Millets
-
గట్ హెల్త్‌పై దృష్టి పెడదాం..ఆరోగ్యంగా ఉందాం..!
ఇంటిగ్రేటెడ్ హెల్త్‌కేర్ సొల్యూషన్స్ మహిళల గట్ హెల్త్ కోసం పిలుపునిచ్చింది. అందుకోసం సెలియక్ సొసైటీ ఆఫ్ ఇండియా హాబిటాట్ సెంటర్లోని అపోలో హాస్పిటల్స్ సహకారంతో వివిధ విభాగాలకు చెందిన ప్రముఖ నిపుణులతో ఇల్నెస్ టు వెల్నెస్ అనే ప్రోగ్రామ్ నిర్వహిచింది. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాలకు చెందిన నిపుణులచే గట్ హెల్త్‌పై అవగాహన కల్పించేలా 'గట్ మ్యాటర్స్- ఉమెన్స్ హెల్త్ అండ్ గట్ మైక్రోబయోమ్' అంశంపై సెమినార్ని నిర్వహించింది. ఆరోగ్య సమస్యలకు మూలం..ఆ సమావేశంలో హర్మోన్ల అసమతుల్యత, సంతానోత్పత్తి, పీసీఓఎస్ వంటి దీర్ఘకాలిక పరిస్థితులుపై గట్ మైక్రోబయోమ్ ప్రభావం గురించి చర్చించారు. అలాగే మహిళ తరుచుగా ఎదుర్కొన్నే ఆరోగ్య సమస్యలపై కూడా దృష్టిసారించారు. ఈ సెమినార్లో పాల్గొన్న క్లినికల్ న్యూట్రిషనిస్ట్ ఇషి ఖోస్లా, డాక్టర్ అర్జున్ డాంగ్, డాక్టర్ డాంగ్స్, డాక్టర్ హర్ష్ మహాజన్, ఇండియన్ కోయలిషన్ ఫర్ కంట్రోల్ ఆఫ్ అయోడిన్ డెఫిషియెన్సీ డిజార్డర్ (ICCIDD) అధ్యక్షుడు, పద్మశ్రీ గ్రహీత డాక్టర్ చంద్రకాంత్ పాండవ తదితరాలు మహిళల ఆరోగ్యంలో కీలక పాత్ర పోషించే గట్ హెల్త్ సంరక్షణ గురించి నొక్కి చెప్పారు. అంతేగాదు సమాజంలో ముఖ్యపాత్ర పోషించే మహిళల ఆరోగ్యంపై దృష్టిసారించాల్సిన ప్రాముఖ్యతను గురించి కూడా హైలెట్ చేశారు. అలాగే మహిళల ఆరోగ్యంలో గట్ హెల్త్ అత్యంత కీలకమైనదని అన్నారురు. ఇది హర్మోన్లు, సంతానోత్పత్తి, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని చెప్పారు. మహిళలకు సంబంధించిన ప్రశూతి ఆస్పత్రులు లేదా ఆరోగ్య క్లినిక్స్‌లో దీనిపై అవగాహన కల్పించాలన్నారు. ఈ గట్ ఆరోగ్యం అనేది వైద్యపరమైన సమస్య కాదని మొత్తం కుటుంబాన్నే ప్రభావితం చేసే సమస్యగా పేర్కొన్నారు. సెలియక్ సొసైటీ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఇల్నెస్ టు వెల్నెస్ ప్రోగ్రామ్‌లో తాను పాలుపంచుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు ఆస్కామ్ నేషనల్ సీఎస్ఆర్ ఛైర్పర్సన్అనిల్ రాజ్‌పుత్. ఆరోగ్యకరమైన సమాజాన్నినిర్మించేందుకు ఇలాంటి ఆరోగ్య పరిజ్ఞానానికి సంబందించిన సెమినార్లు అవసరమన్నారు. ఇక ఆ సెమినార్లో డాక్టర్ అర్జున్ డాంగ్ మహిళల్లో పేగు ఆరోగ్యాన్ని గణనీయంగా ప్రభావితం చేసే అలర్జీలు, సరిపడని ఆహారాలు గురించి కూడా చర్చించారు. అలాగే అభివృద్ధి చెందుతునన్న రోగ నిర్థారణ సాధానాల ప్రాముఖ్యత తోపాటు అందుబాటులో ఉన్న సమర్థవంతమైన చికిత్సపై రోగులకు సమగ్రమైన అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని గురించి నొక్కిచెప్పారు. మిల్లెట్ల పాత్ర..పోషకాహారం తీసుకునేలా మిల్లెట్లను మహిళల డైట్లో భాగమయ్యేలా చూడాలని వాదించారు. దీనివల్ల మొటిమలు, నెలసరి సమస్యలు, అధిక బరవు తదితర సమస్యలు అదుపులో ఉంటాయని ఉదహరించి మరి చెప్పారు. అంతేగాదు సెమినార్‌లోని నిపుణులు 2023లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన భారతదేశ మిషన్ మిల్లెట్స్ గురించి లేవనెత్తడమే గాక దానిపై మళ్లీ ఫోకస్ పెట్టాలన్నారు. గట్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మిల్లెట్ ఆధారిత ఆహారాలను ప్రోత్సహించాలన్నారు.అంతేగాదు పెరుగుతున్న ఆటిజం కేసులు, తల్లిబిడ్డల ఆరోగ్యంతో సహా మహిళల ప్రేగు ఆరోగ్యం ఎలా ప్రభావితం చేస్తుందన్నది సెమినార్లో నొక్కి చెప్పారు. వీటన్నింటిని నిర్వహించడంలో ఆహారం, మైక్రోబయోమ్ బ్యాలెన్స్‌ల పాత్రపై మరింతగా పరిశోధనలు నిర్వహిస్తున్నట్లు కూడా వెల్లడించారు. చివరగా ఈ సెమినార్లో ప్రజారోగ్య విధానాల్లో గట్ హెల్త్ ప్రాముఖ్యత, మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేలా బడ్జెట్ కేటాయింపుల చర్చలతో ముగిసింది. కాగా, సెలియక్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రజారోగ్య కార్యక్రమాలలో గట్ హెల్త్ పై అవగాహన పెంచడమే గాక ఇలాంటి సెమినార్లో ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించేలా ప్రోత్సహిస్తోంది. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య సవాళ్లను పరిష్కరించడమే లక్ష్యంగా పెట్టుకుంది.(చదవండి: ఇండియా నన్ను స్వీకరిస్తే చాలు..!: జాక్వెలిన్ ఫెర్నాండేజ్) -
మొలకెత్తిన రాగుల పిండితో లాభాలెన్నో: ఇంట్లోనే చేసుకోండిలా!
రాగులతో మన ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు రాగులు చాలామంచిది. కాల్షియం, ఐరన్ లాంటి ముఖ్యమైన పోషకాలు అందుతాయి. రాగులతో పసందైన వంటకాలను తయారు చేసుకొని ఆస్వాదించవచ్చు. అయితే రాగులను నానబెట్టి,మొలకలొచ్చాక, వేయించి పౌడర్ చేసుకొన వాడితేమరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. పిల్లలు నుంచి పెద్దల వరకు రాగులను అనేక రూపాల్లో తీసుకోవచ్చు. రాగి జావ, రాగి పిండితో దోసెలు, ఇడ్లీలు చేసుకోవచ్చు. అలాగే రాగులతో మురుకులను కూడా తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా రాగులను మొలకలు వచ్చేలా చేసి వాటిని ఎండబెట్టి, లైట్‌గా వేయించి పౌడర్ చేసుకుంటే ఇంకా మంచిది. ఆరోగ్యానికి ఆరోగ్యం. రుచికీ రుచీ పెరుగుతుంది. పోషకాలూ పెరుగుతాయి. రాగుల మొలకలతో పిండిని ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూద్దాం.రాగుల మొలకలతో పిండి తయారీరాగులను రాళ్లు, ఇసుక లేకుండా శుభ్రంగా జల్లించుకోవాలి. ఆ తరువాత వీటిని శుభ్రంగా కడగాలి. ఎక్కువ సార్లు దాదాపు నాలుగు నుంచి పదిసార్లు , తెల్ల నీళ్లు వచ్చేదాకా కడుక్కోవాలి. కడిగిన రాగులను జాలీలో వేసుకొని నీళ్లు మొత్తం వాడేలా చూసుకోవాలి. తరువాత వీటిని పల్చని కాటన్ వస్త్రంలో(కాటన్ చున్నీ, చీర అయితే బావుంటుంది)వేసి మూట కట్టి, లైట్‌గా నీళ్లు చిలకరించి ఒక జాలీ గిన్నెలో పెట్టి, జాగ్రత్తగా వంట ఇంటి కప్‌బోర్డులో(గాలి, వెలుతురు తగలకుండా) పెట్టుకోవాలి. రెండు రోజులకు రాగులు మొలకలు భలే వస్తాయి. మూటలోంచి మొలకలు తెల్లగా బయటికి వచ్చేంత పెరుగుతాయి. వీటిని జాగ్రత్తగా తీసుకొని తడి ఆరేలాగా ఎండబెట్టుకోవాలి. ఆరిన తరువాత వీటిని నూనె లేకుండా ఉత్తి మూకుడులో వేగించుకోవాలి. మాడకుండా గరిటెతో తిప్పుతూ సన్నని సెగమీద కమ్మటి వాసన వచ్చేదాకా వేయించుకోవాలి. చల్లారిన తరువాత మిక్సీలో మెత్తగా పట్టుకోవాలి. అంటే కమ్మని రాగుల మొలకల పిండి రెడీ.ఈ పిండిని జావ, దోసెలు, చపాతీలు తయారీలో వాడుకోవచ్చు. ఇంకా రాగిమొలకలతో చేసిన పిండిలో కొద్దిగా పుట్నాల పొడి, బెల్లం, నెయ్యి కలిపి సున్ని ఉండలుగా చేసి పిల్లలకు రోజుకు ఒకటి పెడితే మంచి శక్తి వస్తుంది.రాగి ఇడ్లీరాగుల పిండిలో గోధు రవ్వ, పుల్లని పెరుగు, సరిపడినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. దీన్ని కనీసం అరగంటపాటు పక్కన పెట్టుకోవాలి. వేడి నూనెలో ఆవాలు జీలకర్ర, జీడిపప్పు, కొన్ని ఎండు మిర్చి,, కొన్ని కరివేపాకులువేసి పోపు రెడీ చేసుకోవాలి. ఇవి వేగాక ఇందులోనే తరిగిపెట్టుకున్న క్యారట్, ఉల్లిపాయముక్కలను వేయాలి. ఇది చల్లారాక రాగుల పిండిలో కలపాలి. తరువాత బేకింగ్ సోడా(పెరుగు పుల్లగా ఉంటే ఇది కూడా అవసరంలేదు) బాగా కలపాలి. కొత్తమీర కూడా కలుపుకోవచ్చు.రాగులతో ఉపయోగాలురాగులు బలవర్దకమయిన ఆహారం. ఇతర ధాన్యాల కంటే రాగుల్లో 10 రెట్లు ఎక్కువ కాల్షియం ఎక్కువ. నానబెట్టి, మొలకెత్తడంవల్ల పోషకాలు మరింత పెరుగుతాయి కొవ్వు కంటెంట్ తగ్గుతుంది. ఈ పిండితో చేసిన ఉగ్గును శిశువులకు కూడా తినిపించవచ్చు.బీపీ మధుమేహం, కాలేయవ్యాధులు, గుండె బలహీనత, ఉబ్బసం లాంటి సమస్యలకు దివ్యౌషధంలా పనిచేస్తాయి. చిన్నపిల్లల్లో ఎముకల వృద్ధికి, అనీమియా నివారణలో ఉపయోగపడుతుంది. వృద్దాప్యంలో వున్న వారు రాగులతో తయారు చేసిన ఆహార పదార్థాలను భుజించడం వల్ల శరీరానికి బలం, శక్తి చేకూరుతాయి -
కొర్రలతో కొండంత ఆరోగ్యం!
ఇటీవల చిరుధాన్యాల వాడకం పెరిగిపోయిన కాలంలో కొర్రలకు మంచి ప్రాధాన్యం ఏర్పడింది. చాలామంది కొర్రలను పిండిగా కొట్టించి, వాటితో చేసిన ఆహారాలను వాడటం పరిపాటి అయ్యింది. నిజానికి గోధుమ పిండి కంటే కొర్రల పిండి మంచిదంటున్నారు న్యూట్రిషన్ నిపుణులు. కొర్రలలో ఉండే పోషకాలూ, వీటితో సమకూరే ఆరోగ్య ప్రయోజనాలూ లాంటి అనేక విషయాలను తెలుసుకుందాం...ఒక కప్పు కొర్రపిండిలో ప్రోటీన్ 10 గ్రాములు డయటరీ ఫైబర్ 7.4 గ్రాములు, మెగ్నీషియమ్ 83 మిల్లీగ్రాములతో తోపాటు ఇంకా చాలా రకాల సూక్ష్మపోషకాలు అంటే మైక్రోన్యూట్రియెంట్లూ ఉంటాయి. కొర్రపిండితో సమకూరే కొన్ని ప్రయోజనాలు... కొర్రపిండిలో పీచుపదార్థాల పరిమాణం చాలా ఎక్కువ కాబట్టి దీంతో చేసిన ఆహారాలు తీసుకోవడం వల్ల మలబద్ధకం తేలిగ్గా నివారితమవుతుంది. ఒక్క మలబద్ధకాన్ని నివారించుకుంటే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలూ, అనర్థాలూ దూరమవుతాయన్న సంగతి తెలిసిందే. కొర్రల్లోని ప్రోటీన్లు కండరాల్లోని కణజాలానికి మంచి బలాన్ని ఇస్తాయి. ఈ ప్రోటీన్లే కండరాల్లో తమ రోజువారీ పనుల కారణంగా దెబ్బతినే కండరాలను రిపేర్లు చేస్తుంటాయి. దాంతో దెబ్బలు త్వరగా తగ్గడం, గాయాలు త్వరగా మానడం జరుగుతాయి. బలంగా మారిన ఈ కణజాలాలు మరింత ఎక్కువ ఆక్సిజన్‌ను గ్రహించగలుగుతాయి కాబట్టి మరింత ఆరోగ్యకరంగా ఉంటాయి. అంతేకాదు చాలాసేపు అలసి΄ోకుండా పనిచేయగలుగుతాయి. ఫలితంగా మనం పనిచేసే సామర్థ్యం, అలసి΄ోకుండా పనిచేయగల సమయం (టైమ్ డ్యూరేషన్) పెరుగుతాయి. ఈ అంశాలన్నీ కలగలసి రోగనిరోధక వ్యవస్థ బలోపేతమవుతుంది. డయాబెటిస్ నివారణకూ... కొర్రల్లో చాలా ఎక్కువ పరిమాణంలో ఉండే పీచు దేహంలోని గ్లూకోజ్‌ను చాలా మెల్లగా రక్తంలో కలిసేలా చేస్తుంది. దాంతో డయాబెటిస్ నివారణకు ఇది బాగా తోడ్పడుతుంది. ఈ పీచు పదార్థమూ, ఈ గుణం కారణంగానే టైప్–2 డయాబెటిస్ ఉన్నవారికి ఆరోగ్యకరమైన ఆహారంగా రూపొందాయి. అంతేకాదు కొర్రలు రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఇందులోని మెగ్నీషియమ్ వల్ల ఎముకలు మరింత పటిష్టమవుతాయి. జీవకణాల్లోని ఎంజైములు మరింత సమర్థంగా పనిచేస్తాయి. కొర్రల్లో జింక్ మోతాదులూ ఎక్కువే కావడంతో వ్యాధి నిరోధక శక్తి పెరుగుదలకు ఈ అంశం దోహదపడుతుంది. ఈ జింక్ వల్ల జుట్టు ఊడటం కూడా తగ్గుతుంది. థైరాయిడ్ పనితీరు క్రమబద్ధంగా మారుతుంది. (చదవండి: స్పాండిలోసిస్ అంటే..?) -
గుళి సామ.. ఎకరానికి 11 క్వింటాళ్లు!
ఉత్తరాంధ్రలోని అల్లూరి సీతారామ జిల్లాలో సామ పంట విస్తృతంగా సాగవుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా ఇతర చిరుధాన్యాలతో పాటు సామలకు మంచి గిరాకీ ఏర్పడటంతో గిరిజన రైతుల్లో ఈ పంట సాగుపై ఆసక్తి పెరుగుతోంది. దీంతో ఈ పంట విస్తీర్ణం కూడా విస్తరిస్తోంది. సేంద్రియ పద్ధతిలో పండించడానికి శ్రమ, పెట్టుబడి పెద్దగా అవసరం లేనిది సామ. అందువల్ల గిరిజనులందరూ ఎంతోకొంత విస్తీర్ణంలో ఈ పంటను పండించి, తాము తింటూ, మిగతా సామలు అమ్ముకుంటూ మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. పూర్వం సామ ధాన్యాన్ని తిరగలిలో మరపట్టి బియ్యంలా మార్చుకొని సామ అన్నం, ఉప్మా, జావ వంటి సాంప్రదాయ వంటలు వండుకునే వారు. ఈ మధ్య మైదాన ప్రాంతాల ప్రజల్లో కూడా చిరుధాన్యాల వినియోగం పెరగడం, వీటితో బిస్కట్లు, కేక్ వంటి వివిధ రకాల చిరు తిండి ఉత్పత్తులను తయారుచేసి అమ్మడం వల్ల చిరుధాన్యాల ధరలు పెరిగి రైతులకు మంచి లాభాలు వస్తున్నాయి.అప్పుడు చోడి, ఇప్పుడు సామ ఈ క్రమంలో వికాస స్వచ్చంద సంస్థ 2016లో చోడి /రాగి పంటలో గుళి సాగు పద్ధతిని ప్రవేశపెట్టింది. సాధారణంగా రైతులు చిరుధాన్యాల విత్తనాలను వెదజల్లే పద్ధతిలో పండిస్తుంటారు. నారు పెంచి, పొడి దుక్కిలో వరుసల్లో గుంతలు తీసి నాట్లు వేసుకునే పద్ధతిలో పండించడాన్నే ‘గుళి’ (గుళి అంటే గిరిజన భాషలో గుంట అని అర్థం) పద్ధతిగా పిలుస్తున్నారు. గుళి చోడిని పద్ధతిలో పండిస్తూ గిరిజన రైతులు దిగుబడిని ఎకరాకు 400 కేజీల నుంచి దాదాపు 1000 కేజీల వరకు పెంచుకోగలిగారు. ఈ క్రమం లోనే వికాస సంస్థ 2024 ఖరీఫ్ పంట కాలంలో గుళి పద్ధతిలో సామ పంటను సాగు చేయటానికి 54 మంది గిరిజన రైతులకు తోడ్పాటునందించింది.30–35 రోజుల మొక్క నాటాలిప్రధాన పొలం చివరి దుక్కిలో 200 కేజీల ఘన జీవామృతాన్ని చల్లడం వల్ల భూమికి బలం చేకూరి, రైతులు మంచి దిగుబడి సాధించారు. సామ పంట ముఖ్యంగా పెద్ద సామ రకం బాగా ఎత్తు పెరుగుతుంది. అందువల్ల మొక్కలు నాటిన తర్వాత 30 నుండి 35 రోజుల మధ్య వెన్ను రాక ముందే తలలు తుంచాలి. దీని వల్ల పంట మరీ ఎత్తు పెరగకుండా, దుబ్బులు బలంగా పెరుగుతాయి. గాలులకు పడిపోకుండా ఉంటుంది. దుంబ్రీగూడ మండలం లోగిలి గ్రామంలో కొర్రా జగబంధు అనే గిరిజన రైతు పొలంలో గుళి పద్ధతిలో పండించిన పెద్ద సామ పంటలో క్రాప్ కటింగ్ ప్రయోగాన్ని నిర్వహించారు. రైతులు, వికాస సిబ్బంది, నాబార్డ్ జిల్లా అధికారి చక్రధర్ సమక్షంలో సామలను తూకం వేసి చూస్తే.. ఎకరాకు దాదాపు 1,110 కేజీల (11.1 క్వింటాళ్ల) దిగుబడి నమోదైంది. ఈ పొలానికి పక్కనే రైత్వారీ పద్ధతిలో వెదజల్లిన సామ పొలంలో దిగుబడి ఎకరాకు 150 కేజీల నుంచి 200 కేజీలు మాత్రమే! గుళి సాగు ప్రత్యేకత ఏమిటి?రైత్వారీ పద్ధతిలో ఎక్కువ విత్తనం వెదజల్లటం, నేలను తయారు చేసే సమయంలో ఎటువంటి ఎరువు వేయక΄ోవడం, ఒక ఎకరాకు ఉండాల్సిన మొక్కల కన్నా మూడు నాలుగు రెట్లు ఎక్కువ సాంద్రతలో మొక్కలు ఉండటంతో పంట బలంగా పెరగలేకపోతోంది. గుళి పద్ధతిలో లేత నారును పొలంలో వరుసల మధ్య అడుగున్నర దూరం, మొక్కల మధ్య అడుగు ఉండేలా నాటుతారు. రైత్వారీ వెద పద్ధతిలో ఎకరానికి 3 నుంచి 4 కేజీల విత్తనం అవసరం. దీనికి బదులు మొక్కలు నాటడం వల్ల ఎకరానికి 300 నుంచి 400 గ్రాముల విత్తనం (దాదాపు పది శాతం మాత్రమే) సరిపోతుంది. నారు పెంచుకొని 15 నుంచి 20 రోజుల వయసు మొక్కల్ని పొలంలో నాటుకోవడం వల్ల విత్తన ఖర్చు దాదాపుగా 90 శాతం తగ్గుతోంది. మొక్కల సాంద్రత తగినంత ఉండి, మొక్కలు పెరిగే సమయంలో ప్రతి మొక్కకూ చక్కగా ఎండ తగలుతుంది. ఘన జీవామృతం వల్ల నేల సారవంతమై సామ మొక్కలు బలంగా పెరిగి, మంచి దిగుబడి వస్తున్నట్టు గమనించామని వికాస సిబ్బంది వెంకట్, నాగేశ్వర రావు, తవుడన్న చెబుతున్నారు. దూరంగా నాటడం వల్ల దుక్కి పశువులతో కానీ, సైకిల్ వీడర్‌తో కానీ కలుపు తొందరగా, సులభంగా తియ్యవచ్చు. మొక్కలు బలంగా , ఏపుగా పెరగటం వల్ల కోత సమయంలో వంగి మొదలు నుంచి కోసే బదులు, నిలబడి వెన్నులు కొయ్యడం వల్ల సమయం ఆదా అవడమే కాక సులభంగా పంట కోత జరుగుతుండటం మరో విశేషం. మున్ముందు వరిగ, ఊద కూడా..అల్లూరి సీతారామ జిల్లాలో సామ పంటను ఈ సంవత్సరం ప్రయోగాత్మకంగా గుళి పద్ధతిలో పండించిన గిరిజన రైతులకు ఎకరానికి 11 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. రైత్వారీ వెద పద్ధతిలో 2 క్వింటాళ్లకు మించలేదు. కనువిందు చేస్తున్న ఈ పొలాలను చుట్టుపక్కల గ్రామాల నుంచి రైతులను, మహిళలకు చూపిస్తున్నాం. వారు కూడా వచ్చే సంవత్సరం నుంచి మొక్కలు నాటే పద్ధతిని అనుసరించేలా ్ర΄ోత్సహిస్తున్నాం. ఇప్పటికే గిరిజన రైతులు చోడి సాగులో గుళి పద్ధతిని ΄ాటిస్తున్నారు. దీని వల్ల తక్కువ సమయంలోనే సామ రైతులు గుళి పద్ధతికి మారే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో వరిగ, ఊద పంటల్ని కూడా గుళి పద్ధతిలో సాగు చేయిస్తాం. – డా. కిరణ్ (98661 18877), వికాస స్వచ్ఛంద సంస్థ, అల్లూరి సీతారామరాజు జిల్లా -
రాగులతో దూదుల్లాంటి ఇడ్లీ, రుచికరమైన ఉప్మా : ఇలా చేస్తే ఎవ్వరైనా ఫిదా!
తృణధాన్యాల్లో ప్రముఖమైనవి రాగులు (finger millets). రాగులతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు చాల ఉన్నాయి. రాగులలో ప్రోటీన్ , ఫైబర్స్ వంటి స్థూల పోషకాలతో పాటు, కాల్షియం, మెగ్నీషియం, మెథియోనిన్, లైసిన్ ,అమైనో ఆమ్లాలు ఉన్నాయి. ఇవి సులభంగా జీర్ణం అవుతాయి. కాబట్టి చిన్న పిల్లలతోపాటు, వృద్ధులకూ ఆహారంగా ఇవ్వవచ్చు. రాగులతో రకరకాలుగా వంటకాలను తయారు చేసుకోవడం ఎలాగో చూద్దాం.ఇడ్లీని సాధారణంగా బియ్యం ,మినప్పప్పుతో తయారు చేస్తారు.కానీ హెల్తీగా రాగులతో కూడా ఇడ్లీ తయారు చేసే విధానం ఇప్పుడు తెలుసుకుందాం.కావాల్సిన పదార్థాలు ఒక కప్పు రాగుల పిండి ఒక కప్పు సూజీ/రవ్వ) ఒక కప్పు పుల్లని పెరుగుతాజా కొత్తిమీర (సన్నగా తరిగినవి)ఉప్పు (రుచి కి తగినంత ) అర టీస్పూన్ బేకింగ్ సోడాపోపుగింజలుకావాలంటే ఇందులో శుభ్రంగా కడిగి తురిమిన క్యారెట్ ,ఉల్లిపాయకూడా కలుపుకోవచ్చు.తయారీ : పిండి తయారీ వెడల్పాటి గిన్నెలో పిండి, రవ్వ, పుల్లని పెరుగు, సరిపడినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. దీన్ని కనీసం అరగంటపాటు పక్కన పెట్టుకోవాలి.వేడి నూనెలో ఆవాలు జీలకర్ర, జీడిపప్పు, కొన్ని ఎర్ర/ఎండు మిరపకాయలు, కొన్ని కరివేపాకులువేసి పోపు రెడీ చేసుకోవాలి. ఇవి వేగాక ఇందులోనే తరిగిపెట్టుకున్న క్యారట్, ఉల్లిపాయముక్కలను వేయాలి. ఇది చల్లారాక రాగుల పపిండిలో కలపాలి. తరువాత బేకింగ్ సోడా(పెరుగు పుల్లగా ఉంటే ఇది కూడా అవసరంలేదు) బాగా కలపాలి.ఇడ్లీ తయారీ: దీన్ని ఇడ్లీ కుక్కర్లేదా, ఇడ్డీపాత్రలో ఆవిరి మీదకొద్దిసేపు హైలో , తరువాత మీడియం మంటమీద ఉడికించుకోవాలి. ఇడ్లీ ఉడికిందో లేదో చెక్ చేసుకోని, తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే రాగి ఇడ్లీ రెడీ. అల్లం, పల్లీ, పుట్నాల చట్నీతోగానీ,కారప్పొడి నెయ్యితోగానీ తింటే మరింత రుచిగా ఉంటుంది. (నవరాత్రుల ఉపవాసాలు : ఈజీగా, హెల్దీగా సగ్గుబియ్యం కిచిడీ)రాగి ఉప్మా కావలసినవి: రాగి రవ్వ– కప్పు; నీరు – రెండున్నర కప్పులు; ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు; ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి; నూనె లేదా నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; కరివే΄ాకు – 2 రెమ్మలు; పచ్చిమిర్చి – 2 (తరగాలి); ఇంగువ – చిటికెడు; ఆవాలు – అర టీ స్పూన్; జీలకర్ర – అర టీ స్పూన్; వేరుశనగపప్పు – 3 టేబుల్ స్పూన్లు; అల్లం తరుగు – టీ స్పూన్; పచ్చి శనగపప్పు – అర టేబుల్ స్పూన్; మినప్పప్పు టీ స్పూన్; కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు; ఒక నిమ్మకాయతయారీ: రాగి రవ్వను కడిగి నీటిని వడపోయాలి. రవ్వ మునిగేటట్లు నీటిని పోసి అరగంట సేపు నాన పెట్టాలి. తర్వాత నీటిలో నుంచి రవ్వను తీసి పిడికిలితో గట్టిగా నొక్కి నీరంతా ΄పోయేటట్లు చేసి (ఇడ్లీ రవ్వలాగానే) పక్కన పెట్టాలి బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, వేరుశనగపప్పు, శనగపప్పు, మినప్పప్పు వేసి దోరగా వేగిన తర్వాత అందులో ఉల్లియ ముక్కలు, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ వేయాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత రవ్వ వేసి సన్నమంట మీద దోరగా వేయించాలి. ఈ లోపు పక్కన మరో స్టవ్ మీద నీటిని వేడి చేయాలి. రవ్వ వేగి మంచి వాసన వచ్చేటప్పుడు ఉప్పు వేసి నీటిని పోసి కలిపి రుచి చూసి అవసరమైతే మరికొంత ఉప్పు కలిపి బాణలి మీద మూత పెట్టాలి. రెండు నిమిషాల తర్వాత మూత తీసి కొత్తిమీర చల్లి మళ్లీ మూత పెట్టాలి ∙. రాగి రవ్వకు బొంబాయి రవ్వకంటే ఎక్కువ నీరు పడుతుంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని, రవ్వ ఉడకలేదు అనుకుంటే కాసిన్ని నీళ్లు జల్లి మూత పెట్టుకోవాలి. అంతే వేడి వేడి రాగి ఉప్మా రెడీ. ఈ ఉప్మాను పల్లీ, అల్లం, మరేదైనా మనకిష్టమైన చట్నీతోగానీ తినవచ్చు.ఇవీ చదవండి : రాగిజావ రోజూ తాగుతున్నారా? ఇవి తెలుసుకోండి!రాగిముద్ద-నాటుకోడి పులుసు సూపర్ కాంబో -
మెనూ మారుద్దాం
మిల్లెట్స్ ఆరోగ్యానికి మంచివని తెలుసు. కానీ... రోజూ తినాలంటే కష్టంగా ఉంది. దోసె రుచి కోసం నాలుక మారాం చేస్తోంది. మరేం చేద్దాం... జొన్నతో దోసె చేద్దాం. జొన్నతోనే లంచ్ బాక్స్‌కి కిచిడీ చేద్దాం. ఎంచక్కా తింటూనే బరువు తగ్గుదాం.కావలసినవి: జొన్న పిండి – కప్పు; బియ్యప్పిండి – పావు కప్పు; రవ్వ – పావు కప్పు; జీలకర్ర– అర టీ స్పూన్; పచ్చిమిర్చి– 2 (తరగాలి); అల్లం – అంగుళం ముక్క (తురమాలి); ఉప్పు – పావు టీ స్పూన్ లేదా రుచిని బట్టి; నూనె – టేబుల్ స్పూన్.తయారీ: ∙ఒక వెడల్పు పాత్రలో జొన్నపిండి, బియ్యప్పిండి, రవ్వ, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు వేసి కలపాలి. ఇందులో దాదాపుగా మూడు కప్పుల నీటిని ΄ోసి గరిటె జారుడుగా కలుపుకోవాలి. మిశ్రమం గట్టిగా అనిపిస్తే మరికొంత నీటిని చేర్చి కలిపి ఓ అరగంట సేపు నాననివ్వాలి ∙ఇప్పుడు పెనం వేడి చేసి ఒక గరిటె పిండితో దోసె వేసి, చుట్టూ పావు టీ స్పూన్ నూనె చిలకరించాలి. ఒకవైపు కాలిన తర్వాత తిరగేసి రెండో వైపు కూడా కాల్చితే జొన్న దోసె రెడీ. ఈ దోసెలోకి వేరుశనగపప్పు చట్నీ, సాంబారు, టొమాటో పచ్చడి మంచి కాంబినేషన్.జొన్న కిచిడీకావలసినవి: జొన్నలు›– అరకప్పు; పెసరపప్పు – పావు కప్పు; కూరగాయల ముక్కలు – కప్పు (క్యారట్, బీన్స్, బఠాణీలు కలిపి); జీలకర్ర – అర టీ స్పూన్; పసుపు – పావు టీ స్పూన్; ఉప్పు – పావు టీ స్పూన్ లేదా రుచిని బట్టి; నీరు – 3 కప్పులు; నెయ్యి లేదా నూనె – టేబుల్ స్పూన్.తయారీ: ∙జొన్నలను కడిగి మంచి నీటిలో నాలుగు గంటల సేపు నానబెట్టాలి ∙ప్రెషర్ కుక్కర్లో నెయ్యి వేడి చేసి జీలకర్ర వేసి మంట తగ్గించాలి. అవి వేగిన తర్వాత అందులో కూరగాయ ముక్కలు వేసి రెండు నిమిషాల సేపు మగ్గనివ్వాలి. నానిన జొన్నలను కడిగి నీటిని వంపేసి పక్కన పెట్టుకోవాలి. పెసరపప్పును కడిగి పెట్టుకోవాలి ∙కూరగాయ ముక్కల పచ్చిదనం ΄ోయిన తర్వాత అందులో జొన్నలు, పెసర పప్పు, పసుపు, ఉప్పు వేసి నీటిని ΄ోసి కలిపి మూత పెట్టాలి ∙మీడియం మంట మీద ఉడికించాలి. నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేయాలి ∙ప్రెషర్ తగ్గిన తర్వాత మూత తీసి గరిటెతో కలిపి వేడిగా వడ్డించాలి. ఇందులోకి ఆవకాయ, పెరుగు పచ్చడి బాగుంటాయి. -
రాగిజావ రోజూ తాగుతున్నారా? ఇవి తెలుసుకోండి!
ఇటీవలి కాలంలో ఆహారం, ఆరోగ్యంపై అందరికీ శ్రద్ధ పెరుగుతోంది. ఈ క్రమంలో ఆర్గానిక్ ఫుడ్, మిలెట్స్పై మరింత ఆసక్తి చూపిస్తున్నారు జనం. అలాంటి వాటిల్లో ఒకటి రాగులు లేదా ఫింగర్ మిల్లెట్స్. దీనిలోని ప్రయోజనాల కారణంగా మరింత ప్రజాదరణ పొందాయి. చవకగా దొరుకుతాయి కూడా. రాగుల జావ లేదా మాల్ట్ తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం!జీర్ణశక్తిని పెంచుకోవాలనుకున్నా, మధుమేహాన్ని తట్టుకోవాలనుకున్నా, లేదా మీ ఆహారాన్ని మరింత ఉత్సాహంగా మార్చుకోవాలనుకున్నా, అవసరమైన అన్ని పోషకాలతో నిండిన సూపర్‌ఫుడ్ రాగుల పిండితో చేసుకొనే జావ.రాగుల లడ్డు, రాగుల పిండితో మురుకులు ఇలా రాగులతో తయారు చేసే పదార్థాల్లో రాగిజావ, రాగి ముద్ద బాగా పాపులర్. రాగి జావ తీసుకుంటే అనేక ఆరోగ్య సమస్యలనుంచి విముక్తి లభిస్తుంది. సీ, ఈ విటమిన్లు, మినరల్స్, కార్బోహైడ్రేట్లు, ఫైబర్లు, కొవ్వులు, ప్రొటీన్ పుష్కలంగా లభిస్తాయి. బి కాంప్లెక్స్, థయామిన్, రిబోఫ్లావిన్, నియాసిన్, ఫోలిక్ యాసిడ్, అలాగే కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్ అధికంగా ఉంటాయి.రాగి జావతో ఆరోగ్య ప్రయోజనాలుజీర్ణక్రియకు మంచిది. మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. రాగిజావలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ సేపు కడుపు నిండిన అనుభూతినిస్తుంది. ఆందోళన, డిప్రెషన్, నిద్రలేమి సమస్యలు తగ్గుతాయి.మధుమేహాన్ని కంట్రోల్ చేస్తుంది. రాగి జావలో పాలీఫెనాల్స్, డైటరీ ఫైబర్,మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఇవి రక్తంలో గ్లూకోజ్‌ను నియంత్రిస్తాయి. గుండె కండరాల పనితీరు, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రాగి జావ సహజ ఇనుముకు గొప్ప మూలం. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది.ఎముకలు బలోపేతం: రాగుల్లో కాల్షియం ఎముకలను బలోపేతం చేస్తుంది. దంతాల అభివృద్ధికి సహాయపడుతుంది.అధిక బరువుకు చెక్ చెబుతుంది. కాలేయ వ్యాధులను తగ్గిస్తుంది. రాగి జావ తయారీరాగులను శుభ్రంగా కడిగి ఎండబెట్టుకొని పొడి చేసుకోవాలి. మరుగుతున్న ఒక గ్లాసు నీళ్లలో, ఒక టీ స్పూన్ రాగుల పిండి వేసి, కలుపుతూ ఉడికించుకోవాలి. దీనికి మజ్జగ, ఉప్పు కలుపుకొని తాగవచ్చు. లేదా పచ్చిమిర్చి ఉల్లిపాయల ముక్కలతో కలిపి తాగవచ్చు. బెల్లం, నెయ్యి వేసి ఇస్తే పిల్లలు ఇష్టంగా తాగుతారు. రాగులను మొలకలు వచ్చేలా చేసి, వాటిని ఎండబెట్టి, పొడి చేసుకొని కూడా జావ చేసుకోవచ్చు. ఈ పొడిని తడిలేని గాజు సీసాలో భద్రం చేసుకోవచ్చు. -
సెలబ్రెటీలను సైతం పక్కకునెట్టి అంబాసిడర్ అయిన యువతి!
సాధారణంగా అంబాసిడర్‌గా సిని సెలబ్రెటీలు లేదా స్పోర్ట్స్ స్టార్లు, ప్రముఖులు ఉంటారు. ముఖ్యంగా కార్పొరేట్ కంపెనీలు, ప్రభుత్వ సంస్థలు కూడా వాళ్లనే పెట్టుకోవడం జరుగుతుంది. అలాంటి ఓ సాధారణ యువతి వాళ్లందర్నీ పక్కకు నెట్టి మరీ అంబాసిడర్ అయ్యింది. స్వయంగా మన భారత ప్రభుత్వమే ఆ యువతిని నియమించింది. ఎందుకని ఆమెనే అంబాసిడర్‌గా నియమించింది? ఆమె ప్రత్యేకత ఏంటీ అంటే.. అమ్మమ్మ స్పూర్తితోనే.. ఆ యువతి పేరు లహరీబాయి మధ్యప్రదేశ్‌లోని బైగా (వైద్యుడు) గిరిజన సంఘానికి చెందిన యువతి. ప్రత్యేకించి బలహీనమైన గిరిజన సమూహం. ఈ తెగకు చెందిన ప్రజలు తమ పర్యావరణం, దాని జీవవైవిధ్యంపై పూర్తి అవగాహన కలిగి ఉంటారు. వారు తమకుండే మౌఖిక సంప్రదాయాల ద్వారా తమ నైపుణ్యాలను ఒక తరం నుంచి మరొక తరానికి కొనసాగేలా ప్రొత్సహిస్తారు. ఇక లహరీ మధ్యప్రదేశ్‌లోని దిండోరి జిల్లాలోని సిల్పాడి అనే మారుమూల గ్రామానికి చెందింది. ఆమె తన బామ్మ మాటలతో స్ఫూర్తిపొందింది. కనుమరుగవుతున్న మిల్లెట్ ధాన్యంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి లహరీబాయి తన అమ్మమ్మ నుంచి పాఠాలు నేర్చుకుంది. తర్వాత దాని విత్తనాలను సంరక్షించడానికి తన జీవితాన్ని అంకితం చేసింది. లమరీ 18 ఏళ్ల వయస్సు నుంచే విత్తనాలు సేకరించడం ప్రారంభించింది. ఆమె ఇప్పుడు కూడా సమీపంలోని గ్రామాలలో తిరుగుతూ అడవులు, పొలాల నుంచి విత్తనాలను సేకరిస్తూనే ఉండటం విశేషం. స్కూల్ ముఖమే చూడకపోయినా.. ఇక లహరీబాయి ఇల్లు మిల్లెట్స్‌తో అలంకరించినట్లుగా ఇంటిపైకప్పుడు వేలాడుతుంటాయి. అస్సలు పాఠశాల ముఖమే చూడని గిరిజన మహిళ ఈ విత్తనాల గొప్పతనం గురిచి తెలసుకుని వాటిని సంరక్షించాలని భావించడం నిజంగా స్ఫూర్తి దాయకం. ఇక ఈ మిల్లెట్‌ల్లో మాంసకృత్తులు, ఫైబర్, విటమిన్లు కలిగి ఉంటాయి. అవి మన ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలకపాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా మధుమేహం, అధిక బరువు, వంటి దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడటంలో తోడ్పడుతుంది. ఏకంగా 150 రకాలకు పైనే.. ఇక లహరీబాయి ప్రస్తుత వయసు 27 ఏళ్లు. ఆమె 1ఆ ఏళ్ల నుంచి ఈ మిల్లెట్స్ సేకరణ ప్రారంభించింది. అలా ఇప్పటి వరకు దాదాపు 150 రకాలకుపైనే మిల్లెట్స్ సేకరించింది. కోడో, కుట్కి, సికియా, సల్హార్, సావా మరియు చేనాతో సహా 150కిపైగా ఎక్కువ రకాల అరుదైన మిల్లెట్స్ లహరీబాయి వద్ద ఉండటం విశేషం. ఐతే చాలా రకాల మిల్లెట్స్ అంతరించిపోతున్నాయని, వాటిని సంరక్షించుకోవాలని చెబుతుంది లహరీబాయి. విత్తనాల సేకరణ కోసం.. ఇక ఎవరైనా మిల్లెట్స్ సాగు చేస్తే.. లహరీ బాయి వారికి కిలో విత్తనాలు ఉచితంగా ఇస్తుందట. తిరిగి పంట చేతికి వచ్చిన తర్వాత ఆ రైతుల నుంచి కిలోన్నర తీసుకుంటుంది. మరి కొందరు మాత్రం ఆమెకు కొంతభాగం బహుమతిగా కూడా ఇస్తారు. డబ్బు సంపాదించడం కోసం ఇలా చేయడం లేదని, ఎక్కువ విత్తనాలు సేకరించడం కోసమేనని చెబుతున్న లహరీబాయిని చూస్తే నిజంగా వాటి ప్రాముఖ్యతను అందురు గుర్తించేలా, బావితరాలకు అందిచాలనే లక్ష్యం కనిపిస్తుంది ఆ ఆసక్తి ఆమెను అంబాసిడర్‌గా.. లహరీబాయి మిల్లెట్స్ సేకరణ, సంరక్షణ పట్ల ఆమె కనబరుస్తున్న ఆసక్తిన, కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం ఆమెను మిల్లెట్స్ అంబాసిడర్ గా నియమించింది. భారత ప్రభుత్వం దేశాన్నిమిల్లెట్‌సాగు, పరిశోధనలకు ప్రపంచ హబ్‌గా మార్చడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది . ఇలాంటి వాళ్లను ప్రోత్సహిస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల ఉన్న ఈ మిల్లెట్స్ అంతరించిపోకుండా సంరక్షింపబడతాయన్న ఉద్దేశ్యంతో సెలబ్రెటీలను కూడా కాదని, ఆ గిరిజ యువతిని అంబాసిడర్‌గా నియమించింది. పెద్ద పెద్ద చదువులతోనే కాదు, చేస్తున్న పట్ల సరైన అవగాహన నిబద్ధతతో కృషి చేస్తే దేశమే గుర్తించి మెచ్చుకునే మనిషిగా పేరుతెచ్చుకోవచ్చని ఈ గిరిజన యువతి ప్రూవ్ చేసింది కదూ..! (చదవండి: అత్యంత పిన్నవయస్కురాలైన మహిళా పైలట్!) -
‘చిరు’ యంత్రాల ఫౌండేషన్!
టేబుల్ టాప్ హల్లర్: దేశంలోనే తొలి ‘స్మాల్ మిల్లెట్ టేబుల్ టాప్ ఇంపాక్ట్ హల్లర్ వి3’ ఇది. చిన్న చిరుధాన్యాల పైపొట్టు తీసి బియ్యం తయారు చేసుకోవడానికి ఉపయోగపడే చిన్న యంత్రం ఇది. బరువు 30 కిలోలు. ముప్పావు మీటరు ఎత్తు, అర మీటరు పొడవు, అర మీటరు వెడల్పు ఉంటుంది. ఇంట్లో చిన్న టేబుల్ మీద పెట్టుకొని వాడుకోవచ్చు. మహిళలు, పిల్లలు సైతం ఉపయోగించడానికి అనువైనది. ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లవచ్చు. అతి తక్కువ 0.5 హెచ్ పి విద్యుత్తుతో పనిచేస్తుంది. సింగిల్ ఫేజ్ విద్యుత్తు లేదా సౌర విద్యుత్తు లేదా పెట్రోలు మోటారుతోనూ నడుస్తుంది. 90% సామర్థ్యంతో పనిచేస్తుంది. ఒకసారి మర పడితే 10% మెరికలు వస్తాయి. రెండోసారి మళ్లీ మరపడితే వంద శాతం బియ్యం సిద్ధమవుతాయి. చిరుధాన్యం రకాన్ని బట్టి గంటకు 30 నుంచి 80 కిలోల ధాన్యాన్ని మర పట్టొచ్చు. ఏ రకం చిన్న చిరుధాన్యాన్నయినా ఈ యంత్రానికి ఎటువంటి మార్పులు చేయాల్సిన అవసరం లేకుండానే మర పట్టుకోవచ్చు. అర కేజీ ధాన్యం ఉన్నా సరే దీన్ని ఉపయోగించవచ్చు. తక్కువ శబ్దం చేస్తుంది. 2 గంటల తర్వాత ఓ గంట విరామం ఇవ్వాలి. దీని ధర రూ. 88 వేలు (18% జిఎస్టీ అదనం). కొర్రలు, అండుకొర్రలు, సామలు, ఊదలు, అరికెలు వంటి చిన్న చిరుధాన్యాల (స్మాల్ మిల్లెట్స్) ధాన్యాన్ని వండుకొని తినాలంటే పైపొట్టు తీసి బియ్యం తయారు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్వం దంపుకొని చిరుధాన్యాల బియ్యం తయారు చేసుకునే వారు. ఇది చాలా శ్రమతో కూడిన పని. కొన్ని సంవత్సరాలుగా మిక్సీలను ఉపయోగించి ఇంటి స్థాయిలో మిల్లెట్ బియ్యం తయారు చేసుకోవటం ప్రారంభమైంది. అయితే, మిక్సీకి ఉన్న పరిమితుల దృష్ట్యా వాణిజ్య దృష్టితో చిన్న చిరుధాన్యాల బియ్యం ఉత్పత్తి చేయదలచిన రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, సహకార సంఘాలు, మహిళా స్వయం సహాయక బృందాలు, చిన్న వ్యా΄ారులు యంత్రాలను ఆశ్రయించక తప్పట్లేదు. యంత్రాల ధర అందుబాటులో లేని పరిస్థితుల్లో చిన్న చిరుధాన్యాల ప్రాసెసింగ్ పెద్ద సంస్థలు, కంపెనీలకే పరిమతం అవుతూ వచ్చింది. ఇది గ్రామాల్లో పేద రైతులు, మహిళా బృందాలు, చిన్న వ్యా΄ారులకు ఈ ప్రక్రియ పెద్ద సవాలుగా నిలిచింది. ఈ సవాలును అధిగమించడానికి ఇంటి స్థాయిలో, గ్రామస్థాయిలో మహిళలు, పిల్లలు సైతం ఉపయోగించడానికి అనువైన అనేక చిన్న యంత్రాల రూపుకల్పనలో అనేక ఏళ్లుగా విశేష కృషి చేస్తున్న తమిళనాడుకు చెందిన స్మాల్ మిల్లెట్ ఫౌండేషన్ (డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ యాక్షన్ – ధాన్ – ఫౌండేషన్ అనుబంధ సంస్థ) విజయం సాధించింది. ఈ సంస్థ రూపొదించిన చిన్న యంత్రాల్లో ఒకటి.. దేశంలోనే తొలి ‘టేబుల్ టాప్ డీహల్లర్ మిషన్’. కొర్రలు, అండుకొర్రలు, సామలు, ఊదలు, అరికెలు వంటి ఏ రకం చిరుధాన్యాలతోనైనా, అర కిలో అయినా సరే, ఈ యంత్రంతో బియ్యం తయారు చేసుకోవచ్చు. ఇటువంటివే మనికొన్ని చిన్న యంత్రాలను ఈ ఫౌండేషన్ రూపొందించింది. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచ్చిన మేలైన సాగు, శుద్ధి, విలువ జోడింపు పద్ధతులు, యంత్రాలపై నీతి ఆయోగ్ ‘మిల్లెట్ సంకలనం’ను న్యూఢిల్లీలో ఇటీవల విడుదల చేసింది. స్మాల్ మిల్లెట్ ఫౌండేషన్ ప్రజలు, శాస్త్రవేత్తలు, రైతులు అవసరాల మేరకు తయారు చేసి అందుబాటులోకి తెచ్చిన చిన్న యంత్రాలను ప్రశంసిస్తూ ఒక కథనం ప్రచురించటం విశేషం. నీతి ఆయోగ్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ నీలం పటేల్ తదితరులు ఈ సంకలనానికి సం΄ాదకులుగా వ్యవహరించారు. పోర్టబుల్ ఇంపాక్ట్ హల్లర్ టేబుల్ టాప్ హల్లర్ కన్నా కొంచెం పెద్దది స్మాల్ మిల్లెట్ పోర్టబుల్ ఇంపాక్ట్ హల్లర్ (ఎస్.ఎం.ఎఫ్. వి2). ఇది గంటకు 100 నుంచి 500 కిలోల చిన్న చిరుధాన్యాలను ్ర΄ాసెస్ చేస్తుంది. 1 హెచ్‌పి మోటారుతో త్రీఫేస్ విద్యుత్తుతో పనిచేస్తుంది. బరువు 98 కిలోలు. మీటరు ΄÷డవు, మీటరు ఎత్తు, ము΄్పావు మీటరు వెడల్పు ఉంటుంది. ఎక్కువ గంటల పాటు వాడొచ్చు. మహిళలు సైతం సురక్షితంగా, సులువుగా వాడటానికి అనువైనది. ఎస్.ఎం.ఎఫ్. వి2 ధర రూ. 1,68,000. (18% జిఎస్టీ అదనం). ఈ యంత్రాలపై ఆసక్తి గల వారు తమిళనాడులోని కృష్ణగిరి కేంద్రంగా పనిచేస్తున్న స్మాల్ మిల్లెట్ ఫౌండేషన్ (ఎస్.ఎం.ఎఫ్.) సాంకేతిక విభాగం ఇన్చార్జ్ శరవణన్‌ను 86675 66368 నంబరులో ఇంగ్లిష్ లేదా తమిళంలో సంప్రదించవచ్చు. 11న దేశీ గోవ్యాధులపై సదస్సు ఫిబ్రవరి 11(ఆదివారం) న ఉ. 7 గం. నుంచి సా. 4 గం. వరకు గుంటూరు జిల్లా కొర్నె΄ాడులోని రైతునేస్తం ఫౌండేషన్ ఆవరణలో దేశీ గో–జాతుల వ్యాధులు, ఇతర సమస్యలపై రాష్ట్ర స్థాయి సదస్సు, ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ యడ్లపల్లి వేంకటేశ్వరరావు తెలిపారు. దేశీ ఆవుల ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవలసిన చర్యలపై గో పోషకులకు అవగాహన కల్పిస్తారు. గోవులకు ఉచిత వైద్య శిబిరంతోపాటు ఉచితంగా మందులు ఇవ్వనున్నట్లు తెలిపారు. అందరూ ఆహ్వానితులే. ప్రవేశం ఉచితం. వివరాలకు 97053 83666. -
Brown Top Millet ఒక్కసారి విత్తితే.. నాలుగు పంటలు!
అండుకొర్ర.. చిన్న చిరుధాన్యా(స్మాల్ మిల్లెట్స్)ల్లో విశిష్టమైన పంట. పంట కాలం 90–100 రోజులు. ధాన్యపు పంట ఏదైనా కోత కోసి, దుక్కి చేసిన తర్వాత మళ్లీ పంట రావాలంటే తిరిగి విత్తనాలు ఎదపెట్టాల్సిందేనని మనకు తెలుసు. అయితే, అండుకొర్ర పంటను రెండేళ్లుగా సాగు చేస్తున్న కర్నూలు జిల్లా కోడుమూరుకు చెందిన కె. హేమాద్రిరెడ్డి అనుభవం అందుకు భిన్నంగా ఉంది. 2022 జూౖలై లో తొలిసారి 5 ఎకరాల్లో అండుకొర్ర విత్తనం వేసి, అక్టోబర్‌లో పంట కోసుకున్నారు. నవంబర్‌లో దుక్కిచేసి మినుము చల్లి, నీటి తడి పెట్టారు. అండుకొర్ర వత్తుగా మొలవటంతో ఆశ్చర్యం కలిగింది. అండుకొర్ర కోత కోసే సమయంలో రాలిన ధాన్యమే నెల రోజుల తర్వాత దుక్కి చేసి తడి పెట్టగానే మొలిచిందన్నమాట. మినుము మొలకలు కనిపించినా అవి ఎదగలేకపోయాయి. అండుకొర్ర ఏపుగాపెరిగింది. సరే.. ఇదే పంట ఉండనిద్దామని నిర్ణయించుకొని.. ట్రాక్టర్‌తో సాళ్లు తీసి అండుకొర్ర పంటనే కొనసాగించారు. అదే విధంగా మూడు పంటలు పూర్తయ్యాయి. నాలుగో పంట ఇప్పుడు కోతకు సిద్ధంగా ఉందని, ప్రతి పంటలోనూ ఎకరానికి 10 క్వింటాళ్ల అండుకొర్ర దిగుబడి వస్తోందని, పంట పంటకు దిగుబడి ఏమాత్రం తగ్గలేదని, తక్కువ ఖర్చుతోనే అండుకొర్ర పంట అధికాదాయాన్ని అందిస్తోందని రైతు హేమాద్రి రెడ్డి సంతోషంగా చెప్పారు. అనంతపురంలో ఇటీవల జరిగిన మూడు రోజుల చిరుధాన్యాల సమ్మేళనం ప్రారంభోత్సవానికి హాజరైన ఆయన ‘సాక్షి సాగుబడి’తో తన ఆనందాన్ని పంచుకున్నారు. కదిరికి చెందిన ఎర్త్ 360 సంస్థ వ్యవస్థాపకులు దినేశ్ సూచనలు, సహాలతో చిరుధాన్యాల సాగు చేపట్టానని ఆయన తెలిపారు. కలుపు బాధ లేని అండుకొర్ర పంట 40 ఎకరాల ఆసామి అయిన హేమాద్రిరెడ్డి సాగు భూమిని చాలా కాలంగా కౌలుకు ఇస్తూ వచ్చారు. రెండేళ్ల క్రితం మనుమడి సూచన మేరకు 5 ఎకరాల్లో అండుకొర్ర చిరుధాన్యాల సాగు ్ర΄ారంభించారు. కూలీల కొరతతో ఇబ్బంది అవుతుందని తొలుత సంశయించానని, అయితే అండుకొర్ర పంటకు కలుపు సమస్య లేక΄ోవటంతో హాయిగా ఊపిరి పీల్చుకున్నానని ఆయన అన్నారు. పెద్దగా ప్రయాస పడాల్సిన అవసరం లేని చక్కని పంట అండుకొర్ర అన్నారాయన. కలుపు మొక్కల కన్నా అండుకొర్ర మొక్కలు వేగంగా పెరుగుతుంది. అందువల్ల కలుపు పెరిగే అవకాశమే లేదన్నారు. దీంతో ప్రయాస లేకుండానే పంట చేతికి వస్తోందని, యంత్రంతో కోతలు జరుపుతున్నారు. ఇప్పుడు మొత్తం 20 ఎకరాలకు అండుకొర్ర సాగును విస్తరించారు. మోళ్లు కలియదున్నుతాం.. దుక్కి చేసిన తర్వాత గొర్రెలను పొలంలో నిల్వగడతారు. గొర్రెల మలమూత్రాలు పొలాన్ని సారవంతం చేస్తాయి. ఆ తర్వాత కలియదున్నిన తర్వాత వరుసల మధ్య 15 అంగుళాలు ఉండే ట్రాక్టర్ గొర్రుతో ఎకరానికి 5 కిలోల అండుకొర్ర విత్తనాలను తొలి ఏడాది విత్తారు. రెండో పంట నుంచి.. పంట కోత తర్వాత మోళ్లను రొటవేటర్‌తో భూమిలో కలియదున్నుతున్నారు. పంట కాలంలో మూడు దఫాలు హంద్రీ నది నుంచి మోటారుతో తోడిన నీటిని పారగడుతున్నారు. నల్లరేగడి నేల కావటంతో ఎక్కువగా తడి ఇవ్వటం లేదని, ఇది మెట్ట పంట కాబట్టి నీరు ఎక్కువ పెడితే రొట్ట పెరుగుతుంది తప్ప దిగుబడి రాదని హేమాద్రి రెడ్డి వివరించారు. గొర్రెలు ఆపటానికి ఎకరానికి రూ. 1,500 ఖర్చవుతోంది. దుక్కి, అంతర సేద్యం అంతా సొంత ట్రాక్టర్‌తోనే చేస్తున్నారు. బయటి ట్రాక్టర్‌తో ఈ పనులు చేస్తే ఎకరానికి పంటకు రూ. 3 వేలు ఖర్చు వస్తుంది. ‘అంతకు మించి చేసేదేమీ లేదు. చీడపీడలు, తెగుళ్ల సమస్య లేదు కాబట్టి పురుగుమందుల పిచికారీ అవసరం రావటం లేద’న్నారాయన. కలుపు, చీడపీడల సమస్యలు లేని, కూలీల అవసరం పెద్దగా లేని అండుకొర్ర పంటను సునాయాసంగా సాగు చేస్తూ.. క్వింటాకు రూ. 9,500 ఆదాయం పొందుతున్నానని హేమాద్రిరెడ్డి తెలిపారు. మిషన్‌తో పంట కోత ఖర్చు, గడ్డి అమ్మితే సరిపోతోందన్నారు. కొర్ర కూడా సాగు చేస్తున్నానని, వచ్చే సీజన్ నుంచి అరికలు కూడా వేద్దామనుకుంటున్నానన్నారు. అండుకొర్ర అద్భుత పంట అద్భుతమైన చిరుధాన్య పంట అండుకొర్ర.. కలుపును ఎదగనివ్వదు. ఈ విత్తనానికి నిద్రావస్థ పెద్దగా ఉండదు. గింజ బాగా తయారైన తర్వాత కోత కోసి నూర్పిడి చేస్తే, వారం రోజుల తర్వాత మొలుస్తుంది. ఒక్కసారి విత్తి వరుసగా నాలుగో పంట తీసుకుంటున్న హేమాద్రిరెడ్డి సాగు అనుభవం రైతులకు స్ఫూర్తిదాయకంగా ఉంది. పంట కోసిన తర్వాత మోళ్లను భూమిలోకి కలియదున్నటం, గొర్రెలను నిలపటం వల్ల భూమి సారవంతమవుతోంది. మార్కెట్లో అండుకొర్రలు సహా అన్ని చిరుధాన్యాలకు ఇప్పుడు మంచి గిరాకీ ఉంది. ధర తగ్గే ప్రమాదం లేదు. దినేశ్ (94408 70875), చిరుధాన్యాల నిపుణుడు, ఎర్త్ 360, కదిరి క్వింటా రూ.9,500 రెండేళ్ల క్రితం తొలిసారి 5 ఎకరాల్లో అండుకొర్ర విత్తినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి పంటా ఎకరానికి పది క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. తొలి పంట క్వింటా రూ. 5 వేలకు అమ్మాను. రెండో పంటను క్వింటా రూ.7,500కు అమ్మాను. గత ఏడాది ఖరీఫ్‌లో మరో 15 ఎకరాల్లో కూడా అండుకొర్ర వేశా. మూడో పంటను క్వింటా రూ. 9,500కు అమ్మాను. నాలుగో పంట కొద్ది రోజుల్లో కోతకు సిద్ధమవుతోంది. రైతులకు విత్తనంగా కూడా ఇస్తున్నాను. ఎకరానికి రూ. 20 వేలు ఖర్చులు పోగా మంచి నికరాదాయం వస్తోంది. 3 సార్లు నీరు కడుతున్నాం. నీరు ఎక్కువైతే దిగుబడి తగ్గిపోతుంది. ఒక పొలంలో జనుము సాగు చేసి రొటవేటర్ వేస్తే ఆ తర్వాత అండుకొర్ర దిగుబడి ఎకరాకు 15 క్వింటాళ్ల వరకు వచ్చింది. ప్రయాస లేని పంట అండుకొర్ర. – కె. హేమాద్రిరెడ్డి (92469 22110), అండుకొర్ర రైతు, కోడుమూరు, కర్నూలు జిల్లా -
సిరిధాన్యాల అంబలే నిజమైన వైద్యుడు
సాక్షి, హైదరాబాద్: సిరిధాన్యాల ఆహారమే, ముఖ్యంగా అంబలే, మన కడుపులో వుండి అనుక్షణం నిజమైన వైద్యుడని పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ ఖాదర్ వలి అన్నారు. ఆరోగ్యంగా జీవించాలని అనుకునే ప్రతి ఒక్కరూ రోజుకు రెండు పూటలూ సిరిదాన్యాల అంబలి భోజనానికి నిమిషాలు ముందు విధిగా తాగుతూ ఆరోగ్యంగా జీవించాలని సూచించారు. రంగారెడ్డి జిల్లా తుర్కాయంజల్ రాగన్నగూడలోని లక్ష్మీ మెగా టౌన్షిప్ లో ఆదివారం రాత్రి అనుదిన అంబలి ఉచిత పంపిణీ కేంద్రాన్ని డాక్టర్ ఖాదర్ వలీ ప్రారంభించారు. తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం అధ్యక్షులు మేరెడ్డి శ్యామ్ ప్రసాద్ రెడ్డి తన సతీమణి దివంగత జయశ్రీ జ్ఞాపకార్థం అనుదినం అంబలి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించటం అభినందనీయం అని డాక్టర్ ఖాదర్ ప్రశంసించారు. తాను రోజూ భోజనానికి ముందు అంబలి తప్పకుండా తాగుతానని, రెండుపూటలా సిరధాన్యాలే తింటానని, 67 యేళ్లు నిండినా ఏటువంటి సమస్యలు లేవన్నారు. మన ఆహారం ప్రపంచవ్యాప్తంగా కంపెనీల పరమై పోయిందని, మనం ఆహార సార్వభౌమత్వాన్ని కోల్పోయామని అంటూ.. అనారోగ్యకరమైన ఆహారాన్ని కంపెనీలు అమ్ముతూ వుంటే ప్రజలు ఆనారోగ్యం పాలవుతూ ఔషధాలతోనే జీవనం వెళ్లదీస్తున్నామని డా. ఖాదర్ అన్నారు. ప్రతి కిలో శరీర బరువుకు 4 గ్రాముల కన్నా ప్రోటీన్ ఎక్కువ అవసరం లేదని, ఎక్కువ ప్రోటీన్ తినది అని కంపెనీలు వ్యాపారాభివృద్ధి కోసమే ప్రచారం చేస్తున్నాయని డా. ఖాదర్ స్పష్టం చేశారు. ప్రసిద్ధ చిత్రకారులు తోట వైకుంఠం తదితరులు ఈ సమావేశం లో పాల్గొన్నారు. చదవండి: చలిగాలిలో వాకింగ్: ఊపిరితిత్తులు జాగ్రత్త! -
ఏపీకి బెస్ట్ పెవిలియన్ అవార్డు
సాక్షి, అమరావతి: మిల్లెట్స్–ఆర్గానిక్స్‌పై బెంగుళూరులో 3 రోజుల పాటు జరిగిన అంతర్జాతీయ సేంద్రీయ వాణిజ్య ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్‌కు బెస్ట్ స్టేట్ పెవిలియన్ అవార్డు లభించింది. ఈ నెల 5 నుంచి నిర్వహించిన ఈ ప్రదర్శనలో 20 రాష్ట్రాలతో పాటు విదేశీ రైతులు తమ ఉత్పత్తులతో 250 స్టాల్స్ ఏర్పాటు చేశారు. స్టాల్ వాలిడేషన్ కమిటీ స్టాల్స్ ఏర్పాటు, ప్రదర్శించిన ఉత్పత్తులను పరిగణనలోకి తీసుకొని బెస్ట్ స్టేట్ పెవిలియన్, పెస్ట్ స్టాల్ అవార్డులను ప్రదానం చేసింది. అంతర్జాతీయ స్థాయిలో ఏపీ రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలోని స్టాల్స్‌కు ఈ అవార్డులు వరించాయి. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, వ్యవసాయ శాఖ మంత్రి చెలువరాయ స్వామి చేతుల మీదుగా రైతు సాధికార సంస్థ సీనియర్ థిమాటిక్ లీడ్ ప్రభాకర్‌కు ఈ అవార్డులను ప్రదానం చేశారు. గతేడాది డిసెంబర్ 28–30 వరకు కేరళలో జరిగిన జాతీయ స్థాయి ఆర్గానిక్ ప్రదర్శనలో ఏపీకి రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డు లభించింది. -
మిల్లెట్స్ తింటున్నారా? ఆ వ్యాధులను పూర్తిగా మాయం చేయగలదు!
సాక్షి సాగుబడి, హైదరాబాద్: చిరుధాన్యాలను రోజువారీ ప్రధాన ఆహారంగా తీసుకోవటానికి అలవాటు పడితే యావత్ మానవాళికి ఆహార /పౌష్టికాహార భద్రతతో పాటు ఆరోగ్య/ పర్యావరణ భరోసా దొరుకుతుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. ‘చిరుధాన్యాలతో ప్రపంచ ప్రజలకు ఆహార భద్రత’ అనే అంశంపై రాజేంద్రనగర్‌లోని జాతీయ వ్యవసాయ విస్తరణ యాజమాన్య సంస్థ (మేనేజ్)లో మంగళవారం ప్రారంభమైన మూడు రోజుల అంతర్జాతీ రౌండ్‌టేబుల్ సమావేశంలో 31 దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. ‘మేనేజ్’తో కలసి ఆఫ్రికా ఆసియా గ్రామీణాభివృద్ధి సంస్థ (ఎఎఆర్‌డిఓ) నిర్వహిస్తున్న ఈ రౌండ్‌టేబుల్ ప్రారంభ సమావేశంలో మిల్లెట్ మాన్ ఆఫ్ ఇండియా, పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. ఖాదర్ వలితో పాటు ప్రకృతి వ్యవసాయ పితామహుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత సుభాష్ పాలేకర్ ప్రధాన స్రవంతి వ్యవసాయ శాస్త్రవేత్తలతో కలసి తొలిసారి వేదికను పంచుకోవటం విశేషం. డా. ఖాదర్ వలి కీలకోపన్యాసం చేస్తూ, భూగోళంపై వేల ఏళ్లుగా ప్రజలు ప్రధాన ఆహారంగా తింటున్న చిరుధాన్యాలే అసలైన ఆహారమన్నారు. అయినప్పటికీ.. ఆంగ్లేయులు, పాశ్చాత్యులు ఇది మనుషుల ఆహారం కాదని చెప్పటం ప్రారంభించి గోధుమలు, వరి బియ్యాన్ని హరిత విప్లవం పేరుతో ప్రోత్సహిస్తూ కేంద్రీకృత వ్యవస్థ ద్వారా పారిశ్రామిక ఆహారోత్పత్తులను ముందుకు తేవటం వల్ల చిరుధాన్యాలు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొన్నదని, ఇందువల్లనే ఆహార భద్రత సమస్య ఉత్పన్నమైందన్నారు. పారిశ్రామిక ఆహారం కారణంగానే మానవాళి ఎన్నో జబ్బుల పాలవుతున్నదని మానవాళి, శాస్త్రవేత్తలు, పాలకులు గుర్తెరగాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. మనుషులను రోగగ్రస్థంగా మార్చుతున్న కార్పొరేట్ ఆహారాన్ని వదిలించుకుంటేనే మానవాళికి జబ్బుల నుంచి, ఎడతెగని ఔషధాల వాడకం నుంచి సంపూర్ణ విముక్తి దొరుకుతుందన్నారు. సిరిధాన్యాలు (స్మాల్ మిల్లెట్స్) దివ్యౌషధాలుగా పనిచేస్తున్నాయని 8 ఏళ్లుగా తాను వందలాది మంది రోగులతో కలసి చేసిన అధ్యయనంలో వెల్లడైందని డా. ఖాదర్ వలి పేర్కొన్నారు. శాస్త్రీయంగా ఫలితాలను నమోదు చేశామని, 140 రకాల జబ్బుల్ని ఆరు నెలల నుంచి 2 ఏళ్లలోపు నయం చేయటమే కాదు పూర్తిగా మాయం చేస్తున్నట్లు గుర్తించామన్నారు. సిరిధాన్యాలను రోజువారీ ప్రధాన ఆహారంగా తీసుకుంటూ ఉంటే డయాబెటిస్, బీపీ, ఊబకాయం, కేన్సర్ వంటి జబ్బులకు వాడుతున్న మందులను క్రమంగా మానివేస్తూ పూర్తి ఆరోగ్యాన్ని సంతరించుకోవచ్చన్నారు. సిరిధాన్యాలు సకల పోషకాలను అందించటంతోపాటు దేహంలో నుంచి కలుషితాలను బయటకు పంపటంలోనూ కీలకపాత్రపోషిస్తున్నాయన్నారు. ఇవి వర్షాధారంగా పండే అద్భుత ఆహార ధాన్యాలని అంటూ సాగు నీటితో పండించే ఆహారం అనారోగ్య కారకమనటంలో ఏ సందేహమూ లేదని డా. ఖాదర్ వలి తెలిపారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత సుభాష్ పాలేకర్ ప్రసంగిస్తూ పోషకాల గనులైన చిరుధాన్యాలను రసాయనాలతో సాగు చేయటం విచారకరమన్నారు. రసాయనాలతో పండించటం వల్ల చిరుధాన్యాల్లో పోషకాలు తగ్గిపోవటమే కాకుండా, రసాయనిక అవశేషాల వల్ల ప్రజలకు హాని కలుగుతుందన్నారు. చిరుధాన్యాల వేలాది వంగడాలను అనాదిగా ఆదివాసులు సంరక్షిస్తున్నారని, మనకు తెలియని చిరుధాన్య రకాలు ఇప్పటికీ వారి వద్ద ఉన్నాయన్నారు. శాస్త్రవేత్తలు వాటిపై దృష్టి కేంద్రీకరిస్తే మరింత ఎక్కువ పోషకాలున్న చిరుధాన్యాలు వెలుగులోకి రావచ్చన్నారు. ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లో ప్రకృతి వ్యవసాయం ద్వారా చిరుధాన్యాల సాగును, వినియోగాన్ని ప్రోత్సహించటంపై పాలకులు దృష్టి కేంద్రీకరిస్తే ఆహార భద్రత సమస్య, పర్యావరణ సమస్య కూడా తీరిపోతుందని పాలేకర్ సూచించారు. భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ (ఐఐఎంఆర్) సంచాలకులు డా. సి.తార సత్యవతి ప్రసంగిస్తూ చిరుధాన్యాల సాగును విస్తృతంగా చేయాలన్నారు. వరి కోతల తర్వాత ఆ పొలాల్లో జొన్న తదితర చిరుధాన్యాలను సాగు చేసి అధిక దిగుబడి సాధించవచ్చని తమ అధ్యయనంలో రుజువైందన్నారు. చిరుధాన్యాలను అన్నం, రొట్టెలతో పాటు 300 రకాల ఉత్పత్తులుగా మార్చి తినవచ్చన్నారు. ఐఐఎంఆర్ ప్రపంచ దేశాలకు ఆధునిక చిరుధాన్య ఉత్పత్తులకు సంబంధించిన సాంకేతికతను అందిస్తోందన్నారు. ‘మేనేజ్’ డైరెక్టర్ జనరల్ డా. పి. చంద్రశేఖర ప్రసంగిస్తూ ఆహార భద్రత సాధించాలంటే చిరుధాన్యాల ఉత్పత్తిని పెంపొందించడానికి అందరూ సమన్వయంతో కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎఎఆర్‌డిఓ ప్రధాన కార్యదర్శి మనోజ్ నర్దేవ్సింగ్, డా.సంజీవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
వంట పండింది!
జీవితంలో సమస్యలు రావడం సాధారణం. ఒక్కోసారి ఇవి ఊపిరాడనివ్వవు. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనే ధైర్యంగా వాటిని ఎదుర్కొనాలి. తానేమిటో నిరూపించుకోవాలి. అలానే చేసింది బిందు. తన కూతుళ్లకు మంచి చదువును అందించేందుకు ఒక పక్క గరిట తిప్పుతూనే మరోపక్క నాగలి పట్టి పొలం సాగు చేస్తూ ‘‘మనం కూడా ఇలా వ్యవసాయం చేస్తే బావుంటుంది’’ అనేంతగా ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. తమిళనాడులోని తెనై జిల్లా బొమ్మినాయకన్పట్టి గ్రామానికి చెందిన బిందు, పిచ్చయ్య దంపతులకు ఇద్దరు అమ్మాయిలు. పిచ్చయ్య సొంత పొలంలో చెరకు పండించేవాడు. అయితే ఏటా అప్పులు తప్ప ఆదాయం వచ్చేది కాదు. గ్రామంలో చాలామంది రైతులు చెరకు, పత్తిని పండించి నష్టపోవడాన్ని చూసి ఇతర పంటలను పండించాలని నిర్ణయించుకుంది బిందు. మొక్కజొన్న, వంగ పంటను పొలంలో వేసింది. మరోపక్క సెల్ఫ్‌హెల్ప్ గ్రూప్‌లో చేరి చుట్టుపక్కల రైతులు ఏం పండిస్తున్నారో తెలుసుకునేది. ఇతర రైతుల సలహాలు, సూచనలతో సాగును మెరుగు పరుచుకుంటూ, ఎస్‌హెచ్‌జీ ద్వారా కృషి విజ్ఞాన్ నిర్వహించే వ్యవసాయ కార్యక్రమాలకు హాజరవుతూ మెలకువలు నేర్చుకుంది. అధికారులు చెప్పిన విధంగా పప్పుధాన్యాలు, మిల్లెట్స్, మినుములు కూడా సేంద్రియ పద్ధతి లో సాగుచేసింది. దీంతో మంచి లాభాలు వచ్చాయి. విరామంలో... పంటకు పంటకు మధ్య వచ్చే విరామంలో కూరగాయలు పండించడం మొదలు పెట్టింది. అవి నాలుగు నెలల్లోనే చేతికి రావడంతో మంచి ఆదాయం వచ్చేది. విరామ పంటలు చక్కగా పండుతుండడంతో.. కొత్తిమీర, కాకర, ఇతర కూరగాయలను పండిస్తోంది. పంటను పసుమయిగా ... ఉత్పత్తి ఎక్కువగా ఉండడంతో చాలా కూరగాయలు వృథా అయ్యేవి. అలా వ్యర్థంగా పోకుండా ఉండేందుకు ‘పసుమయి’ పేరిట ఎండబెట్టిన కూరగాయలు, పొడులను విక్రయిస్తోంది. ఇడ్లీ పొడి, నిమ్మపొడి, ధనియాల పొడి వంటి అనేక రకాల పొడులను మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చింది. నెలకు వందల సంఖ్యలో విక్రయాలు జరుగుతున్నాయి. ఇలా అంచెలంచెలుగా ఎదుగుతూ వ్యాపారవేత్తగా ఎదిగింది బిందు. ఆమె పెద్దకూతురు ఎం.ఎస్. పూర్తి చేస్తే, చిన్నకూతురు బీఎస్సీ నర్సింగ్ చేస్తోంది. అలా సేద్యంతో పిల్లల చదువులనూ పండించుకుంది బిందు. -
నాలుగైదేళ్లలో జన్యుసవరణ జొన్నలు, రాగులు!
సాక్షి సాగుబడి, హైదరాబాద్: చిరుధాన్య వంగడాల అభివృద్ధికి జన్యు సవరణ (జీనోమ్ ఎడిటింగ్) సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లు భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసిఏఆర్) డెప్యూటీ డైరెక్టర్ జనరల్ (క్రాప్ సైన్స్) డాక్టర్ టి. ఆర్. శర్మ వెల్లడించారు. అంతర్జాతీయ చిరుధాన్య సమ్మేళనం 5.0 ముగింపు ఉత్సవంలో పాల్గొనేందుకు మంగళవారం హైదరాబాద్ వచ్చిన శర్మ ‘సాక్షి సాగుబడి’తో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. పోషకాల నాణ్యతను పెంపొందించడానికి, ‘యాంటీ న్యూట్రియంట్ల’ను పరిహరించడానికి జొన్న, రాగి విత్తనాలకు జన్యు సవరణ ప్రక్రియ చేపట్టినట్లు డా. శర్మ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. చిరుధాన్యాలపై గతంలో పెద్దగా పరిశోధనలు జరగనందున జన్యుసవరణ కష్టతరంగా మారిందన్నారు. అందువల్ల జన్యు సవరణకు ఎక్కువ కాలం పట్టే అవకాశం ఉందన్నారు. ఈ పరిశోధనలు శైశవ దశలో ఉన్నాయని, ఈ వంగడాలు అందుబాటులోకి రావటానికి 4–5 ఏళ్ల సమయం పడుతుందన్నారు. మెరుగైన చిరుధాన్యాల వంగడాల అభివృద్ధి దిశగా ఇప్పటికే గణనీయమైన అభివృద్ధి సాధించామని, ఈ కృషిలో భాగంగానే జన్యు సవరణ(జీనోమ్ ఎడిటింగ్) సాంకేతికతను కూడా చేపట్టామన్నారు. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం ముగింపు దశకు వచ్చిన నేపథ్యంలో రానున్న కాలంలోనూ చిరుధాన్యాల ప్రోత్సాహానికి సంబంధిత వర్గాలందరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అంతర్జాతీయ సమ్మేళనంలో వివిధ వర్గాల నుంచి సేకరించిన అభిప్రాయాలను క్రోడీకరించి, రానున్న పదేళ్లలో చిరుధాన్యాల అభివృద్ధికి చేపట్టవలసిన కార్యాచరణ ప్రణాళికను త్వరలో ప్రకటిస్తామని ఆయన చెప్పారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో ఆహార, పౌష్టికాహార భద్రత కోసం పర్యావరణ అనుకూల సుస్థిర వ్యవసాయ పద్ధతులను ఐసిఏఆర్ ప్రోత్సహిస్తోందన్నారు. ఆహార వ్యవస్థలో సంబంధితులందరూ పరస్పరం సహకరించుకుంటూ చిరుధాన్యాలను ప్రధాన జీవన స్రవంతిలోకి తీసుకురావాలని డా. శర్మ సూచించారు. (చదవండి: చిరుధాన్యాలు నిరుపేదలకూ అందాలి!) -
చిరుధాన్యాలు నిరుపేదలకూ అందాలి!
సాక్షి సాగుబడి, హైదరాబాద్: చిరుధాన్యాలను దైనందిన ఆహారంలో భాగం చేసుకుంటే పౌష్టికాహార లోపాన్ని సులువుగా జయించవచ్చని, నిరుపేదలు సైతం చిరుధాన్యాలను రోజువారీ ఆహారంగా తిసుకునే అవకాశం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై అన్నారు. అంతర్జాతీయ చిరుధాన్య సంవత్సరం సందర్భంగా భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ (ఐఐఎంఆర్)–న్యూట్రిహబ్ ఆధ్వర్యంలో నోవోటెల్ హోటల్లో సోమవారం ప్రారంభమైన అంతర్జాతీయ చిరుధాన్య సమ్మేళనం మంగళవారం ముగిసింది. ముగింపు కార్యక్రమంలో డా. తమిళిసై ముఖ్య అతిథిగా ప్రసంగిస్తూ చిరుధాన్యాలను తాను ప్రతి రోజూ తింటానన్నారు. వైద్యురాలిగా కూడా చిరుధాన్యాలను రోజువారీ ఆహారంలో తిరిగి ప్రజలంతా భాగం చేసుకోవటం అవశ్యమన్నారు. జొన్నలు, రాగులు, సజ్జలకు మాత్రమే పరిమితం కావద్దని అంటూ.. వీటితో పాటు కొర్రలు, సామలు, అరికెలు, అండుకొర్రలు, ఊదలు తదితర స్మాల్ మిల్లెట్స్‌ను కూడా మార్చి మార్చి తినాలని సూచించారు. ఒక్కో చిరుధాన్యంలో వేర్వేరు ప్రత్యేకతలున్నాయంటూ, ఒక్కో దాంట్లో ఒక్కో రకం వ్యాధుల్ని పారదోలే ప్రొటీన్లు, సూక్ష్మపోషకాలు, పీచుపదార్థాలు వేర్వేరు పాళ్లలో ఉన్నాయని డా. తమిళిసై వివరించారు. ఈ మిల్లెట్స్ చిన్నసైజులో ఉంటాయి కాబట్టి చిన్నచూపు చూడకూడదన్నారు. ప్రధాని మోదీ ప్రత్యేక శ్రద్ధతో యోగాతో పాటు చిరుధాన్యాలను ప్రపంచానికి తిరిగి పరిచయం చేయటం హర్షదాయకమన్నారు. ఐఐఎంఆర్ న్యూట్రిహబ్‌లో శిక్షణతో పాటు ఆర్థిక సాయం పొంది చిరుధాన్యాల ఆహారోత్పత్తుల వ్యాపారం చేపట్టిన పలు స్టార్టప్‌ల వ్యవస్థాపకులకు గవర్నర్ తమిళిసై గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లను అందించి ప్రశంసించారు. ముగింపు సమావేశానికి ఐఐఎంఆర్ న్యూట్రిహబ్ సీఈవో డా. బి. దయాకర్‌రావు అధ్యక్షతవహించారు. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసిఎఆర్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (క్రాప్‌సైన్స్) డా. శర్మ ప్రసంగిస్తూ వచ్చే నెలతో ముగియనున్న అంతర్జాతీయ చిరుధాన్య సంవత్సరం తర్వాత 2033 వరకు చేపట్టనున్న భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికతో కూడిన హైదరాబాద్ డిక్లరేషన్‌ను త్వరలో వెలువరిస్తామని ప్రకటించారు. క్లైమెట్ ఛేంజ్ నేపథ్యంలో సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రాచుర్యంలోకి తెస్తున్నామని, మెరుగైన వంగడాలను రైతులకు అందిస్తున్నామన్నారు. కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ (సిఎసిపి) చైర్మన్ డాక్టర్ విజయపాల్ శర్మ ప్రసంగిస్తూ ప్రస్తుతం చిరుధాన్యాలు పేదలకు అందుబాటులో లేవని, వారికి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా అందించాల్సిన బాధ్యత రాష్ట్రప్రభుత్వాలపై ఉందన్నారు. కనీస మద్దతు ధర పెంపుదలలో కేంద్రం ఇప్పటికే చిరుధాన్యాలకు ప్రాధాన్యం ఇస్తోందన్నారు. చిరుధాన్యాలకు మార్కెట్లో డిమాండ్ ఏర్పడినందున రైతులకు మున్ముందు మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. ఐఐఎంఆర్ డైరెక్టర్ డా. సి.తార సత్యవతి మాట్లాడుతూ మెరుగైన చిరుధాన్య వంగడాల తయారీకి జన్యు సాంకేతికతలను వినియోగిస్తున్నట్లు తెలిపారు. (చదవండి: ప్రపంచానికి చిరుధాన్యాల సత్తా చాటిన భారత్ !) -
ప్రపంచానికి చిరుధాన్యాల సత్తా చాటిన భారత్!
సాక్షి సాగుబడి, హైదరాబాద్: అన్ని విధాలుగా ఆరోగ్యదాయకమైన చిరుధాన్యాల ఆహారంపై అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం-2023 సందర్భంగా మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అద్భుతమైన ప్రజా చైతన్యం వెల్లివిరుస్తోందని భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి(ఐసిఎఆర్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డా. సురేశ్ కుమార్ చౌదరి అన్నారు. ఐరాసకు చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) తోడ్పాటుతో భారత ప్రభుత్వం సకల పోషకాల గనులైన చిరుధాన్యాలను శ్రీఅన్నగా పేర్కొంటూ ఫ్యూచర్ హెల్దీ సూపర్ ఫుడ్‌గా సరికొత్త రూపాల్లో తిరిగి పరిచయం చేయటంలో సఫలీకృతమైందని ఆయన తెలిపారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో మనుషుల ఆరోగ్యానికే కాకుండా భూగోళం ఆరోగ్యానికి కూడా దోహదపడే అసలైన ఆహార ధాన్యాలు చిరుధాన్యాలేనని జీ20 తదితర అంతర్జాతీయ వేదికల్లోను, దేశీయంగాను చాటి చెప్పటంలో మన దేశం విజయవంతమైందని అంటూ, భవిష్యత్తులో చిరుధాన్యాల ప్రాధాన్యం మరింత విస్తరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ప్రధాన జీవన స్రవంతిలోకి తిరిగి చిరుధాన్యాలు- ఇప్పుడు, తర్వాత’ అనే అంశంపై నొవోటెల్ హోటల్లో రెండు రోజుల అంతర్జాతీయ చిరుధాన్యాల సమ్మేళనం సోమవారం ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థలోని న్యూట్రిహబ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి డా. సురేశ్ కుమార్ చౌదరి అధ్యక్షతవహించారు. దేశంలో చాలా రాష్ట్రాలు మిల్లెట్ మిషన్లను ప్రారంభించాయని, ప్రజలు నెమ్మదిగా చిరుధాన్యాల వినియోగం వైపు మళ్లుతున్నారన్నారు. అయితే, చిరుధాన్యాల రైతులకు మరింత ఆదాయాన్ని అందించే పాలకులు విధాన నిర్ణయాలు తీసుకొని ప్రోత్సాహించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. 2023 తర్వాత కాలంలో చిరుధాన్యాలు మన ఆహారంలో మరింతగా భాగం కావాలంటే కేవలం ప్రభుత్వ చర్యలే సరిపోవని, ప్రభుత్వేర సంస్థలు, వ్యక్తులు, ప్రైవేటు ఆహార కంపెనీలు కూడా సంపూర్ణ సహకారం అందించాలని డా. సురేశ్ కుమార్ చౌదరి విజ్ఞప్తి చేశారు. ఐసిఏఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డా. సురేశ్ కుమార్ చౌదరి చిరుధాన్యాల పుట్టిల్లు భారత్: ఎఫ్.ఎ.ఓ. ఐరాసకు చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) భారత్ ప్రతినిధి టకయుకి హగివర ముఖ్య అతిథిగా ప్రసంగిస్తూ చిరుధాన్యాలకు భారత్ పుట్టిల్లని, చిరుధాన్యాల వాణిజ్యానికి భారత్ మూలకేంద్రంగా మారే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. క్లైమెట్ ఎమర్జెన్సీ నేపథ్యంలో ఆకలి, పౌష్టికాహార లోపం, ఆహార అభద్రతలను అధిగమించడానికి చిరుధాన్యాలు ఉపకరిస్తాయని భారత్ ప్రపంచానికి శక్తివంతంగా చాటిచెప్పిందన్నారు. ఐసిఎఆర్, ఐఐఎంఆర్ చేసిన కృషి అనితరసాధ్యమైనదన్నారు. అంతర్జాతీయ సంస్థలతో పాటు, ఆహార వాణిజ్యంలో దిగ్గజాల్లాంటి బహుళజాతి కంపెనీలు కూడా చిరుధాన్యాల వైపు దృష్టి సారిస్తున్నాయన్నారు. 2030 నాటికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు చిన్న, సన్నకారు రైతుల అభ్యున్నతికి చిరుధాన్యాలతో కూడిన సుస్థిర వ్యవసాయం దోహదం చేస్తుందన్నారు. రైతులకు దక్కుతున్నది స్వల్పమే చిరుధాన్యాలతో అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా 300కుపైగా అధునాతన, వినూత్న ఆహారోత్పత్తులను ఉత్పత్తి చేసే సాంకేతికతలను రూపొందించటంలో హైదరాబాద్‌లోని ఐఐఎంఆర్ న్యూట్రిహబ్ విశిష్ట ప్రాతను పోషించిందని, ప్రపంచానికే ఇది మార్గదర్శకమని ఐసిఎఆర్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ డా. డి.కె. యాదవ్ తెలిపారు. గతంలో చిరుధాన్యాలు ఎగుమతి చేసేవారమని, ఇప్పుడు అధునాతన తినుబండారాలను ఎగుమతి చేసే దేశంగా భారత్ మారిందన్నారు. అయితే, ప్రాసెస్ చేసిన ఉత్పత్తులను అమ్మి వ్యాపారులు సంపాదించే మొత్తంలో 15-20% మాత్రమే చిరుధాన్యాల రైతులకు దక్కుతున్నదని, కనీసం 50% దక్కేలా విధానపరమైన చర్యలు తీసుకోగలిగితే చిరుధాన్యాలు ప్రధాన ఆహార ధాన్యంగా ప్రధాన జీవన స్రవంతిలోకి వస్తుందన్నారు. రూ. 250 కోట్లతో ఐఐఎంఆర్ను అంతర్జాతీయ చిరుధాన్యాల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా అభివృద్ధి చేశామని డా. యాదవ్ వివరించారు. వరి, గోధుమలకు దీటుగా రైతులకు ఆదాయాన్నందించేలా అధిక దిగుడినిచ్చే 9 రకాల చిరుధాన్యాల వంగడాలను అందుబాటులోకి తెచ్చామని, సర్టిఫైడ్ సీడ్‌కు కొరత లేదన్నారు. భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ(ఐఐఎంఆర్) డైరెక్టర్ డాక్టర్ సి. తార సత్యవతి ప్రసంగిస్తూ చిరుధాన్యాలను పెద్దలతో పాటు పిల్లలు, యువత కూడా ఇష్టంగా తినేలా వినూత్న ఉత్పత్తులను న్యూట్రిహబ్ ద్వారా అందుబాటులోకి తెచ్చామన్నారు. గుంటూరు, బాపట్ల ప్రాంతాల్లో ప్రయోగాత్మక సాగులో మేలైన జొన్న వంగడాల ద్వారా హెక్టారుకు 7-8 టన్నుల జొన్నల దిగుబడి సాధించినట్లు తెలిపారు. గుజరాత్లో బంగాళదుంపలు సాగు చేసిన తర్వాత ఆ పొలాల్లో హెక్టారుకు 7-8 టన్నుల సజ్జ దిగుబడి వచ్చిందన్నారు. దశాబ్దాల నిర్లక్ష్యం తర్వాత చిరుధాన్యాలకు పునర్వైభవం రానుందన్నారు. ఐఐఎంఆర్ న్యూట్రిహబ్ సీఈఓ డా. బి. దాయకర్‌రావు ప్రసంగిస్తూ గతంలో చిరుధాన్యాలు కొనే వారే ఉండేవారు కాదని, ఇప్పుడు కొందామంటే 40% మేరకు కొరత ఏర్పడిందన్నారు. న్యూట్రిహబ్ ద్వారా వినూత్న ఉత్పత్తులు తయారీలో స్టార్టప్‌లకు, ఆహార కంపెనీలకు ప్రపంచంలోనే ఎక్కడా లేని అధునాతన సాంకేతికతను అందిస్తున్నందున ఎగుమతులు పెరిగాయని, ప్రపంచ దేశాలు ఇప్పుడు మన వైపే చూస్తున్నాయన్నారు. చిరుధాన్యాల సాగు విస్తీర్ణాన్ని పెంచి, రైతులకు మున్ముందు మంచి ఆదాయం వచ్చేలా స్టార్టప్‌లు, కంపెనీలతో చర్చించి భవిష్యత్తు కార్యాచరణను ఈ సమ్మేళనంలో రూపొందించి ప్రభుత్వానికి సమర్పిస్తామన్నారు. చిరుధాన్యాల సాగు, వినియోగం పెంపుదలకు విశిష్ట కృషి చేస్తున్న పలువురు శాస్త్రవేత్తలు, స్టార్టప్‌లు, పాత్రికేయులకు ఈ సందర్భంగా ‘పోషక్ అనాజ్’ జీవన సాఫల్య పురస్కారాలను అందించారు. పురస్కారాలు అందుకున్న వారిలో డాక్టర్ పివి వరప్రసాద్, డా. జీవీ రామాంజనేయులు, డా. హేమలత, డా. మీరా తదితరులతో పాటు ‘సాక్షి సాగుబడి’ సీనియర్ న్యూస్‌ఎడిటర్ పంతంగి రాంబాబు ఉన్నారు. మంగళవారం కూడా ఈ సమ్మేళనం కొనసాగుతుంది. ఈ సందర్భంగా నోవోటెల్లో ఏర్పాటైన స్టాళ్లలో సుమారు 200 స్టార్టప్‌లు చిరుధాన్యాల ఆహారోత్పత్తులు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. (చదవండి: వరి ఆకారపు మిల్లెట్లు! మిల్లెట్లు తినేవారిగా మార్చేలా) -
వరి ఆకారపు మిల్లెట్లు!
సాక్షి, హైదరాబాద్: మిల్లెట్ డైట్‌ను ప్రోత్సహించేందుకుగాను తాము చేపట్టిన కార్యక్రమాల్లో మిల్లెట్లను బియ్యం ఆకారంలోకి మార్చడం ఒకటని న్యూట్రీహబ్ సీఈవో డాక్టర్ రావు తెలిపారు. సాయిల్ టు సోల్ అనే అంశంపై ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్‌కు విచ్చేసిన మహిళా పారిశ్రామికవేత్తల బృందంతో డాక్టర్ రావు మాట్లాడారు. మిల్లెట్ డైట్‌పై అవగాహన కల్పించి, ఎక్కువ మంది వీటిని తమ డైట్లో భాగం చేసుకునేలా చేసేందుకే తాము ఈ ప్రయత్నం చేస్తున్నామన్నారు. చాలా మంది అన్నం తినడానికి ఇష్టపడతారు. అలాంటి వారికి మిల్లెట్లు అన్నంలాగా కనిపిస్తాయి. బియ్యం ఆకారంలో తృణధాన్యాలను అందజేస్తాం. తద్వారా వాటికి ఆమోదయోగ్యం పెరుగుతుంది మూడు వేల సంవత్సరాల నాటి తృణధాన్యాల సమూహానికి మరింత యాక్సెప్టెన్స్ పెంచడానికి ఇది ఒక చొరవ. మిల్లెట్లను బియ్యంగా పునర్నిర్మించేటప్పుడు వాటి పోషక విలువలు ఏ మాత్రం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. మిల్లెట్లను బియ్యం రూపంలోకి మార్చడం ద్వారా, మేము వాటి షెల్ఫ్-లైఫ్‌ను పెంచుతున్నాం. మిల్లెట్లు పురాతన ఆహార ధాన్యాలలో ఒకటని, వాటి సాగు దాదాపు క్రీస్తుపూర్వం మూడు వేల సంవత్సరాల నాటిదని ఆధారాలున్నాయి. ఇది ప్రపంచ విస్తీర్ణంలో 19 %, ప్రపంచ ఉత్పత్తిలో 20%తో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద మిల్లెట్ ఉత్పత్తిదారుగా ఉంది. ప్రపంచంలో సాగవుతున్న 18 మిల్లెట్లలో 11 భారత్‌లోనే ఉత్పత్తి అవుతున్నాయి. మిల్లెట్లు గుండె జబ్బులు, పెద్దపేగు క్యాన్సర్‌ను నివారిస్తాయి. టైప్-2 డయాబెటిస్‌ను నిరోధించడంలో సహాయపడతాయి. బరువు తగ్గిస్తాయి. మిల్లెట్లు గ్లూటెన్ రహిత ఆహారం. ఇది గర్భిణీ, బాలింతలకు మంచిది, పిల్లలలో పోషకాహార లోపాన్ని నివారిస్తుంది. భారతదేశంలో మిల్లెట్ డిమాండ్‌ను పునరుద్ధరించడానికి ఐఐఎమ్ఆర్ కృషి చేస్తోంది. వాణిజ్యపరంగా ఐఐఎంఆర్‌లో న్యూట్రిహబ్ టీబీఐఎస్సీ ఉంది. ఇది మిల్లెట్స్‌కు ఒక బ్రాండ్‌ను క్రియేట్ చేసింది. ఇది గత ఐదు ఏళ్లలో 400 స్టార్టప్‌లతో సుమారు రెండు కోట్ల వరకు మూలధనాన్ని సేకరించాయి. ప్రస్తుతం వందకు పైగా స్టార్టప్‌లు ఇంక్యుబేట్ చేపడుతున్నాయి. ఇది దాదాపు 70 సాంకేతికతలను అభివృద్ధి చేసిందని డాక్టర్ బి. దయాకర్ రావు తెలిపారు. అంతకుముందు ఐసీఏఆర్- డైరెక్టర్ డాక్టర్ తారా సత్యవతి మాట్లాడుతూ, “మనము ఆహరం పేరిట కేలరీలను మాత్రమే తింటున్నాము. పౌష్టికాహారం ఎక్కువగా తీసుకోవాలి. తృణధాన్యాలతో ఆహార భద్రత నుంచి పౌష్టికాహార భద్రత దిశగా పయనిస్తున్నాం. మిల్లెట్‌ను సూపర్‌ఫుడ్‌గా ప్రదర్శించడం, మనం మర్చిపోయిన వంటకాలను పునరుద్ధరించడం తదితర వాటితో మిల్లెట్ పేద ప్రజల ఆహారం అనే కళంకాన్ని తొలగించే మన ప్రధాన ఆహారంలో భాగంగే చేసే యత్నం చేస్తోంది ఐఐఎంఆర్. ఇక మిల్లెట్ వాల్యూ చైన్‌లో 500కి పైగా స్టార్టప్‌లు పనిచేస్తున్నాయని, ఐఐఎంఆర్ రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద మరో 250 స్టార్టప్‌లను ప్రారంభించామని ఐసీఏఆర్ డైరెక్టర్ సత్యవతి అన్నారు. దాదాపు 66 స్టార్టప్‌లకు సుమారు రూ. 6.2 కోట్ల నిధులను పంపిణీ చేయగా, మిగిలిన 25 స్టార్టప్లుకు కూడా నిధుల విడుదలకు ఆమోదం లభించినట్లు తెలిపారు. ఈ మేరకు ఎఫ్ఎల్ఓ చైర్పర్సన్ రీతు షా మాట్లాడుతూ.. మిల్లెట్లు ప్రోటీన్, ఫైబర్, కీలకమైన విటమిన్లు, ఖనిజాలకు మంచి మూలమని అన్నారు. ఇది అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరం కాబట్టి ఎఫ్ఎల్ఓ తమ సభ్యులకు మరిన్ని వ్యాపార అవకాశాలను లభించాలని ఆశిస్తోంది. అందుకే ఈ టూర్ ప్లాన్ చేశామని ఆమె తెలిపారు. మిల్లెట్స్‌లో వ్యాపార అవకాశాలను అన్వేషించడానికి ఆసక్తి ఉన్న పలువురు మహిళా పారిశ్రామికవేత్తలు అనేక ప్రశ్నలు సంధించి..వివరణలు పొందారు. ఇక ఈ కార్యక్రమం చివర్లో వారు పారిశ్రామికవేత్తల కోసంఐఐఎంఆర్ సృష్టించిన సౌకర్యాలను కూడా సందర్శించి పరిశీలించారు. (చదవండి: ఆహారానికి ‘అనారోగ్య మూల్యం’ అంతింత కాదయా!) -
ప్రతి అడుగులో అన్నదాత సంక్షేమం
గత నాలుగున్నరేళ్లలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. వాటి ద్వారా ప్రతీ రైతన్న లబ్ధి పొందాలి. ఖరీఫ్ ధాన్యం కొనుగోలు సమయంలో అన్నదాతలకు అన్ని విధాలుగా అండగా నిలవాలి. ఏ ఒక్క రైతు నుంచి కూడా మద్దతు ధర దక్కలేదన్న మాటే వినిపించకూడదు. రైతులెవరూ మిల్లర్లు, మధ్యవర్తులను ఆశ్రయించే పరిస్థితే ఎక్కడా రాకూడదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్దతు ధరతో పాటు జీఎల్టీ రూపంలో ప్రతీ క్వింటాల్‌కు రూ.250 చొప్పున రైతులు అదనంగా లబ్ధి పొందేలా చర్యలు తీసుకున్నాం. ఇదొక గొప్ప మార్పు. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: చిరు ధాన్యాలను (మిల్లెట్స్) సాగు చేసే రైతులకు తోడుగా నిలిచేలా చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఏర్పాటు చేస్తున్న యూ నిట్లను వినియోగించుకుంటూ మిల్లెట్స్‌ను ప్రాసెస్ చేయాలన్నారు. ఏటా రైతుల నుంచి తృణ ధాన్యాల కొనుగోలు పెరిగే అవకాశాలున్నందున ఆ మేరకు పుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటును ప్రోత్సహించాలని సూచించారు. పీడీఎస్ (రేషన్ షాపులు) ద్వారా మిల్లెట్లను ప్రజలకు విస్తృతంగా పంపిణీ చేసేలా చర్యలు తీసుకుని వాటి వినియోగం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై కరపత్రాల ద్వారా అవగాహన కల్పించాలన్నారు. వ్యవసాయం, అను బంధ రంగాలతో పాటు పౌరసరఫరాల శాఖలపై బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్షించి పలు సూచనలు చేశారు. పంట వేసే ముందే భూసార పరీక్షలు ఏటా సీజన్లో పంటలు వేయటానికి ముందే తప్పనిసరిగా భూసార పరీక్షలు చేసి వాటి ఫలితాలతో కూడిన సర్టిఫికెట్లను రైతులకు అందించేలా చర్యలు తీసుకోవాలి. ఆర్బీకేల స్థాయిలో భూసార పరీక్షలు చేసే విధంగా అధికారులు అడుగులు ముందుకేయాలి. అందుకు అవసరమైన పరికరాలను ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచేలా చూడాలి. ముందుగానే భూసార పరీక్షలు చేయడం ద్వారా ఏ పంటలు వేయాలి? ఏయే రకాల ఎరువులు ఎంత మో తాదులో వేయాలన్న దానిపై రైతులకు అవగాహన కల్పిస్తూ పూర్తి వివరాలు అందించేలా ఉండాలి. దీనివల్ల అవసరమైన మేరకు మాత్రమే ఎరువుల ను వినియోగిస్తారు. తద్వారా రైతులకు పెట్టుబడి ఖర్చులు కలిసి వస్తాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. 2023–24 సీజన్‌కు సంబంధించి ‘‘వైఎస్సార్ రైతు భరోసా’’ రెండో విడత పెట్టుబడి సాయాన్ని నవంబర్ మొదటి వారంలో పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయాలి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నాలుగున్నరేళ్లలో పథకం ద్వారా రైతులకు రూ.31,005.04 కోట్లు అందజేసి తోడుగా నిలిచాం. సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సుస్థిర జీవనోపాధి మార్గాలపై దృష్టి వ్యవసాయంతో పాటు పాడిపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్న వారిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. వారికి సుస్థిర జీవనోపాధి మార్గాల కల్పనపై సమీక్ష జరగాలి. వ్యవసాయమే కాకుండా అనుబంధ రంగాల్లో మహిళలకు స్వయం ఉపాధి మార్గాలు బలోపేతం కావాలి. వైఎస్సార్ చేయూత కింద ఏటా ఇస్తున్న డబ్బులకు అదనంగా బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించడం ద్వారా పాడి సహా ఇతర స్వయం ఉపాధి మార్గాలను చూపాలి. తద్వారా గ్రామీణ మహిళల ఆరి్ధక స్థితిగతులు ఎంతగానో మెరుగుపడతాయి. ఇప్పటికే మంజూరు చేసిన యూనిట్లు విజయవంతంగా నడిచేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. జగనన్న పాల వె ల్లువ పథకం కింద అమూల్ ద్వారా పాల సేకరణ చేస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా లక్షలాది మంది మహిళా పాడి రైతులు లబ్ధి పొందుతున్నారు. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీపై ఉంది. రాష్ట్రంలో మూగజీవాలకు పశుగ్రాసం, దాణా కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్బీకేను యూనిట్‌గా తీసుకుని సంపూర్ణ మిశ్రమ దాణాను అందించేందుకు చర్యలు తీసుకోవాలి. ముందస్తు రబీ.. 10 లక్షల ఎకరాల్లో సాగు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ముందస్తు రబీలో 10 లక్షల ఎకరాల్లో పంటలు వేసే అవకాశం ఉన్నట్లు సమీక్షలో అధికారులు వెల్లడించారు. ఖరీఫ్ పంటలు సాగవని ప్రాంతాల్లో రైతులు ముందస్తు రబీకి సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే శనగ సహా ఇతర అన్ని రకాల విత్తనాలను ఆర్బీకే స్థాయిలో అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు. రబీలో సాగుచేసే శనగ విత్తనాలపై సబ్సిడీని 25 శాతం నుంచి 40 శాతానికి పెంచామన్నారు. విత్తనాల పంపిణీ చురుగ్గా సాగుతోందని, సుమారు లక్ష క్వింటాళ్ల శనగ విత్తనాలను సిద్ధం చేయగా, ఇప్పటికే 45 వేల క్వింటాళ్లను రైతులకు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఎరువుల లభ్యతలో ఎలాంటి సమస్యా లేదని, రబీ సీజన్లో రైతుల అవసరాలకు తగిన విధంగా నిల్వలున్నాయని స్పష్టం చేశారు. ఖరీఫ్‌కు సంబంధించి ఇప్పటికే 85 శాతం ఇ–క్రాప్ పూర్తి చేశామని, అక్టోబరు 15 లోగా వంద శాతం లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు. జూన్, ఆగస్టులో వర్షాలు లేకపోవడం పంటల సాగుపై కొంత మేర ప్రభావం చూపిందన్నారు. ఈ కారణంగానే ఖరీఫ్ సీజన్లో 73 శాతం మేర పంటలు సాగైనట్లు చెప్పారు. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, తాడేపల్లిలోని డీఆర్‌ఓజీఓ– ఆర్టీపీఓ కేంద్రాల్లో ఔత్సాహికులైన వారికి కిసాన్ డ్రోన్లపై శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు. ఇప్పటివరకూ 422 మందికి శిక్షణ అందించామన్నారు. నవంబర్ మూడోవారం నాటికి నాటికి మండలానికి ఒకరు చొప్పున శిక్షణ పూర్తవుతుందని, వీరి ద్వారా మిగతా వారికి శిక్షణ ఇప్పించే కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, పాడి పరిశ్రమ మత్స్య శాఖల మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, ఏపీ అగ్రిమిషన్ వైస్ చైర్మన్ ఎంవీయస్ నాగిరెడ్డి, వ్యవసాయశాఖ సలహాదారు తిరుపాల్‌రెడ్డి, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ గోపాలకృష్ణ ద్వివేది, వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్, ఉద్యానవనశాఖ కమిషనర్ డాక్టర్ శ్రీధర్, ఏపీ విత్తనాభివృద్ధి సంస్ధ ఎండీ డాక్టర్ గెడ్డం శేఖర్‌బాబు, పౌరసరఫరాల శాఖ కమిషనర్ అరుణ్‌కుమార్, పౌరసరఫరాల సంస్థ ఎండీ వీరపాండియన్, పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ అమరేంద్రకుమార్, పౌరసరఫరాలశాఖ డైరెక్టర్ విజయ సునీత పాల్గొన్నారు. -
మిల్లెట్ల పిండిపై 5% పన్ను
న్యూఢిల్లీ: త్రుణ ధాన్యాల ఆధారిత పిండిపై 5 శాతం పన్ను విధించాలని జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. లూజుగా విక్రయించే కనీసం 70 శాతం త్రుణధాన్యాల పిండిపై ఎలాంటి పన్ను ఉండదని ఆమె తెలిపారు. అదే ప్యాకేజీ రూపంలో లేబుల్‌తో విక్రయించే పిండిపై మాత్రం 5 శాతం పన్ను ఉంటుందని వివరించారు. జీఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ (జీఎస్టీఏటీ)ప్రెసిడెంట్‌కు 70 ఏళ్లు, సభ్యులకైతే 67 ఏళ్ల గరిష్ట వయో పరిమితి విధించాలని కూడా 52వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్ణయించిందన్నారు. గతంలో ఇది వరుసగా 67, 65 ఏళ్లుగా ఉండేదన్నారు. మొలాసెస్‌పై ప్రస్తుతమున్న 28 శాతం జీఎస్టీని, 5 శాతానికి తగ్గించడంతోపాటు మానవ అవసరాల కోసం వినియోగించే డిస్టిల్డ్ ఆల్కహాల్‌కు జీఎస్టీ నుంచి మినహాయింపు కల్పించినట్లు మంత్రి చెప్పారు. ఒక కంపెనీ తన అనుబంధ కంపెనీకి కార్పొరేట్ గ్యారెంటీ ఇచ్చినప్పుడు, ఆ విలువను కార్పొరేట్ గ్యారెంటీలో 1 శాతంగా పరిగణిస్తారు. దీనిపై జీఎస్టీ 18 శాతం విధించాలని కూడా కౌన్సిల్ నిర్ణయించిందన్నారు. -
ఆ ఉత్పత్తులపై జీరో జీఎస్టీ! కానీ... మెలిక పెట్టిన జీఎస్టీ కౌన్సిల్
అందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం (GST Council Meet) ముగిసింది. ఈ సమావేశంలో ఏయే నిర్ణయాలు తీసుకుంటారోనని అందరూ ఆతృతగా ఎదురుచూశారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలియజేశారు. 70 శాతం కంపోజిషన్ ఉన్న చిరుధాన్యాల (millet) పొడి ఉత్పత్తులపై జీఎస్టీ ఉండదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అయితే బ్రాండెడ్ చిరుధాన్యాల పొడి ఉత్పత్తులపై మాత్రం 5 శాతం జీఎస్టీ విధించేలా జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించిందని పేర్కొన్నారు. వీటిపై ప్రస్తుతం 18 శాతం జీఎస్టీ అమలు చేస్తున్నారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశానంతరం విలేకరుల సమావేశంలో ఆర్థిక మంత్రి మాట్లాడుతూ, బరువు ప్రకారం కనీసం 70 శాతం కంపోజిషన్‌తో కూడిన మిల్లెట్ పొడి ఉత్పత్తులను బ్రాండింగ్ లేకుండా విక్రయిస్తే జీఎస్టీ ఉండదని స్పష్టం చేశారు. కాగా గతంలో జీఎస్టీ కౌన్సిల్ ఫిట్మెంట్ కమిటీ పొడి మిల్లెట్ ఉత్పత్తులపై పన్ను మినహాయింపును సిఫార్సు చేసింది. భారత్ 2023ని 'చిరుధాన్యాల సంవత్సరం'గా పాటిస్తోంది. అధిక పోషక విలువలున్న చిరు ధాన్యాల పొడి ఉత్పత్తులను ప్రోత్సహించడంలో భాగంగా జీఎస్టీ మినహాయింపు, తగ్గింపులను నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. Goods and Services Tax (GST) Council has decided to slash GST on millet flour food preparations from the current 18% GST to 5%: Sources to ANI — ANI (@ANI) October 7, 2023 -
రోజూ మిల్లెట్స్ తింటున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి
తెలుగు రాష్ట్రాలు వేగంగా మిల్లెట్స్ గొడుగు కిందకు చేరుతున్నాయి. ఇది అన్ని ట్రెండ్స్‌లా ఇలాగ వచ్చి అలాగ వెళ్లిపోరాదు.ఎన్నో వసంతాల పాటు మనతో పాటు చిగురించాలి. మిల్లెట్స్ ఆహారంలో భాగమవుతున్నంత వేగంగా కనుమరుగయ్యే ప్రమాదమూ ఉంది. ఎందుకంటే మనం మిల్లెట్స్ వాడకంలో చూపిస్తున్న అత్యుత్సాహం వాటిని అర్థం చేసుకోవడంలో చూపించడం లేదంటున్నారు ఇక్రిశాట్లో అగ్రానమిస్ట్గా ఉద్యోగవిరమణ చేసి, హైదరాబాద్, బోయిన్పల్లి, ఇక్రిశాట్ కాలనీలో విశ్రాంత జీవనం గడుపుతున్నసీనియర్ సైంటిస్ట్ మేకా రామ్మోహన్ రావు. ఇదీ నా పరిచయం! మాది కృష్ణాజిల్లా, పాగోలు గ్రామం పరిధిలోని మేకావారి పాలెం. బాపట్ల అగ్రికల్చరల్ కాలేజ్‌లో ఏజీ బీఎస్సీ. హైదరాబాద్, రాజేంద్రనగర్‌లోని ఆచార్య ఎన్జీ రంగా (ఇప్పుడది ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ) అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ. ఢిల్లీలోని ఐఏఆర్ఐ (ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్)లో వ్యవసాయ పద్ధతుల మీద పరిశోధన చేశాను. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఇక్రిశాట్లో ఒకడినయ్యాను. ఒక మోస్తరు వ్యవసాయ కుటుంబం మాది. మా కుటుంబంలో తొలితరం విద్యావంతుడిని కావడంతో ఏ కోర్సులు చదివితే ఎలాంటి ఉన్నత స్థితికి చేరవచ్చని మార్గదర్శనం చేయగలిగిన వాళ్లెవరూ లేరు. ఢిల్లీకి వెళ్లి పీహెచ్డీ చేయడం కూడా మా ప్రొఫెసర్ గారి సూచనతోనే. మా నాన్న చెప్పిన మాట నాకిప్పటికీ గుర్తే. కాలేజ్ ఖర్చులు భరించి చదివించగలనంతే. డొనేషన్లు కట్టి చదివించాలని కోరుకోవద్దు’ అన్నారాయన. ఆ మాట గుర్తు పెట్టుకుని విస్తరణకు ఉన్న అవకాశాలను వెతుక్కుంటూ సాగిపోయాను. నా ప్రాథమిక విద్య ఏ మాత్రం స్థిరంగా సాగలేదంటే నమ్ముతారా! ఐదవ తరగతి లోపు మూడుసార్లు స్కూళ్లు మారాను. హైస్కూల్ కూడా అంతే. చల్లపల్లి స్కూల్లో పన్నెండవ తరగతి వరకు చదివాను. జాతీయ పతాక ఆవిష్కర్త పింగళి వెంకయ్యగారు కూడా చల్లపల్లి స్కూల్లోనే చదివారు. – మేకా రామ్మోహన్రావు, సీనియర్ సైంటిస్ట్ (రిటైర్డ్), ఇక్రిశాట్ జ్ఞానాన్ని ఇచ్చి పుచ్చుకున్నాం! ‘‘ఇప్పుడు నేను చిరుధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవడం గురించి పని చేస్తున్నాను. కానీ నా అసలు వృత్తి చిరుధాన్యాల సాగు. పటాన్చెరులో మా పరిశోధన క్షేత్రం. మనదేశంలో వర్షాధార నేలలను సమర్థంగా సాగులోకి తీసుకురావడానికి మిల్లెట్స్ మీద విస్తృతంగా పరిశోధనలు చేశాను. ఆ తర్వాత కామెరూన్, బ్రెజిల్, నైజీరియా, కెన్యాల్లో పని చేశాను. ప్రధాన పంటతో పాటు అంతర పంటగా మిల్లెట్స్‌ను సాగు చేయడం, అలాగే మిశ్రమ సాగు విధానాన్ని వాళ్లకు అలవాటు చేశాం. మన మిల్లెట్స్‌ని ఆయా దేశాలకు పరిచయం చేశాం. ఆ దేశాలు సమర్థంగా అనుసరిస్తున్నాయి. ఇన్ని దేశాలూ తిరిగి మన జ్ఞానాన్ని వాళ్లకు పంచి, వాళ్ల నుంచి నేర్చుకోవాల్సిన మెళకువలను మనదేశానికి తీసుకు వచ్చిన తర్వాత పరిశీలిస్తే... మనదేశంలో వ్యవసాయం సరికొత్త రూపు సంతరించుకుని ఉంది. ఒకప్పుడు పాడి–పంట కలగలిసి సమాంతరంగా సాగుతుండేవి. పంట సాగు చేసే రైతు ఇంట్లో పాడి కూడా ఉండేది. ఆ పశువుల ఎరువుతో సాగు చేసుకుంటూ అవసరానికి కొంత మేర పై నుంచి రసాయన ఎరువులను వాడేవాళ్లు. ఇప్పుడు పాడి రైతు వేరు, పంట రైతు వేరయ్యారు. దాంతో పంట సాగు ఆరోగ్యంగా లేదు, పాడి రైతు కూడా సౌకర్యంగా లేడు. జరిగిన పొరపాటును సరి చేసుకోవడానికి సేంద్రియ సాగును వెనక్కి తెచ్చుకుంటున్నాం. అలాగే ఆహారంలో కూడా ఇప్పుడు మిల్లెట్స్ రూపంలో ఆరోగ్యాన్ని వెతుక్కుంటున్నాం. చిరుధాన్యాలు, వరిధాన్యం తగు పాళ్లలో తీసుకునే రోజుల నుంచి జొన్నలు, రాగులను పూర్తిగా మర్చిపోయాం. ఇప్పుడు చిరుధాన్యాల పరుగులో వరిధాన్యాన్ని వదిలేస్తున్నారు. మిల్లెట్ మెనూ ప్రాక్టీస్‌లో మనవాళ్లు చేస్తున్న పొరపాట్లు చూస్తుంటే వాటిని అలవాటు చేసుకున్న నెల రోజుల్లోనే మిల్లెట్స్‌కు దూరమైపోతారేమోననే ఆందోళన కూడా కలుగుతోంది. అందుకే అవగాహన కల్పించే బాధ్యతను నాకు చేతనైనంత చేస్తున్నాను. టేబుల్ మార్చినంత సులువు కాదు! పుట్టినప్పటి నుంచి కొన్ని దశాబ్దాలుగా అన్నం తినడానికి అలవాటు పడిన దేహాన్ని ఒక్కసారిగా మారమంటే సాధ్యం కాదు. మనం డైనింగ్ టేబుల్ మీద పదార్థాలను మార్చేసినంత సులువుగా మన జీర్ణవ్యవస్థ మారదు, మారలేదు కూడా. అందుకే మొదటగా రోజులో ఒక ఆహారంలో మాత్రమే మిల్లెట్స్ తీసుకోవాలి. జొన్న ఇడ్లీ లేదా రాగి ఇడ్లీతో మొదలు పెట్టాలి. ఒక పూట అన్నం తప్పకుండా తినాలి. రాత్రికి రొట్టె లేదా సంగటి రూపంలో మిల్లెట్స్ అలవాటు చేసుకుంటే ఈ తరహా జీవనశైలిని కలకాలం కొనసాగించడం సాధ్యమవుతుంది. దేహం మొదట మిల్లెట్స్‌ను అడాప్ట్ చేసుకోవాలి, ఆ తర్వాత వాటిని అబ్జార్బ్ చేసుకోవడం మొదలవుతుంది. దేహానికి ఆ టైమ్ కూడా ఇవ్వకుండా ఆవకాయతో అన్న్రప్రాశన చేసినట్లు మెనూ మొత్తం మార్చేస్తే ఓ నెల తర్వాత ఆ ఇంటి టేబుల్ మీద మిల్లెట్స్ మాయమవుతాయనడం లో సందేహం లేదు. మరో విషయం... వరి అన్నం తీసుకున్నంత మోతాదులో మిల్లెట్ ఆహారాన్ని తీసుకోకూడదు. పావు వంతుతో సరిపెట్టాలి. అలాగే అరవై దాటిన వాళ్లు జావ రూపంలో అలవాటు చేసుకోవాలి. సాయంత్రం మిల్లెట్ బిస్కట్లను తీసుకోవాలి. ఇక అనారోగ్యానికి గురయిన వాళ్లు తిరిగి కోలుకునే వరకు మిల్లెట్స్‌కి దూరంగా ఉండడమే మంచిది. ఈ సందర్భంగా ప్రముఖ జర్నలిస్ట్ కుష్వంత్ సింగ్ అనుభవాన్నే ఉదాహరిస్తాను. గట్టి ఆహారం తీసుకునే పంజాబీ కుటుంబంలో పుట్టిన ఆయన వార్ధక్యంలో ‘దక్షిణాది ఆహారం సులువుగా జీర్ణమవుతోందని, ఇడ్లీ, అన్నానికి మారినట్లు’ రాసుకున్నారు. మిల్లెట్స్ మనదేహానికి సమగ్రమైన ఆరోగ్యాన్ని చేకూరుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. నిదానంగా జీర్ణమవుతూ, నెమ్మదిగా శక్తిని విడుదల చేస్తుంది. ఊబకాయం సమస్య ఉండదు. ఈ వివరాలన్నీ చెబుతూ మెనూతో పాటు మోతాదును కూడా గమనింపులో పెట్టుకోవాలని మహిళలకు వివరిస్తున్నాను. వాళ్లకు చక్కగా అర్థమైతే చాలు, ఇక ఆ వంటగది నుంచి మిల్లెట్ ఎప్పటికీ దూరం కాదు’’ అన్నారు రామ్మోహన్రావు. రోజూ ఓ గంటసేపు నడక, పాలిష్ చేయని బియ్యంతో అన్నం, మిల్లెట్ బిస్కట్ తీసుకుంటారు. ‘మిల్లెట్స్‌తో ఎన్ని రకాల వంటలు చేసుకోవచ్చో వివరించడానికి కాలనీల్లో మిల్లెట్ మేళాలు నిర్వహిస్తుంటాం. కానీ నేను మాత్రం వాటిలో ఒక్క రకమే తింటాను’’ అన్నారాయన నవ్వుతూ. – వాకా మంజులారెడ్డి, ఫొటోలు : మోర్ల అనిల్ కుమార్ -
మిల్లెట్స్ తింటే ఏమవుతుంది? బీపీ, షుగర్‌ను కంట్రోల్ చేస్తుందా?
కొర్రలు.. సామలు.. అండుకొర్రలు.. అరికెలు.. ఊదలు.. వరిగ.. ఈ పేర్లు ఒకప్పుడు ప్రతి ఇంట్లో వినిపించినా, కొన్నేళ్ల క్రితం కనుమరుగయ్యాయి. ఆధునిక జీవనశైలితో ఈ పంటలు ఎక్కడో కానీ కనిపించని పరిస్థితి. ఉరుకులు పరుగుల జీవితంలో వ్యాధులు చుట్టుముట్టడంతో జీవితం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మారిన వాతావరణం, పరిస్థితుల్లో ఆరోగ్యం, ఆహార అలవాట్లపై దృష్టి సారిస్తున్న నేపథ్యంలో సంప్రదాయ పంటలకు ఇప్పుడిప్పుడే ప్రాధాన్యత పెరుగుతోంది. అనారోగ్య సమస్యలను అడ్డుకునేందుకు సరిధాన్యాల వాడకం అధికమవుతోంది. ప్రభుత్వం కూడా సాగును ప్రోత్సహిస్తూ పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇస్తుండటం విశేషం. 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ మిల్లెట్ ఇయర్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మిల్లెట్ సాగుకు ప్రోత్సాహం, చిరుధాన్యాల వినియోగాన్ని పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించడం విశేషం. అందులో భాగంగా గత ఏడాది ఖరీఫ్‌లో 7,012 ఎకరాల్లో చిరుధాన్యాల పంటలు సాగయ్యాయి. 2023 ఖరీఫ్‌లో చిరుధాన్యాల సాగు 21,825 ఎకరాలకు పెరిగినట్లు తెలుస్తోంది. ధర లేనప్పుడు రైతులు నష్టపోకుండా ప్రభుత్వం మద్దతు ధర కూడా నిర్ణయిస్తోంది. సబ్సిడీపై విత్తనాలను పంపిణీ చేస్తోంది. రాయితీతో ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తోంది. పదేళ్ల క్రితం చిరుధాన్యాల వినియోగం 10 శాతం వరకు ఉండగా.. మారుతున్న పరిస్థితులతో వీటి వినియోగం 40–50 శాతం పైగా పెరిగింది. చిరుధాన్యాల సాగుకు చేయూత ∙ ఆహార, పోషక భద్రత(ఫుడ్ అండ్ న్యూట్రీషియన్ సెక్యూరిటీ) కింద కొర్ర, సజ్జ, జొన్న, వరిగ సాగును ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా ప్రదర్శన క్షేత్రాలు ఏర్పాటు చేస్తున్నారు. 3,450 ఎకరాలకు ప్రభుత్వం రూ.82.80 లక్షల విలువైన ఇన్పుట్స్ సరఫరా చేస్తోంది. ∙ రూ.1.25 లక్షల సబ్సిడీతో ఏడు మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటికి అదనంగా వర్షాధార ప్రాంత అభివృద్ధి కింద రూ.2 లక్షల సబ్సిడీతో దాదాపు 15 మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటవుతున్నాయి. ఇప్పటికే కర్నూలు, నంద్యాల తదితర ప్రాంతాల్లో ప్రాసెసింగ్ సెంటర్లు ఏర్పాటు కావడం విశేషం. షాపింగ్ మాల్స్ సిరిధ్యాన్యాలను ప్రత్యేకంగా విక్రయిస్తున్నాయి. వరి బియ్యంతో పోలిస్తే మిల్లెట్ రైస్ ధరలు కూడా ఎక్కువే. కిలో అండుకొర్రల(వాక్యుమ్ ప్యాకింగ్) ధర రూ.289 పలుకుతోంది. మిల్లెట్ కేఫ్‌కు విశేష స్పందన సిరిధాన్యాలు పోషకాలను అందించడమే కాకుండా రోగ కారకాలను శరీరంలో నుంచి తొలగించి దేహాన్ని శుద్ధి చేస్తాయి. ఈ నేపథ్యంలో కలెక్టరేట్ ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ విత్తన రైతు సేవా సంఘం ఏర్పాటు చేసిన మిల్లెట్ కేప్‌కు విశేషమైన స్పందన లభిస్తోంది. రోజు 160 మందికిపైగా మిల్లెట్ కేఫ్‌ను సందర్శిస్తున్నారు. ఇక్కడ చిరుధాన్యాల అన్నం, మిక్చర్, మురుకులు, లడ్డు, బిస్కెట్లు, చిరుధాన్యాల ఇడ్లీరవ్వ లభిస్తాయి. చిరుధాన్యాల బ్రెడ్‌కు ప్రత్యేక ఆదరణ ఉంటోంది. సిరిధాన్యాల విశిష్టత తక్కువ నీటితో రసాయన ఎరువులు, పురుగుమందుల అవసరం లేకుండా పండగలిగిన అత్యుత్తమ పోషక విలువలు కలిగిన పంటలు సిరిధాన్యాలు. మూడుపూటలా తిన్నప్పుడు, ఆ రోజుకు మనిషికి అవసరమైన పీచుపదార్థం ( ప్రతి ఒక్కరికి రోజుకు 38 గ్రాముల పీచుపదార్థం కావాలి) ఈ ధాన్యాల నుంచే లభిస్తుంది. తక్కిన 10 గ్రాములు కూరగాయలు, ఆకు కూరల నుంచి పొందవచ్చు. 25 ఎకరాల్లో చిరుధాన్యాల సాగు చిరుధాన్యాల సాగును ప్రోత్సహించడం లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ విత్తన రైతు సేవా సంఘాన్ని ఏర్పాటు చేశాం. కొర్రలు, సామలు, ఊదలు, అరికలు, అండుకొర్రలు 25 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయంలో సాగు చేసు చేసున్నాం. పంటను ఆంధ్రప్రదేశ్ విత్తన రైతు సేవా సంఘం ద్వారా కొనుగోలు చేస్తాం. ఇప్పటికి చిరుధాన్యాల ప్రాసెసింగ్ సెంటర్ కూడ ఏర్పాటు చేశాం. కలెక్టరేట్ ప్రాంగణంలో మిల్లెట్ కేఫ్ కూడా నిర్వహిస్తున్నాం. – వేణుబాబు, చిరుధాన్యాల రైతు బీపీ, షుగర్ తగ్గాయి నాకు 79 ఏళ్లు. గతంలో ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. బీపీ, షుగర్ కూడా ఉండింది. బరువు 65 కిలోలు. ఏడాదిన్నరగా కేవలం సిరిధాన్యాలైన సామలు, అరికలు, అప్పుడప్పుడు ఊదల ఆహారం తీసుకుంటున్నా. వీటికి తోడు జొన్న రొట్టె తింటున్నా. ప్రస్తుతం ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. బీపీ, షుగర్ కంట్రోల్లో ఉన్నాయి. – పిచ్చిరెడ్డి, విశ్రాంత ఏడీఏ, వెంకటరమణ కాలనీ, కర్నూలు చిరుధాన్యాల సాగును ప్రోత్సహిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం చిరుధాన్యాలకు మద్దతు ధర ప్రకటించింది. ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తోంది. ఈ పంటల సాగులో పెట్టుబడి వ్యయం తక్కువగా ఉంటుంది. రసాయన ఎరువులు వాడాల్సిన అవసరం ఉండదు. డయాబెటిస్ తదితర వ్యాధులకు చిరుధాన్యల ఆహారం దివ్య ఔషధం. గతంతో పోలిస్తే ఈ ఏడాది మిల్లెట్ సాగు భారీగా పెరుగుతోంది. – పీఎల్ వరలక్ష్మి, డీఏఓ, కర్నూలు -
అనారోగ్యానికి ఆహారపు అలవాట్లే కారణం..!
-
అటు ఆదాయం.. ఇటు ఆరోగ్యం..
సాక్షి, హైదరాబాద్: మిల్లెట్లలో ఔషధ గుణాలు ఎక్కువ. పోషకాహారపరంగా ఇవి ఎంతో కీలకమైనవి. సాగుపరంగా రైతుల కు ఖర్చు తక్కువగా ఉండి..మంచి ఆదాయాన్ని ఇస్తాయి. అందుకే మిల్లెట్లు కీలకమైనవిగా భావిస్తుంటామని నాబార్డ్ చైర్మన్ షాజీ కేవీ అన్నారు. మిల్లెట్స్ కాంక్లేవ్‌లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే....అగ్రి ఎకానమీలో మిల్లెట్ల పాత్ర ఎంతో కీలకం. ప్రపంచంలో మిల్లెట్ల ఉత్పత్తిలో భారత్ వాటా 41 శాతం. ఆసియాలో 81 శాతం మిల్లెట్ విస్తీర్ణం ఇండియాలోనే. మిల్లెట్లు వర్షాభావంలోనూ పండుతాయి. ఇతర పంటలు ఐదు నెలల్లో చేతికి వస్తే, మిల్లెట్లు మూడు నెలల్లోనే చేతికి వస్తాయి. దేశంలో అన్ని రకాల వాతావరణానికి ఇవి అనుకూలం. ప్రజల్లో మిల్లెట్లపై అవగాహన పెంచాలి గతంలో మనం మిల్లెట్లను ఆహారంగా తీసుకునేవారం. కానీ దేశంలో జనాభా పెరగడంతో ఆహారభద్రత సమస్యగా మారింది. దీంతో మన ఆహారపు అలవాట్లు మారి, ప్రజలకు అవసరమైన పంటలను ముందుకు తీసుకొచ్చాం. దీని ఫలితమే హరిత విప్లవం. ప్రజలు గోధుమ, బియ్యమే ఆహారంగా తీసుకోవడం ప్రారంభమైంది. ఇప్పుడు మళ్లీ మిల్లెట్లను ముందుకు తీసుకురావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మిల్లెట్ సాగులో రైతులకు అవసరమైన ప్రోత్సాహం అందాలి.వీటికి మరింత ప్రచారం కల్పించాలి. అభివృద్ధి చెందిన దేశాల్లో మిల్లెట్లపై ఇప్పటికే పూర్తి అవగాహన ఏర్పడింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇంకా ప్రచారం కల్పించాలి. రైతులకు అవగాహన కల్పిస్తున్నాం దేశంలో గోధుమలు, బియ్యానికి ప్రాధాన్యం ఉంది. వాటికి ప్రజలు అలవాటు పడ్డారు. దీన్ని రాత్రికి రాత్రే మార్చలేం. బియ్యం, గోధుమలు పండించాలంటే నీరు కావాలి. మిల్లెట్లు పండించాలంటే తక్కువ నీరు సరిపోతుంది. మిల్లెట్లను సుస్థిరమైన వ్యవసాయంగా భావించొచ్చు. ఈ విషయంలో రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ఉత్పత్తి, ఉత్పాదకత, విక్రయాలు పెరిగితే మిల్లెట్ల ధరలు తగ్గుముఖం పడతాయి. దీనివల్ల వినియోగదారులకు సరసమైన ధరలకు అందించగలం. రూ. లక్ష కోట్ల అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఉంది. దానిద్వారా రుణాలు ఇవ్వాలి. కానీ అందులో రూ. 26 వేల కోట్లు మాత్ర మే వినియోగిస్తున్నారు. మిల్లెట్లకు కనీస మద్దతు ధర కల్పించాల్సిన విషయం పూర్తిగా విధానపరమైన నిర్ణయం. దీనిని కేంద్రమే చెప్పాలి. ప్రస్తుతం 26 రకాల పంటలకు మద్దతు ధర కల్పించారు. అందులో కొన్ని రకాల మిల్లెట్లు కూడా ఉన్నాయి.