Narinja project
-
‘నారింజ’కు భారీగా వరదనీరు
జహీరాబాద్: జహీరాబాద్ ప్రాంతంలో బుధవారం మోస్తారుగా వర్షం కురిసింది. మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి జహీరాబాద్ మండలంలో 2.6 సెం.మీ, కోహీర్ మండలంలో 3.6 సెం.మీ, ఝరాసంగం మండలంలో 1.8 సెం.మీ వర్షపాతం నమోదైంది. గత వారం రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకే జహీరాబాద్ సమీపంలో గల నారింజ ప్రాజెక్టులోకి సామర్థ్యం మేరకు నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టు షటర్ల పైనుంచి కొద్ది మేర నీరు బయటకు పోయింది.మంగళవారం రాత్రి జహీరాబాద్, కోహీర్ మండలాల్లో కురిసిన వర్షాలకు నారింజ ప్రాజెక్టులోకి తిరిగి కొంత నీరు వచ్చి చేరింది. వచ్చి చేరిన నీరు ప్రాజెక్టు గేటు షటర్ల పైనుంచి ప్రవహిస్తుంది. సుమారు రెండు అంచుల మేర నీరు బయటకు పోతుంది. మయటకు పోతున్న నీరు నారింజ జలం కర్ణాటకలోని కరంజా ప్రాజెక్టులోకి పోయింది. గత రెండు సంవత్సరాల నుంచి వర్షాభావంతో నారింజ ప్రాజెక్టులోకి చుక్క నీరు రాలేదు. ఈ సంవత్సరం మాత్రం వర్షాలు ఆశాజనకంగా ఉండడంతో సామర్థ్యం మేరకు ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జహీరాబాద్ ప్రాంతం నుంచి నారింజ జలాలు కర్ణాటక ప్రాంతంలోకి పోతుండడంతో అ ప్రాంత రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే కోహీర్ మండలంలోని పెద్దవాగు ప్రాజెక్టు కూడా గతంలో కురిసిన వర్షాలకు సామర్థ్యం మేర నీటితో నిండింది. దీంతో అదనపు నీరు కర్ణాటకకు పోతుంది. -
‘నారింజ’ కోసం నయా ప్లాన్
జహీరాబాద్: నారింజ... జహీరాబాద్ నియోజకవర్గంలోనే అతిపెద్ద ప్రాజెక్టు. మూడు వేల ఎకరాలకు సాగునీరందించాలన్న లక్ష్యంతో కోటి రూపాయలు వెచ్చించి నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించిన ప్రాజెక్టు. కానీ సెంటు భూమిని తడపకపోవడంతో పేరుకే ప్రాజెక్టుగా నిలిచిపోయింది. అట్టహాసంగా ప్రాజెక్టు ప్రారంభించినా, నీరు పారక రైతులే కాల్వలు పూడ్చేశారు. పాలకుల అలసత్వంతో ప్రాజెక్టు పూడికతో నిండిపోయింది. దీంతో నాలుగు దశాబ్దాలుగా నారింజ నీళ్లు రైతన్నలను ఊరిస్తూనే ఉన్నాయి. కళ్లు తెరచిన కొత్త సర్కార్ సాగునీటికి కటకటలాడుతున్న మెతుకుసీమ రైతాంగానికి సాగునీరిచ్చేందుకు మార్గాలు అన్వేషిస్తున్న కొత్త సర్కార్‌కు నారింజ ప్రాజెక్టు కళ్లముందు కనిపించింది. పైగా జిల్లాకు చెందిన హరీష్‌రావే నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండడంతో నారింజ నీళ్లను సాగుకు తరలించేందుకు ప్లాన్ సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే నారింజ ప్రాజెక్టును ఉన్నతాధికారులతో సర్వే చేయించే విషయమై ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయితే పలువురు పలు రకాల సూచనలు చేస్తుండడంతో సర్కార్ ఓ నిర్ణయానికి రాలేకపోతోంది. దీంతో ప్రాజెక్టు నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకునే విషయమై సాధ్యాసాధ్యాలను నిర్ధారించేందుకు వీలుగా నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్‌తో సర్వే చేయించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ప్రాజెక్టులో నీటిని ఏ మేరకు నిల్వ చేసుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంత మేర నీరు నిల్వ ఉంటుంది, పూడిక తీయించినట్లయితే ఎంత మేర ప్రయోజనం ఉంటుంది, పూడికతీత కోసం ఏ మేరకు నిధులు ఖర్చు చేయాల్సి వస్తుం దనే విషయాలపై ప్రభుత్వం సమాచారం సేకరించాలనే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిసింది. పూర్తిస్థాయి లో ఉన్నతాధికారులతో సర్వే చేయించిన అనంతరమే నారింజ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా.. నారింజ నీటిని రైతులకు అందించేందుకు గత కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. ఆ వెంటనే కాల్వలు నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు రూ.5.70 కోట్ల నిధులను మంజూరు చేసింది. అయితే ప్రాజెక్టులో తగినంత నీటి నిల్వలు లేనప్పుడు కాల్వల నిర్మాణంతో ప్రయోజనమేమిటనే వాదనలు తెరపైకి రావడంతో ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచనలో పడడంతో కాల్వలు నిర్మాణానికి నోచుకోలేదు. కళ్లముందే తరలిపోతుంటే... జహీరాబాద్ నియోజకవర్గంలోనే ప్రధాన నీటి వనరుగా ఉన్న నారింజ వాగు కోహీర్ మండలంలోని బిలాల్పూర్ గ్రామంలో పుట్టింది. అక్కడి నుంచి జహీరాబాద్ మీదుగా కర్ణాటకలోకి ప్రవేశిస్తుంది. ఈ వాగుపై వరద ప్రాంత వైశాల్యం 143.8 స్క్వేర్ మైల్స్‌గా గుర్తించారు. గరిష్ట వరద ప్రవాహం 41.800 క్యూసెక్కులుగా గుర్తించారు. అయితే ఈ నీరంతా వృథాగా కర్ణాటకకు తరలి వెళ్తుండడంతో, జహీరాబాద్ ప్రాంతం రైతులు కూడా నారింజ జలాలను వినియోగించుకునేందుకు వీలుగా బీదర్ రోడ్డుపై రోడ్డు కం బ్యారేజీని నిర్మించి భూములను సాగులోకి తీసుకురావాలని అప్పట్లో ప్రతిపాదించారు. సుమారు కోటి రూపాయల వ్యయంతో బ్యారేజీని నిర్మించారు. 1970 డిసెంబర్ 20న అప్పటి రాష్ర్ట ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి రెగ్యులేటర్ బ్రిడ్జిని ప్రారంభించి జాతికి అంకితం చేశారు. 1971లో అప్పటి నీటి పారుదల శాఖ మంత్రి శీలం సిధారెడ్డి కాలువ తూమును ప్రారంభించారు. అయితే ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి పరిమితమైంది. ఈ ప్రాజెక్టు వల్ల ఇప్పటివరకు ఏ ఒక్క రైతుకు కూడా ప్రయోజనం చేకూరలేదు. అధికారులు, పాలకులు పట్టించుకోకపోవడం మూలంగానే గత నాలుగు దశాబ్దాల కాలంగా నారింజ జలాలు రైతులకు అందని ద్రాక్షలా మారాయి. లక్ష్యం ఘనం...ఫలితం శూన్యం నారింజ ప్రాజెక్టు లక్ష్యం ఘనంగా ఉన్నప్పటికీ ఫలితం మాత్రం శూన్యమనే చెప్పాలి. ప్రాజెక్టు కింద 3 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. కూడి కాల్వ కింద 550 ఎకరాలు, ఎడమ కాల్వ కింద 2,450 ఎకరాలుగా గుర్తించారు. 2 కిలోమీటర్ల మేర పొడవున్న కుడి కాల్వ కింద న్యాల్కల్ మండలంలోని మిర్జాపూర్(బి), మల్కాపూర్, జహీరాబాద్ మండలంలోని కొత్తూర్(బి) గ్రామాలున్నాయి. 13 కిలోమీటర్ల పొడవున్న ఎడమ కాల్వ కింది జహీరాబాద్ మండలంలోని కొత్తూర్(బి), బూర్దిపాడ్, సత్వార్, బూచనెల్లి, చిరాగ్పల్లి, మాడ్గి గ్రామాలను గుర్తించారు. అయినప్పటికీ ఏ ఒక్క కాల్వ కూడా సాగుకు అనువుగా లేకుండా పోయింది. దీంతో ఆయా గ్రామాల్లోని గుంట భూమి కూడా సాగులోకి రాలేదు. ప్రాజెక్టు కింద ప్రధాన కాల్వలను తవ్వించినా, వాటికి అనుబంధంగా చిన్న చిన్న కాల్వలను తవ్వించక పోవడంతో ప్రాజెక్టు నీటిని వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో తమ పొలాల్లో తవ్వి వదిలేసిన కాల్వలను అప్పట్లోనే రైతులు పూడ్చి వేసి పంటలను సాగు చేసుకుంటున్నారు. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 85 మిలియన్ క్యూబిక్ ఫీట్స్(ఎంసీఎఫ్‌టీ)గా ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టుకు ఉన్న రెంటు తూములు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో వాటిని తొలగించి కొత్తగా తూములను ఏర్పాటు చేయాల్సి ఉంది. మట్టితో నిండిపోయిన కాల్వలను తిరిగి తవ్వించాల్సిన అవసరం ఉంది. కాల్వలు అక్కడక్కడ మాత్రమే ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. పూడిక తీస్తేనే ప్రయోజనం ప్రస్తుతం నారింజ ప్రాజెక్టు పూడికతో నిండిపోయి ఉంది. పూడికను తీస్తేనే ఉపయోగకరంగాా ఉంటుందని పరిసర గ్రామాల రైతులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఒక్క భారీ వర్షానికే నిండిపోతోందనీ, దీంతో మిగతా నీరంతా వృథాగా కర్ణాటక వెళ్తోందని రైతులు అంటున్నారు. ప్రాజెక్టులోని పూడికను తీయించినట్లయితే నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుందని, అంతే కాకుండా పరిసర గ్రామాల్లోని భూగర్భ జలాలు మరింతగా వృద్ధి చెందే అవకాశం ఉందని రైతులు అభిప్రాయపడుతున్నారు. దీంతో బోర్ల కింద సాగుకు ఎలాంటి ఇబ్బంది ఉండదంటున్నారు. ప్రాజెక్టులోని పూడిక తీసేందుకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఆ తర్వాతే కాల్వల ద్వారా నీటిని అందించేందుకు వీలుగా నిర్మాణం పనులు చేపట్టాలంటున్నారు. -
నేతల ఎజెండా.. నారింజ!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘నారింజ’ రుచి పులుపు. పుల్లని పండును చూడగానే నోట్లో నీళ్లు ఊరుతాయి. ఆదే సూత్రాన్ని జహీరాబాద్ నేతలు ఎన్నికలకు అపాదించారు. నారింజ వాగు పులుపు చూపించి ‘ఓట్లు’ పారించే ప్రయత్నం చేస్తున్నారు. 1970 నుంచి ఇదే తంతు కొనసాగుతోంది. జహీరాబాద్ బిలాల్పూర్లో పుట్టిన నారింజ వాగు కర్ణాటకకు తరలిపోయి అక్కడ కరంజే ప్రాజెక్టును నింపిన తర్వాత మళ్లీ తిరిగి జహీరాబాద్‌కే వచ్చి మంజీరాలో కలుస్తుంది. ఈ వాగు గుండా ఏడాదికి 3 టీఎంసీల నీళ్లు వృథాగా పోతున్నాయి. వాగు కర్ణాటక రాష్టం చేరక ముందే నీళ్లను ఒడిసిపట్టుకోవాలని వైఎస్సార్ సంకల్పించారు. ఏం చేయాలో సర్వే చేసి, వెంటనే ప్రతిపాదనలు పంపాలని ఇరిగేషన్ శాఖ అధికారులను 2009లో ఆదేశించారు. పాలన పరమైన సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు వైఎస్సార్ అప్పటి కప్పుడు నారింజ వాగును మైనర్ ఇరిగేషన్ విభాగం నుంచి మేజర్ ఇరిగేషన్ విభాగం స్థాయికి పెంచారు. అధికారులు ఉరుకులు పరుగుల మీద సర్వే పూర్తి చేశారు. ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించారు. అధికారులు పంపిన ప్రతిపాదనలు ఇవే.. వాగు వద్ద వరద ప్రాంత వైశాల్యం 143.8 స్కోయర్స్మైల్స్, గరిష్ట వరద ప్రవాహం 41.800 క్యూసెక్కులుగా గుర్తించారు. ఈలెక్కన నారింజ వాగు నుంచి ఏడాదికి 3 టీఎంసీల నీరు వృథాగా కర్ణాటక రాష్ట్రానికి తరలిపోతోంది. వాగు కర్ణాటకలోకి ప్రవేశించడానికి ముందే సింగూరుకు మళ్లిస్తే కనీసం ఒక టీఎంసీ నీళ్లను జహీరాబాద్ నియోజకవర్గం రైతులక అందించవచ్చని అధికారులు నిర్ధారించారు. వాగును మళ్లించడానికి జహీరాబాద్ మండలం అల్గొల్ గ్రామం అనువైన ప్రాంతంగా గుర్తించారు. అల్గొల్ గ్రామం నుంచి కాల్వ తవ్వకాలు మొదలు పెట్టి ఝరాసంగం మండలం మేదపల్లి గ్రామంలోని కొత్త చెరువులకు కలపాలి.. అక్కడి నుంచి జీర్లపల్లి చెరువు మీదుగా దుబ్బవాగును కలపాలి. అక్కడి నుంచి నీటిని సింగూరులోకి మళ్లించాలని ఇంజనీరింగ్ నిపుణులు సూచించారు. ఈ మొత్తం కాల్వ దూరం కేవలం 15.35 కిలోమీటర్లు మాత్రమే ఉంటుందని నిర్ధారించారు. {పాజెక్టు పనులు, కాల్వ నిర్మాణం కోసం రూ. 67.66 కోట్లు వ్యయం అవుతోందని అంచనా వేశారు. ఇలా సిద్ధం చేసిన ప్రతిపాదనలను ఇరిగేషన్ శాఖ అధికారులు వైఎస్సార్ ప్రభుత్వానికి పంపారు. అనుకోని ప్రమాదంలో వైఎస్సార్ మరణించడంతో ఈ ప్రతిపాదనల ఫైల్‌ను అటకమీద పెట్టారు. ఆ తరువాత వచ్చిన నాయకులు ఎవరూ కూడా నారింజ వాగు వైపునకు చూడలేదు. 2009లోనే నారింజ వాగుపై వంతెన కట్టి ఆ నీళ్లను సింగూరుకు పంపాలని వైఎస్సార్ ప్రభుత్వం సిద్దం చేసిన ప్రతిపాదనలను ఆయన మరణం తరువాత చెత్త బుట్టలో వేశారు. మళ్లీ ఇప్పుడు ఎన్నికలు సమీపించిన వేళ నారింజ తొనలను వలిసి ఆ ప్రాంత రైతుల నోళ్లు ఊరించేందుకు అన్ని పార్టీల నేతలు సిద్దమయ్యారు. నారింజ నీళ్ల పులుపెంతో మేం రుచి చూపిస్తామంటే... మేమె రుచి రుపిస్తామని రైతుల నోళ్లు ఊరిస్తున్నారు. వృథాగా జలం.... జహీరాబాద్ మండలం బిలాల్పూర్ గ్రామంలో పుట్టిన నారింజ వాగు వర్షాకాలంలో ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నీరంతా నేరుగా కర్ణాటక రాష్ట్రంలోకి వెళ్లి.. తిరిగి మళ్లీ తెలంగాణలోకే వస్తుంది. వృథాగా పోతున్న జలాలను సద్వినియోగం చేసుకుని సాగు అవసరాలను తీర్చుకోవడం కోసం 1970లో జహీరాబాద్ మండలం కొత్తూరు వద్ద రూ. కోటి వ్యయంతో రెగ్యులేటర్ బ్రిడ్జిని నిర్మించారు. బ్రిడ్జీ కట్టిన రెండేళ్లకే గేట్లు తెరిచి నీళ్లు బయటికి వదిలారు. తరువాత గేట్లకు కొద్దిపాటి రిపేర్లు చేయించి భూగర్భ జలాలు మట్టం పెరిగే విధంగా నీళ్లు నిల్వ చేస్తున్నారు. ఇలా వెళ్లిన జలాలను ఒడిసిపట్టుకోవడానికి కర్ణాటక ప్రభుత్వం నారింజ వాగు మీద కరంజా ప్రాజెక్టు కట్టింది. అది నిండిన తరువాత అదనపు నీళ్లను వదిలితే అవి మళ్లీ మన రాష్ట్రం వైపే ప్రయాణం చేస్తాయి. ఈ నీరు తిరిగి మంజీరాలో కలిసి సింగూరు చేరుతాయి. నీళ్లు కరంజాకు వెళ్లి అక్కడి నుంచి తిరిగి మంజీరాకు వచ్చి సింగూరును నింపే బదులు నేరుగా సింగూరుకు తరలించాలని స్థానిక రైతులు కోరుతున్నారు. -
‘నారింజ’ ఆయకట్టు విలవిల
జహీరాబాద్, న్యూస్‌లైన్ : నియోజక వర్గంలోనే అతి పెద్ద నీటి వనరు నారింజ ప్రాజెక్టు. దీని కింద మూడు వేల ఎకరాలు సాగయ్యే అవకాశం ఉంది. అయినా ఎకరం కూడా సాగుకు నోచుకోవడం లేదు. ఆయకట్టుకు నీటిని అందిస్తామని ప్రజాప్రతినిధులు, అధికారులు చెబుతున్నా అది అందని ద్రాక్షగానే మిగిలింది. రైతులు దశాబ్దాలుగా ఎదురు చూపులతోనే కాలం గడుపుతున్నారు. ఎట్టకేలకు కాలువల నిర్మాణానికి రూ.5.77 కోట్ల నిధులు మంజూరైనా పనులకు నోచుకోవడం లేదు. నీటిని అందించేందుకు వీలుగా సర్వే పనులు పూర్తి చేసి ఏడాదిన్నర గడిచినా ఇప్పటికీ పనులు మాత్రం టెండర్ దశలోనే ఉన్నాయి. ఆరు నెలల క్రితం టెండర్లను ఆహ్వానించగా పలువురు కాంట్రాక్టర్లు సీల్డ్ కవర్లలో టెండర్లు దాఖలు చేశారు. టెండర్ల ఖరారులో జాప్యం జరగడం, అదే సమయంలో మెటీరియల్ ధర లు పెరగడంతో అధికారులు పనులను కుదిం చి తాజాగా మరోసారి ప్రతిపాదనలు పంపా రు. కాలువల పనులు మొదలు కాకపోవడం తో సాగుకు నీరందించేది ఎప్పుడని రైతులు ఆందోళన చెందుతున్నారు. జహీరాబాద్ మండలం కొత్తూరు(బి) గ్రామ శివారులో గల నారింజ వాగుపై 1970 సంవత్సరంలో ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మించిం ది. 1971లో కాలువ తూమును ప్రభుత్వం ప్రారంభించింది. ప్రాజెక్టు కింద మూడు వేల ఎకరాల భూమిని సాగులోకి తేవాలని అప్పట్లో అధికారులు ప్రతిపాదించారు. కర్ణాటక రాష్ట్రానికి వృధాగా పోతున్న నారింజ జలాలను సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా ఈ ప్రాజెక్టును నిర్మించారు. అయినప్పటికీ ఇప్పటి వరకు ఎకరం పొలం కూడా సాగుకు నోచుకోలేకుండా పోయింది. ప్రాజెక్టును నిర్మించిన కొన్నాళ్లకే ప్రాజెక్టు షటర్లను ధ్వంసం చేయడంతో రెండు దశాబ్దాల పాటు నారింజ నీరు వృధాగా పోయింది. 2001లో అప్పటి కలెక్టర్ ప్రేమచంద్రారెడ్డి స్పందించి ప్రాజెక్టు షటర్లకు మరమ్మతులు చేయించి నీరు వృధా పోకుండా చర్యలు తీసుకున్నారు. నిధులు మంజూరైనా.. నారింజ ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల నిర్మాణంతోపాటు పలు పనులు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏడాది క్రితం రూ.5.77 కోట్లు మంజూరు చేసింది. ఇందుకోసం పలువురు కాంట్రాక్టర్లు ఆరు నెలల క్రితం టెండర్లు దాఖలు చేశారు. నీటి పారుదల శాఖ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాకపోవడంతో స్థానిక అధికారులు టెండర్లను తెరవలేకపోయారు. టెండర్లు ఖరారు చేయకపోవడం, అదే సమయంలో మెటీరియల్ ధరలు కూడా బాగా పెరిగి పోవడంతో టెండర్లు వేసిన వారు ఆ పనులు చేపట్టేందుకు ఆసక్తి చూపడం లేదు. ధరలు పెరిగినందున ఆ పనులు చేపట్టేందుకు రూ.5.77 కోట్లు సరిపోవని అధికారులు గుర్తించారు. గతంలో ప్రతిపాదించిన పనులను కొంత మేర కుదించి మూడు నెలల క్రితం తిరిగి ప్రతిపాదనలు పంపినట్టు తెలిసింది. అయితే ఉన్నతాధికారుల నుంచి అనుమతి రాలేదని తెలిసింది. 2011లోనే సర్వే పూర్తయినా.. ప్రాజెక్టు పనులను ఏ మేరకు నిర్వహిస్తే పూర్తి స్థాయిలో రైతులకు ఉపయోగపడే అవకాశం ఉందనే విషయమై మార్చి 2011 సంవత్సరంలో ప్రైవేటు కన్సల్టెన్సీతో సర్వే చేయించారు. పూర్తిగా పూడుకు పోయిన కాలువల మరమ్మతులు, ప్రాజెక్టు పరిధిలో ఏ మేరకు పూడిక నిండుకుందనే విషయమై ప్రధానంగా సర్వే చేశారు. ప్రాజెక్టు కట్ట మరమ్మతులు, చిన్న చిన్న లీకేజీలను సరిచేయడం, ప్రాజెక్టు ద్వారా ఎంత మేర పొలాలకు నీరందించే వీలుందో తెలుసుకున్న అధికారులు ఈ మేరకు పనుల కోసం ప్రతిపాదించారు. ఎనిమిది గ్రామాల రైతులకు ఉపయోగం నారింజ ప్రాజెక్టుకు మరమ్మతు పనులు పూర్తి చేస్తే ఎనిమిది గ్రామాలకు సాగు నీరు అందుబాటులోకి వస్తుంది. కర్ణాటక ప్రాంతానికి వృధాగా వెళ్తున్న వరద నీటిని కొంతమేర సద్వినియోగం చేసుకోవచ్చు. ప్రాజెక్టు పరిసరాల్లో ఉన్న కొత్తూర్(బి), బూర్దిపాడ్, బూచనెల్లి, సత్వార్, చిరాగ్పల్లి, మాడ్గి, మల్కాపూర్, మిర్జాపూర్(బి) గ్రామాలకు నీటిని అందించేందుకు ప్రతిపాదించారు. పనులు పూర్తయితే ఆయా గ్రామాల్లోని సుమారు మూడు వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది.