సాక్షి, అమరావతి: శ్రీశైలం దేవస్థానం భూముల సరిహద్దులను అక్టోబరు నెలాఖరుకల్లా ఖరారు చేయనున్నట్టు ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు. గురువారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీశైలం దేవస్థానం అభివృద్ధిలో భాగంగా మాస్టర్ ప్లాన్ తయారు చేసేందుకు భూ సరిహద్దులు సక్రమంగా లేకపోవడం ఆటంకంగా మారిందన్నారు.
ఈ సమస్యను పరిష్కరించేందుకు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావుతో కలిసి సమీక్ష నిర్వహించామన్నారు. అటవీ, రెవెన్యూ, సర్వే అండ్ లాండ్ రికార్డ్స్, దేవదాయ శాఖ అధికారుల సంయుక్త ఆధ్వర్యంలో భూ సర్వే చేపడతామన్నారు. 1879లో దాదాపు 4,130 ఎకరాలుండగా.. 1967లో మరో 145 ఎకరాలను ప్రభుత్వం శ్రీశైల దేవస్థానానికి కేటాయించిందన్నారు.
నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్టులో ఈ భూములు ఉండటంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటే సరిహద్దుల ఖరారు తప్పనిసరైందన్నారు. రిజర్వ్ ఫారెస్టు నిబంధనలను అతిక్రమించకుండా దేవస్థానానికి చెందిన భూముల్లో పర్యావరణ, ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు. కాగా, బెజవాడ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఉప ఆయన చెప్పారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేశామన్నారు. ఈ సమావేశంలో దేవదాయ శాఖ కమిషనర్ హరి జవహర్‌లాల్ పాల్గొన్నారు.
వచ్చే నెలాఖరుకు శ్రీశైల దేవస్థానం సరిహద్దులు
Published Fri, Sep 30 2022 5:05 AM | Last Updated on Fri, Sep 30 2022 5:05 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment