gold merchant
-
అనుపమ్ ఖేర్ బొమ్మ కరెన్సీతో బురిడీ
అహ్మదాబాద్: వీళ్లు అలాంటిలాంటి మోసగాళ్లు కాదు.. దొంగనోట్ల కట్టలు. అవీ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ బొమ్మతో ఉన్నవి అక్షరాలా రూ.1.30 కోట్లు..ఓ బడా బంగారం వ్యాపారికి అంటగట్టి ఏకంగా 2.1 కిలోల బంగారంతో ఉడాయించారు. ఇందుకోసమే ప్రత్యేకంగా వాళ్లు ఓ నకిలీ హవాలా ఆఫీసును సైతం ఏర్పాటు చేసుకున్నారు. మోసం తెలుసుకునేలోపే పత్తా లేకుండా పోయారు. బాలీవుడ్‌ను సైతం తలదన్నే ట్విస్టులున్న ఈ ఘటన గుజరాత్లో చోటుచేసుకుంది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. అహ్మదాబాద్‌కు చెందిన బంగారం వ్యాపారి మెహుల్ ఠక్కర్‌కు ఇటీవల ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. తన పేరు ప్రశాంత్ పటేల్ అని, స్థానికంగా ఉన్న ఫలానా నగల దుకాణం మేనేజర్‌ను అంటూ పరిచయం చేసుకున్నాడు. ఆ దుకాణం మెహుల్‌కు తెలిసిందే కావడంతో ఆయన నిజమేననుకున్నాడు. పటేల్ 2.1 కిలోల బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపగా, కొంత బేరసారాల తర్వాత రూ.1.60 కోట్లకు డీల్ కుదిరింది. అతడిచి్చన సమాచారం మేరకు సెప్టెంబర్ 24వ తేదీన ఠక్కర్ తన మనుషులకు 2.1 కిలోల బంగారమిచ్చి పంపించారు. చెప్పిన ప్రకారం వాళ్లు ఓ హవాలా దుకాణానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ వీరి కోసం ముగ్గురు వ్యక్తులున్నారు. దుకాణంలోని నోట్ల లెక్కింపు మిషన్‌తో తీసుకువచి్చన 26 బండిళ్లలో ఉన్న నోట్లను లెక్కించడం మొదలైంది. తాము రూ.1.30 కోట్లే తెచ్చామని, మిగతా రూ.30 లక్షలు పక్కనే మరో దుకాణం నుంచి తెస్తామంటూ ముగ్గురిలో ఇద్దరు బంగారం బిస్కెట్లను తీసుకుని వెళ్లారు. అయితే, ఆ నోట్లపై మహాత్మా గాం«దీకి బదులు నటుడు అనుపమ్ ఖేర్ బొమ్మ ఉంది. రిజర్వు బ్యాంక్ ఇండియా స్థానంలో తప్పుగా ‘రెసోల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’అని ఉంది. ఠక్కర్ సిబ్బంది ఇదంతా గమనించి, అనుమానించారు. ఇదేమని, అక్కడే ఉన్న మూడో వ్యక్తిని ప్రశ్నించారు. కౌంటింగ్ మిషన్ తెమ్మంటే తెచ్చానే తప్ప, వారెవరో, ఆ నోట్ల విషయమేంటో నాకూ తెలియదు’అంటూ అతడు చావు కబురు చల్లగా చెప్పాడు. బంగారం బిస్కెట్లతో వెళ్లిన పెద్దమనుషులు తిరిగి రాలేదు. దీంతో, సిబ్బంది ఆ విషయాన్ని ఠక్కర్ చెవిన వేశారు. ఆయన గుండె ఆగినంత పనైంది..! ఇదేమిటని ఆరా తీయగా ఆ హవాలా దుకాణాన్ని రెండు రోజుల క్రితమే ఎవరో తెరిచారని తేలింది. దీంతో, మెహుల్ ఠక్కర్ తననెవరో బకరాను చేశారని గ్రహించి, నవ్‌రంగ్‌పుర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
నగల వ్యాపారి హనీట్రాప్‌లో కొత్త ట్విస్ట్
మండ్య: మండ్యకు చెందిన బంగారం వ్యాపారి హనీట్రాప్ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. గతనెల ఓ లాడ్జీలో యువతితో ఉన్న జగన్నాథశెట్టిని ఇద్దరు యువకులు, ఓ మహిళ లాడ్జికి వచ్చి బెదిరించారు. ఆ సమయంలో జగన్నాథ శెట్టి తాను ఓ కళాశాల ప్రిన్సిపల్ అని చెప్పుకుని ట్యూషన్ కోసం యవతిని పిలుచుకుని వచ్చానని వారికి చెప్పాడు. ఆయన మాటలను వారు విశ్వసించకపోవడంతో పాటు తీవ్రంగా కొట్టారు. కొట్టొద్దని వేడుకున్నా వదలలేదు. తాజాగా ఈ వీడియో మొత్తం ఇప్పుడు వైరల్‌గా మారింది. వైరల్‌గా జగన్నాథశెట్టి ఆడియో.. మైసూరులో ఓ లాడ్జిలో రెండు రోజులు ఉందామని జగన్నాథశెట్టి ఓ యువతికి ఫోన్ చేశాడు. సదరు యువతి పుస్తకాలు ఏమైనా తీసుకురావాలా అన్ని ప్రశ్నిస్తే నీకు ఏ పుస్తకం కావాలో నేనే తీసుకువస్తానని ఆ ఆడియో పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే జగన్నాథ శెట్టి మండ్య బస్టాండ్‌లో మంగళూరు వెళ్లడానికి వేచి ఉండగా ముగ్గురు వ్యక్తులు మైసూరుకు డ్రాప్ ఇస్తామని చెప్పి ఓ వాహనంలో ఎక్కించుకుని ఓ లాడ్జిలోకి తీసుకెళ్లి యువతిని గదిలోకి పంపించి హనీట్రాప్‌నకు పాల్పడ్డారని, ఆ ముఠా డబ్బులు డిమాండ్ చేశారని జగన్నాథశెట్టి అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చదవండి: (నగల వ్యాపారికి హనీ ట్రాప్.. వద్దన్నా హోటల్‌కు.. యువతి ఎంట్రీ..) అయితే తాజాగా జగన్నాథశెట్టి సదరు యువతితో మాట్లాడిన ఆడియో, ఆయనపై ముఠా దాడిచేసే వీడియో ఇప్పుడు బయటకు రావడంతో ఆయన చిక్కుల్లో పడ్డారు. నిజంగా హనీట్రాప్ జరిగిందా లేదా, ఇది సల్మా ఆమె గ్యాంగ్ డబ్బులు వసూలు చేసుకుని ఈ వీడియో వైరల్ చేశారా అనేది ఇప్పుడు చర్చనీయంశమైంది. దీంతో పోలీసులు అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేపట్టారు. -
నగల వ్యాపారికి హనీ ట్రాప్.. వద్దన్నా హోటల్‌కు.. యువతి ఎంట్రీ..
సాక్షి, మండ్య (బెంగళూరు): కొన్నాళ్లుగా నిలిచిపోయిన హనీట్రాప్ దందా మళ్లీ మొదలైనట్లు కనిపిస్తోంది. మండ్యలో ఒక నగల వ్యాపారిపై వలపు వల విసిరి భారీగా కొల్లగొట్టిన వైనం వెలుగుచూసింది. మండ్య మహావీర్ సర్కిల్లో ఉన్న శ్రీనిధి నగల షాపు యజమాని ఎస్.జగన్నాథ్ శెట్టి హనీ ట్రాప్‌కు గురై రూ. 48 లక్షలు పోగొట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బస్టాండులో ఉండగా కారులో పికప్ వివరాలు... ఈ ఏడాది ఫిబ్రవరి నెల 22వ తేదీ రాత్రి సుమారు 8 గంటలకు పని మీద మంగళూరుకు వెళ్లాలని మండ్య బస్టాండుకు వచ్చాడు. ఇంతలో ఒక కారు వచ్చి ఆయన ముందు ఆగింది, అందులోనివారు మీరు ఎక్కడ వెళుతున్నారు అని అడిగారు. మేము మైసూరు వరకు డ్రాప్ చేస్తామని ఆయనను ఎక్కించుకున్నారు. మా వద్ద కొన్ని బంగారు బిస్కెట్లు ఉన్నాయి, వాటి విలువ చెప్పాలని ఆయన వద్దు వద్దంటున్నా మైసూరులోని ఒక హోటల్‌కు తీసుకెళ్లారు. అందులో నిందితులు సల్మా బాను, జయంత్ ఉన్నారు, మరో యువతి కూడా గదిలోకి వచ్చింది. కెమెరాతో అంతా వీడియో తీసి, మా చెల్లెళ్లతో నీకేం పని అని జయంత్ ఆ వ్యాపారిని బెదిరించాడు. అతన్ని కొట్టి రూ. 4 కోట్లు ఇవ్వాలని డిమాండ్ పెట్టారు. దీంతో దిక్కుతోచని బాధితుడు ఒక ఎల్ఐసి ఉద్యోగి నుంచి, మరో జువెలరీ షాప్ యజమాని నుంచి మొత్తం రూ.48 లక్షలు వారికి ఇప్పించాడు. అయితే మరింత డబ్బు తేవాలని దుండగులు పీడిస్తుండడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చేపట్టారు. చదవండి: (అప్పు తీర్చమన్నందుకు హత్య, ఇద్దరికి జీవితఖైదు) -
కరోనా విషాదం: కోట్ల ఆస్తి ఉన్నా తీరని చివరి కోరిక
సాక్షి, పరకాల: వరంగల్ రూరల్ జిల్లా పరకాలకు చెందిన ఓ బంగారం వ్యాపారి (48) కరోనాతో వారం రోజులపాటు పోరాడి బుధవారం మృతి చెందాడు. అయితే చికిత్స పొందుతున్న క్రమంలో ఆయన తాను మృతిచెందాక రేగొండ మండలం దమ్మన్నపేటలో ఉన్న ఎర్రచందనం వనంలో అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులకు సూచించినట్లు సమాచారం. దీంతో ఆయన మృతదేహంతో కుటుంబ సభ్యులు దమ్మన్నపేటకు చేరుకోగా, ఆ గ్రామస్తులు సరిహద్దులోనే అడ్డుకున్నారు. కరోనాతో మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియలు తమ గ్రామంలో నిర్వహించవద్దని తేల్చి చెప్పారు. గుంత తవ్వకానికి జేసీబీ డ్రైవర్లు కూడా ముందుకు రాలేదు. దీంతో మళ్లీ మృతదేహాన్ని పరకాల శివారు చలివాగు ఒడ్డున ఉన్న శ్మశాన వాటికకు తీసుకొచ్చి దహనం చేశారు. మృతుడికి పరకాల పట్టణంలో మూడు చోట్ల రూ.కోట్ల విలువైన మూడంతస్తుల భవనాలతో పాటు, వ్యవసాయ మార్కెట్ ఎదురుగా రూ.కోటి విలువైన భవన సముదాయం ఉంది. (చదవండి: మాస్కు ధరించలేదని చిన్నారులతో కప్పగంతులు) -
రోడ్డు ప్రమాదం: బంగారం వ్యాపారులు మృతి
పెద్దపల్లి: రామగుండం ఎన్టీపీసీ సమీపంలోని మల్యాలపల్లి వద్ద ఉన్న రాజీవ్ రహదారిపై మంగళవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కారు అతి వేగంగా వెళ్లి బోల్తా పడడంతో ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. ఈ ఘటనలోని మృతులు, క్షతగాత్రులు గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. బంగారం వ్యాపారం చేసే కొత్త రాంబాబు, కొత్త శ్రీనివాస్, శ్రీనివాస్ బావమరిది సంతోష్ మరో వ్యక్తి కారులో రామగుండం మీదుగా మంచిర్యాల బెల్లంపల్లి వైపు వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యారు. కారు బోల్తా పడడంతో నలుగురు అందులో ఇరుక్కుపోయారు. స్థానికులు గమనించి బయటకు తీసే లోపే బంగారం వ్యాపారం చేసే రాంబాబు ప్రాణాలు కొల్పోయారు. ఆసుపత్రికి తరలించగా శ్రీనివాస్ మృతి చెందారు. డ్రైవర్ సంతోష్, శ్రీనివాస్ బావమరిది సంతోష్‌కు తీవ్రగాయాలు కాగా వారిని కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను రామగుండం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కారులో కిలోన్నర బంగారం లభించిందని పోలిసులు పేర్కొన్నారు. ముందుగా సంఘటన స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది బంగారం ప్యాకెట్లను రామగుండం పోలీసులకు అప్పగించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. చదవండి: దాబాకు వెళ్లి.. వెంటనే వచ్చేస్తామని చెప్పి బంగారం ఉందో లేదో అడుగుతూ -
నమ్మించి.. నట్టేట ముంచాడు!
‘మోసపోయేవారు ఉన్నాన్నాళ్లు మోసం చేసేవారు రోజుకో చోట పుడుతూనే ఉంటారు’. ఇది ఏదో సినిమాలో డైలాగ్ అనుకునేరు.! అచ్చం ఇలాంటి సంఘటనే పిట్లం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఒకరు కాదు ఇద్దరు సుమారు 20మందికిపైగానే ఓ బంగారు నగల వ్యాపారి రూ. 50లక్షల మేర టోపేసి పారిపోయాడు. ఫలితంగా బాధితులు లబోదిబోమంటున్నారు. పిట్లం(జుక్కల్): ఇటీవలే నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో వ్యాపారి పరారైన సంఘటన మరువక ముందే పిట్లం మండల కేంద్రంలో సుమారు రూ.50 లక్షలతో ఓ బంగారం వ్యాపారి పరారైన సంఘటన ఒకటి చోటుచేసుకుంది. పిట్లంలోని తిమ్మానగర్ రహదారిలో ఓ బంగారం వ్యాపారి దుకాణం నడిపేవాడు. ఆ వ్యాపారి పిట్లం గ్రామానికి చెందిన వాడు కావడంతో నమ్మకంగా ఉంటూ నగలు తయారు చేసి ఇవ్వడంతో మండలంలోని మార్దండ, అంతర్గాం, తిమ్మానగర్, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలానికి చెందినవారు వినియోగదారులు చాలా మంది వచ్చేవారు. వేసవి పెళ్లిళ్ల సీజన్ కావడంతో నగలు తయారు చేయించుకునేందుకు ఈ వ్యాపారికి ఆర్డర్ ఇచ్చి నగదు అప్పజెప్పారు. గత రెండు, మూడు నెలల నుంచి ఈ వ్యాపారి తన తండ్రికి ఆరోగ్యం సరిగ్గా లేదని, లేదంటే హైదరాబాద్ నుంచి బంగారం తెస్తున్నామని నమ్మబలికి కాలం వెల్లదీశాడు. బంగారం నగలు కూడా వినియోగదారులకు రేపు, మాపు అంటూ చెప్పడంతో అతన్ని నమ్మిన వినియోగదారులు ఊరుకుండి పోయారు. ఇక ఇదే అదనుగా భావించిన సదరు వ్యాపారి 15 రోజుల కింద రాత్రికి రాత్రే పరారయ్యాడు. దీంతో వినియోగదారులు అనుమానం వచ్చి అతడిని సెల్‌కు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ రావడంతో ఆ వ్యాపారి పరారైనట్లు తెలుసుకున్న వినియోగదారులు లబోదిబోమంటున్నారు. సుమారు 15రోజుల పాటు ఇక వస్తాడెమో అనుకున్న వినియోగదారులు ఆ వ్యాపారి రాక బుధవారం నాడు సుమారు 20 మంది బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వినియోగదారులతో పాటు పిట్లం గ్రామానికి చెందిన వ్యాపారుల నుంచి ఇతను రూ.లక్షలాదిగా వడ్డీకి తీసుకున్నట్లు సమాచారం. తాము కాయకష్టం చేసుకుని ఈ వ్యాపారి వద్ద బంగారం తయారుకు ఆర్డర్ ఇచ్చామని, తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. ప్రామిసరీ నోటు రాసిచ్చాడు.. నేను బంగారం తయారీకి పోయి న ఫిబ్రవరిలో నగల తయారీకి రూ.1.56 లక్షల నగదు ఇచ్చా. నగలు తయారు చేసి ఇవ్వాలని అడిగితే, ఇస్తానని చెప్పాడు. కొద్ది రోజుల కింద దుకాణానికి వెళ్లి నిలదీస్తే ఇందుకు ప్రామిసరీ నోటు రాసిచ్చాడు. ఈ విషయం ఎవరికి చెప్పొద్దన్నాడు. తొందరగా నగదు ఇస్తానని చెప్పి ఇప్పుడెమో కనబడకుండా వెళ్లిపోయాడు. –నర్పప్ప, బాధితుడు మార్దండ. నిలువునా మోసం చేసిండు.. నేను రెండు నెలల కింద నా కుమారుడి పెండ్లి ఉండటంతో రూ.2 లక్షల 40 వేలు నగల తయారీకి ఇచ్చిన. పెండ్లి సమయానికి నగలు కావాలని అడిగితే రేపు మాపు అంటూ కాలం వెల్లదీశాడు. బంగారు నగలు మాత్రం ఇవ్వలే దు. తన తండ్రికి బాగా లేదని అనడంతో అత న్ని నమ్మినం. ఇప్పుడేమో నిలువున మోసం చే సిండు. –రొట్టె విఠవ్వ, బాధితురాలు, మార్దండ. -
‘నో ఫ్లై లిస్ట్’లో బంగారం వ్యాపారి
న్యూఢిల్లీ: ప్రియురాలిని ఉద్యోగం మాన్పించి.. తనతో పాటు తీసుకెళ్లేందుకు గతేడాది అక్టోబర్‌లో జెట్ ఎయిర్ వేస్ విమానంలో హైజాక్ డ్రామా ఆడిన బంగారం వ్యాపారి బిర్జూ కిషోర్ సల్లా(37)ను విమానాలు ఎక్కకుండా నిషేధిస్తూ ( నో ఫ్లై లిస్ట్) డీజీసీఏ నిర్ణయం తీసుకుంది. ఈ జాబితాలో చేరిన తొలి సాధారణ పౌరుడిగా కిషోర్ సల్లా రికార్డు సృష్టించాడు. కానీ నిషేధం ఎంతకాలం అమల్లో ఉంటుందో డీజీసీఏ స్పష్టత ఇవ్వలేదు. అప్పటి విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు సూచన మేరకు ఆయన్ను నిషేధిత జాబితాలో చేర్చామని సంస్థ పేర్కొంది. గతేడాది అక్టోబర్ 30న ముంబై నుంచి ఢిల్లీకి ప్రయాణిస్తున్న జెట్ ఎయిర్వేస్ విమానంలో హైజాకర్లు ఉన్నారు..ఢిల్లీలో విమానాన్ని ల్యాండ్ చేస్తే పేల్చేస్తామని కిషోర్ టాయిలెట్లో లెటర్ పెట్టాడు. దీంతో విమానాన్ని అత్యవసరంగా అహ్మదాబాద్‌లో ల్యాండ్ చేశారు. -
పెళ్లికి వెళ్లి వచ్చేలోపు ఊడ్చుకెళ్లాడు
- బంగారం వ్యాపారి ఇంట్లో భారీ చోరీ - సుమారు రూ.68 లక్షల వస్తువులు మాయం - వంటవాడి పనే అని అనుమానం హైదరాబాద్: ఓ బంగారం వ్యాపారి సమీప బంధువుల ఇంట్లో వివాహానికి వెళ్లి వచ్చేసరికి దొంగలు ఇల్లు దోచేశారు. హైదరాబాద్ పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. బంజారాహిల్స్ రోడ్డు నంబర్–1 నవీన్‌నగర్‌లో ఉండే జితేందర్ కుమార్ గుప్తా అబిడ్స్‌లో బంగారం దుకాణం నడుపుతుం టాడు. శంషాబాద్‌లోని బంధువు ఇంట్లో వివాహం ఉండటంతో కుటుంబ సభ్యులంతా శనివారం వివాహానికి వెళ్లి ఆదివారం తెల్లవారుజామున 3 గంట లకు వచ్చారు. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా పగలగొట్టి ఉంది. అందులోని ఒక కిలో 14 గ్రాముల బంగారు ఆభరణాలు, 7 కిలోల 100 గ్రాముల వెండి ఆభరణాలు, రూ.3.5 లక్షల నగదు, రూ.4 లక్షల విలువచేసే గడియారం చోరీ కి గురయ్యాయి. గుప్తా ఇంట్లో రాంప్రసాద్ అనే వృద్ధుడితో పాటు బిహార్‌లోని దర్బంగ్ జిల్లాకు చెందిన ఉమేశ్ వంట మనిషిగా పనిచేస్తున్నాడు. ఆభరణాలు చోరీ కావడంతో అనుమానం వచ్చి తమ్ముడు నవీన్‌తో కలసి జితేందర్.. ఉమేశ్ ఇంటికి వెళ్లాడు. అప్పుటికే అతను పరారయ్యాడు. దీంతో ఉమేశ్ ఈ దొంగ తనం చేసి ఉండవచ్చని భావించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఉమేశ్ బంధువులను విచారిస్తున్నారు. -
ఆభరణాలకు రూపమిచ్చే.. జువెలరీ డిజైనర్
అప్‌కమింగ్ కెరీర్: మేని ఆందాన్ని ద్విగుణీకృతం చేసే ఆభరణాలతో భారతీయుల అనుబంధాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. ఆకర్షణీయమైన ఆభరణానికి రూపమిచ్చే కళాకారుడు.. జువెలరీ డిజైనర్. దేశంలో నగల వ్యాపారం వందల నుంచి వేల కోట్ల రూపాయలకు చేరడంతో డిమాండ్ పెరుగుతున్న కెరీర్.. జువెలర్ డిజైనింగ్. జువెలరీ డిజైనింగ్ అనేది ప్రధానంగా సృజనాత్మక ప్రక్రియ. అప్పటివరకు మార్కెట్లోని లేని కొత్త డిజైన్‌ను తయారు చేయాలంటే అపూర్వమైన ఊహ శక్తి ఉండాలి. వినియోగదారుల అభిరుచులు, అవసరాలు తప్పనిసరిగా తెలిసి ఉండాలి. ప్రజల సంస్కృతులు, సంప్రదాయాలు, వారు ధరించే నగలపై అవగాహన పెంచుకోవాలి. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వస్తున్న నూతన డిజైన్లను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. వాటి కంటే భిన్నంగా చేయగల నైపుణ్యం సాధించాలి. అనుభవజ్ఞులకు ఉపాధి అవకాశాలు దేశంలో జువెలరీ డిజైనర్లకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. అనుభవం కలిగిన డిజైనర్లకు రూ.లక్షల్లో వేతనాలు లభిస్తున్నాయి. నిధులు లభిస్తే సొంతంగా డిజైనింగ్ యూనిట్‌ను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఆభరణాల డిజైన్లను జువెలరీ సంస్థలకు విక్రయించుకోవడం ద్వారా అధిక ఆదాయం పొందొచ్చు. మనదేశంతోపాటు విదేశాల్లోనూ డిజైనర్లకు మంచి అవకాశాలున్నాయి. అర్హతలు.. ఇంటర్మీడియెట్ పూర్తిచేసిన తర్వాత జువెలరీ డిజైన్‌లో డిప్లొమా ప్రోగ్రామ్ లేదా గ్రాడ్యుయేషన్ కోర్సును చదవాలి. తర్వాత పోస్టుగ్రాడ్యుయేషన్, ఇంటర్న్‌షిప్ కూడా పూర్తిచేస్తే మెరుగైన అవకాశాలను దక్కించుకోవచ్చు. కొన్ని సంస్థలు స్వల్పకాలిక కోర్సులను కూడా ఆఫర్ చేస్తున్నాయి. వేతనాలు.. జువెలరీ డిజైనర్లకు ఎక్కువగా ప్రైవేట్ రంగంలో అవకాశాలు లభిస్తున్నాయి. ప్రారంభంలో పనితీరు ఆధారంగా నెలకు రూ.10 వేల నుంచి రూ.25 వేల దాకా అందుకోవచ్చు. తర్వాత సీనియారిటీని బట్టి నెలకు రూ.లక్ష దాకా వేతనం పొందొచ్చు. జువెలరీ డిజైన్ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు ఏ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్) వెబ్సైట్: http://www.nift.ac.in/ ఏ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్(ఎన్ఐడీ)-అహ్మదాబాద్ వెబ్సైట్: http://www.nid.edu/ ఏ జువెలరీ డిజైన్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్-నోయిడా వెబ్సైట్: http://www.jdtiindia.com/ ఏ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ వెబ్సైట్: http://www.iiftindia.net/ మోడ్రన్ కెరీర్... జువెలరీ డిజైనింగ్ ‘ప్రజల అభిరుచుల్లో చాలా మార్పులొచ్చాయి. దానికి తగినట్లుగా ఫ్యాషన్ డిజైనింగ్‌లోనూ కొత్తదనం చోటుచేసుకుంటోంది. జువెలరీ డిజైన్ కోర్సు ఇప్పుడున్న ఫ్యాషన్ ప్రపంచంలో అగ్రగామి అనే చెప్పొచ్చు. జువెలరీలోనూ విభిన్నమైన మోడల్స్ వస్తున్నాయి. డ్రెస్సింగ్, టైం సెన్స్, అప్పియరెన్స్‌కు తగిన ఆభరణాలను ధరించటం ఫ్యాషన్‌లో భాగమైంది. దీంతో ఈ కోర్సు చేసిన యువతకు అవకాశాలు పెరుగుతున్నాయి. ఢిల్లీ, ముంబై, పుణె వంటి నగరాల్లో బాగా డిమాండ్ ఉంది. హైదరాబాద్‌లో రెండు మూడేళ్లుగా క్రేజ్ సంపాదించుకుంది. మంచి వేతనంతో ఉద్యోగ అవకాశాలున్నాయి. ఆర్థిక వెసులుబాటు ఉంటే.. డిజైనింగ్ షోరూం ఏర్పాటుచేసుకోవచ్చు’’ - డి.గోపాలకృష్ణ, జాయింట్ డెరైక్టర్ (నిఫ్ట్) హైదరాబాద్ -
‘హానెస్ట్’గానే మోసాలు
రోల్డ్ గోల్డ్ ఆభరణాలకు బంగారం పూత లభించని బంగారం వ్యాపారి ఆచూకీ వంశపారంపర్య భూముల విక్రయంపైపోలీసుల కన్ను నరసన్నపేట, న్యూస్‌లైన్: పట్టణ ప్రజల, ఖాతాదారుల నమ్మకాన్ని ఆసరా చేసుకుని కోట్లాది రూపాయలు స్వాహా చేసి పరారైన బంగారం వ్యాపారి కేసును పోలీసులు తీవ్రస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. వ్యాపారి పాల్పడిన అక్రమాల్లో కొత్త కొత్త అంశాలు తెలుస్తున్నాయి. రోల్డ్‌గోల్డ్ ఆభరణాలకు బంగారం పూత, వంశపారంపర్యంగా సంక్రమించిన భూములను విక్రయించిన వైనాలు వెలుగులోకి వచ్చాయి. ఇల్లు విక్రయిస్తానని డబ్బులు తీసుకుని జీపీఏ ఇచ్చి మోసగించిన సంఘటన కూడా తెలిసింది. నరసన్నపేటలో అదృశ్యమైన బంగారం వ్యాపారి ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా దర్యాప్తు సాగిస్తున్నారు. వ్యాపారికి తాతల నుంచి సంక్రమించిన సుమారు ఐదెకరాల సాగుభూమి తామరాపల్లి ప్రాంతంలో ఉందని తెలిసింది. ఈ భూమిని తన దుకాణంలో పనిచేస్తున్న ఒక గుమస్తాతో పాటు మరో సామాజిక వర్గానికి చెందిన మరో మిత్రుడు పేరున రిజిస్ట్రేషన్ చేయించినట్లు తెలిసింది. ఈ సమాచారం తెలియడంతో పోలీసులు ఆ భూముల రిజిస్ట్రేషన్‌పై దృష్టి సారించారు. వ్యాపారి మిత్రుడు, గుమస్తా ఆ భూములను ఇతరులకు రిజిస్ట్రేషన్ చేయకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. వ్యాపారికి మిత్రుడు సుమారు రూ.12 లక్షల నగదును వడ్డీకి ఇచ్చినట్లు తెలిసింది. ఆ భూమి కొనుగోలు ప్రస్తుతం వివాదాస్పదం కానుండడంతో పోలీసులతో పాటు బాధితులుకూడా వ్యాపారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. సోంపేటలో గల అత్తవారిల్లు, బరంపురంలోని బంధువుల ఇళ్లకు చేరి ఉంటారని భావిస్తున్నారు. ఆ దిశగా వారు గాలింపు చర్యలు చేపట్టారు. వ్యాపారికి సంబంధించి పోలీసులకు ఏ విధమైన సమాచారం అందలేదని తెలిసింది. ఒకరికి జీపీఏ.. విక్రయం మరొకరికి... బంగారం వ్యాపారి తన ఇల్లు విక్రయంలో కూడా ‘హానెస్ట్’ మార్కు ప్రదర్శించాడు. తన ఇంటికి సంబంధించి డబ్బు తీసుకుని ఇద్దరికి జీపీఏ ఇచ్చారు. వారిలో ఒక వ్యక్తికి ఇల్లు రిజిస్ట్రేషన్ చేశారు. జీపీఏ మాత్రమే ఉన్న వ్యక్తి స్థానికంగా ఉండకపోవడంతో ఆయనకు ఈ విషయం తెలియలేదు. బంగారం వ్యాపారి ఆభరణాల విక్రయాల్లోనూ ఖాతాదారులను దగా చేశాడని ఆరోపణలు వస్తున్నాయి. రోల్డ్‌గోల్డ్ ఆభరణాలపై బంగారం పూత పూయించి బంగారు ఆభరణాలుగా విక్రయించాడని పలువురు ఖాతాదారులు ఆరోపిస్తున్నారు. రూ.5 కోట్లకు టోకరా అదృశ్యమైన బంగారం వ్యాపారి కోట్లాది రూపాయల్లో టోకరా వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు పోలీసులకు అందిన ఫిర్యాదుల మేరకు సుమారు రూ.2.10 కోట్లు నష్టపోయినట్లు 180 మంది బాధితులు తెలిపారు. కాగా సుమారు రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు నష్టపోయారని కొందరు పేర్కొన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయని బాధితుల సుమారు రూ.కోటిన్నర నష్టపోయి ఉంటారని అంచనా. -
ఏటీఎం సొమ్ము రూ.70 లక్షలు స్వాహా
శ్రీకాకుళం క్రైం, న్యూస్‌లైన్: ఏటీఎం మిషన్‌లో డిపాజిట్ చేయాల్సిన సుమారు 70 లక్షలు స్వాహా చేసిన వైనం వెలుగులోకి వచ్చింది. ఇందులో ఏటీఎంలో డబ్బు పెట్టే ఏజెన్సీ ఉద్యోగితో పాటు ఒక స్వర్ణవ్యాపారి కుమారుడు కూడా ఉన్నాడని తెలిసింది. డబ్బు తిరిగి చెల్లిస్తామని బ్యాంకు అధికారులకు చెప్పడంతో ఈ విషయం బయటకు తెలియలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో పూర్తి వివరాలు తెలియకుండా జాగ్రత్తపడుతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం మున్సిపాల్టీలో గత ప్రభుత్వ హయాంలో మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడిగి పని చేసిన వ్యక్తి కుమారుడు, పట్టణంలో జీటీ రోడ్డులో బంగారు దుకాణం వ్యాపారి కుమారుడు స్నేహితులు. శ్రీకాకుళం పట్టణంలోని ఒక బ్యాంకుతో పాటు మరి కొన్ని ప్రాంతాల్లోని బ్యాంకులకు చెందిన ఏటీఎంలలో సొమ్ములు జమ చేసే సెక్యూరిటీ ఏజెన్సీలో కో ఆప్షన్ సభ్యుడి కుమారుడు కొంతకాలంగా పని చేస్తున్నాడు. ఏటీఎంలో డబ్బులు జమ చేసే విధి నిర్వహిస్తున్నాడు. అతని స్నేహితుడైన స్వర్ణవ్యాపారుడి కుమారుడు క్రికెట్ బెట్టింగ్‌లో చాలావరకు నష్టపోయాడు. అధిక మొత్తంలో అప్పులు చేయడంతో, వాటికోసం అప్పుల వాళ్లు బెదిరిస్తున్నారు. దీంతో ఏటీఎం ఏజెన్సీలో పని చేస్తున్న మిత్రుడికి బెట్టింగ్‌పై ఆశకలిగించాడు. తనకు సీసీఎల్ మ్యాచ్‌ల్లో క్రికెట్ బెట్టింగ్‌కు సంబంధించి అధిక మొత్తంలో డబ్బు వస్తుందని చెప్పాడు. తనకు డబ్బు ఇస్తే బెట్టింగ్ కడతానని, గెలిస్తే అందులో వాటా ఇస్తానని లేకపోతే తీసుకున్న సొమ్ముకు పది శాతం వడ్డీతో కలిపి ఇస్తానని చెప్పాడు. దీంతో ఆశపడిన మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడి కుమారుడు ఏటీఎంలో జమచేయాల్సిన డబ్బులో సుమారు రూ.70 లక్షలు మూడు విడతలుగా మిత్రుడికి ఇచ్చాడు. నెల రోజుల్లో ఈ సొమ్ముకు లెక్క చెప్పకపోతే బ్యాంకు అధికారులు గుర్తిస్తారని తెలిసినా బెట్టింగ్‌పై ఆశతో ఇందుకు పూనుకున్నాడు. బెట్టింగ్‌లో డబ్బులు రాకపోగా అసలు విషయం అధికారులకు తెలిసింది. బ్యాంకులో జమకావాల్సిన సొమ్ములో కొంత మొత్తం తగ్గడం గమనించి ఏజెన్సీకి ఫిర్యాదు చేశారు. దీనిపై పరిశీలించిన సెక్యూరిటీ ఏజెన్సీ వారు తమ వద్ద పని చేస్తున్న ఉద్యోగే ఈ పనిచేసినట్లు గుర్తించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బ్యాంకు అధికారులు సిద్ధం కాగా, స్వర్ణవ్యాపారి, మాజీ కో ఆప్షన్ సభ్యుడు వారితో రాజీ ప్రయత్నాలు ప్రారంభించారు. పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని, ఆ మొత్తం తాము చెల్లిస్తామని చెప్పడంతో బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో నిందితుల పేర్లు బయటకు రాలేదు. బ్యాంకు సిబ్బంది సాయంపై అనుమానాలు ఏజెన్సీ సొమ్ము జమచేస్తున్న పలు బ్యాంకుల్లో ఒక బ్యాంకు సిబ్బందికి ఈ విషయం ముందే తెలుసనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్యాంకు సిబ్బంది సహకారంతోనే అంత మొత్తంలో సొమ్మును సెక్యూర్టీ ఏజెన్సీకి తెలియకుండా తీసినట్టు తెలుస్తొంది. ఎప్పటికప్పుడు లావాదేవీలు చూడాల్సిన కొంతమంది సిబ్బంది కొంత మొత్తానికి ఆశపడి సహకారం అందించారని సమాచారం. దీనిపై ఇప్పటికైనా పోలీసులకు ఫిర్యాదు అందుతుందా అన్నది వేచి చూడాలి.