జహీరాబాద్: నారింజ... జహీరాబాద్ నియోజకవర్గంలోనే అతిపెద్ద ప్రాజెక్టు. మూడు వేల ఎకరాలకు సాగునీరందించాలన్న లక్ష్యంతో కోటి రూపాయలు వెచ్చించి నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించిన ప్రాజెక్టు. కానీ సెంటు భూమిని తడపకపోవడంతో పేరుకే ప్రాజెక్టుగా నిలిచిపోయింది. అట్టహాసంగా ప్రాజెక్టు ప్రారంభించినా, నీరు పారక రైతులే కాల్వలు పూడ్చేశారు. పాలకుల అలసత్వంతో ప్రాజెక్టు పూడికతో నిండిపోయింది. దీంతో నాలుగు దశాబ్దాలుగా నారింజ నీళ్లు రైతన్నలను ఊరిస్తూనే ఉన్నాయి.
కళ్లు తెరచిన కొత్త సర్కార్
సాగునీటికి కటకటలాడుతున్న మెతుకుసీమ రైతాంగానికి సాగునీరిచ్చేందుకు మార్గాలు అన్వేషిస్తున్న కొత్త సర్కార్‌కు నారింజ ప్రాజెక్టు కళ్లముందు కనిపించింది. పైగా జిల్లాకు చెందిన హరీష్‌రావే నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండడంతో నారింజ నీళ్లను సాగుకు తరలించేందుకు ప్లాన్ సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే నారింజ ప్రాజెక్టును ఉన్నతాధికారులతో సర్వే చేయించే విషయమై ప్రభుత్వం ఆలోచిస్తోంది.
అయితే పలువురు పలు రకాల సూచనలు చేస్తుండడంతో సర్కార్ ఓ నిర్ణయానికి రాలేకపోతోంది. దీంతో ప్రాజెక్టు నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకునే విషయమై సాధ్యాసాధ్యాలను నిర్ధారించేందుకు వీలుగా నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్‌తో సర్వే చేయించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ప్రాజెక్టులో నీటిని ఏ మేరకు నిల్వ చేసుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంత మేర నీరు నిల్వ ఉంటుంది, పూడిక తీయించినట్లయితే ఎంత మేర ప్రయోజనం ఉంటుంది, పూడికతీత కోసం ఏ మేరకు నిధులు ఖర్చు చేయాల్సి వస్తుం దనే విషయాలపై ప్రభుత్వం సమాచారం సేకరించాలనే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిసింది. పూర్తిస్థాయి లో ఉన్నతాధికారులతో సర్వే చేయించిన అనంతరమే నారింజ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
గత ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా..
నారింజ నీటిని రైతులకు అందించేందుకు గత కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. ఆ వెంటనే కాల్వలు నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు రూ.5.70 కోట్ల నిధులను మంజూరు చేసింది. అయితే ప్రాజెక్టులో తగినంత నీటి నిల్వలు లేనప్పుడు కాల్వల నిర్మాణంతో ప్రయోజనమేమిటనే వాదనలు తెరపైకి రావడంతో ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచనలో పడడంతో కాల్వలు నిర్మాణానికి నోచుకోలేదు.
కళ్లముందే తరలిపోతుంటే...
జహీరాబాద్ నియోజకవర్గంలోనే ప్రధాన నీటి వనరుగా ఉన్న నారింజ వాగు కోహీర్ మండలంలోని బిలాల్‌పూర్ గ్రామంలో పుట్టింది. అక్కడి నుంచి జహీరాబాద్ మీదుగా కర్ణాటకలోకి ప్రవేశిస్తుంది. ఈ వాగుపై వరద ప్రాంత వైశాల్యం 143.8 స్క్వేర్ మైల్స్‌గా గుర్తించారు. గరిష్ట వరద ప్రవాహం 41.800 క్యూసెక్కులుగా గుర్తించారు. అయితే ఈ నీరంతా వృథాగా కర్ణాటకకు తరలి వెళ్తుండడంతో, జహీరాబాద్ ప్రాంతం రైతులు కూడా నారింజ జలాలను వినియోగించుకునేందుకు వీలుగా బీదర్ రోడ్డుపై రోడ్డు కం బ్యారేజీని నిర్మించి భూములను సాగులోకి తీసుకురావాలని అప్పట్లో ప్రతిపాదించారు.
సుమారు కోటి రూపాయల వ్యయంతో బ్యారేజీని నిర్మించారు. 1970 డిసెంబర్ 20న అప్పటి రాష్ర్ట ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి రెగ్యులేటర్ బ్రిడ్జిని ప్రారంభించి జాతికి అంకితం చేశారు. 1971లో అప్పటి నీటి పారుదల శాఖ మంత్రి శీలం సిధారెడ్డి కాలువ తూమును ప్రారంభించారు. అయితే ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి పరిమితమైంది. ఈ ప్రాజెక్టు వల్ల ఇప్పటివరకు ఏ ఒక్క రైతుకు కూడా ప్రయోజనం చేకూరలేదు. అధికారులు, పాలకులు పట్టించుకోకపోవడం మూలంగానే గత నాలుగు దశాబ్దాల కాలంగా నారింజ జలాలు రైతులకు అందని ద్రాక్షలా మారాయి.
లక్ష్యం ఘనం...ఫలితం శూన్యం
నారింజ ప్రాజెక్టు లక్ష్యం ఘనంగా ఉన్నప్పటికీ ఫలితం మాత్రం శూన్యమనే చెప్పాలి. ప్రాజెక్టు కింద 3 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. కూడి కాల్వ కింద 550 ఎకరాలు, ఎడమ కాల్వ కింద 2,450 ఎకరాలుగా గుర్తించారు. 2 కిలోమీటర్ల మేర పొడవున్న కుడి కాల్వ కింద న్యాల్‌కల్ మండలంలోని మిర్జాపూర్(బి), మల్కాపూర్, జహీరాబాద్ మండలంలోని కొత్తూర్(బి) గ్రామాలున్నాయి. 13 కిలోమీటర్ల పొడవున్న ఎడమ కాల్వ కింది జహీరాబాద్ మండలంలోని కొత్తూర్(బి), బూర్దిపాడ్, సత్వార్, బూచనెల్లి, చిరాగ్‌పల్లి, మాడ్గి గ్రామాలను గుర్తించారు. అయినప్పటికీ ఏ ఒక్క కాల్వ కూడా సాగుకు అనువుగా లేకుండా పోయింది.
దీంతో ఆయా గ్రామాల్లోని గుంట భూమి కూడా సాగులోకి రాలేదు. ప్రాజెక్టు కింద ప్రధాన కాల్వలను తవ్వించినా, వాటికి అనుబంధంగా చిన్న చిన్న కాల్వలను తవ్వించక పోవడంతో ప్రాజెక్టు నీటిని వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో తమ పొలాల్లో తవ్వి వదిలేసిన కాల్వలను అప్పట్లోనే రైతులు పూడ్చి వేసి పంటలను సాగు చేసుకుంటున్నారు. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 85 మిలియన్ క్యూబిక్ ఫీట్స్(ఎంసీఎఫ్‌టీ)గా ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టుకు ఉన్న రెంటు తూములు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో వాటిని తొలగించి కొత్తగా తూములను ఏర్పాటు చేయాల్సి ఉంది. మట్టితో నిండిపోయిన కాల్వలను తిరిగి తవ్వించాల్సిన అవసరం ఉంది. కాల్వలు అక్కడక్కడ మాత్రమే ఆనవాళ్లు కనిపిస్తున్నాయి.
పూడిక తీస్తేనే ప్రయోజనం
ప్రస్తుతం నారింజ ప్రాజెక్టు పూడికతో నిండిపోయి ఉంది. పూడికను తీస్తేనే ఉపయోగకరంగాా ఉంటుందని పరిసర గ్రామాల రైతులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఒక్క భారీ వర్షానికే నిండిపోతోందనీ, దీంతో మిగతా నీరంతా వృథాగా కర్ణాటక వెళ్తోందని రైతులు అంటున్నారు. ప్రాజెక్టులోని పూడికను తీయించినట్లయితే నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుందని, అంతే కాకుండా పరిసర గ్రామాల్లోని భూగర్భ జలాలు మరింతగా వృద్ధి చెందే అవకాశం ఉందని రైతులు అభిప్రాయపడుతున్నారు. దీంతో బోర్ల కింద సాగుకు ఎలాంటి ఇబ్బంది ఉండదంటున్నారు. ప్రాజెక్టులోని పూడిక తీసేందుకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఆ తర్వాతే కాల్వల ద్వారా నీటిని అందించేందుకు వీలుగా నిర్మాణం పనులు చేపట్టాలంటున్నారు.
‘నారింజ’ కోసం నయా ప్లాన్
Published Mon, Jul 28 2014 11:44 PM | Last Updated on Mon, May 28 2018 1:49 PM
Advertisement