
దేవదాయ శాఖ, పోలీసు అధికారులే కారణం
టీడీపీ నేతల ఒత్తిడితో శివరాత్రి ఉత్సవాల్లో జోక్యం
గ్రామంలోని శ్రీ కాటికోటేశ్వర స్వామి ఆలయంలోకి ప్రవేశం
స్వామివారి వెండి గుర్రాలను ఎత్తుకెళ్లడానికి పోలీసుల ప్రయత్నం
మూకుమ్మడిగా అడ్డుకున్న చిల్లవారిపల్లి గ్రామస్తులు
గ్రామ ఆలయ పూజారి, మరో ముగ్గురు ఆత్మహత్యాయత్నం
ధర్మవరం: శాంతి భద్రతలను సంరక్షించాల్సిన పోలీసులే శ్రీ సత్యసాయి జిల్లాలోని ఓ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులకు కారణమయ్యారు. టీడీపీ నేతల ఒత్తిళ్లతో దేవదాయ శాఖ అధికారులు, పోలీసులు కొత్త సంప్రదాయానికి తెరతీసి గొడవలకు ఆజ్యం పోశారు. దీంతో బుధవారం రాత్రి ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండలం చిల్లవారిపల్లిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. శ్రీ కాటికోటేశ్వర స్వామి ఏడు వెండి గుర్రాలను బలవంతంగా ఎత్తుకెళ్లడానికి పోలీసులు ప్రయత్నించడంతో గ్రామస్తులు మూకుమ్మడిగా అడ్డుకున్నారు.
ఆలయ పూజారి పురుగుల మందు తాగగా, మరో ముగ్గురు యువకులు ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. చిల్లవారిపల్లి సమీపంలోని శ్రీకాటికోటేశ్వర క్షేత్రంలో ఏటా మహా శివరాత్రి పండుగ రోజున, మరుసటి రోజున రెండు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. స్వామి వారి గొడుగులు, ఆభరణాలతో కూడిన ఏడు వెండి గుర్రాలు చిల్లవారిపల్లిలోని గంగిరెడ్డిగారి వంశస్తుల ఆధీనంలో ఉంటాయి. ఆలయం, ఉత్సవాల నిర్వహణ కోసం గతంలో ఆలయ కమిటీ కూడా ఉండేది.
ఆరేళ్ల క్రితం దేవదాయ శాఖ అధికారులు ఆలయ కమిటీ ని రద్దు చేసి గ్రామ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం గ్రామ కమిటీ చైర్మన్‌గా గంగిరెడ్డిగారి నారాయణరెడ్డి ఉన్నారు. ఈ క్షేత్రం ఆలయ పూజారి విషయంలోనూ చిల్లవారిపల్లి, చిల్లకొండయ్యపల్లి గ్రామస్తుల మధ్య వివాదం కోర్టులో నడుస్తోంది. దీంతో ఇరు గ్రామాల వ్యక్తిని కాదని ఓ బ్రాహ్మణున్ని పూజారిగా పెట్టి ఆలయ, ఉత్సవాల నిర్వహణ సవ్యంగా, ప్రశాంతంగా చేపడుతున్నారు. కానీ, కూటమి ప్రభుత్వం రాగానే ఆలయంపై రాజకీయ పెత్తనం మళ్లీ మొదలైంది.
టీడీపీ నేతల అడుగులకు మడుగులొత్తుతున్న దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ (ఏసీ) నరసింహరాజు అత్యుత్సాహంతో క్షేత్రంలోని బ్రాహ్మణ పూజారిని తొలగించారు. చిల్లకొండయ్యపల్లి గ్రామస్తుణ్ని పూజారిగా నియమించారు. దీంతో మళ్లీ గొడవలు మొదలయ్యాయి. చిల్లకొండయ్యపల్లికి చెందిన పూజారిని మారిస్తేనే ఈసారి ఉత్సవాల నిర్వహణకు సహకరిస్తామని చిల్లవారిపల్లి గ్రామస్తులు భీష్మించారు. అయితే.. బుధవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో ధర్మవరం ఆర్డీవో మహేష్, డీఎస్పీ హేమంత్ కుమార్ వందలాది మంది పోలీసులతో గ్రామంలోకి ప్రవేశించారు.
శ్రీకాటికోటేశ్వర స్వామి ఆలయ తాళాలు పగలగొట్టి, ఏడు వెండి గుర్రాలను బలవంతంగా తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. చిల్లవారిపల్లి గ్రామస్తులంతా ఏకమై వారిని అడ్డుకోవడంతో పోలీసులు కొద్దిసేపు మిన్నకుండి పోయారు. రాత్రి 8 గంటల సమయంలో పోలీసులు వెండి గుర్రాలను ఎత్తుకెళ్లడానికి మళ్లీ ఆలయం వద్దుకు చేరుకున్నారు. దీంతో గ్రామస్తులు మళ్లీ అడ్డుకున్నారు.
ఇదే సమయంలో గ్రామంలోని ఆలయ పూజారి గంగిరెడ్డిగారి మంజునాథ్‌రెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గాలిబంకు శంకర్‌రెడ్డి, సిరియాల కిష్టయ్య, అండ్ర వెంకటరెడ్డి ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించారు. గ్రామస్తులు అడ్డుకుని వారిపై నీళ్లు పోశారు. గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గ్రామస్తులు తీవ్రంగా ప్రతిఘటించడంతో పోలీసులు వెనుదిరిగి వెళ్లారు.
ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలి: ఎస్పీ
జిల్లా ఎస్పీ వి.రత్న బుధవారం శ్రీకాటికోటేశ్వర క్షేత్రం వద్దకు వచ్చారు. మహాశివ రాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. ఉత్సవాలను ఎవరైనా అడ్డుకోవడానికి ప్రయత్నించినా, ఘర్షణలకు దిగినా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డీఎస్పీ హేమంత్ కుమార్‌ను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment