జహీరాబాద్, న్యూస్‌లైన్ : నియోజక వర్గంలోనే అతి పెద్ద నీటి వనరు నారింజ ప్రాజెక్టు. దీని కింద మూడు వేల ఎకరాలు సాగయ్యే అవకాశం ఉంది. అయినా ఎకరం కూడా సాగుకు నోచుకోవడం లేదు. ఆయకట్టుకు నీటిని అందిస్తామని ప్రజాప్రతినిధులు, అధికారులు చెబుతున్నా అది అందని ద్రాక్షగానే మిగిలింది. రైతులు దశాబ్దాలుగా ఎదురు చూపులతోనే కాలం గడుపుతున్నారు. ఎట్టకేలకు కాలువల నిర్మాణానికి రూ.5.77 కోట్ల నిధులు మంజూరైనా పనులకు నోచుకోవడం లేదు. నీటిని అందించేందుకు వీలుగా సర్వే పనులు పూర్తి చేసి ఏడాదిన్నర గడిచినా ఇప్పటికీ పనులు మాత్రం టెండర్ దశలోనే ఉన్నాయి. ఆరు నెలల క్రితం టెండర్లను ఆహ్వానించగా పలువురు కాంట్రాక్టర్లు సీల్డ్ కవర్లలో టెండర్లు దాఖలు చేశారు. టెండర్ల ఖరారులో జాప్యం జరగడం, అదే సమయంలో మెటీరియల్ ధర లు పెరగడంతో అధికారులు పనులను కుదిం చి తాజాగా మరోసారి ప్రతిపాదనలు పంపా రు. కాలువల పనులు మొదలు కాకపోవడం తో సాగుకు నీరందించేది ఎప్పుడని రైతులు ఆందోళన చెందుతున్నారు.
జహీరాబాద్ మండలం కొత్తూరు(బి) గ్రామ శివారులో గల నారింజ వాగుపై 1970 సంవత్సరంలో ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మించిం ది. 1971లో కాలువ తూమును ప్రభుత్వం ప్రారంభించింది. ప్రాజెక్టు కింద మూడు వేల ఎకరాల భూమిని సాగులోకి తేవాలని అప్పట్లో అధికారులు ప్రతిపాదించారు. కర్ణాటక రాష్ట్రానికి వృధాగా పోతున్న నారింజ జలాలను సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా ఈ ప్రాజెక్టును నిర్మించారు. అయినప్పటికీ ఇప్పటి వరకు ఎకరం పొలం కూడా సాగుకు నోచుకోలేకుండా పోయింది. ప్రాజెక్టును నిర్మించిన కొన్నాళ్లకే ప్రాజెక్టు షటర్లను ధ్వంసం చేయడంతో రెండు దశాబ్దాల పాటు నారింజ నీరు వృధాగా పోయింది. 2001లో అప్పటి కలెక్టర్ ప్రేమచంద్రారెడ్డి స్పందించి ప్రాజెక్టు షటర్లకు మరమ్మతులు చేయించి నీరు వృధా పోకుండా చర్యలు తీసుకున్నారు.
నిధులు మంజూరైనా..
నారింజ ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల నిర్మాణంతోపాటు పలు పనులు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏడాది క్రితం రూ.5.77 కోట్లు మంజూరు చేసింది. ఇందుకోసం పలువురు కాంట్రాక్టర్లు ఆరు నెలల క్రితం టెండర్లు దాఖలు చేశారు. నీటి పారుదల శాఖ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాకపోవడంతో స్థానిక అధికారులు టెండర్లను తెరవలేకపోయారు. టెండర్లు ఖరారు చేయకపోవడం, అదే సమయంలో మెటీరియల్ ధరలు కూడా బాగా పెరిగి పోవడంతో టెండర్లు వేసిన వారు ఆ పనులు చేపట్టేందుకు ఆసక్తి చూపడం లేదు. ధరలు పెరిగినందున ఆ పనులు చేపట్టేందుకు రూ.5.77 కోట్లు సరిపోవని అధికారులు గుర్తించారు. గతంలో ప్రతిపాదించిన పనులను కొంత మేర కుదించి మూడు నెలల క్రితం తిరిగి ప్రతిపాదనలు పంపినట్టు తెలిసింది. అయితే ఉన్నతాధికారుల నుంచి అనుమతి రాలేదని తెలిసింది.
2011లోనే సర్వే పూర్తయినా..
ప్రాజెక్టు పనులను ఏ మేరకు నిర్వహిస్తే పూర్తి స్థాయిలో రైతులకు ఉపయోగపడే అవకాశం ఉందనే విషయమై మార్చి 2011 సంవత్సరంలో ప్రైవేటు కన్సల్టెన్సీతో సర్వే చేయించారు. పూర్తిగా పూడుకు పోయిన కాలువల మరమ్మతులు, ప్రాజెక్టు పరిధిలో ఏ మేరకు పూడిక నిండుకుందనే విషయమై ప్రధానంగా సర్వే చేశారు. ప్రాజెక్టు కట్ట మరమ్మతులు, చిన్న చిన్న లీకేజీలను సరిచేయడం, ప్రాజెక్టు ద్వారా ఎంత మేర పొలాలకు నీరందించే వీలుందో తెలుసుకున్న అధికారులు ఈ మేరకు పనుల కోసం ప్రతిపాదించారు.
ఎనిమిది గ్రామాల రైతులకు ఉపయోగం
నారింజ ప్రాజెక్టుకు మరమ్మతు పనులు పూర్తి చేస్తే ఎనిమిది గ్రామాలకు సాగు నీరు అందుబాటులోకి వస్తుంది. కర్ణాటక ప్రాంతానికి వృధాగా వెళ్తున్న వరద నీటిని కొంతమేర సద్వినియోగం చేసుకోవచ్చు. ప్రాజెక్టు పరిసరాల్లో ఉన్న కొత్తూర్(బి), బూర్దిపాడ్, బూచనెల్లి, సత్వార్, చిరాగ్‌పల్లి, మాడ్గి, మల్కాపూర్, మిర్జాపూర్(బి) గ్రామాలకు నీటిని అందించేందుకు ప్రతిపాదించారు. పనులు పూర్తయితే ఆయా గ్రామాల్లోని సుమారు మూడు వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది.
‘నారింజ’ ఆయకట్టు విలవిల
Published Sat, Oct 19 2013 12:14 AM | Last Updated on Fri, Sep 1 2017 11:45 PM
Advertisement