
కాళేశ్వరంలో వేగంగా ఎండుతున్న గోదారి
వచ్చే నెల 15 నుంచి సరస్వతీ పుష్కరాలు
దేవాదాయ–నీటిపారుదల శాఖ అధికారుల మల్లగుల్లాలు
నదిలో బోర్లు వేసి తాత్కాలిక కుంటలో నీళ్లు నింపే యోచన
సాక్షి, హైదరాబాద్: గోదావరి–ప్రాణహిత నదులు సంగమించే చోట అంతర్వాహినిగా ఉందని భక్తులు విశ్వసించే సరస్వతీ నదికి వచ్చే నెలలో పుష్కరాలు ఉన్నాయి.. సరిగ్గా మండే ఎండల్లో పుష్కరాలు నిర్వహించాల్సి రావటంతో కొత్త చిక్కు ముంచుకొస్తోంది.. భక్తులు పుణ్యస్నానాలాచరించాల్సిన గోదావరి నది వేగంగా అడుగంటుతోంది. పుష్కరాలకు మరో 37 రోజులున్నందున.. అప్పటికి నీళ్లు దాదాపు ఇంకిపోనున్నాయి. నదిలో నీళ్లే లేకుంటే భక్తులు స్నానాలు ఎలా చేస్తారు?
ఇప్పుడు ఇదే ప్రభుత్వాన్ని వేధిస్తున్న సమస్య
సరస్వతీ పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత జరుగుతున్న తొలి పుష్కరాలు కావటంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంతో, దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి శైలజారామయ్యర్ ఆధ్వర్యంలో అన్ని విభాగాల అధికారుల బృందం ప్రయాగ్‌రాజ్ వెళ్లి మహాకుంభమేళా నిర్వహణ తీరును అధ్యయనం చేసి వచ్చిoది. కోట్ల మంది భక్తులు వచ్చినా ఇబ్బందులు ఎదురుకాకుండా ఏర్పాట్లు చేసిన విధానాన్ని పరిశీలించింది.
వచ్చే ఏడాది, ఆపై సంవత్సరం గోదావరి, కృష్ణా పుష్కరాలు నిర్వహించాల్సి ఉంది. వచ్చే నెల 15 నుంచి 26 వరకు సరస్వతీ పుష్కరాలు ఉన్నాయి. గోదావరి, కృష్ణా పుష్కరాలకు ముందు ప్రారంభంకానున్న సరస్వతీ పుష్కరాలను ఘనంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. దీంతో అధికారులు ఆ పనుల్లో నిమగ్నమయ్యారు.
కానీ, పుష్కరాలకు అతి ముఖ్యమైన నదీ జలాలే లేకుంటే ఎలా అని అధికారులు తర్జనభర్జనలో మునిగిపోయారు. తాజాగా దేవాదాయశాఖ ఉన్నతాధికారులు నీటిపారుదల శాఖ అధికారులతో భేటీ అయి దీనిపై చర్చించారు.
తాత్కాలిక అడ్డుకట్టతో నీటి నిల్వ
ప్రస్తుతం గోదావరి దాదాపు అడుగంటింది. ప్రాణహిత నదిలో కొంత నీటి ప్రవాహం ఉంది. కాళేశ్వరం దేవాలయం సమీపంలో నదీగర్భంలో తాత్కాలిక అడ్డుకట్ట నిర్మించి నీటిని నిల్వ చేసి పుష్కర స్నానాలకు వాడాలన్న ప్రతిపాదన వచ్చిoది. కానీ, మండే ఎండల్లో నిల్వ నీటిలో బ్లూగ్రీన్ ఆల్గే బ్యాక్టీరియా ఏర్పడే ప్రమాదం ఉంటుందని, ఆ నీటిలో స్నానం చేస్తే చర్మ సంబంధిత సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉండనున్నందున అది ఆచరణీయం కాదని భావిస్తున్నారు.
ఎల్లంపల్లి నుంచి నీటి విడుదల
కాళేశ్వరం దేవాలయానికి ఎగువన ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసి నదిలో స్నానాలకు నీళ్లు ఉండేలా చూడాలన్నది మరో ఆలోచన. కానీ, ఎల్లంపల్లి ప్రాజెక్టు కాళేశ్వరం దేవాలయానికి దాదాపు 80 కి.మీ. దూరంలో ఉంది. ప్రస్తుతం గోదావరిలో భారీ గుంతలున్నాయి. ఆ గుంతలు నిండితేనే ప్రవాహం ముందుకు సాగుతుంది.
ఇసుక తేలిన నదిలో చాలా నీళ్లు ప్రవాహంలోనే ఇంకుతాయి. పుష్కరాల నాటికి ప్రచండ ఎండలుండనున్నందున ప్రవాహంలో నీళ్లు ఆవిరయ్యే పరిస్థితి ఉంటుంది. వీటిని తట్టుకుని నీళ్లు దేవాలయం వరకు చేరాలంటే నిత్యం 5 వేల క్యూసెక్కుల వరకు విడుదల చేయాల్సి ఉంటుందని అధికారులంటున్నారు. అది అంత సులభం కాదనే అభిప్రాయమూ ఉంది.
బోర్లు వేయటం ద్వారా
నదిలో శక్తివంతమైన బోర్లు తవ్వించటం ద్వారా నీటిని పైకి లాగి తాత్కాలిక కొలనులు ఏర్పాటు చేసి నీటిని నింపాలన్నది ఒక ఆలోచన. ఇక ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకొచ్చి పుష్కర ఘాట్లపై షవర్లు ఏర్పాటు చేసి జల్లు స్నానాలకు ఏర్పాట్లు చేయాలన్నది మరో ఆలోచన. త్వరలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.