
నిర్వహణ, పర్యవేక్షణకు నయాపైసా విదల్చని సర్కారు
2024–25 బడ్జెట్‌లో రూ.480 కోట్ల కేటాయింపులు
ఇప్పటివరకు ఒక్క రూపాయి విడుదల చేయని వైనం
170 పనులకు సంబంధించి రూ.160 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్
నీటిపారుదల శాఖ ఓకే చేసినా ఆర్థిక శాఖ ససేమిరా
సాక్షి, హైదరాబాద్: కొత్త సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ఏటా రూ.వేల కోట్లు ఖర్చుచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. నిర్మాణం పూర్తైన ప్రాజెక్టుల బాగోగులకు మాత్రం నయాపైసా విదల్చడం లేదు. దీంతో రూ.లక్షల కోట్లు విలువ చేసే ప్రాజెక్టులు గాలిలో దీపంలా మారాయి. సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, పర్యవేక్షణ (ఓ అండ్ ఎం)కు 2024–25 బడ్జెట్‌లో రూ.480 కోట్లు కేటాయించగా, మరో 26 రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనున్నా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి విడుదల చేయలేదు.
సాగునీటి ప్రాజెక్టు నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఆర్థిక శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లుల విలువ రూ.160 కోట్లకు ఎగబాకింది. మొత్తం 170 పనులకు సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. నీటిపారుదల శాఖ టోకెన్లు జారీ చేసినా, ఆర్థిక శాఖ బడ్జెట్ రిలీజ్ ఆర్డర్లు (బీఆర్‌ఓ) జారీ చేయకపోవడంతో వాటికి మోక్షం లభించడం లేదు.
దయనీయంగా దేవాదుల
కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలు మినహా రాష్ట్రంలోని ఇతర సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, పర్యవేక్షణను ప్రభుత్వం.. ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించింది. దేవాదుల ప్రాజెక్టు నిర్వహణ, పర్యవేక్షణ చూస్తున్న కాంట్రాక్టర్ ఏడాదికాలంగా బిల్లులు చెల్లించకపోవడంతో సిబ్బందికి జీతాలు చెల్లించలేక చేతులెత్తేశారు. దీంతో కార్మికులు ఇటీవల పంప్‌హౌస్‌కు తాళం వేసి నిరసన తెలిపారు.
తక్షణమే బిల్లులు చెల్లించకపోతే మోటార్లను బంద్ చేసి నీటి పంపింగ్‌ను నిలుపుదల చేస్తామని హెచ్చరించారు. రెండేళ్ల పాటు ఓ అండ్ ఎం పనులు నిర్వహించేందుకు రూ.22 కోట్ల అంచనాలతో కాంట్రాక్టు అప్పగించగా, సదరు కాంట్రాక్టర్‌కు రూ.9 కోట్లకు పైగా బిల్లులు చెల్లించాల్సి ఉంది. అయితే యాసంగి సాగు చివరి దశలో ఉండడంతో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు కాంట్రాక్టర్‌కు సర్దిచెప్పి నీటి పంపింగ్ కొనసాగేలా చర్యలు తీసుకున్నారు.
ఓ అండ్ ఎం లోపాలే శాపం!
గతేడాది గోదావరికి వచ్చిన వరదల్లో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగు కొట్టుకుపోగా, నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు పలుచోట్ల గండ్లు పడ్డాయి. 500కి పైగా చెరువులకు కూడా గండ్లు పడ్డాయి. వీటికి నిర్వహణ లోపాలే కారణమనే ఆరోపణలొచ్చాయి. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల వైఫల్యాలకు కూడా నిర్వహణ, పర్యవేక్షణ లోపాలు ఓ కారణమని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ) తన మధ్యంతర నివేదికలో స్పష్టం చేసింది.
అయినా రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణపై నిర్లక్ష్యాన్ని వీడడం లేదు. తెలంగాణ ఏర్పడ్డాక గత 11 ఏళ్లలో కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.1.9 లక్షల కోట్లు ఖర్చు చేయగా, ప్రాజెక్టుల నిర్వహణకు మాత్రం ఏటా రూ.100 కోట్లను కూడా ఖర్చు చేయడం లేదు. నెలకు కనీసం రూ.20 కోట్లు ఇచ్చినా ప్రాజెక్టుల నిర్వహణ సజావుగా సాగుతుందని నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.
పనులు చిన్నవే.. కాని అత్యంత కీలకం!
రాష్ట్రంలో 40 వరకు భారీ, మధ్యతరహా జలాశయాలుండగా, వాటికి 1,884 గేట్లున్నాయి. 42 వేల కి.మీ. మేర ప్రధాన కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలు, 900 కి.మీ. మేర పైప్డ్ కాల్వలు, 138 పంప్‌హౌస్‌లు, 115 సబ్‌స్టేషన్లతో పాటు కాల్వలపై బ్రిడ్జీలు, అక్విడక్ట్‌లు వంటి 1.3 లక్షల ఇతర నిర్మాణాలున్నాయి.
జలాశయాల గేట్లకు గ్రీజింగ్, గేట్లు ఎత్తే క్రేన్లు, జనరేటర్లు, రోప్‌వైర్లకు మరమ్మతులు, కాల్వల్లో కలుపు మొక్కల తొలగింపు, దెబ్బతిన్న కాల్వలకు మరమ్మతులు, ఎలక్ట్రికల్ పనులు, డిస్ట్రిబ్యూటరీల నిర్వహణ వంటి పనులు నీటిపారుదల శాఖలోని ఓ అండ్ ఎం విభాగం పరిధిలోకి వస్తాయి. స్థానిక చిన్నస్థాయి కాంట్రాక్టర్లే వీటిని చూస్తుండగా, బిల్లులు చెల్లించకపోవడంతో పనులు చేపట్టేందుకు వారు ముందుకు రావడం లేదు.
ఏదైనా జలాశయం గేట్లకు గ్రీజింగ్‌కు ఏటా రూ.10 లక్షల లోపే వ్యయం కానుండగా, ఈ పనులు చేయకపోతే వరదల సమయంలో గేట్లు మొరాయించే ప్రమాదం ఉంటుంది. కాల్వల్లో కలుపు మొక్కలు, పూడిక పేరుకుపోవడంతో ప్రస్తుత యాసంగి సీజన్‌లో చాలా ప్రాజెక్టుల కింద చివరి ఆయకట్టుకు సాగునీరు అందడం లేదని పెద్దసంఖ్యలో ఫిర్యాదులొస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment