జబ్బుల పాలవుతున్నదని మానవాళి, శాస్త్రవేత్తలు, పాలకులు గుర్తెరగాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు.
మనుషులను రోగగ్రస్థంగా మార్చుతున్న కార్పొరేట్ ఆహారాన్ని వదిలించుకుంటేనే మానవాళికి జబ్బుల నుంచి, ఎడతెగని ఔషధాల వాడకం నుంచి సంపూర్ణ విముక్తి దొరుకుతుందన్నారు. సిరిధాన్యాలు (స్మాల్ మిల్లెట్స్) దివ్యౌషధాలుగా పనిచేస్తున్నాయని 8 ఏళ్లుగా తాను వందలాది మంది రోగులతో కలసి చేసిన అధ్యయనంలో వెల్లడైందని డా. ఖాదర్ వలి పేర్కొన్నారు. శాస్త్రీయంగా ఫలితాలను నమోదు చేశామని, 140 రకాల జబ్బుల్ని ఆరు నెలల నుంచి 2 ఏళ్లలోపు నయం చేయటమే కాదు పూర్తిగా మాయం చేస్తున్నట్లు గుర్తించామన్నారు. సిరిధాన్యాలను రోజువారీ ప్రధాన ఆహారంగా తీసుకుంటూ ఉంటే డయాబెటిస్, బీపీ, ఊబకాయం, కేన్సర్ వంటి జబ్బులకు వాడుతున్న మందులను క్రమంగా మానివేస్తూ పూర్తి ఆరోగ్యాన్ని సంతరించుకోవచ్చన్నారు.
సిరిధాన్యాలు సకల పోషకాలను అందించటంతోపాటు దేహంలో నుంచి కలుషితాలను బయటకు పంపటంలోనూ కీలకపాత్రపోషిస్తున్నాయన్నారు. ఇవి వర్షాధారంగా పండే అద్భుత ఆహార ధాన్యాలని అంటూ సాగు నీటితో పండించే ఆహారం అనారోగ్య కారకమనటంలో ఏ సందేహమూ లేదని డా. ఖాదర్ వలి తెలిపారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత సుభాష్ పాలేకర్ ప్రసంగిస్తూ పోషకాల గనులైన చిరుధాన్యాలను రసాయనాలతో సాగు చేయటం విచారకరమన్నారు. రసాయనాలతో పండించటం వల్ల చిరుధాన్యాల్లో పోషకాలు తగ్గిపోవటమే కాకుండా, రసాయనిక అవశేషాల వల్ల ప్రజలకు హాని కలుగుతుందన్నారు.
చిరుధాన్యాల వేలాది వంగడాలను అనాదిగా ఆదివాసులు సంరక్షిస్తున్నారని, మనకు తెలియని చిరుధాన్య రకాలు ఇప్పటికీ వారి వద్ద ఉన్నాయన్నారు. శాస్త్రవేత్తలు వాటిపై దృష్టి కేంద్రీకరిస్తే మరింత ఎక్కువ పోషకాలున్న చిరుధాన్యాలు వెలుగులోకి రావచ్చన్నారు. ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లో ప్రకృతి వ్యవసాయం ద్వారా చిరుధాన్యాల సాగును, వినియోగాన్ని ప్రోత్సహించటంపై పాలకులు దృష్టి కేంద్రీకరిస్తే ఆహార భద్రత సమస్య, పర్యావరణ సమస్య కూడా తీరిపోతుందని పాలేకర్ సూచించారు. భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ (ఐఐఎంఆర్) సంచాలకులు డా. సి.తార సత్యవతి ప్రసంగిస్తూ చిరుధాన్యాల సాగును విస్తృతంగా చేయాలన్నారు.
వరి కోతల తర్వాత ఆ పొలాల్లో జొన్న తదితర చిరుధాన్యాలను సాగు చేసి అధిక దిగుబడి సాధించవచ్చని తమ అధ్యయనంలో రుజువైందన్నారు. చిరుధాన్యాలను అన్నం, రొట్టెలతో పాటు 300 రకాల ఉత్పత్తులుగా మార్చి తినవచ్చన్నారు. ఐఐఎంఆర్ ప్రపంచ దేశాలకు ఆధునిక చిరుధాన్య ఉత్పత్తులకు సంబంధించిన సాంకేతికతను అందిస్తోందన్నారు. ‘మేనేజ్’ డైరెక్టర్ జనరల్ డా. పి. చంద్రశేఖర ప్రసంగిస్తూ ఆహార భద్రత సాధించాలంటే చిరుధాన్యాల ఉత్పత్తిని పెంపొందించడానికి అందరూ సమన్వయంతో కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎఎఆర్‌డిఓ ప్రధాన కార్యదర్శి మనోజ్ నర్‌దేవ్‌సింగ్, డా.సంజీవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment