
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల భూములు, ఇతర ఆస్తులను కాపాడడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించబోమని ఈవోలను దేవదాయ శాఖ హెచ్చరించింది. దేవుడి ఆస్తులను కాపాడటంలో ఉదాశీనత, జమా ఖర్చుల్లో అవకతవకలు లాంటి చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవని దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్ స్పష్టం చేశారు. భూములను ఆక్రమించుకోవడం, లీజు గడువు ముగిసినా ఖాళీ చేయకపోవడం లాంటి వాటిపై ఎప్పటికప్పుడు కేసులు నమోదు చేయని పక్షంలో బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు ఆమె అన్ని ఆలయాల ఈవోలకు ఆదేశాలు జారీ చేశారు.
► భూములు, షాపుల లీజు గడువు ముగియడానికి మూడు నెలల ముందే బహిరంగ వేలం నిర్వహించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించరాదు. ఏడాది లీజు మొత్తాన్ని అడ్వాన్స్‌గా వసూలు చేయాలి. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా 75 శాతానికి మించి బిల్లులు చెల్లించరాదు.
► ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి కనీస వేతనాలు చెల్లించేలా కాంట్రాక్టర్లతో ఒప్పందాలు చేసుకోవాలి. రూ.కోటికిపైగా విలువైన టెండర్లకు ఆరు నెలల వ్యవధికే ఒప్పందాలు చేసుకోవాలి.
► దేవాలయాల్లో అన్నదానం, ప్రసాదం పంపిణీకి ఒకే తరహా ‘దిట్టం’ విధానాన్ని అమలు చేస్తారు. అన్నదానం హాళ్లు, కిచెన్, సరుకుల గదుల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.
► ఆలయాల్లో ఖర్చులకు నగదుగా కాకుండా చెక్కుల రూపంలోనే చెల్లింపులు చేయాలి.
► ఆలయాల క్యాష్ బుక్‌లో పెన్నుతో కాకుండా పెన్సిల్‌తో జమా ఖర్చులు రాయడం, రశీదులు చూపకపోవడం లాంటి వాటిని గుర్తిస్తే ఈవో అవినీతికి పాల్పడినట్టు పరిగణిస్తారు.