endowment department
-
సత్యసాయి జిల్లా చిల్లవారిపల్లిలో తీవ్ర ఉద్రిక్తత
ధర్మవరం: శాంతి భద్రతలను సంరక్షించాల్సిన పోలీసులే శ్రీ సత్యసాయి జిల్లాలోని ఓ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులకు కారణమయ్యారు. టీడీపీ నేతల ఒత్తిళ్లతో దేవదాయ శాఖ అధికారులు, పోలీసులు కొత్త సంప్రదాయానికి తెరతీసి గొడవలకు ఆజ్యం పోశారు. దీంతో బుధవారం రాత్రి ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండలం చిల్లవారిపల్లిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. శ్రీ కాటికోటేశ్వర స్వామి ఏడు వెండి గుర్రాలను బలవంతంగా ఎత్తుకెళ్లడానికి పోలీసులు ప్రయత్నించడంతో గ్రామస్తులు మూకుమ్మడిగా అడ్డుకున్నారు. ఆలయ పూజారి పురుగుల మందు తాగగా, మరో ముగ్గురు యువకులు ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. చిల్లవారిపల్లి సమీపంలోని శ్రీకాటికోటేశ్వర క్షేత్రంలో ఏటా మహా శివరాత్రి పండుగ రోజున, మరుసటి రోజున రెండు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. స్వామి వారి గొడుగులు, ఆభరణాలతో కూడిన ఏడు వెండి గుర్రాలు చిల్లవారిపల్లిలోని గంగిరెడ్డిగారి వంశస్తుల ఆధీనంలో ఉంటాయి. ఆలయం, ఉత్సవాల నిర్వహణ కోసం గతంలో ఆలయ కమిటీ కూడా ఉండేది.ఆరేళ్ల క్రితం దేవదాయ శాఖ అధికారులు ఆలయ కమిటీ ని రద్దు చేసి గ్రామ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం గ్రామ కమిటీ చైర్మన్‌గా గంగిరెడ్డిగారి నారాయణరెడ్డి ఉన్నారు. ఈ క్షేత్రం ఆలయ పూజారి విషయంలోనూ చిల్లవారిపల్లి, చిల్లకొండయ్యపల్లి గ్రామస్తుల మధ్య వివాదం కోర్టులో నడుస్తోంది. దీంతో ఇరు గ్రామాల వ్యక్తిని కాదని ఓ బ్రాహ్మణున్ని పూజారిగా పెట్టి ఆలయ, ఉత్సవాల నిర్వహణ సవ్యంగా, ప్రశాంతంగా చేపడుతున్నారు. కానీ, కూటమి ప్రభుత్వం రాగానే ఆలయంపై రాజకీయ పెత్తనం మళ్లీ మొదలైంది. టీడీపీ నేతల అడుగులకు మడుగులొత్తుతున్న దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ (ఏసీ) నరసింహరాజు అత్యుత్సాహంతో క్షేత్రంలోని బ్రాహ్మణ పూజారిని తొలగించారు. చిల్లకొండయ్యపల్లి గ్రామస్తుణ్ని పూజారిగా నియమించారు. దీంతో మళ్లీ గొడవలు మొదలయ్యాయి. చిల్లకొండయ్యపల్లికి చెందిన పూజారిని మారిస్తేనే ఈసారి ఉత్సవాల నిర్వహణకు సహకరిస్తామని చిల్లవారిపల్లి గ్రామస్తులు భీష్మించారు. అయితే.. బుధవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో ధర్మవరం ఆర్డీవో మహేష్, డీఎస్పీ హేమంత్ కుమార్ వందలాది మంది పోలీసులతో గ్రామంలోకి ప్రవేశించారు. శ్రీకాటికోటేశ్వర స్వామి ఆలయ తాళాలు పగలగొట్టి, ఏడు వెండి గుర్రాలను బలవంతంగా తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. చిల్లవారిపల్లి గ్రామస్తులంతా ఏకమై వారిని అడ్డుకోవడంతో పోలీసులు కొద్దిసేపు మిన్నకుండి పోయారు. రాత్రి 8 గంటల సమయంలో పోలీసులు వెండి గుర్రాలను ఎత్తుకెళ్లడానికి మళ్లీ ఆలయం వద్దుకు చేరుకున్నారు. దీంతో గ్రామస్తులు మళ్లీ అడ్డుకున్నారు. ఇదే సమయంలో గ్రామంలోని ఆలయ పూజారి గంగిరెడ్డిగారి మంజునాథ్‌రెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గాలిబంకు శంకర్‌రెడ్డి, సిరియాల కిష్టయ్య, అండ్ర వెంకటరెడ్డి ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించారు. గ్రామస్తులు అడ్డుకుని వారిపై నీళ్లు పోశారు. గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గ్రామస్తులు తీవ్రంగా ప్రతిఘటించడంతో పోలీసులు వెనుదిరిగి వెళ్లారు.ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలి: ఎస్పీజిల్లా ఎస్పీ వి.రత్న బుధవారం శ్రీకాటికోటేశ్వర క్షేత్రం వద్దకు వచ్చారు. మహాశివ రాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. ఉత్సవాలను ఎవరైనా అడ్డుకోవడానికి ప్రయత్నించినా, ఘర్షణలకు దిగినా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డీఎస్పీ హేమంత్ కుమార్‌ను ఆదేశించారు. -
తుదిదశకు స్వర్ణ తాపడం పనులు
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ విమానగోపురానికి చేపట్టిన స్వర్ణతాపడం పనులు పూర్తికావొచ్చాయి. ఈ నెల 23న కుంభాభిషేకం కార్యక్రమానికి దేవాదాయశాఖ ఏర్పాట్లు చేస్తోంది. దాతలు ఇచ్చిన సొమ్ముతోపాటు దేవస్థానం నిధులు రూ.21 కోట్లతో సుమారు 60 కిలోలకు పైగా బంగారంతో స్వర్ణతాపడం పనులు చేపట్టారు. సీసీ కెమెరాల నిఘాలో పనులు రాత్రింబవళ్లు జరుగుతున్నాయి. అయితే, భక్తుల మనోభావాలకు అనుగుణంగా క్షేత్ర ప్రాశస్థ్యం పెంచే చర్యలు తీసుకోవడంతోపాటు భక్తులకు మరిన్ని వసతులు కల్పించాల్సిన అవసరముంది. ఆలయ ఉద్ఘాటన జరిగిన రెండు సంవత్సరాలు కావొస్తున్నా నిధుల లేమితో వసతుల పనులు ఇంకా పూర్తికాలేదు. మార్చిలో జరిగే వార్షిక బ్రహ్మోత్సవాల నాటికి పెండింగ్ పనులు పూర్తయ్యే పరిస్థితి లేదు. – సాక్షి, యాదాద్రిసీఎం సమీక్షించినాయాదాద్రి పేరును యాదగిరిగుట్టగా మార్చిన సీఎం రేవంత్‌రెడ్డి.. దేవస్థానంలో పనులు పూర్తి చేయడానికి నిధులు విడుదల చేయడం లేదు. ఇప్పటివరకు జరిగిన పనులకు చెల్లించాల్సిన బిల్లులు రూ.70 కోట్లకు పైగా పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. నవంబర్ 8న యాదగిరిగుట్టకు వచ్చిన సీఎం.. అభివృద్ధి పనుల ప్రతిపాదనలు పంపించాలని అధికారులను ఆదేశించారు. ఆ మేరకు అధికారులు కొండ ప్రాశస్త్యం, భక్తుల వసతులకు పనుల ప్రతిపాదనలు పంపించారు. ప్రధానంగా కొండపైన రాత్రి నిద్ర చేయడానికి డార్మెటరీ హాల్, కల్యాణ మండపం, కళాభవన్, కల్యాణకట్ట, క్యూలైన్లలో మరిన్ని వసతుల కోసం పంపిన ప్రతిపాదనలకు సంబందించిన ఫైల్ ముఖ్యమంత్రి కార్యాలయంలో పెండింగ్‌లో ఉంది. ఇవీ చేపట్టిన పనులుగత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనుల్లో ప్రధానమైనవి కొండపైన కృష్ణ శిలలతో ఆలయ గోపురాలు, మాడవీధులు, చుట్టూ ప్రాకారాలు, గర్భగుడి, ధ్వజస్తంభం, శివాలయం, క్యూలైన్లు, ప్రసాదాల వంటశాల, కొండపైన విష్ణుపుష్కరిణి, కొండకింద లక్ష్మి పుష్కరిణి, స్వామి తెప్పోత్సవం కోసం గండి చెరువు, నిత్యాన్నదాన సత్రం, సత్యనారాయణస్వామి వ్రత మండపం, కొండపైన బస్బే, దీక్షాపరుల మండపం, గిరిప్రదర్శన రింగ్‌రోడ్డు, పెద్దగుట్టపైన టెంపుల్ సిటీ, గుట్ట చుట్టూ రింగ్‌రోడ్డు, ఆర్టీసీ బస్టాండ్, దేవస్థానం బస్టాండ్, ప్లైఓవర్ల నిర్మాణం చేపట్టారు.ఈ పనులు పూర్తికాలేదు » బాలాలయం స్థానంలో రంగ మండపం (కళాభవన్) నిర్మించాలని నిర్ణయించారు. కల్యాణోత్సవాలు, భక్తుల రాత్రి నిద్ర చేయడం, సాంస్కృతిక కార్యక్రమాలు జరిపించొచ్చని భావించారు. పనులు ఇంకా ప్రారంభం కాలేదు. » స్వచ్చంద సంస్థ వెగ్నేష్ రూ.11 కోట్లతో నిర్మించిన అన్నదాన సత్రం ఇంకా భక్తులకు అందుబాటులోకి రాలేదు. ఇది అందుబాటులోకి వస్తే రోజు సుమారు రెండు వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించొచ్చు. ప్రస్తుతం దీక్షాపరుల మండపంలో భక్తులకు రోజు అన్నప్రసాదం అందిస్తున్నారు. » దేవస్థానం బస్టాండ్ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. » కొండ పైన దుకాణాలు కోల్పోయిన వ్యాపారులకు కొండ కింద 122 దుకాణాల కోసం మడిగెలు నిర్మిస్తున్నారు. ఇందులో పుష్కరిణి వద్ద కొందరికి దుకాణాలు కేటాయించారు. మిగతావి ఇంకా పూర్తి కాలేదు. » గోదావరి జలాలతో నింపిన గండి చెరువులో తెప్పోత్సవం పనులు పూర్తి కాలేదు. గ్రీనరీ, బెంచీలు ఏర్పాటు వరకే నిలిచిపోయాయి. » కొండపైకి చేపట్టిన ఘాట్‌రోడ్డు పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం ఒకే రోడ్డు ఉండడంతో వాహనాలకు ఇబ్బందిగా మారింది. » పెద్దగుట్టపైన వైటీడీఏ అభివృద్ధి చేసిన టెంపుల్ సిటీలో దాతల సాయంతో నిర్మించతలపెట్టిన వసతిగదుల నిర్మాణం ప్రారంభం కాలేదు. -
విజయవాడ దసరా ఉత్సవాల్లో ఘోర అపచారం
-
విజయవాడ: దసరా ఉత్సవాల్లో ఘోర అపచారం
సాక్షి, విజయవాడ: దసరా ఉత్సవాల్లో ఘోర అపచారం జరిగింది. భవానీ భక్తులను దేవాదాయ శాఖ దారుణంగా మోసం చేసింది. ఆగమ శాస్త్రానికి తూట్లు పొడిచిన దుర్గ గుడి అధికారులు.. భక్తులకు ఇతర ఆలయాల్లో ప్రసాదాలు పంపిణీ చేశారు. ఇతర ఆలయాల ప్రసాదాలు దుర్గమ్మ ప్రసాదంగా పంపిణీ చేయడం ఆగమ శాస్త్ర విరుద్ధం. దుర్గగుడికి పెదకాకాని, మోపిదేవి, పెనుగంచిప్రోలు ఆలయాల నుంచి తెచ్చిన 37 వేల లడ్డూలు భవానీ భక్తులతో పాటు దుర్గమ్మ దర్శనానికి వచ్చిన భక్తులకు పంపిణీ చేశారు.ఇతర ఆలయాల నుంచి లడ్డూ ప్రసాదం తెచ్చి దుర్గమ్మ ప్రసాదంగా పంపిణీ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేవాదాయశాఖ, దుర్గగుడి అధికారుల తీరుపై భక్తులు మండిపడుతున్నారు. బెజవాడ దుర్గమ్మ లడ్డూ ప్రసాదం భవానీ భక్తులకు అత్యంత పవిత్రం, ప్రీతికరం. అయితే, లడ్డు ప్రసాదం కొరత రాకుండా ఉండేందుకేనంటూ చేసిన అపచారాన్ని దుర్గగుడి అధికారులు సమర్థించుకుంటున్నారు. సామాన్య భక్తులతో పాటు భవానీ భక్తుల మనోభావాలను దేవాదాయ శాఖ అధికారులు దారుణంగా దెబ్బతీశారు. -
పూజారి.. ఏది దారి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని దేవాదాయశాఖ పరిధిలోని ఆలయాల అర్చకుల బదిలీలపై పీఠముడి ఏర్పడింది. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ఇక ఆల య అర్చకులను కూడా బదిలీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని అర్చకులు మూకుమ్మడిగా వ్యతిరేకిస్తున్నారు. వీరికి ఆ శాఖలోని కొందరు అధికారులు మద్దతిస్తుండగా, మరికొందరు అధికారులు మాత్రం బదిలీ చేయటంలో ఎలాంటి తప్పు లేదని పేర్కొంటున్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా అర్చకులు.. మంత్రులు మొదలు స్థానిక ఎమ్మెల్యేలను కలుస్తూ, ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకునేలా ఒత్తిడి ప్రారంభించారు. వాస్తవానికి ఇప్పటివరకు దేవాలయ ఉద్యోగులను మాత్రమే ఒక ఆలయం నుంచి మరో ఆలయానికి బదిలీ చేసేవారు. అర్చకులు మాత్రం అదే దేవాలయంలో పనిచేస్తూ వస్తున్నారు. అయితే ఉద్యోగులతో సమంగా ఇప్పుడు ఆలయ అర్చకులు కూడా ప్రభుత్వం నుంచి జీతాలు పొందుతున్నందున.. అర్చకులను కూడా ఆలయ ఉద్యోగులుగానే పరిగణిస్తూ బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు దేవాదాయ శాఖ పది రోజులుగా కసరత్తు చేస్తోంది. హైకోర్టు స్టే.. కౌంటర్‌కు ప్రభుత్వం ఏర్పాట్లు.. దేవాదాయ శాఖ చరిత్రలో తొలిసారి అర్చకుల బదిలీలకు రంగం సిద్ధమైన వేళ. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ భద్రాచలం దేవాలయానికి చెందిన నారా యణాచార్యులు, మురళీకృష్ణమాచార్యులు హైకోర్టును ఆశ్రయించటంతో కోర్టు బదిలీ ప్రక్రియను రెండు వారాలపాటు నిలిపేస్తూ స్టే ఇచ్చింది. దీనికి కౌంటర్ దాఖలు చేసేందుకు దేవాదాయ శాఖ సిద్ధమవుతోంది. అర్చకుల వివరాలు, బదిలీ చేస్తే ప్రత్యామ్నాయ దేవాలయాన్ని ఎంచుకునే ఐచ్చికాన్ని తెలపాలంటూ జారీ చేసిన నమూనా పత్రం ఆధారంగా ఈ ఇద్దరు అర్చకులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే స్టే గడువు పూర్తి కాగానే బదిలీలు నిర్వహించాలన్న అభిప్రాయంతో ఉన్నతాధికారులున్నట్టు తెలుస్తోంది. ఐదు దేవాలయాల చాయిస్ ఆయా దేవాలయాల ఉద్యోగుల వివరాలను, వారు బదిలీలో ఏ దేవాలయాన్ని కోరుకుంటున్నారో (ఐదు దేవాలయాల చాయిస్) వెల్లడించాలని పే ర్కొంటూ ప్రొఫార్మాను ఆలయాలకు పంపింది. ఆ వివరాలు సేకరించి.. ఉమ్మడి జిల్లా యూనిట్‌గా అంతరజిల్లా బదిలీలు చేయాలని నిర్ణయించింది. అర్చకులతోపాటు వేద పండితులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కూడా నిర్ణయించటం విశేషం. ఎవరికి వర్తిస్తుందంటే. రాష్ట్రంలోని దేవాలయాల ఆదాయం ఆధారంగా వాటి స్థాయిని ప్రభుత్వం విభజించింది. సాలీనా రూ.2 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వాటిని నేరుగా పర్యవేక్షిస్తూ తన ఆ«దీనంలోకి తీసుకుంది. ఈ దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు ఉద్యోగుల తరహాలో గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా జీతాలను చెల్లిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఇలాంటివి646 దేవాలయాలున్నాయి. వీటిల్లో 2500 మంది వరకు అర్చకులు పనిచేస్తున్నారు. ప్రతి సంవత్సరం 20 శాతం మంది బదిలీ.. దేవాదాయ శాఖలో ప్రతి సంవత్సరం 20 శాతం మంది ఉద్యోగులను బదిలీ చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. బదిలీ ప్రక్రియకు సంబంధించిన గైడ్‌లైన్స్‌ను వెల్లడిస్తూ 2019లో జీఓ నంబరు 64ను జారీ చేసింది. కానీ, అది అమలులోకి రాలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం బదిలీలకు సిద్ధమైంది. ఈమేరకు జీఓ 243ని వారం రోజుల క్రితం జారీ చేసింది. వైష్ణవ ఆగమాలను అనుసరించే దేవాలయాల్లో పద్ధతులకు శైవ ఆగమాలను అనుసరించే దేవాలయాల్లో పద్ధతులకు చాలా తేడా ఉంటుంది. ఏ ఆగమాన్ని అనుసరించే దేవాలయ ఉద్యోగులు అదే ఆగమాన్ని అనుసరించే దేవాలయానికే బదిలీ చేయాలని నిర్ణయించింది. -
పూర్ణాహుతితో పరిపూర్ణం
సాక్షి, అమరావతి: దేవదాయ శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అష్టోత్తర శత కుండాత్మక, చండీ, రుద్ర, రాజశ్యామల సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహాయజ్ఞం బుధవారంతో ముగిసింది. వేద మంత్రోచ్ఛారణల నడుమ పీఠాధిపతులు ముందుండి నడిపించగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా మహాయజ్ఞ అఖండ పూర్ణాహుతి కార్యక్రమం వైభవంగా పూర్తైంది. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి, శాంతి సౌభాగ్యాలు, పాడిపంటలు, సిరి సంపదలు, ఆయురారోగ్యాలతో ప్రజలంతా వర్థిల్లాలని కాంక్షిస్తూ, ప్రకృతి అనుగ్రహం ఎల్లప్పడూ కొనసాగాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్ ఈనెల 12వ తేదీన మహాయజ్ఞ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆరు రోజులపాటు నిత్య పారాయణాలు, వైదిక క్రతువులు, వివిధ క్షేత్రాల కల్యాణోత్సవాలు, పీఠాధిపతుల అనుగ్రహభాషణలు, ప్రవచనాలు, పూర్తి ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించిన మహాయజ్ఞ క్రతువులో 600 మందికి పైగా రుత్వికులు, వేదపండితులు పాలుపంచుకున్నారు. ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు, దేవదాయశాఖ కమిషనర్ ఎస్. సత్యనారాయణ దంపతులు దీక్షాధారణ చేపట్టి రోజువారీ యజ్ఞ కార్యక్రమాలలో పాల్గొన్నారు. అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం మహాయజ్ఞం ముగింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సీఎం జగన్‌కు వేద పండితులు మంగళ వాయిద్యాల నడుమ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పాంచరాత్ర, వైదిక స్మార్త, వైఖానస, శైవ ఆగమ యాగశాలలను సందర్శించిన సీఎం జగన్ వేద పండితుల సూచనలకు అనుగుణంగా హోమగుండంలోకి సుగంధ ద్రవ్యాలను జారవిడిచి పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక మండపంలో ఏర్పాటు చేసిన అనంత(మహా)లక్ష్మీ అమ్మవారికి స్వయంగా పంచామృతాలతో అభిషేకం చేసి హారతి ఇచ్చారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులందరి పేర్లతో, గోత్రనామాలతో వేదపండితులు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తగా రూపొందించిన దుర్గ గుడి మాస్టర్ ప్లాన్ నమూనాను యజ్ఞశాల వద్ద ముఖ్యమంత్రి పరిశీలించారు. ఆశీర్వదించిన పీఠాధిపతులు మహాయజ్ఞం అఖండ పూర్ణాహుతి కార్యక్రమంలో విశాఖ శారదా పీఠాధిపతి శ్రీస్వరూపానందేంద్రస్వామి, మైసూరు దత్తపీఠాధిపతి శ్రీగణపతి సచ్చిదానందస్వామి, రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థస్వామి, విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీస్వాత్మానందేంద్ర స్వామితోపాటు శ్రీత్రిదండి దేవనాథ జియ్యర్ స్వామి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలందరి బాగోగులు కోరుతూ ప్రత్యేక సంకల్పం తీసుకుని మహాయజ్ఞ దీక్షను నిర్వహించిన సీఎం జగన్‌కు పీఠాధిపతులు వేర్వేరుగా వేదాశీర్వచనం అందజేశారు. ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు, మంత్రి బొత్స సత్యనారాయణ దంపతులు, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, మంత్రులు తానేటి వనిత, జోగి రమేష్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంపూర్ణంగా ఫలప్రదం: ఉప ముఖ్యమంత్రి కొట్టు వేదాలు సూచించిన ఎనిమిది ఆగమాల ప్రకారం దేశ చరిత్రలో తొలిసారిగా ఆరు రోజులు నిర్వహించిన మహాయజ్ఞం, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పం సంపూర్ణంగా ఫలప్రదమైందని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. దేవదాయశాఖ కమిషనర్ సత్యనారాయణ, ఇతర అధికారులతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ కార్యక్రమానికి ముందురోజు వరుణ దేవుడు వర్షం కురిపించి ఆశీస్సులు అందించినట్లు చెప్పారు. ప్రత్యేకంగా శ్రీనగర్ నుంచి తెప్పించిన కల్తీ లేని కుంకుమ పువ్వు, ఎక్కడా దొరకని కస్తూరిని విశేష ద్రవ్యాలతో పూజల్లో ఉపయోగించినట్లు వెల్లడించారు. మహాయజ్ఞం విజయవంతంగా పూర్తి కావడం పట్ల సీఎం సంతోషం వ్యక్తం చేశార న్నారు. సనాతన హిందూ ధర్మం పట్ల ముఖ్యమంత్రికి ఉన్న గౌరవానికి ఇది నిదర్శనమని చెప్పారు. రాష్ట్రమంతా ధర్మ ప్రచారం కోసం ప్రభుత్వం ఇప్పటికే ధర్మపరి రక్షణ పరిషత్‌ను ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. ఈనెల 25 నుంచి 31వతేదీ వరకు శ్రీశైలంలోని శివాజీ రాజగోపురంపై బంగారు కలశం ఏర్పాటు కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా మల్లిఖార్జునస్వామి వారికి మహా కుంభాభిషేకం నిర్వహిస్తామన్నారు. మహాయజ్ఞం క్రతువును నిర్విఘ్నంగా పూర్తి చేసిన అర్చన ట్రైనింగ్ అకాడమీ డైరెక్టర్ వేదాంత రాజగోపాల చక్రవర్తి, గోపాలాచార్యులు, కైతేపల్లి సుబ్రహ్మణ్యం, కండవల్లి సూర్యనారాయణాచార్యులు, మృత్యుంజయప్రసాద్, దుర్గగుడి స్థానాచార్యులు శివప్రసాద్‌ను ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, దేవదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ అభినందించారు. ముఖ్యమంత్రి జగన్‌కు కాణిపాకం గణపతి ఆశీస్సులు యాదమరి (చిత్తూరు జిల్లా): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామి ఆశీస్సులను వేదపండితులు అందచేశారు. బుధవారం విజయవాడలో శ్రీలక్ష్మీ మహాయజ్ఞం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్‌ను కాణిపాకం ఆలయం చైర్మన్ మోహన్‌రెడ్డి కలసి స్వామివారి తీర్థ ప్రసాదాలు, వేదపండితుల ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో కొత్తగా 3,000 ఆలయాలు
సాక్షి, అమరావతి: దేవదాయ శాఖ ఆధ్వర్యంలో టీటీడీ శ్రీవాణి ట్రస్టు ద్వారా రాష్ట్రంలో కొత్తగా దాదాపు 3 వేల ఆలయాలను నిర్మిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో ఆలయాల నిర్మాణం కొనసాగుతోందన్నారు. అధికారులతో సమీక్ష అనంతరం శుక్రవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక్కో ఆలయానికి రూ.10 లక్షల చొప్పున 1,072 ఆలయాల నిర్మాణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందన్నారు. వీటిలో 936 చోట్ల ఆలయాలను నిర్మించేందుకు భూమిని గుర్తించామని చెప్పారు. వీటిలో పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. శ్రీవాణి ట్రస్టు ద్వారానే మరో 330 ఆలయాల నిర్మాణం హిందూ ధార్మిక సంస్థ సమరసత ఆధ్వర్యంలో కొనసాగుతోందన్నారు. ఇవికాకుండా మరో 1,568 ఆలయాల నిర్మాణానికి స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి ప్రతిపాదనలు వచ్చాయని తెలిపారు. మరో 300 చోట్ల కూడా ఆలయాలను నిర్మించాలని అక్కడి ప్రజాప్రతినిధులు కోరుతున్నారన్నారు. వచ్చే ఏడాదిన్నర కాలంలోనే ఆలయాల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. వేగంగా నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు ప్రతి 30 ఆలయాలకు ఒక ఇంజనీరింగ్ అధికారిని నియమించనున్నామని తెలిపారు. దేవదాయ శాఖ ఆలయాల్లో పనిచేసే ఉద్యోగుల బదిలీలకు ఏక విధానంతో కూడిన ప్రత్యేక పాలసీని తీసుకురానున్నట్టు చెప్పారు. అన్నదాన సత్రాల ఏర్పాటుకు 18 దరఖాస్తులు.. శ్రీశైలంలో వివిధ కులసంఘాల ఆధ్వర్యంలో అన్నదాన సత్రాల ఏర్పాటు, ఇతర సేవా కార్యక్రమాల నిర్వహణకు 18 దరఖాస్తులు ప్రభుత్వ పరిశీలనకు వచ్చాయన్నారు. వీటికి ఒక నిర్ణీత విధానంలో భూకేటాయింపులు చేయాలనే యోచన చేస్తున్నట్టు వివరించారు. ముందుగా అక్కడ భక్తులకు వసతి కోసం ఎన్ని గదులతో సత్రాలు నిర్మిస్తారో పూర్తి ప్లాన్‌ను సమర్పించాల్సి ఉంటుందన్నారు. శ్రీశైలంలో భూముల కేటాయింపు ఆలయ అభివృద్ధికి దోహదపడేలా నిబంధనలు తీసుకొచ్చే యోచనలో ఉన్నామని తెలిపారు. శ్రీశైలం ఆలయం– అటవీ శాఖల మధ్య ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న 4,700 ఎకరాల భూమిని అటవీ శాఖ.. ఆలయానికి స్వాధీనం చేసేందుకు ఆమోదం తెలిపిందన్నారు. విజయవాడ దుర్గగుడిలో భక్తులకు అదనపు సౌకర్యాల కోసం పూర్తి స్థాయి మాస్టర్ ప్లాన్ సిద్ధమైందని తెలిపారు. ఆలయాల్లో వివిధ అవసరాలకు వస్తువుల కొనుగోలులో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా ప్రతి ఆలయంలో మూడు వేర్వేరు టెండర్ల ప్రక్రియ ఉంటుందన్నారు. దేవదాయ శాఖ భూముల పరిరక్షణకు ప్రత్యేక సెల్ ఉందని తెలిపారు. -
3 ప్రముఖ ఆలయాలకు ట్రస్టు బోర్డుల నియామకం
సాక్షి, అమరావతి/ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): రాష్ట్రంలో దేవదాయ శాఖ పరిధిలోని మూడు ప్రముఖ ఆలయాలకు ప్రభుత్వం మంగళవారం ట్రస్టు బోర్డులను నియమించింది. కాకినాడ జిల్లా అన్నవరం శ్రీవీరవెంకటసత్యనారాయణ స్వామి వారి దేవస్థానానికి ఆ ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఐ.వి.రోహిత్‌ను ట్రస్టు బోర్డు చైర్మన్‌గా, మరో 13 మంది ట్రస్టు బోర్డు సభ్యులుగా నియమిస్తూ దేవదాయశాఖ ముఖ్య కార్యదర్శి హరిజవహర్‌లాల్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి దేవస్థానానికి ఆ ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఎస్వీ సుధాకరరావును ట్రస్టు బోర్డు చైర్మన్‌గా, మరో 14 మంది ట్రస్టు బోర్డు సభ్యులుగా నియమించారు. అదే విధంగా విజయవాడ శ్రీదుర్గమల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానానికి 15 మంది ట్రస్టు బోర్డు సభ్యులను నియమించారు. ఈ మూడింటికి వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు. విజయవాడ దుర్గగుడి ట్రస్టు బోర్డు చైర్మన్‌ను సభ్యులు ప్రమాణ స్వీకారం అనంతరం సమావేశమై ఎన్నుకుంటారు. అదనంగా ఆయా ఆలయాలలో ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్న వారు ఆయా ట్రస్టు బోర్డులో ఎక్స్ అఫిషియో సభ్యులుగా కొనసాగుతారని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆయా ఆలయాల ట్రస్టు బోర్డులలోని సభ్యులు పదవీ బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి రెండేళ్ల పాటు ఆ పదవుల్లో కొనసాగుతారని తెలిపింది. దుర్గమ్మ ఆలయ చైర్మన్‌గా కర్నాటి రాంబాబు ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన నూతన పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం మంగళవారం జరిగింది. చైర్మన్‌గా కర్నాటి రాంబాబు, సభ్యులుగా కేసరి నాగమణి, కట్టా సత్తెయ్య, బుద్దా రాంబాబు, దేవిశెట్టి బాలకృష్ణ, చింతా సింహాచలం, బచ్చు మాధవీకృష్ణ, అనుమోలు ఉదయలక్ష్మి, నిడమనూరి కళ్యాణి, నంబూరి రవి, చింకా శ్రీనివాసరావు, మారం వెంకటేశ్వరరావు, అల్లూరి కృష్ణవేణి, తొత్తడి వేదకుమారి చేత ఈవో భ్రమరాంబ ప్రమాణ స్వీకారం చేయించారు. కొలుకులూరి రామసీత ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. -
పండుగలు, ప్రత్యేక పర్వదినాల్లో.. వీఐపీ దర్శనాలకు పరిమితులు
సాక్షి, అమరావతి: పండుగలు, జాతరలు, ఇతర ప్రత్యేక పర్వదినాల్లో ఉదయం సాయంత్రం వేళ నిర్ణీత సమయంలో ఒకట్రెండు గంటలు మాత్రమే ఆలయాల్లో వీఐపీ దర్శనాలను పరిమితం చేయాలని దేవదాయ శాఖ నిర్ణయించింది. సాధారణ భక్తులకు సంతృప్త స్థాయిలో తొందరపాటు లేని దర్శనాన్ని సజావుగా అందించడం అత్యంత ప్రాధాన్యతగా దేవదాయ శాఖ భావిస్తోంది. ఆయా రోజుల్లో వృద్ధులు, చిన్నపిల్లల తల్లులతో పాటు దివ్యాంగుల దర్శనాలకు ప్రత్యేక ఏర్పాట్లుచేస్తారు. ఉప ముఖ్యమంత్రి (దేవదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ సూచన మేరకు దేవదాయ శాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్ అన్ని ఆలయాల ఈఓలకు ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు. ఉత్తర్వుల్లో ముఖ్యాంశాలు.. ► పండుగ, జాతర రోజులతో పాటు ఇతర ప్రత్యేక పర్వదినాల్లో వీఐపీలకు, ఉదయం, సాయంత్రం ఒకట్రెండు గంటల పాటు నిర్ణీత సమయం కేటాయిస్తారు. ఆ సమయంలో కూడా ఒకటి లేదా రెండు సాధారణ భక్తుల క్యూలైన్లు కొనసాగించాలి. ► సామాన్య భక్తులకు సాఫీగా సంతృప్త స్థాయిలో దర్శనాలను అందించడం ఆయా ఆలయాల ఈఓల ప్రాథమిక విధి. ► వీఐపీ, అతని కుటుంబ సభ్యులు మొత్తం ఆరుగురు మించకుండా చూసుకోవాలి. అంతకుమించి ఉంటే వారు దర్శన టికెట్లు కోనుగోలు చేయాలి. ► పండుగ, ప్రత్యేక పర్వదినాల రోజుల్లో ఆలయానికి వచ్చే వీఐపీలకు ఆలయ ఈఓ అవసరమైన మర్యాదలు చేసేందుకు వీలుగా వారు ఆలయ సందర్శన షెడ్యూల్‌కు ఒక్క రోజు ముందు వీఐపీలు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ► ప్రత్యేక పర్వదినాల్లో వీఐపీలతో పాటు సాధారణ భక్తులకు అంతరాలయ దర్శనాలపై నియంత్రణ ఉండాలి. ► ఈ రోజుల్లో అన్ని రకాల దర్శన టికెట్లను ఆన్లైన్ విధానంలో మాత్రమే విక్రయించాలి. ఇంటర్నెట్ సమస్యలు తలెత్తితే పీఓఎస్ వంటి ప్రత్యేక పరికరాల ద్వారా కేటాయించాలి. ► ఈ టికెట్లను క్యూలైన్లో స్కాన్‌చేసే విధానం ఏర్పాటుచేసుకోవాలి. అలాగే, స్కానింగ్ జరిగే ప్రాంతంలో సీసీ కెమెరాలను విధిగా ఏర్పాటుచేసుకోవాలి. ఈ ఫుటేజీ కనీసం 15 రోజుల పాటు బ్యాకప్‌తో ఉండాలి. ► ఉచిత దర్శనం క్యూలైన్లు ఆలయం తెరిచినంతసేపు కొనసాగించాలి. ► దర్శనాలకు సంబంధించి ప్రత్యేకంగా ఒక అధికారి బాధ్యత తీసుకోవాలి. -
గుళ్లలో అరిటాకులు లేదా విస్తళ్లలోనే అన్నదానం
సాక్షి, అమరావతి: ఆలయాల్లో నిర్వహించే అన్నదానంలో భక్తులకు అరిటాకులు లేదా విస్తరాకుల్లో మాత్రమే వడ్డించాలని దేవదాయశాఖ నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం రాష్ట్రంలోని ఆలయాల ఈవోలకు దేవదాయశాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్ ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రంలోని దేవదాయశాఖ పరిధిలోని అన్ని ప్రధాన ఆలయాల్లో భక్తులకు అన్నదాన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మంగళవారం కూడా రాష్ట్రంలోని పది ప్రధాన ఆలయాల్లోనే కేవలం మధ్యాహ్నం వేళ 2,24,727 మంది భక్తులకు అన్నదానం జరిగింది. కొన్ని ఆలయాల్లో స్టీల్‌ప్లేట్లలో అన్నదాన కార్యక్రమం కొనసాగుతున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో.. ఆలయాల్లో అన్నదానం పేరుతో అందజేసే ఆహారానికి మరింత పవిత్రతను కల్పించేందుకు భక్తులకు అరిటాకులు లేదా విస్తరాకుల్లో మాత్రమే భోజనం వడ్డించాలని నిర్ణయించినట్టు దేవదాయశాఖ కమిషనర్ ఈవోలకు ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొన్నారు. ఒకవేళ స్టీల్ప్లేట్లోనే వడ్డించాల్సి వస్తే.. ప్లేట్లో ఆకువేసి వడ్డించాలని సూచించారు. ఇందుకు సంబంధించి ఉపముఖ్యమంత్రి, దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఇటీవల ప్రధాన ఆలయాల ఈవోలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలోను సూచించిన విషయాన్ని కమిషనర్ తన ఆదేశాల్లో ఉదహరించారు. -
పెద్ద ఆలయాల్లో ఆన్లైన్ సేవలు
సాక్షి, అమరావతి: రూ.25 లక్షలకు పైబడి వార్షికాదాయం కలిగిన 175 పెద్ద ఆలయాల్లో జనవరి నెలాఖరుకు ఆన్లైన్ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. దేవదాయ శాఖలో అమలవుతున్న వివిధ కార్యక్రమాలపై బుధవారం విజయవాడలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటికే 16 ప్రధాన ఆలయాల్లో పూర్తి స్థాయి ఆన్లైన్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. దేవదాయ శాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్, అదనపు కమిషనర్ చంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
జేసీ దివాకర్ రెడ్డికి దేవాదాయ శాఖ నోటీసులు
-
16 నుంచి అయ్యప్ప దర్శనం
సాక్షి, అమరావతి: నిర్దిష్ట వేళల్లో మాత్రమే కొనసాగే శబరిమల అయ్యప్పస్వామి దర్శనాలు ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చే ఏడాది జనవరి 18వ తేదీ వరకు ఈ విడత దర్శనాలు కొనసాగుతాయి. కేరళలోని శబరిమల అయ్యప్ప దర్శనానికి రాష్ట్రం నుంచి ఈసారి 5 లక్షలకు పైగా భక్తులు తరలివెళ్తారని అంచనా. వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టే చర్యల్లో భాగంగా ఏటా శబరిమల యాత్ర ప్రారంభానికి ముందు కేరళ రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వివిధ దక్షిణాది రాష్ట్రాల దేవదాయ శాఖ మంత్రులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ ఏడాదికి సంబంధించిన ఏర్పాట్లపై కేరళ మంత్రి రాష్ట్ర దేవదాయ శాఖ అధికారులతో పాటు వివిధ దక్షిణాది రాష్ట్రాల అధికారులతో మూడు రోజుల క్రితం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే దర్శనం కరోనా నేపథ్యంలో మూడేళ్లగా శబరిమల ఆలయానికి సంబంధించిన ‘వర్చువల్ క్యూ సిస్టమ్’ ప్రత్యేక వెబ్ పోర్టల్‌లో ముందుగా పేర్లు నమోదు చేసుకున్న వారిని మాత్రమే ఆలయ అధికారులు దర్శనాలకు అనుమతిస్తున్నారు. ఈ ఏడాది కూడా ముందుగా పేర్లు నమోదు చేసుకున్న వారినే అనుమతిస్తున్న విషయాన్ని ఏపీలోని భక్తులకు తెలిసేలా ప్రచారం చేయాలని కేరళ మంత్రి విజ్ఞప్తి చేశారు. భక్తుల సౌకర్యార్థం శబరిమలకు వచ్చే మార్గంలోని నిలక్కల్, ఎడతావళం ప్రాంతాల్లో ప్రత్యేకంగా స్పాట్ బుకింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఆలయాల్లో ప్రత్యేక బోర్డులు శబరిమల యాత్రకు వెళ్లే భక్తులు పాటించాల్సిన నిబంధనల్ని తెలియజేసేలా రాష్ట్రంలోని పెద్ద ఆలయాల్లో ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేసేలా రాష్ట్ర దేవదాయ శాఖ చర్యలు చేపట్టింది. రూ.25 లక్షలకు పైబడి ఆదాయం వచ్చే దాదాపు 270 ఆలయాల్లో ఈ బోర్డులు ఏర్పాటు చేస్తున్నట్టు దేవదాయ శాఖ అధికారులు వెల్లడించారు. కేరళ ప్రభుత్వం చేసిన సూచనలతో తెలుగులో బుక్లెట్ రూపొందించి, వాటిని ఆయా ఆలయాల వద్ద ఆయ్యప్ప భక్తులకు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. ఈ నిబంధనలు తప్పనిసరి ► దర్శనాలకు వచ్చే భక్తులు వైద్యుడు ఇచ్చే మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్లను తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి. ► భక్తులు ప్లాస్టిక్, వాడి పడేసే కొన్ని రకాలైన పేపర్లు వంటివి కలిగి ఉండకూడదని.. కప్పులు, గ్లాస్లు వంటివి ఒకసారి వాడిన తర్వాత కడుక్కొని తిరిగి వాడుకోవడానికి అవకాశం ఉండేవి మాత్రమే వెంట తీసుకెళ్లాలి. అన్నిరకాల ప్లాస్టిక్ వస్తువులు, యూజ్ అండ్ త్రో కవర్ల వినియోగంపై కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ► గుడ్డ సంచులను మాత్రమే భక్తులు వెంట తీసుకువెళ్లాలి. ► పంబ, అయ్యప్పస్వామి ఆలయ సన్నిధానం ప్రాంతాల్లో సెల్ఫోన్ల వాడకంపై నిషేధం అమలులో ఉంటుంది. -
వచ్చే నెలాఖరుకు శ్రీశైల దేవస్థానం సరిహద్దులు
సాక్షి, అమరావతి: శ్రీశైలం దేవస్థానం భూముల సరిహద్దులను అక్టోబరు నెలాఖరుకల్లా ఖరారు చేయనున్నట్టు ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు. గురువారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీశైలం దేవస్థానం అభివృద్ధిలో భాగంగా మాస్టర్ ప్లాన్ తయారు చేసేందుకు భూ సరిహద్దులు సక్రమంగా లేకపోవడం ఆటంకంగా మారిందన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావుతో కలిసి సమీక్ష నిర్వహించామన్నారు. అటవీ, రెవెన్యూ, సర్వే అండ్ లాండ్ రికార్డ్స్, దేవదాయ శాఖ అధికారుల సంయుక్త ఆధ్వర్యంలో భూ సర్వే చేపడతామన్నారు. 1879లో దాదాపు 4,130 ఎకరాలుండగా.. 1967లో మరో 145 ఎకరాలను ప్రభుత్వం శ్రీశైల దేవస్థానానికి కేటాయించిందన్నారు. నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్టులో ఈ భూములు ఉండటంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటే సరిహద్దుల ఖరారు తప్పనిసరైందన్నారు. రిజర్వ్ ఫారెస్టు నిబంధనలను అతిక్రమించకుండా దేవస్థానానికి చెందిన భూముల్లో పర్యావరణ, ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు. కాగా, బెజవాడ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఉప ఆయన చెప్పారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేశామన్నారు. ఈ సమావేశంలో దేవదాయ శాఖ కమిషనర్ హరి జవహర్లాల్ పాల్గొన్నారు. -
శ్రీవారి సేవలో సీఎం
సాక్షి ప్రతినిధి, తిరుపతి/తిరుమల/సాక్షి నెట్వర్క్: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టువ్రస్తాలు సమరి్పంచారు. ప్రతిఏటా నిర్వహించే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువ్రస్తాలను సమర్పించటం ఆనవాయితీ. అందులో భాగంగా ధ్వజారోహణతో మంగళవారం ప్రారంభమైన బ్రహ్మోత్సవాల తొలి రోజున ఆయన తిరునామం పెట్టుకుని.. పంచెకట్టు, కండువాతో శ్రీవారికి పట్టు వ్రస్తాలను తీసుకొచ్చారు. సీఎం హోదాలో వైఎస్ జగన్ ఇలా శ్రీవారికి పట్టు వ్రస్తాలు సమర్పించడం ఇది నాలుగవసారి. అంతకుముందు బేడి ఆంజనేయస్వామిని దర్శించుకున్న అనంతరం.. అక్కడ అర్చకులు ఆలయ సంప్రదాయం మేరకు సీఎం తలకు పరివట్టం చుట్టారు. పట్టువస్త్రాలను తలపై పెట్టుకున్న ముఖ్యమంత్రి వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, ఆశ్వ, గజరాజులు వెంటరాగా ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. బలిపీటానికి, ధ్వజస్తంభానికి మొక్కుకుని వెండివాకిలి మీదుగా బంగారువాకిలి చేరుకుని గరుడాళ్వార్‌ను దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి సన్నిధిలో అర్చకులకు పట్టువస్త్రాలను అందజేసి స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు స్వామి వైభవాన్ని తెలియజేయగా జీయర్లు శేషవస్త్రంతో íసీఎంను సత్కరించారు. అనంతరం వకుళమాతను దర్శించుకున్న ముఖ్యమంత్రి ప్రదక్షిణగా ఆనందనిలయంపై ఉన్న విమాన వేంకటేశ్వరస్వామిని, సబేరా, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామిని దర్శించుకున్నారు. హుండీలో కానుకలు సమర్పించి రంగనాయకుల మండపానికి చేరుకున్న ఆయనకు వేదపండితులు చతుర్వేద ఆశీర్వచనం అందజేశారు. టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి.. శ్రీవారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీవారి ఆలయంలో బియ్యాన్ని తులాభారంగా సమర్పించారు. 2023 శ్రీవారి కేలండర్, డైరీ, టేబుల్ కేలండర్లను, అగ్గిపెట్టెలో పెట్టిన చీరను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. తరువాత శ్రీవారి వాహన మండపానికి చేరుకున్న సీఎం.. పెద్దశేషవాహన సేవలో పాల్గొన్నారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామిని దర్శించుకున్నారు. అనంతరం పద్మావతి అతిథిగృహానికి చేరుకున్నారు. తిరుమలలో బియ్యాన్ని తులాభారంగా సమర్పిస్తున్న సీఎం జగన్. చిత్రంలో సుబ్బారెడ్డి, మంత్రి రోజా అభిమానం.. అభివాదం శ్రీవారి దర్శనాంతరం ఆలయం వెలుపలకు చేరుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వాహన మండపానికి వెళ్తున్న సమయంలో అక్కడ ఉన్న వారికి అభివాదం చేశారు. కొందరు భక్తులు సీఎంను చూసిన ఆనందంలో సీఎం సార్, సీఎం సార్ అంటూ కేకలు వేశారు. వారందరికీ అదే అభిమానంతో రెండుచేతులతో నమస్కరిస్తూ ఆయన ముందుకు సాగారు. ముందు తిరుపతి గంగమ్మను దర్శించుకున్న సీఎం ఆచారాలు, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 400 ఏళ్ల ప్రాచీన సంప్రదాయాన్ని పునరుద్ధరించారు. తిరుమల శ్రీవారికి చెల్లెలుగా భావించే తిరుపతిలోని శ్రీతాతయ్యగుంట గంగమ్మను దర్శించుకున్న తర్వాతే భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకునే సంప్రదాయం 900 ఏళ్లుగా ఉన్నట్లు చరిత్ర ఉంది. కాలక్రమేణా 400 ఏళ్ల నుంచి ఈ సంప్రదాయం కనుమరుగైంది. ఈ విషయాన్ని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ముఖ్యమంత్రికి వివరించారు. ఘనచరిత్ర కలిగిన అమ్మవారి ఆలయ సంప్రదాయాన్ని పునరుద్ధరించేందుకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు తిరుమల వెళుతూ ముందుగా శ్రీతాతయ్యగుంట గంగమ్మ దర్శనం చేసుకున్నారు. ఆలయ ప్రదక్షిణ అనంతరం అఖిలాండం వద్ద కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమతో కూడిన సారెను సమర్పించారు. దర్శనానంతరం అర్చకులు ముఖ్యమంత్రికి వేదాశీర్వచనం చేశారు. అమ్మవారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయ సందర్శన పుస్తకంలో సీఎం సంతకం చేశారు. తిరుమలలో అర్చకుల ఆశీర్వాదాలు అందుకుంటున్న సీఎం జగన్. చిత్రంలో డిప్యూటీ సీఎం కొట్టు ఎలక్ట్రికల్ బస్సులు ప్రారంభం అనంతరం తిరుపతి–తిరుమల మధ్య నడిపే పది ఎలక్ట్రికల్ బస్సులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అలిపిరిలో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎలక్ట్రిక్ బస్సు ప్రత్యేకతలను ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమలరావు, చైర్మన్ మల్లికార్జునరెడ్డి సీఎంకు వివరించారు. ఒలెక్ట్రా కంపెనీ నుంచి వంద ఎలక్ట్రికల్ బస్సులు రానున్నాయని తెలిపారు. 50 బస్సులను తిరుపతి–తిరుమల, 14 బస్సులను రేణిగుంట–తిరుమల, 12 బస్సులను తిరుపతి–మదనపల్లి, 12 బస్సులను తిరుపతి–కడప, 12 బస్సులను తిరుపతి–నెల్లూరు మధ్య నడపనున్నట్టు చెప్పారు. తిరుపతి–తిరుమల మధ్య నడిపే ఎలక్ట్రికల్ బస్సులను అలిపిరిలో జెండా ఊపి ప్రారంభిస్తున్న సీఎం జగన్ సీఎం వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించేందుకు తిరుపతి చేరుకున్న సీఎం వైఎస్ జగన్‌కు రేణిగుంట విమానాశ్రయం, తాతయ్యగుంట గంగమ్మ ఆలయం, అలిపిరి, తిరుమల పద్మావతి అతిథిగృహం వద్ద ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన వారిలో టీటీడీ చైర్మెన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా, లోక్‌సభ ప్యానల్ స్పీకర్, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎంపీలు గురుమూర్తి, రెడ్డప్ప, జెడ్పీ చైర్మెన్ గోవిందప్ప శ్రీనివాసులు, డీసీసీబీ చైర్మెన్ రెడ్డమ్మ, ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, ఆదిమూలం, మేడా మల్లికార్జునరెడ్డి, కిలివేటి సంజీవయ్య, వరప్రసాద్, ఆర్టీసి వైస్ చైర్మన్ విజయానందరెడ్డి, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి జవహర్‌రెడ్డి, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి, టీటీడీ జేఈవో సదాభార్గవి, ఆర్టీసీ ఈడీలు గోపీనాథరెడ్డి, కృష్ణమోహన్, తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్లు భూమన అభినయ్‌రెడ్డి, ముద్ర నారాయణ, కమిషనర్ అనుపమ అంజలి, తాతయ్యగుంట గంగమ్మ ఆలయ చైర్మన్ కట్టా గోపీయాదవ్, జిల్లా దేవదాయశాఖ అధికారి రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దేవుడితో ఆటలొద్దు.. దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ధ్వజం
సాక్షి, అమరావతి: వినాయక చవితి వేడుకలు, ఇతర సమయాల్లో ప్రతిపక్ష పార్టీలు భగవంతుడి పేరుతో రాజకీయాలు, అసత్య ప్రచారాలను మానుకోవాలని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ సూచించారు. రాష్ట్ర సచివాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ చవితి ఉత్సవాలపై అసత్య ప్రచారం చేస్తున్న విపక్షాల వైఖరిపై మండిపడ్డారు. వారు చేస్తున్న దుష్ప్రచారం భగవంతుడిపై చేస్తున్నారని గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. దేవుడితో ఆటలొద్దని హెచ్చరించారు. భగవంతునికి ఆగ్రహం వస్తే ఏమి జరుగుతుందో తెలుసుకోవాలని అన్నారు. గణేష్ మండపాల ఏర్పాటులో ప్రభుత్వం కొత్తగా ఎలాంటి నిబంధనలు పెట్టలేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న నిబంధనలే ఇప్పుడూ ఉన్నాయన్నారు. కాగా అన్ని ప్రధాన అమ్మవారి దేవాలయాల్లో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పలు ఆలయాల ఈవోలు, డిప్యూటీ, అసిస్టెంట్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. ఆలయాల్లో ఏర్పాట్లు, ప్రత్యేక కార్యక్రమాలపై ఆరా తీశారు. ఈ సమావేశంలో దేవదాయ శాఖ కమిషనర్ హరి జవహర్లాల్ పాల్గొన్నారు. -
ప్రసాదానికి త్వరలో ఫుడ్ సేఫ్టీ సర్టిఫికెట్
సాక్షి, అమరావతి: దేవదాయ శాఖ పరిధిలోని 11 ప్రముఖ ఆలయాల్లో భక్తులకు పంచిపెట్టే ప్రసాదాలకు కేంద్ర ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ సర్టిఫికెట్లు దక్కబోతున్నాయి. కేంద్ర ఫుడ్ సేఫ్టీ విభాగం ఇటీవల ప్రసాదాల నాణ్యత ఆధారంగా భోగ్(దేవునికి సమర్పించే పరిశుభ్రమైన నైవేద్యం) పేరుతో సర్టిఫికెట్లు జారీ చేసే విధానానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో శ్రీశైలం, శ్రీకాళహస్తి, బెజవాడ దుర్గగుడి, సింహాచలం, కాణిపాకం, అన్నవరం, పెనుగంచిప్రోలు, విశాఖపట్నం కనకమహాలక్ష్మీ, కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి, మహానంది, ద్వారకా తిరుమల ఆలయాల్లోని ప్రసాదాలకు సర్టిఫికెట్ జారీ చేసేందుకు ఫుడ్ సేఫ్టీ విభాగం ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో 11 ప్రధాన ఆలయాల ఈవోలు ప్రసాదాలకు భోగ్ సర్టిఫికెట్ కోసం వెంటనే ఫుడ్ సేఫ్టీ విభాగానికి దరఖాస్తు చేయాలని దేవదాయ శాఖ కమిషనర్ హరి జవహర్లాల్ శనివారం ఆదేశాలిచ్చారు. -
'దేవాదాయశాఖలో ధార్మిక పరిషత్ నిర్ణయాలే కీలకం'
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో 21 మంది సభ్యులతో పూర్తిస్థాయి ధార్మిక పరిషత్‌ను ఏర్పాటు చేసినట్లు దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ఈమేరకు సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'టీడీపీ ప్రభుత్వంలో కోట్లాది రూపాయల ఆస్తులు అన్యాక్రాంతం అయినా పట్టించుకోలేదు. కొన్ని మఠాలలో అక్రమాలు జరిగినా చర్యలు తీసుకోలేదు. ధార్మిక పరిషత్‌కి మాత్రమే ఆ అధికారం ఉంటుంది. దేవాదాయశాఖలో ధార్మిక పరిషత్ నిర్ణయాలే కీలకం. అందుకే 21 మందితో ధార్మిక పరిషత్‌ని ఏర్పాటు చేశాము. సీజీఎఫ్ కమిటీని పూర్తిస్థాయిలో నియమించాం. గతంలో నలుగురు మాత్రమే ఉన్నారు. అందులో మరో ముగ్గురిని చేర్చాం. కలికి కోదండరామిరెడ్డి, మలిరెడ్డి వెంకటపాపారావు, కర్రి భాస్కరరావులను సభ్యులుగా నియమించాం. హిందూ ధర్మ పరిరక్షణ కోసమే ఈ కమిటీలను నియమించాం. చదవండి: (21 మందితో ధార్మిక పరిషత్) కనీసం గ్రామానికి ఒక దేవాలయానికి దూప, దీప నైవేధ్యం పథకం అమలు చేసేలా చర్యలు తీసుకుంటాం. అన్ని జిల్లాల అధికారులకు దరఖాస్తులను పరిశీలించాలని కోరాం. దీని ద్వారా ప్రతి గ్రామంలో హిందూ దేవాలయలను పరిరక్షించే బాధ్యతను తీసుకున్నాం. ట్రిబ్యునల్ కేసులకు సంబంధించిన వెబ్‌సైట్‌ని ఏర్పాటు చేస్తున్నాం. దేవాలయాలకు 4లక్షల 9వేల ఎకరాల భూములున్నాయి. వాటిలో కొన్ని ఆక్రమణలో ఉన్నాయి. వాటిని తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని' మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. చదవండి: (ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఇంటికి సీఎం జగన్) -
21 మందితో ధార్మిక పరిషత్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 21 మంది సభ్యులతో పూర్తిస్థాయి ధార్మిక పరిషత్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దేవదాయ శాఖ పరిధిలో ఉండే ఆలయాలు, మఠాలు, సత్రాలు, ఇతర హిందూ ధార్మిక సంస్థల వ్యవహారాలపై ప్రభుత్వ పరంగా తీసుకొనే విధాన నిర్ణయాల్లో అత్యంత కీలకంగా వ్యవహరించే ధార్మిక పరిషత్ పదేళ్ల తర్వాత పూర్తిస్థాయిలో ఏర్పాటయింది. దేవదాయ శాఖ మంత్రి చైర్మన్‌గా, ఇద్దరు మఠాధిపతులు, ఇద్దరు ఆగమ పండితులు, ఓ రిటైర్డు హైకోర్టు జడ్జి, ఓ రిటైర్డు ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి, ఓ రిటైర్డు ఐఏఎస్ అధికారి, ఒక చార్టెడ్ అకౌంటెంట్, ఒక రిటైర్డు దేవదాయ శాఖ అధికారితో పాటు ఆలయాల నిర్మాణంలో ముఖ్య భూమిక ఉండే ఇద్దరు దాతలు, వివిధ ఆలయాల పాలక మండళ్లకు చైర్మన్లుగా ఉన్న ఆరుగురుని సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. అధికారవర్గాల నుంచి దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, టీటీడీ ఈవో సభ్యులుగా, దేవదాయ శాఖ కమిషనర్ సభ్య కార్యదర్శిగా (మెంబర్ సెక్రటరీ) ఉంటారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో నెంబరు 571 విడుదల చేసింది. పరిషత్ పదవీ బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి మూడేళ్లు కొనసాగుతుందని ప్రభుత్వం పేర్కొంది. ఉమ్మడి ఏపీలోగానీ, ప్రస్తుత విభజిత ఏపీలోగానీ ధార్మిక పరిషత్‌ను ఏర్పాటు చేయడం ఇది రెండోసారి కావడం గమనార్హం. కమిటీ సభ్యులు ధార్మిక పరిషత్‌లో దేవదాయ శాఖ మంత్రి, ముఖ్య కార్యదర్శి, కమిషనర్, టీటీడీ ఈవో మినహా మిగిలిన 17 మంది పేర్లు.. మఠాధిపతులు: 1) పెద్ద జియ్యంగార్ మఠం, తిరుమల 2) పుష్పగిరి మఠం, వైఎస్సార్ జిల్లా రిటైర్డు హైకోర్టు జడ్జి: మఠం వెంకట రమణ రిటైర్డు ప్రిన్సిపల్ జడ్జి: కె. సూర్యారావు రిటైర్డు ఐఏఎస్ అధికారి: అజేయ కల్లం ఆగమ పండితులు: పీవీఎస్‌ఎస్‌ఆర్ జగన్నాథాచార్యులు, సీహెచ్ శ్రీరామ శర్మ చార్టెడ్ అకౌంటెంట్: శ్రీరామమూర్తి దేవదాయ శాఖ రిటైర్డు అధికారి: ఏబీ కృష్ణారెడ్డి (రిటైర్డు అడిషనల్ కమిషనర్) దాతలు: ఎస్ నరసింహారావు, యూకే విశ్వనాథ్‌రాజు ఆలయ, సత్రాల పాలక మండళ్ల సభ్యులు: ఎం.రామకుమార్ రాజు, భీమవరం (జగన్నాథరాజు సత్రం), ఇనుగంటి వెంకట రోహిత్ (అన్నవరం), జ్వాలా చైతన్య (యడ్ల పిచ్చయ్య శెట్టి సత్రం, కడప), చక్కా ప్రభాకరరావు (చాకా వారి సత్రం, పాలకొల్లు), మాక్కా బాలాజీ, రంజన్ సుభాషిణి. దేవదాయ శాఖలో పరిషత్‌వి విస్త్రత అధికారాలే.. దేవదాయ శాఖ పరిపాలన, కార్యనిర్వాహక వ్యవహారాల్లో ధార్మిక పరిషత్ అత్యంత ఉన్నత కమిటీ. శాఖ పరిధిలోని రూ.25 లక్షల నుంచి రూ. కోటి లోపు వార్షికాదాయం ఉండే ఆలయాలు, అన్ని రకాల మఠాల పాలన, ధార్మిక వ్యవహారాలు పూర్తి పరిషత్ ఆధీనంలో కొనసాగాలి. రాష్ట్రంలో చిన్నా పెద్దవి కలిపి మొత్తం 128 మఠాలు ఉన్నాయి. మంత్రాలయం, హథీరాంజీ మఠం వంటివి ఈ కేటగిరిలోకే వస్తాయి. ► ఏటా రూ. 25 లక్షలకు పైబడి కోటి రూపాయలకు తక్కువ వార్షికాదాయం వచ్చే ఆలయాలకు ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో పాలక మండళ్ల నియామకం జరుగుతుంది. ► దేవదాయ శాఖ పరిధిలో ఉండే అలయాలు, సత్రాల కార్యకలాపాలపై తీసుకొనే విధాన పరమైన నిర్ణయాల్లో పరిషత్ కీలకంగా వ్యవహరిస్తుంది. ► వందేళ్లు దాటిన ఆలయాల పునర్నిర్మాణానికి ముందుగా పరిషత్ అనుమతి తీసుకోవాలి. ► హిందూ ధార్మిక పరమైన కార్యక్రమాల నిర్వహణలో ధార్మిక పరిషత్‌తో చర్చించే నిర్ణయాలు జరుగుతాయి. ► నిబంధనల ప్రకారం ధార్మిక పరిషత్ మూడు నెలలకొకసారి తప్పనిసరిగా సమావేశమవ్వాలి. అవసరమైతే ప్రతి నెలా సమావేశాలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఉమ్మడి ఏపీలో ధార్మిక పరిషత్‌ను తొలిసారి ఏర్పాటు చేసింది వైఎస్సే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రత్యేక చట్టం తీసుకొచ్చి ధార్మిక పరిషత్‌ను ఏర్పాటు చేశారు. ధార్మిక పరిషత్‌కు దఖలు పడిన అధికారాలన్నీ అంతకు ముందు ప్రభుత్వం ఆధీనంలో ఉండేవి. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం చట్టం తీసుకొచ్చిన వెంటనే తొలిసారి ధార్మిక పరిషత్ ఏర్పాటుకు చకచకా ప్రయత్నాలు జరిగాయి. అయితే, పరిషత్ ఏర్పాటు జీవో విడుదలకు ముందే వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణం చెందారు. ఆ తర్వాత రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జీవో విడుదలైంది. అప్పుడు ఏర్పడిన పరిషత్ పదవీకాలం 2012లో ముగిసింది. ఉమ్మడి ఏపీలోనే 2014లో మరోసారి ధార్మిక పరిషత్‌ను ఏర్పాటు చేస్తూ అప్పటి ప్రభుత్వం జీవో విడుదల చేసినప్పటికీ, అది బాధ్యతలు చేపట్టక ముందే సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడంతో పరిషత్ ఏర్పాటుకు ముందే రద్దయింది. ఆ తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్‌లో 2014 – 19 మధ్య రెండు విడతలు ధార్మిక పరిషత్ ఏర్పాటుకు దేవదాయ శాఖ నుంచి ప్రతిపాదనలు వెళ్లినప్పటికీ, అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. నిబంధనల ప్రకారం 21 మంది సభ్యులతో పూర్తి స్థాయిలో ధార్మిక పరిషత్ ఏర్పాటుకు ముందుకు రాలేదు. తిరిగి పదేళ్ల తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ధార్మిక పరిషత్‌ను రెండో విడత పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసింది. -
అన్నదాత నుంచే ఆలయాలకు ఆహార ధాన్యాలు
సాక్షి, అమరావతి: దేవదాయ శాఖ పరిధిలో ఉండే ఆలయాల్లో పురుగుమందుల ఆనవాళ్లు లేని ప్రసాదాలు, అన్న ప్రసాదాన్ని భక్తులకు అందించాలని దేవదాయ శాఖ నిర్ణయించింది. ఇందుకోసం సేంద్రియ పద్ధతిలో పండించే రైతుల నుంచి నేరుగా ఆహార ధాన్యాలు కొనాలని నిర్ణయించింది. ప్రసాదాలు, అన్నదానంలో ఉపయోగించే 12 రకాల ఆహార ధాన్యాలను దేవదాయ శాఖ రైతుల నుంచి కొంటుంది. వీటి కొనుగోలులో మార్క్‌ఫెడ్ మధ్యవర్తిత్వం వహిస్తుంది. తొలుత 11 ప్రధాన ఆలయాల్లో ఈ విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఈ అంశంపై ఇంతకు ముందే ఉప ముఖ్యమంత్రి (దేవదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ, వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డిల స్థాయిలో ప్రాథమిక చర్చలు జరిగాయి. బుధవారం ఆలయాల ఈవోలతో దేవదాయ శాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్, మార్క్‌ఫెడ్ ఎండీ ప్రద్యుమ్న, రైతు సాధికార సంస్థ సీఈవో రామారావు సమావేశమయ్యారు. తదుపరి దశలో ఆయా ఆలయ పాలక మండలి సమావేశాల్లో రైతుల నుంచే సేంద్రియ ఆహార ధాన్యాల కొనుగోలుపై చర్చించి, ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసే అవకాశం ఉందని దేవదాయ శాఖ వర్గాలు తెలిపాయి. తదుపరి దశలో నిత్య అన్నదానం జరిగే మరో 175 ఆలయాల్లో ఈ విధానం అమలుకు కసరత్తు జరుగుతోంది. రైతులకు కేవలం 15 రోజుల్లోనే డబ్బు చెల్లించాలని కూడా దేవదాయ శాఖ భావిస్తోంది. ఆ 11 ఆలయాలకే ఏటా 8 వేల టన్నుల ఉత్పత్తులు శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీశైలం, విజయవాడ కనకదుర్గమ్మ, పెనుగంచిప్రోలు, ద్వారకా తిరుమల, అన్నవరం, సింహాచలం, వాడపల్లి, విశాఖ కనకమహాలక్ష్మీ ఆలయం, మహానంది ఆలయాల్లో ముందుగా ఈ విధానాన్ని ప్రవేశ పెడుతున్నారు. ఈ ఆలయాల్లో ప్రసాదాలు, అన్నదాన కార్యక్రమాలకు ఏటా దాదాపు 8 వేల టన్నుల ఆహార ధాన్యాలు అవసరం ఉంటుందని అంచనా. రెండు దశలో చేపట్టే 175 ఆలయాలకు 35 – 40 వేల టన్నుల ఆహార ధాన్యాల అవసరం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. సాధారణ పురుగు మందులు ఉపయోగించి పండించే ఆహార ధాన్యాలకు బదులు సేంద్రియ పద్ధతిలో పండించిన ధాన్యం వినియోగం ద్వారా భక్తులకు మరింత నాణ్యమైన ప్రసాదం అందించవచ్చని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయ విధానానికి ప్రభుత్వ పరంగానూ అదనపు ప్రోత్సాహం అందించినట్టవుతుందని చెప్పారు. టీటీడీలో సేంద్రియ శనగల కొనుగోలు తిరుమల తిరుమల దేవస్థానం (టీటీడీ)లో ప్రసాదాల తయారీలో ఇప్పటికే ఈ విధానాన్ని అమలు పరుస్తున్నారు. టీటీడీలో ఏటా 24 వేల టన్నుల ఆహార ధాన్యాలు వినియోగిస్తారు. వీటిలో శనగలను మార్కెఫెడ్ మధ్యవర్తిత్వంతో సేంద్రియ వ్యవసాయం చేసే రైతుల నుంచి నేరుగా కొంటున్నారు. మిగతా ఆహార ధాన్యాలను కూడా సేంద్రియ పద్ధతిలో పండించే రైతుల నుంచి కొనాలన్న ప్రక్రియ పురోగతి దశలో ఉంది. -
అమెరికాలో దుర్గమ్మకు కుంకుమార్చనలు
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): బెజవాడ శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివార్లకు అమెరికాలోని పలు నగరాల్లో కుంకుమార్చనలు నిర్వహిస్తున్నారు. ప్రవాసాంధ్రుల కోసం ఏటా దుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో అమెరికాలో ఆర్జిత సేవలు జరిగేవి. కోవిడ్ వల్ల రెండేళ్లుగా ఈ సేవలను నిలిపివేశారు. కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో ఈ ఏడాది నుంచి ఆర్జిత సేవలను పునఃప్రారంభించాలని దేవదాయ శాఖ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో దుర్గమ్మ దేవస్థానం నుంచి అమెరికాకు ఉత్సవమూర్తులను తీసుకెళ్లారు. అమ్మవారికి అలంకరించేందుకు ఆభరణాలను అమెరికాకు పంపించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. గురువారం శాన్హోస్లోని శ్రీ సత్యనారాయణస్వామి దేవస్థానంలో ఆది దంపతులకు ఖడ్గమాలార్చన, లక్ష కుంకుమార్చన, శాంతి కల్యాణం, చండీ హోమాలు నిర్వహించారు. 3 రోజుల పాటు ఈ ఆలయంలో పూజలు జరుగనున్నాయి. 29 నుంచి లాస్ఏంజెల్స్లో.. ఈ నెల 29 నుంచి 31 వరకు లాస్ఏంజెల్స్లోని శ్రీ శివకామేశ్వరి దేవస్థానంలో, జూన్ 2 నుంచి 4 వరకు న్యూజెర్సీలోని సాయి దత్తపీఠం, శ్రీ శివవిష్ణు ఆలయాల్లో, జూన్ 5 నుంచి 7 వరకు బాల్టిమోర్‌లోని శ్రీ షిర్డీసాయి మందిర్‌తో పాటు మరికొన్ని ఆలయాల్లో ఆర్జిత సేవలు నిర్వహిస్తారు. జూన్ 11న ఆలయ అర్చకులు దేవతా విగ్రహాలతో తిరిగి భారత్‌కు చేరుకుంటారు. -
ఆలయాల్లో అక్రమాల కట్టడికి విజిలెన్స్ సెల్
సాక్షి, అమరావతి: ఆలయాల్లో అవినీతి, అక్రమాలను పూర్తిస్థాయిలో కట్టడి చేసేందుకు ఐజీ స్థాయి పోలీస్ అధికారి నేతృత్వంలో ప్రత్యేకంగా విజిలెన్స్ సెల్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోందని ఉప ముఖ్యమంత్రి(దేవదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో సోమవారం కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్) పథకం కమిటీ సమావేశం జరిగింది. అనంతరం కొట్టు సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే కామన్ గుడ్ ఫండ్ పథకం కింద ప్రభుత్వం మంజూరు చేసిన 584 ఆలయ నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయని.. వాటిని నిర్ణీత కాల పరిమితిలో పూర్తి చేసేందుకు ప్రణాళికబద్ధంగా పూర్తి చేస్తామని చెప్పారు. దాదాపు రూ.58.80 కోట్లతో మరో 142 ఆలయాల నిర్మాణానికి ప్రతిపాదనలు అందగా, అందులో 43 ప్రతిపాదనలకు సంబంధించి స్థానికులు మ్యాచింగ్ గ్రాంట్ రూపంలో కొంత మొత్తం చెల్లించారన్నారు. ప్రజాప్రతినిధుల నుంచి మరో 99 ప్రతిపాదనలు రాగా, వాటిపై త్వరలో కమిటీ మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకోనుందని చెప్పారు. ధూపదీప, నైవేద్య పథకాన్ని మరిన్ని ఆలయాల్లో అమలు చేయాలని కోరుతూ ఇప్పటివరకు 653 దరఖాస్తులు అందాయని, వాటిలో 73 ప్రతిపాదనలను ఆమోదించామని తెలిపారు. మిగిలిన దరఖాస్తులను కూడా త్వరలో పరిష్కరిస్తామన్నారు. దేవుడి భూముల పరిరక్షణ చట్ట సవరణ దేవదాయ భూముల ఆక్రమణను పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు రానున్న కేబినెట్లో ఎండోమెంట్ చట్ట సవరణకు ప్రతిపాదించనున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. దేవదాయ భూముల ఆక్రమణను కట్టుదిట్టంగా నియంత్రించేందుకు ఎండోమెంట్ చట్టంలోని సెక్షన్–83, 84 నిబంధనలలో కొన్ని ఆటంకాలు ఉన్నట్టు గుర్తించామని, వాటిని సవరిస్తామని వివరించారు. -
ప్రధాన దేవాలయాల్లో ప్లాస్టిక్ నిషేధం
సాక్షి, అమరావతి: ఇక నుంచి దేవాలయాల్లో ప్లాస్టిక్ వస్తువులకు దేవదాయ శాఖ స్వస్తి పలకనుంది. ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లతోపాటు ప్లాస్టిక్ కవర్లలో పూజా సామగ్రిని ఆలయాల్లోకి అనుమతించరు. అలాగే ఆలయానికి అనుబంధంగా ఉండే దుకాణాల్లో ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల అమ్మకాలను నిషేధించనున్నారు. ప్రసాదాల పంపిణీలోనూ చిన్నచిన్న ప్లాస్టిక్ సంచుల వినియోగానికి పూర్తిగా చెక్ పెడతారు. తొలి దశలో జూలై 1 నుంచి 6 (ఏ) కేటగిరీగా వర్గీకరించిన ప్రధాన ఆలయాలన్నింటిలో ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని పూర్తి స్థాయిలో నిషేధించనున్నారు. ఏడాదికి రూ.25 లక్షలు, ఆపైన ఆదాయం ఉండే ఆలయాలను దేవదాయ శాఖ 6(ఏ) కేటగిరీగా వర్గీకరించింది. దేవదాయ శాఖ పరిధిలో రాష్ట్రంలో మొత్తం 24,699 ఆలయాలు, మఠాలు, సత్రాలు ఉన్నాయి. ఇందులో 174 ఆలయాలు, 28 సత్రాలు, మఠాలు 6 (ఏ) కేటగిరీ కిందకు వస్తాయి. జూలై 1 నుంచి ఆయా ఆలయాలు, మఠాలు, సత్రాలలో ప్లాస్టిక్ వస్తువులను పూర్తిగా నిషేధించేందుకు తగిన చర్యలు చేపట్టాలని దేవదాయ శాఖ ఇప్పటికే ఆయా ఆలయాలు, సత్రాల ఈవోలకు ఆదేశాలిచ్చింది. టీటీడీ తరహాలో మంచినీటి సరఫరా.. తిరుమలలో గత కొద్ది నెలల నుంచి ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని పూర్తిగా నిషేధించారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో అమలు జరుగుతున్న తరహాలోనే ప్రధాన దేవాలయాల్లో శుభ్రమైన మంచినీటి సరఫరాకు చర్యలు చేపడతారు. అలాగే మంచినీటి సరఫరా పాయింట్ల వద్ద స్టీల్ గ్లాస్‌లను అందుబాటులో ఉంచుతారు. భక్తులు ఇంటి నుంచి మంచినీరు తెచ్చుకున్నా గాజు సీసాలు లేదంటే స్టీల్ బాటిళ్లలో తెచ్చుకునేలా విస్తృత ప్రచారం చేయాలని అధికారులు యోచిస్తున్నారు. పర్యావరణానికి, జీవజాలానికి హాని.. ప్లాస్టిక్ కవర్లు పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. అలాగే ఆలయాల వద్ద సంచరించే గోవులతోపాటు ఇతర జంతువులు కవర్లను తిని మృత్యువాత పడుతున్నాయని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో క్రమంగా అన్ని ఆలయాల వద్ద ప్లాస్టిక్ వస్తువుల వినియోగానికి స్వస్తి పలకాలని దేవదాయ శాఖ నిర్ణయించినట్టు అధికారులు వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేవదాయ శాఖ కార్యక్రమాలపై ఇటీవల సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా టీటీడీలో అమలులో ఉన్న మంచి విధానాలను అన్ని ఆలయాల్లో అమలు చేయాలంటూ స్పష్టమైన ఆదేశాలిచ్చారని అధికారులు తెలిపారు. -
ఆంజనేయుడికే ఆ భూములు..
సాక్షి, అమరావతి: గుంటూరు నగర శివారులో దాదాపు పాతికేళ్లుగా ఆక్రమణదారుల చెరలో ఉన్న రూ.120 కోట్ల విలువచేసే 16 ఎకరాల దేవుడి భూమికి ఎట్టకేలకు మోక్షం సిద్ధించింది. సుదీర్ఘకాలం పాటు నడుస్తున్న ఈ వివాదానికి రాష్ట్ర ప్రభుత్వం ముగింపు పలుకుతూ సోమవారం ఆ భూములను ఆలయానికి అప్పగించింది. గుంటూరు కొరిటపాడు ప్రాంతంలోని శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానానికి నగర శివారులోని సర్వేనెం.78లో 17.70 ఎకరాల భూమి ఉంది. అందులో 16 ఎకరాల భూమిపై ఏటా వచ్చే ఆదాయాన్ని జీతభత్యాల కింద వినియోగించుకునేందుకు వీలుగా అర్చకునికి ఆ భూమిని దేవదాయ శాఖ అప్పట్లో ఈనాంగా కేటాయించింది. ఆ తర్వాత.. భూమిని లీజుకు తీసుకున్న కౌలుదారులు తనకు ఏటా లీజు డబ్బులు చెల్లించడంలేదని.. తనకు గుడి నుంచి ప్రతినెలా కొంత మొత్తం జీతం రూపంలోనే చెల్లించాలంటూ సదరు పూజారి ఆ భూమిని 1998లో తిరిగి ఆలయానికే అప్పగించారు. దీంతో ప్రతినెలా జీతం చెల్లించేందుకు దేవదాయశాఖ అంగీకరించింది. అయితే, అప్పటికే ఆ 16 ఎకరాల భూమి ఆక్రమణదారుల చెరలోకి వెళ్లిపోయింది. 2003లో ఆక్రమణదారుల నుంచి భూమిని విడిపించాల్సిన నాటి ప్రభుత్వం.. ఈ వివాదానికి శాశ్వత పరిష్కారం కుదిరే వరకు ఎకరాకు రూ.5 వేల చొప్పున ఏటా డ్యామేజీ రూపంలో ఆలయానికి చెల్లించాలని ఆక్రమణదారులకు ఆదేశాలిచ్చి సరిపెట్టింది. దీంతో అప్పటినుంచి ఆక్రమణదారులు ఏటా రూ.80 వేలు చెల్లిస్తున్నారు. ఆదాయం సరిపోక అప్పుల బాట విలువైన భూములుండీ ఆ స్వామికి అప్పులు తప్పడంలేదు. ఆక్రమణదారులు ఏటా చెల్లించే రూ.80 వేలే ఆలయానికి ఆదాయం. రెండు లక్షల డిపాజిట్‌పై మరో రూ.పది వేల వడ్డీ వస్తుందని ఆలయ ఈఓ తెలిపారు. పూజారికి అన్నీ కలుపుకుని రూ.12 వేల వేతనం చెల్లిస్తున్నారు. అందులో రూ.5 వేలను ధూపదీప నైవేద్యం కోసం. ఈ నేపథ్యంలో.. పూజారి జీతభత్యం, ఆలయంలో కరెంటు బిల్లులకు ఆదాయం సరిపోక పొరుగున ఉండే కొన్ని ఆలయాల నిధుల నుంచి అప్పులు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆలయం పేరిట రూ.70 వేల దాకా అప్పు ఉంది. ఇటీవలే ఆలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటుకు రూ.40 వేలను పొరుగు ఆలయం నిధుల నుంచి సర్దుబాటు చేశారు. టీడీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం.. ఇక ఆక్రమణలో ఉన్న ఈ ఆలయ భూములను విడిపించేందుకు ఈవో ఎన్నిసార్లు గత టీడీపీ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా స్పందనలేదు. దీంతో దేవదాయ శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఉండే ప్రత్యేక కోర్టులో ఈ భూమి వివాదం పెండింగ్‌లో ఉండిపోయింది. జగన్ ప్రభుత్వం వచ్చాక ఈ భూమి సమస్య పరిష్కరించేందుకు మూడుసార్లు మంత్రి కోర్టు భేటీ అయింది. ఆక్రమణదారుల నుంచి భూమిని విడిపించాలని ఆదేశాలు జారీచేసింది. దీంతో సోమవారం గుంటూరు జిల్లా పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సమక్షంలో గుంటూరు జిల్లా దేవదాయ శాఖ అధికారి మహేశ్వరరెడ్డి ఆ భూములను స్వాధీనం చేసుకుని ఆలయ ఈఓకు అప్పగించారు. అప్పట్లో నా రిపోర్టులకు సమాధానం వచ్చేదికాదు.. గుంటూరు జిల్లా నల్లపాడు గ్రూపు టెంపుల్స్‌లో ఇదీ ఒకటి. వాటన్నింటికీ నేను ఈఓగా ఉన్నాను. 2017 నుంచి ఈ వివాదాస్పద భూములను ఆక్రమణదారుల నుంచి విడిపించడానికి ప్రయత్నిస్తున్నా. అప్పట్లో కోర్టు భేటీకి నేను రాసిన రిపోర్టులకు ప్రభుత్వం నుంచి రిప్లయ్ వచ్చేది కాదు. రెండున్నర ఏళ్ల క్రితం నేను చేసిన ప్రతిపాదనకు స్పందనగా ప్రత్యేక కోర్టు భేటీని ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటుచేసి సమస్యను పరిష్కరించింది. – విజయభాస్కరరెడ్డి, శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం, కొరిటపాడు, గుంటూరు -
ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వైఎస్సార్
వేంపల్లె/ఇడుపులపాయ/ఒంటిమిట్ట: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ప్రశంసించారు. శనివారం ఆయన వైఎస్సార్ జిల్లా వేంపల్లె మండలం ఇడుపులపాయకు కుటుంబ సభ్యులతో కలిసి చేరుకున్నారు. ముందుగా గండి వీరాంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్దకు చేరుకుని దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద ఘనంగా నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ దివంగత వైఎస్సార్ అనుచరునిగా తనను గుర్తిస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తనకు కేబినేట్లో మంత్రి పదవి కల్పించడంతో పాటు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగించారన్నారు. గండి క్షేత్రంలో వీరాంజనేయస్వామి 100 అడుగుల విగ్రహం ఏర్పాటుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో మాట్లాడి చర్యలు తీసుకుంటానని తెలిపారు. అనంతరం ఒంటిమిట్టకు చేరుకున్న ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోని పలు ప్రధాన ఆలయాలను తొలిదశలో మాస్టర్‌ప్లాన్ రూపకల్పనకు ఎంపిక చేసినట్లు తెలిపారు. అన్యాక్రాంతమైన, కబ్జాకు గురైన దేవదాయ శాఖ భూములను సంరక్షిస్తామని చెప్పారు. దేవదాయ శాఖలో టీటీడీ తరహా ఆన్లైన్ పద్ధతిని పాటించేలా ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. గండి వీరాంజనేయస్వామి దేవస్థాన చైర్మన్ పి.రాఘవేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా కోదండరాముడి రథోత్సవం
ఒంటిమిట్ట: వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు శనివారం రథోత్సవం నిర్వహించారు. దీనికి హాజరైన రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణకు ఆలయ మర్యాదలతో అధికారులు, అర్చకులు స్వాగతం పలికి గర్భాలయంలోని మూలవిరాట్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీతాలక్ష్మణ సమేత కోదండ రాములవారు రథాన్ని అధిష్టించి గ్రామ వీధుల్లో విహరించారు. భజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలు చేస్తుండగా భక్తులు రథాన్ని లాగారు. అడుగడుగునా భక్తులు కాయకర్పూర నీరాజనాలు అందించారు. బ్రహ్మోత్సవాల్లో నేడు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం కాళీయమర్ధని అలంకారంలో రాములవారు దర్శనమివ్వనున్నారు. ఉదయం 11 గంటలకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు ఊంజల్ సేవ జరుగుతుంది. రాత్రి 7 గంటలకు అశ్వవాహనంపై స్వామి వారు విహరిస్తారు. -
రాష్ట్రంలో 1,072 ఆలయాల నిర్మాణం
తిరుపతి ఎడ్యుకేషన్: శ్రీవాణి ట్రస్టు ద్వారా దేవదాయశాఖ నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా 1,072 ఆలయాల నిర్మాణానికి టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ (డీపీపీ) కార్యనిర్వాహక మండలి ఆమోదం తెలిపింది. త్వరలో భారీ ఎత్తున కల్యాణమస్తు, సామూహిక వివాహాలు, దేశవ్యాప్తంగా శ్రీనివాస కల్యాణాలు నిర్వహించాలని తీర్మానించింది. తిరుపతిలో గురువారం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన మండలి సమావేశం జరిగింది. టీటీడీ ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి, జేఈవో వీరబ్రహ్మం, ధర్మకర్తల మండలి సభ్యురాలు అల్లూరి మల్లీశ్వరి వర్చువల్‌గా, ధార్మిక ప్రాజెక్టుల అధికారి విజయసారథి, ఏఈవో సత్యనారాయణ పాల్గొన్న ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. ► రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత్స్యకార గ్రామాల్లో ఒక్కో ఆలయం రూ.10 లక్షల వ్యయంతో ఏడాదిలోపు 1,072 ఆలయాల నిర్మాణం. ఈ ఆలయాల్లో అర్చకులుగా పనిచేసేందుకు ముందుకొచ్చే వారికి దేవదాయశాఖ సహకారంతో తిరుపతిలో శిక్షణ. ► దేశంలోని ప్రధాన కేంద్రాల్లో ప్రతినెలా శ్రీనివాసకల్యాణం. ► ఏప్రిల్ 23న కర్ణాటక రాష్ట్రం చిక్‌బళ్లాపూర్, మే 8న తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, మే నెలలో ఢిల్లీ, జూన్‌లో హైదారాబాద్, జూన్ 23 నుంచి జూలై 4 వరకు అమెరికాలోని నాలుగు ప్రాంతాల్లో శ్రీనివాసకల్యాణాల నిర్వహణ. ► గోదావరి జిల్లాల్లో త్వరలో శ్రీనివాస కల్యాణాల నిర్వహణకు ఏర్పాట్లు. ► కోవిడ్ పరిస్థితుల నుంచి బయటపడడంతో సామూహిక వివాహాల నిర్వహణకు పండిత మండలి ఏర్పాటు. మండలి నిర్ణయించే పవిత్ర ముహూర్తాల్లో జిల్లా యంత్రాంగాల సహకారంతో భారీ ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహణ. ► తిరుపతిలో ప్రతినెలా టీటీడీ ఆధ్వర్యంలో ఒక యజ్ఞం. మే నెలలో అన్నమయ్య జయంతి ఉత్సవాల నిర్వహణ. ► గుడికో గోమాత కార్యక్రమం ద్వారా ఇప్పటికి దేశంలోని 141 ఆలయాలకు ఉచితంగా గోవు, దూడ అందజేత. ఈ కార్యక్రమాన్ని విస్తృత పరిచే ఏర్పాట్లు. ► రాష్ట్రంలోని టీటీడీ, దేవదాయశాఖ భూముల్లో గో ఆధారిత వ్యవసాయం చేసేలా రైతులను ప్రోత్సహించి, వారు పండించిన ఉత్పత్తులను శ్రీవారి ప్రసాదాల తయారీకి కొనుగోలు చేయాలి. -
కాణిపాకం వినాయకునికి స్వర్ణ రథం సిద్ధం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తిరుమల శ్రీవారి తర్వాత కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామికి బంగారు రథం సిద్ధమైంది. దాదాపు 15 కేజీలకు పైగా బంగారంతో రథాన్ని తయారు చేయించారు. ఈ నెల 16వ తేదీన సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్య నూతన స్వర్ణ రథం ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించేందుకు దేవదాయ శాఖ నిర్ణయించింది. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర సరస్వతి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ముఖ్య కార్యదర్శి వాణీమోహన్, కమిషనర్ హరిజవహర్‌లాల్ హాజరవుతారు. 2005లోనే ప్రతిపాదన 2005లోనే కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామికి బంగారు రథం తయారు చేయించాలని అప్పటి ఆలయ పాలకమండలి తీర్మానించగా.. దేవదాయ శాఖ అనుమతి తెలిపింది. బంగారు రథం కోసం దాతల నుంచి ప్రత్యేక విరాళాలు సేకరించడంతో పాటు ఆలయంలో ప్రత్యేక హుండీని ఏర్పాటు చేశారు. 2005 నుంచి గత ఏడాది సెప్టెంబర్ వరకు హుండీ ద్వారా రూ.3,57,85,102.85 విరాళాలు వచ్చాయి. దాతల నుంచి రూపంలో మరో రూ.1,67,09,616 కలిపి మొత్తం రూ.5.25 కోట్ల వరకు అందాయి. బంగారు రథం తయారీ బాధ్యతలను దేవదాయ శాఖ 2009లోనే టీటీడీకే అప్పగించింది. ఇందుకు ఆలయ నిధుల నుంచి రూ.కోటి 2010 ఫిబ్రవరిలో టీటీడీకి చెల్లించారు. సిద్ధమైన వినాయకుని బంగారు రథం 2019 అక్టోబర్‌లో ఊపందుకుని.. 2019లో అక్టోబర్‌లో బంగారు రథం నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. 1,690 కేజీల చెక్క రథానికి బంగారం తాపడం చేయడానికి రూ.9.70 కోట్లు ఖర్చవుతుందని టీటీడీ తేల్చగా.. ఆలయ నిధుల నుంచి మరో రూ.5 కోట్లను కాణిపాకం ఆలయ అధికారులు 2019 అక్టోబర్‌లో టీటీడీకి చెల్లించారు. చెక్క రథానికి బంగారు తాపడం చేసే పనులు 2020 నవంబర్‌లో మొదలు కాగా, 2021 సెప్టెంబర్ నాటికి పూర్తయ్యాయి. ప్రతి నెలా ఊరేగింపు! ప్రతి గురువారం లేదా ప్రతి నెలా పౌర్ణమి తర్వాత నాలుగో రోజున ఆలయంలో నిర్వహించే సంకటహర గణపతి వ్రతం సందర్భంగా బంగారు రథంపై స్వామివారి ఊరేగింపు నిర్వహించాలనే ఆలోచన ఉందని.. దీనిపై ఆలయ పాలకమండలి సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఈవో వెంకటేష్ చెప్పారు. బ్రహ్మోత్సవాల సమయంలో బంగారు రథం ఉపయోగించనున్నట్టు వివరించారు. బంగారు రథం తయారీకి ఇప్పటివరకు టీటీడీకి రూ.6 కోట్లను చెల్లించామని, తుది బిల్లు టీటీడీ నుంచి అందాల్సి ఉందని వెంకటేష్ తెలిపారు. -
అరసవల్లిలో వైభవంగా రథసప్తమి
అరసవల్లి/తిరుమల: శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో మంగళవారం రథ సప్తమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. సుమారు 60 వేల మంది వరకు భక్తులు ఆదిత్యుడిని దర్శించుకున్నారు. ఆదిత్యుడిని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ దర్శించుకున్నారు. అరసవల్లి ఆలయానికి మాస్టర్ ప్లాన్ అమలుకు త్వరలోనే చర్యలు చేపడతానని మంత్రి వెలంపల్లి చెప్పారు. ఆలయ వివరాలను ఆర్జేసీ సురేష్‌బాబు, ఈవో వి.హరిసూర్యప్రకాష్‌ను అడిగి తెలుసుకున్నారు. దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీమోహన్, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. సప్తవాహనాలపై శ్రీనివాసుడి కటాక్షం.. తిరుమల శ్రీవారు సప్తవాహనాలను అధిరోహించి మంగళవారం భక్తులను కటాక్షించారు. తిరుమల ఆలయంలో రథసప్తమి మహోత్సవం వైభవంగా సాగింది. కోవిడ్ నేపథ్యంలో దీన్ని ఏకాంతంగా నిర్వహించారు. కార్యక్రమాలను ఎస్వీబీసీ చానల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఉషోదయాన సూర్యప్రభ వాహనంతో సప్తవాహన సేవోత్సవం ప్రారంభమైంది. అనంతరం శ్రీవారి ఆలయంలోని కల్యాణమండపంలో శ్రీమలయప్పస్వామి చిన్నశేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై కొలువుదీరారు. మధ్యాహ్నం శ్రీసుదర్శన చక్రత్తాళ్వారులకు అభ్యంగనం ఆచరించారు. రాత్రి చంద్రప్రభ వాహనంతో వాహనసేవలు పరిసమాప్తమయ్యాయి. సింహగిరిపై విశేషంగా రథసప్తమి సింహాచలం: విశాఖ జిల్లా సింహాచలంలో వేంచేసిన శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో రథసప్తమి పూజలను మంగళవారం విశేషంగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను ఆలయ ప్రాంగణంలో హంసమూలన ఉన్న పురాతన రాతిరథంపై వేంజేపచేసి ఉదయం పంచామృతాభిషేకం, అరుణపారాయణ పఠనం నిర్వహించారు. అనంతరం రాతిరథంపైనే స్వామికి నిత్య కల్యాణాన్ని నిర్వహించారు. సాయంత్రం స్వామివారి ఉత్సవమూర్తులను సూర్యప్రభ వాహనంపై వేంజేపచేసి తిరువీధిని నిర్వహించారు. -
11 ఆలయాలకు రూ.8.48 కోట్లు మంజూరు
తిరుమల: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో శ్రీవాణి ట్రస్టు ద్వారా 11 ఆలయాల నిర్మాణానికి రూ.8.45 కోట్లు మంజూరు చేస్తున్నట్లు టీటీడీ ఈవో డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి తెలిపారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ఈవో చాంబర్లో శ్రీవాణి ట్రస్టుపై ఆయన శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. శ్రీవాణి ట్రస్టు ద్వారా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఎంపిక చేసిన ఆలయాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ట్రస్టు ద్వారా చేపట్టిన 50 నూతన ఆలయాలు, 84 ఆలయాల జీర్ణోద్ధరణ, పునర్నిర్మాణ పనులు, 42 భజన మందిరాల ఏర్పాటు పనులను వేగవంతం చేయాలన్నారు. శ్రీవాణి ట్రస్టు, దేవదాయ శాఖ సీజీఎఫ్ ద్వారా మంజూరు చేసే ఆలయాల నిర్మాణాలకు సంబంధించి మాస్టర్ డేటాబేస్డ్ సిస్టమ్‌ను తయారు చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో ఆలయాల నిర్మాణానికి అందిన 1,100 దరఖాస్తులను దేవదాయ శాఖ పరిశీలనకు పంపామని, పరిశీలన పూర్తి కాగానే నిర్మాణ పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. వెనుకబడ్డ ప్రాంతాల్లో సనాతన హిందూ ధర్మాన్ని మరింత వ్యాప్తి చేయడంలో భాగంగా పురాతన ఆలయాల పునర్నిర్మాణం, ఆలయాలు లేనిచోట ఆలయ నిర్మాణంపై దృష్టి సారించామన్నారు. సమావేశంలో జేఈవో వీరబ్రహ్మం, ఎఫ్ఏ సీఏవో బాలాజీ, సీఈ నాగేశ్వరరావు, డిప్యుటీ సీఈ ప్రసాద్, డిప్యుటీ ఈవో జనరల్ డాక్టర్ రమణప్రసాద్, ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రామింగ్ అధికారి లంక విజయసారథి తదితరులు పాల్గొన్నారు. -
Omicron Effect: కరోనా నేపథ్యంలో ఆలయాల్లో ప్రత్యేక జాగ్రత్తలు
సాక్షి, అమరావతి/కాణిపాకం (యాదమరి): కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు రాష్ట్రంలోని దేవాలయాల్లో ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టారు. అన్నవరం, శ్రీశైలం, శ్రీకాళహస్తి సహా అన్ని ప్రముఖ ఆలయాల్లో భక్తులకు జారీ చేసే పూజలు, సేవల టికెట్లను సగానికి సగం కుదించాలని దేవదాయ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఆ శాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్ ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. భక్తుల రద్దీ ఎంత ఎక్కువగా ఉన్నా.. గంటకు గరిష్టంగా వెయ్యి మందికి మించి క్యూ లైన్లలోకి అనుమతించవద్దని ఆదేశించారు. అంతరాలయ దర్శనాలు, తీర్థప్రసాదాల పంపిణీ విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని.. అన్నదానం కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని సూచించారు. దర్శనాలకు వచ్చే భక్తులు మాస్క్, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించేలా చూడాలని ఆదేశించారు. ఎవరి వద్దనైనా మాస్క్ లేకపోతే వారికి నిర్ణీత ధరకు ఆలయం వద్ద మాస్క్ లభించేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఆలయ సిబ్బంది తప్పనిసరిగా రెండు మాస్క్‌లు ధరించాలని సూచించారు. ఆన్లైన్ సేవలను ప్రోత్సహించాలని చెప్పారు. జిల్లా కలెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల నిర్ణయాలకు అనుగుణంగా నిబంధనలను సడలించే అధికారాన్ని ఈవోలకు కల్పించారు. కరోనా నిర్మూలనకు నిత్యం హోమాలు.. కరోనా నిర్మూలన లక్ష్యంగా దేవదాయ శాఖ పరిధిలోని అన్ని ప్రముఖ ఆలయాల్లో రోజూ మృత్యుంజయ హోమం, ధన్వంతరి హోమం, సీతాళ హోమం, ఆయుష్య హోమం, విరాట పర్వ పారాయణం చేపట్టాలని ఈవోలను దేవదాయ శాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్ ఆదేశించారు. చిన్న ఆలయాల్లో సహస్ర నామ పారాయణాలు ప్రతి రోజూ నిర్వహించాలని సూచించారు. -
హిందూ ధర్మానికి పట్టుకొమ్మలు గిరిజన ప్రాంతాలు
సింహాచలం (పెందుర్తి)/పెందుర్తి: హిందూ ధర్మానికి పట్టుకొమ్మలు గిరిజన ప్రాంతాలేనని విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి అన్నారు. శ్రీశారదా పీఠం ఆధ్వర్యంలో చినముషివాడలోని శారదా పీఠం నుంచి సింహగిరికి 5 వేల మందితో పాదయాత్రని శ్రీగురుదేవా చారిటబుల్ ట్రస్ట్ శనివారం నిర్వహించింది. విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాం తం నుంచి వచ్చిన వందలాది మంది గిరిజనులతోపాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మొత్తం 121 గ్రామాల నుంచి 5 వేల మంది ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. హరినామస్మరణలు చేస్తూ సింహగిరికి చేరుకున్నారు. సింహగిరిపై శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. సంక్రాంతిని పురస్కరించుకుని తమ ప్రాంతాల్లో పండిన ధాన్యం తొలి పంటని స్వామివారికి సమర్పించారు. ఈ సందర్భంగా వరాహ లక్ష్మీనృసింహస్వామికి స్వాత్మానందేంద్ర ప్రత్యేక పూజ లు నిర్వహించారు. అనంతరం స్వామీజీ ఆలయ రాజగోపురం ఎదురుగా భక్తులకు అనుగ్రహ భాషణం చేశా రు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో భక్తిభావాన్ని పెం పొందించేందుకు టీటీడీ, దేవదాయశాఖ ఆలయాలను, భజన మండళ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. శ్రీశారదా పీఠాన్ని సందర్శించిన ఆదివాసీలు శారదా పీఠాన్ని విశాఖ ఏజెన్సీ ప్రాంతానికి చెందిన వందలాది మంది గిరిజనులు శనివారం సందర్శించారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా స్వామీజీ వారిని ఉద్దేశించి మాట్లాడుతూ అన్యమతాల ఉచ్చులో పడవద్దని సూచించారు. పసుపు–కుంకుమలతో సౌభాగ్యంగా కనిపించేది కేవలం హిందూ ధర్మంలో మాత్రమేనని చెప్పారు. ఈ సందర్భంగా పీఠం ప్రాంగణంలోని దేవతామూర్తుల సన్నిధిలో గిరిజనులు ప్రత్యేక పూజలు చేశారు. -
ద్వారకాతిరుమల ఆలయ ఈవోపై విచారణ
ద్వారకాతిరుమల: పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమలలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ కార్యనిర్వహణాధికారి జీవీ సుబ్బారెడ్డిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి బి.సూర్యనారాయణ, దేవదాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి, కమిషనర్లకు గతనెల 29న ఉత్తర్వులు జారీ చేశారు. ఈవోగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సుబ్బారెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని భీమడోలుకు చెందిన శ్రీవేంకటేశ్వరస్వామి సేవాసమితి అధ్యక్షుడు పరిమి వేంకటేశ్వరరెడ్డి గతేడాది నవంబర్ 16న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. గత ఆగస్టు 8న శ్రీవారి కొండపై వైష్ణవ సంప్రదాయాలకు విరుద్ధంగా జంతుబలి ఇచ్చారని, దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఆ వివాదంపై విచారణాధికారిగా నియమితులైన ఏఈవో బీవీఎస్ రామాచార్యులపై ఒత్తిడి తెచ్చి, ఆయన గుండెపోటుతో మృతిచెందడానికి ఈవో సుబ్బారెడ్డి కారకుడయ్యారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆలయ పరిసరాల్లోనే నివాసం ఉంటున్న ఈవో.. భక్తులు కాళ్లు కడుక్కునే బహిరంగ ప్రదేశంలో టవల్ కట్టుకుని స్నానం చేయడం వల్ల మహిళా భక్తులు ఇబ్బంది పడుతున్నట్టు తెలిపారు. గత అక్టోబర్ 20న స్వామి కల్యాణంలో పాల్గొనేందుకు వచ్చిన ఎంపీ, ఎమ్మెల్యే, స్థానిక ప్రజాప్రతినిధులను అవమానించారని పేర్కొన్నారు. ఆలయ ఆస్తిని కాజేస్తున్నా పట్టించుకోవడంలేదని తెలిపారు. ప్రసాదాల తయారీ, సెంట్రల్ స్టోర్, లీజియస్ విభాగాల నుంచి ఈవో ప్రతినెలా రూ.10 లక్షలు వసూలు చేస్తున్నారని, తలనీలాల కాంట్రాక్టరుకు లాభం చేకూరుస్తూ ఆలయానికి నష్టం కలుగజేస్తున్నారని ఆరోపించారు. -
గుడిలో నగలకు 'డిజిటల్' బందోబస్త్
సాక్షి, అమరావతి: అన్ని ఆలయాల్లోని ఆభరణాల విషయంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పూర్తి పారదర్శకత, మరింత భద్రత కల్పించేందుకు దేవదాయ శాఖ కసరత్తు ప్రారంభించింది. స్వామివారు, అమ్మవారి అలంకరణ కోసం ఉండే బంగారు, వెండి ఆభరణాలతోపాటు అన్ని రకాల నగల వివరాలతో జనవరి 15కల్లా ప్రతి గుడిలో డిజిటల్ ఆల్బమ్‌లు రూపొందించుకోవాలని ఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో పటిష్టంగా అమలు చేస్తున్న పలు అంశాలను రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో అమలుకు దేవదాయశాఖ వివిధ స్థాయి అధికారులతో ఇటీవల పునశ్చరణ కార్యక్రమం నిర్వహించింది. ఆ సమావేశంలో చర్చించిన అంశాల ఆధారంగా దేవదాయ శాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్ ఇటీవల ఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. అవేమిటంటే.. ప్రతి ఆలయంలో ఐదు రకాల రిజిస్టర్లు.. ► ప్రతి ఆభరణాన్ని డిజిటల్ చేయడానికి అన్ని కోణాల నుంచి ఫొటోలు తీయాలి. ► బంగారం, వెండికి సంబంధించిన ప్రతి ఆభరణం పేరు, దేవదాయశాఖ ఆ ఆభరణానికి కేటాయించిన నంబరు, దాని బరువు తదితర వివరాలన్నీ ఆ ఫొటోలలో కనిపించాలి. ► ఆలయాల్లో అలంకరణలకు ఉపయోగించని బంగారాన్ని గోల్డ్ బాండ్ పథకంలో బాండ్‌గా మార్పిడి చేసుకోవాలి. ► అభరణాలన్నింటికీ క్రమం తప్పకుండా బీమా చేయించాలి. ► కనీసం మూడేళ్లకొకసారైనా దేవదాయ శాఖలోని జ్యుయలరీ వెరిఫికేషన్ అధికారి (జేవీవో)లు ఆలయాల వారీగా ఆభరణాలకు తనిఖీలు నిర్వహించాలి. ► ఆభరణాలకు సంబంధించి ప్రతి ఆలయంలోనూ ఐదు రకాల రిజిస్టర్లను నిర్వహించాలి. అభరణాల అంచనా రిజిస్టర్, ఆభరణాల వారీగా నంబరు, వాటి బరువుకు సంబంధించి ఇన్వెంటరీ రిజిస్టర్, అర్చక కస్టడీ రిజిస్టర్, ఈవో కస్టడి రిజిస్టర్, బ్యాంకు లాకర్‌కు సంబంధించిన రిజిస్టర్లో ఎప్పటికప్పుడు వివరాలను నమోదు చేయాలి. ► ఆభరణాలు, వాటి భద్రత విషయంలోనూ ఈవోలు పూర్తి పారదర్శకంగా వ్యవహరించాలి. ఘాట్ రోడ్లపై మూడు చక్రాల వాహనాలకు బ్రేక్.. ► అన్ని ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుతో పాటు, 24 గంటల పాటు వాటిని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఒకరికి బాధ్యత అప్పగించాలి. ► ఆలయ భద్రతకు కేటాయించిన సిబ్బందితో పాటు ఈవోలు శాశ్వత ప్రాతిపదికన వాకీటాకీలను ఏర్పాటు చేసుకోవాలి. ► కొండ మీద ఆలయాలు ఉన్న చోట ఘాట్ రోడ్డుపై ఆటోలు వంటి మూడు చక్రాల వాహనాలను ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించకూడదు. ► భక్తులు మంచి నీటి కోసం ప్లాస్టిక్ బాటిళ్లు ఉపయోగించాల్సిన అవసరం లేకుండా ఆలయాల్లో పూర్తి స్థాయిలో శుద్ధిచేసిన నీటి సరఫరా పాయింట్లను ఏర్పాటు చేసుకోవాలి. -
బోడికొండపై 'దండు'యాత్ర..
సాక్షి ప్రతినిధి, విజయనగరం, నెల్లిమర్ల/నెల్లిమర్ల రూరల్: రెండో భద్రాద్రిగా భాసిల్లుతున్న విజయనగరం జిల్లా రామతీర్థం బోడికొండపై కోదండరామ స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు టీడీపీ నేత పూసపాటి అశోక్ గజపతిరాజు అడ్డు తగిలి వీరంగం సృష్టించారు. ఉదయం శంకుస్థాపన సమయానికి ముందుగానే కొందరు టీడీపీ కార్యకర్తలను వెంటబెట్టుకుని ఆయన బోడికొండ పైకి చేరుకున్నారు. రామతీర్థం దేవస్థానం తన పూర్వీకులదని, అభివృద్ధి పనులకు ప్రభుత్వం ఎలా శంకుస్థాపన చేస్తుందంటూ దేవదాయ శాఖ అధికారులపై చిందులేశారు. శంకుస్థాపన కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని కిందకి తోసేశారు. అనువంశిక ధర్మకర్తనైన తనకు తెలియకుండా ముహూర్తం ఎలా నిర్ణయిస్తారంటూ కేకలు వేశారు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న మంత్రులతో వాగ్వాదానికి దిగారు. స్వయంగా ఆహ్వానించినా.. రాష్ట్ర ప్రభుత్వం రూ.4 కోట్ల వ్యయంతో రామతీర్థం ఆలయ అభివృద్ధికి సంకల్పించినట్లు మంత్రులు వెలంపల్లి, బొత్స సత్యనారాయణ మీడియాకు తెలిపారు. దేవదాయ శాఖ నిధులతో సంబంధం లేకుండా ప్రభుత్వ ఖర్చుతోనే రూ.3 కోట్లతో బోడికొండపై కోదండరామస్వామి ఆలయ పునర్నిర్మాణంతో పాటు రూ.కోటి వ్యయంతో దిగువనున్న రామస్వామి ఆలయ అభివృద్ధి పనులను చేపట్టినట్లు వివరించారు. శంకుస్థాపన కార్యక్రమాన్ని అశోక్ గజపతిరాజు అడ్డుకోవడం సరికాదన్నారు. ప్రోటోకాల్ ప్రకారం శిలాఫలకంపై ఆయన పేరు ఉన్నప్పటికీ కూలదోసేందుకు ప్రయత్నించారన్నారు. ఆలయ సిబ్బంది, ప్రజాప్రతినిధులపైనా అనుచిత ప్రవర్తన తగదని సూచించారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని దేవదాయశాఖ అధికారులు స్వయంగా ఆయన్ను కలిసి ఆహ్వానించారని గుర్తు చేశారు. ఆ సమయంలోనూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇదేనా విజ్ఞత? దేవదాయ శాఖను సర్కస్ కంపెనీ అని హేళన చేయడమేనా ఆయన విజ్ఞత? అని మంత్రులు విస్మయం వ్యక్తం చేశారు. ధర్మకర్తగా ఉన్న ఆయన టీడీపీ హయాంలో ఒక్క రూపాయైనా ఆలయ అభివృద్ధికి వెచ్చించారా? అని ప్రశ్నించారు. విగ్రహాల తయారీకి విరాళం ఇవ్వడానికి ముందుకొచ్చినా ఆ బాధ్యతను టీటీడీ తీసుకున్నందున తిరస్కరించామని తెలిపారు. ఆలయ అభివృద్ధి పట్ల ఆయనకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా పునర్నిర్మాణ పనులకు విరాళం ఇవ్వవచ్చని సూచించారు. మాన్సాస్ ట్రస్ట్ భూములను దోపిడీ చేసిన అశోక్ గజపతిరాజు ఆ డబ్బుతో ఆలయ అభివృద్ధికి ముందుకు రావాలన్నారు. ఆయనది నీచమైన, క్రిమినల్ మనస్తత్వమని విమర్శించారు. మనమంతా ప్రజాస్వామ్యంలో ఉన్నామని, రాచరికపు ఆలోచనల నుంచి బయటకు రావాలని హితవు పలికారు. గతేడాది కోదండ రామ ఆలయంలో చోటుచేసుకున్న విగ్రహ ధ్వంసం ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, అది పూర్తయ్యాక దోషులెవరో తేలుతుందని చెప్పారు. అంగరంగ వైభవంగా.. రామతీర్థం బోడికొండపై కోదండ రామస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వైఖాసన ఆగమ శాస్త్రం ప్రకారం అర్చక స్వాములు శంకుస్థాపన ఘట్టాన్ని నిర్వహించారు. వేకువజాము నుంచి ప్రత్యేక పూజలు చేశారు. విశ్వక్షేన, పుణ్యాహవచనం, పంచగవ్య ఆరాధన, అష్టకలశ స్నపనం తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా చేపట్టి శంకుస్థాపన మహోత్సవానికి శ్రీకారం చుట్టారు. నూతన రాతి శిలలకు పూజలు, అభిషేకాలు చేశారు. చతుర్వేదాల ఆవాహన అనంతరం ముహూర్తం ప్రకారం ఉదయం 10.08 గంటలకు డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి, దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. నూతన శిలా ఖండాలకు మంత్రులు ప్రత్యేక పూజలు చేశారు. ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు... బోడికొండ దిగువన ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారికి ప్రాతఃకాలార్చన, బాల భోగం అనంతరం యాగశాలలో ప్రత్యేక హోమాలు జరిపారు. స్వామి వెండి మండపం వద్ద నిత్యకల్యాణం, పట్టాభిషేక మహోత్సవం జరిగాయి. హాజరైన ప్రజా ప్రతినిధులు, అధికారులు కార్యక్రమంలో విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు బడ్డుకొండ అప్పలనాయుడు, పీడిక రాజన్నదొర, శంబంగి వెంకట చినఅప్పలనాయుడు, అలజంగి జోగారావు, ఎమ్మెల్సీలు డాక్టర్ పెనుమత్స సురేష్‌బాబు, ఇందుకూరి రఘురాజు, జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎంపీపీ అంబళ్ల సుధారాణి, దేవదాయ శాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్, దుర్గగుడి ఈవో భ్రమరాంబ, రామాలయ ఈవో ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. -
భక్తుల అభిప్రాయాలకే ప్రాధాన్యం
సాక్షి, అమరావతి: దేవాలయాల్లో భక్తులకు ఎదురయ్యే ఇబ్బందులను తెలియజేసేందుకు, పరిష్కరించేందుకు వీలుగా ప్రతి నెలా రెండు విడతలుగా ‘డయల్ యువర్ ఈవో’ కార్యక్రమం నిర్వహించాలని దేవదాయ శాఖ నిర్ణయించింది. రోజువారీ కార్యక్రమాల నిర్వహణలో భక్తుల అభిప్రాయాలకు ప్రాధాన్యం కల్పించనుంది. ఈ మేరకు దేవదాయశాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్ వివిధ ఆలయాల కార్యనిర్వహణాధికారుల(ఈవో)కు ఆదేశాలు జారీ చేశారు. మొదట దేవదాయశాఖ పరిధిలోని విజయవాడ దుర్గగుడి, శ్రీశైలం, శ్రీకాళహస్తి, సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, కాణిపాకం, మహానంది, కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయం, విశాఖపట్నం కనకమహాలక్ష్మీ, పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయాల్లో ఈ కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాలని సూచించారు. క్రమంగా అన్ని ఆలయాల్లోనూ నిర్వహించాలన్నారు. ప్రతి నెలా ఒకటి రెండు శనివారాల్లో ఏదో ఒక రోజు మొదటి విడత, మూడు నాలుగు శనివారాల్లో ఏదో ఒక రోజు రెండో విడతగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని ఆదేశించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా విస్తృత ప్రచారం కల్పించాలని, వీలైతే స్థానిక టీవీ చానళ్లలో ఈ కార్యక్రమాన్ని ప్రచారం చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. కమిషనర్ క్షేత్రస్థాయి తనిఖీలు జిల్లాల్లోని ఆలయాల నిర్వహణ, దేవదాయ శాఖ కార్యాలయాల్లో ఫైళ్ల పరిష్కారం సహా ఇతర అంశాలను పరిశీలించేందుకు కమిషనర్ హరిజవహర్‌లాల్ జనవరిలో క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టనున్నారు. ఆ సందర్భంగా ఆప్రాంతంలోని రెండు మూడు ఆలయాలకు ఆయన వెళ్లనున్నారు. కేవలం ఒక్క రోజు ముందస్తు సమాచారంతో అన్ని జిల్లాల్లోని అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, ఆర్జేసీ కార్యాలయాల్లో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఆలయాల్లో భక్తులకు సౌకర్యాల కల్పనతో పాటు కార్యాలయ శుభ్రత, రికార్డు రూం నిర్వహణ, పెండింగ్ ఫైళ్ల పరిష్కారం, కార్యాలయ ప్రాంగణంలో గ్రీనరీ, సిబ్బంది డ్రెస్ కోడ్, సీసీ కెమెరాల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించనున్నారు. -
కల్యాణమస్తుకు త్వరలో ముహూర్తం
తిరుమల: టీటీడీ త్వరలో నిర్వహించనున్న కల్యాణమస్తు సామూహిక వివాహాల నిర్వహణకు అర్చక స్వాములతో చర్చించి ముహూర్తాలను ఖరారు చేయవలసిందిగా టీటీడీ ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈవో మాట్లాడుతూ ప్రతి శనివారం శ్రీవేంకటేశ్వర వ్రత కల్పం నిర్వహించేందుకు విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక అందగానే శ్రీవేంకటేశ్వర వ్రత కల్పం ప్రారంభిస్తామని తెలిపారు. ఇప్పటికే టీటీడీ అనుబంధ ఆలయాల్లో గోపూజ ప్రారంభించామని, మిగిలిన ఆలయాల్లో కూడా గోపూజ ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర దేవదాయ శాఖ ఆధీనంలోని 6ఎ, 6బి ఆలయాల్లో కూడా గో పూజ ప్రారంభించాలన్నారు. ప్రైవేట్ ఆలయాల్లో గోపూజ ప్రారంభించాలనుకునే వారికి కోరిన వెంటనే గోమాతను అందిస్తామన్నారు. సనాతన ధార్మిక పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించేందుకు విద్యార్థులకు పుస్తకాలను అందించాలని ఆదేశించారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. -
టీటీడీ విధానాలే మిగతా ఆలయాల్లోనూ..
సాక్షి, అమరావతి: భక్తులకు సౌకర్యాల కల్పన, ప్రసాదాల పంపిణీ, దేవుడి ఆస్తుల పరిరక్షణ తదితర అంశాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో కొనసాగుతున్న మంచి విధానాలు మిగిలిన ఆలయాల్లోనూ అమలు చేసేందుకు దేవదాయ శాఖ సిద్ధమవుతోంది. ఈ మేరకు అన్ని ప్రముఖ ఆలయాల ఈవోలు, జిల్లా దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్లతో పాటు డిప్యూటీ కమిషనర్లు, ఆర్జేసీ స్థాయి అధికారులతో బుధవారం వర్క్‌షాప్ నిర్వహించారు. దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్, కమిషనర్ హరిజవహర్‌లాల్ పాల్గొన్నారు. టీటీడీలో అమలవుతున్న విధానాలపై అధ్యయనం చేసేందుకు కమిషనర్ కార్యాలయ సీనియర్ స్థాయి అధికారులు కొందరు రెండు నెలల కిత్రం రెండు విడతలుగా తిరుమలను సందర్శించిన విషయం తెలిసిందే. అక్కడికి వెళ్లి అధ్యయనం చేసిన అంశాలపై ఆయా అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్స్ (ఎస్వోపీ– పూర్తి స్థాయి విధివిధానాలు)ను ఈ వర్క్‌షాప్ సందర్భంగా రూపొందించినట్టు కమిషనర్ హరిజవహర్‌లాల్ తెలిపారు. ఖరారు చేసిన విధి విధానాలను అన్ని ఆలయాల్లో అమలు చేసేలా దేవదాయ శాఖ ఈవోలందరికీ ఉత్తర్వులిస్తామని ఆయన వివరించారు. -
ప్రముఖ ఆలయాల్లో భగవద్గీత పారాయణం
సాక్షి, అమరావతి: దేవదాయ శాఖ పరిధిలో ఉండే ఎనిమిది ప్రముఖ ఆలయాల్లో, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరిధిలో ఉండే çపది ఆలయాల్లో భగవద్గీత పారాయణం చేపట్టనున్నారు. గీతా జయంతి పండుగ సందర్భంగా ఈ నెల 27 నుంచి వచ్చే నెల 14 వరకు 18 రోజుల పాటు ఆయా ఆలయాల్లో వేద పండితుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అరసవిల్లి సూర్యనారాయణస్వామి ఆలయం (శ్రీకాకుళం జిల్లా), సింహాచలం శ్రీవరాహ లక్ష్మీ నరసింహాస్వామి దేవస్థానం (విశాఖ జిల్లా), అన్నవరం శ్రీరమా సమేత వీరవెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం (తూర్పుగోదావరి జిల్లా), ద్వారకా తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయం (పశ్చిమ గోదావరి), మంగళగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (గుంటూరు జిల్లా), నెల్లూరు శ్రీరంగనాథ దేవస్థానం (నెల్లూరు జిల్లా), కదిరి శ్రీలక్ష్మీ నరసింహదేవస్థానం (అనంతపురం), అహోబిలం శ్రీలక్ష్మీనరసింహ దేవస్థానం (కర్నూలు జిల్లా)లో 18 రోజుల పాటు భగవద్గీత పారాయణం చేసేందుకు ఏర్పాటు చేసుకోవాలని ఆయా ఆలయాల ఈవోలను ఆదేశిస్తూ దేవదాయశాఖ కమిషనర్ హరి జవహర్లాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యేలా ముందస్తుగా తగిన ప్రచారం కల్పించాలని ఈవోలను ఆదేశించారు. భగవద్గీత పారాయణ నిర్వహణ ఖర్చులు టీటీడీ భరిస్తుంది. -
ధర్మపరిరక్షణకు ప్రభుత్వం కృషి
సాక్షి, అమరావతి: హైందవధర్మ పరిరక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తోందని దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు చెప్పారు. వేద, సంస్కృత పాఠశాలల ఏర్పాటుతోపాటు హైందవ ధర్మాన్ని కాపాడేందుకు ధార్మికసంస్థలు, పీఠాలకు భూములు కేటాయిస్తున్నట్టు తెలిపారు. విశాఖ శారదాపీఠానికి, అనంతపురంలో గణపతి సచ్చిదానంద ఆశ్రమానికి భూమి ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. సచివాలయంలో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ధర్మప్రచారానికి ముందుకొస్తున్న ప్రభుత్వంపై పచ్చపత్రికలు కుట్ర పూరితంగా విషం చిమ్ముతున్నాయని మండిపడ్డారు. స్వామీజీలకు కూడా రాజకీయాలను ఆపాదించడం సిగ్గుచేటన్నారు. గత ప్రభుత్వాల్లో కూడా పీఠాధిపతుల కోరిక మేరకు స్థలాలు కేటాయించారని గుర్తుచేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో కావూరి సాంబశివరావుకు అప్పనంగా 400 ఎకరాలు ఇచ్చారని, విశాఖలో లోకేశ్ భూములను పంచిపెట్టినప్పుడు పచ్చపత్రికలు ఏం చేశాయని ప్రశ్నించారు. ఈషా ఫౌండేషన్‌కు చంద్రబాబు స్థలం ఇస్తానని ప్రకటించగానే ఫౌండేషన్‌కు గొప్ప అవకాశం కల్పిస్తున్నారంటూ వార్తలు రాయలేదా అని నిలదీశారు. ఆర్యవైశ్యులకు పూర్తిస్వేచ్ఛ వాసవీకన్యకాపరమేశ్వరి సత్రాలు, అన్నదాన సత్రాలపై ప్రభుత్వ అజమాయిషీని తగ్గిస్తూ వాటి నిర్వహణను ఆర్యవైశ్యులకే అప్పగించేలా తీర్మానాన్ని కేబినెట్ ఆమోదించడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. పాదయాత్రలో ఇచ్చిన హామీని సీఎం జగన్ నిలబెట్టుకున్నారని కొనియాడారు. మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆర్యవైశ్యుల దేవాలయాల నిర్వహణ విషయంలో కొన్ని మినహాయింపులు ఇచ్చారన్నారు. ఆయన తనయుడిగా సీఎం జగన్ మరో అడుగు ముందుకేసి ఆర్యవైశ్య సత్రాలను అమ్ముకోవడం మినహా దేవదాయశాఖ అన్ని సెక్షన్ల నుంచి వెసులుబాటు కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తమ సొంత నిధులతో నిర్మించుకున్న దేవాలయాలు, సత్రాల నిర్వహణలో ఆర్యవైశ్యులకు పూర్తిస్వేచ్ఛ లభించిందన్నారు. సీఎంకు ఆర్యవైశ్య సంఘం ధన్యవాదాలు సీఎం వైఎస్ జగన్‌ని ఏపీ ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు గురువారం కలిశారు. ఆర్యవైశ్య సత్రాలు, ఆర్యవైశ్య అన్నదాన సత్రాల నిర్వహణ ఆర్య వైశ్యులకే అప్పగిస్తూ కేబినెట్లో తీర్మానం చేసినందుకు సచివాలయంలో సీఎం జగన్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. సీఎంను కలిసినవారిలో మంత్రి వెలంపల్లి, ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు ఎం. ద్వారకానాథ్, ఆర్టీఐ కమిషనర్ రేపాల శ్రీనివాస్, ఆర్యవైశ్య సంఘం విజయవాడ అర్బన్ జిల్లా అధ్యక్షుడు కె.విద్యాధరరావు తదితరులున్నారు. -
ధర్మ ప్రచార నిధి ఏర్పాటు చేయాలి
పెందుర్తి: రాష్ట్రంలో దేవదాయ శాఖ ప్రత్యేకంగా ధర్మ ప్రచార నిధిని ఏర్పాటు చేసుకోవాలని విశాఖ శ్రీశారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ సూచించారు. తద్వారా వాడవాడలా హిందూ ధర్మ ప్రచారం సాగేలా ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. విశాఖ జిల్లా పెందుర్తిలోని శ్రీశారదాపీఠాన్ని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, చీఫ్ సెక్రటరీ వాణీమోహన్, కమిషనర్ హరిజవహర్ మంగళవారం సందర్శించారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీల ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురు పలు అంశాలపై చర్చించారు. ఆలయాల భద్రత కోసం నియమించిన ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందికి పోలీస్ శాఖ ద్వారా శిక్షణ ఇప్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆలయ వ్యవస్థలో పరిపాలనపరమైన లోపాలను సరిదిద్దుకోవడానికి ఉద్యోగుల సంఖ్యను పెంచుకోవాలని చెప్పారు. ప్రధాన దేవాలయాల ప్రచార రథాలకు మరమ్మతులు చేపట్టి గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా హిందూ ధర్మ ప్రచారం చేపట్టాలని సూచించారు. ధర్మ ప్రచారం కోసం శ్రీశారదా పీఠం పెద్ద ఎత్తున కసరత్తులు చేసి కులాలకు అతీతంగా ప్రచారం ఉండేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించిందని వెల్లడించారు. దేవాలయ సాహిత్యం, కవీశ్వరుల రచనలను వెలుగులోకి తీసుకురావాలని స్వామీజీ చెప్పారు. పురాణ సభలను ఏర్పాటు చేసి.. ఎంపిక చేసిన పండితుల ద్వారా ఆలయాల చరిత్ర, స్థల పురాణం పుస్తకరూపంలో తీసుకురావాలన్నారు. -
నేడు తిరుమలకు సీఎం జగన్
సాక్షి, అమరావతి/సాక్షి, తిరుపతి/ సాక్షి ప్రతినిధి, విజయవాడ: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమ, మంగళవారాల్లో తిరుపతి, తిరుమలలో పర్యటించనున్నారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం సీఎం జగన్.. ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన వివరాలివి.. ► మధ్యాహ్నం 2 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి తిరుమలకు పయనం ► 3 గంటలకు రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు చేరిక ► అక్కడి నుంచి తిరుపతి బర్డ్ ఆస్పత్రికి చేరుకుని.. అక్కడ నిర్మించిన శ్రీపద్మావతి చిన్న పిల్లల కార్డియాక్ సెంటర్‌ను ప్రారంభిస్తారు. ► అనంతరం అలిపిరి వద్దకు చేరుకుని శ్రీవారి పాదాల వద్ద నుంచి తిరుమలకు నడక మార్గం, పై కప్పును, గోమందిరాన్ని ప్రారంభిస్తారు.. సాయంత్రం తిరుమలలోని బేడి ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకుని స్వామి దర్శనం చేసుకుంటారు. అనంతరం శ్రీవారి ఆలయానికి చేరుకుని స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. స్వామివారి దర్శనం అనంతరం ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారు. తర్వాత పద్మావతి అతిథి గృహానికి చేరుకుని, రాత్రికి అక్కడే బస చేస్తారు. ► మంగళవారం ఉదయం 5.30 గంటలకు శ్రీవారి దర్శనం చేసుకుని గొల్ల మండపాన్ని సందర్శిస్తారు. ► అక్కడ శ్రీవేంకటేశ్వర భక్తి చానల్‌కు సంబంధించి.. కన్నడ, హిందీ చానళ్లను ప్రారంభిస్తారు. అనంతరం కొత్తగా నిర్మించిన బూందీ పోటును ప్రారంభించి.. అన్నమయ్య భవన్‌కు చేరుకుంటారు. అక్కడ రైతు సాధికార సంస్థ, టీటీడీ మధ్య జరిగే ఒప్పందం కార్యక్రమంలో పాల్గొంటారు. ► అనంతరం పద్మావతి అతిథి గృహానికి చేరుకుని, తిరుపతి ఎయిర్‌పోర్ట్‌కు తిరుగుపయనమవుతారు. ఉదయం 11.40 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. రేపు దుర్గమ్మకు పట్టు వస్త్రాల సమర్పణ విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 12న మూలా నక్షత్రం రోజు సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిచ్చే దుర్గమ్మకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఏర్పాట్లపై దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జి.వాణీమోహన్ ఆదివారంఈవో కార్యాలయంలో దేవదాయ, పోలీస్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడుతూ.. మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు గంటల మధ్యలో సీఎం.. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు ఆలయానికి వస్తారని తెలిపారు. ఏర్పాట్లను సమీక్షిస్తున్న దేవదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికి అంతరాలయంలోకి తీసుకెళ్తామని, అక్కడ అమ్మవారికి సీఎం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని తెలిపారు. అనంతరం వేద ఆశీర్వచనంతో పాటు, తీర్థప్రసాదాలు అందజేస్తామని వివరించారు. అమ్మవారి ప్రాశస్త్యాన్ని తెలిపే ఆగమెంటెడ్ రియాల్టీ షోను కూడా సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. సమావేశంలో ఆలయ ఈవో భ్రమరాంబ, ఏసీపీ హనుమంతరావు, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ చంద్రకుమార్, రీజనల్ జాయింట్ కమిషనర్ సాగర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
దేవదాయ శాఖలో విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ
సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) తరహాలోనే దేవదాయశాఖలోను ఎస్పీ ర్యాంకు అధికారి పర్యవేక్షణలో ప్రత్యేకంగా విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. వారం రోజుల కిందట దేవదాయశాఖ కార్యక్రమాలపై జరిగిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించిన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆలయాల భద్రత, దేవుడి భూముల పరిరక్షణ ఈ విభాగం పరిధిలోకి తీసుకురావాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఆలయాల్లో అవినీతి, అక్రమాలకు తావులేకుండా ఈ విభాగం ఆకస్మిక తనిఖీలు చేపడుతుంది. దేవదాయశాఖ పరిధిలోని ప్రముఖ ఆలయాలతోపాటు సున్నిత ప్రాంతాల్లో ఉండే ఆలయాలకు సమీపంలో 24 గంటలు పనిచేసే ప్రత్యేక పోలీసు ఔట్‌పోస్టులు ఏర్పాటు చేస్తారు. దేవదాయశాఖతో సంబంధం లేకుండా ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో ఉన్న ఆలయాలన్నింటిలోను మూడు నెలల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆయా ఆలయాల యాజమాన్యాలకు నోటీసులు జారీచేయనున్నారు. రాష్ట్రంలో దేవదాయశాఖ పరిధిలో మొత్తం 24,622 ఆలయాలు, మఠాలు ఉన్నాయి. వీటిలో 4,380 ఆలయాలు ఈవోల పర్యవేక్షణలో ఉన్నాయి. -
ఏపీ: అత్యుత్తమంగా ఆలయాల నిర్వహణ
సాక్షి, అమరావతి: దేవాలయాల్లో ఉత్తమ నిర్వహణ పద్ధతులు తేవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. ఆలయాలకు వచ్చే భక్తులకు వసతి సదుపాయాల కల్పనలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు. టీటీడీలో అమలు చేస్తున్న మంచి విధానాలను ఇతర దేవాలయాల్లోనూ ప్రవేశ పెట్టాలని, ఆన్లైన్ పద్ధతుల నుంచి నాణ్యమైన ప్రసాదాల తయారీ దాకా టీటీడీ అనుసరిస్తున్న విధానాలను పాటించాలని ఆదేశించారు. దేవదాయ శాఖలో ఏమాత్రం అవినీతికి తావులేకుండా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. శ్రీశైలం సహా ఇతర ప్రధాన దేవాలయాల అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. దేవదాయశాఖపై సోమవారం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో ఆలయాల ఆస్తుల పరిరక్షణ, భద్రత, దాతలిచ్చే విరాళాల వినియోగం, భక్తులకు వసతి, ప్రసాదాలపై ముఖ్యమంత్రి జగన్ పలు సూచనలు చేశారు. దుర్గమ్మకు తొలిసారిగా రూ.70 కోట్ల ప్రభుత్వ నిధులు దేవాలయాలకు లభించే ఆదాయాన్ని వాటి అభివృద్ధికే ఖర్చు చేయాలని, క్రమం తప్పకుండా సంరక్షణపై దృష్టిపెట్టాలని సీఎం సూచించారు. విజయవాడ దుర్గగుడిలో అభివృద్ధి పనులకు దాదాపు రూ.70 కోట్లను చరిత్రలో తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు చేస్తోందని తెలిపారు. తీపి గుర్తులా భగవంతుడి ప్రసాదాలు భక్తుల వసతి, ప్రసాదాల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దేవాలయాల్లో భక్తులకు వసతి సదుపాయాల కల్పనలో రాజీ పడకూడదని, నాణ్యమైన వసతి సదుపాయాలను వారికి అందుబాటులోకి తేవాలని సూచించారు. ప్రతి దేవాలయంలో ప్రసాదాల నాణ్యతపై దృష్టిపెట్టాలని, భక్తులకు గుర్తుండిపోయేలా అవి ఉండాలని, తిరుమలలో లడ్డూ తయారీ విధానాలను ఇతర ఆలయాల్లో పాటించేలా చూడాలని, దీనివల్ల నాణ్యతగా ప్రసాదాలు ఉంటాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అన్ని దేవాలయాల కోసం మాస్టర్ ప్లాన్లు దేవాలయాల్లో కమిటీల ఏర్పాటు పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. దీనివల్ల దేవాలయాలపై పర్యవేక్షణ పెరుగుతుందన్నారు. అన్ని దేవాలయాల అభివృద్ధి కోసం మాస్టర్ ప్రణాళికలను రూపొందించడంతో పాటు శ్రీశైలం సహా ఇతర ప్రధాన దేవాలయాల అభివృద్ధికి కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. క్రమం తప్పకుండా వీటిని అమలు చేస్తూ ముందుకు వెళ్లాలని సూచించారు. నిర్వహణపై ఈవోలకు శిక్షణ దేవాలయాల ఈవోల పనితీరు మెరుగుపడాలని సీఎం సూచించారు. నిర్వహణలో మెరుగైన ప్రమాణాలు పాటించాలన్నారు. ఆలయాల అభివృద్ధి ఈవో పనితీరు మీద ఆధారపడి ఉంటుందని, టీటీడీ నిర్వహణ విధానాలపై ఈవోలందరికీ అవగాహన, శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. దేవాలయాల్లో మౌలిక సదుపాయాలకు సంబంధించిన లోపాలు, తేవాల్సిన మార్పులను గుర్తించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వంశపారంపర్య హక్కు అమలు అర్చకులకు వంశపారంపర్య హక్కును అమలు చేస్తున్నట్లు అధికారులు పేర్కొనగా మిగిలిన వారికి కూడా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. దేవాలయాల్లో పనిచేసే 1,305 మంది అర్చకులకు కనీస వేతనం 25 శాతం పెంచుతామని హామీ ఇవ్వగా వాస్తవానికి 56 శాతం, 100 శాతం చొప్పున పెంచామని అ«ధికారులు తెలిపారు. ► దేవదాయ ధర్మాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి (ఎండోమెంట్స్) జి.వాణీమోహన్, టీడీడీ ఈవో డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డితో పాటు రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల కార్యనిర్వహణాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆలయాల అభివృద్ధికే దాతల విరాళాలు దేవదాయ శాఖలో ఆన్లైన్ విధానాలను అనుసరించడం ద్వారా అవినీతికి ఆస్కారం లేకుండా చేయవచ్చని, వ్యవస్థలో మార్పులు వస్తాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. దాతలు ఆన్లైన్లో దేవాలయాలకు విరాళాలు ఇవ్వవచ్చని, ఈ విధానాలను తెలియజేస్తూ ప్రతి దేవాలయంలో పెద్ద బోర్డులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దాతలు ఇచ్చిన విరాళాలను ఆలయాల అభివృద్ధికి వినియోగించుకోవాలని, అవి పక్కదోవ పట్టకుండా నేరుగా దేవాలయాలకు ఉపయోగపడాలని, టీటీడీ తరహాలో ఇతర చోట్ల కూడా అలాంటి వ్యవస్థలు ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో నిర్దేశించుకున్న అంశాల పురోగతిని రెండు నెలల అనంతరం సమీక్షించనున్నట్లు సీఎం స్పష్టం చేశారు. పారదర్శకంగా ఆడిటింగ్.. దేవాలయాల్లో ఆడిటింగ్ పారదర్శకంగా జరగాలని సీఎం సూచించారు. ఆన్లైన్ బుకింగ్, కియోస్క్‌లు, క్యూ ఆర్ కోడ్ పేమెంట్స్, గదుల బుకింగ్ సిస్టమ్ తదితరాల డిజిటలైజేషన్ ప్రక్రియపై టీటీడీ సహకారాన్ని తీసుకోవాలని దేవదాయ శాఖకు సూచించారు. ఆలయాల భూముల జియో ట్యాగింగ్.. దేవాలయాల భూముల పరిరక్షణలో భాగంగా సర్వే చేసి జియో ట్యాగింగ్ చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. భూముల పరిరక్షణకు కలెక్టర్, ఎస్పీ, ప్రభుత్వ న్యాయవాదితో ఒక కమిటీ ఏర్పాటుపై ఆలోచన చేయాలని సూచించారు. భద్రతకు 47 వేల సీసీ కెమెరాలు రాష్ట్రంలోని సుమారు 18 వేల ఆలయాల్లో భద్రత కోసం 47 వేలకుపైగా సీసీ కెమేరాలు ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఎక్కడ ఆలయాలున్నా భద్రత కోసం సీసీ కెమెరాలు అమర్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దేవదాయ శాఖలో విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ కోసం ఎస్పీ స్థాయి అధికారిని నియమించాలన్నారు. దేవాలయాల్లో భద్రత తదితర అంశాలపై పోలీసుల పర్యవేక్షణ ఉండాలని సూచించారు. అర్చకులందరికీ ఇళ్ల స్థలాలు అర్చకులందరికీ ఇళ్ల స్థలాల కేటాయింపుపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాల కార్యక్రమం అమలుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ధర్మపథం ప్రారంభించిన సీఎం విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో కళ, సాంస్కృతిక, ఆరోగ్యవేదిక (ధర్మపథం) కార్యక్రమాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ప్రాచీన కళలు, సాంస్కృతిక, ఆరోగ్య, ఆధ్యాత్మిక సేవలకు ఆలయాలను వేదిక చేసేందుకు ప్రభుత్వం ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ‘ధర్మపథం’ పేరుతో ఆలయ ప్రాంగణాల్లో సాయంత్రం వేళ నాట్యం, శాస్త్రీయ సంగీతం, గాత్ర కచేరీలు, హరికథ, బుర్రకథ లాంటి సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక ప్రవచనాలు వంటివి ఏర్పాటు చేస్తారు. ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ వారాంతాల్లో యోగా, ప్రాణాయామం, ధ్యానం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆయుర్వేద, హోమియో వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తారు. ధర్మపథం కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్ విజయవాడ దుర్గ గుడిలో ఏర్పాటు చేసిన నృత్య కార్యక్రమాన్ని వర్చువల్‌గా తిలకించారు. మొదట రాష్ట్రంలో ప్రధాన దేవాలయాలన్నింటిలో తక్షణమే ఈ కార్యక్రమాలను మొదలుపెట్టి క్రమంగా దేవదాయశాఖ ఈవోల పర్యవేక్షణలో ఉండే ఆలయాలన్నింటికి విస్తరించనున్నట్టు వాణీమోహన్ తెలిపారు. సింహాచలం, అరçసవెల్లి, అన్నవరం ఆలయాల్లో పైలెట్‌గా సూర్య నమస్కారాలు, యోగా, మెడిటేషన్, ఆయుర్వేద వైద్యశిబిరం వంటి కొన్ని కార్యక్రమాలను పదిరోజులుగా నిర్వహించినట్టు చెప్పారు. విజయవాడ, శ్రీశైలం శరన్నవరాత్రి ఉత్సవాలకు సీఎంకు ఆహ్వానం విజయవాడ శ్రీదుర్గామల్లేశ్వరస్వామి ఆలయంలోను, శ్రీశైలం శ్రీ భ్రమరాంబమల్లిఖార్జునస్వామి ఆలయంలోను జరిగే శరన్నవరాత్రి ఉత్సవాలకు హాజరుకావాలని కోరుతూ సోమవారం ముఖ్యమంత్రికి దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి జి.వాణీమోహన్, దుర్గగుడి, శ్రీశైలం ఆలయాల కార్యనిర్వహణాధికారులు భ్రమరాంబ, లవన్న ఆహ్వానపత్రాలు అందజేశారు. కనకదుర్గ అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించాలని ఆహ్వానించారు. -
బీసీ సంక్షేమశాఖ పరిధిలోకి బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్
సాక్షి, విజయవాడ: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయశాఖ పరిధి నుంచి తప్పించింది. కాగా తప్పించిన బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్‌ను జగన్ సర్కార్ బీసీ సంక్షేమ పరిధిలోకి తీసుకొచ్చింది. ఈ మేరకు గురువారం సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. -
30 మందితో టీటీడీ పాలక మండలి
సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) 30 మంది సభ్యులతో కొత్త పాలక మండలిని ప్రభుత్వం బుధవారం నియమించింది. అధికారులతో కలిసి 28 మందిని పాలక మండలి సభ్యులుగా, మరో ఇద్దరిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీ మోహన్ రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. ఆగస్టు 8వ తేదీనే టీటీడీ పాలక మండలి చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డిని రెండోసారి నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో కేవలం పాలక మండలి చైర్మను మాత్రమే ప్రకటించిన ప్రభుత్వం, తాజాగా కమిటీ సభ్యుల పేర్లను వెల్లడించింది. చైర్మన్ సహా సభ్యుల పదవీ కాలం దేవదాయ శాఖ చట్టంలోని సెక్షన్ 99ను అనుసరించి ఉంటుందని పేర్కొన్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులైన ఇద్దరికి పాలక మండలిలో ఓటు హక్కు ఉండదన్నారు. కొత్త పాలక మండలి ఇలా.. 1. పొలకల అశోక్‌కుమార్, 2. మల్లాడి కృష్ణారావు 3.టంగుటూరు మారుతీ ప్రసాద్, 4. మన్నే జీవన్‌రెడ్డి, 5. డాక్టర్ బండి పార్థసారథిరెడ్డి, 6. జూపల్లి రామేశ్వరరావు, 7. ఎన్. శ్రీనివాసన్, 8. రాజేష్ శర్మ, 9. బోరా సౌరభ్, 10. మూరంశెట్టి రాములు, 11. కల్వకుర్తి విద్యాసాగర్, 12. ఏపీ నందకుమార్, 13. పచ్చిపాల సనత్‌కుమార్, 14. వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, 15. డాక్టర్ కేతన్ దేశాయి, 16.బూదాటి లక్ష్మీనారాయణ, 17. మిలింద్ కేశవ్ నర్వేకర్, 18. ఎంఎన్ శశిధర్, 19 అల్లూరి మల్లేశ్వరి 20. డాక్టర్ ఎస్.శంకర్, 21. ఎస్ఆర్ విశ్వనాథ్‌రెడ్డి, 22. బుర్రా మధుసూదన్‌యాదవ్, 23. కిలివేటి సంజీవయ్య, 24. కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఎక్స్ అఫీషియో సభ్యులు 1. దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, 2. దేవదాయ శాఖ కమిషనర్, 3. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్, 4. టీటీడీ ఈవో ప్రత్యేక ఆహ్వానితులు 1. భూమన కరుణాకర్ రెడ్డి 2. సుధాకర్ (బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్) ప్రత్యేక ఆహ్వానితులుగా మరో 50 మంది ఏపీ టూరిజం పాలసీలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల ద్వారా భవిష్యత్‌లో తిరుమల ఆలయానికి భక్తుల రాక పెరిగే అవకాశం ఉన్న దృష్ట్యా, ఇంకొక 50 మందిని టీటీడీ ఆలయ ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు. ఈ మేరకు దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీ మోహన్ మరో ఉత్తర్వు జారీ చేశారు. టీటీడీ పాలక మండలి సభ్యుల పదవీ కాలం కొనసాగినంత కాలం ఆలయ ప్రత్యేక ఆహ్వానితుల పదవీ ఉంటుందని.. పాలక మండలి సభ్యులకు వర్తించే ప్రొటోకాల్ వీరికీ వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
దేవుడి నగల వివరాల డిజిటలీకరణ
సాక్షి, అమరావతి: దేవదాయ శాఖ పరిధిలోని ఆలయాలకు సంబంధించి దేవుడి నగల వివరాలన్నిటినీ డిజటలీకరణ చేయాలని దేవదాయ శాఖ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో నిర్ణయించారు. దేవుడికి సంబంధించిన బంగారు, వెండి నగలను అన్నివైపుల నుంచి ఫొటోలు తీసి, ఆ నగ బరువు వివరాలతో సహా కంప్యూటరీకరణ చేయాలని నిర్ణయించారు. దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన గొల్లపూడిలోని కమిషనర్ కార్యాలయంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న సమావేశాలు మంగళవారం మొదలయ్యాయి. ఆ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్ వాణీమోహన్, ఆర్జేసీలు, డిప్యూటీ కమిషనర్లు, జిల్లాల అసిస్టెంట్ కమిషనర్లు, ప్రధాన ఆలయాల ఈవోలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆలయాల్లో ఎటువంటి అవకతవకలకు అవకాశాలు లేకుండా పూర్తి పారదర్శక విధానాలను అమల్లోకి తెచ్చేందుకు.. దేవుడి నగలతో పాటు ఆలయ భూములు, ఇతర ఆస్తులు, లీజుల వివరాలతోపాటు ఆలయాలకు ఏటా ఏ రూపంలో ఎంత ఆదాయం వస్తోంది, ఎంత మొత్తం ఖర్చవుతోంది, బ్యాంకులలో డిపాజిట్లు ఏ మేరకు ఉన్నాయనే వివరాలను ఆలయాల వారీగా నిర్వహించే 6 రకాల రిజిస్టర్లను కూడా కంప్యూటరీకరించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియను ఆయా ఆలయాల్లో వెంటనే చేపట్టాలని మంత్రి వెలంపల్లి, వాణీమోహన్ సూచించారు. జమా ఖర్చులపై విధిగా ఆడిట్ జమా ఖర్చులకు సంబంధించి ఆలయాల వారీగా ఏటా ఆడిట్ జరిపించాలని మంత్రి వెలంపల్లి ఆదేశించారు. దశలవారీగా పూర్తిస్థాయిలో క్యాష్ లెస్ విధానం అమలు చేయాలన్నారు. దేవుడి భూములు, షాపులు, ఇతర లీజులకు సంబంధించి ఎటువంటి బకాయిలు లేకుండా ఎప్పటికప్పుడు వసూలు చేయాలని సూచించారు. ఆలయాల్లో పూర్తిస్థాయిలో సీసీ కెమెరాల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ప్రైవేట్ ఆలయాలపై దాడులు జరిగినా దేవదాయ శాఖ స్పందించి క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తుందని హెచ్చరించారు. -
ఆలయాల్లో నిరంతర తనిఖీలు
సాక్షి, అమరావతి: భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనలో భాగంగా ఆలయాల్లో నిరంతర తనిఖీలు చేపట్టాలని దేవదాయ శాఖ నిర్ణయించింది. జిల్లా స్థాయిలో అసిస్టెంట్ కమిషనర్ మొదలు.. డిప్యూటీ కమిషనర్, ప్రాంతీయ జాయింట్ కమిషనర్(ఆర్జేసీ)లు వారానికి మూడు, నాలుగు రోజుల పాటు తమ పరిధిలో తనిఖీలు చేపట్టాలని దేవదాయ శాఖ కమిషనర్ వాణీమోహన్ తాజాగా ఆదేశాలిచ్చారు. 6(ఏ) కేటగిరిలో ఉండే పెద్ద ఆలయాల్లో ఏటా ఒకసారైనా, 6(బీ) కేటగిరి ఆలయాల్లో రెండేళ్లకోసారి, 6(సీ) కేటగిరి ఆలయాల్లో మూడేళ్లకోసారైనా తనిఖీలు చేయాలని పేర్కొన్నారు. తనిఖీ జరిపే రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయంలోనే ఉండి.. అన్ని రకాల ఆలయ రికార్డులను పరిశీలించాలని, గుర్తించిన అంశాలను రికార్డుల్లో నమోదు చేయాలని ఆదేశించారు. రూ.కోటి పైబడి ఆదాయం ఉన్న ఆలయాల్లో అడిషనల్ కమిషనర్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తారని ఆదేశాల్లో పేర్కొన్నారు. డిప్యూటీ కమిషనర్, ఆర్జేసీ స్థాయి అధికారులు ప్రతి నెలా తమ పరిధిలోని ఏదో ఒక ఆలయానికి తప్పనిసరిగా తనిఖీ చేయాలని ఆదేశించారు. అసిస్టెంట్ కమిషనర్ స్థాయి అధికారులు తమ పరిధిలోని అన్ని రెవెన్యూ డివిజన్లలో పర్యటించడంతో పాటు రాత్రి వేళ కూడా ఏదో ఒక ఆలయంలోనే బస చేసి, అక్కడ పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించాలని దేవదాయ శాఖ కమిషనర్ ఆదేశించారు. -
మతాల మధ్య బీజేపీ చిచ్చు
సాక్షి, అమరావతి: బీజేపీ నేతలు మత రాజకీయాలు మానుకోవాలని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ హితవు పలికారు. రాష్ట్రంలో మతాల మధ్య చిచ్చుపెట్టే విధంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం ఆదేశాలతోనే వినాయక చవితి వేడుకలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. వీర్రాజు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ వద్ద మంత్రి సోమవారం మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కులమతాలకతీతంగా పాలన చేస్తున్నారన్నారని.. కానీ, ఆయనపై మతం ముద్ర వేయాలని బీజేపీ కుట్ర చేస్తోందని మండిపడ్డారు. బీజేపీ నేతలకు హిందూ మతంపై గౌరవం ఉంటే గతంలోనే ప్రశ్నించేవారని.. కానీ, ఆలయాలను కూల్చిన టీడీపీని బీజేపీ ఏనాడూ ప్రశ్నించలేదని మంత్రి వెల్లంపల్లి ధ్వజమెత్తారు. వినాయక చవితి చేసుకోవద్దని తాము చెప్పలేదని.. దీనిపై బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. పండుగల విషయంలో కేంద్రం ప్రభుత్వమే మార్గదర్శకాలిచ్చిందని.. వాటిని మార్చమని సోము వీర్రాజు అదే కేంద్రాన్ని అడగాలని వెలంపల్లి డిమాండ్ చేశారు. వీటిని జారీచేసిన కేంద్ర ప్రభుత్వం కూడా హిందువులకు వ్యతిరేకమా అని ఆయన ప్రశ్నించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పండుగ చేసుకోమని చెప్పామని.. ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చెయ్యొద్దని ఆయన కోరారు. పెద్ద పెద్ద విగ్రహాలు, ఊరేగింపులు పెట్టకూడదని మాత్రమే సూచించామన్నారు. ప్రజలు బీజేపీకి ఓట్లు వేయలేదు కాబట్టి, ఏపీ ప్రజలకు ఏమైనా పర్వాలేదన్నది బీజేపీ విధానమా? అని కూడా మంత్రి ప్రశ్నించారు. కోవిడ్ వేళ ప్రజలకు అండగా ఉండాల్సిందిపోయి, మత విద్వేషాలను రెచ్చగొట్టడం ఏమిటన్నారు. మార్గదర్శకాలు ఉల్లంఘిస్తే కేసులే.. పండుగలకు సంబంధించి.. కేంద్రం ఏవైతే మార్గదర్శకాలు ఇచ్చిందో.. ఆ నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించినా, ఆఖరికి బీజేపీ నేతలు వ్యవహరించినా వారి మీద కూడా కేసులు పెడతామని వెలంపల్లి హెచ్చరించారు. అందులో ఎటువంటి సందేహంలేదని స్పష్టంచేశారు. కోవిడ్ కాలంలోనే కుంభమేళాకు అనుమతిస్తే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మీద వచ్చిన వ్యతిరేకతను ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. హిందూ మతం మీద ప్రేమ, గౌరవం బీజేపీకి ఉంటే.. చంద్రబాబు హయాంలో విజయవాడలో 50 పురాతన దేవాలయాలు కూల్చివేసినప్పుడు, గోదావరి పుష్కరాల్లో 30 మంది అమాయక భక్తుల్ని పొట్టనపెట్టుకున్నప్పుడు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. బీజేపీ ధర్నాలు చేయాల్సింది రాష్ట్రంలోని కలెక్టరేట్ల ముందు కాదని.. మార్గదర్శకాలు జారీచేసిన కేంద్ర హోంమంత్రి కార్యాలయం ముందో లేదా కేంద్ర ప్రభుత్వం ముందో చేయాలని మంత్రి వెలంపల్లి సవాల్ చేశారు. -
ఆగమ సలహా మండలి ఏర్పాటు చేయాలి
పెందుర్తి: దేవదాయ శాఖ నిర్వహణలో భాగస్వామ్యమయ్యేలా ఆగమ సలహా మండలిని ఏర్పాటు చేయాలని, ఆ సలహా మండలి సూచనలతో ఆలయాల నిర్వహణలో మార్పులు చేపట్టాలని రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌కు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి సూచించారు. రుషికేష్‌లో విశాఖ శ్రీ శారదా పీఠం ఆశ్రమంలో చాతుర్మాస దీక్షలో ఉన్న స్వరూపానందేంద్ర, పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతిని మంత్రి వెలంపల్లి శనివారం కలిశారు. మంత్రితో స్వరూపానంద మాట్లాడుతూ..మారుమూల ప్రాంతాల్లోని ఆలయాలను కేంద్రంగా చేసుకుని హిందూ ధర్మ ప్రచారం చేపట్టాలని సూచించారు. అన్యాక్రాంతం అవుతోన్న ఆలయాల భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్కియాలజీ శాఖ పరిధిలో ఉన్న ఆలయాల అభివృద్ధికి కేంద్రంతో చర్చించాలన్నారు. చాతుర్మాస దీక్ష అనంతరం పంచారామ క్షేత్రాలపై విశాఖ శ్రీ శారదాపీఠం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా సీతారామపురం ఆలయ ఆస్తుల పరిరక్షణకు చర్యలు వేగవంతం చేయాలని సూచించారు. అనంతరం మంత్రి వెలంపల్లి రిషికేష్‌లోని గంగానదిలో స్నానం ఆచరించారు. శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారు, చంద్రమౌళీశ్వరుల పీఠార్చనకు హాజరయ్యారు. -
మరో 180 ఆలయాల్లో ఆన్లైన్ సేవలు
పెనుగంచిప్రోలు: ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో సేవలు, పూజలు చేసుకునే అవకాశం భక్తులకు కల్పించామని దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ పి.వాణీమోహన్ పేర్కొన్నారు. శనివారం ఆమె కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు గ్రామంలోని శ్రీ లక్ష్మీతిరుపతమ్మ వారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. గత మూడు నెలలుగా ప్రముఖ ఆలయాలన్నింటిలో ఆన్లైన్ సేవలు కొనసాగుతున్నాయని, మరో 180 దేవాలయాల్లో కొత్తగా ఆన్లైన్ సేవలు కల్పిస్తున్నట్లు చెప్పారు. అలాగే ప్రముఖ ఆలయాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించటంతో పాటు రిజిస్టర్లు, బంగారం, వెండి నిల్వలను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రముఖంగా భక్తులకు మెరుగైన సౌకర్యాలను కల్పించటంపై దృష్టి పెడుతున్నామన్నారు. అనంతరం ఆలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఆలయ ఈవో మూర్తి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలతో ప్రిన్సిపల్ సెక్రటరీని సత్కరించారు. -
రూ.200 కోట్లతో శ్రీకాళహస్తీశ్వరాలయం అభివృద్ధి
శ్రీకాళహస్తి (చిత్తూరు జిల్లా): ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఆలయాల్లోనూ భక్తులకు మెరుగైన సేవలు అందించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు దేవదాయ శాఖ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీమోహన్ తెలిపారు. చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని ఆమె శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా వాణీమోహన్ విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఆలయాల్లో శ్రీకాళహస్తీశ్వరాలయం ప్రత్యేకమైందన్నారు. ఈ ఆలయాభివృద్ధి కోసం రూ.200 కోట్లతో కొత్త మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించి, త్వరిత గతిన అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పుణ్యక్షేత్రాల్లో పారిశుద్ధ్యంపైన ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నామన్నారు. విద్యుత్‌ను ఆదా చేసేందుకు సోలార్ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తామన్నారు. ఆలయంలో ఉన్న వెండి, బంగారు, నగదు నిల్వల రిజిస్టర్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి ఆలయ ఆస్తుల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. భక్తులకు పత్యక్ష సేవలతోపాటు ఆన్లైన్, పరోక్ష సేవల ద్వారానూ దగ్గరయ్యేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఒప్పంద ఉద్యోగుల్లో ఇద్దరు హుండీ లెక్కింపులో దొంగతనం చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని, వారిని ఉద్యోగాల నుంచి తొలగించి, క్రిమనిల్ కేసులు నమోదు చేయిస్తామని చెప్పారు. ఆలయ అనుబంధ స్కిట్ కళాశాల ఆలయానికి భారంగా మారిందన్నారు. అందులోని విద్యార్థులు నష్టపోకుండా వారిని వేరే కళాశాలల్లో చేర్పించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాబోయే నవరాత్రి, కార్తీక బ్రహ్మోత్సవాల కోసం శ్రీకాళహస్తీశ్వరాలయంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా ఈవోకు సూచించినట్లు తెలిపారు. అన్ని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో స్థల పురాణం, ఆలయ ప్రాశస్త్యం, దేవతా విగ్రహాల ప్రాశస్త్యాన్ని తెలియజేసే విధంగా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించామని వాణీమోహన్ పేర్కొన్నారు. -
ఆలయాల ఆస్తులపై నిర్లక్ష్యాన్ని ఉపేక్షించం
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల భూములు, ఇతర ఆస్తులను కాపాడడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించబోమని ఈవోలను దేవదాయ శాఖ హెచ్చరించింది. దేవుడి ఆస్తులను కాపాడటంలో ఉదాశీనత, జమా ఖర్చుల్లో అవకతవకలు లాంటి చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవని దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్ స్పష్టం చేశారు. భూములను ఆక్రమించుకోవడం, లీజు గడువు ముగిసినా ఖాళీ చేయకపోవడం లాంటి వాటిపై ఎప్పటికప్పుడు కేసులు నమోదు చేయని పక్షంలో బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు ఆమె అన్ని ఆలయాల ఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. ► భూములు, షాపుల లీజు గడువు ముగియడానికి మూడు నెలల ముందే బహిరంగ వేలం నిర్వహించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించరాదు. ఏడాది లీజు మొత్తాన్ని అడ్వాన్స్‌గా వసూలు చేయాలి. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా 75 శాతానికి మించి బిల్లులు చెల్లించరాదు. ► ఔట్సోర్సింగ్ సిబ్బందికి కనీస వేతనాలు చెల్లించేలా కాంట్రాక్టర్లతో ఒప్పందాలు చేసుకోవాలి. రూ.కోటికిపైగా విలువైన టెండర్లకు ఆరు నెలల వ్యవధికే ఒప్పందాలు చేసుకోవాలి. ► దేవాలయాల్లో అన్నదానం, ప్రసాదం పంపిణీకి ఒకే తరహా ‘దిట్టం’ విధానాన్ని అమలు చేస్తారు. అన్నదానం హాళ్లు, కిచెన్, సరుకుల గదుల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. ► ఆలయాల్లో ఖర్చులకు నగదుగా కాకుండా చెక్కుల రూపంలోనే చెల్లింపులు చేయాలి. ► ఆలయాల క్యాష్ బుక్‌లో పెన్నుతో కాకుండా పెన్సిల్‌తో జమా ఖర్చులు రాయడం, రశీదులు చూపకపోవడం లాంటి వాటిని గుర్తిస్తే ఈవో అవినీతికి పాల్పడినట్టు పరిగణిస్తారు. -
చిన్న ఆలయాలకు చింతలేదు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో నిత్యం ధూప దీప నైవేద్యాలకు నోచుకోని వందల ఆలయాలకు మంచిరోజులు వస్తున్నాయి. శిథిలావస్థలో ఉన్న ఆలయాల పునర్నిర్మాణం.. ఆగమ, వేద పాఠశాలల నిర్వహణ.. ధూప దీప నైవేద్య (డీడీఎన్ఎస్) స్కీం వంటి కార్యక్రమాలకు నిధులను వినియోగించే కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్)కు ఏటా కేటాయించే నిధులను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. దీంతో ఇక నుంచి ఒక్క తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నుంచే ఏటా రూ.40 కోట్లు ఈ ఫండ్‌కు కేటాయిస్తారు. ఇప్పటివరకూ ఎన్నో ఏళ్లుగా టీటీడీ కేవలం రూ.1.25 కోట్లు మాత్రమే సీజీఎఫ్‌కు నిధులు కేటాయిస్తోంది. కానీ, దేవదాయ శాఖ ఆధీనంలో ఉండే శ్రీశైలం, శ్రీకాళహస్తి, విజయవాడ దుర్గగుడి వంటి దాదాపు తొమ్మిది ఆలయాలు అంతకంటే ఎక్కువ మొత్తంలోనే ఈ ఫండ్‌కు ఇస్తున్నాయి. శ్రీశైలం దేవస్థానం దాదాపు రూ.11 కోట్లు వరకు అందజేస్తుండగా, శ్రీకాళహస్తి ఆలయం రూ.8 కోట్లు.. బెజవాడ దుర్గగుడి రూ.7 కోట్లు.. అన్నవరం ఆలయం రూ.5 కోట్లకు పైబడి.. ద్వారాక తిరుమల ఆలయం రూ.4.28 కోట్లు.. సింహాచలం ఆలయం రూ.4.54 కోట్లు.. కాణిపాకం ఆలయం రూ.3.72 కోట్లు దాకా నిధులు అందజేస్తున్నాయి. టీటీడీ మాత్రం 1987 నుంచి గత ఏడాది వరకు రూ.1.25 కోట్లు మాత్రమే ఇస్తోంది. దీంతో సీజీఎఫ్‌కు టీటీడీ వాటాను పెంచుతూ.. అందుకు దేవదాయ శాఖ చట్టానికి సవరణలు చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఇటీవలే ఆమోదం తెలిపింది. కామన్ గుడ్ ఫండ్ అంటే.. ఏటా ఐదు లక్షలకు పైబడి ఆదాయం ఉండే ఆలయాల నుంచి వాటి ఆదాయంపై తొమ్మిది శాతం చొప్పున సీజీఎఫ్‌కు నిధులు కేటాయిస్తారు. వీటితో అవసరమైన శిథిల ఆలయాలకు నిధులు కేటాయించి వాటి పునర్నిర్మాణం.. లేదా ఆధునీకరణ పనులు చేపడతారు. ఆగమ, వేద పాఠశాలల నిర్వహణకూ ఈ ఫండ్ నుంచే నిధుల కేటాయిస్తారు. అలాగే, ఆదాయంలేని గ్రామీణ ప్రాంత ఆలయాల్లో నిత్య ధూప దీప నైవేద్యాలకు, అక్కడి అర్చకునికీ కొంత మొత్తం చెల్లిస్తారు. దేవదాయ శాఖ మంత్రి చైర్మన్‌గా, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, టీటీడీ ఈఓలు సభ్యులుగా ఉండే కమిటీ ఎప్పటికప్పుడు సమావేశమై నిబంధనల ప్రకారం అవసరమైన వాటికి నిధులు కేటాయిస్తారు. ఇక రాష్ట్రంలో దేవదాయ శాఖ ఆధీనంలో ఉండే దాదాపు 1,500 ఆలయాలు మాత్రమే ఏటా ఐదు లక్షలకు పైబడి వార్షిక ఆదాయం పొందుతున్నాయని.. వాటి ద్వారా సీజీఎఫ్‌కు ఏటా రూ.80 కోట్ల నుంచి రూ.92 కోట్ల మధ్య నిధులు సమకూరుతున్నాయని అధికారులు వెల్లడించారు. 2008 నుంచి డీడీఎన్ఎస్ పథకం నిజానికి రాష్ట్రంలో దేవదాయ శాఖ పరిధిలో వేలాది ఆలయాలు ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఆలయాల్లో ఎక్కువ భాగం తగిన ఆదాయంలేక రోజువారీ ధూప దీప నైవేద్యాలకు నోచుకోవడంలేదని దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గుర్తించి 2008లో డీడీఎన్ఎస్ పథకాన్ని ప్రవేశపెట్టారు. అప్పుడు తొలిసారిగా.. ప్రస్తుత 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ పరిధిలో 1,610 ఆలయాలకు ఈ పథకం ద్వారా సీజీఎఫ్ నుంచి నిధులు కేటాయించారు. ప్రస్తుతం 1,660 ఆలయాలకు ఈ పథకం అమలుచేస్తున్నారు. కానీ, మరో 5,119 ఆలయాలకు ఈ పథకం నుంచి నిధులు కేటాయించాలంటూ దేవదాయ శాఖకు అందిన దరఖాస్తులను గత తెలుగుదేశం ప్రభుత్వం పెండింగ్‌లో పడేసింది. అలాగే, పాడుబడిన ఆలయాల ఆధునీకరణ, పునర్నిర్మాణానికీ వచ్చిన వందల దరఖాస్తులనూ ఆ సర్కార్ పట్టించుకోలేదని అధికారులు వెల్లడించారు. ఏటా రూ.130 కోట్లకు పైగా.. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఒక్క టీటీడీ నుంచే ఇప్పుడు సీజీఎఫ్‌కు రూ.40 కోట్లు సమకూరితే.. సీజీఎఫ్‌కు ఇకపై ఏటా రూ.130 కోట్లకు పైగా వస్తాయని అధికారులు చెబుతున్నారు. దీంతో ఆదాయంలేని ఆలయాల అభివృద్ధికి గతం కంటే మెరుగ్గా నిధులు కేటాయించే అవకాశం ఉంటుంది. అలాగే, అర్చక సంక్షేమ నిధికి ఏటా మరో ఐదు కోట్లు, ఈఏఎఫ్ (ఎంప్లాయ్మెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఫండ్)కు మరో ఐదు కోట్లు చొప్పున మొత్తం రూ.50 కోట్లు టీటీడీ నిధులు కేటాయించేలా ప్రభుత్వం చట్ట సవరణలు చేయనుంది. -
అప్పన్న భూముల కైంకర్యంపై విజిలెన్స్ విచారణ
సాక్షి, అమరావతి: టీడీపీ అధికారంలో ఉండగా సింహాచలం ఆలయానికి చెందిన 862.22 ఎకరాలను దేవుడి భూములు కాదంటూ ఆలయ ఆస్తుల జాబితా నుంచి తొలగించడంపై రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. అప్పట్లో ఆలయ ఆస్తుల జాబితా నుంచి తొలగించిన భూములు ఇప్పుడు ఎవరి ఆధీనంలో ఉన్నాయి? ఈ వ్యవహారంలో లబ్ధి పొందిన వారెవరు? దేవదాయ శాఖ చట్ట నిబంధనలను ఉల్లంఘించి జరిగిన ఈ అక్రమాలకు బాధ్యులు ఎవరు? అనే అంశాలపై సమగ్ర దర్యాప్తు జరపాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖను ఆదేశించింది. 3 నెలల్లోగా విచారణ ముగించి ప్రభుత్వానికి నివేదిక అందచేయాలని నిర్దేశించింది. విచారణలో గుర్తించిన అంశాల ఆధారంగా తదుపరి చేపట్టాల్సిన చర్యలపైనా నివేదికలో తగిన సూచనలు చేయాలని పేర్కొంది. మెడికల్ కాలేజీ పేరుతో మాన్సాస్ ట్రస్టు భూములను కారుచౌకగా అప్పటి ప్రభుత్వ పెద్దలు కట్టబెట్టిన తీరు తెన్నులపైనా ఈ విచారణ కొనసాగనుంది. ఆయా అంశాలపై విజిలెన్స్ విచారణకు తగిన తోడ్పాటు, అవసరమైన పత్రాలు అందజేసేందుకు దేవదాయ శాఖ కమిషనర్‌ను నోడల్ అధికారిగా నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు దేవదాయశాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్ సోమవారం ఉత్తర్వులిచ్చారు. ప్రాథమిక విచారణలో అక్రమాల నిర్థారణ సింహాచలం శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం, మాన్సాస్ ట్రస్టులో అధికారులు ఇటీవల తనిఖీలు నిర్వహించిన నేపథ్యంలో 2016 నుంచి 2018 వరకు పెద్ద ఎత్తున భూ అక్రమాలు జరిగినట్లు దేవదాయ శాఖ గుర్తించింది. దీనిపై ప్రాథమిక విచారణ కోసం దేవదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో అదనపు కమిషనర్‌గా పనిచేస్తున్న చంద్రకుమార్, విజయవాడ దుర్గ గుడి ఈవో భ్రమరాంబ, విశాఖ డిప్యూటీ కమిషనర్ పుష్పవర్థన్‌లతో కూడిన కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఈ కమిటీ వారం రోజులకు పైగా మరోసారి తనిఖీలు నిర్వహించి 108 పేజీల నివేదికను దేవదాయ శాఖ కమిషనర్‌కు అందజేసింది. ఆలయ ఆస్తుల జాబితా నుంచి భూముల మాయం నిజమేనని ప్రాథమిక విచారణలో కమిటీ తేల్చడంతో పాటు అప్పట్లో ఆలయ ఆస్తుల జాబితా నుంచి తొలగించిన 862.22 ఎకరాల్లో కొన్ని ఇప్పటికీ రెవిన్యూ రికార్డుల్లో సింహాచలం ఆలయం పేరిట ఉన్నట్లు వెల్లడించింది. దీని ద్వారా ఎవరు లబ్ధి పొందారన్నది తేలాలంటే దర్యాప్తు సంస్థలతో క్షుణ్నంగా విచారణ నిర్వహించాలని కమిటీ సూచించడంతో ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. బోర్డులో అశోక్‌తో పాటు బాబు సన్నిహితుడు సింహాచలం ఆలయ భూములు, మాన్సాస్ ట్రస్టు బోర్డులో భూ అక్రమాలు జరిగిన సమయంలో ట్రస్టు బోర్డు చైర్మన్‌గా అశోక్‌గజపతి రాజే ఉన్నారు. మాన్సాస్ ట్రస్టు వ్యవహారాల పర్యవేక్షణకు గత సర్కారు ముగ్గురు సభ్యులతో ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ కమిటీలో చైర్మన్ అశోక్‌తో పాటు చంద్రబాబుకు సన్నిహితుడైన కుటుంబరావు సభ్యుడిగా ఉన్నారు. ఇద్దరు అధికారులపై ఇప్పటికే చర్యలు.. ఈ వ్యవహారంలో భాగస్వామ్యలైన అప్పటి సింహాచలం ఈవో, ప్రస్తుతం దేవదాయ శాఖ అదనపు కమిషనర్‌గా పనిచేస్తున్న రామచంద్రమోహన్‌తోపాటు నాటి విశాఖ దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్, ప్రస్తుతం సింహాచలం ఆలయంలో ఏఈవోగా ఉన్న సుజాతను ప్రభుత్వం 4 రోజుల కిత్రం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. మెడికల్ కాలేజీ అంటూ మభ్యపెట్టి... విజయనగరంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామంటూ మభ్యపెట్టి గత ప్రభుత్వ పెద్దలు వందల ఎకరాల మాన్సాస్ భూములను విక్రయించిన వ్యవహారంపై కూడా విజిలెన్స్ అధికారులు విచారణ జరపనున్నారు. మెడికల్ కాలేజీ కోసమంటూ విశాఖకు సమీపంలో మాన్సాన్ ట్రస్టు పేరిట ఉన్న 150.09 ఎకరాల భూమిని, మరో 1,430 చదరపు గజాల వాణిజ్య భూమిని గత సర్కారు తమకు కావాల్సిన వారికి కారుచౌకగా కట్టబెట్టింది. అయితే మెడికల్ కాలేజీ కోసం అప్పటి ప్రభుత్వం గానీ, మాన్సాస్ ట్రస్టు తరఫున గానీ కనీసం దరఖాస్తు కూడా చేయలేదని అధికారుల కమిటీ గుర్తించింది. మచ్చుకు 36.11 ఎకరాల విక్రయాల రికార్డులను పరిశీలించగా అందులోనే రూ.74 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు కమిటీ ప్రాథమికంగా గుర్తించింది. సింహాచలం ఆలయం ఉన్న కొండపై గ్రావెల్‌ను అక్రమంగా విక్రయించారని, మాన్సాస్ ట్రస్టు భూములలో ఇసుక అమ్మకాలలోనూ భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయని కమిటీ నిర్ధారించింది. -
దేవుళ్ల ఆస్తులు కాపాడలేని చైర్మన్లు ఎందుకు?
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ‘బొబ్బిలి, విజయనగరం రాజుల ఆధీనంలోని దేవస్థానాలకు చెందిన భూములు అన్యాక్రాంతమవుతుంటే ఆ దేవాలయాల చైర్మన్లుగా ఉండి ఏం చేస్తున్నారు? చైర్మన్‌ను అని అనుకోవడం కాదు. భూముల్లో ఒక గజం స్థలం కూడా కాపాడలేకపోతే... దేవదాయ శాఖ చూస్తూ ఊరుకోవాలా? అలాంటి పరిస్థితుల్లో కచ్చితంగా జోక్యం చేసుకుంటుంద’ని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.శనివారం జరిగిన విజయనగరం జిల్లా సమీక్షా సమావేశంలో మంత్రులిద్దరూ పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో విలేకరులతో మాట్లాడారు. మాన్సాస్ ట్రస్ట్, బొబ్బిలి వేణుగోపాల స్వామి దేవాలయాల భూములపై లోతుగా పరిశీలిస్తే వేల ఎకరాల భూమి రికార్డుల్లో లేదని, దశల వారీగా అమ్ముకున్నట్లు దేవదాయశాఖ అధికారుల దర్యాప్తులో తేలిందన్నారు. ఈ వ్యవహారంలో ఇటీవల సింహాచలం దేవస్థానం అధికారులపై చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు. టీడీపీ నాయకుడు ఆర్వీఎస్కే రంగారావు మంత్రిగా ఉన్నప్పుడు బొబ్బిలిలోని భూములను కాపాడలేకపోయారని, ఆ పనిని ఇప్పుడు దేవదాయ శాఖ చేపడుతుందన్నారు. తప్పు జరిగిందని తేలితే చైర్మన్లైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బొబ్బిలి వేణుగోపాలస్వామి ఆభరణాలను దేవాలయాల్లో ఉంచకుండా.. ఎవరి అనుమతితో తీసుకెళ్లి కోటలోని ఇంటిలో ఉంచారని ప్రశ్నించారు. ‘మాన్సాస్’ పదవి హక్కును కోర్టు తేల్చాలి.. విజయనగరంలోని మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ పదవిపై హక్కు ఎవరిదో కోర్టు తేల్చాల్సి ఉందని మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పెద్దకొడుకు వారసురాలి హక్కుతో ట్రస్ట్ చైర్మన్ బాధ్యతలను సంచయిత గజపతిరాజు చేపట్టారని, దాన్ని సవాలు చేస్తూ అశోక్ గజపతిరాజు తెచ్చుకున్న కోర్టు తీర్పుతో ఆ పదవిని ఆమె కోల్పోయారని తెలిపారు. ఉన్నత న్యాయస్థానాలను ఆమె ఆశ్రయించారని, అలా వారసత్వపు అంశంపై అన్నదమ్ముల మధ్య వస్తున్న వివాదంతో ప్రభుత్వానికి సంబం«ధం లేదని స్పష్టం చేశారు. -
దేవదాయశాఖలో రచ్చకెక్కిన విభేదాలు
Conflicts In AP Endowment Department Officials మహారాణిపేట (విశాఖ దక్షిణ): దేవదాయశాఖలో ఇద్దరు అధికారుల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. ఒక అధికారి మీద మరో అధికారిణి ఇసుక పోయడం సంచలనం కలిగించింది. విశాఖపట్నంలోని దేవదాయశాఖ డిప్యూటీ కమిషనర్ (డీసీ) ఇ.పుష్పవర్ధన్ గురువారం కార్యాలయంలో విధుల్లో ఉండగా సహాయ కమిషనర్ (ఏసీ) కె.శాంతి ఇసుక పోశారు. దేవదాయశాఖ హుండీల ఆదాయం లె క్కింపుల్లో అవకతవకలకు పాల్పడిన ఉద్యోగులను సస్పెం డ్ చేయడంతోపాటు భూముల స్వాధీనం విషయంలో వీరిద్దరి మధ్య వాదోపవాదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పై ఘటన చోటుచేసుకుంది. ఈ విషయమై దేవదాయశాఖ కమిషనర్‌కు లేఖ రాసినట్లు డీసీ పుష్పవర్ధన్ చెప్పా రు. ఏసీపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, క్రిమినల్ కేసు పెట్టడానికి అనుమతివ్వాలని కోరినట్లు తెలిపారు. డీసీ తనను మానసికంగా వేధించారని, ఒక స్త్రీగా తాను ఇంతకుమించి ఏమీ చేయలేనని ఏసీ శాంతి విలపిస్తూ మీడియాకు తెలిపారు.పత్రికల్లో తప్పుడు వార్తలు రాయించి, వాటి ఆధారంగా సిబ్బందిపై చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఇదీ నేపథ్యం.. జూన్ 23న దేవదాయశాఖ ఉప కమిషనర్‌గా పుష్పవర్ధన్ బాధ్యతలు స్వీకరించారు. సింహాచలం భూముల జాబితా నుంచి కొన్ని భూములు మినహాయించిన ఘటన, మాన్సాస్ భూములపై విచారణ సంఘంలో ఆయన్ని కూడా ప్రభుత్వం నియమించింది. హుండీల లెక్కింపుల్లో అవకతవకలు జరిగాయని జూలై 19న జ్ఞానాపురం శ్రీఎర్నిమాంబ దేవాలయం ఈవో, అనకాపల్లి ఇన్స్పెక్టర్ వి.శ్రీనివాసరాజును ఆయన సస్పెండ్ చేసి 34 చార్జ్‌లు నమోదు చేశారు. అనంతరం జూలై 28న విశాఖ అర్బన్ ఇన్స్పెక్టర్, పలు ఆలయాల ఈవో మంగి పూడి శ్రీధర్‌ను ఏసీ కె.శాంతి సస్పెండ్ చేసి 31 చార్జ్‌లు నమోదు చేశారు. డీసీ చర్యకు ప్రతిచర్యగానే ఏసీ వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య వివాదం నెలకొంది. -
‘మా ఊరు–మా గుడి’ పేరిట చిన్న ఆలయాల అభివృద్ధి
సాక్షి, అమరావతి: ఆదాయం లేని ఆలయాల అభివృద్ధిపై దేవదాయ శాఖ దృష్టి పెట్టింది. దాతలు, ప్రవాసాంధ్రులను ప్రోత్సహించి.. వారి స్వగ్రామాల్లోని చిన్నచిన్న ఆలయాలను వారి ద్వారానే అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ‘మా ఊరు–మా గుడి’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. ఇందుకోసం ఆన్లైన్ పోర్టల్‌ను తయారు చేయిస్తోంది. దేవదాయ శాఖ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా 23 వేల వరకు ఆలయాలు ఉన్నాయి. వాటిలో 2,700 ఆలయాలను మాత్రమే దేవదాయ శాఖ తరఫున ఈవోలు పర్యవేక్షిస్తున్నారు. మిగిలిన ఆలయాలు స్థానిక పూజారులు, గ్రామ పెద్దల ఆధ్వర్యంలోనే పనిచేస్తున్నాయి. నిధుల కొరత వల్ల అభివృద్ధికి నోచుకోని ఆ ఆలయాలను స్థానిక పర్యవేక్షణలో ఈ కార్యక్రమం ద్వారా అభివృద్ధి చేయాలని దేవదాయ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఆలయాల అభివృద్ధి, నిత్య కైంకర్యాలకు విరాళాలు అందజేసేందుకు దాతలు, ప్రవాసాంధ్రులు ముందుకొస్తే.. వారి ఆధ్వర్యంలోనే ఆయా కార్యక్రమాలను దేవదాయ శాఖ చేపడుతుంది. తమ గ్రామాల్లోని ఆలయాల అభివృద్ధికి ముందుకొచ్చే దాతలు తమ ఆసక్తిని ఆన్లైన్ ద్వారా గానీ, వ్యక్తిగతంగా గానీ తెలియజేసేందుకు వీలుగా ప్రత్యేక దరఖాస్తు ఫారాన్ని దేవదాయ శాఖ వెబ్సైట్లో అధికారులు అందుబాటులో ఉంచారు. -
అప్పన్న భూముల్లో ‘పచ్చ’ బాబులు
సర్వే నంబరు–161/1లోని 21.96 ఎకరాలను అప్పట్లో టీడీపీలో ఉన్న మండవ రవికుమార్ చౌదరి అనే వ్యక్తి రైతుల నుంచి కొనుగోలు చేసినట్టు రికార్డులు సృష్టించాడు. ఈ స్థలంలో భారీ భవనాల నిర్మాణం జరుగుతోంది. వీటిని అనేక మందికి విక్రయించారు. ఈ భూమి కూడా సింహాచలం ఆలయానికి చెందినదే. ఈ సర్వే నంబరులోని భూమిని కూడా ఆలయ ఆస్తుల జాబితా నుంచి తప్పించారు. ఇది వేపగుంట గ్రామం సర్వే నంబరు–5లో సింహాచలం ఆలయానికి చెందిన భూమి. ఈ భూమిలో బొబ్బర నరసింహం అనే టీడీపీ నేత రెండెకరాల వరకు స్వాధీనం చేసుకున్నాడు. ఇక్కడున్న గెడ్డ పోరంబోకు భూమిని కూడా ఆక్రమించాడు. అలాగే, వేపగుంటలోని సర్వే నంబరు–1లోని ఒక ఎకరాన్ని టీడీపీ నేత గంట్ల పెంటారావు ఆక్రమించుకుని ఏకంగా ఇల్లు నిర్మించుకున్నాడు. ఈ స్థలం కూడా సింహాచలం ఆలయానికి చెందినదే. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : చాలా మంది టీడీపీ నేతలు సింహాచలం దేవస్థానం ఆస్తులను కొల్లగొట్టారు. అడవి వరంలో ఆలయానికి చెందిన భూమినే ఒక సంస్థకు కేటాయించారు. ఆ సంస్థ నుంచి టీడీపీకి చెందిన మాజీ మంత్రి ఒకరు బినామీ పేర్లతో కొనుగోలు చేశారని తెలుస్తోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో సింహాచలం దేవస్థానం భూముల జాబితా నుంచి తొలగించిన 862.22 ఎకరాల్లో కొన్నింటిని ‘సాక్షి’ పరిశీలించింది. ఇందులో టీడీపీ నేతల వ్యవహారం బయటపడింది. ఈ వ్యవహారం వెనుక అప్పటి ప్రభుత్వ పెద్దల హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేటు వేసి పాగా.! సింహాచలం దేవస్థానానికి 9,069 ఎకరాల భూమి ఉంది. ఇందులో 862.22 ఎకరాల భూమి ఆలయానికి చెందినది కాదంటూ.. దానిని తొలగించేందుకు అప్పటి ఈవో రామచంద్రమోహన్ ద్వారా 2016లో ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఇందుకు అనుగుణంగా 2016 మే 31న ఫలానా ఆస్తులు సింహాచలం ఆలయానికి చెందినవి అనే ఆధారాలు లేవంటూ.. వాటిని జాబితా నుంచి తొలగించాలని అప్పటి దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్‌కు ఫైల్ పంపారు. అయితే.. ఆలయ ఆస్తుల జాబితా నుంచి తొలగించేందుకు గానూ సరైన ప్రాతిపదిక లేదని పేర్కొంటూ ఆ అధికారి ఆ ఫైల్‌ను ఈవోకు తిప్పి పంపారు. ఏడాదైనా ఆ ఫైల్ తిరిగి రాలేదు. ఆ తరువాత కాలంలో ఇద్దరు దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్లను ప్రభుత్వం ఎటువంటి కారణాలు లేకుండా బదిలీ చేసింది. ఆ తర్వాత 2017లో 862.22 ఎకరాలను తొలగిస్తూ ఆలయ భూముల జాబితాను ప్రచురించారు. వాస్తవానికి ఈ జాబితా ప్రకటన దేవదాయ శాఖ కమిషనర్ నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే జరగాలి. ఇక్కడ ఈ నిబంధన అమలు కాలేదు. కేవలం దేవదాయ శాఖ కమిషనర్ నుంచి మౌఖిక ఆదేశాలు ఉన్నాయని పేర్కొంటూ 862.22 ఎకరాలను తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ప్రధానంగా టీడీపీ నేతలు ఈ భూములను ఆక్రమించేందుకు ఈ తతంగం మొత్తం నడిపారని దేవదాయ శాఖ అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. ప్రభుత్వానికి నివేదిక సింహాచలం ఆలయ భూముల వ్యవహారాలతో పాటు మాన్సాస్ ట్రస్టు భూముల అక్రమాలపై దేవదాయ శాఖ అధికారులు చేపట్టిన విచారణ నివేదికను గత నెల 16న ఆ శాఖ కమిషనర్‌కు సమర్పించారు. ప్రధానంగా ఆలయ ఆస్తులను కాజేసేందుకే తొలగింపు వ్యవహారం నడిచిందని.. అది కూడా నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని తమ నివేదికలో అధికారులు పేర్కొన్నట్టు తెలిసింది. అలాగే ఆలయానికి చెందిన భూములు, ఆస్తులను లీజులకు ఇవ్వడంలో గోల్మాల్ జరిగిందని నిర్ధారించారు. దీనిపై మరింత లోతుగా విచారణ జరగాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రధానంగా ఈ భూములు ఎవరు ఆక్రమించారు, ఆలయ భూములను లీజుకు ఇవ్వడంలో నిబంధనలను ఎలా తొక్కిపట్టారు, ఎవరికి లీజుకు ఇచ్చారు, ఎవరి ఒత్తిడి ఉందనే కోణంలో ఇంకా విచారణ జరగాల్సి ఉందని పేర్కొన్నారు. మొత్తం మీద ఈ వ్యవహారంపై మరింత లోతుగా విచారణ జరిపితే మరింత మంది ‘పచ్చ దొంగలు’ బయటకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. -
గోల్మాల్ నిజమే!
మహారాణిపేట (విశాఖ దక్షిణ): తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సింహాచలం దేవస్థానం భూములను జాబితాల నుంచి తప్పించడం.. మాన్సాస్ ట్రస్టుకు సంబంధించిన భూముల వ్యవహారాల్లో చోటుచేసుకున్న అక్రమాలూ నిజమేనని విచారణ కమిటీ ప్రాథమికంగా నిర్ధారించింది. దేవదాయ శాఖ అడిషనల్ కమిషనర్ చంద్రకుమార్, ప్రాంతీయ కమిషనర్ భ్రమరాంబ, ఉప కమిషనర్ పుష్పావర్ధన్ ఈ వ్యవహారంపై విచారణ పూర్తిచేసి నివేదికను ఆ శాఖ ప్రత్యేక కమిషనర్ పి.అర్జునరావుకు శనివారం సమర్పించారు. ఈ నివేదికను సోమవారం ప్రభుత్వానికి పంపుతున్నట్లు తెలిపారు. సింహాచలం దేవస్థానం భూములకు సంబంధించి పంచ గ్రామాల్లోని పలు సర్వే నంబర్లతో పాటు 748 ఎకరాల భూములను జాబితాల నుంచి తప్పించినట్లు కమిటీ నిగ్గుతేల్చింది. దేవదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్ల (ఇద్దరు ఏసీలు) సాయంతో అప్పటి దేవస్థానం ఈవో రామచంద్రమోహన్ ఈ 748 ఎకరాలను జాబితా నుంచి తప్పించడంలో కీలకపాత్ర పోషించారని.. దీని వెనుక ఆ శాఖకు చెందిన పలువురితోపాటు, కొందరు సింహాచలం దేవస్థానం అధికారులు, సిబ్బంది ఉన్నట్లు పేర్కొంది. భూములను జాబితాల నుంచి తప్పించడంలో అప్పటి ఈఓ నిబంధనలు ఉల్లంఘించారని నివేదికలో స్పష్టంచేసింది. ఈ విషయంలో ఏకపక్షంగా వ్యవహరించి.. దేవదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్లపై ఒత్తిడి తెచ్చారని తెలిపింది. కోట్లాది రూపాయలు విలువ చేసే ఈ భూములను దేవస్థానం జాబితాల నుంచి తప్పించిన వ్యవహారంపై విచారణ బృందం పలు ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఈవో రామచంద్రమోహన్ హయాంలో సిబ్బంది, సెక్యూరిటీ సంస్థల నియామాకం, లీజుల కాల పరిమితి పెంపు, ఇతర వ్యవహారాలపై పూర్తిస్థాయి విచారణ చేపడితే మరిన్ని అక్రమాలు వెలుగుచూసే అవకాశముందని కమిటీ సభ్యులు తమ నివేదికలో సిఫారసు చేసినట్టు సమాచారం. మాన్సాస్ భూముల అమ్మకాలు, మెడికల్ కాలేజీ ఏర్పాటులో చేతివాటం ప్రదర్శించినట్లు కూడా విచారణ బృందం గుర్తించింది. పలు వస్తువుల కొనుగోళ్లలో హెచ్చు ధరలున్నట్లు నివేదికలో పేర్కొంది. రెండు విడతలుగా విక్రయించిన 150 ఎకరాల్లో కొంత భూమిని పక్కదారి పట్టించినట్లు గుర్తించింది. 50 ఎకరాల భూమి విక్రయిస్తే అందులో 36 ఎకరాలకే సొమ్ములు వసూలు చేసి, మిగిలిన 14 ఎకరాలు విడిచి పెట్టినట్లు గుర్తించారు. -
‘మాన్సాస్’లో మరో మాయ
సాక్షి, అమరావతి: హైకోర్టు ఆదేశాలతో వివిధ ఆలయాలు, సత్రాలకు సంబంధించిన భూములను రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు లేకుండా నిషేధిత జాబితాలో ఉంచేందుకు దేవదాయ శాఖ కసరత్తు చేస్తున్న రోజులవి. 2016 ఏప్రిల్ 11వ తేదీ.. విజయనగరం కార్పొరేషన్ పరిధిలోని ధర్మపురి రెవెన్యూ గ్రామ పరిధిలో గల 474.44 ఎకరాల భూములు మాన్సాస్ ట్రస్టుకు చెందనవిగా పేర్కొంటూ అప్పటి ట్రస్టు ఈవో ఆ జిల్లా దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్‌కు నివేదిక ఇచ్చారు. దాని ప్రకారం జిల్లా అసిస్టెంట్ అప్పటి దేవదాయ శాఖ కమిషనర్ ద్వారా ఆ భూములకు ఎటువంటి ప్రైవేట్ రిజిస్ట్రేషన్లు జరగడానికి వీలు లేకుండా నిషేధిత జాబితాలో చేర్చాలంటూ లేఖ రాశారు. ఇది జరిగిన ఏడాదికే.. 2017 ఏప్రిల్ 19వ తేదీన ధర్మపురి రెవెన్యూ గ్రామంలో మాన్సాస్ ట్రస్టు భూములుగా నిర్ధారించిన 474.44 ఎకరాల భూములలో 145.78 ఎకరాలు ట్రస్టువి కాదంటూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ కమిషనర్, ఇన్స్పెక్టర్ జనరల్‌కు అప్పటి దేవదాయ శాఖ కమిషనర్ లేఖ రాశారు. అవి ట్రస్టు భూములని పేర్కొన్నప్పుడు, అందులో 145.78 ఎకరాలు ట్రస్టువి కాదని తిరిగి లేఖ రాసినప్పుడు దేవదాయ శాఖ కమిషనర్‌గా ఉన్నది ఒక్కరే. మొత్తంగా ఏదో మాయ చేసినట్టుగా.. ట్రస్టు ఆస్తుల జాబితా నుంచి బాగా ఖరీదైన 145.78 ఎకరాల భూములు ఎగిరిపోయాయి. మాన్సాస్ ట్రస్టుకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో మొత్తం 14,418 ఎకరాల భూములుండగా.. 2015–16, 2018–19లలో 150 ఎకరాలను మెడికల్ కళాశాల–ఆస్పత్రి పేరుతో విక్రయించేసిన బాగోతం ఇప్పటికే వెలుగు చూసిన విషయం తెలిసిందే. విజయనగరం జిల్లా కొత్తవలస, చిప్పాడ, బాకురపాలెం, డాబా గార్డెన్స్, సంతపేటలో ఉడా ద్వారా ఆ 150 ఎకరాలను విక్రయించగా రూ.120 కోట్లు వచ్చిందని ట్రస్టు లెక్క చూపించింది. సింహచలం శ్రీలక్ష్మీనరసింహాస్వామి ఆలయం, మాన్సాస్ ట్రస్టు భూములకు సంబంధించి టీడీపీ హయాంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు నేపథ్యంలో దేవదాయ శాఖ అధికారులు పాత రికార్డులు పరిశీలన చేయగా ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. చట్టాలను, కోర్టు ఉత్తర్వులను, దేవదాయ శాఖ నిబంధనలను తోసిరాజని అధికారం దన్నుతో ఈ కుంభకోణానికి తెరలేపినట్టు రికార్డుల పరిశీలనలో తేలింది. ఆ కమిటీ తీర్మానం ప్రకారమే.. అశోక్‌గజపతిరాజు చైర్మన్‌గా, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన కుటుంబరావు సభ్యుడిగా ఉన్న ముగ్గురు సభ్యులతో కూడిన ట్రస్టు బోర్డు 2017 ఫిబ్రవరిలో ధర్మపురి రెవెన్యూ పరిధిలో ట్రస్టు పేరిట ఉండే 145.78 ఎకరాలు ట్రస్టువి కావంటూ ట్రస్టు ఈవో అప్పటి దేవదాయశాఖ కమిషనర్‌కు లేఖ రాయడం, ఆ వెనువెంటనే ఆ భూములకు రిజిస్ట్రేషన్లకు వీలు కల్పిస్తూ అప్పటి దేవదాయ శాఖ కమిషనర్ నిరభ్యంతర సర్టిఫికెట్ జారీ చేయడం చకచకా జరిగిపోయాయి. ట్రస్టు చైర్మన్‌గా ఆయన బాధ్యతలు చేపట్టాకే.. 2014 జూన్–2019 మే మధ్య రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఆ సమయంలోనే మాన్సాస్ ట్రస్టు చైర్మన్‌గా అశోక్‌గజపతిరాజు బాధ్యతలు చేపట్టిన ఏడాదికే ఈ భూ మాయ చోటుచేసుకోవడం విశేషం. అంతకుముందు మాన్సాస్ ట్రస్టు చైర్మనుగా ఉన్న ఆనంద గజపతిరాజు 2016 మార్చిలో మరణించారు. దీంతో టీడీపీ తరఫున ఎంపీగా కొనసాగుతున్న అశోక్‌గజపతిరాజును ట్రస్టు చైర్మనుగా నియమిస్తూ 2016 ఏప్రిల్ 7న అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అప్పటి సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడుగా మెలిగిన కుటుంబరావును ట్రస్టు నిర్వహణ కమిటీలో సభ్యుడిగా నియమిస్తూ అదే 2016 ఏప్రిల్ 7వ తేదీన ప్రభుత్వం మరో ఉత్తర్వు ఇచ్చింది. అప్పట్లో ట్రస్టు నిర్వహణకు ప్రభుత్వం నియమించిన ముగ్గురు సభ్యుల కమిటీలో ఇద్దరు ప్రముఖ టీడీపీ నేతలే ఉన్నారు. వీరి నియామకం జరిగిన రోజుల్లోనే దేవదాయ శాఖ అధికారులు విజయనగరం కార్పొరేషన్ పరిధిలో ట్రస్టు పేరిట 474.44 ఎకరాలుందని నిర్ధారించారు. ఏడాదికల్లా అందులో 145.78 ఎకరాలు ట్రస్టువి కాదని తేల్చడం గమనార్హం. -
సింహాచలం భూములపై లోతుగా విచారణ
మహారాణిపేట (విశాఖ దక్షిణ): సింహాచలం దేవస్థానం భూముల జాబితా నుంచి వందలాది ఎకరాలు మాయం కావడంపై విచారణ మరింత లోతుగా సాగుతోంది. పంచగ్రామాల భూ జాబితా నుంచి 740 ఎకరాల గల్లంతు కావడంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. దేవదాయ శాఖ అదనపు కమిషనర్ చంద్రకుమార్, ఉప కమిషనర్ ఇ.పుష్పవర్దన్ బుధవారం టర్నర్ సత్రం ఉప కమిషనర్ కార్యాలయంలో విచారణ చేపట్టారు. దేవదాయ శాఖ ఆస్తుల జాబితా, 22 ఏ జాబితా, ఇతర రికార్డులను అధికారులు తనిఖీ చేశారు. అడంగల్ కాపీలు, టెన్ వన్ రికార్డులను కూడా పరిశీలిస్తున్నారు. 2016 డిసెంబర్–2017 ఫిబ్రవరి మధ్య 740 ఎకరాల భూమిని జాబితాల నుంచి తప్పించినట్టు అధికారులు గుర్తించారు. ఏ ప్రాంతాల్లోని భూములను జాబితాల నుంచి తప్పించారనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. 2010 రికార్డుల ప్రకారం దేవస్థానానికి 11,118 ఎకరాల భూమి ఉండగా.. 2016 నాటికి 10,278 ఎకరాలు మాత్రమే ఉన్నాయి. మొత్తం వ్యవహారంపై విచారణ అధికారులు రెండు రోజుల్లో దేవదాయ శాఖ నివేదిక సమర్పించే అవకాశం ఉంది. -
దార్మిక పరిషత్ తీర్మానాన్ని మా ముందుంచండి
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లాలోని పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి మఠం పీఠాధిపత్యం విషయంలో ఏపీ ధార్మిక పరిషత్ ఏదైనా తీర్మానం చేసిందా? అని హైకోర్టు గురువారం దేవదాయ శాఖను ప్రశ్నించింది. ఒకవేళ తీర్మానం చేసి ఉంటే.. దానిని తమ ముందుంచాలని దేవదాయశాఖ అధికారులను ఆదేశించింది. ఇదే సమయంలో పీఠాధిపత్యం ఎవరికి చెందాలన్న విషయాన్ని తాము తేల్చబోమని హైకోర్టు స్పష్టం చేసింది. పీఠాధిపత్యం విషయంలో దేవదాయ ప్రత్యేక కమిషనర్, సహాయ కమిషనర్ ఉత్తర్వుల చట్టబద్ధతను మాత్రమే తేలుస్తామని చెప్పింది. పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ఉత్తర్వులిచ్చారు. మఠం శాశ్వత పీఠాధిపతులుగా తమను గుర్తించేలా దేవదాయశాఖను ఆదేశించాలంటూ దివంగత పీఠాధిపతి రెండో భార్య మహాలక్షుమ్మ, కుమారుడు గోవిందస్వామి హైకోర్టులో బుధవారం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
ష్... గప్‌చుప్!
సాక్షి, అమరావతి: సింహాచలం శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ భూముల గోల్‌మాల్‌కు సంబంధించి రోజుకో వ్యవహారం వెలుగుచూస్తోంది. ఈ విషయమై రెండ్రోజులుగా ‘సాక్షి’లో వస్తున్న సంచలనాత్మక కథనాలు తెలిసిందే. తాజాగా.. ఈ 748 ఎకరాల భూబాగోతం వ్యవహారం వెలుగుచూడకుండా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ పెద్దలే అధికారుల నోరు నొక్కేసినట్లు తెలుస్తోంది. నిజానికి.. 2016 డిసెంబర్లో సింహాచలం ఆలయ ఆస్తుల రిజిస్టర్ నుంచి ఆ భూములు తొలగించడానికి నాలుగు నెలల ముందే అప్పటి దేవదాయ శాఖ కమిషనర్ మౌఖిక ఆదేశాలతో ఆలయ ఆస్తులపై రహస్యంగా విచారణ జరిపినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఆ శాఖలో ఉన్నతాధికారులకు కూడా తెలీకుండా గుట్టుగా ఆలయ ఈఓ స్థాయిలో సాగుతున్న ఈ భూబాగోతం వ్యవహారం గురించి దేవదాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి ఉప్పు అందింది. దీంతో అప్పటి కమిషనర్ ఈ మొత్తం తతంగంపై విచారణకు మౌఖికంగా ఆదేశిలిచ్చారు. ఈ నేపథ్యంలో.. కమిషనర్ కార్యాలయంలో భూముల వ్యవహారాలను పర్యవేక్షించే అధికారితో పాటు ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకు సంబంధించిన దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, విశాఖపట్నం జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఆధ్వర్యంలో ఈ విచారణ సాగింది. ఆరు పేజీలతో కమిషనర్‌కు నివేదిక కాగా, ఆలయాల ఆస్తుల రిజిస్టర్లో పేర్కొన్న భూముల వివరాల వారీగా ఆ ముగ్గురు అధికారులు మూడ్రోజులపాటు విచారణ జరిపి కమిషనర్‌కు ఆరు పేజీల నివేదికను అందజేశారు. ఈ నివేదికలో.. ఎవరి నుంచి ఎలాంటి వినతులు రాకుండా ఏకపక్షంగా సదరు 748 ఎకరాలు దేవుడి భూములు కావని ప్రకటించే అధికారం ఎవరికీ లేదని అధికారులు స్పష్టంగా పేర్కొన్నారు. భూములు తమవిగా ప్రజల నుంచి వినతి వచ్చినప్పుడు మాత్రమే నిబంధనల ప్రకారం విచారణ జరిపి వాటికి కమిషనర్ ‘నో అబ్జెక్షన్ సర్టిఫికెట్’ (ఎన్ఓసీ) జారీచేయాల్సి ఉంటుందని అందులో వివరించారు. లేదంటే.. దీనిపై ఎవరైనా ట్రిబ్యునల్‌ను ఆశ్రయిస్తే ట్రిబ్యునల్ తగిన ఆదేశాలు జారీచేస్తుందంటూ దేవదాయ శాఖ చట్టంలోని నిబంధనలను ఆ ముగ్గురు అధికారులు తమ నివేదికలో స్పష్టంచేశారు. కాగా, ఈ ఆరు పేజీల నివేదిక ప్రస్తుతం దేవదాయ శాఖ వద్ద భద్రంగా ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అందరూ సైలెంట్.. ఇదిలా ఉంటే.. ముగ్గురు అధికారులు అప్పటి కమిషనర్‌కు నివేదిక ఇచ్చిన తర్వాత కూడా సింహాచలం లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈఓ స్థాయిలో ఈ భూముల గోల్మాల్ యథేచ్ఛగా కొనసాగింది. కానీ, అప్పటి కమిషనర్ సహా సంబంధిత శాఖ ఉన్నతాధికారులందరూ ఒక్కసారిగా గప్‌చుప్ అయ్యారు. ఇందుకు ప్రధాన కారణం.. అప్పటి ప్రభుత్వ ముఖ్యుల నుంచి అందిన ఆదేశాలే కారణమని విశ్వసనీయ సమాచారం. -
సింహాచలం భూముల గోల్మాల్.. పన్నాగం ‘పెద్ద’లదే!
సాక్షి, అమరావతి: విశాఖపట్నం నగరం చుట్టుపక్కల పది వేల కోట్లకుపైగా విలువ చేసే 748 ఎకరాల సింహాచలం ఆలయ భూములను 2016లో దేవదాయ శాఖ ఆస్తుల జాబితా నుంచి తొలగించడం వెనుక అప్పటి ప్రభుత్వ పెద్దల పాత్రే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ‘సాక్షి’ ఆదివారం సంచికలో ‘అప్పన్నకే శఠ గోపం’ శీర్షికతో సంచలనాత్మక కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. దీంతో.. టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మరికొన్ని పరిణామాలు వెలుగులోకి వచ్చాయి. ఈ భూబాగోతానికి సంబంధించి నాటి ప్రభుత్వ ‘ముఖ్య’నేత కనుసన్నల్లో భారీ కుంభకోణానికి రెండేళ్లకు పైగా పకడ్బందీ స్కెచ్ నడిచినట్లు దేవదాయ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన తెలుగుదేశం పార్టీ నేతలు 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే ముందుగా సింహాచలం ఆలయ భూములను కబ్జా చేసినట్లు తెలిసింది. అలాగే, 2016 డిసెంబరు 14న సింహాచల ఆలయ ఆస్తుల పట్టిక నుంచి 748 ఎకరాలను తొలగించిన జాబితాలో.. టీడీపీ నేతలు చేసిన కబ్జా భూములు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేవుడి భూములను ఆలయ ఆస్తుల జాబితా నుంచే నాటి ప్రభుత్వమే తనంతట తానుగా తొలగించడంతో టీడీపీ నేతలు ముందస్తు వ్యూహంతోనే దురాక్రమించుకున్నారని.. ఆ తర్వాత ఆ భూములన్నింటికీ వారే నిజమైన యజమానులుగా చలామణీలోకి వచ్చారన్నది ఒక బలమైన వాదన. నిషేధ జాబితాకు ఎక్కకుండా జాగ్రత్తలు 2015లో అప్పటి టీడీపీ ప్రభుత్వం రాష్ట్రమంతటా వ్యవసాయ భూములను అన్లైన్లో నమోదు చేసేందుకు ‘మీ ఇంటికి మీ భూమి’ పేరుతో ఓ కార్యక్రమాన్ని చేపట్టింది. దీంతో దేవదాయ శాఖ కూడా రాష్ట్రంలో వివిధ ఆలయాల పేరిట ఉన్న భూములన్నింటినీ అన్లైన్లో నమోదుకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రతి మండలానికి ఒక అధికారిని నియమించి ఆ మండల పరిధిలో దేవుడి భూములను అన్లైన్లో నమోదు చేయించే బాధ్యతను ఆయనకు అప్పగించింది. మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల వారీగా భూముల వివరాలను స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖకు కూడా పంపి ఆయా భూములకు భవిష్యత్‌లో కొత్తగా రిజిస్ట్రేషన్ల జరగకుండా దేవదాయ శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆలయాల భూములన్నింటినీ ప్రత్యేకంగా 22 (ఏ) (1) (సీ) అన్లైన్లో నిషేధిత జాబితాలో చేర్చారు. ఈ సమయంలోనూ అప్పటి ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో టీడీపీ నేతలు ఆ 748 ఎకరాలు అసలు రిజిస్ట్రేషన్ శాఖ 22(ఏ)(1)(సీ) జాబితా దాకా వెళ్లకుండా పక్కా వ్యూహంతో వ్యవహరించారు. సింహాచలం ఆలయ భూములపైనే ప్రత్యేక నివేదిక ఇదిలా ఉంటే.. ఆలయాల వారీగా 22(ఏ)(1)(సీ) జాబితాలో చేరాల్సిన భూముల వివరాలను జిల్లా దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ద్వారా ఆయా జిల్లాల పరిధిలోని అన్ని ఆలయాల వివరాలను ఒక నివేదిక రూపంలో కమిషనర్ కార్యాలయానికి తెప్పించుకుంది. అనంతరం ఇదే నివేదికను కమిషనర్ కార్యాలయం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు పంపింది. అయితే, విశాఖ జిల్లాలో అన్ని ఆలయాల వివరాలు కమిషనర్ కార్యాలయానికి చేరగా.. సింహాచలం ఆలయ నాటి ఈఓ మాత్రం దేవస్థానం పరిధిలోని ఆస్తుల వివరాలను పంపలేదు. అప్పటి ప్రభుత్వ పెద్దల సూచనల మేరకే ఇలా జరిగిందన్న వాదన బలంగా వినిపిస్తోంది. అంతేకాక.. ఆస్తుల వివరాలను అప్పటి దేవదాయ శాఖ కమిషనర్ ఈఓను సమాచారం కోరినప్పటికీ నాటి ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ఈ విషయంలో జోక్యం చేసుకున్నట్లు తెలిసింది. నాలుగు నెలల తర్వాత సింహాచలం దేవస్థానానికి సంబంధించిన భూముల నివేదికను విడిగా పంపినట్లు సమాచారం. రికార్డుల తారుమారు? సింహాచలం దేవస్థానం ఆస్తులకు సంబంధించిన 22(ఏ)(1)(సీ) జాబితాను రిజిస్ట్రార్ శాఖకు పంపే ముందు ఆలయ ఆస్తుల రికార్డులను తారుమారు చేశారన్న ఆరోపణలున్నాయి. ఆలయ ఆస్తుల జాబితా నుంచి 748 ఎకరాలను తొలగించాలన్న నిర్ణయం బయటకు పొక్కకుండా ఉండేందుకు సింహాచల ఆలయ ఆస్తులకు సంబంధించి 22(ఏ (1)(సీ) జాబితా వివరాలు మొదట ఆలయ ఈఓ ద్వారానే స్థానికంగా ఉండే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి పంపి గుట్టుచప్పుడు కాకుండా కార్యక్రమాన్ని ముగించాలన్న ప్రయత్నం జరిగింది. అయితే, నిబంధనలకు విరుద్ధంగా నాటి ఈఓ నేరుగా పంపిన నివేదికను పరిగణనలోకి తీసుకోవడానికి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులు సాహసించలేదు. దీంతో నెలల విరామం అనంతరం ఈఓ కమిషనర్ కార్యాలయం ద్వారానే రిజిస్ట్రేషన్ శాఖకు పంపారని రెండు వేర్వేరు కథనాలు వినిపిస్తున్నాయి. ఆ అధికారికి అందలం కాగా.. 2016లో సింహాచలం ఆలయ ఆస్తుల జాబితా నుంచి 748 ఎకరాల దేవుడి భూమి తొలగించినప్పుడు ఆలయ ఈఓగా పనిచేసిన అధికారే ఇప్పుడు దేవదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో కమిషనర్ తర్వాత స్థాయి ర్యాంకులో అడిషనల్ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో సదరు ఈఓకు అదనపు కమిషనర్‌గా పదోన్నతి ఇవ్వగా, ఆప్పటి నుంచే ఆయన కమిషనర్ కార్యాలయంలో ఆ హోదాలో పనిచేస్తున్నారు. ఆస్తుల గోల్‌మాల్‌పై విచారణ సింహాచలం శ్రీ లక్ష్మీనరసింహాస్వామి ఆలయ ఆస్తుల రిజిస్టర్ నుంచి 2016లో ఒకేసారి 748.07 ఎకరాల తొలగింపు వ్యవహరంపై దేవదాయశాఖ విచారణకు ఆదేశించింది. ఆదివారం ‘సాక్షి’లో ఈ బాగోతంపై వచ్చిన కథనం మీద ఆ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ స్పందించారు. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రత్యేక కమిషనర్ అర్జునరావును కోరారు. దీంతో దేవదాయ శాఖ విశాఖపట్నం ఇన్చార్జి డిప్యూటీ కమిషనర్‌తో సమగ్ర విచారణకు అర్జునరావు ఆదేశించారు. -
Simhachalam Temple: అప్పన్నకే శఠగోపం
సాక్షి, అమరావతి: సెంటు స్థలం అటు ఇటు అయితే గొడవలు పడటం.. కోర్టులకు వెళ్తుండటం చూస్తున్నాం. అలాంటిది ఒక ఎకరా కాదు.. రెండెకరాలు కాదు.. ఏకంగా రూ.10 వేల కోట్లకు పైబడి విలువ చేసే 748 ఎకరాల భూములు మావి కాదంటూ దేవదాయ శాఖ పరులకు వదిలేసింది. ఇవి విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయ భూములు. స్వామి వారి భూములను జాగ్రత్తగా కాపాడాల్సింది పోయి.. ఎవరూ అడక్కపోయినా, ఇవి మావి కావంటూ ఇతరులకు ధారాదత్తం చేసింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2016లో ఈ బాగోతం చోటుచేసుకుంది. అప్పటి ప్రభుత్వ పెద్దలు తెర వెనుక వ్యవహారం నడపడంతో విలువైన భూములు అన్యాక్రాంతమయ్యాయి. ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన దేవాలయ భూముల, ఆస్తుల పరిరక్షణలో భాగంగా దేవుడి భూములకు జియో ఫెన్సింగ్ (ఆన్లైన్ మ్యాప్‌లో సరిహద్దుల గుర్తింపు) చర్యలకు ఉపక్రమించిన క్రమంలో ఈ భారీ కుంభకోణం వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఒక్క రోజులో ఒక్క కలం పోటుతో.. సింహాచలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పేరిట 11,282.26 ఎకరాల భూమి ఉంది. ఈ భూములను అప్పటి విజయనగరం మహారాజులు రాసిచ్చారు. ప్రస్తుత విశాఖపట్నం నగరానికి సమీపంలో ఉండే అడవి వరం, వెంకటాపురం, వేపగుంట, చీమాలపల్లి, పురుషోత్తపురం గ్రామాల పరిధిలో ఈ భూములు ఉన్నాయి. 1967–68లో ఈ భూముల వ్యవహారంలో ఎస్టేట్ ఎబాలిష్ యాక్ట్ వివాదం కొనసాగినప్పటికీ, 1977, 78లో అప్పటి ఇనామ్ తహాసీల్దార్ ఈ భూములన్నీ స్వామి వారికే చెందుతాయని డిక్లరేషన్ జారీ చేశారు. ఎస్టేట్ ఎబాలిష్ యాక్ట్ ప్రకారం అందులో కొంత భూమిని మాత్రం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. 9,069.22 ఎకరాలకు రెవిన్యూ అధికారులు దేవుడి పేరుతో రైతు వారీ పట్టా జారీ చేశారు. ఈ క్రమంలో 2016లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పెద్దల చూపు ఈ భూములపై పడింది. ఎలాగైనా సరే కొంత భూమిని అయిన వాళ్లకు కట్టబెట్టాలని తెరవెనుక మంత్రాంగం నడిపారు. ఇందుకు దేవదాయ శాఖను పావుగా వినియోగించుకున్నారు. ఏ ఒక్కరి నుంచి వినతి కానీ, ఫిర్యాదు కానీ లేకుండానే విశాఖపట్నం నగరానికి అనుకొని ఉండే 748.07 ఎకరాల దేవుడి భూములను ఒకే రోజు దేవదాయ శాఖ ఆస్తుల జాబితాల నుంచి తొలగించేశారు. ఈ భూములు స్వామి వారివి కావని, వేరే ఎవరివోనంటూ ప్రభుత్వం 2016 డిసెంబరు 14వ తేదీన అధికారికంగా ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. 2016లో సింహాచలం ఆలయ ఆస్తుల జాబితా నుంచి పలు భూములను తొలగిస్తూ ఇచ్చిన ఉత్తర్వు ఎవరూ అడగక్క పోయినా.. అడవివరం, వేపగంట్ల, చీమాలపల్లి రెవిన్యూ గ్రామాల పరిధిలో మొత్తం 291 సర్వే నంబర్లకు సంబంధించి కొన్నింటిలో మొత్తం భూమిని, మరికొన్నింటిలో కొంత భాగం భూమిని స్వామి వారి ఆస్తుల జాబితాల నుంచి గత తెలుగుదేశం ప్రభుత్వం తొలగించింది. ఇందులో 306 ఎకరాల భూమికి సంబంధించి కుంభకోణం జరిగిందని ఇప్పటికే అధికారుల పరిశీలనలో వెల్లడైనట్లు తెలిసింది. లోతైన విచారణ జరిగితే పూర్తి స్థాయిలో వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. వాస్తవానికి రాష్ట్రంలో పలు చోట్ల సామాన్య ప్రజల వ్యవసాయ భూములు తప్పుగా నమోదు కావడంతో క్రయవిక్రయాలకు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ తరహా బాధిత రైతులు అధికారులకు అర్జీల మీద అర్జీలు పెట్టుకుంటూ ఏళ్ల తరబడి ఆఫీసుల చుట్టూ తిరిగినా ఫలితం ఉండేది కాదు. అలాంటిది సింహాచలం శ్రీ వరహా లక్ష్మీనరసింహస్వామి ఆలయ భూముల విషయంలో బాధితులమంటూ ఎవరూ స్వయంగా ప్రభుత్వానికి ఎలాంటి వినతులు పెట్టుకోలేదు. అయినప్పటికీ అప్పటి ప్రభుత్వం తనంతట తానుగా ఆ భూములను ఆలయ రికార్డుల నుంచి తొలగించేసింది. ఈ పరిణామంతో కుంభకోణం చోటుచేసుకుందని ప్రత్యేకించి చెప్పక్కరలేదని స్థానికులు అంటున్నారు. ఏకపక్ష నిర్ణయం.. నిబంధనలు బేఖాతరు ఒకే విడత ఇంత పెద్ద మొత్తంలో భూములను ఆలయ జాబితా నుంచి తొలగించే ప్రక్రియ జరిగిన సమయంలో విశాఖపట్నం జిల్లా దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ పోస్టులో ఉన్న ముగ్గురు అధికారులు ఒక్క ఏడాదిలోనే వెంట వెంటనే బదిలీ అవ్వడం గమనార్హం. తద్వారా ఈ తతంగం మొత్తంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తొలుత పుష్పవర్ధన్‌ను బదిలీ చేశారు. ఆ తర్వాత ఎన్వీఎస్ఎన్ మూర్తిని నియమించారు. ఆ తర్వాత కొద్ది కాలానికే ఆయనను కూడా బదిలీ చేసి సుజాత అనే మరో అధికారిని జిల్లా దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్‌గా నియమించారు. ఓ ఆలయ ఆస్తుల జాబితా నుంచి నిర్ణీత కారణాలతో ఏవైనా భూములను తొలగించాలంటే దేవదాయ శాఖ చట్టంలో ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. ఆలయ ఆస్తుల జాబితాలో పేర్కొన్న భూములపై ఎవరన్నా అభ్యంతరం వ్యక్తం చేస్తూ వినతిపత్రం పెట్టుకుంటే ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) మొదట ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను జిల్లా దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్(ఏసీ)కు పంపాల్సి ఉంటుంది. ఆ ప్రతిపాదనలపై ఏసీ సంతృప్తి చెందిన పక్షంలో ఆ వివరాలతో పబ్లిక్ నోటీసు జారీ చేస్తారు. సంబంధిత ఆలయ ప్రాగంణం, సంబంధిత భూముల గ్రామ కార్యాలయం, దేవదాయ శాఖ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయం సహా మొత్తం ఐదు బహిరంగ ప్రదేశాల్లో ఆ పబ్లిక్ నోటీసును ప్రజలందరికీ తెలిసేలా ప్రదర్శించాల్సి ఉంటుంది. 15 రోజుల పాటు ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణకు అవకాశమివ్వాలి. ఆ తర్వాత అంతా సక్రమంగా ఉందని నిర్ధారించుకుని ఆ భూములను ఆలయ ఆస్తుల జాబితా నుంచి తొలగించాలి. ఆస్తుల జాబితా రిజస్టర్‌లో తొలగించిన భూముల వివరాల వద్ద సంబంధిత జిల్లా దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సంతకం కూడా చేయాల్సి ఉంటుంది. 2010 ఆస్తుల రిజిస్టర్‌ను సాకుగా చూపి.. ఆలయ ఆస్తుల జాబితా నుంచి భూముల తొలగింపునకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం చూపిన కారణం ఏమిటంటే.. ఆ భూములను తప్పుగా నమోదు చేశారని చెప్పారు. సర్వే నంబర్ల వారీగా ‘ఇనాం బి. రిజిస్టర్ నందు పట్టా నెం.2లో ఇతర ఇనాం భూమిగా నమోదు చేయబడి దేవస్థానం టైటిల్‌డీడ్ నంబరు 3145 నందు నమోదు కాలేదు’ అని పేర్కొన్నారు. మరికొన్ని భూములను గతంలో వేరే వారికి కేటాయించారని, విక్రయించారని చూపుతూ ఈ 748 ఎకరాలను జాబితా నుంచి తొలగించారు. 2004కు ముందు వివిధ ప్రభుత్వ, ప్రజా అవసరాలకు విశాఖపట్నం జిల్లాలో సింహాచలం శ్రీవరహా లక్ష్మీ నరసింహాస్వామి ఆలయ భూములను చాలా సందర్భాలలో అప్పటి ప్రభుత్వాలు కేటాయింపులు చేశాయి. మధ్య తరగతి ప్రజల ఇళ్ల కోసం ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డుకు కొంత భూమిని నిర్ణీత ధరకు బదలాయించారు. ప్రస్తుత ఎల్జీ పాలిమర్స్ వంటి సంస్థలు రావడానికి పూర్వమే భూములను కేటాయించారు. 2000–03 మధ్యలో ఆలయ భూములను అక్రమించుకున్న వారికి నిర్ణీత ధర ప్రకారం అక్రమణల క్రమబద్దీకరణ చేసి ఎల్‌ఆర్‌సీ సర్టిఫికెట్లను జారీ చేశారు. అవన్నీ 2004కు ముందు జరిగిన పరిణామాలు. ఆలయ భూములపై హైకోర్టు తీర్పు తర్వాత ఆ భూముల అమ్మకం, కేటాయింపులపై ఆంక్షలు అమలులో ఉన్నాయి. కాగా, 2010లో సింహాచలం ఆలయ ఆస్తుల రిజస్టర్‌లో అప్పటి వరకు ఆలయానికి ఉండే ఆస్తులను నమోదు చేసి, మిగిలినవి తొలగిస్తూ మార్పులు చేర్పులు చేశారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ 2016లో టీడీపీ ప్రభుత్వం ఆలయ ఆస్తుల జాబితా నుంచి 748 ఎకరాలను తొలగిస్తున్నట్టు రికార్డులో పేర్కొంది. ఆలయ ఆస్తుల కోసం ప్రత్యేక రిజిస్టర్ ప్రతి ఆలయానికి ఆ ఆలయం పేరిట ఉన్న భూములు, స్వామి వారి నగలు, నగదు రూపంలో బ్యాంకులో ఉండే డిపాజిట్ వంటి వివరాలతో ప్రత్యేక రిజిస్టర్ ఉంటుంది. 1966 దేవదాయ శాఖ చట్టం ప్రకారం దీనిని 25వ నంబరు రిజస్టర్గా పిలిచేవారు. 1966–88 మధ్య ఈ రిజస్టర్‌ను 38వ నంబరుగా మార్చారు. 1987 తర్వాత 43వ నంబరు రిజస్టర్గా పిలుస్తున్నారు. దేవదాయ శాఖ నిబంధనల ప్రకారం ప్రతి మూడేళ్లకు ఒకసారి స్వామి వారి ఆస్తుల వివరాల్లో చోటు చేసుకునే మార్పు చేర్పులను ఆ రిజస్టర్‌లో తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. సమగ్రంగా విచారణ సింహాచలం శ్రీ వరహా లక్ష్మీ నరసింహాస్వామి ఆలయ ఆస్తుల జాబితా నుంచి 2016లో ఒకేసారి 748 ఎకరాలు తొలగించిన విషయం మా పరిశీలనకు కూడా వచ్చింది. దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఈ అంశంపై శాఖ కార్యదర్శి వాణీమోహన్ ఆధ్వర్యంలో కమిషనర్ కార్యాలయంలో ఓ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించాం. సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలను నిర్ధారించేందుకు తగిన చర్యలు చేపట్టాం. – అర్జునరావు, దేవదాయ శాఖ ప్రత్యేక కమిషనర్. -
‘మాన్సాస్’ వ్యవహారంలో సుప్రీంకోర్టుకు వెళ్తాం
సాక్షి, అమరావతి: మాన్సాస్ ట్రస్టు వ్యవహారంలో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తామని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ట్రస్ట్ పరిధిలో అభివృద్ధి శూన్యమని విమర్శించారు. ట్రస్ట్ విషయంలో కోర్టు ఆదేశాలను పరిశీలిస్తున్నామన్నారు. ఏదైనా చట్టప్రకారమే అన్నీ జరుగుతాయని చెప్పారు. ఈ మేరకు సోమవారం మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. ట్విట్టర్ పిల్లాడు లోకేష్ ప్రతి దాంట్లో వేలు పెడతాడని.. మాన్సాస్ ట్రస్ట్ గురించి ఆయనకు ఏమి తెలుసని ప్రశ్నించారు. లోకేష్ ఈ విషయం గురించి మాట్లాడటానికి అటు పిల్లాడు కాదు.. ఇటు పెద్దవాడు కాదని ఎద్దేవా చేశారు. ఒక కోర్టులో తీర్పు వ్యతిరేకంగా వచ్చినంత మాత్రాన లోకేష్ గెలిచినట్టు కాదన్నారు. మాన్సాస్‌లో జరిగిన అక్రమాలను గుర్తించి చర్యలు చేపడుతున్నామన్నారు. ఏది చేసినా చట్టప్రకారం, న్యాయబద్ధంగా చేస్తామని తెలిపారు. బ్రహ్మంగారి మఠం విషయంలో చట్టప్రకారం ముందుకెళ్తామని స్పష్టం చేశారు. వీలునామా చట్టప్రకారం 90 రోజుల్లో ధార్మిక పరిషత్‌కు చేరాలన్నారు. పీఠాధిపతులతో కమిటీ వేసి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రూల్స్ ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారని తెలిపారు. శివస్వామి ముందుగా తన నిర్ణయం ప్రకటించడం సరికాదన్నారు. విషయం తేలే వరకు అక్కడ ఇన్‌చార్జ్‌ను నియమించామన్నారు. -
మఠాధిపత్యంపై పీఠాధిపతులతో కమిటీ
సాక్షి, అమరావతి: చారిత్రక శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠం ఖ్యాతి, గౌరవ మర్యాదలకు ఎటువంటి భంగం కలగకుండా తదుపరి మఠాధిపతిని ఎంపిక చేసేందుకు ధార్మిక పరిషత్ నిబంధనల ప్రకారం తదుపరి చర్యలకు దేవదాయ శాఖ ఉపక్రమించింది. ఈ అంశంపై చర్చించేందుకు ఆ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఆదివారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. బ్రహ్మంగారి మఠం తరహా సంప్రదాయం కలిగి ఉండే మఠాధిపతులు, భక్తులతో ఒక కమిటీని ఏర్పాటుచేసి, దాని సూచనల మేరకు ధార్మిక పరిషత్ ద్వారా తదుపరి మఠాధిపతిని ప్రకటించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున అప్పటివరకు మఠానికి తాత్కాలిక ఫిట్పర్సన్ (పర్సన్ ఇన్చార్జి)గా వైఎస్సార్ కడప జిల్లా దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శంకర్ బాలాజీని నియమించారు. ఈ మేరకు ఆ శాఖ ప్రత్యేక కమిషనర్ అర్జునరావు ఉత్తర్వులు జారీచేశారు. మంచి నిర్ణయమే తీసుకుంటాం: మంత్రి సమావేశానంతరం మంత్రి వెలంపల్లి ఉన్నతాధికారులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. మఠం పవిత్రత, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా వీలైనంత త్వరగా మఠాధిపతి ఎంపికపై మంచి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎలాంటి విద్వేషాలకు తావులేకుండా అందరూ సంయమనంతో వ్యవహరించాలని మంత్రి కోరారు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 1693లో జీవ సమాధి అయ్యాక, అప్పటి నుంచి వారి వంశమే మఠాధిపత్యం స్వీకరిస్తూ వచ్చిందని.. ఇలా ఇప్పటివరకు 11 మంది కొనసాగారని ఆయన తెలిపారు. ప్రస్తుత మఠాధిపతి మే 8న పరమపదించారని.. ఈ నేపథ్యంలో ఆయన ఇద్దరి భార్యల వారసులు పీఠాధిపతి స్థానానికి పోటీపడడంతో వివాదం ఏర్పడిందన్నారు. ఇరుపక్షాలు తమ వద్ద వీలునామాలు ఉన్నాయని చెబుతున్నాయని.. కానీ, ఇప్పటివరకు ఏ వీలునామా కూడా దేవదాయ శాఖకు అందలేదని మంత్రి వెలంపల్లి చెప్పారు. నిబంధనల ప్రకారం.. వీలునామా రాసిన 90 రోజుల వ్యవధిలో దానికి ఒక విన్నపాన్ని జతపరిచి దేవదాయ శాఖకు అందజేయాల్సి ఉందని.. అయినా ఏ వీలునామా కూడా దేవదాయ శాఖకు అందనందున తదుపరి చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉన్నందున మఠాధిపతి ఎంపిక సంప్రదాయ బద్ధంగా జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి వివరించారు. పీఠాధిపతి ఉన్నప్పుడే తదుపరి ఉత్తరాధికారిని ప్రకటించి ఉంటే సమస్య ఉత్పన్నమయ్యేదే కాదన్నారు. ముందస్తు నోటీసు ఇచ్చే కమిటీ సమావేశం.. ఇదిలా ఉంటే.. దేవదాయ శాఖ పరిధిలో 128 వరకు మఠాలు, పీఠాలు ఉన్నాయని.. వాటిలో బ్రహ్మంగారి మఠం తరహా సంప్రదాయాలు కలిగిన ఇతర మఠాధిపతులు, భక్తులతో ఒక కమిటీని ఏర్పాటుచేస్తామని.. కమిటీ సూచనలను ధార్మిక పరిషత్ పరిశీలించి తదుపరి మఠాధిపతి ఎంపిక పూర్తి చేస్తామని మంత్రి వివరించారు. కమిటీ సమావేశం నిర్వహణకు 30 రోజుల ముందస్తు నోటీసు ఇచ్చి సమావేశం నిర్వహిస్తారని మంత్రి తెలిపారు. ఈ ప్రక్రియకు సంబంధించి ఇతర మఠాధిపతులు, పీఠాధిపతులు ఎవరైనా సూచనలు ఇవ్వొచ్చని వెలంపల్లి చెప్పారు. -
ఇక 'వాడ'వాడలా గుడిగంటలు
సాక్షి, అమరావతి/విజయవాడ: రాష్ట్రంలో పెద్దఎత్తున ఆలయాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఎస్సీ, మత్స్యకార కాలనీలు, గిరిజన తండాలతో పాటు ఇతర వెనుకబడిన ప్రాంతాల్లో వీటిని నిర్మించనుంది. ఇందుకోసం ఒక్కో ఆలయానికి గరిష్టంగా రూ.10 లక్షల వరకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిధులు అందజేయనుంది. ఇప్పటివరకు ఒక్క ఆలయం కూడా లేనిచోట్ల కొత్తగా ఆలయ నిర్మాణానికి ప్రాధాన్యతనిచ్చి నిధులు విడుదల చేస్తారు. ఇందులో భాగంగా దేవదాయ శాఖ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దీనికి సంబంధించి దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్, ప్రత్యేక కమిషనర్ అర్జునరావు డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లకు ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు. భక్తుల మనోభావాల మేరకు రామాలయం, వేంకటేశ్వరస్వామి, శివాలయం, గ్రామదేవతల మొదలు ఏ ఇతర హిందూ ఆలయాల నిర్మాణానికైనా నిధులు అందజేస్తారు. ఇందుకోసం దేవదాయశాఖ పలు నియమ నిబంధనలు రూపొందించింది. అవి.. ► ఆలయ నిర్మాణానికి గ్రామస్తులు పది సెంట్ల స్థలాన్ని సమకూర్చాలి. స్థలాన్ని ఎవరైనా దాత ఇచ్చినట్లయితే, రూ.100 స్టాంపు పేపరుపై అతని సమ్మతిని తెలియజేయాలి. దేవదాయ శాఖ, టీటీడీ అధికారులు స్థలాన్ని పరిశీలించి, ఆలయ నిర్మాణానికి అనుమతిస్తారు. తర్వాత ఆలయ నిర్మాణ పురోగతి ఆధారంగా ఐదు విడతల్లో నిధులు విడుదల చేస్తారు. ► టీటీడీ, దేవదాయ శాఖ రూపొందించిన డిజైన్‌లో మాత్రమే ఆలయ నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. ప్రతి గుడిలోనూ గర్భాలయం, ఆరాధన మండపంతోపాటు భక్తులు కూర్చుని భజనలు చేసుకునేందుకు వీలుగా 13.3 అడుగుల వెడల్పు, 13.3 అడుగుల పొడవుతో మరో మండపాన్ని ఉండేలా డిజైన్ చేశారు. ► దేవాలయం నిర్మాణానికి గ్రామస్తులు కమిటీగా ఏర్పడాలి. ఆలయ నిర్మాణానికే టీటీడీ నిధులు సమకూర్చుతుంది. ► గ్రామాల్లోని దళితవాడలు, ట్రైబల్ ఏరియా, మత్స్యకార కాలనీలు, వెనుకబడిన ప్రాంతాల్లో ఎలాంటి ఆలయాలు లేకపోతే ప్రాధాన్యత ఇస్తారు. -
వీడని ‘పీఠ’ముడి!
బ్రహ్మంగారి మఠం: తన కాలజ్ఞానం ద్వారా ప్రపంచానికి భవిష్యత్తును చాటిచెప్పిన పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠాధిపత్యంపై నెలకొన్న ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ ఆధిపత్యం ఎవరికి దక్కుతుందనే అంశం ఇప్పుడు తీవ్ర ఉత్కంఠగా మారింది. తాజా పరిస్థితులు పరిశీలిస్తే ఈ వివాదం పరిష్కారానికి మరికొంత సమయంపట్టే అవకాశం కనిపిస్తోంది. వివాదాన్ని పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వం నెరపుతున్న గుంటూరు జిల్లాకు చెందిన పీఠాధిపతి శివస్వామి నేతృత్వంలోని ఇతర మఠాధిపతుల బృందం ఆదివారం మఠానికి వచ్చి రెండోసారి చర్చలు జరుపుతారని.. తద్వారా వివాదానికి ముగింపు పలికే అవకాశముందని అందరూ భావిస్తున్నారు. కానీ.. దివంగత పీఠాధిపతి రెండో భార్య మారుతీ మహాలక్షుమ్మ మాత్రం పట్టువదలకపోవడంతో ఇప్పుడు ఈ వివాదంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మధ్యవర్తిత్వానికి ‘నో’.. మఠాధిపతి వివాదంలో అసాంఘిక శక్తులు వచ్చే అవకాశముందని, పీఠాధిపతుల జోక్యాన్ని సహించేదిలేదని, వీరిని మఠానికి రాకుండా నిలువరించాలంటూ డీజీపీ మొదలుకుని కిందిస్థాయి అధికారులందరికీ ఆమె శుక్రవారం లేఖలు రాశారు. అలాగే, తాము మఠాధిపతుల చర్చల్లో పాల్గొనేది కూడా లేదని ఆమె స్పష్టంచేశారు. తాము దేవదాయ శాఖ నిబంధనల మేరకు మఠం పర్యవేక్షణలోనే మఠాధిపతి ఎంపిక నిర్వహించుకుంటామని, పీఠాధిపతుల జోక్యం అక్కర్లేదని ఆమె తెగేసి చెబుతున్నారు. అలాగే, మఠాధిపతి నియామకం వారసత్వ చట్ట ప్రకారం ఉంటుందని దివంగత మఠాధిపతి మొదటి భార్య కుమారులు అంటున్నారు. ఈ విషయంపై శివస్వామి ఈనెల 2న వివిధ పీఠాధిపతులతో కలిసి ఇరువర్గాలతో చర్చలు జరిపినప్పటికీ వివాదం ఓ కొలిక్కి రాని విషయం తెలిసిందే. రెండోదఫా చర్చలు ప్రశ్నార్ధకం మరోవైపు.. శివస్వామి నేతృత్వంలోని పీఠాధిపతుల బృందం బ్రహ్మంగారి మఠానికి శనివారం రాత్రి రానుండడంతో ఎలాంటి ఘర్షణలు చోటుచేసుకోకుండా పోలీసులు గట్టి చర్యలు చేపట్టారు. పీఠాధిపతుల నేతృత్వంలో చర్చలకు మహాలకు‡్ష్మమ్మ ససేమిరా అనడంతో రెండవ దఫా చర్చలు ప్రశ్నార్థకంగా మారాయి. దీంతో పోలీసులతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులతో ఈ విషయమై చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అనంతరం.. దేవదాయ శాఖ ఉన్నతాధికారులతోనూ మాట్లాడనున్నట్లు సమాచారం. రాజీ ఫార్ములా!? ఇదిలా ఉంటే.. స్థానిక ప్రజల్లో కొందరు దివంగత మఠాధిపతి మొదటి భార్య తనయుడికి మద్దతు పలుకుతుండగా, మరికొందరు రెండో భార్యకు అండగా నిలుస్తుండడంతో ఈ వివాదంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. అయితే, పీఠాధిపతులు వారి కుటుంబాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు రాజీ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా రెండు, మూడు రకాల ప్రతిపాదనలు తెరమీదకు తీసుకొస్తున్నారు. ఇది విఫలమైన పక్షంలో ప్రభుత్వం జోక్యం చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే ప్రభుత్వం ప్రత్యేక అధికారిని నియమించే అవకాశమున్నట్లు చెబుతున్నారు. పీఠాధిపతులకు అనుమతిలేదు బి.మఠం మఠాధిపతి నియామకం కోసం చర్చల నిమిత్తం వస్తున్న వివిధ పీఠాధిపతులకు దేవస్థానంలోకి అనుమతిలేదు. వారు శనివారం రాత్రికి వస్తే వారు బి.మఠంలోని పల్నాటి అన్నదాన సత్రంలో ఉండేందుకు ఏర్పాట్లుచేశారు. పీఠాధిపతులు ఆదివారం కేవలం స్వామి దర్శనం కోసం వెళ్లొచ్చు కానీ చర్చలకు మాత్రం అందరి ఆమోదం ఉంటేనే పంపుతాం. –విజయకుమార్, మైదుకూరు డీఎస్పీ ఇదీ వివాదం.. పూర్వపు మఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి ఇటీవల కరోనాతో శివైక్యం చెందారు. భార్య చంద్రావతికి నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. చంద్రావతి అనారోగ్యంతో మృతిచెందడంతో ఆయన పదేళ్ల క్రితం రెండో వివాహం చేసుకున్నారు. రెండో భార్యకు ఇద్దరు కుమారులు. వీరు మైనర్లు. మఠాధిపతి వెంకటేశ్వరస్వామి మరణంతో పెద్ద భార్య జ్యేష్ఠ కుమారుడు వెంకటాద్రిస్వామి (53), రెండో భార్య పెద్ద కుమారుడు గోవిందస్వామి (9)ల మధ్య ఇప్పుడు పీఠాధిపత్యంపై పోటీ నెలకొంది. అయితే, గోవిందస్వామి మేజర్ అయ్యే వరకు తాను మఠం బాధ్యతలను తాత్కాలికంగా స్వీకరిస్తానంటూ రెండో భార్య మారుతి మహాలక్షుమ్మ పోటీలోకి వచ్చారు. దీంతో సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు రాష్ట్రంలోని వివిధ మఠాల నుంచి పలువురు పీఠాధిపతులు గత వారం బ్రహ్మంగారి మఠానికి చేరుకున్నారు. కానీ, వీరి ప్రయత్నాలు ఫలించలేదు. -
ఇష్టదైవానికి ఆన్లైన్లోనే పూజలు
సాక్షి, అమరావతి: కోవిడ్ వేళ గుడి వరకు వెళ్లకుండానే తమ ఇష్ట దైవాల పూజల్లో ఆన్లైన్ ద్వారా హాజరవుతున్నారు భక్తులు. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో ఆన్లైన్లో పూజాదికాలు నిర్వహించుకునే అవకాశాన్ని దేవదాయ శాఖ అందుబాటులోకి తీసుకురాగా.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్న భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడచిన శుక్రవారం రోజున రాష్ట్రంలోని 23 ఆలయాల్లో 512 మంది భక్తులు ఆన్లైన్ ద్వారా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నట్టు దేవదాయ శాఖ వెల్లడించింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప్రముఖ క్షేత్రమైన మావుళ్లమ్మ ఆలయంలో శుక్రవారం అత్యధికంగా 159 మంది భక్తులు ఆన్లైన్ పూజల్లో పాల్గొనగా.. శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున ఆలయంలో ఒక్కరోజే 145 మంది భక్తులు ఆన్లైన్ ద్వారా పూజలు నిర్వహించారు. ఈ నెల 8–11 తేదీల మధ్య 14 ఆలయాల్లో 624 మంది ఆన్లైన్ విధానాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ప్రస్తుతం 23 క్షేత్రాల్లో.. రాష్ట్రంలో పెద్ద దేవాలయాలైన శ్రీశైలం, అన్నవరం, విజయవాడ కనకదుర్గ, ద్వారకా తిరుమల, కాణిపాకం, మావుళ్లమ్మ మొదలగు 23 ఆలయాల్లో పరోక్ష పద్ధతిలో నిర్వహించుకునేలా ఈ–పూజలను దేవదాయ శాఖ ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది. భక్తుల రద్దీ అధికంగా ఉండే 6 (ఏ) కేటగిరీలో ఉండే 175 ఆలయాల్లోనూ ఈ నెలాఖరు నాటికి ఆన్లైన్ పూజలను అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేపట్టింది. మరో 1,300 పైగా 6 (బీ) కేటగిరీ ఆలయాల్లోనూ జూలై చివరి నాటికి ఈ విధానాన్ని అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా నిర్ణయించారు. భక్తులు వీక్షించేలా ప్రత్యేక లింకు వివిధ ఆలయాల్లో ఈ–పూజలను బుక్ చేసుకున్న భక్తులకు గోత్రనామాలతో కోరుకున్న పూజను ఆలయంలో నిర్వహించేలా దేవదాయ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భక్తుడు పూజను బుక్ చేసుకున్న వెంటనే అతడి మొబైల్ నంబర్‌కు ప్రత్యేకంగా ఓ ఆన్లైన్ లింకును ఆలయ అధికారులు పంపుతారు. నిర్దేశిత సమయంలో అధికారులిచ్చిన కోడ్‌తో భక్తుడు ఆన్లైన్లో లింకు ఓపెన్ చేయగానే.. సంబంధిత భక్తుల పూజను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఉంటుంది. పూజల తరువాత ప్రసాదాన్ని పోస్ట్ ద్వారా పంపిస్తారు. రాష్ట్రంలోని 170 ప్రముఖ ఆలయాల్లో ఈ–హుండీ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. 207 రకాల పూజలు వివిధ ఆలయాల్లో స్వామి, అమ్మవార్లకు నిత్యం నిర్వహించే ప్రత్యేక పూజా కార్యక్రమాలను మాత్రమే దేవదాయ శాఖ ఆన్లైన్లో పరిధిలోకి తెచ్చింది. త్వరలో 207 రకాల పూజలను ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబోతోంది. ► శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జునస్వామి ఆలయంలో అభిషేకం, రుద్ర హోమం, మృత్యుంజయ హోమం, చంఢీ హోమం, నిత్య కల్యాణ పూజలను పరోక్ష సేవల కేటగిరిలో అందుబాటులోకి తీసుకొచ్చింది. భక్తులు ఆన్లైన్ రూ.1,116 చెల్లించి ఏ పూజానైనా తమ గోత్రనామాలతో జరిపించుకోవచ్చు. ► అన్నవరం ఆలయంలో మఖ నక్షత్రం రోజున అభిõÙకంతోపాటు అన్ని రోజుల్లో సత్యనారాయణ స్వామి వ్రతాలను ఆన్లైన్ ద్వారా జరిపించుకోవచ్చు. ► ద్వారకా తిరుమలలో శ్రీవారి నిత్య కల్యాణం (టికెట్ ధర రూ.1,600), బెజవాడ కనకదుర్గ ఆలయంలో చండీహోమం, ఖడ్గమాలార్చన, శ్రీకాళహస్తిలో రాహు–కేతు పూజలను ఆన్లైన్ విధానంలో నిర్వహించుకోవచ్చు. -
రాజన్న, నర్సన్న ప్రసాదాలు పొందడం ఇక సులువే!
సాక్షి, హైదరాబాద్/వేములవాడ: రాష్ట్రంలోని పది ప్రధాన దేవాలయాల ప్రసాదాలను నేరుగా ఇళ్లకే పంపే ప్రత్యేక సేవను దేవాదాయ శాఖ ప్రారంభించింది. ఇందుకు శనివారం తపాలా శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి, భద్రాచలం సీతారామచంద్రస్వామి, వేములవాడ రాజరాజేశ్వరస్వామి, బాసర శ్రీ జ్ఞాన సరస్వతి, కొండగట్టు ఆంజనేయ స్వామి, కొమురవెల్లి మల్లికార్జున స్వామి, సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళీ, సికింద్రాబాద్ గణేశ్, బల్కంపేట ఎల్లమ్మ–పోచమ్మ, కర్మన్‌ఘాట్ ఆంజనేయస్వామి దేవాలయాల్లో ప్రస్తుతం ఈ సేవలు ప్రారంభించారు. భక్తులు ఈ దేవాలయాల ప్రసాదాలు కావాలని స్థానిక తపాలా కార్యాలయానికి వెళ్లి వివరాలు నమోదు చేసుకుంటే రెండు మూడు రోజుల్లో ఆయా ఆలయాల నుంచి ప్రసాదం వారి ఇంటికి తపాలా ద్వారా చేరుతుంది. అయితే, ఆయా దేవాలయాలకు ప్రత్యేక ప్రసాదాలుంటాయి. పులిహోర, దధ్యోదనం, లడ్డూ, రవ్వకేసరి లాంటివి. కానీ, ఇవి రెండుమూడు రోజుల పాటు నిల్వ ఉండే అవకాశం ఉండదు. దీనికోసం తపాలా ద్వారా డ్రైఫ్రూట్స్, రవ్వ పొడి ప్రసాదాలను మాత్రమే పంపనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 1.60 లక్షల తపాలా కార్యాలయాలలో ఈ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. ఇప్పటికే ఆన్లైన్ ద్వారా ఆయా దేవాలయాల ఆర్జిత సేవలు నిర్వహించుకునే అవకాశాన్ని దేవాదాయ శాఖ గతంలోనే ప్రారంభించింది. వేర్వేరు ప్రాంతాల్లో ఉంటూ నేరుగా తమ పేరుతో జరిగే పూజల్లో పాల్గొనే అవకాశం లేని వారు ఆన్లైన్లో గోత్రనామాలు, పూజ జరగాల్సిన తేదీని బుక్ చేసుకుంటే ఆ రోజు వారి పేరిట పూజలు నిర్వహిస్తున్నారు. ఇందు కోసం ఐటీ శాఖ రూపొందించిన టీ యాప్ ఫోలి యో ద్వారా 22 దేవాలయాల్లో ఈ సేవలు పొందే వీలుంది. తాజాగా పూజలతోపాటు ప్రసాదాలు కూడా పొందే వీలును తపాలాశాఖతో కలిసి ఏర్పా టు చేసింది. శనివారం అరణ్య భవన్‌లోని కార్యాలయంలో దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమక్షంలో జరిగిన ఈ ఒప్పందంలో దేవాదాయశాఖ కమిషనర్ అనిల్‌కుమార్, తపాలాశాఖ తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ ఎస్.రాజేంద్రకుమార్, దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ కృష్ణవేణి, హైదరాబాద్ రీజియన్ పోస్ట్‌మాస్టర్ జనరల్ పీవీఎస్‌రెడ్డి, హైదరాబాద్ పోస్ట్ మాస్టర్ జనరల్ సాగర్ హనుమాన్ సింగ్, డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ ఎస్వీ రావు తదితరులు పాల్గొన్నారు. -
రామతీర్థం విగ్రహాలకు తుది మెరుగులు
తిరుపతి ఎడ్యుకేషన్: విజయనగరం జిల్లాలోని రామతీర్థంలో ఇటీవల దుండగులు శ్రీరాముని విగ్రహాన్ని ధ్వంసం చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ధ్వంసమైన శ్రీరాముని విగ్రహం స్థానంలో నూతనంగా సీతాలక్ష్మణ సమేత శ్రీరాముని ప్రతిమలను ప్రతిష్టించేందుకు ఆ జిల్లా దేవదాయ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా విగ్రహాల తయారీకి ఈ నెల 8న టీటీడీ ఉన్నతాధికారులను దేవదాయ శాఖ అధికారులు సంప్రదించారు. అలిపిరిలోని టీటీడీ శిలా శిల్ప ఉత్పత్తి కేంద్రంలో ఏఈ మహేందర్‌రెడ్డి పర్యవేక్షణలో స్థపతి మునిశంకర్, మార్కింగ్ స్థపతి మారుతీరావు నేతృత్వంలో శిల్పులు రమేష్, నాగరాజు, సుబ్రమణ్యం ఆచారీ విగ్రహాల తయారీ పనిలో నిమగ్నమయ్యారు. మూలవిరాట్ తయారీకి కంచి నుంచి కృష్ణశిల(బ్లాక్ గ్రానైట్)ను తెప్పించారు. పీఠంతో కలిపి శ్రీరాముని విగ్రహం 3.6 అడుగులు, సీతా, లక్ష్మణుల విగ్రహాలు పీఠంతో కలిపి 3 అడుగులతో మలుస్తున్నారు. గురువారం సాయంత్రానికి ఈ విగ్రహాలు తుదిమెరుగులు దిద్దుకోనున్నాయి. -
రూ.3 కోట్లతో రామతీర్థం ఆలయ పునఃనిర్మాణం
సాక్షి, అమరావతి: విజయనగరం జిల్లా రామతీర్థం శ్రీరామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి, పునఃనిర్మాణానికి మూడుకోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్టు దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు చెప్పారు. ఆయన సోమవారం దేవదాయశాఖ కార్యదర్శి గిరిజాశంకర్, ప్రత్యేక కమిషనర్ అర్జునరావు, ఆర్జేసీ భ్రమరాంబ, ఎస్ఈ శ్రీనివాస్‌తో సమావేశం నిర్వహించారు. 700 అడుగుల ఎత్తులో కొండపై ఉన్న స్వామి ఆలయాన్ని పూర్తిగా రాళ్లతోనే పునఃనిర్మించాలని నిర్ణయించారు. ఒకటి రెండు నెలల ముందు వరకు కనీసం విద్యుత్ సౌకర్యం లేని ఈ ఆలయ పరిసరాల్లో పునఃనిర్మాణ ప్రక్రియలో భాగంగా విద్యుత్ దీపాలంకరణ చేయాలని, కొండపైన శాశ్వత నీటివసతిని కల్పించాలని, ఆలయ ప్రాకారం నిర్మించాలని నిర్ణయించారు. కొత్తగా హోమశాల, నివేదనశాల నిర్మించటంతోపాటు ధ్వజస్తంభం ప్రతిష్టించాలని నిర్ణయించారు. కొండపైన ఆలయం వద్ద సహజ సిద్ధంగా ఉన్న కోనేటిని పూర్తిస్థాయిలో ఆధునికీకరించి దాని చుట్టూ గ్రిల్స్ ఏర్పాటు చేయాలని, ఆలయం వద్దకు వెళ్లేందుకు ఇప్పుడున్న ఇరుకు మెట్ల మార్గాన్ని బాగా వెడల్పు చేయాలని నిర్ణయించారు. ఫిబ్రవరి 13న అంతర్వేది ఆలయ రథప్రతిష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అంతర్వేది ఆలయ కొత్త రథం నిర్మాణం వేగంగా పూర్తయింది. ఫిబ్రవరి 13న కొత్తగా నిర్మించిన రథానికి అభిషేకం, పుర్ణాహుతి, రథప్రతిష్ట కార్యక్రమాలను దేవదాయశాఖ అధికారులు నిర్వహించనున్నారు. మూడురోజుల పాటు నూతన రథానికి వైఖానస ఆగమ సంప్రదాయం ప్రకారం సంప్రోక్షణ చేస్తారు. 11న సంకల్పం, 12న అధివాస కార్యక్రమం నిర్వహిస్తారు. ఫిబ్రవరి 22వ తేదీన అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి కళ్యాణం జరుగుతుంది. 23న స్వామి ఊరేగింపును కొత్త రథంపై నిర్వహిస్తారు. -
రామతీర్థం ఘటనపై సీఐడీ విచారణ
సాక్షి, అమరావతి: రామతీర్థం ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఐడీ విచారణకు ఆదేశించారని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు వెల్లడించారు. ఇటీవల ఆలయాల్లో చోటుచేసుకున్న ఘటనలపై పోలీస్, దేవదాయ శాఖల అధికారులతో సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. శాంతి భద్రతల అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్, దేవదాయ శాఖ కార్యదర్శి గిరిజా శంకర్, ప్రత్యేక కమిషనర్ అర్జునరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో వెలంపల్లి మాట్లాడుతూ.. రామతీర్థం ఘటనలో కొందరు అనుమానితులను పోలీసులు గుర్తించారని, ఒకట్రెండు రోజుల్లో దోషులను పట్టుకునేలా విచారణ కొనసాగుతోందన్నారు. పూర్తి హంగులతో ఆలయం ఆధునికీకరణ ఎటువంటి వసతులు లేని రామతీర్థం ఆలయాన్ని పూర్తిగా ఆధునికీకరించాలని సీఎం జగన్ ఆదేశించినట్టు మంత్రి చెప్పారు. ఇప్పటికే ఆలయ డిజైన్లు ప్రాథమికంగా తయారు చేయించామన్నారు. ఒకట్రెండు రోజుల్లో విగ్రహ పునఃప్రతిష్ఠ తేదీలను ఖరారు చేస్తామన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు విజయవాడలో కూల్చివేసిన ఆలయాలను సైతం తిరిగి నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని చెప్పారు. ర్యాలీ విరమించుకోవాలని విజ్ఞప్తి రామతీర్థం అంశం సున్నితంగా మారిన నేపథ్యంలో బీజేపీ, ఇతర పార్టీలు మంగళవారం తలపెట్టిన ర్యాలీని విరమించుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఘటనలపై ఎవరైనా అభిప్రాయం చెప్పవచ్చని, సలహాలు, సూచనలు ఇవ్వొచ్చని, ఎలాంటి చర్యలకైనా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. అది టీడీపీ కార్మిక సంఘం కట్టుకున్న గుడి విజయవాడ బస్టాండ్‌లో ఘటన జరిగిన ఆలయం టీడీపీ అనుబంధ కార్మిక సంఘం సభ్యులు కట్టుకున్నదని.. అందులో మట్టి విగ్రహాలను తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్నారని మంత్రి వివరించారు. ఆ ఆలయానికి, దేవదాయ శాఖకు, ప్రభుత్వానికి సంబంధం లేదని.. గుడి భద్రతను పట్టించుకోవాల్సిన టీడీపీ దానిని ఎందుకు పట్టించుకోలేదో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. రాజమండ్రిలో సుబ్రహ్మణ్యస్వామి విగ్రహ ధ్వంసంపైనా సీఐడీ విచారణకు ఆదేశించామని.. ఆ ఆలయం కూడా టీడీపీ నేత గన్ని కృష్ణ నిర్వహణలో ఉందని అన్నారు. నిందితులకు శిక్షలు పడ్డాయ్ వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక దేవదాయ శాఖకు సంబంధించి 8 ఆలయాల్లో దుశ్చర్యలు చోటు చేసుకున్నాయని.. వాటిలో కొందరు నిందితులను పోలీసులు పట్టుకున్నారని చెప్పారు. ప్రైవేట్ వ్యక్తుల ఆదీనంలో ఉండే వాటితో కలిపి మొత్తం 31 ఆలయాలపై దాడులు జరిగాయని, గుప్త నిధుల కోసం తవ్వకాలు, హుండీ చోరీలు వంటి వాటితో కలిపి పోలీసులు 88 కేసులు నమోదు చేశారని వివరించారు. ఆ కేసుల్లో 159 మందిని అరెస్ట్ చేశారని, వారిలో కొందరికి రెండేళ్ల శిక్ష పడిందని, మరికొందరు రిమాండ్‌లో ఉన్నారని వివరించారు. ప్రైవేట్ ఆలయాల్లో భద్రతపైనా దృష్టి గడచిన రెండేళ్లలో రాష్ట్రంలోని 31 ఆలయాల్లో వివిధ ఘటనలు చోటు చేసుకున్నట్టు దేవదాయ శాఖ గుర్తించింది. వీటిలో 23 ఆలయాలు ప్రైవేట్ వ్యక్తుల ఆదీనంలో ఉన్నట్టు తేల్చారు. దేవదాయ శాఖ పరిధిలోని 8 ఆలయాల్లో వివిధ ఘటనలు చోటు చేసుకున్నట్టు అధికారులు తేల్చారు. ఈ నేపథ్యంలో మారుమూల ఉండే ప్రైవేట్ ఆలయాల భద్రతపై దేవదాయ శాఖ, పోలీసులు శాఖ దృష్టి పెట్టాయి. ప్రైవేట్ ఆలయాల భద్రత విషయంలో ఆలయ నిర్వహక కమిటీలు సమన్వయంతో వ్యవహరించాలని పోలీసులు నిర్ణయించారు. పోలీసు స్టేషన్ల వారీగా ప్రైవేట్ ఆలయాల నిర్వహకులను పిలిపించి మాట్లాడే ప్రక్రియను పోలీసులు మొదలు పెట్టారు. -
రాముడి విగ్రహ ధ్వంసం 'దేశం' మూకల పనే?
సాక్షి, అమరావతి/విజయనగరం టౌన్: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం, కోదండరామస్వామి అలయంలో శ్రీరాముని విగ్రహం ధ్వంసం ఘటన వెనక తెలుగుదేశం పార్టీ కుట్ర స్పష్టంగా బయటపడింది. మహిళలకు ఇళ్ల పట్టాలిస్తూ ముఖ్యమంత్రి జగన్ అనితర సాధ్యమైన రీతిలో ముందుకెళుతుండటంతో విజయనగరంలోని ఆయన బహిరంగ సభను అడ్డుకోవాలన్న కుట్రతోనే మొదట దీనికి తెగబడినట్లు తెలియవస్తోంది. రకరకాల కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు... 20 మందికిపైగా వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అందులో టీడీపీ కుట్ర కోణం స్పష్టంగా బయటపడినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని ముందే తెలుసుకున్న చంద్రబాబు... తమ పాత్ర బయటపడుతుందన్న భయంతో రెండు రోజులుగా అక్కడ జనాన్ని పోగేస్తూ వచ్చారు. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల నుంచి భారీగా జనాన్ని సమీకరించి ఆలయం దగ్గర రచ్చ చేయాలని, తద్వారా తమ పాత్ర బయటపడకుండా చేసి రాజకీయ లబ్ధి పొందాలని భావించారు. ఇందులో భాగంగానే... అప్పటికే అక్కడికి చేరుకున్న 2,500 మందికి పైగా జనంతో శనివారం ‘షో’ చేయబోయారు. కానీ ఈ విషయం తెలుసుకుని అప్పటికే అక్కడకు వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు, పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి వీరిని అడ్డుకోవటంతో బాబు ఆటలు సాగలేదు. అనంతరం పోలీసులు కూడా దర్యాప్తును ముమ్మరం చేసి.. ఇదంతా టీడీపీ నేతలు ఒక పన్నాగం ప్రకారం చేసిందేనని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అసలు ఏం జరిగిందంటే... రామతీర్థం ప్రధానాలయానికి సుమారు 500 మీటర్ల దూరంలో నీలాచలం కొండ మీద శ్రీ కోదండరామస్వామి ఆలయంలోని సీతారామలక్ష్మణుల విగ్రహాల్లో ఈ నెల 28 అర్ధరాత్రి కొందరు దుండగులు శ్రీరాముని విగ్రహాన్ని ద్వంసం చేశారు. సాధారణంగా రోజూ అక్కడకు పూజారి ఉదయం 8 గంటలకు వెళ్లి మధ్యాహ్నం 12కు వెనక్కి వచ్చేస్తారు. అప్పటి నుంచి ఎవ్వరూ ఉండరు. దీన్ని అదనుగా తీసుకున్న దుండగులు ఖండించిన శిరస్సును సీతమ్మ కొలనులో పడేశారు. ఈ దుశ్చర్యను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు, విజయనగరం ఎస్పీ రాజకుమారి పర్యవేక్షణలో 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. వారు దర్యాప్తు చేస్తుండగా... స్థానిక టీడీపీ నేతలు కొందరు హడావుడి చేసి, కోనేరులో వెదికినట్లుగా వెదికి, అందులోంచి తల భాగాన్ని బయటకు తీయటం వారి అనుమానాల్ని మరింత పెంచింది. అనంతరం ఈ శిరస్సు భాగాన్ని వెనుక నుంచి కోసినట్లు పోలీసులు గుర్తించారు. ఆధారాల కోసం మళ్ళీ నీలాచలం కొండపైన పరిశీలించారు. మాగ్నెట్లతో కోనేరులో సెర్చ్ చెయ్యగా యాక్సా బ్లేడు దొరికింది. వారు పగులగొట్టిన తాళం కూడా ఆలయం బయట పోలీసులకు దొరికింది. నిజానికి డిసెంబరు 25న కొండపైకి కరెంటొచ్చింది. 29న సిసి కెమెరాలు ఏర్పాటు చేయటానికి అంతా సిద్ధం చేశారు. ఈ విషయం తెలిసి తెల్లారక ముందే విగ్రహాన్ని ద్వంసం చేశారంటే అదంతా పక్కా సమాచారంతోనే జరిగి ఉంటుందనేది పోలీసుల భావన. పైగా 30న గుంకలాంలో 12,301 మందికి ఇళ్లపట్టాలివ్వటానికి సీఎం వైఎస్ జగన్ వస్తున్న నేపథ్యంలో ఇది జరగటాన్ని బట్టి... ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలనే ఉద్దేశంతో పక్కా పథకం ప్రకారమే చేశారన్నది వారి దర్యాప్తులో ప్రాథమికంగా తేలినట్లు సమాచారం. అనుమానితుల కోసం టీడీపీ యాగీ... విచారణ నిమిత్తం పోలీసులు అదుపులోకి తీసుకున్న అనుమానితుల్లో రామతీర్థం గ్రామానికి చెందిన టీడీపీ మాజీ ఉపసర్పంచ్, మాజీ వార్డు మెంబర్, మరికొందరు తెలుగుదేశం పార్టీకి చెందిన వారున్నారు. మొత్తం 21 మందికి పైగా పోలీసుల అదుపులో ఉన్నారు. ఇది తెలుసుకున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హుటాహుటిన రామతీర్థం పర్యటనకు రావటం... రాక ముందే 3 రోజులుగా జనాన్ని పోగేయటం ఇక్కడ గమనార్హం. దీన్నిబట్టి తమ వారి పాత్ర ఏమాత్రం లేదని జనాన్ని నమ్మించడానికే ఈ అక్కర్లేని రాద్దాంతానికి ప్రయత్నించారన్నది తెలియకమానదు. కాగా పోలీసుల అదుపులో ఉన్న టీడీపీ నేతలను ఎట్టిపరిస్థితుల్లోనూ బయటపడేయాలని, అందుకోసం ఎలాంటి ఉద్యమానికైనా వెనుకాడవద్దని ఈ సందర్భంగా తమ పార్టీ వారికి చంద్రబాబు సూచించటం గమనార్హం. దీంతోపాటు పోలీసులు విచారణ కోసం పిలిచి 24 గంటలు కూడా గడవకముందే అనుమానితుడైన టీడీపీ నేత భార్య న్యాయస్థానాన్ని ఆశ్రయించి హెబియస్ కార్పస్ పిటిషన్ వేసినట్లు సమాచారం. ఇదంతా టీడీపీ పెద్దలు దగ్గరుండి చేయించడం విశేషం. జరిగింది ముమ్మాటికీ కుట్రేనని, దానివెనుక టీడీపీ వారున్నారని... అయితే పూర్తి సాక్ష్యాధారాలు సేకరించాకగానీ ఈ విషయాన్ని నిర్థారించలేమని పోలీసులు చెబుతున్నారు. ఉద్దేశపూర్వకంగా అలజడుల సృష్టికే.. రాష్ట్రంలో వరుసగా ఆలయాలలో ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో దేవదాయ శాఖ ఆ«దీనంలోని అన్ని ఆలయాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రభుత్వం గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. దాదాపు అన్ని ఆలయాల్లో ఈ ఏర్పాటు ప్రక్రియ పూర్తికావొచి్చంది. 20 వేలకు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటయ్యాయి కూడా. ఈ నేపథ్యంలో... శ్రీరాముని విగ్రహం ధ్వంసం జరిగిన రామతీర్థం ఆలయానికి విద్యుత్ సౌకర్యం లేకపోతే.. అక్కడ కూడా సీసీ కెమెరాలు పెట్టడానికి కొండపైకి ప్రభుత్వం కొత్త విద్యుత్ లైన్లు వేసింది. ఒక్క రోజులో కెమెరాలు ఏర్పాటు చేస్తారనగా ఈ దుర్ఘటన జరగటం గమనార్హం. ఈ ఆలయ ట్రస్టు బోర్డు ఛైర్మన్‌గా ఇప్పటిదాకా టీడీపీ నేత, మాజీ మంత్రి అశోక గజపతిరాజు కొనసాగుతుండగా... ఇటీవల తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం శ్రీరాంనగర్‌లోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ధ్వంసం జరిగిన వరసిద్ధి విఘ్నేశ్వరస్వామి ఆలయం కూడా దేవాదాయ శాఖ ఆదీనంలో లేని ఒక ప్రైవేట్ ఆలయం. ఇది టీడీపీ సీనియర్ నేత గన్ని కృష్ణ అజమాయిషీలో ఉండటం గమనార్హం. చైర్మన్ పదవి నుంచి అశోక గజపతి తొలగింపు రామతీర్థం ఆలయంలో శ్రీరాముని విగ్రహ ధ్వంసం ఘటనకు వ్యవస్థాపక ధర్మకర్త హోదాలో రామతీర్థం ఆలయ చైర్మనుగా కొనసాగుతున్న కేంద్ర మాజీమంత్రి అశోక గజపతి రాజు నిర్లక్ష్యం కూడా కారణమని దేవదాయ శాఖ పేర్కొంది. సంఘటన జరిగి రోజులు గడుస్తున్నా, కనీసం ఆ ఆలయాన్ని ఆయన సందర్శించలేదు. సరికదా.. దానిపై సరైన రీతిలో స్పందించలేదు. దీంతో ఆయన్ను ఆ పదవి నుంచి తొలగిస్తూ దేవదాయ శాఖ కార్యదర్శి గిరిజా శంకర్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. దీనికితోడు విజయనగరంలోని శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం, తూర్పు గోదావరి జిల్లా మందపల్లిలోని మందేశ్వరస్వామి ఆలయం చైర్మన్ పదవుల నుంచి కూడా అశోక గజపతిరాజును తొలగించారు. -
ఆలయాలపై కుట్రలను ఛేదిద్దాం
సాక్షి, అమరావతి: దేవాలయాలను అడ్డం పెట్టుకుని కొందరు రాజకీయ పార్టీల ముసుగులో రాష్ట్ర ప్రభుత్వానికి మచ్చ తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఆలయాలపై జరుగుతున్న ఈ కుట్రలను ఛేదిద్దామని ఆయన అధికారులకు పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దేవదాయ శాఖ అధికారులతో శుక్రవారం ఆయన ఆ శాఖ కమిషనర్ పి. అర్జునరావుతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి ఏమన్నారంటే.. ► కొందరు పనిగట్టుకుని దేవాలయాలపై కుట్రలు చేస్తున్నారు. జిల్లాలో పనిచేసే అసిస్టెంట్ కమిషనర్లతో పాటు రీజనల్ కమిషనర్లు, డిప్యూటి కమిషనర్, తమ పరిధిలోని గ్రామల్లో తరచూ పర్యటించి.. అక్కడ గ్రామ కమిటీలతో పాటు స్థానికులతో సమావేశమై వారి సూచనలను తెలుసుకుంటూ ఉండాలి. ► దేవాలయాలు, రథాల భద్రత కోసం ఏర్పాటుచేసే సీసీ కెమెరాల నాణ్యత విషయంలో రాజీపడొద్దు. అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవు. -
ఆలయాలకు భక్తులు రావొద్దు..
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేవాదాయ శాఖ పలు కీలక నిర్ణయాలు తీసుకుందని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. కరోనా వైరస్ చైనా నుంచి 180 దేశాలకు వ్యాపించిందని చెప్పారు. తెలంగాణలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో కరోనా నియంత్రణకు ముఖ్యమంత్రి కేసీఆర్ పటిష్ట చర్యలకు ఆదేశించారని తెలిపారు. ఇతర దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులను క్వారంటైన్ కు తరలిస్తున్నామని పేర్కొన్నారు. దేవాలయాల్లో రద్దీ తక్కువ ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించామని చెప్పారు. నిన్నటి నుంచి అన్ని ఆలయాల్లో భక్తులకు అనుమతులు నిలిపివేశామన్నారు. (కరోనా అలర్ట్: 271కి చేరిన బాధితుల సంఖ్య) దేవాదాయ శాఖ కార్యాలయంలో పంచాంగ శ్రవణం ప్రతి ఏటా ఉగాది పంచాంగ శ్రవణం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రగతి భవన్లో జరిగేందని.. కానీ ఈ ఏడాది దేవాదాయ శాఖ కార్యాలయంలో జరుగుతుందన్నారు. లైవ్ ద్వారా మాత్రమే భక్తులు పంచాంగ శ్రవణం వినాలని సూచించారు. కరోనా కట్టడికి చర్యల్లో భాగంగా శ్రీరామనవమి ఉత్సవాలు కూడా ఆడంబరాలు లేకుండా జరిపేవిధంగా ఆదేశాలిచ్చామని తెలిపారు. తక్కువ మంది మాత్రమే శ్రీరామనవమి ఉత్సవాలకు హాజరవుతారని పేర్కొన్నారు. (‘దగ్గు, గొంతు నొప్పి.. ఆ తర్వాత కరోనా’) -
అధికారం అండగా.. వేశారు పాగా
సాక్షి, అమరావతి : అధికారం అండగా టీడీపీ నేతలు పాల్పడిన అక్రమాలు ఒక్కటొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. విజయవాడ నడిబొడ్డున వేద పాఠశాల ఏర్పాటు చేయాలన్న ఓ ట్రస్టు ఆశయాన్ని టీడీపీ అధికార ప్రతినిధి, మాజీ మేయర్ పంచుమర్తి అనురాధ కుటుంబానికి చెందిన ప్రసాదరావు తుంగలో తొక్కి, భూమిని కబ్జా చేసిన విషయం ఇటీవల బట్టబయలైంది. ఆక్రమించుకున్న భూమిలో ఏకంగా షెడ్డు వేసి, ఓ ఫ్యాక్టరీ నెలకొల్పడం విస్తుగొలుపుతోంది. శ్రీకాంచనపల్లి కనకాంబ ట్రస్టుకు విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్న లబ్బీపేటలో దాదాపు రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్ల విలువ చేసే భూములున్నాయి. 2000లో చంద్రబాబు సీఎంగా ఉన్నారు. ఆ సమయంలో అప్పటి దాకా దేవదాయ శాఖ పరిధిలో ఉన్న శ్రీకాంచనపల్లి కనకాంబ ట్రస్టు నిర్వహణను కొన్ని మినహాయింపులతో ప్రైవేట్ సంస్థలకు అప్పగించారు. అప్పట్లో విజయవాడ నగర మేయర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పంచుమర్తి అనురాధ కుటుంబ సభ్యులు ఈ ట్రస్టు భూములను అక్రమ మార్గంలో చేజిక్కించుకున్నారు. ట్రస్టు పేరిట ఉండే భూమిని ట్రస్టుకు ఏ సంబంధం లేని వ్యక్తుల నుంచి కొనుగోలు చేసినట్టు రికార్డులు సృష్టించి, ఆ భూమిలో పరిశ్రమను ఏర్పాటు చేసుకున్నారు. అవి కనకాంబ ట్రస్టు భూములే.. ట్రస్టు నిర్వహణ వ్యవహారాలు 2016లో తిరిగి దేవదాయ శాఖ అధీనంలోకి వచ్చాయి. ట్రస్టు భూముల్లో టీడీపీ నేతలు పరిశ్రమను ఏర్పాటు చేసిన విషయం గోప్యంగా ఉండింది. గత ఏడాది జూలైలో ఈ కబ్జా వ్యవహారం వెలుగులోకి రావడంతో దేవదాయ శాఖ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. ఆ భూములు శ్రీకాంచనపల్లి కనకాంబ ట్రస్టువేనని స్పష్టంగా దేవదాయ శాఖ వద్ద రికార్డులు ఉండడంతో వాటిని స్వాధీనం చేసుకోవాలని ట్రిబ్యునల్.. విజయవాడ అసిస్టెంట్ కమిషనర్, ట్రస్టు ఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. గత ఏడాది డిసెంబర్లో తీర్పు వెలువరించినప్పటికీ, తీర్పు కాపీ జనవరి 30న దేవదాయ శాఖకు చేరింది. దీంతో ఇప్పుడు ఆ భూములను స్వాధీనం చేసుకునేందుకు దేవదాయ శాఖ అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. టీడీపీ నేతల దోపిడీతో ట్రస్టు ఆశయాలు గాలికి వేద పాఠశాల ఏర్పాటుతో పాటు.. తెలుగు, సంస్కృత భాష చదువుకునే విద్యార్థులకు భోజన వసతి కల్పించడం, ఇతరత్రా సదాశయాలతో విజయవాడకు చెందిన కాంచనపల్లి కనకాంబ 1958లో ఈ ట్రస్టును ఏర్పాటు చేశారు. ట్రస్టు పేరుతో విజయవాడ, పరిసర ప్రాంతాల్లో కూడా పలు ఆస్తులున్నట్టు దేవదాయ శాఖ రికార్డుల్లో ఉంది. అయితే అవి ఎక్కడెక్కడ ఉన్నాయన్నది స్పష్టంగా లేకపోవడం, మరికొన్ని రికార్డుల్లో స్పష్టంగా ఉన్నా అవి టీడీపీ నేతలతో పాటు మరికొందరి చేతుల్లోకి వెళ్లడంతో ట్రస్టు స్థాపించిన ఆశయాలు ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం ఆక్రమణలో ఉన్న భూమిని స్వాధీనం చేసుకుని, అక్కడ వేద పాఠశాల ఏర్పాటుకు దేవదాయ శాఖ కసరత్తు ప్రారంభించింది. భూముల స్వాధీనానికి చర్యలు : ఈవో ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు ట్రస్టు భూములు స్వాధీనం చేసుకోవాలని దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ నుంచి మాకు ఆదేశాలు అందాయి. రెవిన్యూ, పోలీసు అధికారుల సహాయంతో త్వరలోనే ఆ భూములను స్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – యడవల్లి సీతారామయ్య, ట్రస్టు ఈవో. -
దేవాదాయలో కలకలం..!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఉమ్మడి జిల్లా దేవాదాయ శాఖలో కలకలం రేగింది. ఆ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ.. అదే శాఖలో గద్వాల ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న వెంకటేశ్వరమ్మల మధ్య కొన్ని నెలల క్రితం మొదలైన వివాదం తారాస్థాయికి చేరుకుంది. కొన్నాళ్లుగా అసిస్టెంట్ కమిషనర్ (ఏసీ) తన గురించి అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారంటూ వెంకటేశ్వరమ్మ మండిపడుతున్నారు. ఏసీ వ్యవహారశైలిపై ఇది వరకే డిప్యూటీ కమిషనర్ రామకృష్ణాకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదంటోన్న ఆమె త్వరలోనే మహిళా సంఘాలను ఆశ్రయించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడిన వెంకటేశ్వరమ్మ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణపై సంచలన ఆరోపణలు చేశారు. అయితే... ఇప్పటికే ఆ శాఖలో చర్చనీయాంశంగా మారిన ఇరువురు అధికారుల వ్యవహారం ఎటు దారి తీస్తుందో అనే చర్చ హాట్‌టాపిక్‌గా మారింది. మౌనమేలనోయి..? అసిస్టెంట్ కమిషనర్, గద్వాల డివిజన్ ఇన్స్పెక్టర్ల మధ్య వివాదం రోజురోజుకు తీవ్రరూపం దాలుస్తోంది. అసిస్టెంట్ కమిషనర్ తన గురించి అసభ్యకరంగా మాట్లాడుతున్నారంటోన్న వెంకటేశ్వరమ్మ ఆరోపణల్లో ఏ మేరకు వాస్తవం ఉందో తెలియదు. ఇటు అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ కూడా వెంకటేశ్వరమ్మ గురించి తాను ఏనాడూ అసభ్యకరంగా మాట్లాడలేదని స్పష్టం చేశారు. అయితే వీరిద్దరి కోల్డ్‌వార్ గురించి పైస్థాయి అధికారులకు తెలిసినా వారు మౌనపాత్ర పోషిస్తున్నారంటూ ఆ శాఖ ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించకపోతే దేవాదాయ శాఖ అభాసుపాలవుతుందనే ఆవేదన ఆ శాఖ ఉద్యోగుల్లో వ్యక్తమవుతుంది. మరో దారి లేదు.. సహచర ఉద్యోగిగా ఉన్న తనను అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ చిన్నచూపు చూస్తున్నారని వెంకటేశ్వరమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఏసీ తనపై ఎలా కక్ష సాధిస్తున్నారని ‘సాక్షి’కి వివరించారు. ‘జూన్, 2018 వరకు మహబూబ్‌నగర్ జిల్లాలో పని చేసిన తనకు నాగర్‌కర్నూల్ డివిజన్ ఇన్స్పెక్టర్గా బదిలీ అవకాశం వచ్చింది. కానీ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ అక్కడ విల్లింగ్ చూపొద్దని.. గద్వాలలో పని చేస్తానని నాతో పైస్థాయి అధికారులకు చెప్పించారు. ఈ క్రమంలో గద్వాల డివిజన్ ఇన్స్పెక్టర్గా బదిలీ అయ్యాను. తర్వాత సహచర ఉద్యోగుల ముందు నన్ను అసభ్యపదజాలంతో దూషించడం మొదలుపెట్టారు. అందరి సమక్షంలో నాకు పని రాదంటూ నాలో మానసిక ఆవేదన కలిగించారు. ఈ విషయంలో నేను డిప్యూటీ కమిషనర్ రామకృష్ణ దృష్టికి తీసుకెళ్లా. అయినా అసిస్టెంట్ కమిషనర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇంతటితో ఏసీ వేధింపులు ఆగలేదు. ఇప్పటికీ ఆయన అలానే వ్యవహరిస్తున్నారు.అందుకే త్వరలోనే మహిళా సంఘాలను ఆశ్రయించాలని నిర్ణయం తీసుకున్న’ అని గద్వాల ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరమ్మ వివరించారు. పని చేయమంటేనే ఇదంతా: అసిస్టెంట్ కమిషనర్ బి.కృష్ణ ఉమ్మడి జిల్లా దేవాదాయశాఖకు నేను అధికారిని. ఆమెతో పాటే చాలా మంది నా వద్ద పని చేస్తున్నారు. నాకెవరూ ఎక్కువ కాదు.. ఎవరూ తక్కువ కాదు. పని దగ్గర మాత్రం నేను సీరియస్‌గా ఉంటాను. వెంకటేశ్వరమ్మ విషయానికి వస్తే.. ఆమె నాపై అలాంటి ఆరోపణలు ఎందుకు చేస్తున్నారో నాకు తెలియదు. పైస్థాయి అధికారులు అడిగిన సమాచారం నిర్ణీత సమయంలోగా ఇవ్వమనే కొంచెం గట్టిగా చెబుతాను. అంతే గానీ ఎన్నడూ ఆమెతో అసభ్య పదజాలంతో మాట్లాడలేదు. ఆ ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదు. -
అర్చకుల చిరకాల స్వప్నం నెరవేర్చిన సీఎం
-
దేవాదాయ శాఖ ఉద్యోగులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: దేవదాయ శాఖ పరిధిలో పనిచేసే ఉద్యోగులంతా హిందూమతాన్ని విశ్వసిస్తున్నట్టు అఫిడవిట్ ఇవ్వాలని ఆ శాఖ శనివారం సర్క్యులర్ జారీ చేసింది. దేవదాయ శాఖ పరిధిలో పనిచేసే ఉద్యోగుల్లో అన్యమతస్తులు ఉన్నారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈమేరకు చర్యలు చేపట్టింది. దేవాలయాల్లో పనిచేసే ఉద్యోగులు హిందూమతాన్ని విశ్వసిస్తున్నట్టు అఫిడవిట్ తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో దేవదాయ శాఖ కమిషనర్ పద్మ సర్క్యులర్ జారీ చేశారు. దేవాలయాలు, దేవదాయ శాఖ కార్యాలయాలు, సంస్థ ఉద్యోగుల నుంచి అఫిడవిట్ తీసుకోవాలని నిర్ణయించారు. నిర్ణీత పత్రంలో అఫిడవిట్ 15 రోజుల్లోగా కమిషనర్ కార్యాలయంలో అందచేయాలని సూచించారు. దేవదాయ చట్టం ప్రకారం హిందూ మతస్తులనే ఉద్యోగులుగా, ఆలయాల్లో తీసుకోవాలనే స్పష్టమైన నిబంధన ఉంది. తప్పుడు అఫిడవిట్ సమర్పిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఉత్తర్వులో పేర్కొన్నారు. రెగ్యులర్, కాంట్రాక్టు, కన్సాలిడేటెడ్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నుంచి తీసుకోవాల్సిన అఫిడవిట్ ఫ్రొఫార్మను దేవదాయ శాఖ రీజినల్ జాయింట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయాలతోపాటు అన్ని దేవదాయ శాఖ సంస్థలు, ఆలయాలకు కమిషనర్ పంపించారు. -
టెన్త్ చదవకున్నా గెజిటెడ్ పోస్టు..!
దేవాదాయ శాఖలో వివాదాస్పద అధికారిగా పేరున్న ఓ వ్యక్తి అసిస్టెంట్ కమిషనర్ హోదాలో పలు కీలక ఆలయాల్లో పనిచేశారు. ఆయన విద్యార్హత ఆరో తరగతి. ఓసారి వయసు నిర్ధారణ కోసం పదో తరగతి మెమో కోరితే, నకిలీ పత్రం సృష్టించి సమరి్పంచారన్న ఫిర్యాదులొచ్చాయి. దీంతో ప్రస్తుతం దానిపై విచారణ సాగుతోంది. అంటే ఆరో తరగతి విద్యార్హతతో ఆయన ఏకంగా గెజిటెడ్ హోదా ర్యాంక్ ఉద్యోగం పొందేశారు. దేవాలయాల్లో చిరుద్యోగంలో చేరి ఆ తర్వాత సహాయ కమిషనర్ స్థాయికి వెళ్లినవారి సంఖ్య దాదాపు 60 వరకు ఉంటుందని సమాచారం. ఇందులో ఐదారుగురు డిప్యూటీ కమిషనర్లుగా కూడా పనిచేశారు. సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పాస్ కాకున్నా గెజిటెడ్ హోదా అధికారి కావొచ్చు. నకిలీ ధ్రువపత్రాలతోనా అని అనుకుంటున్నారా?. అదేంకాదు.. అసలు ధ్రువపత్రాలేమీ లేకుండానే ఇది సాధ్యం. అదెలా అంటే.. రాష్ట్ర దేవాదాయ శాఖలో ఉద్యోగం పొందితే చాలు. అడ్డగోలు వ్యవహారాలకు చిరునామాగా మారిన ఈ శాఖలో విద్యార్హతతో ప్రమేయం లేకుండా గెజిటెడ్ హోదా అధికారి కుర్చీ ఎక్కేయొచ్చు. బూజుపట్టిన విధానాలు మార్చేస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కొన్ని విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నా, దేవాదాయ శాఖలో మాత్రం ఈ అడ్డగోలు వ్యవహారం అలాగే కొనసాగుతోంది. ఇదీ జరుగుతోంది... దేవాలయ పాలకమండలి సభ్యులు, కొందరు అధికారుల ‘చలవ’తో విద్యార్హతల ఊసే లేకుండా జూనియర్ అసిస్టెంట్ హోదాలో ఉద్యోగంలో చేర వచ్చు. తర్వాత నేరుగా దేవాలయ కార్యనిర్వహణాధికారిగా పదోన్నతి పొందే వీలుంది. గ్రేడ్–3 ఈవోల పదోన్నతుల్లో 40%, గ్రేడ్– 2, –1 ఈవోల పదోన్నతుల్లో 20% చొప్పున వీరికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. సీనియారిటీ ఆధారం గా కార్యనిర్వహణాధికారులు సహాయ కమిషనర్లుగా పదోన్నతి పొందే వీలుంది. విద్యార్హతతో సం బంధం లేకుండా గ్రేడ్–1 ఈవో అయిన వ్యక్తి సహా య కమిషనర్ అవుతాడు. పదవీ విరమణ సమ యం ఇంకా ఉంటే డిప్యూటీ కమిషనర్ కూడా అవు తారు. అలా అయిన వారు కూడా ఉన్నారు. దేవాదాయ శాఖకు మినహాయింపు.... కార్యనిర్వహణాధికారులు, సహాయ కమిషనర్లని నేరుగా టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేసే వెసులుబాటు ఉంది. కానీ, దేవాలయ ఉద్యోగులకు ఆ కీలక పోస్టుల్లో కూడా పదోన్నతులు కల్పించేందుకు ప్రభుత్వం కొన్ని పోస్టులను కేటాయించింది. అంటే కొన్ని నేరుగా, మరికొన్ని పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తారన్నమాట. దీంతోనే అసలు సమస్య వస్తోంది. ఈ శాఖలో చిరుద్యోగంలో చేరేటప్పుడు టీఎస్పీఎస్సీ నిబంధనలేవీ వర్తించవు. విద్యార్హతతో సంబంధం లేకుండా చేరిపోతున్నారు. తర్వాత గెజిటెడ్ పోస్టుల్లోకి పదోన్నతి పొందుతున్నారు. ఇలా కాకుండా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఆ పై గెజిటెడ్ హోదా పోస్టులను టీఎస్పీఎస్సీ ద్వారానే నియమించాలనే సూచన చాలాకాలంగా పెండింగులో ఉంది. వసూళ్లు లక్షల్లోనే.. దేవాదాయశాఖలోని కొందరు ఉన్నతాధికారులు యథేచ్ఛగా వసూళ్ల పర్వం కానిస్తున్నారు. పదోన్నతులు, నియామకాల్లో రూ.లక్షలు వసూలు చేయటం వారికి అలవాటుగా మారింది. తాజాగా ఓ అధికారి ఒక్కో పోస్టుకు రూ.3 లక్షల వరకు వసూళ్లకు పాల్పడినట్టు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. పై అధికారులకు వాటా ఇవ్వాలని చెప్పి మరీ వసూళ్లు చేశారని ఫిర్యాదులొచ్చాయి. ఇలాంటివారంతా నిబంధనలు మార్చకుండా అడ్డుపడుతున్నారు. -
రూ. 25 కోట్ల అధర్మ ఆదాయం!
సాక్షి, మంత్రాలయం(కర్నూలు) : ఆలయ ఆదాయాలను దిగమింగాడో.. బినామీ కాంట్రాక్టర్ అవతారమెత్తి కాసులను మెక్కాడో తెలియదు గానీ మొత్తానికి ఆదాయానికి మించి ఆస్తులు గడించాడు ఈ పి.రాంప్రసాద్. ధర్మ సంస్కృతికే మచ్చ తెచ్చాడు. జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరి గ్రేడు–1 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్థాయికి ఎదిగాడు. ఎదుగుతూనే అక్రమ ఆస్తులను అంతకు అంత పెంచుకున్నాడు. గురువారం ఏసీబీ దాడుల్లో ఆయన అక్రమాస్తుల గుట్టు రట్టయ్యింది. దాదాపు పాతిక కోట్లకు పైగా ఆదాయానికి మించి ఆస్తులు గడించినట్లు రికార్డులు తెలుపుతుండడం దేవదాయ శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఉరకుంద ఈరన్న స్వామి ఆలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా రాంప్రసాద్ 1990లో ఉద్యోగం సంపాదించారు. ఏడేళ్ల క్రితం గ్రేడ్–1 ఈవోగా పదోన్నతి పొందారు. కసాపురం, మహానంది, శ్రీశైలం, ఉరకుంద, ఆదోని గ్రూపు టెంపుల్ ఈవోగా పనిచేశారు. 2013 నుంచి 2014 నవంబర్ వరకు , అనంతరం 2018 జూన్ నుంచి 2019 ఫిబ్రవరి వరకు ఉరుకుంద ఆలయ ఈవోగా విధులు నిర్వర్తించారు. ఆ సమయంలోనూ హుండీ ఆదాయం పక్కదారి పట్టించారన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అంతకు మించి బినామీ పేర్లతో టెంకాయ దుకాణాలు దక్కించుకోవడం, సున్నాలు వేయడం తదితర పలను చేశారనే విమర్శలు వచ్చాయి. టీడీపీ నాయకుల పంచన ఉండి పదవులతో పాటు పైకం కూడబెట్టుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అక్రమాలు ఇలా బయటపడ్డాయి... ప్రస్తుతం గూడురు మండలం దేవాలయాల గ్రేడ్–1 గ్రూపు ఈఓగా పనిచేస్తున్న రాంప్రసాద్ అక్రమాలు..ఏసీబీ అధికారుల దాడులతో బయటికి వచ్చాయి. ఏసీబీ డీఎస్పీ నాగభూషణం నేతృత్వంలో సీఐలు ఖాదర్‌భాష, శ్రీధర్, చక్రవర్తి, ప్రవీణ్‌కుమార్ ఆద్వర్యంలో ఎస్ఐలు, సిబ్బంది నాలుగు బృందాలుగా విడిపోయి ఆదోని పట్టణంలోని రాంప్రసాద్ ఇంటితో పాటు ఆయన సమీప బంధువుల ఇళ్లపై గురువారం దాడులు చేశారు. రాంప్రసాద్ తన పేరు, కుటుంబ సభ్యుల పేర్లపై రూ.2కోట్లకు పైగా అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారుల సోదాలో తేలింది. తాజా మార్కెట్ విలువ మేరకు వీటి విలువ పదింతలకు పైగా ఉండొచ్చని అంచనా. దాడుల్లో ఆదాయానికి మించి భారీ స్థాయిలో అస్తులు కూడబెట్టుకున్నట్లు తేలడంతో ఏసీబీ అధికారులు తెల్లబోయారు. సోదాలో పట్టుబడిన బంగారు, నగదు ఇవీ ఆస్తులు.. ► రాంప్రసాద్ భార్య లక్ష్మీదేవి పేరుపై ఆదోని, ఎమ్మిగనూరులో 23 ఇళ్ల ప్లాట్లు ఉన్నాయి. ► కోసిగిలో 2.5 ఎకరాల పొలం ఉన్నట్లు గుర్తించారు. ► ఇద్దరు కూతుళ్లు ఉండగా ఓ కూతురు పేరిట రూ.15.5లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. ► రూ.28.44లక్షలు అప్పు ఇచ్చినట్లు ప్రాంసరీనోట్లను అధికారులు గుర్తించారు. ► కూతురు పేరిట ఉన్న 2 స్కూటర్లను అధికారులు జప్తు చేశారు. ► ఇంట్లో దాచిన రూ.6లక్షల నగదు, 75 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ► ఆదోని పట్టణంలో మొత్తం మూడు ఇళ్లు ఉన్నట్లు గుర్తించారు. వాటికి సంబందించిన డాక్యుమెంట్లను కూడాస్వాధీనం చేసుకున్నారు. ► కర్నూలు శ్రీనివాసనగర్‌లో కూడా ఇటీవలే ఇల్లు కొనుగోలు చేసిటనట్లు సోదాలు దొరికిన డాక్యుమెంట్లను బట్టి తెలుస్తోంది. ► కర్నూలులో కూడా మరో మృందం సోదాలు నిర్వహిస్తోందని డీఎస్సీ నాగభూషణం తెలిపారు. ► ఆదోని పట్టణంలోని కర్ణాటక బ్యాంకులో లాకర్ ఉన్నట్లు తెలుసుకున్న అధికారులు మధ్యాహ్నం సోదాలు జరిపారు. ► లాకర్లో రూ.లక్ష నగదు, 55 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. ► రూ.40వేలు జీతం పొందుతున్న రాంప్రసాద్ రూ.కోట్ల విలువైన ఆస్తులు కూడ బెట్టడం వెనుక అవినీతి అక్రమాలు ఉన్నట్లు తేటతెల్లం అవుతోందని డీఎస్సీ నాగభూషణం తెలిపారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడ బెట్టుకున్న ఈఓ రాంప్రసాద్ ఇంటిపై జరిగిన ఏసీబీ దాడులు అక్రమార్కుల్లో వణుకు ప్రారంభం అయింది. ఇలాంటి అధికారులు ఇంకా చాలా మంది ఉన్నారని, వారి ఆస్తులను కూడ గుర్తించి చట్టపరమైన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. -
ఆలయాలకు మంచిరోజులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ధూప, దీప నైవేద్యాలకు నోచుకోని ఆలయాలకు రాష్ట్ర ప్రభుత్వం మునుపెన్నడూ లేనిరీతిలో మొట్టమొదటిసారిగా బడ్జెట్లో నిధులు కేటాయించింది. వీటి నిర్వహణకు తగినన్ని నిధుల్లేని హిందూ దేవాలయాలు రాష్ట్రంలో అనేకం ఉన్నాయి. ఇప్పుడు వీటిల్లో నిత్య పూజలు జరిపించేందుకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూలేని విధంగా రూ.234కోట్లను కేటాయిస్తున్నట్లు తన బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శుక్రవారం ప్రకటించారు. ఇన్నాళ్లు దేవదాయ శాఖ అంటే.. రాష్ట్రంలోని ఆదాయం ఉండే ఆలయాల నుంచి ప్రతియేటా 21.5 శాతం మొత్తాన్ని ప్రభుత్వం పన్ను రూపంలో వసూలుచేసి, ఆ డబ్బులతోనే దేవదాయ శాఖ ఖర్చులకు ప్రభుత్వం ఖర్చు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఆ శాఖ అవసరాలకు ప్రభుత్వ బడ్జెట్ నుంచి కేటాయింపులు అస్సలు జరిగేవి కావు. దీంతో రాష్ట్రంలోని దాదాపు 19వేల ఆలయాలకు ఏడాదికి రూ.50వేలు ఆదాయం కూడా రాని పరిస్థితి. ఫలితంగా వీటిల్లో నిత్యం ధూప, దీప, నైవేద్యాలు జరిగేవి కావు. కానీ, ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్న దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2008లో ధూప, దీప, నైవేద్యం (డీడీఎన్ఎస్) పథకాన్ని ప్రవేశపెట్టారు. దీని కింద ధూప, దీప, నైవేద్యాలకు రూ.వెయ్యి, పూజారికి గౌరవ వేతనంగా రూ.1,500 చెల్లించాలని నిర్ణయించారు. ఆ తర్వాత ఈ మొత్తాన్ని రూ.5వేలకు పెంచారు. అయితే, ఈ మొత్తాన్ని ఆదాయం ఉన్న వివిధ ఆలయాల ద్వారా దేవదాయ శాఖకు పన్నుల రూపంలో వచ్చే మొత్తం నుంచి ఖర్చుపెట్టేవారు. కానీ, ఆ మహానేత హఠాన్మరణంతో ఈ పథకం కొడిగడుతూ వచ్చింది. రాష్ట్ర విభజన సమయానికి రాష్ట్రంలో 1906 ఆలయాలకు డీడీఎన్ఎస్ పథకం అమలవుతుండగా.. ఈ ఏడాది జూన్ నెలకు ఆ సంఖ్య 1,604కు పడిపోయింది. అలాగే, చంద్రబాబు ప్రభుత్వం గత ఏడాది ఆలయాల నుంచి కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్) పేరుతో వసూలు చేసిన డబ్బుల నుంచి కేవలం రూ.9.62 కోట్లను మాత్రమే డీడీఎన్ఎస్ పథకానికి ఖర్చు పెట్టింది. ఈ నేపథ్యంలో.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర సమయంలో చిన్నచిన్న ఆలయాల్లో పనిచేసే అర్చకులు డీడీఎన్ఎస్ పథకం కింద అందే ఆర్థిక సహాయంతో పాటు గౌరవ వేతనాన్ని పెంచాలంటూ పెద్దఎత్తున వినతిపత్రాలు అందజేయడంతో ఆయన అప్పట్లో సానుకూలంగా స్పందించారు. అధికారంలోకి రాగానే తొలి బడ్జెట్లోనే దాని అమలుకు ఏకంగా రూ.234 కోట్లు కేటాయించారు. చరిత్రలో మొదటిసారిగా.. బడ్జెట్లో ఆదాయంలేని ఆలయాల నిర్వహణకు చరిత్రలో మొట్టమొదటిసారిగా రూ.234 కోట్ల మేర కేటాయించడం చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రంలో ఆలయాలకు మంచి రోజులు వచ్చాయనిపిస్తోంది. – పద్మ, దేవదాయ శాఖ కమిషనర్ బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ.100 కోట్లు సాక్షి, అమరావతి: బ్రాహ్మణుల సంక్షేమానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించింది. కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తర్వాత అత్యధిక కేటాయింపు ఇదే. 2014లో చంద్రబాబు అధికారంలోకి రాగానే బ్రాహ్మణుల సంక్షేమానికి రూ.500 కోట్ల ఏక మొత్తంతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అయితే ఆ హామీని పట్టించుకోకపోగా.. గడిచిన ఐదేళ్లలో బ్రాహ్మణ కార్పొరేషన్‌కు చంద్రబాబు ప్రభుత్వం కేటాయించింది కేవలం రూ.282 కోట్లు మాత్రమే. అంటే ఏడాదికి సరాసరిన రూ.56 కోట్లు మాత్రమే కేటాయించిందన్నమాట. రాష్ట్రంలో 18 ఏళ్ల వయస్సు నిండిన బ్రాహ్మణుల సంఖ్యే 45 లక్షలదాకా ఉంటుందని అంచనా. అయితే కార్పొరేషన్‌కు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అరకొర నిధులు మాత్రమే విడుదల చేయడంతో కేవలం 80 వేల మందికే సాయం చేయగలిగింది. అయితే ఇప్పుడు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం బ్రాహ్మణ వర్గానికి గతంలో ఎప్పుడూ లేనంత స్థాయిలో బడ్జెట్ కేటాయింపులు చేసింది. -
కన్నప్ప జన్మస్థలిపై కనికరమేదీ!
సాక్షి, రాజంపేట : శ్రీకాళహస్తిలో దక్షిణకాశిగా విరాజిల్లుతున్న పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర ఆలయం. ఈ ఆలయంలోని శివలింగానికి పూజలు చేసి అపర శివభక్తునిగా నిలిచిన భక్తకన్నప్పది వైఎస్సార్ జిల్లా రాజంపేట మండలం ఊటుకూరు (ఊడుమూరు) గ్రామమని పెరియపురాణం ద్వారా వెలుగులోకి వచ్చింది. ఇక్కడున్న శివాలయంలో శివలింగానికి కన్నప్ప పూజించినట్లుగా చెబుతుంటారు. అపర శివభక్తుడు భక్తకన్నప్ప(తిన్నడు) జన్మస్థలంపై రాష్ట్ర ప్రభుత్వం అధికారముద్ర ఇంతవరకు పడలేదు. ఇప్పటి వరకు ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. జన్మస్థలం అభివృద్ధి గురించి శ్రీకాళహస్తి దేవస్థానం శీతకన్ను వేసిందని భక్తుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. తమిళనాడుకు చెందిన ఓ భక్తుడు పెరియపురాణం ద్వారా భక్తకన్నప్ప జన్మస్థలం రాజంపేట మండలంలోని ఊటుకూరు అని వెలుగులోకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి గ్రామస్తులు దాతల సహకారంతో ఆలయాభివృద్ధికి నడుం బిగించారు. భక్త కన్నప్ప విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. భక్త కన్నప్ప జన్మ స్థలంలో ప్రతిష్టించిన కన్నప్ప విగ్రహం కన్నప్ప కాళహస్తికి ఎలావెళ్లాడు.. తిన్నడు(కన్నప్ప) ఒకనాడు అడవిలో పందిని వేటాడుతూ ఊటుకూరు నుంచి అటవీ ప్రాంతంలో స్వర్ణముఖి నది వరకు వెళ్లాడు. అక్కడ నేటి శ్రీకాళహస్తి దగ్గర శివలింగాన్ని దర్శించి, శివుని భక్తునిగా మారి పూజలు చేసేవాడు. తర్వాత పరమశివునికి తన రెండు కళ్లను సమర్పించి తన భక్తిని చాటుకున్నాడు. ఆయన భక్తికి మెచ్చి శివుడు కన్నప్పకి మోక్షమిచ్చాడు. మహాభక్తుడు కన్నప్ప ప్రతిష్టించిన శివలింగం జన్మ స్థలమైన ఊటుకూరు శివాలయంలో ఉంది. కన్నప్ప ఊహాచిత్రం అన్నమయ్యతో భక్త కన్నప్ప జన్మస్థలానికి అనుబంధం.. తాళ్లపాక అన్నమాచార్యులు తాత నారాయణయ్య చదువుకోవడానికి ఊటుకూరు(ఉడుమూరు)కు వచ్చారు. చదువు అబ్బక గురువు పెట్టే శిక్షలు భరించలేక చింతాలమ్మ గుడిలోని పుట్టలో చేయిపెట్టారు. పాము కరవలేదు కానీ, చింతాలమ్మ ప్రత్యక్షమైంది. శ్రీ వేంకటేశ్వరుని అనుగ్రహం వల్ల పరమభక్తుడు నీకు మనమడుగా పుడతాడని ఆశీర్వదించింది. ఆ నారాయణయ్య మనువడే అన్నమాచార్యులు. అన్నమయ్య తండ్రి నారాయణసూరి, తల్లి లక్కమాంబ. అన్నమయ్య కూడా ఊటుకూరులో చిన్నతనంలో విద్యాభ్యాసం చేశాడు. కలియుగ దైవం వేంకటేశ్వరునిపై 32వేల కీర్తనలు రచించి, పదకవితా పితామహడు పేరు తెచ్చుకొని ధన్యుడయ్యారు. చింతాలమ్మ అమ్మవారి విగ్రహం ఇప్పటికీ ఊటుకూరు శివాలయంలో ఉంది. -
నేడు పైడితల్లి సిరిమానోత్సవం
విజయనగరం టౌన్: రాష్ట్రంలోనే ప్రత్యేకతను సంతరించుకున్న శ్రీపైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం విజయనగరంలో మంగళవారం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దేవదాయశాఖ డిప్యూటీ కమిషనర్, ఫెస్టివల్ అధికారి ఎన్.వి.ఎస్.ఎన్.మూర్తి, ఆలయ ఈవో భానురాజా తెలిపారు. జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర జిల్లాలు, ముఖ్యంగా ఒడిశా ప్రాంతం నుంచి భక్తులు లక్షలాదిగా ఈ సంబరానికి ఇప్పటికే తరలి వచ్చేశారు. రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు విదేశీయులు సందడి చేయనున్నారు. సోమవారం తొలేళ్ల సంబరం ఘనంగా ముగిసింది. ఆలయ అనువంశిక ధర్మకర్త, మాజీ కేంద్రమంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు, భార్య సునీలా గజపతి, కుమార్తె అదితి గజపతి అమ్మవారిని దర్శించి, పట్టువస్త్రాలను సమర్పించారు. అశోక్‌గజపతిరాజు మాట్లాడుతూ అమ్మ ఆశీస్సులు అందరిపైనా ఉండాలన్నారు. రాత్రి 11 గంటల తర్వాత కోటశక్తికి పూజలు నిర్వహించి, అనంతరం రైతులకు విత్తనాలను పంచిపెట్టారు. సిరిమానోత్సవానికి ఏర్పాట్లను కలెక్టర్ డాక్టర్ హరిజవహర్‌లాల్, జిల్లా అదనపు ఎస్పీ ఎం.నరసింహారావు పర్యవేక్షిస్తున్నారు. మంగళవారం ఉదయానికే సిరిమానును, పూజారి బంటుపల్లి వెంకటరావును హుకుంపేట నుంచి ఆలయం వద్దకు ప్రత్యేక వాహనంలో తీసుకొస్తారు. హుకుంపేటలో సిరిమానును ఉదయం 10 గంటల నుంచి బయలుదేరేలా చూస్తారు. మధ్యాహ్నం 12:30 గంటలకు చదురుగుడి వద్దకు సిరిమానుకు చేరుకుంటుంది. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సుమారు గంటన్నర వ్యవధిలో సిరిమానుకు ఏర్పాటు చేయాల్సిన రథాన్ని, అనుసంధాన పలకలు, పూజారి కూర్చునే పీటలను అమర్చుతారు. అక్కడి నుంచి బయలుదేరిన సిరిమాను మూడుసార్లు అమ్మవారి ఆలయం నుంచి కోట వరకు వెళ్లి కోటశక్తికి మొక్కి తిరిగి ఆలయానికి చేరుకుంటుంది. పోలీస్ యంత్రాంగం ఇప్పటికే పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. దాదాపు రెండు వేల మంది పోలీసులు బందోబస్తు విధులు నిర్వర్తిస్తున్నారు. -
ఆర్జిత సేవలు బంద్
నిర్మల్‌టౌన్: జిల్లాలోని దేవాదాయశాఖ పరిధిలో గల అన్ని ఆలయాల్లో ఆర్జిత సేవలను అర్చకులు, ఆలయ సిబ్బంది నిలిపివేశారు. మూడురోజులుగా ఆర్జిత సేవలు నిలిచిపోగా, కైంకర్యం(నిత్యపూజలు, మహానైవేద్యం) మాత్రం కొనసాగుతోంది. ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్‌లో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న అర్చకులు, ఉద్యోగులకు ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా 577 జీవోను సైతం ప్రభుత్వం విడుదల చేసింది. ఏడాది గడుస్తున్నా ఇప్పటి వరకు ఆ జీవో అమలుకు నోచుకోవడం లేదు. దీంతో అర్చకులు, సిబ్బంది తప్పనిసరి పరిస్థితుల్లో ఆందోళన నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న 27 దేవాలయాల్లో 332 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఏడాదైనా మోక్షం లేదు.. దేవుడు కరుణించిన పూజారి కరుణించలేదన్న చందంగా మారింది దేవాదాయశాఖ ఉద్యోగులు, సిబ్బంది పరిస్థితి. అర్చక, ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఇవ్వాలని గతేడాది సెప్టెంబర్‌లో ప్రభుత్వం జీవో నంబర్ 577 విడుదల చేసింది. అయితే ఇప్పటి వరకు జీవో అమలుకు నోచుకోలేదు. అలాగే కేడర్ ఫిక్సేషన్లో జరిగిన అవకతవకలను కూడా సరిచేయాలని అర్చక, ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. వారు ఆలయాల్లో నిత్యపూజలు, మహానైవేద్యం యథావిధిగా సమర్పిస్తూ, ఆర్జిత సేవలను మాత్రం నిలిపివేశారు. శుక్రవారం నుంచి నల్లబ్యాడ్జీలు ధరించి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అర్చక, ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా వేతనాలు ఇవ్వాలి.. అర్చక, ఉద్యోగులకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా వేతనాలు ఇవ్వాలని వారు ప్రముఖంగా డిమాండ్ చేస్తున్నారు. 577 జీవో విడుదల చేసి ఏడాదవుతున్నా రాష్ట్రప్రభుత్వం ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 5,625 మందికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇవ్వాల్సి ఉండగా, కేవలం 792మందికి వేతనాలు అమలు చేస్తున్నారు. వీరికి కూడా దేవాలయ నిధి, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా రెండు పద్దులలో వేతనాలు ఇస్తున్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న వారందరికీ ఒకే పద్దు ద్వారా వేతనాలు అందిచాలని వారు కోరుతున్నారు. క్యాడర్ ఫిక్సేషన్తో అభద్రతభావంలో ఉద్యోగులు.. క్యాడర్ ఫిక్సేషన్ పేరిట ప్రభుత్వం కాలయాపన చేస్తుండడంతో తాము అభద్రతాభావానికి గురవుతున్నామని అర్చక, ఉద్యోగులు చెబుతున్నారు. 2014 కంటే ముందు నుంచి పనిచేస్తున్న అర్హులను గుర్తించి ట్రెజరీ ద్వారా వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మేరకు హైదరాబాద్‌లో దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జోన్ల వారీగా సమావేశం నిర్వహించారు. క్యాడర్ ఫిక్సేషన్ తర్వాత అర్హులైన వారందరికీ హామీ ప్రకారం వేతనాలు అమలు పరిచే అవకాశం ఉంది. ఇంకా కాలయాపన చేయకుండా వెంటనే సమస్య పరిష్కారానికి ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని అర్చక, ఉద్యోగులు కోరుతున్నారు. వెంకన్న గుడికి తాళం అర్చకుల సమ్మె ఎఫెక్ట్ 577 జీవో ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ ఎదులాపురం(ఆదిలాబాద్): జీవో 577 ప్రకారం వేతనాలు చెల్లించాలని అర్చక, ఉద్యోగులు సమ్మె బాట పట్టగా అర్జిత సేవలు నిలిచిపోయి భక్తుల రాలేక ఆలయాలు వెలవెలబోతున్నాయి. జిల్లా కేంద్రంలోని మర్వాడీ ధర్మశాల వేంకటేశ్వర ఆలయంలో అర్చక, ఉద్యోగులు చేస్తున్న సమ్మె ఆదివారానికి మూడోరోజుకు చేరుకుంది. అర్చక, ఉద్యోగులు మాట్లాడుతూ తమకు జీవో ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించాలన్నారు. వారితో సమానంగా అన్ని అలవెన్సులను అందించాలన్నారు. సమ్మెలో అర్చక, ఉద్యోగ సంఘం ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి చిల్లప్ప చంద్రశేఖర్, అర్చక సంఘం జిల్లా అధ్యక్షుడు పనకంటి విలాస్శర్మ, అర్చకులు సునీల్‌కుమార్, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలి ప్రభుత్వం ఏడాది క్రితం అర్చకులకు ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లిస్తామని ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు ట్రెజరీ ద్వారా వేతనాలు అందడం లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇవ్వాలి. – జగన్నాథస్వామి, దేవరకోట ఆలయ అర్చకుడు, నిర్మల్ సేవలు నిలిపివేశాం రాష్ట్ర శాఖ ఆదేశం మేరకు ఆలయాల్లో ఆర్జిత సేవలను నిలిపివేశాం. కేవలం నిత్యపూజలు, మహానైవేద్యాన్ని సమర్పిస్తున్నాం. ఆలయాలను తెరిచే ఉంచి నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్నాం. ప్రభుత్వం మా ఆవేదన అర్థం చేసుకుని వెంటనే సమస్యను పరిష్కరించాలి. – నవీన్, దేవరకోట -
ఆంజనేయా..ఆస్తులు కాపాడుకో తండ్రీ ..!
బొబ్బిలి విజయనగరం : ఎంతో విలువైన దేవాదాయ శాఖకు చెందిన షాపింగ్ కాంప్లెక్స్‌లోని షాపులను వేలం వేయడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్టణంలోని ఆంజనేయస్వామి దేవస్థానం దేవాదాయ శాఖ పరిధిలో ఉంది. ఈ ఆలయానికి చెందిన స్థలంతో పాటు మున్సిపాలిటీ స్థలంలో మున్సిపల్ అధికారులు షాపింగ్ కాంప్లెక్స్‌ను నిర్మించారు. ఈ కాంప్లెక్స్‌కు మున్సిపల్ మాజీ చైర్మన్ ఆరి గంగయ్య పేరు పెట్టారు. అయితే దేవాదాయ శాఖ మా స్థలంలో కట్టిన షాపులను మాకు అప్పగించాలని కోర్టుకు వెళ్లారు. చివరకు ఏళ్ల తరబడి నడచిన ఈ కేసు సుమారు ఎనిమిది నెలల కిందట కోర్టు ఆ షాపులు దేవాదాయ శాఖకు చెందుతాయని తీర్పిచ్చిందని దేవాదాయ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే నేటికీ ఆ షాపులను వేలం వేయడం లేదు. ఇదిగో అదిగో అని తాత్సారం చేస్తున్నారే తప్ప షాపులకు వేలం వేయడం లేదు. ఇదిలా ఉంటే పైరవీలు చేసుకున్న వారికే షాపులు కట్టబెట్టేందుకు ఏర్పాట్లు సాగుతున్నట్లు సమాచారం. ఇక్కడ ఒక్కో దుకాణానికి నెలసరి అద్దె రూ.4 వేల నుంచి పది వేల రూపాయల వరకు పలుకుతోంది. అలాగే డిపాజిట్లు కూడా రూ. లక్షల్లో చెల్లించాల్సి ఉంటుంది.అయితే దుకాణాల వేలాన్ని దేవాదాయ శాఖాధికారులు కావాలనే తాత్సారం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చాలా మంది ఔత్సాహికులు షాపులను దక్కించుకునేందుకు ఎదురు చూస్తున్నారు. బహిరంగ వేలం అయితే ఎవరు ఎక్కువ ధరకు పాడుకుంటే వారికే షాపులు కేటాయించాలి. అయితే కౌన్సిలర్లు, కొంతమంది రాజకీయ నాయకులు బహిరంగ వేలం కాకుండా అడ్డుపడుతున్నారు. కోర్టు వేలంపాట నిర్వహించుకోవాలని చెప్పినప్పుడు దేవాదాయ శాఖాధికారులు ఎందుకు ఆలస్యం చేస్తున్నారో అర్థం కావడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై ఈఓ శ్రీనివాసరావును వివరణ కోరగా స్థలాల కొలతలను బట్టి అద్దెలుంటాయనీ, ఈనెల 27న వేలం ప్రక్రియను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అందరికీ తెలిసేలా కరపత్రాలు పంచి వేలం ధరను నిర్ణయిస్తామన్నారు. ఇప్పటివరకూ కొన్ని దుకాణలకు వసూలు చేసిన అద్దెలు మున్సిపాలిటీ వద్దనే ఉండొచ్చన్నారు. -
తోక జాడిస్తే కత్తిరిస్తా : చంద్రబాబు
సాక్షి, అమరావతి: ‘ఇయ్యమయ్యా... కనీస వేతనాలు ఇవ్వమని చెబుతున్నా. ఇవ్వం... మళ్లీ మళ్లీ చెబుతున్నా.. తోక జాడిస్తే కట్ చేస్తా. బీ కేర్‌పుల్. ఇంకొకసారి తోక తిప్పండి చెబుతా మీ కథ’.. ‘సచివాలయానికి వచ్చి ఇష్ట్రపకారం చేస్తారా? ఇంకోసారి చేస్తే గుళ్లలోకి కూడా రారు. బీ కేర్‌పుల్’.. ‘ఆర్గ్యుమెంట్స్ లేవు. కనీస వేతనాలు ఇవ్వం. నో నో.. ఏం చేస్తారో చేయండి. ఇంకోసారి మాట్లాడితే మర్యాద కాదు..’ ‘ఏ వూరు మీది..? మీదే ఊరు..? తెలుసా మీకు.. తొమ్మిదేళ్లు పాలించా.. బెదిరిస్తే తోక కట్ చేస్తా’ ‘పిచ్చాటలాడితే మాత్రం.. చాలా సీరియస్‌గా ఉంటది’ ‘ఏం తమాషాలాడుతున్నారా...’ ఆలయ కేశఖండనశాలలో పనిచేసే క్షురకులపై సీఎం చంద్రబాబు వీరావేశంతో ఊగిపోతూ మాట్లాడిన మాటలు ఇవన్నీ. తమను కాంట్రాక్టు ఉద్యోగులుగానైనా గుర్తించి కనీస వేతనాలు చెల్లించాలని కోరిన వారిపై సీఎం తీవ్రస్థాయిలో మండిపడి వేలు చూపిస్తూ హెచ్చరికలు చేయటంతో నిర్ఘాంతపోయారు. సంఘాలతో సర్కారు చర్చలు విఫలం ఆలయ కేశఖండనశాలల్లో క్షురకుల విధుల బహిష్కరణతో గత నాలుగు రోజులుగా తలనీలాల సమర్పణ నిలిచిపోయిన సంగతి పాఠకులకు విదితమే. విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్న క్షురక జేఏసీ ప్రతినిధులు, నాయీ బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. సోమవారం ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో దేవదాయ శాఖ ఉన్నతాధికారులు క్షురక ఉద్యోగ ప్రతినిధులతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. కనీస వేతనాలైనా చెల్లించాలని ప్రతినిధులు పట్టగా అది కూడా కుదరంటూ కేఈ కృష్ణమూర్తి తేల్చి చెప్పడంతో వారంతా చర్చలను బహిష్కరించారు. ఎంతిచ్చినా జీతంగానే ఇవ్వాలన్న ప్రతినిధులు నాయీ బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతుండగా అదే సమయంలో సీఎం చంద్రబాబు అక్కడ ఆగారు. ఆలయాల్లో పనిచేసే క్షురకులకు కనీస వేతనాలు ఇవ్వాలని నినాదాలు చేయటంతో.. భక్తుల ఒక్కొక్క గుండుకు రూ.25 చొప్పున చెల్లించడానికి ప్రభుత్వం అంగీకరిస్తున్నట్లు చంద్రబాబు వారితో చెప్పారు. అయితే ఒక్కొక్క గుండుకు రూ.50 చొప్పున ఇచ్చినా కూడా తమకు వద్దని, ఎంత ఇచ్చినా జీతం రూపంలోనే ఇవ్వాలని వారు ముఖ్యమంత్రిని అభ్యర్థించారు. హామీని గుర్తు చేయగానే బాబులో ఆవేశం... ‘ఏం చేసినా కనీస వేతనాలు ఇవ్వడం కుదరదు. ఏం చేసుకుంటారో చేసుకోండని’ చంద్రబాబు ఆవేశంగా వ్యాఖ్యానించారు. ‘‘అయ్యా, మేం ఏ రోజైనా రోడ్డు మీదకొచ్చిన వాళ్లం కాదు. ఎన్నికలప్పుడు మీరే హామీ ఇచ్చారు. మీ మ్యానిఫెస్టోలో కూడా పెట్టారు. దేవస్థానాల్లో క్షురక ఉద్యోగాలను నాయీ బ్రాహ్మణులతో భర్తీ చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఏళ్ల తరబడి ఆ పనిచేస్తున్న మాకు కనీస వేతనాలు ఇవ్వమని అడుగుతున్నాం’ అంటూ నాయీ బ్రాహ్మణుల సంఘం ప్రతినిధులు విన్నవించటంతో చంద్రబాబులో ఆవేశం కట్టలు తెంచుకుంది. ‘‘అరుస్తారా.. ఏమన్నా ఫిష్ మార్కెటా ఇది (సచివాలయం)..? ఏం తమాషాలాడుతున్నారా?’ అంటూ ఆవేశంతో ఊగిపోయారు. తాము అరవడం లేదంటున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు వినలేదు. ‘అరవలేదా.. మీరు తమాషాలాడుతున్నారు’ అని చిందులు తొక్కారు. ముందు విధుల్లో చేరండి... తర్వాతే ఏదైనా అనంతరం చంద్రబాబు వారికి హెచ్చరికలు చేస్తూ, వేలు చూపిస్తూ.. ‘ఏయ్, వినయ్యా విను.. నీకు కుటుంబం ఉండొచ్చయ్యా.. ఏమి మాట్లాడతావు (కోపంగా) ఏం తమాషాలు ఆడుతున్నావు నువ్వు?’ అంటూ ఒక ప్రతినిధిపై విరుచుకుపడ్డారు. దేవాలయంలో పనిచేసే వారు ఇలా ప్రవర్తించడం మంచిది కాదన్నారు. కనీస వేతనాలు ఇవ్వడం కుదరని పలుమార్లు స్పష్టం చేసిన ముఖ్యమంత్రి.. ‘ముందు మీరు విధుల్లో చేరండి. తర్వాత ఏదైనా మాట్లాడదాం’ అంటూ ఆవేశంగా తన కారు వద్దకు వెళ్లిపోయారు. రూ.25 చొప్పున చెల్లించేందుకు ముందుకొచ్చిన సర్కారు పలు దేవాలయాల్లో ప్రస్తుతం రూ.10 – రూ. 20 మధ్య ఉన్న తలనీలాల టిక్కెట్ ధరను అన్ని ఆలయాల్లో రూ.25కు పెంచి ఆ మొత్తాన్ని విధుల్లో పాల్గొనే క్షురకులకు చెల్లించడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. నాయీ బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులతో చర్చల అనంతరం ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. దేవాలయాల్లోని ప్రతి శిరోముండనానికి ప్రస్తుతం క్షురకులకు చెల్లిస్తున్న 13 రూపాయలను 25 రూపాయలకు పెంచుతామన్నారు. శిరోముండనం కోసం భక్తులు చెల్లించే టిక్కెట్ ధర పెంచే ఆలోచన లేదన్నారు. పెంపు వల్ల పడే అదనపు వ్యయాన్ని సంబంధిత దేవాలయమే భరిస్తుందన్నారు. భక్తులకు ఇబ్బంది కలిగించవద్దని, ఆందోళనను విరమించాలని కోరారు. బాబుకు తగిన బుద్ధి చెబుతాం నాయీ బ్రాహ్మణ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు బాబ్జీనంద సీఎం స్థానంలో ఉన్న వ్యక్తే రౌడీలాగా మాట్లాడుతూ నాయీ బ్రాహ్మణుల ఆత్మగౌరవాన్ని కించపరిచి, మనోధైర్యాన్ని దెబ్బతీశారని నాయీ బ్రాహ్మణ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు ఇంటూరి బాబ్జీనంద అన్నారు. సమస్యలు చెప్పుకోవడానికి వెళితే సానుకూలంగా స్పందిచకపోగా, తమపైనే ఆయన బెదిరించి, భయపెట్టే ధోరణిలో మాట్లాడారని చెప్పారు. అన్ని బీసీ కులాలతో పాటు నాయీ బ్రాహ్మణులు గత ఎన్నికల్లో టీడీపీ విజయానికి పనిచేశారని, వచ్చే ఎన్నికల్లో నాయీ బ్రాహ్మణుల సత్తా ఏంటో చూపిస్తామన్నారు. సాయంత్రం శివాలు....రాత్రి బుజ్జగింపు! ఆలయ కేశఖండనశాలల్లో పనిచేసే క్షురకుల జేఏసీ ప్రతినిధులపై సోమవారం సాయంత్రం సచివాలయంలో తీవ్ర ఆగ్రహావేశాలు ప్రదర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. అనంతరం రాత్రి వారిని మళ్లీ చర్చల కోసం తన ఇంటికి ఆహ్వానించారు. ప్రతి ఆలయంలో పనిచేసే ఇద్దరేసి చొప్పున ప్రతినిధులను చర్చలకు పిలిచారు. ఈనెల 25వ తేదీన ఈ అంశంపై మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుందామని జేఏసీ ప్రతినిధులకు చెప్పారు. దేవదాయశాఖ కమిషనర్ అనురాధ ప్రస్తుతం సెలవులో ఉన్నారని, ఆమె తిరిగి విధుల్లో చేరాక అన్ని విషయాలపై చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చినట్టు జేఏసీ ప్రతినిధులు తెలిపారు. ముఖ్యమంత్రి హామీ మేరకు మంగళవారం నుంచి అన్ని ఆలయాల్లోని కేశఖండనశాలల్లో విధులకు హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు క్షురకుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గుంటుపల్లి రాందాసు చెప్పారు. -
దేవాదాయశాఖ కమిషనర్‌పై కేసు నమోదు
సాక్షి, విజయవాడ : దేవాదాయశాఖ కమిషనర్ వైవీ అనురాధ, సహాయ కమిషనర్ పుష్పవర్ధన్‌తో సహా, మరొకరిపై విజయవాడ వన్ టౌన్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. దుర్గగుడిలో పనిచేసే వెంకటేశ్వర్లు అనే కాంట్రాక్టర్ కార్మికుడు పట్ల దురుద్దేశ పూర్వకంగా, నష్టం కలిగించే విధంగా వ్యవహరించటం మీద కోర్టు ఆదేశాల మేరకు అనురాధపై సెక్షన్ 166, 384, 425, 506, 120బీ, 34ఐపీసీ, 156(3), సీఆర్పీసీల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. గతంలో వైవీ అనురాధ దుర్గగుడి ఈవోగా పనిచేశారు. -
హెరిటేజ్ తెలంగాణతో సర్వతో‘భద్రం’
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే ప్రత్యేక చారిత్రక నిర్మాణంగా గుర్తింపు పొందిన సర్వతోభద్ర ఆలయ పునర్నిర్మాణ బాధ్యత నుంచి ప్రభుత్వం దేవాదాయ శాఖను తప్పించింది. ఆలయ ప్రత్యేకతలను దెబ్బతీసేలా దేవాదాయ శాఖ పనులు చేస్తుండటాన్ని ‘సాక్షి’వెలుగులోకి తేవడంతో.. సర్కారు స్పందించింది. ఈ పనులను హెరిటేజ్ తెలంగాణ (రాష్ట్ర పురావస్తు విభాగం)కు అప్పగించింది. ఈ పనుల కోసం దేవాదాయ శాఖకు మంజూరు చేసిన నిధులను కూడా పురావస్తు శాఖకే అప్పగించాలని ఆదేశించింది. దీంతో ఈ ఆలయ విశిష్టత దెబ్బతినకుండా.. పూర్తిగా రాతి నిర్మాణాలతో పునర్నిర్మాణ పనులు చేపట్టేందుకు పురావస్తుశాఖ సిద్ధమైంది. ఆలయానికి దూరంగా ఆర్కేడ్ భూపాలపల్లి జిల్లా నయన్‌పాక గ్రామంలో పురాతన సర్వతోభద్ర ఆలయాన్ని ఇటీవల గుర్తించిన విషయం తెలిసిందే. దానిని పునరుద్ధరించి పునర్వైభవం తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి.. దేవాదాయ శాఖకు బాధ్యత అప్పగించింది. కానీ దేవాదాయ శాఖ అధికారులు పురాతన ఆలయ విశిష్టతనే దెబ్బతీసేలా రాళ్ల తొలగింపు, కాంక్రీటుతో పనుల వంటివి చేపట్టారు. ఈ వ్యవహారాన్ని ప్రశ్నిస్తూ ‘సాక్షి’ఇటీవల కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన సర్కారు పునరుద్ధరణ బాధ్యతలను దేవాదాయ శాఖ నుంచి తప్పించి.. హెరిటేజ్ తెలంగాణకు అప్పగించింది. చర్యలు చేపట్టిన పురావస్తు శాఖ సర్వతోభద్ర ఆలయం అతి పురాతన నిర్మాణం కావడంతో.. దాని ప్రత్యేకత దెబ్బతినేలా, దాన్ని అనుకుని కొత్త నిర్మాణాలేవీ చేపట్టడానికి వీలు లేదు. దీంతో ప్రధాన ఆలయానికి చుట్టూ 60 అడుగుల దూరంలో చతురస్రాకారంలో భారీ ఆర్కేడ్ (మంటపం తరహాలో) నిర్మించాలని పురావస్తు శాఖ అధికారులు యోచిస్తున్నారు. అది కూడా పూర్తిగా రాతి నిర్మాణంగా ఉండనుంది. ఆలయానికి నాలుగు వైపులా ద్వారాలు ఉన్నందున ఆర్కేడ్ నాలుగు వైపులా ప్రత్యేక బాటలు ఏర్పాటు చేస్తారు. మధ్యలో పచ్చిక బయలు, పూల చెట్లు ఏర్పాటు చేస్తారు. ఇక ఈశాన్య దిశలో ఉన్న కోనేరులో పూడిక తీసి పునరుద్ధరిస్తారు. ఇక ఆర్కేడ్ వెలుపల భక్తులు, పర్యాటకుల వసతి కోసం ఇతర నిర్మాణాలను చేపడతారు. ఇక ఆలయ శిఖరంపై భాగాన ఇటుకలు పడిపోయి ఉన్నాయి. దీంతో అదే పరిమాణంలో కొత్త ఇటుకలు తయారు చేయించి.. శిథిలమైన చోట ఏర్పాటు చేసి, డంగుసున్నంతో పునరుద్ధరించ నున్నారు. -
జీర్ణం.. జీర్ణం.. దేవాదాయం!
సాక్షి, హైదరాబాద్: అవి దేవాలయానికి చెందిన దుకాణాలు.. ఈ విషయం దేవాదాయ శాఖ రికార్డులే చెబుతున్నాయి. ఆ దుకాణాల నుంచి అద్దె రూపంలో వచ్చే ప్రతి పైసా దేవుడి ఖజానాకే చెందాలి. ఇది దేవాదాయ శాఖ చట్టం చెబుతున్నమాట! కానీ దాదాపు రూ. అరకోటి వరకు అద్దె సొమ్ము ఎంచక్కా ప్రైవేటు వ్యక్తుల జేబుల్లోకి చేరిపోతోంది. ఇలా ఒకటీ రెండు నెలలుగా కాదు.. ఏళ్లుగా సాగుతోంది! మరి అధికారులేం చేస్తున్నారు? దేవుడి ఖాతాలో జమ కావాల్సిన అద్దెలను ఎందుకు వసూలు చేయటం లేదంటూ ఉన్నతాధి కారులు సంబంధిత అధికారికి మెమో జారీ చేస్తారు. కానీ చర్యలు తీసుకోరు. కొన్ని నెలల తర్వాత మళ్లీ ఓ మెమో ఇస్తారు. అదీ బుట్టదాఖలవుతుంది. ఇదేం పద్ధతి అంటారా.. అదంతే.. ఎందుకంటే అది దేవాదాయశాఖ కాబట్టి! అక్రమాలకు ఇదిగో మచ్చుతునక.. సికింద్రాబాద్‌లోని రాణిగంజ్‌లో శంకరమఠం ఉంది. దానికి అనుబంధంగా దేవాలయం ఉంది. ఇది 1950లలో దేవాదాయశాఖ సికింద్రాబాద్ కార్యాలయంలో రిజిస్టర్ అయింది. రోడ్డువైపు ఉన్న స్థలంలో చాలాకాలం క్రితమే ఓ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారు. ఇందులో దాదాపు 55కి పైగా దుకాణాలున్నాయి. ఇది కీలక వాణిజ్య ప్రాంతం కావటంతో వాటికి డిమాండ్ ఎక్కువ. ఇక్కడ సాధారణ దుకాణాలకు కూడా నెలవారీ అద్దె కనీసం రూ.20 వేల వరకు ఉంటుంది. ఈ లెక్కన ప్రతినెలా వీటి అద్దె రూ.10 లక్షలకుపైగానే దేవాలయ ఖాతాలో పడాలి. కానీ ఇప్పటి వరకు దేవుడి ఖజానాకు అద్దె రూపంలో నయా పైసా రాలేదు. ప్రస్తుతం ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించే ఓ బడా నేత కనుసన్నల్లో ఈ ప్రాంతం ఉంది. దీంతో దేవాదాయశాఖ అధికారులు దానిపై చర్యలు తీసుకోవటానికి సాహసించ లేదు. రెండేళ్ల క్రితం ఓ అధికారి ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చి విషయాన్ని కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆ దేవాలయానికి ఓ కార్యనిర్వహణాధికారిని నియమించాలని నివేదించారు. దీంతో ఏడాదిన్నర క్రితం ఓ అధికారిని ఈఓగా నియమించారు. అద్దెలు వసూలు చేయటమే ప్రధాన పనిగా పురమాయించారు. కానీ ఏడాదిన్నర గడిచినా ఒక్క పైసా దేవుడి ఖాతాలో పడలేదు. కానీ ప్రతినెలా ఠంచన్‌గా అద్దెలు మాత్రం లక్షల్లో వసూలవుతూ.. ప్రైవేటు వ్యక్తుల జేబుల్లోకి చేరుతున్నాయి. ప్రతి రెండుమూడు నెలలకోమారు ఈఓ తీరును తప్పుపడుతూ మెమోలు పంపటానికే పరిమితమైన దేవాదాయశాఖ అంతకుమించి చర్యలు తీసుకోలేకపోయింది. బడా నేత కనుసన్నల్లో బాజాప్తా జరుగుతున్న కుంభకోణమిది. ప్రతినెలా రూ.లక్షల్లో వచ్చి పడుతున్న అద్దెలను స్వాహా చేసేందుకు నేతలు, అధికారులు, మఠం నిర్వాహకులు కుమ్మక్కై ఈ తతంగా నడుపుతున్నారు. వైష్ణవాలయం వద్దా ఇదే కథ.. సికింద్రాబాద్ జనరల్ బజార్ ప్రాంతంలో ఉన్న అతిపురాతన వైష్ణవాలయం వద్దా ఇదే కథ నడుస్తోంది. ఇక్కడ గజం జాగా దొరికినా దుకాణం పెట్టేస్తారు. అలాంటిది ఆ దేవాలయానికి ఇక్కడ 50 వరకు దుకాణాలున్నాయి. వాటి అద్దె ప్రతినెలా రూ.15 లక్షల వరకు ఉంటుంది. కానీ అద్దెల సొమ్ము దేవాలయానికిగాక ప్రైవేటు వ్యక్తుల జేబుల్లోకి వెళ్లోంది. 20 ఏళ్ల కిందటి ధరలతో.. దేవాదాయశాఖ పరిధిలో ఉన్న గ్రెయిన్ బజార్ ధర్మశాలకు కూడా పెద్ద సంఖ్యలో దుకాణాలున్నాయి. అయితే వీటి విషయంలో అధికారులు అతి తెలివి ప్రదర్శించారు. మిగతావాటిలా వీటిని గాలికొదిలేయలేదు. ప్రతినెలా అద్దె వసూలు చేస్తున్నారు. కానీ అవి రెండు దశాబ్దాల క్రితం నాటి ధరలు. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం వాటిని సవరించాల్సి ఉన్నా అధికారులు హస్తలాఘవం ప్రదర్శిస్తున్నారు. వాటిని సవరించకుండా ఉన్నతాధికారులు ఎప్పట్లాగే మెమోలు పంపి చేతులు దులుపుకొంటున్నారు. వ్యాపారులు మాత్రం మార్కెట్ ధరల మేరకు అద్దె చెల్లిస్తున్నా దేవుడి ఖజానాకు అతి తక్కువ జమ అవుతోంది. ఇలా దుకాణాలను బంగారుబాతుల్లాగా మార్చుకున్న నేతలు.. అధికారులను గుప్పిట్లో పెట్టుకుని దేవుడి సొమ్మును దిగమింగుతున్నారు. ప్రతినెలా రూ.అరకోటి వరకు పక్కదారి పడుతున్నట్టు అధికారులే అంచనా వేస్తున్నారు. ప్రతినెలా రూ.లక్షల్లో ఆదాయం ఉంటున్నా ఒక్కోసారి ఉత్సవాలకు చాలినంత సొమ్ము లేక తూతూమంత్రంగా కానిచ్చేస్తుండటం దేవాదాయశాఖ దుస్థితికి నిదర్శనం. అక్రమాలకు ఉదాహరణలెన్నో.. ►సికింద్రాబాద్ పాన్‌బజార్ వేణుగోపాలస్వామి ఆలయం అధీనంలోని దుకాణాలకు చాలాకాలంగా అద్దె వసూలు కావడం లేదు. దీంతో ఆ దుకాణదారులను ఖాళీ చేయించి కొత్తవారికి అద్దెకిచ్చే ఉద్దేశంతో కోర్టులో ఎవిక్షన్ పిటిషన్ దాఖలు చేయగా.. దాన్ని ఉపసంహరించుకొని ప్రస్తుత దుకాణదారులనే కొనసాగించాలంటూ ఓ బడా నేత చక్రం తిప్పుతున్నాడు. ►అమీర్‌పేటలోని హనుమాన్ దేవాలయం అధీనంలోని దుకాణాలను ఓ నేత దర్జాగా సబ్లీజుకు ఇచ్చేసి పెద్దమొత్తంలో అద్దెలు స్వాహా చేస్తున్నాడు. ఇది స్థానిక అధికారులకు తెలిసినా కళ్లుమూసుకున్నారు. -
దక్షిణ సమర్పయామి..!
సాక్షి, హైదరాబాద్ : దేవాలయ ఉద్యోగులు, అర్చకుల వేతన సవరణను ఆసరాగా చేసుకుని దళారులు దండెత్తారు. క్లిష్టమైన ఆ అంశాన్ని కొలిక్కి తెస్తామని, సవరణ పరిధిలోకి రాని వారికి భవిష్యత్‌లో వేతన సవరణ జరిపిస్తామని భారీగా దండుకుంటున్నారు. డబ్బులిచ్చిన వారి జాబితానే సర్కారుకు చేరుతుం దని.. వారికి మాత్రమే వేతనాలు పెరుగుతాయని, క్రమబద్ధీకరణ జరుగుతుందని బెదిరించి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇలా ఒక్కో ఉద్యోగి, అర్చకుడి నుంచి రూ.10 వేల వరకు.. మొత్తంగా రూ.2 కోట్లకుపైగా వసూలు చేసినట్లు సమాచారం. దేవాలయ ఉద్యోగుల నుంచి ఓ గుంపు, అర్చకుల నుంచి మరో గుంపు ఈ వసూళ్ల వేటలో నిమగ్నమై ఉన్నట్లు తెలిసింది. మెలికలను ఆసరాగా చేసుకుని.. అర్చకులు, దేవాలయ సిబ్బందికి దేవాలయాల ఆదాయం నుంచి ఇప్పటివరకు వేతనాలు చెల్లిస్తూ వచ్చారు. అయితే దీన్ని అడ్డుపెట్టుకుని అధికారులు వేధిస్తున్నారని.. ఆదాయం లేదంటూ, తగ్గిందంటూ సకాలంలో వేతనాలు ఇవ్వడం లేదని, ఇచ్చినా కోత పెడుతున్నారని ఆలయ ఉద్యోగులు, అర్చకులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో దిగొచ్చిన ప్రభుత్వం.. సెక్షన్ 65ఏ ప్రకారం వేతన నిధి ఏర్పాటుచేసి ప్రభుత్వోద్యోగుల తరహాలో ఒకటో తేదీనే బ్యాంకు ఖాతాలకు వేతనాలు చెల్లించనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే రూ.50 వేలకు పైబడి ఆదాయం ఉన్న దేవాలయాలను వేతన సవరణ పరిధిలోకి తేవాలని నిర్ణయించగా.. ఆ లెక్కన ఉద్యోగులు, అర్చకుల సంఖ్య 6 వేల వరకు చేరింది. అయితే 2015 పీఆర్సీ, కన్సాలిడేటెడ్ పే, ఎన్ఎంఆర్.. ఇలా రకరకాల అంశాలను తెరపైకి తెచ్చి ఆ సంఖ్యను సగానికి కంటే తక్కువ చేశారు. దీంతో అర్చకులు, సిబ్బందిలో ఆందోళన మొదలైంది. దీన్ని అనుకూలంగా మలుచకున్న వసూళ్ల బృందాలు.. ఆయా ఉద్యోగులను వేతన సవరణ కిందకు తీసుకురావాలంటే సొమ్ములు చెల్లించాలని డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. ఇక రూ.50 వేల కంటే తక్కువ ఆదాయం ఉన్న దేవాలయాలనూ సవరణ పరిధిలోకి తెస్తామంటూ రూ.5 వేల చొప్పున వసూలు చేస్తున్నారు. వసూళ్ల రాయుళ్లకు టెన్షన్.. దేవాలయ ఉద్యోగులు, అర్చకుల నుంచి భారీగా దండుకున్న వసూళ్ల రాయుళ్లకు తాజాగా ఓ విషయంలో టెన్షన్ పట్టుకుంది. ఉద్యోగుల నియామకంపై నిషేధం ఉన్నా.. దేవాదాయ శాఖలో 1,700 మంది అక్రమంగా చేరినట్లు అధికారులు ఇటీవల తేల్చారు. వారికి వేతన సవరణ సాధ్యం కాదని దేవాదాయ శాఖ కమిషనర్ తేల్చడంతో ప్రస్తుతానికి వారి విషయం గందరగోళంలో పడింది. ఆ ఉద్యోగుల నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడినందున.. వారందరినీ రెగ్యులరైజ్ చేయాలని సంబంధిత ముఠా వ్యక్తులు పట్టుపడుతున్నారు. దీంతో కమిషనర్‌ను కాదని రాజకీయ కోణం వైపు నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ ప్రక్రియను ఉన్నతాధికారులు వ్యతిరేకిస్తుండటంతో వసూళ్ల అంశం వివాదాస్పదమై ప్రభుత్వానికే మచ్చతెచ్చేలా తయారైంది. మంత్రికి ఫిర్యాదు చేయండి.. వేతన సవరణ వసూళ్ల అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురాగా.. వేతన సవరణ అంశం వివాదాల చుట్టూ తిరుగుతున్నందున తాము జోక్యం చేసుకోలేమని చెప్పారు. వసూళ్లకు, తమకు సంబంధం లేనందున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి ఫిర్యాదు చేయాలని సూచించారు. -
సరస్వతీదేవి సాక్షిగా దోపిడీ పర్వం
నిర్మల్: బాసర జ్ఞాన సరస్వతీ ఆలయ సొమ్మును అక్కడ పని చేసే అధికారులు యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నారు. ఆలయ ఉన్నత స్థాయి అధికారితో పాటు.. అతని తర్వాతి స్థాయి అధికారి ఓ పద్ధతిగా ఈ దోపిడీ పర్వాన్ని కొనసాగిస్తున్నారు. పనిమనిషి పేరిట బ్యాంకు ఖాతా తెరిచి ఈ దోపిడీ పర్వాన్ని ఓ పద్ధతి ప్రకారం నడిపిస్తున్నారు. ఇలా ఇచ్చి.. ఇలా తీసుకుంటారు.. బాసరలో నిత్యపూజలు, ఉత్సవాలు, ఇతర కార్యక్రమాలు, భక్తుల సౌకర్యాల కోసం వస్తువుల కొనుగోలుతో పాటు అనేక రకాల ఖర్చులు ఉంటాయి. వీటన్నింటికీ దేవాదాయ శాఖ బిల్లులు తీసుకుని డబ్బులు చెల్లిస్తుంది. ఇదే విధానం ఇప్పుడు ఇక్కడి అధికారులకు కలిసి వస్తోంది. పూజా సామగ్రి, ఇతరత్రా వస్తువులను కొనుగోలు చేసే దుకాణాల నుంచి ముందుగా అధిక మొత్తంలో బిల్లులు తీసుకొని, ఆ మేరకు డబ్బులు చెల్లిస్తున్నారు. సదరు దుకాణదారులు తమకు రావాల్సిన అసలైన బిల్లు తీసుకుని, అదనంగా వచ్చిన డబ్బులను తిరిగి అధికారులు సూచించిన బినామీ వ్యక్తి ఖాతాలోకి జమ చేస్తారు. ఇలా సికింద్రాబాద్‌లోని ఓ జనరల్ దుకాణం, మహారాష్ట్రలోని మరో దుకాణం నుంచి ఇచ్చి పుచ్చుకోవడాలు జరిగాయి. బినామీ ఖాతాల నుంచి వాటాలు.. బినామీ వ్యక్తి ఖాతాల్లోకి నగదు చేరిన వెంటనే వాటాల పంపకాలు జరిగిపోతుంటాయి. ఆలయంలోని పెద్దసారు, చిన్నసారుతో పాటు వివిధ స్థాయిల ఉద్యోగులకూ ఇందులో వాటాలు ఉంటాయి. స్థాయిల వారీగా ఈ పంపకాలు జరుగుతాయి. ఇలా బినామీలను పెట్టుకుని కథంతా నడిపేది ఆలయంలో చిన్నసారే కనుక.. ఆయనకు కాస్త ఎక్కువ మొత్తంలో వెళ్తున్నట్లు సమాచారం. ఈ అధికారులు నేరుగా డబ్బులు తీసుకోకుండా.. తమ కుటుంబసభ్యుల ఖాతాల్లో వేసుకుంటారు. సిబ్బంది ఎరియర్సూ వదల్లేదు.. ఆలయం కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ సిబ్బందికి సంబంధించి ఎరియర్స్నూ ఆలయ అధికారులు వదిలి పెట్టలేదు. 2016 నుంచి ఈ ఏడాది మార్చి వరకు ఆలయంలోని వివిధ విభాగాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు రూ.లక్షల్లో ఎరియర్స్ వచ్చాయి. ఈ డబ్బులన్నీ ఆయా ఏజెన్సీలు అధికారుల బినామీ ఖాతాలో జమ చేయించుకున్నారు. ఎరియర్స్‌కు సంబంధించి డబ్బులో రూ.2 లక్షలను బినామీ వ్యక్తి ఆలయ ఉన్నతాధికారి కోడలి బ్యాంకు అకౌంట్లోకి చేర్చడం గమనార్హం. ఎవరికీ అనుమానం రాకుండా రూ.2 లక్షలు ఒకేసారి వేయకుండా ఐదుసార్లు రూ.40 వేల చొప్పున ఈ ఖాతాలో జమచేసినట్లు సమాచారం. ఇక అదే రోజు ద్వితీయ స్థాయి అధికారి ఎవరికీ అనుమానం రాకుండా తన బినామీకి సంబంధించిన ఏటీఎం కార్డు నుంచే డబ్బులు డ్రా చేసుకున్నట్లు సమాచారం. వీరితో పాటు పలువురు కిందిస్థాయి అధికారులు, సిబ్బందికి వారి స్థాయికి తగ్గట్లు డబ్బులు ముట్టినట్లు తెలిసింది. చిన్నసారే సూత్రధారి..! ఆలయంలో కొనసాగుతున్న అవినీతి పర్వానికి అక్కడ కొనసాగుతున్న ద్వితీయ స్థాయి అధికారి ప్రధాన కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయన గతంలోనే అక్రమాలకు పాల్పడ్డాడన్న కారణంతో సస్పెండ్ చేసి, అనంతరం కొండగట్టుకు డిప్యుటేషన్‌పై పంపించారు. గోదావరి పుష్కరాలపుడు మళ్లీ పైరవీతో బాసరకే చేరుకున్నారు. అప్పుడు మళ్లీ అవినీతి, అక్రమాలకు పాల్పడటంతో ఇలాంటి అధికారిని ఆలయానికి ఎందుకు తీసుకొచ్చారంటూ ఓ ట్రస్టు బోర్డు సభ్యుడు ఏకంగా తన పదవికే రాజీనామా చేశారు. ఇలా చేతులు మారాయి.. - 24–05–2017న మహారాష్ట్రకు చెందిన దుకాణదారుడి నుంచి బినామీ వ్యక్తి ఖాతా (ఎస్బీఐ 62211311029)లోకి రూ.1,50,000 జమ అయ్యాయి. అదేరోజు బినామీ వ్యక్తి తన ఖాతాలో నుంచి ఆలయానికి చెందిన ఓ ఉద్యోగి భార్య అకౌంట్ (62240751111)కు రూ.40 వేలు, రూ.20వేల చొప్పున రెండుసార్లు ట్రాన్స్ఫర్ చేశాడు. అలాగే చిన్నసారుకు సంబంధించిన ఓ మహిళ ఖాతా (62031507489)లోకి రూ.30 వేలు జమచేశాడు. - 29–05–2017న ఆలయ అధికారులు కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించి వచ్చిన ఎరియర్స్ రూ.1,05,192 లను ఓ కాంట్రాక్టు ఉద్యోగి అకౌంట్ (52170507610)లోకి జమ చేశారు. సదరు కాంట్రాక్టు ఉద్యోగి అందులో నుంచి వెంటనే బినామీ వ్యక్తికి చెందిన ఖాతా (62211311029)లోకి రూ.40 వేలు, రూ.30 వేల చొప్పున మొత్తం 70వేల రూపాయలు పంపించాడు. - 29–05–2017 రోజునే వాగ్దేవి కో–ఆపరేటివ్ లేబర్ సొసైటీ నుంచి చెక్ (నం.363101) ద్వారా బినామీ వ్యక్తి ఖాతాలోకి రూ.1,83,200 జమ అయ్యాయి. ఈ డబ్బులు ఆలయంలోని 86 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించినవిగా భావిస్తున్నారు. - ఆలయ సిబ్బంది ఎరియర్స్ 29–05– 2017న బినామీ వ్యక్తి ఖాతాల్లోకి వచ్చిన డబ్బుల్లో నుంచి 30–05–2017న రూ.40వేల చొప్పున ఐదుసార్లు అంటే మొత్తం రూ.2 లక్షలను ఉన్నతాధికారి కోడలి ఖాతా (62495094834)లోకి ట్రాన్స్ఫర్ అయ్యాయి. - 01–06–2017 రోజున బినామీ వ్యక్తి అకౌంట్ నుంచి ఆలయంలోని ఓ చిరు ఉద్యోగి ఖాతా (52170508400)లోకి రూ.10వేలు ట్రాన్స్ఫర్ అయ్యాయి. - 06–06–2017 రోజున బినామీ వ్యక్తి ఖాతా నుంచి ద్వితీయ స్థాయి అధికారి భార్య ఖాతా (52170497974)లోకి రూ.26వేలు చేరాయి. ఎంక్వైరీ చేయిస్తాం.. ఆలయంలో అధికారులు బినామీలను పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఇప్పటివరకు దృష్టికి రాలేదు. అలాంటిది ఏదైనా ఉంటే తప్పకుండా విచారణ చేయిస్తాం. ఈ విషయం నిజమని తేలితే ఎంతటి వారున్నా చర్యలు తీసుకుంటాం. నాకు వ్యక్తిగతంగా ఎలాంటి బినామీలు లేరు. ఇలాంటి ఆరోపణలపై విచారణ జరిపిస్తాం. – సుధాకర్‌రెడ్డి, ఈఓ, బాసర ఆలయం -
రూ.3లక్షలకే ఉద్యోగం..
సాక్షి, అమరావతి : పవిత్రమైన భగవంతుడి సన్నిధిలో గడిపే పోస్టులకూ ప్రభుత్వ పెద్దల అండతో బేరసారాలు జరుగుతున్నాయి. దేవాదాయ శాఖలో నిరుద్యోగులకు అవకాశం కల్పించటం ద్వారా భర్తీ చేయాల్సిన గ్రేడ్– 3 ఆలయ కార్యనిర్వాహక అధికారి(ఈవో) పోస్టులను సర్కారు వద్ద పలుకుబడి కలిగిన బ్రోకర్లు రూ. 3 లక్షల చొప్పున అమ్మకానికి పెట్టారు. ముందుగా లక్ష చొప్పున వసూలు చేసిన బ్రోకర్లు తాత్కాలిక సిబ్బందికి పదోన్నతులు కల్పించటం ద్వారా భర్తీ చేసేందుకు మెమో కూడా జారీ చేయించటం గమనార్హం. రంగంలోకి బ్రోకర్లు దేవాదాయ శాఖలో గ్రేడ్–3 ఈవో పోస్టులు 167 ఖాళీగా ఉన్నాయి. నిబంధనల ప్రకారం వీటిని ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయాలి. అయితే అందుకు విరుద్ధంగా ఆలయాల్లో పనిచేస్తున్న వారికి పదోన్నతులు కల్పించడం ద్వారా వీటిని భర్తీ చేసేందుకు బ్రోకర్లు రంగంలోకి దిగారు. నిరుద్యోగులతో భర్తీ చేయాల్సిన ఈ పోస్టులను పదోన్నతుల ద్వారా నియమించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ‘సాక్షి’ రెండేళ్ల కిత్రమే పలు కథనాలు ప్రచురించడంతో ఈ వ్యవహారం తాత్కాలికంగా ఆగింది. అయితే కొద్ది విరామం తరువాతబ్రోకర్లు మరోసారి దందాకు దిగారు. గుట్టుగా రూ.కోటిన్నర గుంజారు ఆలయాల్లో సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తింపు ఉండదు. ఆలయ ఆదాయం నుంచే వీరికి జీతభత్యాల చెల్లింపులు జరుగుతాయి. గ్రేడ్–3 ఈవో పోస్టును మాత్రం పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగిగా పరిగణిస్తారు. వీరికి ప్రభుత్వ ట్రెజరీల నుంచి జీతాలు చెల్లిస్తారు. ఈ నేపథ్యంలో ఆలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది పదోన్నతి ద్వారా గ్రేడ్ –3 ఈవో పోస్టు దక్కించుకుంటే పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగిగా పరిగణిస్తారనే ఉద్దేశంతో లక్షలు చెల్లించేందుకు సిద్ధపడటాన్ని బ్రోకర్లు అవకాశంగా మలుచుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 167 మందిని గుర్తించి ఒక్కొక్కరి నుంచి ముందుగా రూ.లక్ష చొప్పున వసూలు చేశారు. గుట్టుచప్పుడు కాకుండా రూ. కోటిన్నరకు పైగా గుంజారు. మంత్రి కార్యాలయానికీ వాటాలు..! బ్రోకర్లు నజరానాగా వాటాలు పంచడంతో పదోన్నతుల ద్వారా భర్తీకి అనుమతిస్తూ ఉన్నతాధికారులు మోమో కూడా జారీ చేసినట్టు సమాచారం. మోమో జారీలో ఓ మంత్రి కార్యాలయం ప్రమేయం ఉందన్న ప్రచారం జరుగుతోంది. అయితే మోమో జారీ అయిన తర్వాత కూడా పోస్టులు దక్కకపోవడంతో డబ్బులు సమర్పించుకున్నవారు ప్రస్తుతం సచివాలయంలోని దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్సింగ్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. -
గూడెంలో పసుపు కొనుగోలు కేంద్రం
తాడేపల్లిగూడెం : పసుపు రైతుల సమస్యను పరిష్కరించేందుకు తాడేపల్లిగూడెం వ్యవసాయ మార్కెట్ కమిటీలో పసుపు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు చెప్పారు. జిల్లాలోని పసుపు రైతులు తమ సమస్యలపై మంత్రికి శనివారం స్థానిక క్యాంప్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాడేపల్లిగూడెం, నల్లజర్ల మండలాలతో పాటు ఆచంట. పెనుగొండ మండలాల్లో రైతులు పసుపు పండిస్తున్నారన్నారు. వారి సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రితో మాట్లాడినట్టు చెప్పారు. రెండు, మూడు రోజుల్లో ఏఎంసీలో పసుపు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. సమాన పనికి సమానవేతనం రావడంలేదని 108 అంబులె న్స్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. జీవీకే సంస్థ నుంచి లీవ్‌ఎన్ క్యాష్మెంట్ సొమ్ములు రాక ఇబ్బందులు పడుతున్నట్టు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. ఈ సమస్యపై సీఎంతో మాట్లాడి అంబులె న్స్ సిబ్బందికి న్యాయం చేస్తామన్నారు. గోవధ నిరోధక చట్టం సంచలనం కేంద్రం తీసుకువచ్చిన గోవధ నిరోధక చట్టం సంచలనమని ఇలాంటి చట్టాన్ని తీసుకొచి్చన ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలుపుతున్నట్టు మంత్రి తెలిపారు. దేశంలో ఉండే అత్యధిక శాతం హిందువులు భగవంతునితో సమానంగా గోవును పూజిస్తారన్నారు. మోపురం ఉన్న దేశీయ ఆవుల పాల నుంచి తయారుచేసిన పదార్థాలలో రోగనిరోధకశక్తితో పాటు అద్భుతమైన ఆయుర్వేద గుణాలున్నాయని ప్రపంచం గుర్తించిదన్నారు. గత పాలకులు పిరికితనం, నిర్లక్ష్యం కారణంగా గోవులు కబేళాలకు తరలిపోతున్నాయన్నారు. ఎర్రకాల్వ ముంపు సమస్య పరిష్కారం కోసం నందమూరులో ఎర్రకాలువపై ఉన్న పాత అక్విడెక్ట్‌ను తొలగించే ప్రక్రియ తుదిదశకు చేరుకుందన్నారు. -
దేవాలయాలు ప్రభుత్వ అధీనంలో ఉండటం తప్పు
ఉండి: దేవాలయాలు ప్రభుత్వ అధీనంలో ఉండటం చాలా పెద్ద తప్పని దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అభిప్రాయపడ్డారు. మాజీ ఎమ్మెల్యే, జిల్లా రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజు సొంత నిధులు రూ.కోటి ఖర్చుతో నిర్మించిన శివాలయం రాజగోపురం, కలశస్థాపన కార్యక్రమాలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సినీ నటుడు తనికెళ్ళ భరణి స్వామికి అభిషేకాలు నిర్వహించారు. ముఖ్య అతిథి పాల్గొన్న మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మాట్లాడుతూ దేవాలయాలు దేవుడి సొత్తని, దానిపై ప్రభుత్వ అజమాయిషీ తగదని అన్నారు. తనే స్వయంగా నిర్మించిన ఒక దేవాలయ కమిటీ అధికారులతో కుమ్మక్సై 10 ఎకరాలు అమ్ముకున్న ఘటన ఆలస్యంగా వెలుగుచూసిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అటువంటి నాయకులపై వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. నాయకులు దేవాలయాలను కేంద్రంగా చేసుకుని రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఆలయాల పునఃనిర్మాణంలో ప్రజలు, దాతలు పాలుపంచుకోవాలని పిలుపు నిచ్చారు. రంగనాథరాజు సుమారు రూ.కోటి సొంత ఖర్చుతో ఇంతటి గొప్ప కార్యం చేయడం అభినందనీయమన్నారు. ఆలయ «నిర్వాహకుడు రంగనాథరాజు మాట్లాడుతూ ఎంత సంపాదించినా కలగని ప్రశాంతత దైవభక్తితో సమకూరుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సినీ నటుడు తనికెళ్ల భరణిని బంగారు కంకణంతో, ప్రముఖ గజల్స్ గాయకుడు గజల్ శ్రీనివాస్, శతావధాని కోటలక్ష్మీనరసింహంలను బంగారు గొలుసులతోనూ మంత్రి మాణిక్యాలరావు, చెరుకువాడ శ్రీరంగనాథరాజులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, మాజీ ఎమ్మెల్యే పసల కనకసుందరరావు తదితరులు పాల్గొన్నారు. అంతా శివోహం.. జగమంతా శివోహం.19 ఏళ్ల నుంచి నాటకరంగంపై మక్కువతో ఇంకా ప్రదర్శనలిస్తున్నాను. ఆధ్యాత్మికతపై మక్కువతో శివ భక్తుడిగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాను. మా పూర్వీకులు యండగంగి వాస్తవ్యులు కావడం, తెలుగు జాతి గర్వించదగ్గ కవులు కావడం నాకు చాలా ఆనందం. -తనికెళ్ల భరణి, సినీ నటుడు సంస్కృతీ సంప్రదాయాలు కాపాడాలి దేశంలో చాలా వరకు హిందూ దేవాలయాలు పాడుపడ్డ స్థితిలో ఉన్నాయి. వాటి పునఃనిర్మాణానికి ప్రజలు, దాతలు ,ప్రభుత్వం ముందుకు రావాలి. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడాలి. అలాగే పెద్దపెద్ద చదువులు చదివిన వారంతా విదేశాల బాటపట్టి భారతదేశంలో హిందుత్వానికి దూరమవుతున్నా. అలాంటి వారంతా దేవాలయాల అభివృద్ధికి సాయమందించాలి. నిర్మించిన ఆలయాలను ఆయా గ్రామాల ప్రజలంతా కాపాడుకోవాలి.-గజల్ శ్రీనివాస్, గజల్ గాయకుడు -
దుర్గమ్మ భూములకు ‘సిద్ధార్థ’ ఎసరు!
-
దుర్గమ్మ భూములకు ‘సిద్ధార్థ’ ఎసరు!
రూ.వెయ్యి కోట్ల భూముల కైంకర్యం.. నేడు కేబినెట్ తీర్మానం ► ప్రైవేట్ యాజమాన్యానికి 14.20 ఎకరాల అప్పగింత యత్నం ► రేపు మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై చర్చ ► ప్రస్తుతం అక్కడ సిద్ధార్థ విద్యా సంస్థల నిర్వహణ ► పదేళ్లుగా దేవాదాయ శాఖ, సిద్ధార్థ మధ్య వివాదం ► హైకోర్టులో దేవాదాయశాఖకు అనుకూల నిర్ణయం ► ప్రైవేట్‌కు అనుకూలంగా సర్కారు నిర్ణయం? ► రూ.కోట్లలో చేతులు మారిన సొమ్ము సాక్షి, అమరావతి: విజయవాడ నడిబొడ్డున కనకదుర్గ అమ్మవారి దేవస్థానానికి చెందిన రూ.1,000 కోట్ల విలువైన భూమికి రాష్ట్ర ప్రభుత్వం ఎసరు పెట్టబోతోంది. బెంజి సర్కిల్ సమీపంలో ఉన్న 14.20 ఎకరాల దుర్గ గుడి భూములను ప్రైవేట్‌పరం చేయడంపై కసరత్తు జరుగుతోంది. రెండు చోట్ల ఉన్న ఆ భూముల్లో ప్రస్తుతం సిద్ధార్థ అకాడమీ ఆధ్వర్యంలో విద్యా సంస్థలు కొనసాగుతున్నాయి. ఇక్కడ మార్కెట్ ధర ప్రకారం ఎకరం విలువ రూ.70 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ భూముల వ్యవహారంలో దేవాదాయ శాఖ, సిద్ధార్థ అకాడమీ యాజమాన్యాల మధ్య కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. తాము విద్యా సంస్థలు నిర్వహిస్తున్న భూములకు బదులుగా నగరం వెలుపల అంతే విస్తీర్ణంలో భూములు కొని, దుర్గగుడి పేరిట రాసిస్తామని సిద్ధార్థ యాజమాన్యం తాజాగా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. సోమవారం జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించి, తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. అసలేం జరిగిందంటే... విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయం పేరిట గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 225.74 ఎకరాల భూములున్నాయి. విజయవాడలోని పటమటలో సర్వే నంబరు 17లో ఉన్న 5.98 ఎకరాలను 50 ఏళ్లపాటు సిద్ధార్థ అకాడమీకి లీజుకిస్తూ 1973 డిసెంబర్ 6న అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ భూమిలో శ్రీదుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా జూనియర్ కళాశాలను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1980లో అదే సిద్ధార్థ అకాడమీకి మొగల్రాజపురంలో సర్వే నంబరు 76లో 8.22 ఎకరాల దుర్గ గుడి భూమిని కూడా 50 ఏళ్లపాటు లీజుకిస్తూ అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందులో పీబీ సిద్ధార్థ జూనియర్ కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అకాడమీని నెలకొల్పారు. ఎకరాకు రూ.5 వేల చొప్పున ఆయా భూములను అప్పటి ప్రభుత్వం సిద్ధార్థ అకాడమీకి లీజుకిచ్చింది. పదేళ్లకోసారి లీజు పెంచాలని నిబంధన విధించారు. ప్రభుత్వం వద్దకు రెండు ప్రతిపాదనలు భూముల లీజును రద్దు చేస్తూ 2006లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సమయానికి సిద్ధార్థ అకాడమీ ఎకరాకు రూ.9 వేల చొప్పున దుర్గ గుడికి చెల్లిస్తూ ఉండేది. ప్రభుత్వం అధికారికంగా భూముల లీజును రద్దు చేయడంతో గత పదేళ్లుగా సిద్ధార్థ అకాడమీ నుంచి లీజు మొతాన్ని జమ చేసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో సిద్ధార్థ అకాడమీ ఈ ఏడాది జూలై 4న రెండు రకాల ప్రతిపాదనలు చేస్తూ ప్రభుత్వానికి ఒక దరఖాస్తు సమర్పించింది. తమ అధీనంలో ఉన్న భూములకు ఎకరాకు ఏడాదికి రూ.1.25 లక్షల చొప్పున లీజు చెల్లింపునకు అనుమతించాలని, లేదంటే ఆ భూమికి బదులుగా నగరం వెలుపల వేరే ప్రాంతంలో దుర్గగుడికి అంతే విస్తీర్ణంలో భూములు కొనుగోలు చేసి, ఇచ్చేందుకు అనుమతించాలని కోరింది. ఇదే సమయంలో దేవాదాయ శాఖ, సిద్ధార్థ అకాడమీ మధ్య ఉన్న వివాదాన్ని 8 వారాల్లో సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునే లా సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు వెలువరించినట్లు అధికార వర్గాలు చెప్పాయి. నవంబర్ 16వ తేదీ నాటికి 8 వారాల గడువు ముగియనున్న నేపథ్యంలో కోర్టు మధ్యంతర ఉత్తర్వులను అడ్డం పెట్టుకొని ప్రభుత్వం సిద్ధార్థ అకాడమీకి భూములను అప్పగించడానికి సన్నద్ధమవుతున్నట్లు తెలిసింది. లీజు పెంపునకైతే మంత్రివర్గానికి అక్కరలేదు లీజు పెంపు ప్రతిపాదనలకైతే నిబంధనల ప్రకారం అధికారుల స్థాయిలోనే నిర్ణయం తీసుకోవచ్చు. సంబంధిత శాఖ మంత్రి అనుమతితో లీజు పెంపు నిర్ణయం వెలువరించవచ్చు. కానీ, మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించి, నిర్ణయం తీసుకోవాలన్న ప్రభుత్వ యోచనపై దేవాదాయ శాఖలో కొత్త చర్చ మొదలైంది. భూమికి బదులు భూమి ఇస్తామంటూ సిద్ధార్థ అకాడమీ చేసిన ప్రతిపాదనకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వ పెద్దలు ఈ అంశాన్ని మంత్రివర్గ సమావేశంలో చర్చకు పెడుతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో సిద్ధార్థ అకాడమీకి అనుకూలంగా నిర్ణయం వెలువడడానికి ఇప్పటికే రూ.కోట్లు చేతులు మారాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దుర్గగుడి భూములపై ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ జోక్యం చేసుకుంటున్నట్లు దేవాదాయ శాఖలో చర్చ సాగుతోంది. 50 ఏళ్ల లీజును తప్పుపట్టిన విజిలెన్స్ దుర్గ గుడి భూములను 50 ఏళ్లపాటు లీజుకివ్వడాన్ని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ విభాగం 2000లో తీవ్రంగా తప్పుపట్టింది. దీనివల్ల దుర్గ గుడికి అప్పటి అంచనాల ప్రకారం రూ.7.42 కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొంది. లీజు నియమ నిబంధనలను పున:పరిశీలించాలంటూ డెరైక్టర్ జనరల్ ఆఫ్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ విభాగాధిపతి 2001లో రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ ప్రక్రియలో భాగంగా 2006లో అప్పటి ప్రభుత్వం పాత లీజులను రద్దు చే సి, కొత్త లీజుపై నిర్ణయానికి సిద్ధార్థ అకాడమీని చర్చలకు ఆహ్వానించిందని దేవాదాయ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే, ప్రభుత్వం తమ లీజును రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై సిద్ధార్థ అకాడమీ న్యాయ పోరాటానికి సిద్ధమైంది. దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ కోర్టులోనూ ప్రభుత్వం లీజును రద్దు చేయడాన్ని సమర్థించగా, ఆ తర్వాత హైకోర్టు సైతం డిప్యూటీ కమిషనర్ కోర్టు నిర్ణయాన్ని సమర్థిస్తూ తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పుపై 2010లో సిద్ధార్థ అకాడమీ సుప్రీంకోర్టును అశ్రయించింది. 2010లో హైకోర్టు తీర్పు వెలువరించిన తర్వాత అప్పటి దేవాదాయ శాఖ మంత్రి గాదె వెంకటరెడ్డి దుర్గగుడి భూములకు లీజు పెంపుపై సిద్ధార్థ అకాడమీ యాజమాన్యంతో చర్చలు జరిపినా, అవి సఫలం కాలేదని దేవాదాయ శాఖ వర్గాలు తెలిపాయి. -
దేవాదాయ శాఖలో పోలీసు విజిలెన్స్
► ఏసీపీ, ఏఎస్పీ స్థాయి అధికారులతో ప్రత్యేక బృందం ► ఆక్రమణల తొలగింపునకు కలెక్టర్, ఎస్పీల సహకారం ► మంత్రివర్గ ఉపసంఘ కీలక నిర్ణయాలు సాక్షి, హైదరాబాద్: దేవాదాయ శాఖలో అవినీతి, అక్రమాలను నియంత్రించటంతో పాటు పాలనాపరంగా కొత్త విధానాలకు అవకాశం కల్పించేలా మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయాలు తీసుకుంది. దేవాదాయ శాఖకు సంబంధించి ఆ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం రెండో సమావేశం గురువారం జరిగింది. మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, జూపల్లి కృష్ణారావు, తలసాని శ్రీనివాసయాదవ్, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, దే వాదాయ శాఖ కార్యదర్శి శివశంకర్, జాయింట్ కమిషనర్లు కృష్ణవేణి, శ్రీనివాసరావు ఇందులో పాల్గొన్నారు. కమిటీలోని మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరుకాలేదు. ప్రత్యేక వింగ్...: దేవాలయాల్లో అడ్డూఅదుపూ లేకుండా అక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం విజిలెన్స్ విభాగం ఉన్నా అది అత్యంత బలహీనంగా మారింది. ఆ అధికారులకు ఇతర బాధ్యతలుండటంతో తనిఖీలు కూడా సాధ్యం కావటం లేదు. ఈ నేపథ్యంలో అదనపు ఎస్పీ స్థాయి పోలీసు అధికారి ఆధ్వర్యంలో ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ముగ్గురు సబ్ఇన్స్పెక్టర్లు, ఐదుగురు కానిస్టేబుళ్లతో ప్రత్యేక విజిలెన్స్ విభాగం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఏసీపీ స్థాయి అధికారిని దేవాదాయ శాఖ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా నియమిస్తారు. భూముల రక్షణ కోసం ప్రత్యేక వ్యవస్థ... ఆలయాలకు వేల ఎకరాల భూములున్నా చాలా వరకు కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. వాటిల్లో వెలసిన అక్రమ నిర్మాణాల తొలగింపు ఆ శాఖ వల్ల కావటం లేదు. రెవెన్యూ భూముల్లో ఉన్న ఆక్రమణల తొలగింపు ఎలా జరుగుతుందో దేవాదాయ శాఖలో కూడా ఆ తరహా వ్యవస్థ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సహకారం తీసుకుని ఆక్రమణలు తొలగించేందుకు వెసులుబాటు కల్పించాలని నిర్ణయించారు. వివిధ కోర్టుల్లో దాఖలయ్యే వ్యాజ్యాలను పరిశీలించేందుకు లీగల్ సెల్ ఏర్పాటు చేయనున్నారు. ‘ధూప దీప నైవేద్యం’ పరిధికి మరిన్ని గుళ్లు రాష్ట్రంలో 1805 ఆలయాలకు ధూపదీప నైవేద్య పథకం కింద నెలకు రూ.1.08 కోట్లు ప్రభుత్వం చెల్లిస్తోంది. జిల్లాల విభజన నేపథ్యంలో మరికొన్ని ఈ పథకం కిందకు తేవాలని నిర్ణయించారు. ఇటీవల ప్రభుత్వం సర్వశ్రేయోనిధికి 50 కోట్లు కేటాయించినందున వాటికి ఆ పథకాన్ని వర్తింపజేస్తారు. అర్చకుల వేతనాలపై దాటవేత... అర్చకులు, దేవాలయ ఉద్యోగుల వేతనాలను క్రమబద్ధం చేసే లక్ష్యంగా మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. కానీ రెండో సమావేశంలోనూ దీన్ని పక్కనపెట్టేశారు. అధికారుల కమిటీ విధానాలను ఖరారు చేసి ఉపసంఘం ముందుంచింది. మరిన్ని వివరాలు కావాలంటూ గురువారం దీనిపై నిర్ణయం తీసుకోలేదు. 653 ఆలయాలకు చెంది ఐదున్నర వేల మంది అర్చకులు, ఉద్యోగులకు దీనితో లబ్ధికలగాలి. మిగతా ఆలయాల్లోని సిబ్బంది విషయంలో కూడా నిర్ణయం తీసుకుంటే బాగుంటుందనే కోణంలో సీఎం ఉన్నట్టు తెలియటంతో కమిటీ దాన్ని పక్కనపెట్టినట్టు సమాచారం. దీపావళి కానుకగా శుభవార్త అందుతుందని వేలమంది అర్చకులు, ఉద్యోగులు ఎదురుచూసి నిరాశకు గురయ్యారు. మరోసారి ఉద్యమానికి సన్నద్ధం కావాలన్న డిమాండ్ రావటంతో కొద్ది రోజులు ఓపిక పడతామంటూ జేఏసీ నేతలు వారించారు. -
'దేవాదాయశాఖ గుడ్డిగా నడుస్తోంది'
విశాఖపట్టణం : రాష్ట్రంలో దేవాదాయశాఖ గుడ్డిగా నడుస్తోందని ఆ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా పరిషత్ సమావేశం హాల్లో శనివారం నిర్వహించిన ఉత్తరాంధ్ర జిల్లాల దేవాదాయ శాఖ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ శాఖలో పనిచేస్తున్న వారిలో బాధ్యతారాహిత్యం కనిపిస్తోందని మండిపడ్డారు. ఇక నుంచి సీరియస్‌గా పనిచేయకపోతే ఉద్యోగాలు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలని మాణిక్యాలరావు హెచ్చరించారు. ఉప కమిషనర్, సహాయ కమిషనర్ కార్యాలయాల్లో తప్పనిసరిగా కంప్యూటర్, కంప్యూటర్ ఆపరేటర్ ఉండాలని, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలని ఆదేశించారు. దేవాదాయశాఖకు సంబంధించిన వ్యవహారాలన్నీ ఇక నుంచి ఆన్లైన్ సిస్టమ్ ద్వారానే జరగాలని సూచించారు. ఆన్లైన్ సిస్టమ్‌పై సిబ్బందికి వర్క్‌షాప్ నిర్వహించి అవగాహన కల్పించాల్సి ఉందన్నారు. ఏ ఆలయంలో ఎంత మంది దర్శనం చేసుకుంటున్నారు. ఆదాయం ఎంత వస్తోంది.. తదితర అంశాలను ఏ రోజుకారోజు మెయిల్ ద్వారా పంపాలని ఆదేశించారు. పెద్ద ఆలయాల ద్వారా విద్యాదాన కార్యక్రమాలు నిర్వహించాలని, ఆలయ సేవ పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహించాలని, దేవుడి దర్శనానికి వచ్చే వికలాంగులు, వృద్ధుల కోసం వీల్చైర్లు, ర్యాంపులు ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తులను విసుక్కోకుండా గౌరవించి పంపాలని, భక్తులపై కేకలు వేస్తే సహించేది లేదన్నారు. దేవాలయాల ఆస్తులు కోర్టు పరిధిలో ఉంటే ప్రభుత్వం వైపు వచ్చేలా కృషి చేయాలని చెప్పారు. కార్యనిర్వహణాధికారుల పనితీరు, గతంలో వారు పనిచేసిన ఆలయాల్లో ఆదాయం ఎంత వచ్చేది? ప్రస్తుతం ఎంత వస్తోంది? తదితర అంశాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి మెయిల్ చేయాలని, దేవాలయాల ఆదాయం పెంచేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో దేవాదాయశాఖ కమిషనర్ వై.వి.అనురాధ, ఆర్జేడీ చంద్రశేఖర్ ఆజాద్, డిప్యూటీ కమిషనర్ మూర్తి, ఉత్తరాంధ్ర జిల్లాల ఆలయాల కార్యనిర్వహణాధికారులు పాల్గొన్నారు. -
ఆలయ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు
- దేవాదాయ శాఖలో దసరా కానుక - 16 వేల మంది ఉద్యోగులకు ప్రయోజనం అమరావతి : ఆలయాల్లో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 58 నుంచి 60 ఏళ్లకు పెంచుతూ దేవాదాయ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయ శాఖ ఆధీనంలో 24,507 ఆలయాలు, సత్రాలు, మఠాలు ఉన్నాయి. దాదాపు 16 వేల మంది ఆయా ఆలయాల్లో ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఆలయాల్లో పనిచేసే ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం ఉండదు. ఆయా ఆలయాలకు వచ్చే ఆదాయం నుంచే వారికి జీతభత్యాలు చెల్లింపులు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లకు పెరిగినప్పటికీ, ఆలయ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు ఇప్పటి వరకు 58 ఏళ్లే అమలవుతోంది. ఇప్పుడు ఆలయ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లకు పెంచుతూ దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ జీవో నెంబరు 444ను జారీ చేశారు. డిసెంబరు 1న విజయవాడకు దేవాదాయ శాఖ కమిషనరేట్ ఆంధ్రపద్రేశ్ దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం డిసెంబరు 1వ తేదీ నుంచి విజయవాడ కేంద్రంగా పనిచేయనుంది. జూన్ 27వ తేదీ నుంచే దాదాపు అన్ని ప్రభుత్వ శాఖల కమిషనరేట్ కార్యాలయాలు కొత్త రాజధాని అమరావతి ప్రాంతానికి తరలిరాగా, దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి శాశ్వత భవన నిర్మాణ పనులు మధ్యలో ఉన్న కారణంగా ఈ కార్యాలయం ప్రస్తుతం హైదరాబాద్ నుంచే పనిచేస్తోంది. డిసెంబరు 1న కార్యాలయం హైదరాబాద్ నుంచి విజయవాడకు సమీపంలోని గొల్లపూడిలోని శాశ్వత భవనానికి తరలించనున్నారు. కాగా, దేవాదాయ శాఖ మంత్రి పి. మాణిక్యాలరావు ఈ నెల 12వ తేదీ నుంచి వెలగపూడి సచివాలయ కేంద్రంగా కార్యకలాపాలు మొదలుపెట్టనున్నారు. -
ఏసీ ఒక సైకో..
దేవాదాయశాఖ ఉద్యోగుల డిమాండ్ ఏసీపై బిగుస్తున్న ఉచ్చు సిబ్బందంతా మూకుమ్మడి సెలవులు టర్నర్ చౌల్టీ్ర వద్ద వంటావార్పుతో నిరసన కొత్త కమిషనర్‌ను నియమించే వరకు పోరాటం ఆగదని స్పష్టం డాబాగార్డెన్: దేవాదాయశాఖ సహాయ కమిషనర్ ఇ.వి.పుష్పవర్థన్‌పై ఉచ్చు బిగుసుకుంటోంది. కార్యనిర్వహణాధికారులే కాదు.. ఆలయాల మేనేజర్లు, సిబ్బంది కూడా ఏసీ పై మండిపడతున్నారు. కార్యాలయంలో ఉన్న సిబ్బందంతా మాస్ లీవ్ పెట్టి మరీ కార్యనిర్వహణాధికారుల పోరాటంలో భాగస్వాములయ్యారు. ఈ మేరకు బుధవారం టర్నర్ చౌల్టీ్ర ప్రాంగణంలో దేవాదాయ శాఖ సిబ్బంది వంటా వార్పు కార్యక్రమం చేపట్టి నిరసన తెలిపారు. నియంతగా వ్యవహరిస్తున్న ఏసీ డౌన్ డౌన్.. అంటూ నినాదాలు చేశారు. మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధిస్తూ.. నిజారుుతీ ముసుగులో అవినీతి చేస్తున్న ఏసీపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కార్యాలయానికి వస్తున్న ఉప కమిషనర్ ఎన్వీఎస్ మూర్తి వాహనాన్ని అడ్డుకుని ఏసీని వెంటనే బదిలీ చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు. ఈ సందర్భంగా ఉప కమిషనర్ మాట్లాడుతూ మీ డిమాండ్‌ను..మీరిచ్చిన వినతి పత్రాన్ని అధికారుల దృష్టికి ఇప్పటికే తీసుకెళ్లినట్టు తెలిపారు. ఏసీ ఒక సైకో.. సహాయ కమిషనర్ ఒక సైకోల ప్రవర్తిస్తున్నాడని కార్యనిర్వాహణాధికారులు ఆరోపించారు. అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడుతున్నారని, మహిళా ఉద్యోగినులకు పక్కన కూర్చొబెట్టుకుని వేధిస్తున్నారన్నారు. ఒక్కొక్కర్ని టార్గెట్ చేసి సస్పెన్స చేస్తానని బెదిరిస్తూ మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారని వాపోయారు. ప్రేమసమాజానికి సంబంధించిన స్థల విషయంలో సారుుప్రియా రిసార్ట్స యాజమాన్యం వద్ద రూ.5లక్షలు అక్రమంగా తీసుకున్నారని ఆరోపించారు. 2014 ఆగస్టు ఒకటిన విధుల్లోకి చేరిన నాటి నుంచి నిరంకుశ ధోరణి సాగిస్తున్నారని మండిపడ్డారు. ఎటువంటి ఆరోపణలు లేకుండా, విచారణ చేపట్టకుండా సిబ్బందిని డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నారని దుయ్యబట్టారు. కొత్త సహాయ కమిషనర్‌ను నియమించే వరకూ సెలవులోనే కొనసాగుతామని హెచ్చరించారు. నల్లబ్యాడ్జీలతో నిరసన.. సహాయ కమిషనర్ ఇ.వి.పుష్పవర్థన్‌పై తక్షణ చర్యలు కోరుతూ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉద్యోగులు తలపెట్టిన సామూహిక సెలవులకు మద్దతుగా కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థాన ఉద్యోగుల సంక్షేమ సంఘం నల్ల బ్యాడ్జీలు ధరంచి సంఘీభావం తెలిపారు. మరో వైపు నిన్నమొన్నటి వరకు ఏసీకి అనుకూలంగా వ్యవహరించిన వారంతా ఉద్యమిస్తున్న ఉద్యోగులకు మద్దతు ప్రకటించడంతో ఏసీ ఏకాకిగా మిగిలారు. నేటి నుంచి నిరాహారదీక్షలు.. మాస్ లీవ్‌లో భాగంగా జిల్లా దేవాదాయశాఖ ఉద్యోగులు, ఆలయాల మేనేజర్లు, సిబ్బంది అందరూ గురువారం నుంచి నిరాహారదీక్షలకు దిగనున్నట్టు కార్యనిర్వహణాధికారుల సంఘం అధ్యక్షుడు అల్లు జగన్నాథం, కార్యదర్శి బండారు ప్రసాద్, సహాయ కార్యదర్శులు శ్రీనివాసరావు, ఎం.ఎల్.ఎన్.శాస్తి్ర, కార్యనిర్వహణాధికారులు కె.శిరీష, భానురాజా అధిక సంఖ్యలో ఈవోలు, ఆలయాల మేనేజర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
యాగాల వల్లే దేశం సుభిక్షం
అన్నవరప్పాడు (పెరవలి) : వేద పండితులు నిర్వహిస్తున్న యాగాలు, అర్చకులు చేస్తున్న పూజల వల్లనే దేశం సుభిక్షంగా ఉందని దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సీహెచ్ దుర్గాప్రసాద్ పేర్కొన్నారు. మండలంలోని అన్నవరప్పాడు వేంకటేశ్వరస్వామి ఆలయంలో వేద పండితుడు ఖండవల్లి సూర్యనారాయణ చార్యులు రచించిన ‘సంక్షిప్త ప్రతిష్ఠా సరళి గ్రం«థం’ను గురువారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 1721 దేవాలయాలకు గాను 710 దేవాదాయ శాఖా అధీనంలో ఉన్నాయని అన్నారు. వీట న్నింటికీ కమిటీలు వేస్తున్నామని, ఇప్పటికీ 80 శాతం పూర్తి చేశామని చెప్పారు. జిల్లాలో ప్రముఖ దేవాలయాలైన భీమవరం మావుళ్లమ్మ అమ్మవారు, ద్వారకా తిరుమల శ్రీవారి ఆలయాలను కలుపుతూ టూరిజం ఏర్పాటు చేస్తున్నామని, ఇది త్వరలోనే భక్తులకు అందుబాటులోకి వస్తుందని చెప్పారు. గత నెలలో దేవాలయాలన్నింటిలో నిర్వహించిన వరుణ, అరుణయాగం, సహస్ర ఘటాభిషేకం వల్లనే మూడు రోజులుగా రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయని తెలిపారు. శాస్త్రాలు, పురాణాలు ఆధారంగా క్రతువుల్లో చేసే యాగాల ఫలమే ప్రపంచశాంతికి, దేశ సుఖశాంతులకు దోహదం చేస్తున్నాయని అన్నారు. తొలుత ఆయనకు పండితులు వేద మంత్రాల నడుమ పూర్ణకుంభంతో స్వాగతం పలకగా వేదపండితులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఆ శాఖ ఇ¯Œæస్పెక్టర్ శ్రీనివాస్, ఈవో వీఎస్ఎస్ బ్రహ్మారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
పూర్తయ్యేనా స్వామీ!
గద్వాల: కృష్ణా పుష్కరాలకు గడువు సమీపిస్తున్నా.. దేవాదాయశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న పనులు నత్తనడకన సాగుతున్నాయి. పుష్కరాల కోసం గద్వాల నియోజకవర్గపరిధిలోని పలు ఆలయాలకు ప్రభుత్వం రూ.64లక్షల నిధులు కేటాయించింది. మంజూరైన నిధులతో చేపట్టిన పనులు సైతం నత్తను తలపిస్తున్నాయి. ఈ నిధులతో ఆలయాలన్నింటికీ రంగులు, ఆధునికీకరణ, చలువరాళ్ల ఏర్పాటు, మండపాల ఏర్పాటు, విద్యుదీకరణ, షెడ్ల నిర్మాణం ప్రతిపాదించారు. అధికారులు ఆలస్యంగా టెండర్లు పిలవడంతో పనుల్లో జాప్యం నెలకొంది. బిడ్లు పిలిచి ఒప్పందాలు కుదుర్చుకోవడంలోనే పుణ్యకాలం కాస్త కరిగిపోయింది. ఫలితంగా ఆలయాల పనులు నత్తతో పోటీ పడుతున్నాయి. నెల రోజుల క్రితం ఆలయ నిర్మాణ పనులు చేపట్టారు. అలయాల అభివృద్ధికి, అధికారులు ప్రతిపాదించిన వాటికి, ప్రస్తుతం జరుగుతున్న వాటికి పొంతనలేని పరిస్థితి నెలకొంది. దివి గ్రామమైన గుర్రంగడ్డలో కొలువైన జమ్ములమ్మ అమ్మవారి ఆలయ మండప నిర్మాణంలో జాప్యం నెలకొంది. రూ.12లక్షల వ్యయంతో నిర్మాణ పనులను చేపట్టారు. ప్రస్తుతం పిల్లర్లు వేసి వదలివేశారు. పుష్కరాలు పూర్తయినా నిర్మాణం పూర్తయ్యే పరిస్థితిలో లేదు. నది అగ్రహారంలోని ఆలయాల సముదాయాలకు రూ.20 లక్షలు మంజూరయ్యాయి. వీటితో స్ఫటిక లింగేశ్వర ఆలయం, శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర ఆలయం, రామావధూతల ఆలయాలు, ఆంజనేయస్వామి, సంతాన వేణుగోపాలస్వామి తదితర ఆలయాల మరమ్మతులు కొనసాగుతున్నాయి. స్ఫటిక లింగేశ్వర ఆలయానికి షెడ్ల నిర్మాణం కొనసాగుతోంది. సంతాన వేణుగోపాలస్వామి ఆలయ మండపం పైకప్పు వేశారు. పుష్కరకాలం నాటికి సిమెంట్ పనులు మాత్రమే పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది. రంగులు, తదితర ఆధునికీకరణ పనులు ప్రశ్నార్థకంగా మిగిలే అవకాశం ఉంది. చింతరేవుల ఆలయ ప్రాంగణంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఆలయ నిర్మాణానికి వేసే చలువరాళ్ల పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఆలయం చుట్టూ పై భాగాన ఆధునికీకరణ పనులు చేపట్టారు. జమ్ములమ్మ ఆలయ ప్రాంగణంలో మాత్రమే దాదాపు పనులు పూర్తి కావచ్చాయి. రూ.12లక్షల వ్యయంతో పుష్కర అభివృద్ధి పనులు చేపట్టారు. ఒకటి, రెండు రోజుల్లో పనులు మొత్తం పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
దేవుళ్లకు శఠగోపం!
దేవాలయ భూములు: 22,959 ఎకరాలు సర్వే పూర్తయినవి: 18,134 ఎకరాలు దేవాదాయ శాఖ ఆధీనం: 14,392 ఎకరాలు ఆక్రమణకు గురైనవి: 4 వేల ఎకరాలు సింహభాగం అధికార పార్టీ నేతల గుప్పెట్లో.. జిల్లాలో దేవాదాయశాఖ ఆధీనంలో ఉన్న భూములపై కబ్జాదారులు కన్నేశారు. ఏకంగా దేవుళ్లకే శఠగోపం పెడుతూ అందిన కాడికి ఆక్రమించేశారు. పెపైచ్చు బినామీ పేర్లతో రికార్డులు సృష్టించి విక్రయించేందుకూ యత్నిస్తున్నారు. అగ్నికి ఆజ్యం తోడైనట్లు వీరికి పాలకులు, రెవెన్యూ అధికారులు దన్నుగా ఉండడంతో అక్రమార్కులు మూడు కుంటలు.. ఆరు ఎకరాలు అన్న చందంగా కబ్జా చేసేస్తున్నారు. ఆక్రమణదారుల్లో సింహభాగం తెలుగు తమ్ముళ్లదే’. చిత్తూరు(రూరల్): చిత్తూరు జిల్లాలో ఆలయ భూముల ఆక్రమణ పర్వం యథేచ్ఛగా కొనసాగుతోంది. దేవుళ్లకు సంబంధించి 6 ఏ కేటగిరీ కింద 5 ఆలయాలు, 6 బీ కేటగిరీ కింద 25 ఆలయాలు, 6 సీ కేటగిరీ కింద 3170 ఆలయాలు ఉన్నాయి. అలాగే సత్రాలు 277, మఠాలు 33 ఉన్నాయి. దీనికి సంబంధించి జిల్లాలో దేవాదాయశాఖ లెక్కల ప్రకారం భూములు 22,959 ఎకరాలు ఉండాలి. అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు మీ ఇంటికి-మీ భూమిలో భాగంగా దేవాదాయ శాఖ భూములపై ఏడాది పాటు సర్వే చేపట్టారు. ఈ సర్వేలో మొత్తం 18,134 ఎకరాల భూములు మాత్రమే సర్వే చేయగలిగారు. ఇందులో 14,392 మాత్రం దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్నట్లు, మిగతా 4 వేల ఎకరాల భూమి ఆక్రమణకు గురైనట్లు అధికారులు సర్వేలో తేల్చారు. సర్వే చేపడుతున్న సమయంలో పలు ప్రాంతాల్లో అడ్డంకులు వచ్చాయి. ఆక్రమణకు గురైన దేవాదాయ భూముల్లో చాలా వరకు టీడీపీ నాయకుల చేతిలోనే ఉన్నాయి. కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలంలోని వేణుగోపాల స్వామి, విరుపాక్షమ్మ ఆలయ భూములు సుమారు 50 ఎకరాల వరకు ఓ టీడీపీ నాయకుడి ఆధీనంలోనే ఉంది. దీనిపై సంబంధిత అధికారులు ప్రశ్నిస్తే బెదిరింపులకు గురిచేస్తున్నారు. సీంఎం పేరును వాడుకుని రెచ్చిపోతున్నారు. పెనుమూరు మండలంలోని రామలింగేశ్వర ఆలయ భూములు, పుంగనూరు మండలంలోని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయ, చౌడేపల్లి మండలంలోని మృత్యంజయ స్వామి ఆలయ, వేణుగోపాల స్వామి ఆలయాల భూములు 180 ఎకరాల వరకు టీడీపీ నాయకులు ఆక్రమణలు చేసుకోని దేవాదాయ శాఖ భూములకే శఠ గోపం పెట్టారు. ఇలా అనేక మండలంలోని ఉన్న దేవాదాయ శాఖ ఆస్థులపై టీడీపీ నాయకులు బరితెగించి ఆక్రమణలు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నారు. తిరుపతిలో నో సర్వే.. తిరుపతి నగరంలో 8 వేల ఎకరాల్లో ఉన్న దేవాదాయ శాఖ భూములపై సర్వే జరగలేదు. దీనిపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీడీపీ నాయకులకు.. అధికారులు అమ్ముడు పోయారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేల కోట్ల భూములు ఆక్రమణ... ఒక్క శ్రీకాళహస్తిలో మాత్రమే 2 వేల ఎకరాల భూములను ఆక్రమణదారులు దోచుకున్నారు. ఇక్కడ అడుగు భూమి రూ.7 నుంచి రూ.10 వేల వరకు పలుకుతోంది. కోట్లాది రూపాయలు విలువైన భూములను ఆక్రమణదారులు వారి ఆధీనంలో ఉంచుకుని పెత్తనం చెల్లాయిస్తున్నారు. అలాగే చిత్తూరులో 331 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి. రామసముద్రం మండలంలో 282 ఎకరాలు, ఏర్పేడు 37, చంద్రగిరి, 20, పిచ్చాటూరు 24, పెనుమూరు 35, నిండ్ర, 2, వడమాల పేట 30, సదుం 250, నాగాల పురం 25, చిన్నగొట్టికల్లు 34, చౌడేపల్లి 26, కలకడ 29,పులిచెర్ల 26, పెద్దమాండ్యం 24, పుత్తూరు 24, ఐరాల 10, కురబలకోట 100, సత్యవేడు 84, రేణిగుంట 49, కలికిరి 16, బంగరుపాళ్యం 10, తవణంపల్లి 20, పాకాల 84, పెద్ద తిప్పసముద్రం 37, మదనపల్లి 43, కుప్పం 14, గుడిపల్లె 26, శాంతిపురం 15, బెరైడ్డిపల్లి 27 ఎకరాల్లో దేవాదాయ శాఖ భూములు అన్యాక్రాంతమయ్యాయి. ఇతర మండలాల్లోనూ చిన్నా చితకా ఆక్రమణలు చోటు చేసుకున్నాయి. ఈ విషయం సంబంధిత జిల్లా అధికారులు తెలిసిన మౌనం పాటిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఆదాయానికి గండి... దేవాదాయశాఖ ఆధీనంలోని భూములు వేల ఎకరాల్లో ఆక్రమణకు గురవడంతో లక్షల రూపాయల మేరకు ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది. ఓ అంచనా ప్రకారం సంవత్సరానికి ఈ భూముల నుంచి రూ. 80 లక్షల ఆదాయం రావాల్సి ఉండగా, రూ.55 లక్షలు మాత్రమే వస్తోంది. ఆక్రమణకు గురైన భూములను స్వాధీనం చేసుకుంటే అదనంగా మరో రూ. 25 లక్షలకు పైగా దేవాదాయశాఖకు ఆదాయం వచ్చే అవకాశాలున్నాయి. ఉన్నతాధికారులైనా చర్యలు తీసుకోవాల్సి ఉంది. -
దేవాదాయ శాఖలో ఉద్యోగి ఆత్మహత్యాయత్నం
కడప: దేవాదాయశాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న వ్యక్తి కార్యాలయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ సంఘటన కడప పట్టణంలోని కో-ఆపరేటివ్ కాలనీలో ఉన్న దేవాదాయశాఖ కార్యాలయంలో సోమవారం వెలుగు చూసింది. కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న టి. రాములు(50) ఎప్పటిలాగే ఈ రోజు కార్యాలయానికి వచ్చాడు. ఎవరు గమనించని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఇది గమనించిన తోటి ఉద్యోగులు అతన్ని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఈ పాపం ఎవరిది..?
ఏడాదిగా నిలిచిన రిజిస్ట్రేషన్లు దేవాదాయశాఖ అధికారుల నిర్వాకంతో ఇక్కట్లు ఎన్ఓసీ కోసం ఎదురుచూస్తున్న విక్రయదారులు నెల్లిమర్ల: దేవాదాయ శాఖ అధికారులు చేసిన నిర్వాకంతో నెల్లిమర్ల పట్టణ వాసులు అవస్థలు పడుతున్నారు. వారి నిర్లక్ష్యం కారణంగా ఏడాది కాలంగా పట్టణంలోని పలు ఇళ్లు, ఇళ్ల స్థలాలు, షాపుల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. పట్టణంలోని ప్రధాన రహదారికి ఎదురుగా ఉన్న ఆస్తుల క్రయవిక్రయాలన్నీ ఆగిపోయాయి. ఇంత జరుగుతున్న ఆ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారంటే ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్న పట్టణవాసులు.. నెల్లిమర్ల పట్టణంలోని విజయనగరం-పాలకొండ ప్రధాన రహదారికి ఎగువనున్న సర్వేనంబరు 104 సబ్‌డివిజన్ 1లోని స్థలాలన్నీ జిరాయితీనే. ఈ సర్వేనంబరులో సుమారు 14 ఎకరాల స్థలముంది. స్థానికులు దశాబ్దాల తరబడి ఇక్కడ పక్కా ఇళ్ళు, షాపులు నిర్మించుకుని ఉంటున్నారు. కానీ ఏడాది కాలంగా ఈ ప్రాంతంలోని ఆస్తుల క్రయ విక్రయాలు ఆగిపోయాయి. దీనికి కారణం కేవలం దేవాదాయ శాఖ అధికారులు చేసిన తప్పిదమేనని స్థానికులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఈప్రాంతంలోని భూమంతా దేవాదాయ శాఖదేనని, వాటిని రిజిస్ట్రేషన్ చెయ్యోద్దని ఆ శాఖాధికారులు గతంలో నెల్లిమర్ల సబ్ రిజిస్టార్కు వినతి ఇచ్చారు. దీంతో అప్పటినుంచి ఆ సర్వే నంబరులోని స్థలాలను రిజిస్ట్రేషన్లను నిలిపివేశారు. వాస్తవానికి మండలంలోని గొర్లిపేట గ్రామానికి చెందిన సర్వే నంబరు 104లోని సబ్‌డివిజన్ 1లోని భూమి రామతీర్థం దేవస్థానానికి చెందిది. కానీ అప్పట్లో గొర్లిపేట వీఆర్వో పొరపాటున సర్వే నంబరును రిజిస్టార్ కార్యాలయానికి అందించినట్లు సమాచారం. దీంతో అప్పటినుంచి ఇక్కడున్న ఆస్తుల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. రోడ్డుకు ఎగువన పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఆర్వోబి వరకు ఉన్న స్థలాల్లో ఒక్కటి కూడా క్రయవిక్రయాలు జరుపుకోలేదు. దేవాదాయశాఖకు చెందిన భూముల సర్వే నంబర్ల జాబితా నుంచి ఈ ప్రాంతాన్ని తొలగించాలని స్థానికులు మొరపెట్టుకుంటున్నా వినే నాథుడే కరువయ్యాడు. ఇప్పటికైనా దేవాదాయశాఖ అధికారులు కల్పించుకుని నెల్లిమర్ల పట్టణంలోని సర్వేనంబరు 104 సబ్ డివిజన్ 1లోని భూములను దేవాదాయశాఖ భూముల జాబితానుంచి తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. -
ఏపీలోని ఆలయాల్లో బాణాసంచాపై నిషేధం
హైదరాబాద్: కొల్లాం ఆలయంలో చోటుచేసుకున్న పెను విషాదం నుంచి అన్ని రాష్ట్రాలూ పాఠాలు నేర్చుకుంటున్నాయి. ఈ క్రమంలో ముందడుగు వేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో బాణాసంచా వినియోగాన్ని నిషేధించింది. ఇక నుంచి ఏ గుడిలో ఎలాంటి ఉత్సవం జరిపినా ఆ సందర్భంగా పటాకులు పేల్చే కార్యక్రమాన్న చేపట్టవద్దని రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ అధికారులను ఆదేశిచింది. ఒకవేళ ఏదైనా ఉత్సవంలో బాణాసంచా ఉపయోగించడం తప్పనిసరి ఆచారమైతే, అలాంటి సందర్భంలో జిల్లా ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకోవాలని సర్కారు సూచించింది. ఈ మేరకు దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. నాలుగు రోజుల కిత్రం కేరళలోని కొల్లం జిల్లాలో పుట్టింగల్ అమ్మవారి ఆలయ ఉత్సవంలో బాణా సంచా పేల్చుతూ అగ్ని ప్రమాదం చోటుచేసుకొని వంద మందిపైగా మృతి చెందడంతో ప్రభుత్వం రాష్ట్రంలోని ఆలయాల్లో భద్రతా చర్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఏడాదికి రూ. 25 వేలకు పైబడి ఆదాయం ఉండే ఆలయంలో అగ్ని ప్రమాద నివారణకు స్థానిక ఆలయ అధికారులు జిల్లా ఫైర్ ఆఫీసర్ సూచనల అమలు చేయాలని ఆదేశించారు. అన్నదాన, ప్రసాద పాకశాల వద్ద పందిళ్ల ఏర్పాటుపై ఆలయ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని.. రథోత్సవం, దీపోత్సవం, తెప్పోత్సవం వంటి కార్యక్రమాల సందర్భంగా ఎలాంటి ప్రమాదాలకు అవకాశం లేకుండా అన్ని జాగ్రత్తలు చేపట్టాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా చేశారు. టీటీడీ పరిధిలో సైతం అగ్నిప్రమాదాల నివారణ విషయంలో అక్కడి ఈవో ప్రస్తుత పరిస్థితులపై మరోసారి పూర్తి స్థాయి సమీక్ష జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది. -
ఉగాది నుంచి ఉచిత ఆలయ దర్శనం
- 1.30 లక్షల మందికి వర్తింపు - కొత్త కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన దేవాదాయ శాఖ తిరుపతి(చిత్తూరు జిల్లా) ఉగాది నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత ఆలయ దర్శిని కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో ఆదివారం ప్రకృతి వ్యవసాయ సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ 1.30 లక్షల మందికి ఐదు మార్గాల ద్వారా రాష్ట్రంలోని ఆలయాలను దర్శించే ఏర్పాటు చేస్తున్నామన్నారు. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి భోజనం, వసతి, వాహన సదుపాయం ఉచితంగా ఏర్పాటుచేస్తామన్నారు. ఐదు రూట్లుగా విభజించి ఆలయాల దర్శనానికి ఏర్పాట్లు చేశామన్నారు. -
సర్వశ్రేయోనిధికి రూ.50 కోట్ల గ్రాంటు
సాక్షి, హైదరాబాద్: దేవాదాయ శాఖ సర్వశ్రేయోనిధికి ప్రభుత్వం రూ.50 కోట్లు గ్రాంటుగా ప్రకటించింది. పురాతన దేవాలయాల జీర్ణోద్ధరణ, కొత్త ఆలయాలను ధూపదీప నైవేద్యాల పథకం కిందకు తేవటం, బలహీన వర్గాల కాలనీల్లో రామాలయాల నిర్మాణం కోసం ఈ నిధులు వినియోగిస్తారు. బలహీన వర్గాల వాడల్లో రామాలయాల నిర్మాణ పనులకు సంబంధించి దాదాపు రూ.43 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ఈ నేపథ్యంలో కనీసం రూ.100 కోట్లు కావాలంటూ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఇటీవల సీఎంను కోరారు. ఇక యువజన వ్యవహారాలు, పర్యాటక, సాంస్కృతిక శాఖకు రూ.232 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. సాంస్కృతిక సారథికి రూ.25 కోట్లు అడగ్గా.. రూ.15 కోట్లు ప్రకటించారు. -
భద్రాద్రిలో అసలేం జరుగుతోంది?
విగ్రహాల బంగారు తాపడంపై ‘దేవాదాయ’ వివరణ కోరిన సీఎం సాక్షి, హైదరాబాద్: భద్రాచలం శ్రీరామచంద్రస్వామి దేవాలయంలో స్వామివారి పురాతన విగ్రహాల బంగారు తాపడంలో గోల్‌మాల్‌పై సీఎం కేసీఆర్ దేవాదాయ శాఖ కార్యదర్శి శివశంకర్‌ను వివరణ కోరారు. రామదాసు కాలం నాటి పురాత న విగ్రహాలకున్న బంగారు తాపడం జీర్ణం కావటంతో కొత్తవి చేయించే క్రమంలో జరిగిన గందరగోళంపై ఇటీవల పత్రికల్లో వార్తలు ప్రచురితమయ్యాయి. ఈ గందరగోళమేంటో, అసలు ఆలయంలో జరుగుతున్న పనులేంటో తనకు తెలపాల్సిందిగా సీఎం కేసీఆర్ ఆ శాఖ కార్యదర్శిని ఆదేశించారు. ఈ మేరకు రెండు రోజుల క్రితం సీఎం కార్యాలయం నుంచి దేవాదాయశాఖ కార్యదర్శి కార్యాలయానికి శ్రీముఖం అందింది. విగ్రహాల తాపడం కోసం ఎంత బంగారాన్ని కరిగించారు, దాని నాణ్యత, విలువ, అందుకు దేవాదాయశాఖ నుంచి అనుమతులున్నాయా, కొత్తగా మరికొంత బంగారాన్ని కరిగించేందుకు నగరంలోని మింట్‌కు తరలించటం లాంటి అంశాలపై ఎలాంటి విషయాలూ బయటకు పొక్కకుండా జాగ్రత్త పడటంపై అనుమానాలు వెల్లువెత్తాయి. దీనిపై దేవాదాయశాఖ కమిషనర్ శివశంకర్ అధికారుల వివరణ కోరారు. ఈ విషయంలో అధికారులు వ్యవహరించిన తీరును కూడా ఆయన తప్పుపట్టినట్టు తెలిసింది. మరోవైపు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కూడా దీనిపై అధికారులను వివరణ కోరారు. మీడియాపై ఆంక్షలు భద్రాచలం: భద్రాచలం దేవ స్థానం అధికారులు తమ తప్పిదాలు బయటపడకుండా ఉండేందుకు ఏకంగా మీడియాపైనే ఆంక్షలు విధించారు. ఆలయ ఉద్యోగులు, అధికారులు, వైదిక సిబ్బంది తన అనుమతి లేకుండా మీడియాతో మాట్లాడటానికి వీల్లేదంటూ ఈఓ జ్యోతి ఈ నెల 1న అత్యవసర సర్క్యులర్ జారీ చేశారు. ఇటీవల కాలంలో ముఖ్యమైన విషయాలు తన అనుమతి లేకుండానే మీడియూకు తెలియటం వల్ల దేవస్థానం కీర్తిప్రతిష్టలకు భంగం కలిగించేలా కథనాలు వచ్చాయని అందులో పేర్కొన్నారు. ఇక నుంచి ఆలయ సమాచారాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి అనుమతి మేరకు పేషీ ద్వారానే మీడియాకు ఇవ్వాలని ఆదేశించారు. ఇందుకు భిన్నంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదిలావుంటే... తొందపాటు నిర్ణయాలతో విమర్శల పాలవుతున్న ఈఓ జ్యోతి హైదరాబాద్‌కు బదిలీ అయినట్టు ప్రచారం సాగుతోంది. -
‘అసైన్డ్’ వివరాలను రిజిస్ట్రార్లకు పంపాలి
♦ విస్తృత ధర్మాసనం తీర్పును అమలు చేయాల్సిందే ♦ ఆ తీర్పు ఆధారంగా పిటిషనర్ల డాక్యుమెంట్లపై నిర్ణయం తీసుకోండి ♦ గడువులోగా నిషేధిత భూముల జాబితా రూపొందించండి ♦ ఏపీ, తెలంగాణ అధికారులకు హైకోర్టు ధర్మాసనం ఆదేశం సాక్షి, హైదరాబాద్: నిషేధిత భూముల జాబితా తయారీకి సంబంధించి విస్తృత ధర్మాసనం ఇచ్చిన తీర్పును తప్పనిసరిగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రెవెన్యూ, దేవాదాయ శాఖలు, వక్ఫ్ బోర్డు అధికారులను హైకోర్టు ఆదేశించింది. విస్తృత ధర్మాసనం నిర్దేశించిన గడువులోగా నిషేధిత భూముల జాబితాను తయారు చేసి, ఆయా సబ్ రిజిస్ట్రార్లకు పంపాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇతరులకు బదలాయించరాదన్న నిబంధనలతో కేటాయించిన అసైన్డ్ భూముల జాబితాను సైతం సబ్ రిజిస్ట్రార్లకు పంపాలని పేర్కొంది. 1954కు ముందే అసైన్డ్ భూములను పొంది ఉంటే వాటి వివరాలను, ఆ భూములకు 1977 అసైన్డ్ భూముల చట్టం వర్తించే విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పులను రెవెన్యూ అధికారుల ముందుంచాలని పిటిషనర్లను ఆదేశించింది. రిజిస్ట్రేషన్ల చట్టం సెక్షన్ 22ఎ కింద నిషేధిత భూముల జాబితాను తాజా వివరాలతో సవరించే(అప్డేట్) ముందు పిటిషనర్లు సమర్పించే వివరాలను పరిశీలించాలని అధికారులకు సూచించింది. ఒకవేళ 1954 కంటే ముందు అసైన్ చేసిన భూములను వేటినైనా నిషేధిత జాబితాలో చేర్చాలని నిర్ణయిస్తే, అందుకు సంబంధించి సెక్షన్ 22ఎ(1)(ఈ) కింద నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. ఈ నోటిఫికేషన్‌పై ఎవరికైనా అభ్యంతరాలుంటే వారు చట్టం ప్రకారం ముందుకెళ్లవచ్చని వెల్లడించింది. ఆ డాక్యుమెంట్లపై నిర్ణయం తీసుకోండి కోర్టు మధ్యంతర ఉత్తర్వుల ఆధారంగా తమ ముందున్న పిటిషన్లు, అప్పీళ్లలో ఏవైనా డాక్యుమెంట్లను అధికారులు రిజిస్టర్ చేసి ఉంటే, అది విస్తృత ధర్మాసనం ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా అధికారులు తీసుకునే తుది నిర్ణయానికి లోబడి ఉంటుందని హైకోర్టు తెలిపింది. ఇప్పటికే రిజిస్టర్ చేసిన డాక్యుమెంట్ల విషయంలో విస్తృత ధర్మాసనం తీర్పునకు అనుగుణంగా ఆ రిజిస్ట్రేషన్లను ఖరారు చేయడమా? లేక రద్దు చేయడమా? ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని రిజిస్ట్రేషన్ అధికారులకు స్పష్టం చేసింది. ఈ మొత్తం ప్రక్రియను విస్తృత ధర్మాసనం నిర్దేశించిన నాలుగు నెలల గడువు పూర్తయిన తరువాత నుంచి మూడు నెలల్లోగా పూర్తి చేయాలంది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన హైకోర్టు ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భూముల వర్గీకరణ, రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వానికి, ప్రైవేట్ వ్యక్తులకు మధ్య నెలకొన్న వివాదానికి సంబంధించి కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న 1,633 వ్యాజ్యాలను జస్టిస్ బొసాలే నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారించింది. రిజిస్ట్రేషన్ల చట్టంలోని సెక్షన్ 22ఎ విషయంలో ఇటీవల ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనం జారీ చేసిన మార్గదర్శకాలు, తీర్పును దృష్టిలో పెట్టుకుని ఈ వ్యాజ్యాలను పరిష్కరిస్తూ తీర్పునిస్తున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది. నిషేధిత భూముల జాబితాను రూపొందించేందుకు విస్తృత ధర్మాసనం నిర్ధేశించిన గడువు పూర్తయిన తరువాత ఈ వ్యాజ్యాల్లోని పిటిషనర్లు, తమ భూముల రిజిస్ట్రేషన్ నిమిత్తం సంబంధిత సబ్ రిజిస్ట్రార్ల ముందు డాక్యుమెంట్లను సమర్పించవచ్చని తెలిపింది. సబ్ రిజిస్ట్రార్లు విస్తృత ధర్మాసనం తీర్పును పరిగణనలోకి తీసుకుని పిటిషనర్ల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించింది. డాక్యుమెంట్లను సమర్పించేటప్పుడు వాటితోపాటు విస్తృత ధర్మాసనం ఇచ్చిన తీర్పు కాపీని కూడా జత చేయాలని పిటిషనర్లను ఆదేశించింది. -
11 మందితో ఆగమ సలహా మండలి ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 11 మంది సభ్యులతో కూడిన ఆగమ సలహా మండలిని ఏర్పాటు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణ యజుర్వేదం చిర్రవూరి శ్రీరామ శర్మ ఆగమ సలహా మండలికి చైర్మన్‌గా నియమించారు. ఆయనతో పాటు విశ్వనాధ గోపాలకృష్ణ (రాజమండ్రి ఓరియంటల్ కాలేజీ ప్రిన్సిపల్), నల్లూరి రామచంద్ర భట్టాచార్య (మంగళగిరి లక్ష్మీ నర్సింహస్వామి ఉప ప్రధాన అర్చకులు), మోర్త సీతారామాచార్యులు (సింహాచలం వరహలక్ష్మి దేవాలయం రిటైర్డ్ అర్చకులు), ఎస్ఎంకె సదాశివ (కాళహస్తీశ్వర స్వామి ఆలయ రిటైర్డ్ అర్చకులు), రేవణ్ణ సిద్ధాంతి (కర్నూలు), జగన్నాధ శాస్త్రి (పశ్చిమ గోదావరి, వైదిక శాస్త్ర పరిషత్), చిలకపాటి తిరుమలాచారి (రిటైర్డ్ లెక్చరర్, తిరుపతి), రాజా ఎస్ గిరి ఆచార్య (మంత్రాలయం, కర్నూలు), రాఘవయ్య (అల్లూరు పోలేరమ్మ ఆలయ ఆర్చకులు), ఎల్.సుబ్రహ్మణ్య సిద్ధాంతి (కంచి కామకోటి పీఠం) లను సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. ఈ సలహా మండలి ఐదేళ్లపాటు కొనసాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
దేవాదయ శాఖ అధికారులపై దాడి
-
దేవాదయ శాఖ అధికారులపై దాడి
పెదకాకాని: ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రాష్ర్ట ట్రిబ్యునల్ కోర్టు కోసం కేటాయించిన స్థలాన్ని ఖాళీ చేయించేందుకు వెళ్లిన అధికారులకు చేదు అనుభవం ఎదురైంది. స్థానికంగా ఆ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వాళ్లు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో ముగ్గురు ప్రభుత్వ అధికారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన గుంటూరు జిల్లా పెద్ద కాకాని వద్ద గురువారం చోటు చేసుకుంది. పెద్ద కాకానిలోని వేణుగోపాల స్వామి ఆలయానికి చెందిన 9 ఎకరాల స్థలంలోని కొంత భాగంలో (సుమారూ ఎకరం) రాష్ర్ట ట్రిబ్యునల్ కోర్టు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో రంగంలోకి దిగిన దేవాదయ శాఖ అధికారులు ఆ భూమిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించగా.. స్థానికులు నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. ఈ క్రమంలో ఈరోజు ఆలయ ప్రాంగణానికి దేవాదయ అధికారులు వచ్చారనే సమాచారంతో అక్కడికి పెద్ద ఎత్తున తరలివచ్చిన స్థానికులు అధికారులతో వాగ్వాదానికి దిగి వారి పై దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు అధికారులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షిస్తున్నారు. -
దేవాదాయశాఖలో ఉద్యోగుల కొరత!
♦ జిల్లా కమిషనర్ సైతం ఇన్‌చార్జియే ♦ గోదావరి పుష్కరాలకు ఉద్యోగుల సమస్య ♦ తాత్కాలిక ఉద్యోగుల నియామకం జరిగేనా నిజామాబాద్‌కల్చరల్ : జిల్లా దేవాదాయ, ధర్మాదాయ శాఖ కార్యాలయంలో ఉద్యోగుల కొరత వెంటాడుతోంది. దశాబ్దాలపాటు ఈ శాఖలో రెగ్యులర్ పోస్టుల భర్తీ జరగక, పదవీ విరమణ పొందిన వారి స్థానంలో కొత్త నియామకాలు చేపట్టకపోవడంతో ప్రస్తుతం ఉన్న ఉద్యోగులు అదనపు పనిభారంతో పడరాని పాట్లు పడుతున్నారు. 14 నుంచి 25 వరకు 12 రోజులపాటు జరుగనున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలోనైనా ఉద్యోగుల నియామకాలు చేపట్టక పోవడంపై చొరవ చూపాల్సిన అవసరం ఉందని ఆ శాఖ ఉద్యోగవర్గాలు పేర్కొంటున్నాయి. ఏళ్ల నుంచి పదవీ విరమణ పొందిన స్థానంలో కొత్త వారిని బదిలీపై ఆ శాఖ కమిషనర్ కార్యాలయం నియమించకపోవడంతో ఉన్న ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ఈ కార్యాలయంలో ఉండాల్సిన రెగ్యులర్ జిల్లా కమిషనర్ పోస్టుతోసహా మిగితా ఉద్యోగుల ఖాళీలున్నాయి. గత కొన్నేళ్లుగా మెదక్-నిజామాబాద్ జిల్లాలకు కలపి జిల్లా ఇన్చార్జి కమిషనర్ ఒకరే ఉండగా గత ఏడాదిన్నర నుంచి హైదరాబాద్ ప్రధాన కార్యాలయం నుంచి జిల్లా దేవాదాయ,ధర్మదాయ శాఖ ఇన్చార్జి కమిషనర్‌గా సోమయ్య బాధ్యతలు చేపట్టారు. జిల్లా ఇన్చార్జిగా ఆయన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కార్యాలయాన్ని చక్కదిద్దడంతోపాటు అస్తవ్యస్తంగా ఉన్న కార్యాలయంలోని కొందరు ఉద్యోగుల పనితీరును, జిల్లాలోని శాఖ పరిధిలోకి వచ్చే దేవాలయాల కోర్టు వివాదాల పరిష్కారంపై ప్రత్యేక శ్రద ్ధ కనబరుస్తున్నారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో గల దేవాదాయ, ధర్మదాయ శాఖ కార్యాలయంలో రెగ్యులర్ కమిషనర్ పోస్టుతోపాటు ఒక సీనియర్ అసిస్టెంట్ పోస్టు రెండేళ్ల నుంచి ఖాళీగా ఉన్నారుు. ముగ్గురు ఇన్‌స్పెక్టర్లకుగాను 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లకుగాను రెండు పోస్టులు, టైపిస్టు పోస్టు, రికార్డు అసిస్టెంట్ పోస్టు, రెండు అటెండర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం పచ్చజెండా ఎప్పుడు ఊపుతుందోగాని అప్పటి వరకు తాత్కాలిక ఉద్యోగులనైనా నియమిస్తే ‘గోదావరి పుష్కరాలు’ సవ్యంగా సాగేందుకు అవకాశం ఉంటుందని, ప్రభుత్వం చొరవ చూపాలని ఉద్యోగవర్గాలు ప్రభుత్వాన్ని కోరుతున్నారుు. -
గుళ్లకు కొత్త ‘చట్టం’
పనికిరాని నిబంధనలకు రాంరాం సాక్షి, హైదరాబాద్: అస్తవ్యస్తంగా ఉన్న దేవాదాయ శాఖను చక్కదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దేవాదాయశాఖ విశ్రాంత సంయుక్త కమిషనర్ ఎల్.వెంకటాచారి, దేవాదాయశాఖ విశ్రాంత ఉప కమిషనర్ కె.సీతారామారావు, న్యాయవాది ఎ.కృష్ణమూర్తి సభ్యులుగా.. వరంగల్ ఉప కమిషనర్ రమేశ్‌బాబు కన్వీనర్‌గా ఇటీవల ఏర్పాటైన కమిటీ ఆ దిశగా చర్యలు చేపట్టింది. ప్రభుత్వం మూడు అంశాల్లో స్పష్టమైన సిఫారసులు చేయాలని సూచించగా వాటి కి సంబంధించి దేవాలయాల నిర్వాహకులు, అధికారులు, అర్చకులతో సమావేశాలు నిర్వహిస్తూ సూచనలు, సలహాలు తీసుకుంటోంది. తెలంగాణ పరిస్థితులకు వీలుగా దేవాదాయశాఖ చట్టానికి సవరణలు చేయడం, అంతగా ఉపయోగం లేని నిబంధనలను తొలగించి వాటిస్థానంలో కొత్తవాటిని ఏర్పాటు చేయడం ఇందులో కీలకమైంది. ఇక ఆలయాల నిర్వహణను పూర్తిస్థాయిలో మెరుగుపరిచేందుకు విధివిధానాలు రూపొందించడం, అన్యాక్రాంతమైన ఆలయ భూములను తిరిగి స్వాధీనం చేసుకుని వాటిని లీజుల రూపంలో ఆలయానికి ఆదాయాన్ని పెంచాలంటే తీసుకోవాల్సిన చర్యలను కమిటీ సిఫారసులు సిద్ధం చేస్తోంది. దేవాలయాల్లో ఖాళీల భర్తీకి అనుసరించాల్సిన విధానాలను కూడా ఇందులో చేర్చబోతోంది. -
దేవాదాయశాఖ ఇన్ స్పెక్టర్ పై సస్పెన్షన్ వేటు
విశాఖపట్నం: దేవాదాయ శాఖ టౌన్ ఇన్ స్పెక్టర్ రాజకుమారిపై సస్పెన్షన్ వేటు పడింది. వివరాలు...కోర్టుకు సంబంధించిన రిపోర్టులను పట్టించుకోకపోవడంతో పాటు ప్రజావాణికి వచ్చే ఫిర్యాదుల విచారణలో అలసత్వం ప్రదర్శించినందుకు ఆమెపై సస్పెన్షన్ వేటు వేసినట్లు సమాచారం. సస్పెన్షన్ కు సంబంధించిన ఉత్తర్వులను దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ పుష్పవర్ధన్ వెల్లడించారు. -
దేవాలయాలకు పునర్వైభవం తెస్తాం: ఇంద్రకరణ్‌రెడ్డి
హైదరాబాద్: తెలంగాణలోని దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకువస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఎ. ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. సోమవారం నగరంలోని బొగ్గులకుంటలో దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో శ్రీ బంగారు మైసమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం వైభవంగా జరిగింది. దీనికి తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి హాజరై అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ నిర్మాణానికి అమ్మవారి అశీస్సులు కోరుకున్నట్లు తెలిపారు. కాగా, తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘం అధ్వర్యంలో కమిషనరేట్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో శ్రీ మన్మథనామ సంవత్సర ఉగాది పంచాంగాన్ని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆవిష్కరించారు. (సుల్తాన్‌బజార్) -
రూ.20 కోట్లతో ఏడుపాయల అభివృద్ధి
పాపన్నపేట : ఏడుపాయల అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు చేయనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రకటించారు. మంగళవారం డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి దుర్గమ్మతల్లికి ప్రత్యేక పూజలు చేసిన ఆయన ఒడిబియ్యం పోసి ఏడుపాయల జాతరను ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ లక్షలాది భక్తుల కొంగుబంగారమైన ఏడుపాయల అభివృద్ధి కోసం రూ.20కోట్లు మంజూరు చేసి ఏడాదిలోగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా మాస్టర్‌ప్లాన్ రూపొందిస్తున్నట్లు చెప్పారు. పర్యాటక కేంద్రంగా, ఆధ్యాత్మిక క్షేత్రంగా ఏడుపాయలను తీర్చిదిద్దుతామన్నారు. తెలంగాణ రాష్ర్టంలో జరుగుతున్న మొదటి జాతర కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. కోటి విడుదల చేసిన విషయాన్ని గుర్తుచేశారు. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి, జాన పదుల విశ్వాసాలకు నిలయమైన జాతరను ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నెల రోజులుగా జాతర నిర్వహణ కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసిందన్నారు. జల సమాధులు జరగకుం డా ఉండడానికి నది ఒడ్డున ఫౌంటెన్లు ఏర్పాటు చేశామన్నారు. రూ.5.25 కోట్లతో ఏడుపాయలకు రోడ్డు వెడల్పు, రూ.25లక్షలతో ఆలయం ముందు కొత్తగా బ్రిడ్జి నిర్మించినట్లు తెలిపారు. వచ్చే ఏడాది వరకు ఏడుపాయల రూపురేఖలు మారిపోతాయని తెలిపారు. -
దేవాదాయ కమిషనర్‌గా వెంకట్రామిరెడ్డి?
సాక్షి, హైదరాబాద్: దాదాపు పది నెలలుగా ఇన్చార్జి కమిషనర్‌తో నెట్టుకొస్తున్న దేవాదాయశాఖకు కమిషనర్‌ను నియమించాలని ఆ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నిర్ణయించారు. ప్రస్తుతం దేవాదాయ శాఖ కార్యదర్శి వెంకటేశ్వరరావు ఇన్‌ఛార్జి కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు. కమిషనర్‌గా ఆయన సరిగా దృష్టి సారించకపోవడంతో దేవాదాయశాఖలో ఫైళ్లు పేరుకుపోయినట్టు ఆ శాఖ ఉద్యోగులే పేర్కొంటున్నారు. దీంతో నిత్యం ఆ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి ఫిర్యాదులు వస్తున్నాయి. గురువారం ప్రధాన దేవాలయాల ప్రతినిధులు కొందరు స్వయంగా మంత్రి ఇంటికి వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో గృహనిర్మాణ సంస్థ ఎండీగా ఉన్న వెంకట్రామిరెడ్డికి తాత్కాలికంగా దేవాదాయ శాఖ కమిషనర్ బాధ్యత అప్పగిస్తానని మంత్రి హామీ ఇచ్చినట్టు తెలిసింది. -
‘రికార్డు’స్థాయిలో మాయ !
పైడితల్లి అయినా....పైడమ్మ అయినా అన్నీ ఆ అమ్మపేర్లే అనుకున్నారో ఏమో...ఏ పేరుతో రికార్డులుంటే ఏమవుతుందని భావించారో ఏమో తెలియదు గాని సుమారు రూ. 3 కోట్ల విలువైన భూమి రెవెన్యూ రికార్డుల్లో పైడితల్లి అమ్మవారి పేరుమీద నమోదై ఉండగా, ఓ టీడీపీ కౌన్సిలర్ తల్లి అయిన పైడమ్మ పేరుమీద అడంగల్‌లో నమోదు చేశారు. దీంతో ఈ వ్యవహారంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విజయనగరం మున్సిపాలిటీ : దేవాదాయ భూములు అన్యాక్రాంతమవుతున్నాయా? వ్యూహాత్మకంగా కోట్లాది రూపాయల విలువైన భూమి చేతులు మారిపోతున్నాయా?.... అంటే, వీటీ అగ్రహారంలో గల 1.70 ఎకరాల భూమి వ్యవహారాన్ని చూస్తే ఇవే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పట్టణ శివారుల్లో గల దేవదాయశాఖ భూములకు రక్షణ కరువైంది. జిల్లా కేంద్రం కావటం... రోజు రోజుకు భూముల విలువ పెరిగిపోవడంతో గుళ్లు, బడులు, శ్మశానాలు ఇలా వేటినీ వదలకుండా కబ్జాచేసేస్తున్నారు. ఇదే తరహాలో స్థానిక 24వ వార్డు పరిధిలో గల వి.టి.అగ్రహారంలో కొలువుదీరిన పైడితల్మమ్మవారి పేరుపై ఉన్న 1.70 ఎకరాల భూమి అన్యాక్రాంతమవుతోందన్న ఆరోపణలొస్తున్నాయి. ఈ మొత్తం భూమి విలువ సుమారు రూ. 3 కోట్ల పైమాటే. ఈ ప్రాంతంలో సర్వే నంబర్ 153/1లో గల 1.70 ఎకరాల భూమిని గతంలో కొందరు అమ్మవారి ఆలయానికి అందజేశారని స్థానికులు తెలిపారు. ఈ భూమిని సాగు చేయడం ద్వారా వచ్చే ఆదాయంతో అమ్మవారి ధూప, దీప , నైవేద్యాలు జరుగుతూ ఉండేవి. ఇంతటి విలువైన భూమిపై కన్నేసిన కబ్జాదారులు ఈ ఏడాది ఆరంభంలో భూమి హద్దుల గుండా ఉన్న తాటి చెట్లను తొలగించేశారు. ఎటువంటి అనుమతులు లేకుండానే రియల్టర్లు అమ్మవారికి చెందిన సుమారు ఆరు సెంట్ల స్థలం గుండా రోడ్డు ఏర్పాటు చేసుకున్నారు. ఇంత జరిగినప్పటికీ దేవదాయ శాఖ అధికారులు కనీసం స్పందించలేదు. స్థానికులు రెవెన్యూ అధికారులకు సమాచారం అందించగా.. పరిశీలన జరిపి తూతూమంత్రంగా రోడ్డుకు ఇరువైపులా వేసిన కాల్వలను తొలగించి వదిలేశారు. ఈ సంఘటన జరిగి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ అమ్మవారి భూమిని పరిరక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం లేదు. అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్ రొంగలి రామారావు జోక్యం ఉండంతోనే అధికారులు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ రికార్డుల్లో అమ్మవారి పేరు... అడంగల్ కాపీపై వేరే పేరు వి.టి.అగ్రహారం పైడితల్లమ్మవారికి చెందిన 1.70 ఎకరాల భూమి ఇప్పుడు ఎవరి పేరుపై ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెవెన్యూ రికార్డులో సదరు భూమి అమ్మవారి పేరుపై ఉండగా.. మీసేవా ఇటీవల జారీ చేసిన అడంగల్ కాపీలో మాత్రం రొంగలి పైడిమ్మ పేరు ఉంది. దేవాదాయ శాఖ భూమే... దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆర్ పుష్పనాథంను వివరణ కోరగా...అది అమ్మవారి ఆలయానికి చెందిన భూమేనని చెప్పారు. అండగల్‌లో పేరుమార్పు, భూమి ఆక్రమణ విషయం తనకు తెలియదని, దీనిపై పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆర్ఐ ఏమన్నారంటే... వి.టి.అగ్రహరం పైడితల్లమ్మవారికి చెందిన భూమి విషయంపై ఆర్ఐ కోటేశ్వరరావు వద్ద సాక్షి ప్రస్తావించగా.. రెవెన్యూ రికార్డుల్లో మాత్రం సర్వే నంబర్ 153/1 చెందిన 1.70 సెంట్ల భూమి అమ్మవారి పేరుమీద ఉందని చెప్పారు. అయితే మీసేవా ద్వారా జారీ అయిన అడంగల్ కాపీ చూసిన ఆర్ఐ ఎక్కడో తప్పు జరిగి ఉండవచ్చని చెప్పుకొచ్చారు. తహశీల్దార్ ఏమన్నారంటే.. ఇదే భూమిలో రియల్టర్లు అక్రమంగా రోడ్డు వేయడం పట్ల విజయనగ రం తహశీల్దార్ కోరాడ.శ్రీనివాసరావును సాక్షి ప్రశ్నించగా.. ఈ విషయంపై ఇప్పటికే క్షేత్ర స్థాయి పరిశీలన జరిపినట్లు చెప్పారు. 2008-09 సంవత్సరంలో జరిగిన తప్పులు కారణంగా రికార్డుల్లో పేరు మారి ఉండవచ్చని తెలిపారు. అయితే అక్కడ జరుగుతున్న అక్రమాలపై జాయింట్ కలెక్టర్‌కు నివేదిక పంపించామని, ఆయన వద్ద నుంచి ఆదేశాల వచ్చిన తరువాత చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కౌన్సిలర్ రామారావు వివరణ ‘మా తాత( కోరాడ దాలిప్ప) పేరున ఈ భూమి ఉంది. మధ్యలో ఎవరో రికార్డులో మార్చేశారు. దానధర్మంగా ఇచ్చినట్టు చెప్పుకొస్తున్నారు. కానీ మా వద్ద డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయి. కోర్టులో తేల్చుకుంటాం. ’ అని కౌన్సిలర్ రొంగలి రామారావు ‘సాక్షి’ వద్ద తెలిపారు. -
పులిహోర ప్రసాదం మరింత ప్రియం
అరసవల్లి : ఆదిత్యుని పులిహోర ప్రసాదం మరింత ప్రియం కానుంది. పేరుకు ధర పెంచకపోయినా పరిమాణం తగ్గించడం ద్వారా అధికారులు పరోక్షంగా భక్తులపై భారం మోపారు. అరసవల్లి శ్రీ సూర్యనారాయణస్వామి దేవాలయంలో విక్రయిస్తున్న ప్రసాదాల్లో పులిహోర ముఖ్యమైనది. భక్తులు ఎక్కువగా దీన్నే కొనుగోలు చేసి ప్రీతిపాత్రంగా స్వీకరిస్తుంటారు. దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు పులిహోర ప్యాకెట్ పరిమాణం కాస్త తగ్గించినట్లు ఆ శాఖ సహాయ కమిషనర్, ఆలయ ఇన్చార్జి ఈవో ఆర్.పుష్పనాథం ఆదివారం తెలిపారు. ఇప్పటివరకు 200 గ్రాముల ప్యాకెట్‌ను రూ.5కు విక్రయిస్తున్నారు. ఇక నుంచి అదే ధరకు 150 గ్రాముల పులిహోర మాత్రమే ఇస్తారు. సోమవారం నుంచే ఈ మార్పు అమల్లోకి వస్తుందని ఆయన చెప్పారు. ప్రసాదాల తయారీ, విక్రయాల్లో నష్టం వస్తుండటంతో ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారని పుష్పనాథం పేర్కొన్నారు. -
తలకావేరీ తీర్థోర్భవానికి సర్వం సిద్ధం
ఈనెల 17న సాయంత్రం కావేరీ దర్శనం లక్షలాది మంది భక్తులు దర్శించుకునే అవకాశం కావేరి నది ఉద్భవించిన తలకావేరీ ప్రాంతంలో తీర్థోర్భవానికి సన్నద్ధమవుతోంది. కావేరి మాత కొలువైన తలకావేరీ ప్రాంతంలో ఈనెల 17న జలరూపిణిగా కావేరి దర్శనమివ్వనున్నారు. రాష్ర్టంలోని వారితో పాటు తమిళనాడు రాష్ట్రానికి చెందిన ప్రజలు కావేరి మాతను కులదేవిగా పూజించుకుంటున్నారు. అలాంటి లక్షలాది మంది ఈ తీర్థోర్భవానికి తరలిరానున్నారు. - సాక్షి, బెంగళూరు మౌలిక సదుపాయాల కల్పన కోసం.. తలకావేరి తీర్థోర్భవానికి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు గాను రాష్ట్ర ప్రజాపనుల శాఖ, దేవాదాయశాఖలు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. మడికేరి, భాగమండల, తలకావేరి, కరికె రహదారుల్లోని రోడ్లను అభివృద్ధి చేసే పనిలో పడ్డాయి. ఆయా రహదారులకు మరమ్మతు పనులు చేపట్టడంలో నిమగ్నమయ్యాయి. తీర్థోర్భవ సమయంలో బ్రహ్మకుండికెలో స్నానం చేసేందుకు భక్తులు ఎక్కువగా ఆసక్తి చూపుతారు కాబట్టి ఆ సమయంలో ఎలాంటి తోపులాట జరగకుండా ఉండేందుకు బ్యారికేడ్లను ఏర్పాట్లు చేస్తున్నారు. తీర్ధోర్భవ అపురూప ఘట్టాన్ని వీక్షించేందుకు గాను దాదాపు లక్షకుపైగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని తలకావేరి-భగండేశ్వర దేవాలయ సమితి నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. అందువల్ల ఆలయ చుట్టుపక్కల ప్రాంతాల్లో కట్టుదిట్టమన భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాల జోరు.... తీర్థోర్భవ ఘట్టానికి గాను తలకావేరి ప్రాంతం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. లక్షల రూపాయలను వెచ్చించి క్షేత్రాన్ని పుష్ఫాలతో అలంకరించనున్నారు. ఇక రాష్ట్ర కన్నడ, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
దేవాదాయ శాఖలో లంచావతారం
ఖమ్మం క్రైం: దేవాదాయ శాఖలో ఈవోగా పనిచేస్తూ.. తన కిందిస్థాయి సిబ్బంది వద్ద లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఘటన మంగళవారం ఖమ్మంలో చోటుచేసుకుంది. ఏసీబీ డీఎస్పీ సాయిబాబా కథనం ప్రకారం.. వైరా మండలం గొల్లపుడి పులిగుట్ట నరసింహస్వామి ఆలయ ఈవో పెద్ది సత్యనారాయణ నగరంలోని గుంటు మల్లేశ్వరస్వామి దేవస్థానంతోపాటు మరో రెండు దేవాలయాలకు ఇన్చార్జి ఈవోగా పనిచేస్తున్నారు. పులిగుట్ట నరసింహస్వామి ఆలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న దిరిశాల శ్రీనివాస్ సంవత్సర కాలంగా డిప్యుటేషన్‌పై ఖమ్మం వైరారోడ్డులోని జలాంజనేయస్వామి దేవాలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల దేవాదాయ శాఖ ఉద్యోగులకు ఆ శాఖ డిప్యూటీ కమిషనర్ 2005 పీఆర్సీ విడుదల చేయడంతో దానికి గాను ఆ బిల్లులు రూ.లక్ష విడుదల చేయమని శ్రీనివాస్ ఈవో సత్యనారాయణను కోరాడు. అందుకు ఖర్చవుతుందని, రూ.15 వేలు లంచం ఇవ్వాలని ఈవో చెప్పాడు. తాను నెలకు రూ.7వేల వేతనంతో పనిచేస్తున్నానని, అంత డబ్బు ఇవ్వలేనని, చాలా కష్టాల్లో ఉన్నానని శ్రీనివాస్ బతిమిలాడినా ఈవో ససేమిరా అన్నాడు. కొంతకాలం ఆయన చుట్టూ తిరిగి విసిగి వేసారిన శ్రీనివాస్ ఏసీబీ డీఎస్పీని సంప్రదించాడు. దీంతో డీఎస్పీ సూచన మేరకు సత్యనారాయణకు రూ.10 వేలు లంచం ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ డబ్బు తీసుకుని గుంటుమల్లన్న స్వామి గుడికి వస్తానని శ్రీనివాస్ చెప్పగా.. తానే జలాంజనేయస్వామి గుడికి వచ్చి తీసుకుంటానని సత్యనారాయణ చెప్పాడు. కాగా, రూ.1000 నోట్లు పదింటికి పౌడర్ పూసి శ్రీనివాస్‌కు ఇచ్చిన ఏసీబీ సిబ్బంది గుడి ప్రాంతంలో మాటువేశారు. ఈవో ఆలయంలోకి వస్తుండగానే శ్రీనివాస్ గుడి గోడ పక్కన ఉన్న రోడ్డుపై నిల్చుని డబ్బులు ఈవో ఇచ్చాడు. సత్యనారాయణ ఆ డబ్బును జేబులో పెట్టుకుంటుండగానే పక్కనే ఉన్న ఏసీబీ సిబ్బంది రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈవోనుంచి రూ.10 వేల నగదు స్వాధీనం చేసుకుని అతడిని హైదరాబాద్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టుకు తరలించారు. ఇదిలా ఉండగా, జూనియర్ అసిస్టెంట్ స్థాయి నుంచి వచ్చిన సత్యనారాయణ మొదటి నుంచి లంచాలకు అలవాటు పడి కిందిస్థాయి సిబ్బందిని బాగా వేధిస్తున్నాడని, దీనికితోడు ఆయన పనిచేస్తున్న ఆలయాలకు వచ్చే ఆదాయాన్ని కూడా మాయం చేసేవాడని తోటి సిబ్బంది తెలుపుతున్నారు. ఈ దాడుల్లో డీఎస్పీ సాయిబాబాతోపాటు ఏసీబీ సీఐ సాంబయ్య, శ్రీనివాసరాజు, సిబ్బంది పాపారావు, శ్రీనివాసాచారి, అజీజ్ పాల్గొన్నారు. -
అంచనాలు కుదించండి
సాక్షి, రాజమండ్రి : గోదావరి పుష్కరాలకు సంబంధించి జిల్లాలో వివిధ శాఖలు ప్రభుత్వం నిర్దేశించిన రూ.131 కోట్ల మేరకే ప్రతిపాదనలను పరి మితం చేసుకోవాలని కలెక్టర్ నీతూ ప్రసాద్ ఆ దేశించారు. ఏ శాఖ ఎంత మొత్తానికి పనుల అంచనాలు తయారు చేయాలన్న దానిపై ఈ నెల 18న దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి అనూరాధ ఇచ్చిన నిర్దేశాన్ని దాటరాదని స్ప ష్టం చేశారు. ఎక్కడా అనుబంధ పనులకు తావులేదని, కేవలం పుష్కరాలకు సంబంధించిన సన్నాహాలు, భక్తులకు అవసరమైన వసతులకే ప్రతిపాదనలు పరిమితం కావాలని కచ్చితంగా చెప్పారు. పుష్కర పనుల అంచనాలపై తుది నివేదికలు తీసుకునేందుకు కలెక్టర్ శుక్రవారం రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. గతంలో రూ.142 కోట్లకు ప్రతిపాదనలు ఇచ్చిన ఆర్అండ్బీ శాఖ ఇప్పుడు రూ.70 కోట్ల కు కుదించింది. ప్రతిపాదించిన పనులను ఆ శాఖ ఎస్ఈ సీఎస్ఎన్మూర్తి వివరించారు. పుష్కరాల్లో కీలకమైన రాజమండ్రి- కొవ్వూరు రోడ్‌కం రైలు వంతెన మరమ్మతులకు రైల్వే శాఖ సహకరించడం లేదనడంతో సీఎం దృష్టికి తీసుకు వెళ్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. విద్యుత్తు శాఖ అధికారులు తమ శాఖ నిధులతో చేపట్టే రూ.30 కోట్లు వ్యయమయ్యే పనుల ప్రతిపాదనలిచ్చారు. రాజమండ్రిలో ఆరు సబ్ స్టేషన్ల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని సమకూరుస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. రూ.59 కోట్లు అవసరమన్న దేవాదాయ శాఖ రాజమండ్రి సహా జిల్లాలోని వివిధ ఆలయాల మరమ్మతులు, భక్తులకు వసతులు, పుష్కర ఏర్పాట్లకు దేవాదాయ శాఖ రూ.59.24 కోట్ల తో ప్రతిపాదనలు అందిస్తున్నట్టు ఆ శాఖ అధికారులు కలెక్టర్‌కు తెలిపారు. రాజమండ్రి నగరపాలక సంస్థ ఎస్ఈ ఆర్.జి.కృష్ణారెడ్డి రూ.30 కోట్లకు అంచనాలు సమర్పించారు. జిల్లాలోని 137 స్నానఘట్టాల్లో రాజమండ్రి కార్పొరేషన్ పరిధిలోని 13 పోను మిగిలిన చోట్ల బారికేడ్లు, ఇతర ఏర్పాట్లకు రూ.ఆరు కోట్లకు ప్రతిపాదనలు ఇస్తున్నట్టు జిల్లా పంచాయతీ అధికారి ఎల్.శ్రీధర్‌రెడ్డి చెప్పారు. బారికేడింగ్ పనులు ఇరిగేషన్ శాఖ చేపట్టాలని కలెక్టర్ సూచించారు. పంచాయతీరాజ్ శా ఖ పుష్కరాలు జరిగే గ్రామాల్లో రహదారుల అ భివృద్ధి, ఇతర పనులకు రూ.13.63 కోట్ల ప్రతి పాదనలివ్వగా రూ.6 కోట్లకు కుదించాలని కలెక్టర్ సూచించారు. ఆర్డబ్ల్యూఎస్ రూ.కోటి, ఆర్టీసీ రూ.70 లక్షలు, రవాణా శాఖ రూ.5 ల క్షలు, ట్రాఫిక్ పోలీస్ విభాగం రూ.8 లక్షలు వ్య యమయ్యే ప్రతిపాదనలు ఇచ్చాయి. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ముత్యాల రాజు, సబ్ కలెక్టర్ విజయరామరాజు పాల్గొన్నారు. సీఎస్ఆర్ నిధులు పుష్కరాలకే .. ఈ ఏడాది, వచ్చే ఏడాది జిల్లాలో వివిధ కార్పొరేట్ సంస్థలు సామాజిక బాధ్యతగా వెచ్చించే (సీఎస్ఆర్) సుమారు రూ.25 కోట్లను పుష్కరాల పనులకే వెచ్చిస్తామని కలెక్టర్ విలేకరులకు తెలిపారు. కొన్ని శాఖలకు అవసరం అనుకుంటే మరో రూ.కోటి లేదా రెండు కోట్ల వరకూ అదనపు నిధులు రప్పించే అవకాశాలు ఉన్నాయన్నారు. ఇంకా చేపట్టాల్సిన పనులు మిగిలిపోతే రెండో దశ అంచనాల్లో పరిశీలిస్తామన్నారు. రంపచోడవరం డివిజన్లో విలీనం అయిన నాలుగు ఖమ్మం జిల్లా మండలాల్లోని ఐదు ఘాట్ల అభివృద్ధి పనులను కూడా సంబంధిత శాఖలు పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. -
దేవాదాయ శాఖలో అధర్మం
నగరానికి దూరప్రాంతాల నుంచి వచ్చే వారి ఆకలి తీర్చాలన్న ఓ మహానుభావుడి ఆశయాన్ని అటు దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారులు, ఇటు కొందరు స్వార్థపరులు పక్కదారి పట్టించి, వారి ధనదాహం తీర్చుకుంటున్నారు. కాకినాడ నడిబొడ్డున సినిమారోడ్లో ఉన్న శ్రీ మంత్రిప్రగడ వారి సత్రం చుట్టూ అల్లుకున్న ఈ అక్రమ వ్యవహారం ఎప్పుడో వెలుగు చూసినా.. అడ్డుకట్ట మాత్రం పడలేదు. సాక్షి, కాకినాడ : మంత్రిప్రగడ నరసింహారావు అనే దాత స్వాతంత్య్రానికి పూర్వం కాకినాడకు వైద్యం నిమిత్తం వచ్చే రోగులు, ఇతరులకు భోజన సదుపాయం కల్పించే లక్ష్యంతో మూడువేల చదరపు గజాల్లో సత్రాన్ని నిర్మించి, నిర్వహణ నిమిత్తం అమలాపురం, కడియంలలో వ్యవసాయ భూముల్ని సమకూర్చారు. సత్రం భూమిలో సుమారు 1500 గజాలను 60 ఏళ్ల క్రితం లీజుకు తీసుకున్న ఓ సంస్థ సినిమా థియేటర్‌ను, సాంస్కృతిక సంస్థ కార్యాలయాన్ని నిర్మించింది. లీజును పొడిగించుకుం టూ అయిదు దశాబ్దాల పాటు వాటిని కొనసాగించింది. 2007లో వాటిని తొలగించి, భారీ షా పింగ్ కాంప్లెక్స్ నిర్మించింది. అదే సమయంలో మిగిలిన సత్రం భూమిలో దేవాదాయ శాఖ కూ డా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించింది. లీజు సంస్థ 75 షాపులు, దేవాదాయశాఖ 77 షాపులను నిర్మించాయి. లీజు సంస్థ అనుమతి లేకుండానే షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించడంలో ఓ మాజీ మంత్రి చక్రం తిప్పారని, భారీ మొత్తం చేతులు మారిందని వినికిడి. నామమాత్రపు లీజు.. లక్షల్లో అద్దెలు లీజు సంస్థ 2007 నుంచి కేవలం స్థలానికి ఏడాదికి రూ.లక్షా 20 వేలు మాత్రమే చెల్లిస్తూ ఒక్కో షాపు నుంచి భారీగా అద్దెలు దండుకుంది. ఆ సంస్థ పైకి చూపిన దాని ప్రకారం షాపునకు నెలకు వసూలు చేసింది రూ.వెయ్యి మాత్రమే. ఆ లెక్కన చూసినా 75 షాపులకు నెలకు రూ.75 వేల చొప్పున ఏడాదికి 9 లక్షలు వసూలు చేసుకున్నట్టు. కానీ, సత్రానికి చెల్లించింది ఏడాదికి రూ.లక్షా 20 వేలు మాత్రమే. దేవాదాయ అధికారులదీ అదే దారి.. ఈ వ్యవహారం 2011లో వెలుగు చూడడంతో సత్రం ఈఓని బదిలీ చేసి, లీజు సంస్థ అధీనంలోని షాపింగ్ కాంప్లెక్స్‌ను దేవాదాయశాఖ స్వాధీనం చేసుకుంది. అనుమతి లేకుండా నిర్మించింది కావడంతో లీజు సంస్థ మిన్నకుండిపోయింది. షాపులను అద్దెకు తీసుకున్న వారు ప్రతి నెలా అద్దె సొమ్మును సత్రం ఖాతాలో జ మ చేయాలని దేవాదాయ శాఖ ఆదేశించినా.. ఈనాటి వరకూ వసూలు చేస్తున్న అద్దె ఎంత, ఏ ఖాతాలో ఎంత జమ చేస్తున్నారన్న దానిపై లెక్కాపత్రం లేవు. ఇప్పుడు అనుమతి లేకుండా నిర్మించిన ఈ షాపులను క్రమబద్ధీకరించాలని దేవాదాయశాఖ తలపెట్టింది. అయితే.. దీన్నీ సొమ్ము చేసుకోవడానికి ఆ శాఖ అధికారులు ఆరాటపడుతున్నారు. నిజానికి ఆ శాఖ ఆధ్వర్యంలోని షాపింగ్ కాంప్లెక్స్‌తో పాటు లీజు సంస్థ నిర్మించిన కాంప్లెక్స్‌లోని 152 షాపులు గ త ఏడేళ్లలో ఎన్నో చేతులు మారాయి. ఆరు షా పులు కోర్టు కేసుల్లో ఉండగా మిగిలినన 146 షా పుల్లో 125 బినామీలే నడుపుతున్నారని, వారి లో దాదాపు 100 మంది నుంచి ఇప్పటికే క్రమబద్ధీకరణ పేరిట రూ.లక్ష చొప్పున రూ.కోటి వరకు వసూలు చేశారని సమాచారం. ఓ ఉదారుని ఆశయం పదిలంగా కొనసాగేలా చూ డాల్సిన దేవాదాయ అధికారులు దాన్ని నీరుగార్చడమే కాక శాఖ ఆదాయానికీ గండి కొడుతున్నారు. ఇంతకీ దాత ఆశయాన్ని ఏ మేరకు కొనసాగిస్తున్నారని ఆరా తీస్తే.. పది నుంచి 15 మంది విద్యార్థులకు మాత్రమే మెస్‌లలో భోజ నం చేసేందుకు కూపన్లు ఇస్తూ రికార్డుల్లో ఆ సంఖ్యను పెంచి చూపుతున్నారని తెలిసింది. సత్రం నిర్వహణకు దాత ఇచ్చిన భూములూ అన్యాక్రాంతమయ్యాయని, అందులోనూ అధికారుల ప్రమేయం ఉందని తెలుస్తోంది. దీనిపై విచారణ జరిపి, అవినీతిపరులపై చర్యలు తీసుకుని, దాత లక్ష్యం నెరవేర్చాల్సిన బాధ్యత ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులపై ఉంది. విచారణకు ఆదేశించాం : డీసీ సత్రం స్థలంలోని షాపింగ్ కాంప్లెక్స్‌ల వ్యవహారంపై దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ గాదిరాజు సూరిబాబురాజును వివరణ కోరగా లీజు సంస్థ షాపింగ్ కాంప్లెక్స్‌ను ఎలాంటి అనుమతుల్లేకుండా నిర్మించడం వాస్తవమేనన్నారు. అలాగే అనేక షాపులు బినామీల చేతుల్లో ఉన్నట్టు నిర్ధారణకు వచ్చి, విచారణ జరపాలని తమ శాఖ తనిఖీదారు సతీష్‌కుమార్‌ను ఆదేశించామన్నారు. క్రమబద్ధీకరణకు ఎవరైనా అనధికారికంగా డబ్బులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామన్న ఆయన.. లీజు సంస్థ వసూలు చేసిన మొత్తాన్ని రాబడతారా అన్నప్పుడు ‘చూద్దాం’ అని జవాబిచ్చారు. -
పచ్చని చేలో చిచ్చు
చిలకలూరిపేట రూరల్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కౌలుకు చేస్తున్న పంటపొలాలను దేవాదాయ శాఖ అధికారులు దౌర్జన్యంగా స్వాధీనం చేసుకున్న సంఘటన బుధవారం చిలకలూరిపేట రూరల్ మండలంలో జరిగింది. పోలీసులను రక్షణగా తెచ్చుకుని ట్రాక్టర్లతో భూములను ధ్వంసం చేశారు. 9.40 ఎకరాల్లో పత్తి మొలకలను నాశనం చేశారు. అడ్డొచ్చిన రైతులను పక్కకూ లాగి పొలాలను కలియదున్నేశారు. ఖరీఫ్ పెట్టుబడులను మట్టిపాలు చేశారు. తెలుగుదేశం పార్టీ నేతల ఆదేశాల మేరకే అధికారులు పత్తి మొలకలు వచ్చిన పొలాలను ధ్వంసం చేశారని గంగన్నపాలెం గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌలు పొలాలు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు దక్కకుండా చేసేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. వివరాలు ఇలా వున్నాయి.. మండలంలోని కోమటినేనివారిపాలెం వజ్జావారి చెరువు మాన్యం భూమి గోవిందపురం గ్రామంలో 9.40 ఎకరాలు ఉంది. ఆ భూమిని 1991 నుంచి గంగన్నపాలెంకు చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలు మన్నవ శేషగిరిరావు, మన్నవ మాణిక్యాలరావు కౌలుకు తీసుకుని సాగు చేసుకుంటున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మాణిక్యాలరావు భార్య నళిని గంగన్న పాలెంగ్రామ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఇది అధికారంలో వున్న తెలుగుదేశం పార్టీ నాయకుల ఆగ్రహానికి కారణమైంది. ఎలాగైనా తమ అధికార ప్రతాపం చూపించాలనుకున్న టీడీపీ నేతలు పావులు కదిపారు. రెండు దశాబ్దాలుగా ఆ ఇద్దరు రైతులు సాగు చేసుకుంటున్న దేవుని మాన్యం భూములపై వారి కళ్లు పడ్డాయి. ఆ భూమిని వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు కాకుండా తమ పార్టీ వారికి కౌలుకు ఇప్పించే విధంగా తెరవెనుక మంత్రాంగం నడిపారు. కౌలు గడువు పొడిగించాలని రైతులు శేషగిరిరావు, మాణిక్యాలరావులు పెట్టుకున్న అర్జీలను దేవాదాయ శాఖ కార్యాలయ గదుల్లోనే తొక్కిపెట్టారు. కౌలు గడువు పొడిగిస్తున్నట్టు కానీ, వేరే రైతులకు ఇస్తున్నట్టుగానీ తెలియజేయకుండా అధికారులు మౌనం పాటించారు. ఎప్పటిలానే ఈ ఏడాది కూడా భూమిని తమకే కౌలుకు ఇస్తారని భావించిన రైతులు ఇద్దరూ ఖరీఫ్ సాగుకు ఉపక్రమించారు. దుక్కులు దున్ని కూలీల సాయంతో పత్తి విత్తులు నాటారు. ఎకరాకు రూ.20 వేల వంతున 9.40 ఎకరాలకు దాదాపు రూ.1.90 లక్షలు వ్యయం చేశారు. పత్తి మొలకలు వచ్చిన దశలో ఒక్కసారిగా బుధవారం దేవాదాయ శాఖ అధికారులు పోలీసులను వెంటేసుకుని ఆ పొలంపై విరుచుకుపడ్డారు. పొలాన్ని ధ్వంసం చేశారు.. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు శేషగిరిరావు, మాణిక్యాలరావులు కౌలు చేస్తున్న వజ్జావారి చెరువు మాన్యం భూముల్లోకి దేవాదాయశాఖ అధికారులు, పోలీసులు ట్రాక్టర్లతో ప్రవేశించారని తెలుసుకున్న గ్రామస్తులు అక్కడకు చేరుకున్నారు. అక్కడవున్న దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ మహేశ్వరరెడ్డి, సిబ్బంది, పోలీసులను నిలదీశారు. కౌలుకు చేసుకుంటున్న రైతులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా దౌర్జన్యంగా పొలాల్లోకి ప్రవేశించడం ఏంటని ప్రశ్నించారు. దీనిపై అస్టిటెంట్ కమిషనర్ రైతులకు వింతవాదన వినిపించారు. కౌలు కాలపరిమితి పూర్తయిందనీ, భూమిని స్వాధీనం చేయాలని ఖరాఖండిగా పేర్కొన్నారు. దీనిపై ఆగ్రహించిన కౌలురైతులు, గ్రామస్తులు భూమిని దున్నేందుకు తీసుకువచ్చిన ట్రాక్టర్లకు అడ్డుగా బైఠాయించారు. రూరల్ ఎస్ఐలు ఎస్.జగదీష్, వెంకటేశ్వరరాజు తమ సిబ్బందితో రైతులను అక్కడి నుంచి పక్కకు లాగివేయడంతో ట్రాక్టర్లతో పొలాన్ని కలియదున్నారు. పత్తి మొలకలను ఎందుకు కాకుండా చేశారు. మాపై కక్ష కట్టారు... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుతున్నామని అధికారులు, ప్రజాప్రతినిధులు మాపై కక్ష కట్టారు. ఎప్పటి నుంచో భూమిని సాగు చేసుకుంటున్నా ఎప్పుడు అభ్యంతరం చెప్పలేదు. ఇప్పుడే ఎందుకిలా.. పత్తి విత్తనాలు నాటిన పొలంలో మొలకలు వచ్చాయి. ఈ సమయంలో వాటిని దున్ని నష్టం కలిగించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కౌలు నుంచి ఎలా తప్పిస్తారు. అధికారులు ఏక పక్షంగా వ్యవహరించటం ఎంత వరకు న్యాయం. పత్తి సాగుకు అయిన ఖర్చును వెంటనే చెల్లించాలని లేని పక్షంలో సమస్య పరిష్కరించే వరకు రోడ్డెక్కి పోరాడతాం. - మన్నవ మాణిక్యాలరావు, కౌలు రైతు. -
నీటి గర్భంలోకి ప్రసిద్ధ ఆలయాలు!
ఆగస్టులో ఆలయాల తరలింపు తేదీలను ఖరారుచేసిన దేవాదాయ శాఖ బెల్లంకొండ: పులిచింతల ప్రాజెక్టు ముంపు గ్రామాల పరిధిలో ఉన్న ప్రసిద్ధ ఆలయాలు కొద్ది రోజుల్లో నీటి గర్భంలోకి వెళ్లనున్నాయి. ఆగస్టు నెల చివరి కల్లా ప్రాజెక్టులో 11 టీఎంసీల నీటి నిల్వకు అధికారులు ఇప్పటికే పలు ఏర్పాట్లు పూర్తిచేశారు. ముంపు గ్రామాల్లో ఉన్న ప్రజలను ఈ నెలాఖరు కల్లా గ్రామాలను ఖాళీ చేయాలని అధికారులు గ్రామసభల ద్వారా సూచించారు. దీంతో ప్రాజెక్టు పరిధిలో ఉన్న ముంపు గ్రామాల తరలింపునకు దేవాదాయ శాఖ అధికారులు సన్నాహాలు చేశారు. ఆగస్టు 9, 11 తేదీలను ఖరారుచేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు బెల్లంకొండ గ్రూపు దేవస్థానాల మేనేజరు టి.లక్షణరావు తెలిపారు. మండలంలోని ముంపు గ్రామాల పరిధిలో వున్న ఆలయాలను గుర్తించారు. ముంపు గ్రామాల్లో మొత్తం 25 ఆలయాలు ఉన్న అధికారులు గుర్తించారు. పలు పునరావాస కేంద్రాల్లో ఏ స్థానంలో ఏ ఆలయాలను ఏర్పాటుచేయాలో నిర్ణయించారు. ఆగస్టు 9న శైవ ఆలయాలు, 11న వైష్ణవ ఆలయాలల్లోని విగ్రహాలను 12న ఆయా పునరావాస కేంద్రాలకు తరలించేలా ప్రణాళికలు రూపొందించారు. ఆలయాల తరలింపు ఈ కేంద్రాలకే.. కోళ్లూరులోని ప్రసిద్ధ దేవస్థానమైన కోళ్లూరు శ్రీప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం బెల్లంకొండ క్రాస్ రోడ్డుకు, శ్రీసోమేశ్వర స్వామి ఆలయం రాజుపాలెం కేంద్రానికి, శ్రీ విశ్వేశ్వర, వినాయక స్వామి దేవాలయాలు చిగురుపాడు కేంద్రానికి, రామలింగేశ్వర, వేణుగోపాలస్వామి, ఎమ్మాజిగూడెంలోని ఆంజనేయ ఆలయం కొండమోడు కేంద్రానికి, చిట్యాల గ్రామంలోని శ్రీఆంజనేయ, అంకమ్మ తల్లి, మద్దిరావమ్మ, రామాలయాలు, చిట్యాల తండాలోని అభయాంజనేయ, బోధనం గ్రామంలోని శివాలయం మాచాయపాలెం కేంద్రానికి, పులిచింతలోని కోదండరామ, శివాలయం రెడ్డిగూడెం కేంద్రానికి, ప్రసన్నాంజనేయస్వామి, ఎమ్మాజిగూడెంలోని రామాలయం, మహాలక్ష్మి అమ్మవారి ఆలయం, కామేపల్లిలోని వరద వేణుగోపాల, రామలింగేశ్వర, ముత్యాలమ్మ, రామాలయాలు, కరాలపాడు కేంద్రానికి, బోదనంలోని రామలింగేశ్వర, ఆంజనేయ, గంగమ్మ తల్లి ఆలయాలు చౌటపాపాయపాలెం కేంద్రానికి, కేతవరం లక్ష్మీ నరసింహస్వామి ఆలయం సమీపంలోని కొండ మీదకు తరలిస్తున్నారు. -
6 వేలమంది ఉద్యోగుల జాడలేదు
ద్వారకాతిరుమల: రాష్ట్ర దేవాదాయ శాఖ ఉద్యోగుల్లో సుమారు 6వేల మంది ఎక్కడ పనిచేస్తున్నారో తెలియడం లేదని, ప్రస్తుతం వారిని వెదికే పనిలో ఉన్నామని రాష్ట్ర ఆ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమలలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో 14 వేల మంది ఉద్యోగులు సరైన పనిలేకుండా ఉన్నారని, ముందు వారికి పనికల్పించే పనిలో పడ్డామని చెప్పారు. జీతాలు తీసుకుంటూ ఎక్కడ ఉద్యోగాలు చేస్తున్నారో తెలియని 6 వేల మంది సిబ్బందిని గుర్తించాల్సి ఉందన్నారు. ఆలయాల్లో ఎన్ఎంఆర్ ఉద్యోగులను పర్మినెంట్ చేసే అంశాన్ని పరిశీలించాల్సి ఉందన్నారు. ప్రముఖ ఆలయూలున్న ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా రహదారులను విస్తరించేందుకు మాస్టర్ ప్లాన్స్ రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఆలయాల్లో ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాల్సి ఉందని, అంతకుముందే పదోన్నతులు పొంది అక్కడే పనిచేస్తున్న వారిని బదిలీ చేస్తామని మంత్రి పేర్కొన్నారు. -
భద్రాద్రి ఆలయంలో పాలనా సంస్కరణలు
- శాఖాపరమైన మార్పులకు ఇన్చార్జ్ ఈఓ సూచనలు - ఉద్యోగుల ఐక్యతతోనే అభివృద్ధి - దేవస్థానంపై దేవాదాయశాఖ అధికారుల పెత్తనం..? భద్రాచలం టౌన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థాన ఇన్చార్జ్ ఈవోగా బాధ్యతలు చేపట్టిన దేవాదాయశాఖ వరంగల్ డెప్యూటీ కమిషనర్ టి. రమేష్‌బాబు పాలనాపరమైన వ్యవహారాలపై దృష్టి సారించారు. వారం రోజుల క్రితం బాధ్యతలు స్వీకరించిన ఆయన వివిధ విభాగాలను పరిశీలిస్తున్నారు. గత ఈవో వద్ద స్వామివారి వెండి, బంగారం నిల్వలను సరిచూసుకున్నారు. రామాలయంలోని పాలనాపరమైన విభాగాలన్నింటీన పరిశీలించారు. స్వామివారి నిత్యాన్నదాన సత్రాన్ని సందర్శించారు. రిజిస్టర్ల నిర్వహణను పరిశీలించారు. హాజరుపట్టికలను సరిగా నిర్వహించి తనకు అందజేయాలని ఆదేశించారు. భద్రాచలానికి వచ్చిపోయే భక్తులకు వసతి సౌకర్యాన్ని కల్పించే తానీషా మండపంలో ఉన్న సీఆర్వో కార్యాలయాన్ని తనిఖీ చేశారు. రోజువారీగా ఖాళీ అయ్యే గదులు, సత్రాలు, కాటేజీల వివరాలను నోటీస్ బోర్డులో ఉంచాలని సూచించారు. రామయ్య స్వామిని దర్శించుకునే ఉచిత క్యూలైన్ల వద్ద స్వామివారి నామాలు పెట్టేందుకు ప్రత్యేక అర్చకున్ని నియమిస్తామన్నారు. అక్కడ ఆలయానికి సంబంధించిన అర్చకుడు కాకుండా బయటి వ్యక్తులు భక్తుల నుంచి డబ్బులు తీసుకొని నామాలు పెట్టడాన్ని ఆయన ఆక్షేపించారు. దేవస్థానంపై దేవాదాయశాఖ అధికారులు పెత్తనం పెరుగుతుందని పలువురంటున్నారు. భద్రాచలం దేవస్థానానికి ఇప్పటి వరకు ఆర్జేసీ కేడర్ అధికారులు ఈవోలుగా రావడంతో ఇప్పటి వరకు దేవాదాయశాఖకు చెందిన అధికారులకు అంతగా ప్రాధాన్యం లభించేది కాదు. దీనిపై గతంలో దేవాదాయశాఖ ఉద్యోగులు, అధికారులు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. చాలా రోజుల తరువాత దేవాదాయశాఖకు చెందిన డెప్యూటీ కమిషనర్‌కే దేవస్థాన ఈవో బాధ్యతలు అప్పగించడంతో దేవాదాయశాఖ పెత్తనం పెరగవచ్చనే అభిప్రాయం వెలువడుతోంది. దేవస్థానం ఉద్యోగులు, అర్చకులు, వేదపండితులు ఐక్యంగా ఉంటేనే ఆలయ అభివృద్ధి సాధ్యమని ఇన్చార్జి ఈఓ రమేశ్‌బాబు అన్నారు. రామాలయంలో పరిపాలన పూర్తిగా గాడి తప్పిందన్న విషయం వాస్తవమేనన్నారు. దాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నానన్నారు. ఉద్యోగులను నొప్పించాలన్నది తన అభిమతం కాదన్నారు. అందరూ తమ విధులను నిబద్ధతతో నిర్వహిస్తేనే అభివృద్ధి చెందిన రామాలయాన్ని చూడవచ్చన్నారు. అభివృద్ధికి ఆలయ అర్చకులు, అధికారులు సహకరించాల్సిందిగా కోరారు. -
గూడెంలో మరో యూనివర్సిటీ
- నేడు తన ప్రసంగంలో వెల్లడించనున్న గవర్నర్ - విమానాశ్రయ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న వారికి శాశ్వత పట్టాలు - దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు వెల్లడి. తాడేపల్లిగూడెం : తాడేపల్లిగూడెంలో మరో యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన శనివారం వెలువడనుంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించే సమయంలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు శుక్రవారం తెలిపారు. హైదరాబాద్ నుంచి ఫోన్లో విలేకరులతో మాట్లాడుతూ తాడేపల్లిగూడెం విమానాశ్రయ ప్రాంతంలో ఇళ్లు నిర్మించుకున్న వారికి శాశ్వత పట్టాలు ఇచ్చే విషయమై శుక్రవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో చర్చించినట్టు మంత్రి వెల్లడించారు. సుమారు 150 ఎకరాల విస్తీర్ణంగల విమానాశ్రయ భూముల్లో వేలాదిమంది ఇళ్లు నిర్మించుకుని జీవనం సాగిస్తున్నారని, వీరికి మునిసిపాలిటీ మౌలిక సదుపాయాలు కల్పిం చినా ఇళ్ల పట్టాలు మంజూరు చేయలేదని పేర్కొన్నారు. వీటికోసం 30 ఏళ్లుగా ఈ ప్రాంత వాసులు ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఈ విషయాలన్నింటినీ ముఖ్యమంత్రికి నివేదించానని చెప్పారు. సమీపంలోని గన్నవరం, రాజమండ్రిలో విమానాశ్రయాలు ఉన్న దృష్ట్యా ఇక్కడ విమానాశ్రయం పునరుద్ధరించాల్సిన అవసరం లేదని మంత్రి పేర్కొన్నారు. ఈ విషయాలను సావధానంగా విన్న చంద్రబాబు సానుకూలంగా స్పందించారని చెప్పారు. యూనివర్సిటీకి ఓకే! తాడేపల్లిగూడెంలోని ఏయూ క్యాంపస్‌లో గోదావరి యూనివర్సిటీ ఏర్పాటుకు మార్గం సుగమం అవుతోందని మంత్రి మాణిక్యాలరావు చెప్పారు. రైతులకు, గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపయుక్తంగా ఉండే కోర్సులతో యూనివర్సిటీ రానుందని చెప్పారు. శనివారం నాడు గవర్నర్ ప్రసంగంలో తాడేపల్లిగూడెంలో యూనివర్సిటీ నెలకొల్పే అంశం ఉంటుందని తెలిపారు. ఈ విషయం తెలియడంతో జిల్లాలో విద్యారంగానికి చెందిన వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
రామాలయ ఈవో బదిలీ
భద్రాచలం టౌన్: భద్రాచల శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం ఈవో ఎం.రఘునాథ్‌ను బదిలీ చేస్తూ రాష్ట్రప్రభుత్వం బుధవారం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ మేరకు జీవోనెం10ని విడుదల చేసింది. దేవాదాయ శాఖ వరంగల్ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్న టీ.రమేష్‌బాబుకు భద్రాచలం దేవస్థానం ఇన్చార్జ్ బాధ్యతలను అప్పచెప్పింది. రచ్చకెక్కిన వివాదంతోనే... రామాలయ ఈవోగా 2013 మార్చి1న రఘునాథ్ బాధ్యతలను స్వీకరించారు. 2013, 2014 సంవత్సరాలలో శ్రీరామనవమి, 2014 ముక్కోటి ఉత్సవాలతో పాటు శబరి ఉత్సవాలను సైతం విజయవంతంగానే నిర్వహించారు. అయితే పరిపాలనాపరంగా ఉద్యోగులు, వేదపండితులు, అర్చకులతో ఈవోకు అనేకమార్లు విభేదాలు పొడచూపాయి. ఈనేపథ్యంలోనే ఆలయంలో ఉన్న వైదిక కమిటీని సైతం రద్దు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా తన మాట వినని వారికి మెమోలను జారీ చేశారనే ఆరోపణలను సైతం మూటగట్టుకున్నారు. కాగా, ఈవో వేధింపులకు పాల్పడుతున్నారని, ఆయనను సస్పెండ్ చేయాలంటూ ఆలయ ఉద్యోగులు, వేదపండిత ులు, అర్చకులు ఇటీవల ఆలయ ప్రాంగణంలో 9 రోజులు దీక్షలను చేశారు. ఈ దీక్షలకు టీజేఏసి నాయకులతో పాటు స్థానిక ప్రజా, కుల, ఉద్యోగ సంఘాలతో పాటు పలు రాజకీయ పార్టీలు సంఘీభావం తెలిపా యి. దీనితో పాటు రామనారాయణ నామస్మరణను కావాలనే వివాదం చేశారంటూ వేదపండితులు దేవాదాయ శాఖ, ప్రభుత్వ అధికారులకు నివేదికలను అందచేశారు. ఈవోగా రఘునాథ్ బాధ్యతలు స్వీకరించనప్పటి నుంచి జరిగిన అనేక అభివృద్ధి పనులలో, టెండర్లలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని, ఈవోపై విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీటన్నింటిపై సమాలోచనలు చేసిన ప్రభుత్వం ఈవోను తిరిగి వెనక్కిరప్పించుకునేందుకే నిర్ణయించి జీవోను విడుదల చేసింది. దీంతో పాటుగా ఈవో ఆంధ్రా ప్రాంతానికి చెందిన అధికారి కావడంతో మరో 2, 3 నెలలోనైనా ఆంధ్రా ప్రాంతానికి పంపాల్సిందే కాబట్టి అప్పటి వరకైనా వివాదానికి ముగింపు పలకాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ జీవోను జారీ చేసినట్లు సమాచారం. రామాలయ ఈవోగా రఘునాథ్ 15 నెలలు పనిచేసిన కాలంలో ఉత్సవాలను విజయవంతం చేసి అభినందలను అందుకున్నా, ఉద్యోగులు, వేదపండితులతో సఖ్యత లేని కారణంగా వివాదాల ఈవోగా పేరుపడ్డారు. -
శివశివా.. నాగపడగలెట్టా ?
నాలుగు రోజులకు మాత్రమే సరిపడా నిల్వలు రూ.100 కోట్ల వెండి కరిగింపునకు బ్రేక్ రాహుకేతు పూజలెలా చేయూలి? కొత్త ఈవోకు తొలిరోజే ఇక్కట్లు శ్రీకాళహస్తి: దేవాదాయశాఖ అధికారులు తీసుకున్న అనాలోచిత నిర్ణయంతో శ్రీకాళహస్తి రాహుకేతు క్షేత్రంలో నాగపడగల కొరత తీరేలా లేదు. దీంతో ఆలయాధికారులు తలలు పట్టుకుంటున్నారు. రాహుకేతు పూజలకు వినియోగించే నాగపడగలు ఇక నాలుగు రోజులకు (75కేజీలు) సరిపడేంత మాత్రమే ఉన్నాయి. దీంతో అధికారులు దేవాదాయశాఖ కమిషనర్ అనురాధ ఆదేశాలను ధిక్కరించలేక.. ఇటు నాగపడగలను రాహుకేతు పూజలకు ఎలా అందించాలో అర్థం కాక దిక్కులు చూస్తున్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో సుమారు రూ. 100 కోట్ల వెండి నిల్వలు ఉన్నాయి. కాగా వారం రోజుల క్రితం దేవాదాయశాఖ కమిషనర్‌గా ఉన్న ముక్తేశ్వరరావు ముక్కంటి ఆలయంలోని 16 టన్నుల వెండి నిల్వలను హైదరాబాద్‌లో కరిగించాలని, నాగపడగల అవసరాలు, ఆలయంలో ఉత్సవ వాహనాల మరమ్మతులు, నూతన ఉత్సవ వాహనాల ఏర్పాటుకు పోగా మిగిలిన వెండిని విక్రయించుకోవచ్చని ఆదేశాలు జారీ చేశారు. దీంతో రెండు రోజుల క్రితం ఈవోగా ఉన్న రామచంద్రారెడ్డి నిల్వ ఉన్న వెండిని హైదరాబాద్‌కు తరలించడానికి సన్నాహాలు చేస్తున్న తరుణంలో ఆయన బదిలీ అయ్యారు. తిరుపతి ఆర్జేసీగా పని చేస్తున్న శ్రీనివాసరావు ఆదివారం నూతన ఈవో గా బాధ్యతలు చేపట్టారు. కాగా వారం క్రితం దేవాదాయశాఖ కమిషనర్‌గా బాధ్యలు చేపట్టిన అనురాధ ఆలయంలోని వెండి నిల్వల్లో ఒక్క కేజీని కూడా కరిగించరాదని, ఆలానే ఉంచాలని శనివారం రాత్రి ఉత్తర్వులు పంపారు. దీంతో రూ.100 కోట్ల వెండి నిల్వలకు బ్రేక్ పడింది. అయితే వెండిని కరిగించి నాగపడగలు తయారు చేసే సామర్థ్యం కలిగిన యంత్రాలు ఆలయంలోని మింట్‌లో లేవు. హైదరాబాద్‌లో వెండిని కరిగించి ముద్దలు చేసి ఆలయానికి తీసుకు వస్తే స్థానికంగా ఉన్న మింట్‌లో నాగపడగలు తయారు చేయడానికి అవకాశం ఉంది. ఆలయంలో నిల్వ ఉన్న రూ.100 కోట్ల వెండి కాకపోయినా కనీసం నాగపడగలకు అవసరమైన వెండినైనా హైదరాబాద్‌లో కరిగించడానికి దేవాదాయశాఖ అనుమతి ఇస్తే నాగపడగల కొరత తీరుతుంది. అయితే ఒక్క కేజీ కూడా కరిగించరాదని ఆదేశాలు ఇవ్వడంతో రాహుకేతు పూజలకు నాగపడగల ఇక్కట్లు తప్పేలా లేవు. నాగపడగలకు సమయం ఇలా.. ప్రతి ఆరు నెలలకు ఓసారి ఆలయాధికారులు 2500 కేజీల వెండిని హైదరాబాద్‌లోని మింట్‌లో కరిగిస్తారు. అక్కడి నుంచి వెండి ముద్దలను ఆలయానికి తీసుకువస్తే ఇక్కడ నాగపడగలు తయారు చేస్తారు. హైదరాబాద్‌లోని మింట్‌లో రోజుకు 700 నుంచి 800 కేజీల వెండిని మాత్రమే కరిగించడానికి అవకాశం ఉంది. ఈ లెక్కన 2500 కే జీల కరిగింపునకు మూడు రోజుల సమయం పడుతుంది. ఇక ఆ వెండి ముద్దలను నాగపడగలుగా చేయడానికి ఆలయంలోని మింట్‌లో మరో మూడు రోజులు పడుతుంది. అలాగే హైదరాబాద్‌కు తీసుకు పోవడానికి ఒక్కరోజు, కరిగించిన ముద్దలను శ్రీకాళహస్తికి తీసుకురావడానికి మరో రోజు సమయం పడుతుంది. మొత్తం మీద ఎనిమిది రోజుల సమయం కావాల్సి ఉంది. అయితే ఆలయంలో నాలుగు రోజులకు సరిపడా మాత్రమే నాగపడగలు ఉన్నాయి. దీంతో నూతనంగా ఈవో బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసరావు ఆదివారం నాగపడగలకు అవసరమైన వెండి కరిగింపునకు అనుమతి ఇవ్వాలని పదేపదే దేవాదాయశాఖ అధికారులతో ఫోన్ ద్వారా సంప్రదించారు. ఆలయ ఈవోలను కాపాడడం కోసమేనా? ఆలయంలోని వెండిని కరిగించరాదనే ఆదేశాలు గతంలో ఈవోలను కాపాడడం కోసమేనా? అంటూ పలువురు విమర్శలు చేస్తున్నారు. ఆలయంలో పదేళ్లుగా రూ.100 కోట్ల వెండి నిల్వలు ఉన్నప్పటికీ గతంలో పనిచేసిన పలువురు ఈవోలు నిల్వ ఉన్న వెండిని కరిగించి నాగపడగలు చేయకుండా చెన్నైలో నాగపడగలను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే వాటి కొనుగోళ్లలో భారీగా అక్రమాలు ఉన్నాయనే ఆరోపణలున్నాయి. వెండి కొనుగోలుపై విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా నాగపడగల తయారీలో వెండిశాతం 90 నుంచి 95 శాతం ఉంటేనే వినియోగించాల్సి ఉంది. ప్రస్తుతం మింట్‌లో తయారు చేస్తున్న నాగపడగల్లోనూ అదే నియమాలు (90-95 శాతం వెండి) పాటిస్తున్నారు. అయితే చెన్నైలో భారీ మొత్తంలో అప్పట్లో పలువురు ఈవోలు కొనుగోలు చేసిన వెండిలో 60 నుంచి 65శాతం మాత్రమే వెండి ఉండేలా కోనుగోలు చేసి మిగిలిన మొత్తాన్ని ఈవోలు నోక్కేశారనే ఆరోపణలు ఉన్నాయి. కాగా ప్రస్తుతం ఆలయంలో నిల్వ ఉన్న రూ.100 కోట్ల వెండిని కరిగిస్తే సంవత్సరాల వారీగా ఈవోలు కొనుగోలు చేసిన నాగపడగల్లో వెండి శాతం బయటపడుతుంది. దీంతో ఈవోలకు ఇబ్బందులు తప్పేలా లేవు. ఈ ఉద్దేశంతో దేవాదాయ శాఖాధికారులు వెండిని కరిగించకుండా నిలుపుదల చేశారని తెలుస్తోంది. రూ.100 కోట్ల వెండి నిల్వలు కరిగించకుండా విక్రయించి, అవసరమైన నాగపడగలు కొనుగోలు చేస్తే సరిపోతుందని అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. వారం రోజుల క్రితం దే వాదాయశాఖ కమిషనర్ ముక్తేశ్వరరావు మొత్తం వెండిని హైదరాబాద్‌లో కరిగించాలని ఆదేశాలు జారీచేస్తే, ఆయన పదవీ విరమణతో కమిషనర్ బాధ్యతలు చేపట్టిన అనురాధ ఒక్క కేజీ వెండి కూడా కరిగించరాదని ఆదేశాలు పంపడం విమర్శలకు దారితీస్తోంది. కొరత రానివ్వం రాహుకేతు పూజలకు ఎట్టిపరిస్థితుల్లోనూ నాగపడగల కొరత రానివ్వం. పూజలకు అవసరమైన నాగపడగలు 75 కేజీలు ఉన్నాయి. నాలుగైదు రోజులు ఇబ్బంది లేదు. దేవాదాయశాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడి నాగపడగల కోసం వెండిని కరిగించడం కోసం అనుమతి తీసుకుం టాం. పూజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం. -శ్రీనివాసరావు, ఆలయ ఇన్చార్జి ఈవో -
విన్నపాలు వినవలె..
భీమవరం కల్చరల్ :జిల్లాలోని ఆలయాలను భక్తి భావం ఉట్టి పడేలా తీర్చిదిద్దాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పైడికొండల మాణిక్యాలరావుకు భక్తులు చేసుకుంటున్న విన్నపాలు ఇవి.జిల్లాలో దేవాదాయ, ధర్మాదాయ శాఖకు చెందిన వేలాది ఎకరాల భూములు అన్యాక్రాంతమయ్యాయి. వాటికి సంబంధించి కోర్టుల్లో కేసులు కూడా నడుస్తున్నాయి. వాటి పరిష్కారానికి కృషి చేయాలి.పురాతన ఆలయాలు, జీర్ణావస్థకు చేరిన ఆలయాల మరమ్మతులకు జిల్లాకు రూ.4 కోట్లు విడుదలయ్యాయి. ప్రస్తుతం అంచనాల దశలోనే అవి ఉన్నాయి. పనులు వేగవంతం చేయాల్సిన అవసరముంది.జిల్లాలో ప్రధానమైన ద్వారకాతిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలి. భక్తులు వేచియుండేందుకు అదనంగా గదుల నిర్మాణం, సత్రాల నిర్మాణాలను చేపట్టాలి. ప్రముఖమైన పలు ఆలయాలకు స్థలాల కొరత తీవ్రంగా ఉంది. దీంతో అక్కడ అన్నసమారాధనలు చేసేందుకు, విశ్రాంతికి గదులు, వివాహాలకు కావలసిన వసతులు లేక భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి ఆలయాలను గుర్తించి ప్రభుత్వ స్థలాలను వాటికి కేటాయించేలా చూడాలి.కొన్ని ఆలయాలకు వాస్తు దోషాలు ఉన్నట్టు గుర్తించారు. దేవాదాయ శాఖ స్తపతులతో వాస్తు మార్పులను చేపట్టాలి. స్తపతులతో సంప్రదించకుండానే చాలా ఆలయాల్లో వాస్తు మార్పులు చేస్తున్నారు. వాటిని గుర్తించి సరిచేయాలి.ఆలయాల్లో సిబ్బంది కొరత వేధిస్తోంది. ఆ ఖాళీలను భర్తీ చేయాలి.ఉద్యోగుల సమస్యలుదేవాదాయ, ధర్మాదాయ శాఖ ఉద్యోగులకు పదవీ విరమణ వయసు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 60 ఏళ్లు వర్తించేయాలి. టెంపుల్ ఉద్యోగులకు సంబంధించి సం బంధిత ఆలయంలో వస్తున్న ఆదాయాన్ని వారి జీతాలకు కేటాయిస్తున్నారు. అలా కాకుండా జిల్లాలో అన్ని దేవాలయాలకు ఒక కామన్ ఫండ్‌ను ఏర్పాటు చేసి జీతాలు ఇస్తే వారి ఇబ్బందులు తొలగుతాయి.ఉద్యోగులకు సక్రమంగా ప్రమోషన్లు రావాలంటే జీవో 888లోని రూల్ 33 ను తొలగించాలి. అప్పుడే సీనియారిటీ ప్రకారం ప్రమోషన్లు దక్కుతాయి. మాతృ సంస్థతో సంబంధం లేకుండా 2010 పీఆర్సీనీ, ఇతర బెనిఫిట్స్‌ను అమలు చేయాలి పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు, అర్చ క, ఇతర సిబ్బందికి సంక్షేమ నిధి నుంచి ఇచ్చే గ్రాట్యుటీ రూ.2 లక్షలకు జీతం సీలింగ్‌గా పెట్టిన రూ.12,500 తొలగించి, గ్రాట్యుటీ రూ.5 లక్షలకు పెంచాలి. సిబ్బందికి 65ఎ ఫండ్ ద్వారా జీతాల ఇచ్చేలా సవరణ చేయించాలి. -
కూర్మనాథాలయంపై ఫ్లయింగ్ కెమెరా కన్ను!
- దేవాదాయ శాఖాధికారులు లేకుండా షూటింగ్ జరగడంపై అనుమానాలు - ఆందోళన చెందుతున్న భక్తులు శ్రీకూర్మం(గార),న్యూస్‌లైన్ : ప్రఖ్యాత క్షేత్రం శ్రీకూర్మంలోని కూర్మనాథాలయంపై కొందరు వ్యక్తులు ఫ్లయింగ్ కెమెరాతో చిత్రీకరణ జరపడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులు ఫ్లయిం గ్ కెమెరాతో వచ్చారు. శ్వేతపుష్కరిణి, గర్భగుడి, బేడా మండపం, తదితర స్థలాల్లో చిత్రీకరణ జరిపారు. ఈ సమయంలో ఆలయ అధికారులు, సిబ్బంది ఎవరూ లేరు. వాస్తవానికి, ఆలయంలో ఫోటోలు తీయటం, కెమెరాలు, సెల్ఫోన్లు వాడటం నిషిద్ధం. ఒకవేళ షూటిం గ్ జరపాలనుకుంటే ఉన్నతాధికారుల ప్రత్యేక అనుమతితో అధికారుల సమక్షంలో చేపట్టాలి. దీనికి సాధారణ కెమెరాలనే వినియోగించాలి. ఇప్పుడు అలా కాకుండా ఏకంగా ఫ్లయింగ్ కెమెరాను వినియోగించారు. రిమోట్ సాయంతో పనిచేసిన ఈ కెమెరా 10 నుంచి 20 అడుగుల పైకి వెళ్లి చిత్రీకరణ చేసింది. దేశంలోని ప్రముఖ ఆలయాలకు ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందని నిఘా వర్గాలు ఎప్పటికప్పడు హెచ్చరిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు లేని సమయంలో ఎవరో తెలియని వ్యక్తులు ఫ్లయింగ్ కెమెరాతో చిత్రీకరణ జరపడంతో భక్తుల్లో ఆందోళన నెలకొంది. ఇదిలా ఉండగా గతేడాది మూలవిరాట్‌కు మైనంతో అచ్చుతీయడం, శిలాశాసనాల డీకోడింగ్ అంశాలపై ఓ అర్చకుడు సస్పెండ్ కావడం, ఈవో బదిలీ అయిన సంగతి తెలిసిందే. ఫ్లయింగ్ కెమెరాతో చిత్రీకరణపై ఆలయ కార్యనిర్వహణాధికారి వి.శ్యామలాదేవిని ‘న్యూస్‌లైన్’ ప్రశ్నించగా షూటింగ్ జరిపిందెవరో తమకు తెలియదన్నారు. గతంలో జాయింట్ కలెక్టర్ సీసీ ఫోన్ లో చెప్పిన సూచనల మేరకు జిల్లా వైభవంపై డాక్యుమెంటరీ షూటింగ్ రెండు సార్లు ఆల యంలో జరిగిందన్నారు. ఇప్పుడు కూడా వారే చిత్రీకరణ చేసి ఉండవచ్చన్నారు. -
దేవాదాయ చట్టంలో వైఎస్ మార్పులు అమలు చేయాలి
సాక్షి, హైదరాబాద్: హిందూ దేవాలయాల పరిరక్షణ కోసం దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి దేవాదాయ, ధర్మాదాయ చట్టంలో తీసుకొచ్చిన మార్పులను అమలు చేయాలని చిలుకూరు బాలాజీ దేవస్థానం ప్రధాన అర్చకులు సౌందరరాజన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తిచేశారు. ఆయన పలువురు ఆలయ అర్చకులతో కలిసి శనివారం ఉదయం వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ మేనిఫెస్టో కమిటీతో సమావేశమయ్యారు. వైఎస్ మాదిరిగానే దేవాలయాల పరిరక్షణకు వైఎస్సార్ సీపీ చర్యలు తీసుకోవాలని, ఆ మేరకు ఎన్నికల ప్రణాళికలో చేర్చాలని కోరారు. చర్చల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 1987లో దేవాదాయ, ధర్మాదాయ చట్టాన్ని మార్చి రాష్ట్రంలోని దేవాలయ వ్యవస్థను పాడుచేశారని ఆవేదన వ్యక్తంచేశారు. 2003లో వైఎస్ దృష్టికి తాము ఈ విషయాన్ని తీసుకెళ్లి ఆ చట్టాన్ని మార్చాలని కోరామని సౌందరరాజన్ వివరించారు. 2007లో వైఎస్ ఈ చట్టానికి మార్పులు చేసి ధార్మిక పరిషత్ కిందకు దేవాదాయ, ధర్మాదాయ శాఖ వ చ్చేలా చేశారన్నారు. 2009 ఎన్నికల తరువాత ఈ మార్పులను అమలు చేస్తే దేవాలయాలకు స్వర్ణయుగం వస్తుందనుకున్న తరుణంలో తమ దురదృష్టం కొద్దీ వైఎస్ మరణించారని ఆవేదన వ్యక్తంచేశారు. ఆ తరువాత ధార్మిక పరిషత్ గురించి ఎవరూ పట్టించుకోలేదన్నారు. వైఎస్ ఇచ్చిన హామీలు అమలు చేయడానికి పుట్టిన వైఎస్సార్ సీపీ మేనిఫెస్టో కమిటీ సభ్యులను కలిసి.. దేవాదాయ చట్టంలో చేసిన మార్పులను అమలు చేయాలని తాము కోరామని.. అందుకు వారు అంగీకరించారని కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని 34 వేల హిందూ దేవాలయాల అర్చకులు, భక్తులు వైఎస్‌ను తమ హృదయాల్లో పెట్టుకున్నారని, ఆయన తీసుకువచ్చిన మార్పులను అమలు చేస్తే దేశం సుభిక్షంగా ఉంటుందని, సమాజం బాగుపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. మేనిఫెస్టో కమిటీ సభ్యుడు ఎం.వి.మైసూరారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ ఉన్నపుడు హిందూ దేవాలయాల పరిరక్షణ కోసం చట్టంలో తెచ్చిన మార్పులను అమలు చేయడానికి తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు. అర్చకులు చేసిన సూచనలను తప్పకుండా తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చుతామని హామీ ఇచ్చారు. -
కోనేరు మింగారు
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఎర్రగట్టు దేవస్థానం కోనేరుపై కబ్జాదారుల కన్నుపడింది. విలువైన భూములను ఓ రియల్టర్ ఆక్రమించేస్తున్నాడు. అతడికి జిల్లాకు చెందిన ఓ మంత్రి అండదండలు ఉండడంతో రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారులు మిన్నకుండిపోతున్నారు. మేడారం జాతర పనులతో తీరిక ఉండడం లేదని... జాతర అయ్యాక ఎర్రగట్టు భూముల సంగతి చూస్తామని దాటవేస్తున్నారు. హసన్‌పర్తిలోని శ్రీ ఎర్రగట్టు వెంకటేశ్వరస్వామి ఆలయానికి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో సుమారు 34 ఎకరాల భూమి ఉంది. హన్మకొండ శివారులోని భీమారంలో సర్వే నంబర్ 137/సీలో ఎర్రగట్టు దేవస్థానానికి 10 గుంటల భూమి ఉంది. ఈ భూమిలో కోనేరు ఉండగా... జాతర సమయంలో భక్తులు ఇక్కడ విడిది చేసేవారు. కాలక్రమేణా ఈ కోనేరు వద్ద భక్తుల రద్దీ తగ్గింది. ఇదే అదనుగా సదరు రియల్టర్ ఈ భూములపై కన్నేశాడు. రెవెన్యూ అధికారుల సహకారంతో ఆక్రమించడంతోపాటు ప్లాట్లుగా విభజించి విక్రయాలు చేయడంతో ఆలయ భూమి అన్యాక్రాంతమైంది. మార్కెట్లో ప్రస్తుతం ఈ భూమి విలువ రూ.1.50 కోట్లు. గజానికి రూ.12 వేల నుంచి రూ.15వేల వరకు ధర పలుకుతోంది. పది రోజులుగా వివాదం ఎర్రగట్టు దేవాలయానికి నెల క్రితం కొత్త పాలకవర్గం ఏర్పాటైంది. ఆలయ కోనేరును అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. హోలీ రోజున మొదలయ్యే జాతరలోపు కోనేరులో పూడిక తీసి, అభివృద్ధి చేస్తామని ప్రకటించింది. కొత్త పాలకవర్గం ఇటీవల కోనేరును పరిశీలించేందుకు వెళ్లినప్పుడు అక్కడ ప్లాట్లు ఉన్నాయి. రెవెన్యూ రికార్డుల మేరకు కోనేరును, దాని చుట్టుపక్కల ఉన్న ఆలయ భూమిని పాలకవర్గం జేసీబీతో చదును చేయించింది. సర్వే చేసి హద్దులు పాతాలని రెవెన్యూ, దేవాదాయ అధికారులను కోరింది. ఈ క్రమంలో అక్కడ జరుగుతున్న పనులను రియల్టర్ అడ్డుకోవడంతో భూ వివాదం వెలుగులోకి వచ్చింది. కోనేరు పనులు ఎలా అడ్డుకుంటారని పాలకవర్గ సభ్యులు ప్రశ్నించగా... భూమి తనదేనని రియల్టర్ వారితో వాగ్వాదానికి దిగాడు. అరుుతే కోనేరు వద్ద ఆలయూనికి సంబంధించిన భూమి 10 గుంటలే ఉందని కొత్త రెవెన్యూ రికార్డులో ఉంది. దీనిపై ఆలయ పాలకవర్గం మండిపడింది. ఇది అధికారులు, కబ్జాదారుడి పనే అని ఆరోపిస్తోంది. ఇలా పది రోజులుగా వివాదం నడుస్తోంది. జోక్యం చేసుకుని భూమి ఎవరిదని నిర్ధారించాల్సిన రెవెన్యూ శాఖ మాత్రం చోద్యం చూస్తోంది. మంత్రి ఒత్తిడి... సీనియర్ మంత్రి తనకు మంచి మిత్రుడనే చెప్పుకునే రియల్టర్... పాలకవర్గం చర్యలతో ఇబ్బంది పడి ఒత్తిడి వ్యూహాన్ని అమలు చేయడం మొదలుపెట్టాడు. రియల్టర్ విజ్ఞప్తితో మంత్రి జోక్యం చేసుకుని రెవెన్యూ, దేవాదాయ శాఖల అధికారులు, ఆలయ పాలకవర్గంపైనా ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలిసింది. ‘ఎప్పుడో భూమి కొన్నాడు... ప్లాట్లు చేశాడు... విక్రయించాడు. ఇప్పుడు ఆలయ భూములు అంటే ఎలా..దేవస్థానానికి భూమి ఉంటే ఉండొచ్చు... అటువైపు వెళ్లకండి. ఏమైనా ఉంటే రియల్టర్ చూసుకుంటాడు.’ అని మంత్రి వారితో అన్నట్లు సమాచారం. మంత్రి జోక్యంతో అధికారులు, దేవస్థాన పాలకవర్గం కోనేరు సంగతిని పక్కనబెట్టారు. ఎర్రగట్టు భూములతో తమకు సంబంధం లేదని, దేవాదాయ శాఖ వారే చూసుకోవాలని రెవెన్యూ అధికారులు... సర్వే చేసి హద్దులు నిర్ధారించాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపైనే ఉందని దేవాదాయ శాఖ అధికారులు చెబుతుండడాన్ని బట్టి మంత్రి ఒత్తిడి ఎంత మేర పనిచేసిందో ఇట్టే గ్రహించవచ్చు. ఆలయ పాలకవర్గమే స్వయంగా పైకి తెచ్చిన కోనేరు అంశం... ఇప్పుడు వారి చర్యలతోనే మరుగునపడుతుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నారుు. మరో రూ.8 కోట్ల విలువైన భూమి ఆక్రమణ ఎర్రగట్టు ఆలయానికి సంబంధించి హసన్‌పర్తిలోని తాటివనంలో నాలుగు ఎకరాల భూమి కూడా కబ్జాకు గురైందని పాలకవర్గం చెబుతోంది. ఈ భూమి విలువ రూ.2 కోట్లు ఉంటుందని అంచనా. భీమారం పరిధిలోని సర్వే నంబర్ 138లో రూ. కోటి విలువైన మరో పది గుంటల ఆలయ భూమి పరిస్థితి ఇలాగే ఉంది. గోపాలపురం శివారులోని సర్వే నంబర్ 30లో ఆలయానికి రూ.2 కోట్ల విలువైన 37 గుంటల భూమి ఉంది. భీమారానికి చెందిన ఓ వ్యక్తి గతంలో ఈ భూమిని ప్లాట్లుగా చేసి విక్రయించాడు. ఈ అంశం హైకోర్టుకు వెళ్లగా... ఈ భూమి ఎర్రగట్టు ఆలయానిదేనని కోర్టు తీర్పు ఇచ్చింది. అరుుతే ప్రస్తుతం ఇక్కడ 20 గుంటల భూమి మాత్రమే ఉంది. మిగిలిన 17 గుంటల భూమి కబ్జాకు గురైనట్లేనని తెలుస్తోంది. గోపాలపురంలోని దుప్ప తీర్థం వద్ద ఉన్న సుమారు 20 గుంటల భూమి కూడా అన్యాక్రాంతమైనట్లు పాలకవర్గం చెబుతోంది. దీని విలువ మరో రూ.3కోట్లు ఉంటుందని అంచనా. -
మంత్రులను అడ్డుకుంటాం
=జాతర పనుల్లో అధికార యంత్రాంగం ఏకపక్షం =పూజారులు, ఆదివాసీ గిరిజన సంఘాల ఆగ్రహం =తలనీలాల వ్యవహారంపై వివాదం =సమస్యలపై తిరుగుబాటుకు స్థానికులు సిద్ధం =నేడు మేడారంలో అమాత్యుల పర్యటన సాక్షి, హన్మకొండ: మేడారం జాతరలో గిరిజన ఆచార వ్యవహారాలు, ఇక్కడి ప్రజల బాగోగులను పట్టించుకోకుండా అధికార యంత్రాంగం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని పూజారుల సంఘం, ఆదివాసీ గిరిజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జాతర ఏర్పాట్ల కారణంగా తమకు వాటిల్లుతున్న నష్టానికి పరిహారం ఇప్పించాలని ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. తమ హక్కులకు రక్షణ కల్పించకపోతే శనివారం మేడారంలో పర్యటించనున్న మంత్రులను అడ్డుకుంటామని తేల్చిచెప్పాయి. మేడారం పర్యటన పేరుతో ఇక్కడికి వచ్చే మంత్రులు... అభివృద్ధి పనుల పరిశీలన, సమీక్షల కంటే ముందు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చిం చాలని ఆయూ సంఘాల నేతలు అంటున్నారు. ఆ తర్వాతే సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్దకు వెళ్లేందుకు వారిని అనుమతిస్తామన్నారు. ఇప్పటికే తలనీలాల వ్యవహారంపై సమ్మక్క- సారలమ్మ జాతర కార్యనిర్వాహణ అధికారి దూస రాజేశ్వరరావుకు పూజారుల సంఘం ఈ నెల 15న సమ్మె నోటీస్ ఇచ్చింది. జుట్టుపై పీఠముడి మేడారం జాతర 1967లో దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చింది. అప్పటి నుంచి దేవాదాయశాఖ పర్యవేక్షణలో జాతర సాగుతోంది. గత జాతర సమయంలో 80 లక్షల మంది హాజరవుతారని భావించి రూ.42 లక్షలు చెల్లించి పూజారుల సంఘం తలనీలాల పనులను దక్కించుకుంది. ఈసారి కోటికి పైగా భక్తులు వస్తారనే అంచనాతో రూ.75 లక్షలు చెల్లించేందుకు పూజారుల సంఘం సిద్ధమైంది. కానీ, ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో తలనీలాలకు డిమాండ్ ఉండడంతో.. నామినేషన్ పద్ధతిన కాకుండా టెండర్లు పిలిస్తే కాంట్రాక్టర్ల మధ్య పోటీ పెరిగి ఎక్కువ ఆదాయం వస్తుందని దేవాదాయ శాఖ అంచనా వేస్తోంది. అయితే కాంట్రాక్టర్లు రింగైతే ఆదాయం తగ్గి తమకు నష్టం జరుగుతుందన్న అనుమానాలను గిరిజన పూజారులు వ్యక్తం చేస్తున్నారు. 2004, 2006 జాతర సమయాల్లో టెండర్లు పిలిస్తే రూ.10 లక్షలకు మించి పలకలేదు. దీంతో 2008 జాతర నుంచి మళ్లీ నామినేషన్ పద్ధతిని అమల్లోకి తెవడం వీరి వాదనకు బలం చేకూరుస్తోంది. పంట నష్ట పరిహారం ఏదీ.. జాతరకు వచ్చే భక్తులకు బస, బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్, పార్కింగ్ తదితర అవసరాల నిమిత్తం జాతర జరిగే పరిసరాల్లో స్థానిక రైతులు రెండో పంట వేయడం లేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారం మేడారం, కన్నెపల్లి, ఊరట్టం, కొత్తూరు, రెడ్డిగూడెం గ్రామాల పరిధిలో 164 మంది రైతులు 1015 ఎకరాల్లో రెండో పంటను నష్టపోతున్నారు. ఇందులో పట్టా భూములు 740, ప్రభుత్వ భూమి 274 ఎకరాలు ఉంది. దీనికి తోడు స్థానిక పొలాల్లో తాత్కాలిక మరుగుదొడ్లు, బ్యాటరీ ఆఫ్ టాప్స్ నిర్మాణాలు చేపట్టే అధికారులు.. జాతర ముగిసిన తర్వాత వాటిని పీక్కుని వెళ్తున్నారు. ఫలితంగా పొలాల్లో గుంతలు ఏర్పడుతున్నాయి. ఇక పార్కింగ్ పేరుతో పొలం గట్లను కూల్చేసి మైదానంలా మారుస్తున్నారు. జాతర ముగిసిన తర్వాత ఈ గుంతలను పూడ్చుకోవడం, గట్లు కట్టుకునేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతీ జాతర సందర్భంలో వీరికి నష్టపరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇస్తున్నా... ఇంత వరకు అమల్లో పెట్టలేదు. దీంతో రెండో పంట నష్టంపై స్పష్టమైన హామీ ఇవ్వాల్సిందేనని స్థానికులు కోరుతున్నారు. రైతలకు నష్టం వస్తోంది : అల్లం రామ్మూర్తి, మేడారం జాతర మాజీ చైర్మన్ భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న శానిటేషన్ పనుల వల్ల రైతుల పంట భూములకు నష్టం వస్తుంది. ప్రైవేట్ పార్కింగ్‌ల కోసం పంట భూముల ఒడ్లు తొలగిస్తున్నారు. జాతర తర్వాత వాటిని సరి చేసుకునేందుకు రైతులకు ఖర్చు ఎక్కువవుతోంది. జాతర పేరిట కోట్లాది నిధులు కేటాయిస్తున్న ప్రభుత్వం.. గిరిజన రైతుల రెండో పంట నష్ట పరిహారం ఎందుకు చెల్లించడం లేదు. స్థానిక సమస్యలపై మంత్రులు హామీ ఇచ్చేంత వరకు పూజా కార్యక్రమాలు అడ్డుకుంటాం. ఈ నిరసన కార్యక్రమంలో ఆదివాసీ ప్రజలు, కుల సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. -
సమాచారమివ్వకపోతే చర్యలే
అమలులో నిర్లక్ష్యం =స.హ.చట్టం పరిధిలోనే దేవాదాయశాఖ =తప్పుడు సమాచారమిస్తే జరిమానా =కమిషనర్ పీ విజయబాబు మచిలీపట్నం, న్యూస్‌లైన్ : ఉద్యోగులూ ప్రజలేనన్న నిజాన్ని గ్రహిస్తే సమాచార హక్కు చట్టం ద్వారా వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించగలుగుతారని స.హ. చట్టం కమిషనర్ విజయబాబు అన్నారు. స్థానిక హిందూ కళాశాలలో స.హ. చట్టంపై జిల్లా అధికారులు, అప్పిలేట్ అధికారులు, పౌరసమాచార అధికారులు, సహాయ పౌర సమాచార అధికారులకు గురువారం అవగాహన సదస్సు జరిగింది. ఆయన మాట్లాడుతూ స.హ. చట్టాన్ని అమలు చేయడం ఉద్యోగుల విధుల్లో భాగమేనన్నారు. 2005 అక్టోబరు నుంచి అమలులోకి వచ్చిన స.హ. చట్టం సత్ఫలితాలిస్తుందని చెప్పారు. ఈ చట్టం అమలులో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ఎంతో చరిత్ర కలిగిన ్ణజిల్లా అభివృద్ధిలో వెనుకబడి ఉండటానికి కారణం వివిధ అభివృద్ధి పథకాల్లో ప్రజల భాగస్వామ్యం లేకపోవటమేనని చెప్పారు. స.హ. చట్టం ప్రకారం సమాచారమివ్వని కార్యాలయ అధికారులపై 41-బీ ప్రకారం చర్యలు తీసుకునే అధికారం కమిషనర్‌కు ఉందన్నారు. తప్పుడు సమాచారం ఇచ్చే అధికారులకు రూ. 25 వేలు జరిమానా విధించే అవకాశం ఉందన్నారు. కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు మాట్లాడుతూ భారతదేశంతో పాటు స్వాతంత్య్రం పొందిన ఇతర దేశాలతో పోలిస్తే మనదేశం ఆదర్శంగానే ఉందన్నారు. పారదర్శకమైన పాలన అందించడానికి స.హ. చట్టం అమలు చేయడం మంచి పరిణామమని చెప్పారు. జేసీ పీ ఉషాకుమారి మాట్లాడుతూ ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుందన్నారు. వివిధ శాఖల అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు స.హ. చట్టం కమిషనర్ విజయబాబు సమాధానమిచ్చారు. జిల్లా ఖజానాశాఖ డీడీ నాగేశ్వరరావు, డీఆర్వో ఎల్.విజయచందర్ , విజయవాడ, నూజివీడు సబ్కలెక్టర్లు డీ హరిచందన, చక్రధరరావు, బందరు ఆర్డీవో పీసాయిబాబు, డీఆర్డీఏ పీడీ శివశంకరరావు, పశుసంవర్ధకశాఖ జేడీ దామోదరనాయుడు, డ్వామా పీడీ అనిల్‌కుమార్, వ్యవసాయశాఖ జేడీ సీహెచ్ బాలునాయక్, గుడివాడ ఏఎన్ఆర్ కళాశాల ఉద్యోగి పీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. అమలులో ఇంత నిర్లక్ష్యమా.... సమాచార హక్కు చట్టం అమలులో జిల్లా వెనుకబడి ఉందని విజయబాబు అన్నారు. స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ చట్టం అమలులోకి వచ్చిన 120 రోజుల్లో చట్టాన్ని అమలు చేసే అప్పిలేట్ అధికారుల వివరాలను ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఏర్పాటు చేయాల్సి ఉండగా.... 8సంవత్సరాలైనా ఈ ప్రక్రియ జిల్లాలో పూర్తి కాలేదన్నారు. స.హ. చట్టం అమలులో జిల్లాలో పనిచేస్తున్న అధికారులు పూర్తిగా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారనడానికి ఇంతకంటే ఉదాహరణ లేదని చెప్పారు. దేవాదాయశాఖ అధికారులు తాము ఈ చట్టం పరిధిలో లేమని చెప్పి తప్పించుకుంటున్నారన్నారు. స.హ. చట్టం పరిధిలోకి దేవాదాయశాఖ వస్తుందని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలోని జగ్గయ్యపేట సమీపంలో ఒక దేవస్థానం ట్రస్టీ పరిధిలో ఉన్నందున సమాచారం ఇవ్వటానికి నిరాకరిస్తూ హైకోర్టును ఆశ్రయించారని చెప్పారు. ప్రతి ఒక్కరికీ అర్ధమయ్యే విధంగా స.హ. చట్టంపై పుస్తకాలు ముద్రించి పంపిణీ చేయాల్సి ఉందన్నారు. ఢిల్లీలో అమ్ఆద్మీ పార్టీని స్థాపించి ఎన్నికల్లో అధిక సీట్లు సాధించిన క్రేజీవాల్ స.హ. చట్టం కార్యకర్తగానే తన జీవితాన్ని ప్రారంభించారన్నారు. మచిలీపట్నం విలేకరుల ఆధ్వర్యంలో విజయబాబును ఘనంగా సత్కరించారు. శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి సేవలో... మోపిదేవి : మోపిదేవి శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయన వెంట అవనిగడ్డ ఎస్ఐ శ్రీనివాస్, వీఆర్వో శేషగిరిరావు, ఆలయ సిబ్బంది ఉన్నారు. -
ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం రూ.1.5 కోట్ల
నక్కపల్లి, న్యూస్‌లైన్ : జిల్లాలో శిథిలావస్థకు చేరుకున్న ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం రూ.1.5 కోట్ల సీజీఎఫ్ నిధులు విడుదల చేసిందని దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ దుర్గాప్రసాద్ తెలిపారు. గురువారం ఆయన ఒడ్డిమెట్ట వినాయక ఆలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ నిధులతో జిల్లాలో ఆరు దేవాలయాలను అభివృద్ధి, మరమ్మతుల కు త్వరలో టెండర్లు పిలుస్తామన్నారు. ఆక్రమణలో ఉన్న దేవాదాయశాఖ భూముల స్వాధీనానికి చర్యలు చేపడుతున్నామని, వాటి వివరాలివ్వాలని ఈవోలకు ఆదేశాలిచ్చామన్నారు. ఏళ్ల తరబడి వసూలు కాని శిస్తు బకాయిలు, భూముల స్వాధీనంపైనే దృష్టి సారించాలని ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు. ఆక్రమణదారులు స్వచ్ఛందంగా ఖాళీ చేసి అప్పగించని పక్షంలో చట్టపరంగా రెవె న్యూ, పోలీసు శాఖల సహకారంలో స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. చోడవ రం స్వయంభూ వినాయక ఆలయ షాపి ంగ్ కాంప్లెక్స్‌లో ఆక్రమణలు తొలగి ంచి బహిరంగ వేలం ద్వారా రూ.20 లక్షలు ఆదాయం పెరిగిందని చెప్పారు. భక్తులు ఆకట్టుకునేలా పూజలు... ఆలయాలు, పూజా కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకునేలా ఉంటే భక్తుల ఆదరణ, ఆదాయం పెరుగుతుందని ఏసీ అన్నారు. ఒడ్డిమెట్టలో జరిగే నవరాత్రి మహోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. గణపతి విగ్రహం, అంతరాలయం, గర్భాలయాల కు ఆకర్షణీయమైన రంగులు వేయాలని సూచించారు. నవరాత్రుల్లో రోజూ గణపతి హోమం, వారానికి రెండు రోజులు స్వామికి పాలాభిషేకం, విశేష పూజలు నిర్వహించి రోజూ ఉదయాన్నే భక్తి గీతా లు వినిపించాలని ఆదేశించారు. కాణిపా కం వినాయక ఆలయంలో మాదిరిగా పూజలు జరిపేందుకు అర్చకులు, సిబ్బం ది అక్కడకు వెళ్లి తెలుసుకోవాలని సూచిం చారు. భక్తుల కానుకలు, మొక్కుబడులను దుర్వినియోగం చే స్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆలయంలో వాస్తు మార్పులు చేర్పులకు ఆమోదం తెలిపారు. తొలుత ఆయనతో అర్చకులు ప్రత్యేక పూ జలు చేయించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దేవస్థానం చైర్మన్ దండు బలరామరాజు, ఈవో వెంకటాద్రిలు ఏసీని దుశ్శాలువతో సత్కరించారు. ఆయన వెంట యలమంచిలి ఇన్స్పెక్టర్ శ్రీధర్, ట్రస్ట్ బోర్డు మెంబర్ పైల రాము పాల్గొన్నారు.