zaheerabad
-
హైవేపై కంటైనర్‌లో అగ్నిప్రమాదం.. ఎనిమిది కార్లు దగ్ధం
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ బైపాస్ వద్ద అగ్నిప్రమాద ఘటన చోటుచేసుకుంది. కార్లు తరలిస్తున్న కంటైనర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది నెక్సాన్ కార్లు దగ్ధమైనట్టు సమాచారం.వివరాల ప్రకారం.. జహీరాబాద్ బైపాస్ వద్ద కార్లను తరలిస్తున్న కంటైనర్ లారీలో మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదంలో నాలుగు నెక్సాన్ కార్లు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెస్తున్నారు. కంటైనర్ ముంబై నుంచి హైదరాబాద్ వస్తున్న సమయంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్నిప్రమాదం కారణంగా రహదారిపై భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. -
జహీరాబాద్‌లో ఇండ్రస్టియల్ స్మార్ట్ సిటీ
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో గ్రీన్‌ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. హైదరాబాద్–నాగ్‌పూర్ ఇండ్రస్టియల్ కారిడార్‌లో భాగంగా.. న్యాలకల్, ఝరాసంగం మండలాల్లోని 17 గ్రామాల్లో జహీరాబాద్ పారిశ్రామిక ప్రాంతం కేంద్రంగా రూ.2,361 కోట్ల వ్యయంతో ఈ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ నిర్మాణం జరగనుంది. మొత్తం రెండు దశల్లో దాదాపు 12,500 ఎకరాల విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేయనున్నారు. నేషనల్ ఇండ్రస్టియల్ కారిడార్ డెవలప్మెంట్ – ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ ఫ్రేమ్ వర్క్‌లో భాగంగా..తొలిదశలో 3,245 ఎకరాల్లో పనులు ప్రారంభం అవుతాయి. ఇది జాతీయ రహదారి–65కు 2 కిలోమీటర్ల దూరంలో, హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డుకు 65 కిలోమీటర్లు, ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డుకు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే జహీరాబాద్ రైల్వేస్టేషన్‌కు 19 కిలోమీటర్లు, మెటల్‌కుంట రైల్వేస్టేషన్‌కు 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి 125 కిలోమీటర్ల దూరంలో, ముంబైలోని జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్టుకు 600 కిలోమీటర్ల దూరంలో, ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం పోర్టుకు 620 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పటికే పర్యావరణ అనుమతులు మొదటి దశకు అవసరమైన 3,245 ఎకరాల స్థలంలో 3,100 (దాదాపు 80%) ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం వద్దే ఉంది. రాష్ట్రానికి సంబంధించి షేర్ హోల్డర్స్ అగ్రిమెంట్, స్టేట్ సపోర్ట్ అగ్రిమెంట్ ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వస్తువులు, ఫుడ్ ప్రాసెసింగ్, మెషినరీ, మెటల్స్, నాన్–మెటాలిక్ ఆధారిత పరిశ్రమలు, రవాణా తదితర రంగాలకు ఊతం లభిస్తుంది. 1.74 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. దీనికి సంబంధించిన పర్యావరణ అనుమతులన్నీ అటవీ పర్యావరణ శాఖ నుంచి అందాయి. తెలంగాణ–కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో ఏర్పాటయ్యే ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణతో పాటు కర్ణాటకలోనూ పారిశ్రామికాభివృద్ధి మరింత వేగంగా ముందడుగు వేస్తుందని భావిస్తున్నారు. జహీరాబాద్‌కు ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని కేటాయించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్‌కు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ఏపీలో రెండు ఇండ్రస్టియల్ స్మార్ట్ సిటీలు దేశంలో మొత్తం 12 ప్రపంచ స్థాయి గ్రీన్‌ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగానే తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని ఓర్వకల్లులో రూ.2,786 కోట్ల వ్యయంతో, కొప్పర్తిలో రూ.2,137 కోట్ల వ్యయంతో గ్రీన్‌ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలు ఏర్పాటు కానున్నాయి. తెలంగాణలో 31 ఎఫ్ఎం స్టేషన్లు తెలంగాణలో 31, ఆంధ్రప్రదేశ్‌లో 68 ప్రైవేట్ ఎఫ్ఎం స్టేషన్ల ఏర్పాటుకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలంంగాణలోని ఆదిలాబాద్ (3), కరీంనగర్ (3), ఖమ్మం (3), కొత్తగూడెం (3), మహబూబ్‌నగర్ (3), మంచిర్యాల (3), నల్లగొండ (3), నిజామాబాద్ (4), రామగుండం (3), సూర్యాపేట (3)ల్లో కొత్త ప్రైవేట్ ఎఫ్ఎం స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. -
తాండూరు–జహీరాబాద్ రైల్వేలైన్ ‘సర్వే’ షురూ
సాక్షి, హైదరాబాద్: సిమెంటు పరిశ్రమల క్లస్టర్‌గా ఉన్న తాండూరు నుంచి జహీరాబాద్ వరకు 70 కి.మీ నిడివితో కొత్త రైల్వే లైన్ నిర్మించేందుకు ప్రతిపాదించిన దక్షిణ మధ్య రైల్వే ఇప్పుడు దాని సాధ్యాసాధ్యాలను తేల్చేందుకు ఫైనల్ లొకేషన్ సర్వే ప్రారంభించింది. సికింద్రాబాద్– వాడి మార్గంలో ఉన్న తాండూరు, సికింద్రాబాద్ నుంచి బీదర్ మార్గంలో ఉన్న జహీరాబాద్ మధ్య రైల్వే లైన్ నిర్మించాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. సిమెంటు, నాపరాయి, వ్యవసాయ ఉత్పత్తుల తరలింపు కూడా భారీగానే ఉంటుంది. వెరసి ఇటు ప్రయాణికులకు, అటు సరుకు రవాణాకు ఈ కొత్త మార్గం అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం రైల్లో రెట్టింపు దూరం.. తాండూరు–జహీరాబాద్ మధ్య దూరం (రోడ్డు మార్గం) 54 కి.మీ మాత్రమే. అదే రైలులో వెళ్లాలంటే 104 కి.మీ దూరం ప్రయాణించాల్సి వస్తోంది. వికారాబాద్ మీదుగా వెళ్లాల్సి రావటమే దీనికి కారణం. జహీరాబాద్, సంగారెడ్డి ప్రాంతాలకు తాండూరు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నిత్యం చాలామంది వస్తుంటారు. రైలులో చుట్టూ తిరిగి వెళ్లాల్సి ఉండటంతో ఎక్కువగా రోడ్డు మార్గానే వెళ్తారు. ఇక ముంబై వైపు వెళ్లేవారు ముంబై జాతీయ రహదారి మీద ఉన్న జహీరాబాద్‌కు వెళ్లి రోడ్డు మార్గాన వెళ్లే వాహనాలను ఆశ్రయిస్తారు. దీంతో ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణికుల రద్దీ బాగానే ఉంటోంది.ఇక తాండూరు చుట్టుపక్కల ఉన్న సిమెంటు పరిశ్రమలు, నాపరాయి పరిశ్రమల నుంచి రైళ్ల ద్వారా సరుకు దేశంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా అవుతుంటుంది. బీదర్ మార్గంలో సరుకు వెళ్లాలంటే వికారాబాద్ మీదుగా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని రూ.1,400 కోట్ల అంచనా వ్యయంతో తాండూరు నుంచి నేరుగా జహీరాబాద్‌కు కొత్త రైల్వే లైన్‌ను గతంలో రైల్వే శాఖ ప్రతిపాదించింది. గతేడాది చివరలో ఫైనల్ లొకేషన్ సర్వే మంజూరైంది. దీంతో మూడు రోజుల క్రితం ఆ పనులు మొదలయ్యాయి. ఈ లైన్ పూర్తయింతే గంట సేపట్లో రైళ్లు గమ్యం చేరతాయి. జహీరాబాద్ నుంచి వాడీకి ఇది దగ్గరి దారిగా మారుతుంది. అటు వాడీ మార్గంలో, ఇటు సికింద్రాబాద్ మార్గంలో ఒకేసారి రైళ్లు ప్రయాణించేందుకు ఇది ప్రత్యామ్నాయ మార్గం అవుతుంది. -
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
జహీరాబాద్: అమెరికాలోని చోర్లెట్ ప్రాంతంలో గురువారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతానికి చెందిన అబ్బరాజు పృథ్వీరాజ్ (30) అక్కడికక్కడే మృతి చెందాడు. పృపృథ్వీరాజ్ ఎనిమిదేళ్ల క్రితం ఐటీ ఉద్యోగం నిమిత్తం అమెరికా వెళ్లాడు. ఏడాదిన్నర కిందట సిద్దిపేట ప్రాంతానికి చెందిన శ్రీప్రియతో వివాహం జరిగింది.భార్యాభర్తలు బయటకు వెళ్లి పని ముగించుకుని ఇంటికి వెళుతున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. రోడ్డుపై నిలిచి ఉన్న ఓ వాహనాన్ని పృథ్వీరాజ్ నడుపుతున్న కారు ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో కారు బెలూన్లు తెరుచుకోవడంతో భార్యాభర్తలిద్దరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.ప్రమాదం అనంతరం వారు రహదారికి మరోవైపు చేరుకున్నారు. కాగా, ప్రమాదం జరిగిన విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చేందుకు పృథ్వీరాజ్ కారులో ఉండిపోయిన సెల్‌ఫోన్ కోసం వెళుతూ.. మళ్లీ రోడ్డు దాటుతున్న క్రమంలో అదే సమయంలో వేగంగా వచి్చన వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పృథ్వీ మృతదేహం శనివారం లేదా ఆదివారం ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని బంధువులు తెలిపారు. -
ముస్లిం రిజర్వేషన్లపై.. పీఎం మోడీ కీలక వ్యాఖ్యలు
-
తెలంగాణలో ‘డబుల్ ఆర్’ ట్యాక్స్.. ప్రధాని సంచలన వ్యాఖ్యలు
జహీరాబాద్,సాక్షి: తెలంగాణలో కాంగ్రెస్ డబుల్ ఆర్ ట్యాక్స్ వేస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు. ఈ డబుల్ ఆర్ ట్యాక్స్ వ్యవస్థకు షాక్ ఇవ్వకపోతే రానున్న ఐదేళ్లలో తెలంగాణ మరింత పతనమవుతుందని హెచ్చరించారు. జహీరాబాద్‌లో మంగళవారం(ఏప్రిల్30) జరిగిన బీజేపీ ప్రచార సభలో మోదీ మాట్లాడారు.‘తెలంగాణలో వ్యాపారవేత్తలు డబుల్ ఆర్ ట్యాక్స్ కట్టాల్సి వస్తోంది. కాంగ్రెస్ మళ్లీ పాత రోజులు తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. తెలుగు సినిమా పరిశ్రమ ట్రిపుల్ ఆర్ లాంటి సూపర్‌హిట్ సినిమా ఇచ్చింది. కాంగ్రెస్ మాత్రం డబుల్ ఆర్ ట్యాక్స్ వేస్తోంది. డబుల్ ఆర్ ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది. డబుల్ ఆర్ ట్యాక్స్ సొమ్ము ఢిల్లీకి చేరుతోంది. ప్రజలు భవిష్యత్ కోసం దాచిన సొమ్మును కాజేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. కేంద్రంలో కాంగ్రెస్ వస్తే వారసత్వ పన్ను విధిస్తారు. మీ సందపదలో 50 శాతం కాంగ్రెస్ కాజేస్తుంది. కాళేశ్వరం కుంభకోణంపై కాంగ్రెస్ చాలా మాట్లాడింది. అధికారంలోకి వచ్చి మౌనంగా ఉంటోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒక గూటి పక్షులే’అని మోదీ అన్నారు. -
బీజేపీలో చేరిన బీబీ పాటిల్ కండువా కప్పి ఆహ్వానించిన ఛుగ్, లక్ష్మణ్
సాక్షి, న్యూఢిల్లీ: బీఆర్ఎస్కు చెందిన జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీలో చేరారు. శుక్రవారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ ఛుగ్, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్, సీనియర్ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి, కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌లు పాటిల్‌కు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కాగా, జహీరాబాద్ లోక్‌సభ టికెట్‌పై పాటిల్‌కు నడ్డా హామీ ఇచ్చినట్లు తెలిసింది. బీజేపీలో చేరడానికి ముందే బీబీ పాటిల్ బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. జహీరాబాద్ ఎంపీగా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ.. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌కు తన రాజీనామా లేఖను పంపారు. ఈ సందర్భంగా పాటిల్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో తన నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి జరిగిందని, అయితే మరింత అభివృద్ధిని కాంక్షిస్తూ తాను బీజేపీలో చేరానని తెలిపారు. బీఆర్ఎస్ మునుగుతున్న నావ అని, త్వరలో ఆ పార్టీకి చెందిన మరికొందరు నేతలు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని కె.లక్ష్మణ్ తెలిపారు. కాగా, బీఆర్ఎస్ బీబీబీ.. అంటే బాప్, బేటా, బిటియా (తండ్రి, కుమారుడు, కూతురు) పార్టీగా మారిందని తరుణ్ ఛుగ్ ఎద్దేవా చేశారు. -
బీఆర్ఎస్కు మరో షాక్.. బీజేపీలోకి ఎంపీ బీబీ పాటిల్
సాక్షి, ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్కు మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. గురువారం ఆయన ఢిల్లీలో బీజేపీలోకి చేరారు. కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, పార్టీ ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్, ఎంపీ లక్ష్మణ్ సమక్షంలో చేరారు. జహీరాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పాటిల్ బరిలోకి దిగనున్నారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ రాజీనామా లేఖను అధ్యక్షుడు కేసీఆర్‌కు పంపించారు. తనకు పార్టీలో అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలంటూ లేఖలో పేర్కొన్నారు. ఇవాళ సాయంత్రం ఢిల్లీలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. కాగా, ఎన్నికల షెడ్యూల్ రాకముందే బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించనుంది. ఇందుకుగాను ఆ పార్టీ అగ్ర నాయకత్వం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. తొలిజాబితాలో అభ్యర్థుల పేర్ల ఖరారు కోసం గురువారం సాయంత్రం సమావేశమైన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) భేటీ శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల వరకు సాగింది. తొలి విడతలోనే సగం సీట్లకు ఎంపీ అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం. రెండు మూడు రోజుల్లో ఈ జాబితా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో తక్కువ మెజారిటీతో గెలిచిన సీట్లు, పార్టీ బలహీనంగా ఉన్న సీట్లలో అభ్యర్థులను తొలుత ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా ఆయా అభ్యర్థులకు ఎన్నికల ప్రచారానికి కనీసం 50 రోజుల సమయం దొరుకుతుందని పార్టీ నాయకత్వం భావిస్తోంది. కాగా, తొలి జాబితాలో తెలంగాణ నుంచి సుమారు 8 మంది అభ్యర్థులు ఖరారైనట్లు సమాచారం. ఖరారైన వారిలో సికింద్రాబాద్-కిషన్‌రెడ్డి, నిజామాబాద్-ధర్మపురి అరవింద్, కరీంనగర్- బండి సంజయ్, చేవెళ్ల- కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, భువనగిరి- బూర నర్సయ్యగౌడ్, హైదరాబాద్- మాధవిలత, మహబూబ్‌నగర్- డీకే అరుణ, నాగర్‌కర్నూల్- భరత్ ప్రసాద్ ఉన్నట్లు తెలుస్తోంది. -
కొత్త జిల్లాలు రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: 2014లో అనివార్యంగా ఒంటరిగా పోటీ చేశామని, అప్పుడు సంస్థాగతంగా పార్టీ గట్టిగా లేకపోయినా ప్రజలు మనల్ని దీవించారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఆయన ఆదివారం తెలంగాణ భవన్లో నిర్వహించిన జహీరాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో 119 సీట్లలో 39 సీట్లు గెలిచామని, ఇది తక్కువ సంఖ్య ఏమి కాదని మూడింట ఒకవంతు సీట్లు గెలిచాని అన్నారు. జుక్కల్ నియోజకవర్గలో హన్మంత్ షిండే ఓడిపోతారని అస్సలు ఊహించలేదని తెలిపారు. కేవలం 11 వందల ఓట్లతో ఓడిపోయారని గుర్తుచేశారు. నారాయణ్ ఖేడ్ నుంచి వచ్చిన కాంగ్రెస్ నేత జుక్కల్‌లో గెలిచారని అన్నారు. ఇలాంటి విచిత్రాలు చాలా జరిగాయని అన్నారు. దళిత బంధు నిజాంసాగర్ మండలంలో మొత్తం ఇచ్చినా మిగతా వర్గాలు మనకు ఓట్లు వేయలేదని తెలిపారు. ఒకరికి సాయం అందితే మరొకరు ఈర్ష పడేలా సమాజం తయారైందని అన్నారు. కొత్త ఒక వింత పాత ఒక రోతలా ప్రజలు భావించారని అన్నారు. కాంగ్రెస్‌కు ఓట్లు వేసిన వారు కూడా కేసీఆర్ సీఎం కానందుకు బాధ పడుతున్నారని అన్నారు. కేసీఆర్ పట్ల అభిమానం చెక్కు చెదర లేదని,గతంలో తెలంగాణ పదాన్ని నిషేధించారని అన్నారు. తెలంగాణ కోసం కడుపు చించుకుని కొట్లాడేది బీఆర్ఎస్ మాత్రమేనని తెలిపారు. బీఆర్ఎస్ బలంగా లేకపోతే మళ్ళీ తెలంగాణ పదం మాయం చేసేందుకు పార్టీలు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. నెల రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అప్రతిష్ట మూటగట్టుకుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అప్పుడే ప్రజల నుంచి నిరసన సెగలు మొదలయ్యాయని అన్నారు. అప్పుల బూచీ చూపించి హామీల నుంచి తప్పించుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. పార్లమెంటు ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరుగబోతోందని తెలిపారు. ఈ మూడు ముక్కలాటలో మనకే పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని అన్నారు. కేసీఆర్ పట్ల సానుభూతి, కాంగ్రెస్‌కు దూరమైన వర్గాలు పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయానికి బాటలు వేస్తాయని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్‌లను మార్చి ఉంటే బాగుండేదనే అభిప్రాయం బలంగా ఉందని అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో అలాంటి పొరపాట్లు జరగనివ్వమని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక తిరోగమన చర్యలకు పాల్పడుతోందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన పథకాలు రద్దు చేస్తున్నారని మండిపడ్డారు. జహీరాబాద్ పార్లమెంటు సీటును బీఆర్ఎస్ కచ్చితంగా గెలుస్తుందని అన్నారు. పార్టీ అన్నపుడు ఎత్తులు పల్లాలు తప్పవని, 2009లో పది అసెంబ్లీ సీట్లే గెలిచామని గుర్తు చేశారు. కేవలం ఆరునెలల్లోనే కేసీఆర్ దీక్షతో అపుడు పరిస్థితి మారిందన్నారు. గులాబీ జెండా అంటే గౌరవం పెరిగిందని తెలిపారు. ఇటీవల కాంగ్రెస్‌కు ఓటేసిన వాళ్ళు కూడా ఇపుడు పునారాలోచనలో పడ్డారని అన్నారు. కాంగ్రెస్ 420 హామీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి ఒత్తిడి పెంచుదామని తెలిపారు. జిల్లాల సంఖ్య తగ్గించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కమిషన్ వేస్తామంటున్నారని తెలిపారు. కొత్త జిల్లాలు రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా ? అని ప్రశ్నించారు. ప్రభుత్వం మీద విమర్శల విషయంలో బీఆర్ఎస్ తొందరపడటం లేదని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని తక్కువ చేసి చూపి అప్పుల పాలు చేశామని కాంగ్రెస్ వాళ్ళే మొదట దాడి మొదలు పెట్టారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు.. బీఆర్ఎస్ను విమర్శిస్తే వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు. చదవండి: ప్రధాని మోదీ, నీరవ్ మోదీలు బంధువులా?: మాజీ ఎంపీ వినోద్ -
మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి
జహీరాబాద్: రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజా ర్టీతో అధికారంలోకి రావడం ఖాయమని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో నిర్వహించిన రోడ్‌షోలో ఆమె పాల్గొని ప్రసంగించారు. బీఆర్ఎస్ పాలనతో విసిగిపోయిన ప్రజలు మార్పు కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఫాంహౌస్‌కే పరిమితం అయిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బైబై చెప్పాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళల కోసం చేసిందేమీ లేదని, రాష్ట్రంలో అత్యాచారాలు పెరిగిపోయాయని, యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదని, పేపర్ లీకేజీలు అయ్యాయని, రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని అన్నారు. రుణమాఫీ హామీ ఎందుకు అమలు చేయలేదని ఆమె ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని, ఈ రెండూ ధనిక పా ర్టీలని, ఈ డబ్బంతా ప్రజలదేనన్నారు. ప్రధానికి రెండు విమానాలు ప్రధాని నరేంద్రమోదీ వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి రెండు విమానాలను కొనుగోలు చేశారని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. దేశంలో రైతు రోజుకు రూ. 27 సంపాదిస్తున్నాడని, మోదీ స్నేహితుడు అదానీ మాత్రం వేల కోట్లు సంపాదించారని చెప్పారు. అయినప్పటికీ అదానీకి వేలకోట్ల రూపాయల రుణాలను ప్రధాని మాఫీ చేయించారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంట్లో అవసరం వచ్చినప్పుడు బీఆర్ఎస్ మద్దతునిస్తోందని, తెలంగాణలో బీఆర్ఎస్కు ఎంఐఎం మద్దతునిస్తోందన్నారు. రాహుల్‌పైనే ఒవైసీ విమర్శలు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కేసీఆర్, బీజేపీలను విమర్శించరని, కేవలం రాహుల్‌గాం«దీపైనే విమర్శలు చేస్తారని ప్రియాంక తెలిపారు. ఎంఐఎం దేశవ్యాప్తంగా 40 కంటే ఎక్కువ సీట్లలో పోటీ చేస్తోందని, తెలంగాణలో మాత్రం 9 స్థానాల్లోనే పోటీకి దిగిందన్నారు. బీఆర్ఎస్ను గెలిపించేందుకే ఆ పార్టీ ఇలా చేస్తోందని ఆమె విమర్శించారు. ప్రజలకోసం ఆరు గ్యారంటీలు.. తెలంగాణ ప్రజల కోసం ఆరు గ్యారంటీ పథకాలు తెచ్చామని, అధికారంలోకి రాగానే అమలు చేస్తామ ని ప్రియాంక గాంధీ అన్నారు. ధాన్యంపై ప్రతి క్వింటాలుపై రూ.500 బోనస్ ఇస్తామని, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, 24 గంటల కరెంటు సరఫరా చేస్తామని ఆమె వివరించారు. ఇందిరమ్మ ఇంటి పథకం కింద స్థలంతో పాటు రూ.5 లక్షల అందిస్తామని, రాజీవ్ ఆరోగ్యశ్రీ యోజన కింద రూ.10 లక్షలతో ఉచిత వైద్యం అందిస్తామన్నారు. వృద్ధులకు రూ.4వేల పింఛన్ అందజేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ అమరుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామన్నారు. నీతి, నిజాయి తీగల తమ పార్టీ అభ్యర్థి ఎ.చంద్రశేఖర్‌ను గెలిపించాలని కోరారు. సభలో కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రే, మాజీ ఎంపీ సురేష్ షెట్కార్, జహీరాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి ఎస్.ఉజ్వల్‌రెడ్డి, నియోజకవర్గం కో–ఆర్డినేటర్ ఎన్.గిరిధర్‌రెడ్డి పాల్గొన్నారు. -
BRS ధనిక పార్టీ.. డబ్బు ఎలా వచ్చింది: ప్రియాంక గాంధీ
సాక్షి, జహీరాబాద్: నేటితో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెర పడనుంది. ఈ క్రమంలో చివరి రోజు పార్టీల నేతలు ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఇక, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ.. జహీరాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్పై విరుచుకుపడ్డారు. ఈ సందర్బంగా ప్రియాంక మాట్లాడుతూ.. పదేళ్లలో బీఆర్ఎస్ ఏంచేసింది. ప్రశ్నాపత్నాలు లీక్ అయ్యాయి. ధరణితో రైతుల కష్టాలు పెరిగాయి. రుణమాఫీ పూర్తి కాలేదు. ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ నెరవేర్చలేదు. అధిక ధరలు సామాన్యుడికి భారంగా మారాయి. బైబై కేసీఆర్.. మార్పు రావాలి. తెలంగాణలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. ప్రాజెక్ట్‌ల నిర్మాణంలో బీఆర్ఎస్ అవినీతి చేసింది. బీఆర్ఎస్ అత్యంత ధనిక పార్టీ. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. కర్ణాటకలో మహిళల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాం.. ఇక్కడ కూడా అమలు చేస్తాం’ అని అన్నారు. -
రైతుబంధు నిలిపివేతపై మంత్రి హరీశ్ కామెంట్స్..
సాక్షి, జహీరాబాద్: ఎన్నికల వేళ ఎలక్షన్ కమిషన్ రైతుబంధు నిలిపివేయడంపై మంత్రి హరీశ్ రావు స్పందించారు. రైతుబంధు ఇవ్వవద్దని కాంగ్రెస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. రైతుబంధును ఎన్ని రోజులు ఆపుతారని ప్రశ్నించారు. వచ్చే నెల మూడో తేదీ తర్వాత మళ్లీ గెలిచేది మేమే.. అప్పుడ రైతుబంధు ఇస్తామని స్పష్టం చేశారు. కాగా, మంత్రి హరీశ్ రావు జహీరాబాద్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ.. ‘తెలంగాణ రైతులతో పేగుబంధం మాది. కాంగ్రెస్ పార్టీ రైతుల నోటికాడ బుక్కను లాక్కుంది. రైతుబంధు ఇవ్వవద్దని కాంగ్రెస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. నేను మీటింగ్‌లో న్యాయం గెలిచిందని.. రైతుబంధుకు ఈసీ క్లియరెన్స్ ఇచ్చిందని అన్నాను. రైతుబంధును ఆపిన కాంగ్రెస్‌కు ఓటుతోనే పోటు పొడవాలి. రైతుబంధు రావాలంటే కాంగ్రెస్ ఖతమ్ కావాలి. రైతుబంధును ఎన్ని రోజులు ఆపుతారు. వచ్చే నెల మూడో తేదీ తర్వాత మళ్లీ గెలిచేది మేమే.. అప్పుడ రైతుబంధు ఇస్తాం. ఎకరాకు రైతుబంధు కాదు.. ఒక్కో రైతుకు 15వేలు ఇస్తామని కాంగ్రెస్ చెబుతోంది. ఓట్ల కోసం రైతుబంధు తీసుకురాలేదు. కేసీఆర్ వస్తే పెన్షన్ రూ.5వేలు ఇస్తాం. సౌభాగ్యలక్ష్మి పేరుతో మహిళలకు నెలకు రూ.3వేలు ఇస్తాం. పేదలకు రూ.400లకే గ్యాస్ సిలిండర్ ఇస్తాం. రేషన్‌కార్డు ఉన్న వారికి సన్న బియ్యం ఇస్తాం. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఝురాసంఘంలో ఆరువేల డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇస్తాం’ అని తెలిపారు. -
కాంగ్రెస్ రనౌట్ కావడం ఖాయం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/ మంచిర్యాల: కాంగ్రెస్ పార్టీ పరిస్థితి క్రికెట్లో వెస్టిండీస్ టీం మాదిరిగా తయారైందని.. ఒకప్పుడు వరల్డ్‌కప్ గెలిచిన ఆ టీం ఇప్పుడు ఇదే వరల్డ్‌కప్‌కు క్వాలిఫై కూడా కాలేదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. అలాగే ఒకప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు కనీసం ప్రతిపక్ష పార్టీ హోదాకు కూడా క్వాలిఫై కాలేదన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ రనౌట్ కావడం ఖాయమని.. బీజేపీ డకౌట్ అవుతుందని, ముఖ్యమంత్రి కేసీఆర్ సెంచరీ కొడతారని ధీమా వ్యక్తం చేశారు. శనివారం సంగారెడ్డి, మంచిర్యాల జిల్లాల్లో హరీశ్‌రావు పర్యటించారు. ఝరాసంగం మండలంలోని కేతకీ సంగమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. జహీరాబాద్‌లో డబుల్ బెడ్రూం ఇళ్ల లబి్ధదారులకు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జహీరాబాద్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో హరీశ్‌రావు ప్రసంగించారు. రాష్ట్రంలో 30 స్థానాల్లో కాంగ్రెస్‌కు అభ్యర్థులు లేకుండా పోయారని ఎద్దేవా చేశారు. ఫేక్ సర్వేలతో కాంగ్రెస్ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తోందన్నారు. అధికారంలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో కనీసం తాగునీటిని కూడా సరిగ్గా సరఫరా చేయలేని కాంగ్రెస్.. తెలంగాణలో అధికారం కోసం అమలుకు వీలు కాని హామీలను ఇస్తోందని హరీశ్‌రావు విమర్శించారు. హంగ్ కాదు.. హ్యాట్రిక్... బీజేపీ తీరును కూడా మంత్రి హరీశ్ తూర్పారబట్టారు. రాష్ట్రంలో హంగ్ ఫలితాలు వస్తాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని, తెలంగాణలో హంగ్ రాదని, ముఖ్యమంత్రి కేసీఆర్ హ్యాట్రిక్ విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. తన సొంత రాష్ట్రం హిమాచల్‌ప్రదేశ్‌లో గెలువలేని జేపీ నడ్డా.. తెలంగాణలో బీజేపీని ఎలా గెలిపిస్తారని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, కలెక్టర్ శరత్ తదితరులు పాల్గొన్నారు. ‘కాళేశ్వరం’ముంపునకు శాశ్వత పరిష్కారం కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలకు శాశ్వత పరిష్కారం చూపుతామని హరీశ్‌రావు హామీనిచ్చారు. మంచిర్యాల, చెన్నూరు నియోజకవర్గాల్లో ప్రాణహిత, గోదావరి వరదలతో నష్టపోకుండా సర్వే చేయిస్తామని చెప్పారు. వరద ముంపు సమస్యపై స్పందించిన మంత్రి హరీశ్‌రావుకు బాల్క సుమన్ వేదికపైనే పాదాభివందనం చేశారు. మంత్రి పర్యటనలో ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, నడిపల్లి దివాకర్‌రావు, ఎంపీ వెంకటేశ్ నేత పాల్గొన్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోతో ప్రతిపక్షాలకు మైండ్ బ్లాక్ అవుతుంది కాంగ్రెస్ గురించి రేవంత్‌రెడ్డికి ఏం తెలుసని హరీశ్‌రావు అన్నారు. టీడీపీలో ఉండి సోనియాగాం«దీని బలి దేవత అన్నాడని, ఇప్పుడు దేవత అని పొగుడుతున్నాడని విమర్శించారు. నాటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పుల గుర్తుతో పార్టీ పెట్టీ బీజేపీలో చేరారని, నాటి పీసీసీ అధ్యక్షుడు బొత్స వైసీపీలో చేరారని, నువ్వు ఏబీవీపీ, టీఆర్ఎస్, తెలుగుదేశం, ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరావని, రేపు ఏ పార్టీలోకి వెళ్తావని రేవంత్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. శనివారం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గోదావరిపై నిర్మిస్తున్న పడ్తనపల్లి ఎత్తిపోతల పథకం, 33/11కేవీ సబ్‌స్టేషన్, చెన్నూరు పట్టణంలో 50 పడకల ఆసుపత్రి ప్రారంభం, దోభిఘాట్‌కు శంకుస్థాపన, సుద్దాల వంతెనను మంత్రి ప్రారంభించారు. దోనబండ సభ, చెన్నూరు పట్టణంలో రోడ్ షోలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని, ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. త్వరలో సీఎం కేసీఆర్ ప్రకటించే మేనిఫెస్టోతో ప్రతిపక్షాల మైండ్‌బ్లాక్ అవుతుందన్నారు. మంచిర్యాల, చెన్నూరు ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, బాల్క సుమన్‌ను భారీ మెజారీ్టతో గెలిపించాలన్నారు. -
పోటీకి రెడీ.. నియోజకవర్గం ఏది!
వికారాబాద్: మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ వచ్చే ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే విషయంలో ఇంకా సందిగ్ధత వీడడం లేదు. ఆయన నేటికీ ఈ విషయంలో డోలాయమానంలోనే ఉన్నారు. అనేక పార్టీలు మారిన ఆయన చివరకు బీజేపీని వీడి మళ్లీ హస్తం గూటికి చేరిన విషయం విదితమే. ఆయన కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం మొదలైననాటి నుంచి పోటీ చేసే స్థానం విషయంలోనూ ఎన్నో ప్రచారాలు కొనసాగుతున్నాయి. వికారాబాద్ వాస్తవ్యుడైన ఆయన నాలుగుసార్లు ఎమ్మెల్యేగా.. మంత్రిగా ఓ వెలుగు వెలిగారు. కాంగ్రెస్ నుంచి మరో మాజీ మంత్రి బలమైన నాయకుడు గడ్డం ప్రసాద్ కుమార్ ఉండడంతో ఏసీఆర్ నియోజకవర్గం వీడడం అనివార్యమైంది. ఆయన జహీరాబాద్ లేదా చేవెళ్ల నుంచి బరిలో ఉంటారనే ప్రచారం సాగుతోంది. పరిచయాలు ఇక్కడ.. ప్రాంతం అక్కడ కాంగ్రెస్‌లో చేరింది మొదలు ఏసీఆర్ పోటీ చేసే నియోజకవర్గం విషయంలో స్పష్టత ఇవ్వడంలేదు. దీంతో ఆయన అనుచరగనం, అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఆయన పార్టీలో చేరిన తొలినాళ్లలో చేవెళ్ల నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. ఆయన తన సన్నిహితులతోనూ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. పార్టీలో చేరిన కొద్ది రోజులకే ఆయన తల్లిదండ్రులు, తాత ముత్తాతల సొంత నియోజకవర్గం జహీరాబాద్ నుంచి పోటీ చేస్తారనే ప్రచారమూ సాగింది. ఇప్పటికే ఆయన అక్కడ పలుమార్లు పర్యటించారు. కాగా ఏ నియోజకవర్గంలో గెలుపు సునాయాసమనేది తేల్చుకోలేక పోతున్నారు. జహీరాబాద్ సొంత నియోజకవర్గమైనప్పటికీ అక్కడ పెద్దగా పరిచయాలు లేవు. ఆయన రాజకీయ ప్రస్థానం మొత్తం వికారాబాద్ నియోజకవర్గంలోనే సాగింది. దీంతో ఆయన పునరాలోచనలో పడి చేవెళ్ల నుంచే పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారని.. తాజాగా పార్టీ పెద్దలతోనూ చర్చించినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. గతంలో వికారాబాద్ నియోజకవర్గంలో ఉన్న నవాబుపేట మండలం ఇప్పుడు చేవెళ్ల నియోజకవర్గంలో ఉండడం, నవాబుపేట యాదయ్య సొంత మండలమైనా మిగతా మండలాలతో పోలిస్తే ఓటింగ్ సరళి వ్యతిరేకంగా ఉంటూ రావడం.. నవాబుపేట మండలంపై ఏసీఆర్‌కు పూర్తిగా పట్టుండడంతో.. చేవెళ్ల నియోజకవర్గంలోనూ పరిచయాలుండడంతో ఆయనకు చేవెళ్ల నుంచి పోటీ చేస్తేనే గెలుపు అవకాశాలుంటాయని సర్వేలు చెబుతున్నట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్లో ఉన్న రత్నం, ఆయన వర్గం నేతలు యాదయ్యతో అంటీముట్టనట్టు ఉండడం తదితర కారణాల నేపథ్యంలో ఏసీఆర్ తాజాగా చేవెళ్ల నుంచే బరిలో ఉండాలని నిర్ణయించుకుంటున్నట్లు తెలుస్తోంది. పార్టీలు మారినా దక్కని ఫలితం మూడున్నర దశాబ్దాల క్రితం ఎన్టీఆర్ హయాంలో వికారాబాద్ నుంచి రాజకీయ ప్రవేశం చేసిన ఏసీఆర్ మళ్లీ తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన ఆయన 2008 వైఎస్ హయాంలో జరిగిన ఉప ఎన్నికలో ప్రసాద్‌కుమార్ చేతిలో ఓటమి చవిచూశారు. తరువాత 15 ఏళ్ల పాటు ఆయన ప్రతీ ఎన్నికలో ఓటమి తప్పలేదు. దీంతో ఆయన ఒక్క గెలుపు కోసం పరితపిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్ని పార్టీలు మారినా గెలుపును అందుకోలేకపోయారు. బీజేపీలోనూ గెలుపు సాధ్యం కాదని భావించి ఇటీవల కాంగ్రెస్ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మళీ ఏదో ఒక నియోజకవర్గం నుంచి గెలుపొంది ఫామ్‌లోకి రావాలని చూస్తున్నారు. -
జహీరాబాద్: కాంగ్రెస్ కంచుకోటలో విచిత్ర పరిస్థితి
ఉమ్మడి మెదక్ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గం జహీరాబాద్. ప్రస్తుతం ఇది సంగారెడ్డి జిల్లా పరిధిలోకి వస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ముందు వరకు ఇది కాంగ్రెస్ కంచుకోటగా ఉండేది. సీనియర్ మహిళ నేత గీతారెడ్డి ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహించారు. ఇక రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లోనూ గీతారెడ్డి గెలిచారు. కానీ ముందస్తు ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ ఓటమిపాలైంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్ రావ్ గెలుపుపొందారు. బీఆర్ఎస్కి భారీ వలసలు.. నేతల మధ్య కుమ్ములాట! 2014 ఎన్నికల తర్వాత నియోజకవర్గంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కాంగ్రెస్ నేతలు వరసగా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ఘనవిజయం సాధించింది. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు రాబోతుండటంతో.. అధికార బీఆర్ఎస్ టికెట్ కోసం ప్రధానంగా నలుగురు నేతలు పోటీ ఉన్నప్పటికి ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేనే టికెట్ వరించింది. గీతారెడ్డి సైలెంట్ వెనక వ్యూహాం? మరోవైపు కంచుకోట కాంగ్రెస్‌లో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ నుంచి వరసగా బీఆర్ఎస్లోకి వలసలు పెరుగుతున్న సీనియర్ నేత గీతా రెడ్డి పట్టనట్టు వ్యవహరిస్తున్నారట. అంతేకాదు ఈమె పార్టీని కూడా పెద్ద పట్టించుకోవడం లేదని సొంత పార్టీలోనే వాదనలు వినిపిస్తున్నాయి. రీసెంట్గా నరోత్తం లాంటి సీనియర్ నేతే పార్టీ వీడిన ఆమె సైలెంట్‌గానే ఉన్నారు. భారీగా వలసలు పెరుగుతున్న ఆమె సైలెంట్‌గా ఉండటంపై మిగతా లీడర్లు సర్ప్రైజ్ అవుతున్నారు. ఆమె తీరు పార్టీ నేతలకు కూడా అంతుపట్టడం లేదు. గీతారెడ్డి సైలెంట్ వెనుక ఏదైనా వ్యూహం ఉందా? కావాలనే ఇలా ఉంటున్నారా? అనే సందేహాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో ఆమె జహీరాబాద్ నుండి కాకుండా కంటోన్మెంట్ నుండి పోటీ చేయాలని చూస్తుందనే వార్త తెరపైకి వచ్చింది. అందుకే గీతారెడ్డి ఇక్కడ దృష్టి సారించడం లేదనే ఈ ప్రచారం తెరమీదకు వచ్చింది. దాంతో పక్క జిల్లాలు, పక్క నియోజకవర్గ నేతలు జహీరాబాద్ నియోజకవర్గంపై దృష్టి సారిస్తున్నారట. జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ఫుల్ క్యాడర్ ఉన్న వారిని పట్టించుకునే లీడర్ లేకపోవడం అనేది విచిత్ర పరిస్థితే అని చెప్పాలి. ఎన్నికలను ప్రభావితం చేసే అత్యంత కీలక అంశాలు: నిరుద్యోగ సమస్య యువతకు ఉపాధి NIMZ రైతుల సమస్య చెరుకు రైతుల సమస్య రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు డిమాండ్. మంజూరైన ఐ టి ఐ కళాశాల, మహిళా డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని ప్రధాన డిమాండ్. ప్రధాన పార్టీల టికెట్ల కోసం పోటీ పడుతున్న అభ్యర్థులు బీఆర్ఎస్: కే మానిక్ రావు (సిట్టింగ్ ఎమ్మెల్యే) కాంగ్రెస్ పార్టీ: మాజీ మంత్రి జే గీతారెడ్డికే టికెట్ ఖాయమని భావిస్తున్నా, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు బి నరేష్, కండేమ్ నర్సింహులు, మాజీ సర్పంచ్ గోపాల్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. బీజేపీ రాంచంద్ర రాజనర్సింహ, చింతల గట్టు సుధీర్ కుమార్ లు టికెట్ రేస్ లో ఉన్నారు. వృత్తిపరంగా ఓటర్లు.. నియోజకవర్గంలో ప్రధానంగా వ్యవసాయ రంగంలో, వ్యాపార రంగంలో ప్రజలు అధికంగా ఆధార పడి ఉన్నారు. వ్యాపార పరంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో జహీరాబాద్ రెండో స్థానంలో ఉంది. మతం/కులం పరంగా ఓటర్లు? ఓటర్ల పరంగా చూస్తే 35 శాతం ఉన్న ముస్లింలు రాజకీయంగా నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు కులాల పరంగా SC- మాదిగ, లింగాయత్‌లు గణనీయ సంఖ్యలో ఉన్నారు. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు నదులు : నియోజకవర్గంలో నారింజ వాగు, పెద్ద వాగు, వీరన్న వాగు లు ఉన్నాయి. ఆలయాలు: దక్షిణ కాశీగా పేరు గాంచిన జరాసంగం మండల కేంద్రంలోని శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయం, స్వయంభూగా వెలిసిన రేజీంతల్ శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయం. నియోజకవర్గం గురించి ఆసక్తికర అంశాలు : ఇప్పటి వరకు ఎన్నికలు 15 సార్లు జరగగా వాటిలో ఏకంగా 13 సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. కేవలం రెండు సార్లు మాత్రమే నాన్ కాంగ్రెసు పక్షమైన టిడిపి, టి ఆర్ ఎస్ లు చెరో సారి గెలుపొందాయీ. 7 సార్లు వరుసగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్. బాగా రెడ్డి ఇక్కడి నుండే ప్రాతినిద్యం వహించారు. రాజకీయాకపరమైన అంశాలు : కాంగ్రెసేతర పక్షాలు పెద్ద మెజారిటీ తో గెలుపొంది నా అనంతరం జరిగిన ఎన్నికల్లో ఆ పట్టును నిలుపుకో లేదు. కాంగ్రెసు పార్టీ కి వ్యతిరేకంగా నిలబడ్డ రాజకీయ పక్షాలలో ఐక్యత లేకపోవడం, కాంగ్రెసు పార్టీ తన పట్టును కొనసాగించడానికి ముఖ్య కారణం. -
జహీరాబాద్ (ఎస్సి) నియోజకవర్గం చరిత్ర ఇదే...
జహీరాబాద్ (ఎస్సి) నియోజకవర్గం జహీరాబాద్ రిజర్వుడ్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్దిగా పోటీచేసిన మాణిక్యరావు మొదటి సారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయన తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ధి, మాజీ మంత్రి జె.గీతారెడ్డిని 37773 ఓట్ల ఆదిక్యతతో ఓడిరచారు. 2014లో స్వల్ప మెజార్టీతో గెలిచిన గీతారెడ్డి 2018లో భారీ తేడాతో ఓటమి చెందారు. ఆమె జహీరాబాద్ నుంచి రెండుసార్లు, గజ్వేల్ నుంచి రెండుసార్లు అసెంబ్లీకి ఎన్నికై మంత్రి పదవులు నిర్వహించారు. మాణిక్యరావుకు 96598 ఓట్లు రాగా, గీతారెడ్డికి 62125 ఓట్లు వచ్చాయి. బిజెపి అభ్యర్ధిగా పోటీచేసిన జంగం గోపీకి 19 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి, వై.ఎస్.రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల క్యాబినెట్ లలో మంత్రిగా గీతారెడ్డి పనిచేశారు. జహీరాబాద్ జనరల్ నియోజకవర్గంగా ఉన్నప్పుడు ఎనిమిది సార్లు రెడ్లు గెలవగా, ఒకసారి బిసి(ముదిరాజ్) వర్గానికి చెందిన నేత గెలుపొందారు. రెండుసార్లు ముస్లింలు గెలిచారు. గీతారెడ్డి ప్రముఖ మహిళానేత, రిపబ్లికన్ పార్టీ నాయకురాలు. జె. ఈశ్వరీబాయి కుమార్తె. జహీరాబాద్‌లో అత్యధికసార్లు గెలిచిన ఘనత మాజీ మంత్రి, మాజీ ఎమ్.పి. ఎమ్.బాగారెడ్డికి దక్కింది. ఆయన 1957 నుంచి వరుసగా ఏడుసార్లు 1985 వరకు గెలిచారు. బాగారెడ్డి 1989 నుంచి 1998 వరకు నాలుగుసార్లు మెదక్ నుంచి లోక్‌సభకు గెలిచారు. బాగారెడ్డి గతంలో చెన్నా, అంజయ్య, భవనం, కోట్ల మంత్రివర్గాలలో పనిచేశారు. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు కొంతకాలం ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఉన్నారు. జహీరాబాద్‌లో రెండుసార్లు గెలిచిన ఫరీదుద్దీన్ 2004లో డాక్టర్ వై.ఎస్ రాజశేఖరరెడ్డి క్యాబినెట్లో సభ్యునిగా ఉన్నారు. 2009లో ఈ స్థానం రిజర్వుడ్ కావడంతో హైదరాబాద్ నగరంలోని అంబర్‌పేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. జహీరాబాద్ (ఎస్సి) నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
50 రకాల విత్తనాలను ప్రదర్శించిన మహిళలు
-
జహీరాబాద్ లో టమోటాలు చోరీ
-
తెలంగాణలో టమాటాలు చోరీ.. తెల్లారేసరికి బాక్స్‌లు మాయం
సాక్షి, జహీరాబాద్: దేశవ్యాప్తంగా టమాటాలకు ఎంతో డిమాండ్ ఉందో తెలిసిందే. కొన్ని కిలో టమాటాల ధర ఏకంగా రూ.200లకు పైనే పలికింది. ఈ క్రమంలో కొందరు టమాట రైతులు కోట్ల రూపాయలు సంపాదించారు. ఇక, టమాటకు భారీ ధర పలుకుతున్న నేపథ్యంలో తెలంగాణలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అమ్ముకుందామని కూరగాయల మార్కెట్‌కు తెచ్చిన టమాటాలను దొంగలు ఎత్తుకెళ్లడంతో ఓ రైతు పోలీసులను ఆశ్రయించాడు. వివరాల ప్రకారం.. ఉమ్మడి మెదక్ జిల్లాలో జహీరాబాద్‌కు చెందిన ఓ రైతు టమాటాలు అమ్మడానికి పట్టణంలో కూరగాయల మార్కెట్‌కు తాను పండించిన టమాటాలను తీసుకువచ్చాడు. కాగా, శుక్రవారం రాత్రి టమాటా ట్రేలను దుకాణంలో ఉంచి ఇంటికి వెళ్లాడు. అయితే, శనివారం తెల్లవారుజామునే వచ్చి చూసేసరికి రూ.6,500 విలువైన మూడు టమాటా ట్రేలు కనిపించలేదు. అవి దొంగతనానికి గురయ్యయాయని గుర్తించిన రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా హెల్మెట్ పెట్టుకున్న ఓ వ్యక్తి టమాటా ట్రేలను ఎత్తుకెళ్తు గుర్తించారు. ఇక, అతడి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. దేశవ్యాప్తంగా పలు చోట్ల టమాటాలు చోరీకి గురైన ఘటనలు చాలానే జరిగాయి. ఇటీవలే.. మహారాష్ట్రలోని పుణెలో అరుణ్ ధామ్ తన పొలంలో పండిన 400 కిలోల టమాటాలను పెట్టెల్లో సర్ది వాటిని రాత్రి ఒక వాహనంలో ఉంచి ఇంటి ముందు పార్క్ చేశాడు. ఉదయం వాహనాన్ని మార్కెట్‌కు తీసుకెళ్దామని చూడగా టమాటాలున్న బాక్స్‌లన్నీ చోరీ అయ్యాయి. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక, తమిళనాడులో కూడా విలువైన టమాటాలు చోరీకి గురయ్యాయి. ఇది కూడా చదవండి: 5 కోట్లు గెలిచి 58 కోట్లు పోగొట్టుకున్న అభాగ్యుడు.. -
మిల్లెట్ మ్యాన్ పీవీ సతీష్ ఇకలేరు..
హైదరాబాద్: మిల్లెట్ మ్యాన్ పీవీ సతీష్(77) తుదిశ్వాస విడిచారు. కొన్ని సంవత్సరాలుగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న పీవీ సతీష్.. చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. కాగా, సేంద్రీయ వ్యవసాయం, చిరుధాన్యాల సాగు కోసం 4 దశాబ్దాలుగా కృషి చేసినందుకు గానూ ఈయనను మిల్లెట్ మ్యాన్‌గా పిలుస్తారు. అయితే, 1945 జూన్ 18న కర్ణాటకలో జన్మించిన పీవీ సతీష్.. ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లోని దూరదర్శన్‌లో డైరెక్టర్‌గా పని చేశారు. అనంతరం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కేంద్రంగా దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ స్థాపించారు. జహీరాబాద్ ప్రాంతంలో దళిత మహిళా సాధికారతకు పీవీ సతీశ్ కుమార్ విశేషంగా కృషి చేశారు. అలాగే, వాతావరణ మార్పుల నేపథ్యంలో రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులకు ప్రత్యామ్నాయంగా.. సహజ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తూ పెద్ద ఎత్తున రైతుల్లో అవగాహన కల్పించారు. అంతేకాకుండా.. హైదరాబాద్-ముంబై జాతీయ రహదారిపై తొలి మిల్లెట్స్ కేఫ్ ఏర్పాటుకు తన వంతు కృషి చేశారు. 30 సంవత్సరాల కిందట మొదటిసారిగా ప్రపంచవ్యాప్త చర్చలో.. చిరుధాన్యాలను ప్రవేశపెట్టడంలో సఫలీకృతమయ్యారు.సేంద్రీయ వ్యవసాయం, చిరుధాన్యాల సాగు కోసం 4 దశాబ్దాలుగా కృషి చేశారు. ప్రత్యేకించి చిన్న కమతాల్లో పెట్టుబడి లేకుండా.. చిరుధాన్యాల పంటల సాగు, విస్తీర్ణం, వినియోగం పెంపు కోసం కృషి చేశారు. ప్రభుత్వ పంపిణీ వ్యవస్థలో చిరుధాన్యాలను చేర్చడంలో.. 2018 సంవత్సరాన్ని కేంద్రం జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. వీరి కృషికి అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు లభించాయి. ఇక, సతీష్ మృతిపట్ల ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన అంత్యక్రియలు సోమవారం జహీరాబాద్‌లో జరుగనున్నాయి. -
బీఆర్ఎస్ ఎంపీకి హైకోర్టులో చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. తన ఎన్నిక చెల్లదని ఆదేశాలివ్వాలంటూ కాంగ్రెస్ నేత మదన్మోహన్రావు వేసిన పిటిషన్‌ను కొట్టివేయాలని పాటిల్ హైకోర్టులో ఇంటర్లోక్యుటరీ అప్లికేషన్(ఐఏ) దాఖలు చేశారు. వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం పాటిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. మెయిన్ పిటిషన్(మదన్మోహన్ దాఖలు చేసిన)లో రోజూవారీగా వాదనలు వింటామని పేర్కొంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి బీబీ పాటిల్ కాంగ్రెస్ అభ్యర్థి మదన్‌మోహన్‌రావుపై 6 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే జార్ఖండ్‌లో పాటిల్‌పై ఓ క్రిమినల్ కేసు నమోదైందని, ఆ వివరాలను ఎన్నికల అఫిడవిట్లో పేర్కొలేదని, ఆయన ఎన్నికను రద్దు చేయాలని మదన్మోహన్రావు హైకోర్టులో ఎలక్షన్ పిటిషన్ వేశారు. వాదనలు విన్న సింగిల్ జడ్జి 2022 జూన్‌లో ఆ పిటిషన్‌ను కొట్టివేశారు. అయితే దీన్ని మదన్మోహన్రావు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. తెలంగాణ హైకోర్టు జూన్ 15న మౌఖిక తీర్పు ఇచ్చిందని, 3 నెలలైనా తీర్పు ప్రతిని బహిర్గతం చేయలేదని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. తీర్పు ప్రతులు ఇవ్వకపోవడం సరికాదని, తీర్పు ఉత్తర్వులు లేకుండా తాము వాదనలు వినలేమని, ఆరు నెలల్లోపు వేగవంతంగా కేసును పరిశీలించి తీర్పు ఇవ్వాలని హైకోర్టుకు సూచించింది. దీంతో విచారణను సీజే ధర్మాసనం చేపట్టింది. -
ఆదాయం.. ఆరోగ్యం మహిళల ‘చిరు’ యత్నం.. ఫలిస్తున్న పాత పంటల సాగు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: సామలు.. కొర్రలు.. అరికెలు.. ఊదలు.. జొన్నలు.. ఇలా పలు పాత పంటలు సేంద్రియ పద్ధతిలో సాగు చేయడమే కాకుండా వాటిని వినియోగిస్తూ తమతో పాటు తమ కుటుంబసభ్యుల ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు ఆ మహిళా రైతులు. అంతేకాదు వారి అవసరాలు పోను మిగతా ధాన్యాన్ని మంచి ధరకు అమ్ముకుంటూ లాభాలు ఆర్జించడంతో పాటు ఇతరులకు ఆరోగ్యాన్ని పంచుతున్నారు. చాలా ప్రాంతాల్లో ఈ పాత పంటల సాగు దాదాపు కనుమరుగైందనే చెప్పాలి. అయితే ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఇటీవలి కాలంలో చాలామంది తృణ ధాన్యాల వైపు మొగ్గు చూపుతుండటంతో.. కొద్ది సంవత్సరాలుగా కొన్ని ప్రాంతాల్లో మళ్లీ వీటి సాగు మొదలైంది. అయితే సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంత రైతులు మాత్రం ఏళ్ల తరబడి తృణ ధాన్యాల సాగును కొనసాగిస్తుండటం గమనార్హం. ఒక సంఘం..3 వేలమంది సభ్యులు జహీరాబాద్ ప్రాంతంలో సరైన సాగునీటి సౌకర్యం లేదు. వరుణుడు కరుణిస్తేనే పంటలు చేతికందుతాయి. ఈ ఎర్ర నేలల్లో ప్రస్తుతం సుమారు తొమ్మిది వేల ఎకరాల్లో చిన్న సన్నకారు రైతులు చిరుధాన్యాలను సాగు చేస్తున్నారు. అందరూ కలిసి ఒక సంఘంగా ఏర్పడి ఈ పంటలను పండిస్తున్నారు. డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ (డీడీఎస్) అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన గ్రూపుల్లో సుమారు మూడు వేల మంది మహిళా రైతులు సభ్యులుగా ఉన్నారు. ఒక్క కరోనా మరణం లేదు చిరుధాన్యాలను సాగు చేయడం ద్వారా రూ.లక్షల్లో లాభాలను గడించకపోయినప్పటికీ.. నిత్యం వాటినే వినియోగిస్తుండడంతో ఆ రైతులు ఆరోగ్యంగా ఉంటున్నారు. కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని పొట్టనబెట్టుకుంది. కానీ ఈ చిరుధాన్యాలు వినియోగించిన రైతు కుటుంబంలో ఒక్క కరోనా మరణం కూడా జరగలేదని డీడీఎస్ ప్రతినిధులు పేర్కొంటున్నారు. మూడు వేవ్‌ల్లో అసలు ఈ మహమ్మారి బారిన పడిన రైతులే చాలా తక్కువని చెబుతున్నారు. రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు, ఇతరత్రా వ్యాధుల బారిన పడిన వారి సంఖ్య కూడా తక్కువేనని అంటున్నారు. కొనసాగుతున్న జాతర చిరుధాన్యాల ఆవశ్యకత.. పౌష్టికాహార భద్రత.. సేంద్రియ వ్యవసాయం ప్రాధాన్యతపై రైతుల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా గత 23 ఏళ్లుగా పాత పంటల జాతర జహీరాబాద్ ప్రాంతంలో కొనసాగుతోంది. సంక్రాంతి నుంచి మొదలుపెట్టి కనీసం రోజుకో గ్రామం చొప్పున నెల రోజుల పాటు సుమారు 40 గ్రామాల్లో ఈ జాతర సాగుతుంది. సుమారు 80 రకాల చిరుధాన్యాలను ఎడ్ల బండ్లపై ఆయా గ్రామాలకు తీసుకెళ్లి వాటి సాగు ప్రాధాన్యతను రైతులకు వివరిస్తూ ఆయా పంటల సాగును ప్రోత్సహిస్తుంటారు. డీడీఎస్ ఆధ్వర్యంలో జాతర కోసం ఏర్పాటైన ప్రత్యేక బృందం.. రసాయనాలు లేకుండా విత్తనాలు భధ్ర పరుచుకోవడం, సేంద్రియ ఎరువుల తయారీ, భూసార పరీక్షల కోసం మట్టి నమూనాల సేకరణ వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పిస్తుండటం విశేషం. జహీరాబాద్ కేంద్రంగా ఈ సంస్థ 35 గ్రామాల్లో రైతులను ప్రోత్సహిస్తోంది. జహీరాబాద్, మొగుడంపల్లి, ఝరాసంగం, న్యాల్కల్ తదితర మండలాల రైతులకు తృణధాన్యాల సాగుపై అవగాహన కల్పిస్తోంది. పండిన పంటలు రైతులు వినియోగించేలా వారిని చైతన్యం చేస్తోంది. మిగిలిన పంటలను మార్కెట్ ధర కంటే సుమారు పది శాతం ఎక్కువ ధరకు రైతుల వద్ద డీడీఎస్ కొనుగోలు చేస్తోంది. మేం పండించిన సాయి జొన్నలనే తింటున్నం.. నాకు ఏడు ఎకరాలు ఉంది. టమాటా, మిర్చి వంటి కూరగాయల పంటలకు భూమి అనుకూలంగా ఉన్నప్పటికీ.. చిరుధాన్యాలను సాగు చేయాలనే ఉద్దేశంతో రెండు ఎకరాల్లో సాయి జొన్న పండిస్తున్న. కూరగాయల పంటలతో పాటు శనగలు, కందులు కూడా సాగు చేస్తున్నా. చిరుధాన్యాలు ఆరోగ్యానికి మంచివనే ఉద్దేశంతో మేం పండించిన సాయి జొన్నలనే ఎక్కువగా తింటాం. ఇవి తింటేనే మాకు ఆరోగ్యంగా అనిపిస్తుంది. – గార్లపాటి నర్సింహులు, బర్దిపూర్, సంగారెడ్డి జిల్లా ఐదు ఎకరాల్లో 20 రకాల పంటలు మాకు ఐదు ఎకరాలుంది. వర్షం పడితేనే పంట పండుతుంది. నీటి సౌకర్యం లేదు. తొగర్లు, జొన్నలు, సామలు, కొర్రలు.. ఇట్లా 20 రకాల పంటలు వేస్తున్నాం. విత్తనాలు మావే.. కొనే అవసరం లేదు. మేమే సేంద్రియ ఎరువులను తయారు చేసుకుంటున్నాం. దీంతో పెట్టుబడి వ్యయం చాలా తక్కువగా ఉంటోంది. – పర్మన్గారి నర్సమ్మ, మెటల్‌కుంట, సంగారెడ్డి జిల్లా ఎంతో ఆరోగ్యంతో ఉంటున్నారు.. నెల రోజుల పాటు జరిగే పాతపంటల జాతరలో రైతులకు చిరుధాన్యాల సాగు ఆవశ్యకతను వివరిస్తున్నాం. వివిధ రకాల పంటలు సాగు చేయడం ద్వారా వాతావరణం అనుకూలించక ఒక పంట నష్టపోయినా.. మరో పంట చేతికందుతుంది. ఈ చిరుధాన్యాలను పండించడంతో పాటు వాటిని వినియోగిస్తే వచ్చే ఆరోగ్యపరమైన ప్రయోజనాలపై మహిళా రైతులను చైతన్యం చేస్తున్నాం. చిరు ధాన్యాలను వినియోగిస్తున్న రైతులు, వారి కుటుంబాల వారు ఎంతో ఆరోగ్యంగా ఉంటున్నారు. – బూచనెల్లి చుక్కమ్మ, జాతర కోఆర్డినేటర్ -
అర్థరాత్రి షాకింగ్ ఘటన.. దంపతులపై దాడి.. మహిళను కారు ఎక్కాలంటూ..
జహీరాబాద్(సంగారెడ్డి జిల్లా): అర్ధరాత్రి దంపతులు బస్సుదిగి నడుచుకుంటూ వెళుతున్న క్రమంలో యువకులు దాడి చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఆదివారం రాత్రి పట్టణంలోని శాంతినగర్ కాలనీకి చెందిన దంపతులు అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో బస్టాండ్‌లో బస్సుదిగి కాలినడకన తమ ఇంటికి వెళుతున్నాడు. ఈ క్రమంలో యువకులు వారిని అనుకరిస్తూ బ్లాక్రోడ్డులో అటకాయించారు. కారులో ఎక్కాలంటూ మహిళపై దాడి చేయగా, ఆమె కేకలు వేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. యువకులు తాగిన మైకంలో వారిని అటకాయించినట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఎస్ఐ శ్రీకాంత్‌ను వివరణ కోరగా దంపతులపై జరిగిన జరిగిన దాడిపై ఫిర్యాదు అందిందని, దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో నిందితులను అరెస్ట్‌చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. చదవండి: ఇలా కూడా పగ తీర్చుకోవచ్చా..! -
‘బీబీ పాటిల్ ఎన్నిక’ పిటిషన్ పునఃవిచారించండి
సాక్షి, న్యూఢిల్లీ: 2019 లోక్‌సభ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీగా బీబీ పాటిల్ గెలుపును సవాల్ చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థి మదన్మోహన్ దాఖలు చేసిన పిటిషన్‌ను పునః విచారించాలని తెలంగాణ హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది. హైకోర్టు ఆదేశాలు సవాల్ చేస్తూ మదన్మోహన్ దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం విచారించింది. చదవండి: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. లాభాల బోనస్ ప్రకటన హైకోర్టు జూన్ 15న మౌఖికంగానే తీర్పు చెప్పిందని పూర్తి తీర్పు ప్రతులు బహిర్గతం చేయకపోవడంతో విచారణ, వాదనలు వినడం వృథా అని ధర్మాసనం స్పష్టంచేసింది. కోర్టు తీర్పునకు వేచి ఉండాలని ఆదేశించలే మని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పును పక్కనపెట్టి పునఃవిచారించాలని పేర్కొంది. కేసుపై హైకోర్టు సీజే తగిన ఉత్తర్వులు జారీ చేయాలని, అక్టోబర్ 10న అన్ని పార్టీలు హైకోర్టు ముందు హాజరు కావాలని పేర్కొంది. ఎన్నికల్లో గెలిచిన పాటిల్ తన అఫిడవిట్లో క్రిమి నల్ కేసుల వివరాలు పొందపరచలేదని మదన్మోహన్ గతంలో హైకోర్టును ఆశ్రయించారు. -
పంచాయతీ లెక్కలు అడిగినందుకు.. విద్యుత్ తీగలు పట్టుకున్న సర్పంచ్
న్యాల్కల్(జహీరాబాద్): గ్రామ పంచాయతీ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు, ఖర్చుల వివరాలు సభ్యులు అడగడంతో మనస్తాపానికి గురైన ఓ సర్పంచ్ విద్యుత్ తీగలను పట్టుకునాన్నాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల పరిధి రేజింతల్ గ్రామంలోజరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం పంచాయతీ కార్యాలయంలో పాలకవర్గ సమావేశం బుధవారం నిర్వహించారు. సర్పంచ్ కుత్బుద్దీన్, కార్యదర్శి, వార్డు సభ్యులు హాజరయ్యారు. ‘పంచాయతీ అభివృద్ధికి ఎన్ని నిధులొచ్చాయి? ఏయే పనులు చేపట్టారు?’ వివరాలు కావాలని సభ్యులు నిలదీశారు. దీంతో అభివృద్ధి పనులను వివరించాలని రికార్డులను పంచాయతీ కార్యదర్శికి సర్పంచ్ ఇచ్చారు. ఆమె వివరాలు వెల్లడిస్తున్న సమయంలో వార్డు సభ్యులు, సర్పంచ్‌కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ‘గ్రామాభివృద్ధి కోసం పంచాయతీ నిధులతో పాటు ఇతర నిధులను తీసుకొచ్చినా నిలదీస్తారా? అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నా నన్నే అనుమానిస్తారా?’ అంటూ తీవ్ర మనస్తాపానికి గురైన సర్పంచ్ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయాడు. రైతు వేదిక దగ్గరకు వెళ్లి అక్కడున్న విద్యుత్ ట్రాన్స్పార్మర్ తీగలను పట్టుకున్నాడు. విద్యుదాఘాతంతో కింద పడిపోయాడు. విషయాన్ని గమనించిన పలువురు చికిత్స నిమిత్తం గంగ్వార్ చౌరస్తాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య సిబ్బంది బీదర్‌కు తీసుకువెళ్లాలని సూచించారు. దీంతో బీదర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారని గ్రామస్తులు తెలిపారు. ‘సభ్యులు ప్రశ్నిస్తే సమాధానం చెప్పాలే కాని విద్యుత్ తీగలు పట్టుకోవడం ఏమిటి’ అని స్థానికులు చర్చించుకుంటున్నారు.