
పోలీసులను ఆశ్రయించిన వివిధ గ్రామాలకు చెందిన బాధితులు
‘మోసపోయేవారు ఉన్నాన్నాళ్లు మోసం చేసేవారు రోజుకో చోట పుడుతూనే ఉంటారు’. ఇది ఏదో సినిమాలో డైలాగ్ అనుకునేరు.! అచ్చం ఇలాంటి సంఘటనే పిట్లం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఒకరు కాదు ఇద్దరు సుమారు 20మందికిపైగానే ఓ బంగారు నగల వ్యాపారి రూ. 50లక్షల మేర టోపేసి పారిపోయాడు. ఫలితంగా బాధితులు లబోదిబోమంటున్నారు.
పిట్లం(జుక్కల్): ఇటీవలే నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో వ్యాపారి పరారైన సంఘటన మరువక ముందే పిట్లం మండల కేంద్రంలో సుమారు రూ.50 లక్షలతో ఓ బంగారం వ్యాపారి పరారైన సంఘటన ఒకటి చోటుచేసుకుంది. పిట్లంలోని తిమ్మానగర్ రహదారిలో ఓ బంగారం వ్యాపారి దుకాణం నడిపేవాడు.
ఆ వ్యాపారి పిట్లం గ్రామానికి చెందిన వాడు కావడంతో నమ్మకంగా ఉంటూ నగలు తయారు చేసి ఇవ్వడంతో మండలంలోని మార్దండ, అంతర్‌గాం, తిమ్మానగర్, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలానికి చెందినవారు వినియోగదారులు చాలా మంది వచ్చేవారు. వేసవి పెళ్లిళ్ల సీజన్ కావడంతో నగలు తయారు చేయించుకునేందుకు ఈ వ్యాపారికి ఆర్డర్ ఇచ్చి నగదు అప్పజెప్పారు. గత రెండు, మూడు నెలల నుంచి ఈ వ్యాపారి తన తండ్రికి ఆరోగ్యం సరిగ్గా లేదని, లేదంటే హైదరాబాద్ నుంచి బంగారం తెస్తున్నామని నమ్మబలికి కాలం వెల్లదీశాడు.
బంగారం నగలు కూడా వినియోగదారులకు రేపు, మాపు అంటూ చెప్పడంతో అతన్ని నమ్మిన వినియోగదారులు ఊరుకుండి పోయారు. ఇక ఇదే అదనుగా భావించిన సదరు వ్యాపారి 15 రోజుల కింద రాత్రికి రాత్రే పరారయ్యాడు. దీంతో వినియోగదారులు అనుమానం వచ్చి అతడిని సెల్‌కు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ రావడంతో ఆ వ్యాపారి పరారైనట్లు తెలుసుకున్న వినియోగదారులు లబోదిబోమంటున్నారు.
సుమారు 15రోజుల పాటు ఇక వస్తాడెమో అనుకున్న వినియోగదారులు ఆ వ్యాపారి రాక బుధవారం నాడు సుమారు 20 మంది బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వినియోగదారులతో పాటు పిట్లం గ్రామానికి చెందిన వ్యాపారుల నుంచి ఇతను రూ.లక్షలాదిగా వడ్డీకి తీసుకున్నట్లు సమాచారం. తాము కాయకష్టం చేసుకుని ఈ వ్యాపారి వద్ద బంగారం తయారుకు ఆర్డర్ ఇచ్చామని, తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.
ప్రామిసరీ నోటు రాసిచ్చాడు..
నేను బంగారం తయారీకి పోయి న ఫిబ్రవరిలో నగల తయారీకి రూ.1.56 లక్షల నగదు ఇచ్చా. నగలు తయారు చేసి ఇవ్వాలని అడిగితే, ఇస్తానని చెప్పాడు. కొద్ది రోజుల కింద దుకాణానికి వెళ్లి నిలదీస్తే ఇందుకు ప్రామిసరీ నోటు రాసిచ్చాడు. ఈ విషయం ఎవరికి చెప్పొద్దన్నాడు. తొందరగా నగదు ఇస్తానని చెప్పి ఇప్పుడెమో కనబడకుండా వెళ్లిపోయాడు. –నర్పప్ప, బాధితుడు మార్దండ.
నిలువునా మోసం చేసిండు..
నేను రెండు నెలల కింద నా కుమారుడి పెండ్లి ఉండటంతో రూ.2 లక్షల 40 వేలు నగల తయారీకి ఇచ్చిన. పెండ్లి సమయానికి నగలు కావాలని అడిగితే రేపు మాపు అంటూ కాలం వెల్లదీశాడు. బంగారు నగలు మాత్రం ఇవ్వలే దు. తన తండ్రికి బాగా లేదని అనడంతో అత న్ని నమ్మినం. ఇప్పుడేమో నిలువున మోసం చే సిండు. –రొట్టె విఠవ్వ, బాధితురాలు, మార్దండ.
Comments
Please login to add a commentAdd a comment