
హైదరాబాద్: మిల్లెట్ మ్యాన్ పీవీ సతీష్(77) తుదిశ్వాస విడిచారు. కొన్ని సంవత్సరాలుగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న పీవీ సతీష్.. చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. కాగా, సేంద్రీయ వ్యవసాయం, చిరుధాన్యాల సాగు కోసం 4 దశాబ్దాలుగా కృషి చేసినందుకు గానూ ఈయనను మిల్లెట్ మ్యాన్‌గా పిలుస్తారు.
అయితే, 1945 జూన్ 18న కర్ణాటకలో జన్మించిన పీవీ సతీష్.. ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లోని దూరదర్శన్‌లో డైరెక్టర్‌గా పని చేశారు. అనంతరం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కేంద్రంగా దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ స్థాపించారు. జహీరాబాద్ ప్రాంతంలో దళిత మహిళా సాధికారతకు పీవీ సతీశ్ కుమార్ విశేషంగా కృషి చేశారు. అలాగే, వాతావరణ మార్పుల నేపథ్యంలో రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులకు ప్రత్యామ్నాయంగా.. సహజ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తూ పెద్ద ఎత్తున రైతుల్లో అవగాహన కల్పించారు.
అంతేకాకుండా.. హైదరాబాద్-ముంబై జాతీయ రహదారిపై తొలి మిల్లెట్స్ కేఫ్ ఏర్పాటుకు తన వంతు కృషి చేశారు. 30 సంవత్సరాల కిందట మొదటిసారిగా ప్రపంచవ్యాప్త చర్చలో.. చిరుధాన్యాలను ప్రవేశపెట్టడంలో సఫలీకృతమయ్యారు.సేంద్రీయ వ్యవసాయం, చిరుధాన్యాల సాగు కోసం 4 దశాబ్దాలుగా కృషి చేశారు. ప్రత్యేకించి చిన్న కమతాల్లో పెట్టుబడి లేకుండా.. చిరుధాన్యాల పంటల సాగు, విస్తీర్ణం, వినియోగం పెంపు కోసం కృషి చేశారు. ప్రభుత్వ పంపిణీ వ్యవస్థలో చిరుధాన్యాలను చేర్చడంలో.. 2018 సంవత్సరాన్ని కేంద్రం జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. వీరి కృషికి అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు లభించాయి. ఇక, సతీష్ మృతిపట్ల ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన అంత్యక్రియలు సోమవారం జహీరాబాద్‌లో జరుగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment