శ్రీకాళహస్తి (చిత్తూరు జిల్లా): ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఆలయాల్లోనూ భక్తులకు మెరుగైన సేవలు అందించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు దేవదాయ శాఖ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీమోహన్ తెలిపారు. చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని ఆమె శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా వాణీమోహన్ విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఆలయాల్లో శ్రీకాళహస్తీశ్వరాలయం ప్రత్యేకమైందన్నారు. ఈ ఆలయాభివృద్ధి కోసం రూ.200 కోట్లతో కొత్త మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించి, త్వరిత గతిన అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పుణ్యక్షేత్రాల్లో పారిశుద్ధ్యంపైన ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నామన్నారు. విద్యుత్‌ను ఆదా చేసేందుకు సోలార్ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తామన్నారు.
ఆలయంలో ఉన్న వెండి, బంగారు, నగదు నిల్వల రిజిస్టర్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి ఆలయ ఆస్తుల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. భక్తులకు పత్యక్ష సేవలతోపాటు ఆన్‌లైన్, పరోక్ష సేవల ద్వారానూ దగ్గరయ్యేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఒప్పంద ఉద్యోగుల్లో ఇద్దరు హుండీ లెక్కింపులో దొంగతనం చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని, వారిని ఉద్యోగాల నుంచి తొలగించి, క్రిమనిల్ కేసులు నమోదు చేయిస్తామని చెప్పారు. ఆలయ అనుబంధ స్కిట్ కళాశాల ఆలయానికి భారంగా మారిందన్నారు. అందులోని విద్యార్థులు నష్టపోకుండా వారిని వేరే కళాశాలల్లో చేర్పించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాబోయే నవరాత్రి, కార్తీక బ్రహ్మోత్సవాల కోసం శ్రీకాళహస్తీశ్వరాలయంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా ఈవోకు సూచించినట్లు తెలిపారు. అన్ని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో స్థల పురాణం, ఆలయ ప్రాశస్త్యం, దేవతా విగ్రహాల ప్రాశస్త్యాన్ని తెలియజేసే విధంగా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించామని వాణీమోహన్ పేర్కొన్నారు.
రూ.200 కోట్లతో శ్రీకాళహస్తీశ్వరాలయం అభివృద్ధి
Published Sun, Aug 29 2021 4:54 AM | Last Updated on Sun, Aug 29 2021 4:54 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment