
ఆర్థిక ఇబ్బందులతో మడకశిరలో స్వర్ణకారుని కుటుంబం ఆత్మహత్య
దంపతులతో పాటు ఇద్దరు కుమారుల బలవన్మరణం
పండుగ నాడు విషాదం
మడకశిర: శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో ఉగాది పండుగ నాడు ఒక స్వర్ణకారుడి కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో భార్యాభర్తలతో పాటు ఇద్దరు కుమారులు మృతి చెందడం విషాదం నింపింది. వివరాల్లోకి వెళితే.. మడకశిర గాందీబజార్‌లో సొంతింట్లో స్వర్ణకారుడు క్రిష్ణాచారి కుటుంబం నివాసం ఉంటోంది.
ఏమైందో ఏమో కానీ క్రిష్ణాచారి (45), భార్య సరళ (38), పెద్ద కుమారుడు సంతోష్ (15), రెండో కుమారుడు భువనేష్ (13) మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం ఆదివారం ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో వెలుగులోకి వచి్చంది. మృతుడు క్రిష్ణాచారికి తండ్రితోపాటు గోపి, సురేష్ అనే ఇద్దరు సోదరులు ఉన్నారు. చిన్న సోదరుడు సురేష్ ఇంట్లో ఉంటున్న తండ్రి ఉదయాన్నే క్రిష్ణాచారికి ఫోన్ చేశారు. ఫోన్ తీయకపోవడంతో సురేశ్ తన అన్న కిృష్ణాచారి ఇంటి వద్దకు వెళ్లి చూడగా లోపల మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. వెంటనే ఈ విషయాన్ని చుట్టుపక్కల వారికి తెలియజేశాడు.
క్రిష్ణాచారి జేబులో సైనేడ్ డబ్బా..
సమాచారం అందుకున్న పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. క్లూస్ టీం ఇంటిని క్షుణ్నంగా పరిశీలించింది. క్రిష్ణాచారి జేబులో సైనేడ్ డబ్బా ఉన్నట్లు గుర్తించి స్వాదీనం చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే క్రిష్ణాచారి కుటుంబం ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. క్రిష్ణాచారి ఆదివారం తెల్లవారుజామున ఆత్మహత్యకు ముందు బెంగళూరులో ఉన్న తన అక్కతో ఫోన్‌లో మాట్లాడినట్లు కాల్ డేటా ఆధారంగా పోలీసులు గుర్తించారు.
అయ్యో పిల్లలు.. ఉగాదికి ఇంటికొచ్చి..
క్రిష్ణాచారి పెద్ద కుమారుడు సంతోష్ మడకశిర సమీపంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతూ.. పబ్లిక్ పరీక్షలు రాస్తున్నాడు. చిన్న కుమారుడు భువనేష్ అదే పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఇద్దరూ పాఠశాల హాస్టల్లో ఉంటూ.. ఉగాది సందర్భంగా ఇంటికొచ్చారు. వీరిద్దరూ తల్లిదండ్రులతోపాటు ప్రాణాలు కోల్పోయారు.