అనుపమ్ ఖేర్ బొమ్మ కరెన్సీతో బురిడీ
లబోదిబో మంటున్న గుజరాత్ వ్యాపారి
అహ్మదాబాద్: వీళ్లు అలాంటిలాంటి మోసగాళ్లు కాదు.. దొంగనోట్ల కట్టలు. అవీ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ బొమ్మతో ఉన్నవి అక్షరాలా రూ.1.30 కోట్లు..ఓ బడా బంగారం వ్యాపారికి అంటగట్టి ఏకంగా 2.1 కిలోల బంగారంతో ఉడాయించారు. ఇందుకోసమే ప్రత్యేకంగా వాళ్లు ఓ నకిలీ హవాలా ఆఫీసును సైతం ఏర్పాటు చేసుకున్నారు. మోసం తెలుసుకునేలోపే పత్తా లేకుండా పోయారు. బాలీవుడ్‌ను సైతం తలదన్నే ట్విస్టులున్న ఈ ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
అహ్మదాబాద్‌కు చెందిన బంగారం వ్యాపారి మెహుల్ ఠక్కర్‌కు ఇటీవల ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. తన పేరు ప్రశాంత్ పటేల్ అని, స్థానికంగా ఉన్న ఫలానా నగల దుకాణం మేనేజర్‌ను అంటూ పరిచయం చేసుకున్నాడు. ఆ దుకాణం మెహుల్‌కు తెలిసిందే కావడంతో ఆయన నిజమేననుకున్నాడు. పటేల్ 2.1 కిలోల బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపగా, కొంత బేరసారాల తర్వాత రూ.1.60 కోట్లకు డీల్ కుదిరింది. అతడిచి్చన సమాచారం మేరకు సెప్టెంబర్ 24వ తేదీన ఠక్కర్ తన మనుషులకు 2.1 కిలోల బంగారమిచ్చి పంపించారు.
చెప్పిన ప్రకారం వాళ్లు ఓ హవాలా దుకాణానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ వీరి కోసం ముగ్గురు వ్యక్తులున్నారు. దుకాణంలోని నోట్ల లెక్కింపు మిషన్‌తో తీసుకువచి్చన 26 బండిళ్లలో ఉన్న నోట్లను లెక్కించడం మొదలైంది. తాము రూ.1.30 కోట్లే తెచ్చామని, మిగతా రూ.30 లక్షలు పక్కనే మరో దుకాణం నుంచి తెస్తామంటూ ముగ్గురిలో ఇద్దరు బంగారం బిస్కెట్లను తీసుకుని వెళ్లారు. అయితే, ఆ నోట్లపై మహాత్మా గాం«దీకి బదులు నటుడు అనుపమ్ ఖేర్ బొమ్మ ఉంది. రిజర్వు బ్యాంక్ ఇండియా స్థానంలో తప్పుగా ‘రెసోల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’అని ఉంది. ఠక్కర్ సిబ్బంది ఇదంతా గమనించి, అనుమానించారు.
ఇదేమని, అక్కడే ఉన్న మూడో వ్యక్తిని ప్రశ్నించారు. కౌంటింగ్ మిషన్ తెమ్మంటే తెచ్చానే తప్ప, వారెవరో, ఆ నోట్ల విషయమేంటో నాకూ తెలియదు’అంటూ అతడు చావు కబురు చల్లగా చెప్పాడు. బంగారం బిస్కెట్లతో వెళ్లిన పెద్దమనుషులు తిరిగి రాలేదు. దీంతో, సిబ్బంది ఆ విషయాన్ని ఠక్కర్ చెవిన వేశారు. ఆయన గుండె ఆగినంత పనైంది..! ఇదేమిటని ఆరా తీయగా ఆ హవాలా దుకాణాన్ని రెండు రోజుల క్రితమే ఎవరో తెరిచారని తేలింది. దీంతో, మెహుల్ ఠక్కర్ తననెవరో బకరాను చేశారని గ్రహించి, నవ్‌రంగ్‌పుర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment