రోల్డ్ గోల్డ్ ఆభరణాలకు బంగారం పూత
లభించని బంగారం వ్యాపారి ఆచూకీ
వంశపారంపర్య భూముల విక్రయంపైపోలీసుల కన్ను
నరసన్నపేట, న్యూస్‌లైన్:
పట్టణ ప్రజల, ఖాతాదారుల నమ్మకాన్ని ఆసరా చేసుకుని కోట్లాది రూపాయలు స్వాహా చేసి పరారైన బంగారం వ్యాపారి కేసును పోలీసులు తీవ్రస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. వ్యాపారి పాల్పడిన అక్రమాల్లో కొత్త కొత్త అంశాలు తెలుస్తున్నాయి. రోల్డ్‌గోల్డ్ ఆభరణాలకు బంగారం పూత, వంశపారంపర్యంగా సంక్రమించిన భూములను విక్రయించిన వైనాలు వెలుగులోకి వచ్చాయి. ఇల్లు విక్రయిస్తానని డబ్బులు తీసుకుని జీపీఏ ఇచ్చి మోసగించిన సంఘటన కూడా తెలిసింది.
నరసన్నపేటలో అదృశ్యమైన బంగారం వ్యాపారి ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా దర్యాప్తు సాగిస్తున్నారు. వ్యాపారికి తాతల నుంచి సంక్రమించిన సుమారు ఐదెకరాల సాగుభూమి తామరాపల్లి ప్రాంతంలో ఉందని తెలిసింది. ఈ భూమిని తన దుకాణంలో పనిచేస్తున్న ఒక గుమస్తాతో పాటు మరో సామాజిక వర్గానికి చెందిన మరో మిత్రుడు పేరున రిజిస్ట్రేషన్ చేయించినట్లు తెలిసింది. ఈ సమాచారం తెలియడంతో పోలీసులు ఆ భూముల రిజిస్ట్రేషన్‌పై దృష్టి సారించారు. వ్యాపారి మిత్రుడు, గుమస్తా ఆ భూములను ఇతరులకు రిజిస్ట్రేషన్ చేయకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. వ్యాపారికి మిత్రుడు సుమారు రూ.12 లక్షల నగదును వడ్డీకి ఇచ్చినట్లు తెలిసింది. ఆ భూమి కొనుగోలు ప్రస్తుతం వివాదాస్పదం కానుండడంతో పోలీసులతో పాటు బాధితులుకూడా వ్యాపారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. సోంపేటలో గల అత్తవారిల్లు, బరంపురంలోని బంధువుల ఇళ్లకు చేరి ఉంటారని భావిస్తున్నారు. ఆ దిశగా వారు గాలింపు చర్యలు చేపట్టారు. వ్యాపారికి సంబంధించి పోలీసులకు ఏ విధమైన సమాచారం అందలేదని తెలిసింది.
ఒకరికి జీపీఏ.. విక్రయం మరొకరికి...
బంగారం వ్యాపారి తన ఇల్లు విక్రయంలో కూడా ‘హానెస్ట్’ మార్కు ప్రదర్శించాడు. తన ఇంటికి సంబంధించి డబ్బు తీసుకుని ఇద్దరికి జీపీఏ ఇచ్చారు. వారిలో ఒక వ్యక్తికి ఇల్లు రిజిస్ట్రేషన్ చేశారు. జీపీఏ మాత్రమే ఉన్న వ్యక్తి స్థానికంగా ఉండకపోవడంతో ఆయనకు ఈ విషయం తెలియలేదు. బంగారం వ్యాపారి ఆభరణాల విక్రయాల్లోనూ ఖాతాదారులను దగా చేశాడని ఆరోపణలు వస్తున్నాయి. రోల్డ్‌గోల్డ్ ఆభరణాలపై బంగారం పూత పూయించి బంగారు ఆభరణాలుగా విక్రయించాడని పలువురు ఖాతాదారులు ఆరోపిస్తున్నారు.
రూ.5 కోట్లకు టోకరా
అదృశ్యమైన బంగారం వ్యాపారి కోట్లాది రూపాయల్లో టోకరా వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు పోలీసులకు అందిన ఫిర్యాదుల మేరకు సుమారు రూ.2.10 కోట్లు నష్టపోయినట్లు 180 మంది బాధితులు తెలిపారు. కాగా సుమారు రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు నష్టపోయారని కొందరు పేర్కొన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయని బాధితుల సుమారు రూ.కోటిన్నర నష్టపోయి ఉంటారని అంచనా.
‘హానెస్ట్’గానే మోసాలు
Published Wed, Mar 5 2014 2:32 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement
Advertisement