fake notes
-
అనుపమ్ ఖేర్ బొమ్మ కరెన్సీతో బురిడీ
అహ్మదాబాద్: వీళ్లు అలాంటిలాంటి మోసగాళ్లు కాదు.. దొంగనోట్ల కట్టలు. అవీ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ బొమ్మతో ఉన్నవి అక్షరాలా రూ.1.30 కోట్లు..ఓ బడా బంగారం వ్యాపారికి అంటగట్టి ఏకంగా 2.1 కిలోల బంగారంతో ఉడాయించారు. ఇందుకోసమే ప్రత్యేకంగా వాళ్లు ఓ నకిలీ హవాలా ఆఫీసును సైతం ఏర్పాటు చేసుకున్నారు. మోసం తెలుసుకునేలోపే పత్తా లేకుండా పోయారు. బాలీవుడ్‌ను సైతం తలదన్నే ట్విస్టులున్న ఈ ఘటన గుజరాత్లో చోటుచేసుకుంది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. అహ్మదాబాద్‌కు చెందిన బంగారం వ్యాపారి మెహుల్ ఠక్కర్‌కు ఇటీవల ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. తన పేరు ప్రశాంత్ పటేల్ అని, స్థానికంగా ఉన్న ఫలానా నగల దుకాణం మేనేజర్‌ను అంటూ పరిచయం చేసుకున్నాడు. ఆ దుకాణం మెహుల్‌కు తెలిసిందే కావడంతో ఆయన నిజమేననుకున్నాడు. పటేల్ 2.1 కిలోల బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపగా, కొంత బేరసారాల తర్వాత రూ.1.60 కోట్లకు డీల్ కుదిరింది. అతడిచి్చన సమాచారం మేరకు సెప్టెంబర్ 24వ తేదీన ఠక్కర్ తన మనుషులకు 2.1 కిలోల బంగారమిచ్చి పంపించారు. చెప్పిన ప్రకారం వాళ్లు ఓ హవాలా దుకాణానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ వీరి కోసం ముగ్గురు వ్యక్తులున్నారు. దుకాణంలోని నోట్ల లెక్కింపు మిషన్‌తో తీసుకువచి్చన 26 బండిళ్లలో ఉన్న నోట్లను లెక్కించడం మొదలైంది. తాము రూ.1.30 కోట్లే తెచ్చామని, మిగతా రూ.30 లక్షలు పక్కనే మరో దుకాణం నుంచి తెస్తామంటూ ముగ్గురిలో ఇద్దరు బంగారం బిస్కెట్లను తీసుకుని వెళ్లారు. అయితే, ఆ నోట్లపై మహాత్మా గాం«దీకి బదులు నటుడు అనుపమ్ ఖేర్ బొమ్మ ఉంది. రిజర్వు బ్యాంక్ ఇండియా స్థానంలో తప్పుగా ‘రెసోల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’అని ఉంది. ఠక్కర్ సిబ్బంది ఇదంతా గమనించి, అనుమానించారు. ఇదేమని, అక్కడే ఉన్న మూడో వ్యక్తిని ప్రశ్నించారు. కౌంటింగ్ మిషన్ తెమ్మంటే తెచ్చానే తప్ప, వారెవరో, ఆ నోట్ల విషయమేంటో నాకూ తెలియదు’అంటూ అతడు చావు కబురు చల్లగా చెప్పాడు. బంగారం బిస్కెట్లతో వెళ్లిన పెద్దమనుషులు తిరిగి రాలేదు. దీంతో, సిబ్బంది ఆ విషయాన్ని ఠక్కర్ చెవిన వేశారు. ఆయన గుండె ఆగినంత పనైంది..! ఇదేమిటని ఆరా తీయగా ఆ హవాలా దుకాణాన్ని రెండు రోజుల క్రితమే ఎవరో తెరిచారని తేలింది. దీంతో, మెహుల్ ఠక్కర్ తననెవరో బకరాను చేశారని గ్రహించి, నవ్‌రంగ్‌పుర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
ఆ గుర్తు ఉన్న రూ. 500 నోట్లు ఫేక్? ఇదిగో క్లారిటీ..
సోషల్ మీడియాలో నిత్యం రకరకాల మెసేజ్‌లు వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ప్రతి సందేశం నిజమైనది కాదు. అందులో చాలామటుకు ఫేక్ సందేశాలే ఉంటాయి. ఒక్కోసారి ఫేక్ మెసేజ్‌లతో చాలా మంది మోసపోతుంటారు. ప్రస్తుతం రూ. 500 నోట్ల గురించి అలాంటి ఫేక్ మెసేజ్ ఒకటి వైరల్ అవుతోంది. రూ. 500 నోటుపై ఉన్న సీరియల్ నంబర్లో స్టార్ (*) గుర్తు ఉంటే అలాంటి నోట్లు నకిలీవని ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ రంగ వార్తా సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో - పీఐబీ (PIB) ఫాక్ట్ చెక్ ప్రకారం.. రూ. 500 నోటు గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా తప్పు. అందులో ఉన్నట్లుగా స్టార్ గుర్తు ఉన్న రూ.500 నోట్లు నకిలీవి కావు. ఇదీ చదవండి ➤ Bank Holidays in August 2023: ఆగస్టు నెలలో 14 రోజులు బ్యాంకుల మూత! సెలవుల జాబితా ఇదిగో.. 2016లో రూ.500, రూ.1000 నోట్ల రద్దు అనంతరం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- ఆర్బీఐ స్టార్ (*) గుర్తుతో ఉన్న నంబర్ సిరీస్ నోట్లను ప్రవేశపెట్టింది. కాబట్టి అలాంటి నోట్లు నకిలీవని వచ్చే మెసేజ్‌లను నమ్మవద్దు. భారతీయ కరెన్సీకి సంబంధించి మీకు ఏవైనా సందేహాలు ఉంటే ఆర్బీఐ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. -
RBI Report: అలర్ట్.. నకిలీ నోట్లపై ఆర్బీఐ కీలక రిపోర్ట్
సాక్షి, అమరావతి: దేశంలో అత్యధిక విలువ కలిగిన రూ.2 వేల నోటు కంటే.. రూ.500 నోట్లే అత్యధికంగా నకిలీవి చలామణి అవుతున్నాయని ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. రూ.200 నోట్ల కంటే కూడా రూ.100 నకిలీ నోట్లే ఎక్కువ మార్కెట్లోకి ప్రవేశించాయని తెలిపింది. ఆర్బీఐ తాజాగా ఉపసంహరించిన రూ.2 వేల నోట్లు నకిలీ నోట్లలో 5వ స్థానంలో ఉన్నాయి. 2022–23లో దేశంలో నకిలీ నోట్లపై ఆర్బీఐ విడుదల చేసిన తాజా నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు గుర్తించే నకిలీ నోట్లపై ఆర్బీఐ ఏటా నివేదిక విడుదల చేస్తుంది. జాతీయ బ్యాంకులు, ఇతర బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తాము గుర్తించిన నకిలీ నోట్లను ఆర్బీఐకి పంపిస్తాయి. ఆ విధంగా గుర్తించిన నోట్ల గణాంకాలను ఆర్బీఐ ఏటా విడుదల చేస్తుంది. నోట్ల ముద్రణకు రూ.4,682.80 కోట్లు ఆర్బీఐ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. 2022–23లో కరెన్సీ నోట్ల ముద్రణ కోసం (సెక్యూరిటీ ప్రింటింగ్) ఆర్బీఐ రూ.4,682.80కోట్లు వెచ్చించింది. ♦ దేశవ్యాప్తంగా 2022–23లో మొత్తం 2,25,769 నకిలీ నోట్లను గుర్తించారు. వాటిలో 4.6 శాతం నోట్లను ఆర్బీఐ నేరుగా గుర్తించగా.. 95.4 శాతం నోట్లను దేశంలోని వివిధ బ్యాంకులు గుర్తించాయి. ♦ 2021–22తో పోలిస్తే 2022–23లో దేశంలో గుర్తించిన నకిలీ నోట్లు 5,202 తగ్గాయి. 2021–22లో దేశంలో 2,30,971 నకిలీ నోట్లను గుర్తించారు. ♦ గత ఆర్థిక సంవత్సరంలో గుర్తించిన నకిలీ నోట్లలో రూ.500 నోట్లు మొదటి స్థానంలో ఉన్నాయి. 91,110 నకిలీ రూ.500 నోట్లను గుర్తించారు. 2021–22 కంటే నకిలీ రూ.500 నోట్లు 14 శాతం పెరిగాయి. ♦ నకిలీ నోట్లలో రూ.100 నోట్లు రెండో స్థానంలో ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో 78,699 నకిలీ రూ.100 నోట్లను గుర్తించారు. ♦ రూ.200 నకిలీ నోట్లు మూడో స్థానంలో ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో 27,258 నకిలీ రూ.200 నోట్లను గుర్తించారు. ♦ నాలుగో స్థానంలో రూ.50 నోట్లు ఉన్నాయి. 2022–23లో 17,755 నకిలీ రూ.50 నోట్లను గుర్తించారు. ♦ దేశంలో ఎక్కువ విలువైన రూ.2 వేల నోట్లు నకిలీ నోట్లలో 5వ స్థానంలో ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో 9,806 నకిలీ రూ.2 వేల నోట్లను గుర్తించారు. ♦ గుర్తించిన మిగిలిన నకిలీ నోట్లలో రూ.2, రూ.5 నోట్లతో పాటు రూ.500, రూ.1,000 విలువ గల స్పెసిఫైడ్ బ్యాంక్ నోట్లు (2016కు ముందు చలామణిలో ఉన్న నోట్లకు నకిలీవి) ఉన్నాయి. -
యూ ట్యూబ్ వీడియోలు చూసి దొంగ నోట్లు ముద్రించిన యువకుడు
-
తూ.గో. జిల్లా కు చెందిన మహిళ తో ట్రాప్ చేయించిన ముట్ట
-
ఆస్పత్రి బెడ్‌పై దిండు, సంచి ఉంచి పరారైన దొంగ
గురజాల: తాను చికిత్స పొందుతున్న ఆస్పత్రి బెడ్‌పై దిండు, కర్రల సంచి ఉంచి పైన దుప్పటి కప్పి.. పోలీసుల కళ్లుగప్పి సినీపక్కీలో ఓ దొంగ పరారయిన ఘటన గురజాల సామాజిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పల్నాడు జిల్లా చర్లగుడిపాడు గ్రామానికి చెందిన ఉద్దగిరి అలేఖ ఇంట్లో దొంగనోట్లు తయారు చేస్తున్నాడనే సమాచారం రావడంతో నవంబర్ 17వ తేదీ 2022న పోలీసులు సోదా చేస్తుండగా.. అతను గోడ దూకి పరారయ్యాడు. ఈ నేపథ్యంలో అలేఖ రెండు కాళ్లు దెబ్బతిన్నట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో పోలీసులు ఈ ఏడాది జనవరి 3న అలేఖతో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరిచారు. కోర్టు అలేఖకు రిమాండ్ విధించగా సబ్ జైల్ అధికారులు అలేఖ రెండు కాళ్లకు చికిత్స నిమిత్తం గుంటూరు వైద్యశాలకు తరలించారు. ఆపరేషన్ చేసిన అనంతరం గురజాల వైద్యశాలకు తరలించారు. అప్పటి నుంచి గురజాల సామాజిక ఆరోగ్య కేంద్రంలో అలేఖకు కాపలాగా ఏఆర్ కానిస్టేబుళ్లు పహారా కాస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 8 గంటలకు ఏఆర్ సిబ్బంది మంచం వద్దకు వెళ్లి చూడగా దిండు, కర్రల సంచి ఉంచి పైన దుప్పటి కప్పి అలేఖ పరారైనట్లు గుర్తించారు. వీల్ చైర్‌తో సహా పరారీ..? నిందితుడు ఉద్దగిరి అలేఖ వైద్యశాలలో ఉన్న వీల్ చైర్‌తో సహా పరారైనట్లు పోలీసులు తెలుపుతున్నారు. అలేఖ రెండు కాళ్లు దెబ్బతినడంతో నడవడం కష్టంగా ఉంటుందని వైద్యశాలలో ఒక వీల్ చైర్ కూడా కనిపించడం లేదని తెలిపారు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు పట్టణంలోని పలు కూడళ్లలో ఉన్న సీసీ పుటేజీని పరిశీలిస్తున్నారు. -
భార్యను చంపి 5 ముక్కలుగా నరికి..
బిలాస్పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బిలాస్‌పూర్‌కు చెందిన ఓ వ్యక్తి తన భార్యను చంపి, మృతదేహాన్ని ఐదు ముక్కలుగా నరికి, ఇంట్లోని ఖాళీ నీళ్ల ట్యాంకులో పడేశాడు. సక్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉలాస్‌పూర్ ప్రాంతంలో ఓ వ్యక్తి నకిలీ నోట్లను ముద్రిస్తున్నాడనే అనుమానంతో ఓ ఇంట్లో సోదాలు జరిపారు. బాత్రూం మూలన ఉన్న ట్యాంకులో టేప్ వేసి పాలిధీన్ కవర్లో చుట్టిన శరీర భాగాలు కనిపించడంతో షాక్‌కు గురయ్యారు. అక్రమ సంబంధం అనుమానంతో భార్యను జనవరి 6న గొంతు పిసికి చంపినట్లు విచారణలో అతడు వెల్లడించాడు. అనంతరం కట్టర్‌తో మృతదేహాన్ని ఐదు ముక్కలు కోసి, కొనుక్కొచ్చిన ట్యాంకులో పడేసినట్లు తెలిపాడు. ఇంట్లో నకిలీ నోట్లు, కలర్ ప్రింటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
సాక్షి కార్టూన్ 31-05-2022
మరొక్కసారి నోట్ల రద్దు చేస్తే..! -
గోల్కొండ నకిలీ నోట్ల వ్యవహారంలో కొత్త ట్విస్ట్
-
కూకట్ పల్లి లో నకిలీ నోట్ల కలకలం
-
సూరత్‌లో రూ. 5.44 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం
సూరత్ : రూ. 5.44 లక్షల నకిలీ నోట్లను రాజస్తాన్ నుంచి గుజరాత్‌లోని సూరత్‌కు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పూణే పోలీసులు శనివారం సూరత్‌లో అరెస్టు చేశారు. కాగా నిందితులిద్దరూ రాజస్థాన్ నుంచి బస్సులో ప్రయాణిస్తుండగా నియోల్ చెక్ పోస్ట్ వద్ద పట్టుబడ్డారు. కాగా పట్టుబడిన వారిని చునిలాల్ సుతార్, చంద్రకాంత్ షాగా గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుల వద్ద మొత్తం 642 నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు గుర్తించారు. వీటిలో రూ. 2000,రూ. 500,రూ. 200,రూ.100 నోట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
సకుటుంబ కరెన్సీ ముద్రణ!
మహబూబాబాద్ రూరల్: చిన్నచిన్న వ్యాపారాలు చేసినా కలిసి రాలేదు. దీంతో డబ్బుల కోసం దొంగ నోట్లు ముద్రించాలని నిర్ణయించుకున్నాడు. యూ ట్యూబ్‌లో తయారీ విధానం నేర్చుకుని దొంగ నోట్లు ముద్రించాక చలామణి ప్రారంభించాడు. ఈ క్రమంలో పోలీసులకు పట్టుబడగా భార్యాభర్తలతో పాటు వారి ఇద్దరు కుమారులను మహబూబాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో సామల శ్రీనివాస్ మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం మడగూడలో ఆర్ఎంపీగా ప్రాక్టీస్ చేసేవాడు. భార్య, ఇద్దరు కుమారులతో హైదరాబాద్‌లో ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన పెద్ద కుమారుడు సాయిచరణ్ డిగ్రీ చదువుతూ సినిమా రంగం వైపు మళ్లాడు. షార్ట్ ఫిల్మ్‌లు, ప్రైవేటు సాంగ్ ఆల్బమ్ లు తయారు చేస్తున్నాడు. ఇంతలో ఓ పెద్ద సినిమాలో నటించేందుకు సినీ నిర్మాత బండ్ల గణేశ్ దగ్గర పనిచేసే పేట శ్రీనివాస్ అవకాశం ఇచ్చినా పెట్టుబడి కావాలనడంతో మరోమా ర్గంలేక యూట్యూబ్‌లో నకిలీ నోట్లు తయారీ విధానం నేర్చుకుని ఒక కలర్ ప్రింటర్, రెవెన్యూ స్టాంప్లకు ఉపయోగించే పేపర్లను కొనుగోలు చేసుకుని రూ.200, రూ. 500, రూ.2వేల నకిలీ నోట్లను తయారు చేశాడు. గ్రామాల్లోనైతే సులువు నకిలీ నోట్లు జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో మార్పిడి చేస్తే గుర్తు పడతారని భావించిన శ్రీనివాస్ గ్రామాలను ఎంచుకున్నాడు. ఇందుకు ఓ మహింద్రా జైలో వాహనాన్ని సమకూర్చుకుని మూడు నెలల నుంచి వరంగల్, ఖమ్మం, నల్ల గొండ ఉమ్మడి జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతా ల్లో నకిలీ నోట్లను చలామణి చేస్తున్నాడు. ఈక్రమంలో ఈనెల 19వ తేదీ సాయంత్రం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని ఉప్పరపల్లిలో బెల్టు షాపులో రూ.500 నోటు, మరో మహిళ వద్ద రూ.500 నోటు మార్పిడి చేద్దామని యత్నించాడు. దీన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసముద్రం ఎస్సై బి.సతీశ్ విచారణ ప్రారంభించారు. శుక్రవారం ఉదయం కేసముద్రం వద్ద మహింద్రా జైలో వాహనంలో వెళ్తున్న సామల శ్రీనివాస్, ఆయన భార్య నాగలక్ష్మి, వారి కుమారులు సాయిచరణ్, అఖిల్ పట్టుబడ్డారు. వీరి నుంచి రూ.69,900 నకిలీ నోట్లు, రూ.29,870 అసలైన నోట్లు స్వాధీనం చేసుకున్నారు. -
వీటిలో ఏ ఒక్కటి లేకున్నా అది దొంగనోటే..
సాక్షి, హైదరాబాద్ : నకిలీ నోట్ల చలామణీ దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తోన్న సంగతి తెలిసిందే. వీటిని అడ్డుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అత్యున్నత ప్రమాణాల్లో కరెన్సీని ముద్రిస్తోంది. అయినప్పటికీ దొంగ నోట్లు మార్కెట్లో చలామణీ అవుతూనే ఉన్నాయి. మార్కెట్లో విచ్చలవిడిగా దొంగనోట్లు చెలామణీ అవుతుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అయితే దొంగనోట్లను నివారించడానికి ఆర్బీఐ 2016లోనే పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇందులోని 17 అంశాలు ఉన్నాయి. వీటిలో ఏ ఒక్కటి లేకున్నా అది దొంగనోటేననే నిర్ధారణకు రావొచ్చు. ఆర్బీఐ ప్రకారం నోట్లలోని ప్రధాన గుర్తులను తెలుసుకుంటే ఏది అసలు.. ఏది నకిలీ అని తేలిపోతుంది. రూ.2000, రూ.500, రూ.200, రూ.100 కరరెస్సీ నోట్లలో గుర్తించాల్సిన అంశాలను పరిశీలిస్తే.. రూ.2వేలు నోటు ముందు 1. లైటు వెలుతురులో రూ.2000 అంకెను గమనించవచ్చు. 2. 45 డిగ్రీల కోణంలో చూస్తే రూ.2000 అంకెను గమనించొచ్చు. 3. దేవనాగరి లిపిలో రూ.2000 సంఖ్య ఉంటుంది 4. మధ్య భాగంలో మహాత్మాగాంధీ బొమ్మ ఉంటుంది 5. చిన్న అక్షరాల్లో ఆర్బీఐ, 2000 అని ఉంటుంది 6. నోటును కొంచెం వంచితే విండోడ్ సెక్యూరిటీ త్రెడ్ ఆకుపచ్చ నుంచి నీలానికి మారుతుంది. మధ్యలో భారత్, ఆర్బీఐ, రూ.2000 అంకె ఉంటుంది. 7. గవర్నర్ సంతకం, ఆర్బీఐ చిహ్నం కుడివైపునకు మార్పు 8. మహాత్మాగాంధీ బొమ్మ, ఎలక్ట్రోటైప్ (2000) వాటర్ మార్క్ ఉంటుంది 9. పైభాగంలో ఎడమ వైపున, కింది భాగంలో కుడివైపున సంఖ్యలతో కూడిన నంబర్ సైజ్ ఎడమ నుంచి కుడికి పెరుగుతుంది. 10. కుడి వైపున కింది భాగంలో రంగు మారే ఇంక్ (ఆకుపచ్చ నుంచి నీలం)లో రూపాయి సింబల్‌తో పాటు 2000 సంఖ్య ఉంటుంది 11. కుడివైపున అశోక స్తూపం చిహ్నం ఉంటుంది. అంధుల కోసం..మహాత్మాగాంధీ బొమ్మ, అశోక స్తూపం చిహ్నం, బ్లీడ్ లైన్స్, గుర్తింపు చిహ్నం చెక్కినట్లుగా లేదా ఉబ్బెత్తుగా ఉంటాయి. 12. కుడి వైపున దీర్ఘ చతురస్రాకారంలో ఉబ్బెత్తుగా 2000 అని ముద్రించి ఉంటుంది. 13. కుడి,ఎడమ వైపున ఉబ్బెత్తుగా ముద్రించిన ఏడు బ్లీడ్ లైన్స్ ఉంటాయి. వెనుక వైపు 14. నోటు ముద్రణ సంవత్సరం ఎడమవైపున ఉంటుంది. 15. నినాదంతో సహా స్వచ్ఛభారత్ లోగో ఉంటుంది 16. మధ్య భాగంలో భాషల ప్యానల్ ఉంటుంది 17. మంగళయాన్ చిత్రం ఉంటుంది. -
ఆర్టీసీకి నకిలీ నోట్ల బెడద
ఇబ్రహీంపట్నం: ఆర్టీసీని నకిలీ నోట్ల బెడద వెంటాడుతోంది. ఇబ్రహీంపట్నం ఆర్టీసీ బస్సుల్లో ఈ నోట్ల చలామణి ఎక్కువగా జరుగుతోంది. సంతరోజైన బుధవారం జనాల రద్దీ మార్కెట్లో ఎక్కువగా ఉంటుంది. బస్సుల్లో ప్రయాణికులు కిక్కిరిసి ఉంటారు. ఇదే అదనుగా భావించి కేటుగాళ్లు కండక్టర్లకు నకిలీనోట్లు ఇస్తున్నారు. ప్రయాణికుల రద్దీతో నోట్లను సరిగా గమనించని కండక్టర్లు వారికి టికెట్లను ఇచ్చి తిరిగి చిల్లర డబ్బులను ఇస్తున్నారు. డ్యూటీ దిగి డిపోలోని క్యాష్ కౌంటర్లో డబ్బులను కండక్టర్లు ముట్టజెప్పి వెళ్తున్నారు. ఆ తర్వాత డిపో క్యాష్ క్లర్క్ డబ్బులను లెక్కించే క్రమంలో ఈ నకిలీ నోట్లు బయటపడుతున్నాయి. బుధ, గురువారల్లో ఈ నోట్ల అధికంగా వస్తున్నట్లు డిపో అధికారి ఒకరు తెలిపారు. ఒకే సిరీస్ నంబర్‌తో మూడు నాలుగు నోట్లు వచ్చినట్లు చెప్పారు. అదేవిధంగా రద్దీగా ఉండే పాన్‌షాపుల్లో కూడా ఈ నోట్లు వస్తున్నట్లు ఓ యాజమాని తెలిపారు. ఓరిజనల్ నోట్లను పోలీనట్లుగానే ఉండటంతో ఈ నోట్లను వెంటనే గుర్తించడం ఇబ్బందిగా మారింది. నకిలీనోట్లు వస్తున్నాయి ఆర్టీసీ బస్సుల్లో నకిలీ నోట్లు వస్తున్నాయి. రద్దీగా ఉండే బస్సుల్లోనే దుండగులు నకిలీ నోట్లను విడిపిస్తున్నారు. బుధ, గురువారల్లో ఇవి ఎక్కువ వస్తున్నాయి. క్యాష్ కౌంటింగ్ మిషన్‌కు కూడా ఈ నోట్లు చిక్కడం లేదు. బ్యాంకుకు వెళ్తే ఫెక్ నోట్ అంటూ చెబుతున్నారు. – యాదయ్య, ఆర్టీసీ డిపో క్లర్కు -
ఎన్నికల ఇంకు గురించి తెలుసా..?
సాక్షి, కోదాడ : ఎన్నికల సమయంలో దొంగ ఓట్లను నివారించడానికి, ఒకరు ఒకటి కంటే ఎక్కువ ఓట్లు వేయకుండా ఉండడానికి ఎన్నికల సంఘం ప్రతి ఓటరు ఎడమ చేతి చూపుడు వేలిపై ఇంకు గుర్తును వేస్తుంది. ఇది దాదాపు నెల రోజుల వరకు చెరిగిపోకుండా ఉంటుంది. ఈ ఇంకుకు పెద్ద చరిత్రనే ఉంది. దేశంలో జరిగిన 3వ సాధారణ ఎన్నికల నుంచి దీన్ని ఉపయోగిస్తున్నారు. దేశం మొత్తానికి అవసరమైన ఈ ఇంకును ఒక్క కంపెనీ మాత్రమే తయారు చేస్తుంది. 1937 సంవత్సరంలో కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ పట్టణంలో ఈ ఇంకు తయారీ పరిశ్రమను ‘‘ మైసూర్ ల్యాక్ అండ్ పెయింట్స్ ’’ పేరుతో స్థాపించారు. మహా రాజ నల్వాడీ కృష్ణరాజ వడయార్ దీని వ్యవస్థాపకుడు. తర్వాత దీన్ని మైసూర్ పెయింట్స్ వార్నిష్‌గా పేరు మార్చారు. ప్రస్తుతం ఈ కంపెనీ కర్ణాటక ప్రభుత్వ ఆధీనంలో నడుస్తుంది. 1962 నుంచి ఎన్నికల సంఘం తమకు అవసరమయ్యే ఇంకును ఈ పరిశ్రమ నుంచి మాత్రమే కొనుగోలు చేస్తుంది. ఇది 5, 7, 5, 20, 50 మిల్లీలీటర్ల బాటిళ్లలో దొరుకుతుంది. 5 ఎంఎల్ బాటిల్ 300 మంది ఓటర్లకు సరిపోతుంది. ఈ పరిశ్రమ ఈ ఇంకును ఇతర దేశాలకు కూడా సరఫరా చేస్తుంది. మారుతున్న కాలంతో పాటు ఈ పరిశ్రమ కూడా ఆధునికీకరణ చెందింది. ఈ ఇంకుతో సులువుగా ఉపయోగించడానికి మార్కర్ పెన్నులను కూడా తయారీ చేస్తుంది. ఇతర దేశాలలో వీటిని వాడుతున్నారు. కానీ మనదేశంలో మాత్రం ఇంకా ఇంకును మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఈ ఇంకు తయారీ అత్యంత రహస్యంగా సాగుతుంది. దీని తయారీలో ఉపయోగించే రసాయన ఫార్ములాను నేషనల్ ఫిజికల్ లాబోరేటరీ ఆఫ్ ఇండియా అత్యంత రహస్యంగా రూపొం ది స్తుంది. ఇతరులకు దీని తయా రీ తెలియనీయరు. -
పాక్‌లో మన కరెన్సీ ప్రింటింగ్!
భారత ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసే ఉద్దేశంతో భారీగా నకిలీ కరెన్సీని ముద్రించి, దేశంలోకి పంపుతున్న పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ.. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రెస్ ఏర్పాటు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గత నెలలో హైదరాబాద్‌లోని పాతబస్తీలో దొరికిన కరెన్సీ అక్కడే ముద్రితమై బంగ్లాదేశ్ మీదుగా పశ్చిమబెంగాల్‌కు వచ్చినట్లు భావిస్తున్నారు. పాక్‌లోని బలూచిస్తాన్ లో ఉన్న క్వెట్టాలో ప్రత్యేకంగా ‘భారత్ పవర్ ప్రెస్’ఉన్నట్లు చెబుతున్నారు. ఇక్కడ ముద్రితమైన నకిలీ నోట్లు అసలు వాటిని తలదన్నేలా ఉన్నా.. అసలు నోట్లపై ఉండే కొన్ని భద్రతా ప్రమాణాలను మాత్రం ఐఎస్ఐ కాపీ చేయలేకపోయింది. – సాక్షి, హైదరాబాద్ రూటు మార్చి భారత్‌కు.. క్వెట్టాలో ముద్రితమవుతున్న ఈ నకిలీ కరెన్సీ తొలుత ఆ దేశ రాజధాని కరాచీకి చేరుతోంది. అక్కడ నుంచి ఐఎస్ఐ ప్రత్యేక పార్సిల్స్ ద్వారా పలు మార్గాల్లో భారత్‌కు వస్తోంది. ఒకప్పుడు పాకిస్తాన్ నుంచి విమానాల ద్వారా దుబాయ్/సౌదీ అరేబియాలకు తరలించే వారు. అక్కడున్న ఏజెంట్ల సహకారంతో జలమార్గంలో ఓడల ద్వారా గుజరాత్, మహారాష్ట్రల్లోని వివిధ ఓడ రేవులకు చేర్చేవారు. చిత్తుకాగితాలు, ముడిసరుకుల పేరుతో వచ్చేవి. కొన్నాళ్లుగా ఈ మా ర్గం ద్వారా తీసుకురావడం కష్టంగా మారడంతో ఐఎస్ఐ రూటు మార్చింది. కరాచీ నుంచి విమానాల ద్వారా బంగ్లాదేశ్‌కు చేరవేస్తోంది. అక్కడి నుంచి పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాకు తీసుకొచ్చి ఏజెంట్ల ద్వారా చెలామణీ చేయిస్తోంది. క్వాలిటీతో పాటే పెరిగిన కమీషన్ కరాచీ నుంచి మాల్దా వరకు వివిధ దశల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంటున్న ఐఎస్ఐ వారికి కమీషన్లు చెల్లిస్తోంది. హైదరాబాద్‌కు చేరే నకిలీ కరెన్సీ మార్పిడి రేటు 1:3గా ఉండేది. అంటే రూ.30 వేలు అసలు నోట్లు ఇస్తే ఏజెంట్లు రూ.లక్ష నకిలీ కరెన్సీ ఇచ్చే వారు. ఇటీవల ఏజెంట్లకు ఇచ్చే ఈ కమీషన్ పెరిగింది. నోట్లను పక్కాగా ముద్రిస్తున్న నేపథ్యంలో కమీషన్ పెంచినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇటీవల చిక్కిన కరెన్సీని పాతబస్తీకి చెందిన గౌస్‌కు, మాల్దాకు చెందిన బబ్లూ రూ.50 వేల అసలు కరెన్సీకి రూ.లక్ష నకిలీ నోట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. అలా వచ్చే నిధులను పాకిస్తాన్ పరోక్షంగా ఉగ్రవాదానికి వాడుతోందనే అనుమానాలు ఉన్నాయి. చిక్కిన గౌస్.. పరారీలో బబ్లూ.. బండ్లగూడకు చెందిన మహ్మద్ గౌస్ పండ్ల వ్యాపారి. 1991లో పోలీసులకు బాంబులతో పట్టుబడటంతో బాంబ్ గౌస్‌గా మారాడు. ఇతడిపై పోలీసులు ఉగ్రవాద చర్యల వ్యతిరేక చట్టం (టాడా) కూడా ప్రయోగించారు. తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు 2011 నుంచి నకిలీ కరెన్సీ దందా ప్రారంభించాడు. పశ్చిమ బెంగాల్ నుంచి పలు మార్గాల్లో హైదరాబాద్‌కు తెప్పించి చెలామణీ చేస్తున్నాడు. పశ్చిమ బెంగాల్‌లోని బంగ్లాదేశ్ సరిహద్దు జిల్లా మాల్దాలో ఉన్న కృష్ణాపూర్ ప్రాంతానికి చెందిన అమీనుల్ రెహ్మాన్ అలియాస్ బబ్లూతో పరిచయం ఏర్పడింది. ఇతడికి రూ.40 వేలు చొప్పున చెల్లిస్తూ రూ.లక్ష నకిలీ కరెన్సీ తెప్పించి చెలామణి చేసేశాడు. బబ్లూ గౌస్‌తో పాటు అనేక మందికి సరఫరా చేస్తున్నట్లు అనుమానిస్తున్న పోలీసులు మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చారు. బబ్లూ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఈ మూడు గమనించుకోవాలి.. 1. సెక్యూరిటీ థ్రెడ్ కరెన్సీ నోటుకు ముందు వైపు మధ్యలో కుడివైపుగా నోటు విలువ అంకెల్లో ముద్రితమై ఉంటుంది. దీనికి కుడివైపున నోటు లోపలకు, బయటకు కనిపిస్తూ చిన్న పట్టీ ఉంటుంది. సిల్వర్ బ్రోమైడ్తో తయారయ్యే దీనిపై ఆర్బీఐ అంటూ ఆంగ్లం, హిందీ భాషల్లో చిన్న అక్షరాలతో రాసి ఉంటుంది. ఇది నీలం, ఆకుపచ్చ రంగుల్లో మెరుస్తూ ఉంటుంది. నకిలీ కరెన్సీపై ఆర్బీఐ మార్క్ ఉన్నా.. ఈ థ్రెడ్ సిల్వర్ కోటెడ్ అయి ఉండి, ఆకుపచ్చ రంగు మాత్రమే ఉంటుంది. 2. బ్లీడ్ లైన్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రించే రూ.2 వేల కరెన్సీ నోటుకు కుడి, ఎడమ వైపుల్లో పైభాగంలో కొన్ని గీతలు ఉంటాయి. బ్లీడ్ లైన్స్‌గా పిలిచే ఇవి కాస్త ఎత్తుగా, ఒక్కో వైపు ఏడు చొప్పున ఉంటాయి. సాధారణ నోటును చేతితో తడిమితే ఇవి తగులుతాయి. నకిలీ నోట్లలో ఈ ఫీచర్‌ను కాపీ చేయడం సాధ్యం కాదు. నకిలీ నోట్లపై కూడా లైన్లు ఉన్నా అవి చేతికి తగిలేలా పైకి ఉండవు. 3. వాటర్ మార్క్ కరెన్సీ నోటుకు ముందు భాగంలో కుడి వైపు ఖాళీ ప్రదేశం ఉంటుంది. పైకి కనిపించని విధంగా గాంధీ బొమ్మ ఉంటుంది. దీనికి పక్కగా ఆ నోటు విలువ వేసి ఉంటుంది. ఈ వాటర్ మార్కును వెలుతురులో పెట్టిచూస్తే అందులోనూ గాంధీజీ ఫొటో కనిపిస్తుంటుంది. దాదాపు సగం ప్రాంతానికి సరిపోతూ ఉంటుంది. నకిలీ నోట్లలోనూ ఈ వాటర్‌మార్క్‌లో గాంధీజీ ఫొటో ఉన్నా.. దాని చుట్టూ ఖాళీ ఎక్కువగా ఉంటుంది. -
నకిలీ నోట్ల చలామణి
పశ్చిమగోదావరి, ఏలూరు టౌన్ : ఒరిజినల్ రూ.2 వేల నోట్లను స్కాన్ చేసి .. అదేరీతిలో ఫేక్ రూ.2 వేల నోట్లను జిరాక్స్ తీసి మార్కెట్లోకి చలామణి చేస్తోన్న ఒక వ్యక్తిని ఏలూరు పోలీసులు చాకచక్యంగా వలపన్ని పట్టుకున్నారు. ఈ మేరకు సోమవారం ఏలూరు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. జిల్లా అదనపు ఎస్పీ కె.ఈశ్వరరావు, సీసీఎల్ డీఎస్పీ టీ.సత్యనారాయణ వివరాలను వెల్లడించగా వన్‌టౌన్ ఇన్ఛార్జ్ సీఐ జి.మధుబాబు సమావేశంలో ఉన్నారు. ఏలూరు వన్‌టౌన్ చిరంజీవి బస్టాండ్ దక్షిణపువీధి ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతోన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. సీసీఎస్ డీఎస్పీ సత్యనారాయణ, సీఐ మధుబాబు, వన్‌టౌన్ ఎస్ఐ కిషోర్‌బాబు, సిబ్బంది అతనిని అరెస్టు చేశారు. అతని వద్ద రూ.2 వేల ఫేక్ నోట్లు 50 స్వాధీనం చేసుకున్నారు. రూ.లక్ష విలువ చేసే ఫేక్ నోట్లు పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. జిరాక్స్ తీసి చలామణి మెదక్ జిల్లాకు చెందిన ఉప్పరి రాజు ప్రసాద్ అలియాస్ రాజు హైదరాబాద్ పటాన్చెరువు ప్రాంతంలోని శ్రీరామ్‌నగర్, దుర్గగుడి వద్ద నివాసం ఉంటున్నాడు. రాజు గత కొంతకాలంగా రూ.2 వేల నోట్లను జిరాక్స్ మెషిన్‌పై కలర్ జిరాక్స్ తీసి ఫేక్ రూ.2 వేల నోటును తీస్తున్నాడు. చిన్నచిన్న తేడాలు మినహా ఒరిజినల్ నోటు మాదిరిగానే కలర్ జిరాక్స్ తీస్తూ మార్కెట్లో చలామణి చేస్తున్నాడు. గతంలో హైదరాబాద్‌లోనూ కృష్ణా జిల్లా కైకలూరులోనూ రూ.2 వేల ఫేక్ నోట్లను మార్కెట్లోకి చలామణి చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ రెండు ప్రాంతాల్లోనూ రాజుపై కేసులు నమోదు చేశారు. జిల్లాలో అధికంగా ఆక్వా, చేపల రైతులు అధిక మొత్తంలో డబ్బులు చేతులు మారుతూ ఉండడం, ఫేక్ కరెన్సీ సులువుగా మార్చుకునే అవకాశం ఉండడంతో రాజు ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. కైకలూరులో చేపల రైతుల వద్ద ఫేక్ నోట్లు మార్పు చేసే క్రమంలో దొరికిపోవటంతో ఏలూరు కేంద్రంగా మరోసారి ఫేక్ నోట్లు చలామణి చేసేందుకు ప్రయత్నం చేశాడు. రూ.50 వేలు ఒరిజినల్ కరెన్సీ ఇస్తే రూ.2 లక్షల వరకూ ఫేక్ కరెన్సీ ఇచ్చేలా కొందరు వ్యక్తులతో మంతనాలు సైతం చేసినట్టు తెలుస్తోంది. కైకలూరు నుంచి ఏలూరుకు మకాం మార్చటంతో పోలీసులకు సమాచారం వచ్చింది. ఈ సమాచారంతో పోలీసులు రాజును అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి రూ.2 వేల ఫేక్ నోట్లు, జిరాక్స్ మిషన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అతనిపై 266/18 489 (సీ) (డీ) ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. రాజు ఇప్పటి వరకూ సుమారు రూ.3 లక్షల వరకూ ఫేక్‌నోట్లు మార్పిడి చేసి ఉంటాడని పోలీసులు చెబుతున్నారు. నకిలీ నోట్లతో మోసపోవద్దు ఈ ఫేక్ నోట్లు విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులు కోరుతున్నారు. రూ.500, రూ.2,000 నోట్లు విషయంలో జాగ్రత్తలు పాటించకుంటే నష్టపోయే ప్రమాదం ఉందని తెలిపారు. అధికంగా డబ్బు చలామణి అయ్యే బార్లు, మద్యం దుకాణాలు, హోటల్స్, మాల్స్, చేపల వ్యాపారాల వద్ద ఫేక్ నోట్లు చలామణి చేసేందుకు ఇలాంటి ముఠాలు ప్రయత్నాలు చేస్తుంటాయని తెలిపారు. రూ.2 వేల నోటు వైట్స్పాట్లో గాంధీ బొమ్మ ఉంటుందని, లోపల రూ.2,000 అని అడ్డంగా రాసి ఉంటుందని, ఈ రెండు లేకుంటే ఫేక్నోటుగా భావించాల్సి ఉంటుందని పోలీసు అధికారులు పేర్కొంటున్నారు. ఫేక్ నోట్లలో రెండు, మూడు నోట్లు ఒకే సీరీస్‌తో ఉంటున్నాయని, ఇలా ఒకే సీరిస్తో ఏవైనా నోట్లు ఉన్నట్లు గమనిస్తే దొంగనోట్లుగా గుర్తించాలని కోరారు. అధికమొత్తంలో డబ్బులు ఆశచూపించి మోసం చేసేందుకు ప్రయత్నిస్తారని, అటువంటి మోసాలకు, ప్రలోభాలకు లొంగిపోవద్దని సీసీఎస్ డీఎస్పీ సత్యనారాయణ ప్రజలకు సూచించారు. -
ఏటీఎంలో నకిలీ నోట్లు.!
ఎదులాపురం(ఆదిలాబాద్): జిల్లా కేంద్రంలోని ఓ బ్యాంకు ఏటీఎం కేంద్రం నుంచి వచ్చిన రూ.500ల నోట్లు నకిలీవిగా కలకలం రేగింది. దక్కన్ గ్రామీణ బ్యాంకు సమీపంలో ఉన్న ఓ బ్యాంకు ఏటీఎంలో ఆదివారం పట్టణానికి చెందిన శంకర్‌గౌడ్, గంగాధర్ అనే వ్యక్తులు డబ్బులు డ్రా చేశారు. ఆ సమయంలో ఎర్రా సిరాతో రాసిన.. ప్రింట్ కనిపించకుండా.. ఇతర రంగుతో కూడిన నోట్లు వచ్చాయి. దీంతో వారు ఆందోళనకు గురయ్యారు. బ్యాంకుల్లో సిరాతో రాయబడిన, ఇతర రంగుల్లో ఉన్న నోట్లను తీసుకోవడం లేదని, ఏటీఎం ద్వారా ఇలాంటి నోట్లు రావడం ఏంటని వాపోయారు. సంబంధిత బ్యాంకు అధికారులు స్పందించి ఇకనైనా ఇలాంటి నోట్లు రాకుండా చూడాలని వినియోగదారులు కోరారు. -
ఏటీఎం నుంచి చెల్లని నోట్లు
సాక్షి, విశాఖపట్నం, నాతవరం: ఇండియా వన్ ఏటీఎం ద్వారా రూ.500 నోట్లుపై రంగులు పడిన చెల్లని నోట్లు రావడంతో వినియోగదారులు అందో ళన చెందుతున్నారు. మర్రిపాలెం గ్రామానికి చెందిన సత్తిబాబు అనే వ్యక్తి సోమవారం నర్సీపట్నం ఆస్పత్రికి వెళ్తూ మార్గమధ్యంలో డి.యర్రవరం జంక్షన్లో గల ఇండియా వన్ ఏటీఎంకు వెళ్లి తన కార్డు ద్వారా రూ. మూడు వేలు నగదు తీశాడు. అయితే వచ్చిన ఆరు రూ.500 నోట్లుపై ఎర్రటి పసుపు రంగుతో కూడిన రంగులు ఉన్నాయి. నోట్లన్నిటిపైనా రంగులు పడి ఉండడంతో అవి ఎక్కడా చెల్లలేదు. దీంతో ఏం చేయాలో తెలియక లబో దిబో మన్నాడు. ఇదే విధంగా తూర్పుగోదా వరి జిల్లా కోటనందూరుకు చెందిన మరో వ్యక్తి కూడా ఇదే ఏటీఎంలో డబ్బులు తీశా రు. అయనకు కూడా రంగులు పడిన రూ. 500 నోట్లు రావడంతో అందోళన చెందారు. -
కృష్ణా జిల్లాలో దొంగనోట్ల కలకలం..!
సాక్షి, విజయవాడ: జిల్లాలోని నందిగామలో దొంగనోట్లు ముద్రిస్తున్నారనే వార్త కలకలం రేపింది. పాత బైపాస్ రోడ్డులో గల ఓ ఇంట్లో దొంగ నోట్లు ముద్రిస్తున్నారనే పక్కా సమాచారంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం ఉదయం దాడి చేశారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నోట్లు ముద్రించే సాధనంగా భావిస్తున్న ప్రింటర్ స్కానర్, మరికొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇంటికి తాళం వేసి సీజ్ చేశామని పోలీసులు వెల్లడించారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఎన్‌కేపాడులో.. విజయవాడ రూరల్ మండలంలోని ఎన్‌కేపాడులో దొంగనోట్లు ముద్రిస్తున్న షేక్ బాబు, షేక్ సుభాని, షేక్ జానీలను గురువారం ఉదయం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 75 వేల రూపాయలు విలువగల రూ. 100 నోట్లను, కంప్యూటర్, ప్రింటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
మన్యంలో దొంగనోట్లు
విశాఖ, చింతపల్లి(పాడేరు):మన్యంలో దొంగనోట్ల చలామణీ జోరుగా సాగుతోంది. వారపుసంతలు వేదికలుగా చేసుకుని వ్యాపారులు నోట్ల మార్పిడికి పాల్పడుతున్నారు. బుధవారం మండల కేంద్రంలో జరిగిన వారపుసంతలో తమ్మంగులకు చెందిన ఓ గిరిజన రైతు అటవీఉత్పత్తులను తీసుకువచ్చి విక్రయించాడు. గుర్తు తెలియని వ్యాపారి అధిక ధరకు ఉత్పత్తులను కొనుగోలు చేశాడు. అత్యాశకు పోయిన గిరిజనుడు రూ.2 వేల నోటు తీసుకుని ఉత్పత్తులను విక్రయించాడు. నిత్యావసర సరుకుల కోసం కిరాణ దుకాణానికి వెళ్లి రెండు వేల నోటు ఇవ్వగా సదరు వ్యాపారి నోటు నకిలీదని తెలిపాడు. రెండు వేల నోటు మిగతా నోట్లకు భిన్నంగా ఉండండతో గిరిజనుడు ఆ నోటును చించివేసి వెళ్లిపోయాడు. -
4 వేలకు ఆశ పడితే..
హైదరాబాద్ : నాలుగు వేల రూపాయల అదనపు కమిషన్‌కు ఆశపడిన ఓ ఏజెంట్ రూ.25 లక్షలకు మోసపోయిన ఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. 35 వేల అమెరికన్ డాలర్లను తీసుకుని తెల్ల కాగితాలు ఇచ్చి అతడిని బురిడీ కొట్టించాడో ఘరానా మోసగాడు. దీంతో బాధితుడు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్రావు తెలిపిన వివరాల ప్రకారం.. ఆరాంఘర్‌కు చెందిన ఆటోడ్రైవర్ మోహిన్ అమెరికా డాలర్లు కావాలంటూ వచ్చిన ఓ గుర్తుతెలియని వ్యక్తిని రెండ్రోజుల క్రితం పాతబస్తీకి చెందిన రఫీక్ అనే ఏజెంట్ వద్దకు తీసుకొచ్చాడు. ఈ సమయంలో గుర్తు తెలియని వ్యక్తి 2,700 అమెరికా డాలర్లను తీసుకుని నగదు చెల్లించాడు. మార్కెట్ రేటు కంటే అదనంగా కమీషన్ చెల్లించాడు. బుధవారం మరో 35 వేల డాలర్లు కావాలంటూ ఆ వ్యక్తి మోహిన్, రఫీక్‌ను సంప్రదించాడు. ఈ వ్యవహారం ఫోన్లో సాగింది. రఫీక్ వద్ద అంత మొత్తంలో అమెరికన్ డాలర్లు లేకపోవడంతో మరో ఏజెంట్ జాఫర్‌కు సమాచారం ఇచ్చాడు. జాఫర్ 35 వేల డాలర్లు సమకూరుస్తానని గురువారం మధ్యాహ్నం వరకు టైం తీసుకున్నాడు. గుర్తు తెలియని వ్యక్తి డబ్బు రెడీగా ఉందని డాలర్లు అత్యవసరంగా కావాలంటూ రఫీక్‌కు ఫోన్ చేశాడు. తాను గచ్చిబౌలిలోని కాఫీ డెల్ వద్ద కలుస్తానని సమాచారం ఇచ్చాడు. 4.30 గంటల ప్రాంతంలో రఫీక్, మోహిన్, జాఫర్లు 35 వేల డాలర్లను తీసుకుని హోటల్‌కు చేరుకున్నారు. అప్పటికే హోటల్లో ఉన్న గుర్తు తెలియని వ్యక్తి.. వారి నుంచి డాలర్లను తీసుకుని రూ.25 లక్షల నగదు ఉన్న బ్యాగును వీరికి అందించాడు. డబ్బు బండిళ్లలో పైన అసలైన నోట్లు పెట్టి లోపల తెల్లకాగితాలను అమర్చాడు. డబ్బు లెక్కిద్దామని ముగ్గురూ అడగ్గా.. గుర్తుతెలియని వ్యక్తి వారిని తుపాకీతో బెదిరించి కారులో వెళ్లిపోయాడు. ముగ్గురూ కారులో నార్సింగి వచ్చి డబ్బు సరి చూసుకోగా తెల్ల కాగితాలు కనిపించాయి. మోసపోయామని గుర్తించిన జాఫర్ నార్సింగి పోలీసులను ఆశ్రయించాడు. ప్రస్తుతం జాఫర్ ఒక్కడే పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. మోహిన్, రఫీక్ ఎక్కడికి వెళ్లారనే దానిపై పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో పోలీసులు జాఫర్‌ను విచారిస్తున్నారు. బాధితుడి కాల్ డేటా సేకరణ.. జాఫర్ నుంచి నార్సింగి పోలీసులు సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. జాఫర్ కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. పాతబస్తీ నుంచి ఎప్పుడు వెళ్లాడు, ఎవరెవ్వరితో మాట్లాడాడు అనే విషయాలను సెల్ సిగ్నల్స్ ద్వారా సేకరిస్తున్నారు. ఓఆర్ఆర్పై నుంచి వచ్చామని జాఫర్ తెలపడంతో గచ్చిబౌలి, పుప్పాలగూడ, కోకాపేట, హిమాయత్‌సాగర్ తదితర ప్రాంతాలలోని సీసీ ఫుటేజీలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. కాఫీ డెల్ హోటల్ సీసీ ఫుటేజీనీ పోలీసులు పరిశీలిస్తున్నారు. బాధితుడు తెలిపిన వివరాలతోపాటు సీసీ ఫుటేజీలో ఉన్న గుర్తుతెలియని వ్యక్తి పాత నిందితుడిగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతడు ఎక్కడున్నాడనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. -
నకిలీ కరెన్సీ నోట్ల హల్చల్
గుర్రంకొండ: మండల కేంద్రమైన గుర్రంకొండలో నకిలీ కరెన్సీ నోట్ల చెలామణి జోరుగా సాగుతోంది. రూ.100, రూ.50 నకిలీ కరెన్సీ నోట్లు ఎక్కువగా చలామణీ జరుగుతోంది. రూ.50 నోట్లలో సాధారణంగా ఉన్న సహజ రంగుల కంటే నకిలీ నోట్లు భిన్నంగా కనిపిస్తున్నాయి. నోటు దళసరి కూడా సాధారణ నోటు కంటే చాలా పలుచగా ఉంటోంది. జనం రద్దీ ఎక్కువగా ఉండే బస్టాండు, వారపు సంతల్లో నకిలీ నోట్లు చలామణీ ఎక్కువగా జరుగుతోంది. రూ. 100 నోట్లు కూడా నకిలీవి హాల్చల్ చేస్తున్నాయి. బస్టాండులోని చిల్లరు దుకాణంలో ప్రతి నిత్యం ఈ నోట్లు కనిపిస్తున్నాయి. అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని వ్యాపారస్తులు కోరుతున్నారు. -
కేరళ నటి నకిలీ నోట్ల రాకెట్ గుట్టు రట్టు
పెరబూరు (చెన్నై): కేరళ రాష్ట్రానికి చెందిన ప్రముఖ బుల్లితెర నటి సూర్య శశికుమార్ నకిలీ నోట్ల ముద్రణ వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. ఇరుక్కి సమీపంలోని అణక్కరై ప్రాంతంలో గత కొన్ని రోజుల క్రితం కేరళ పోలీసులు చేసిన శోధనల్లో రూ.2.5 లక్షల నకిలీ నోట్లతో లియో, కృష్ణకుమార్, రవీంద్రన్ అనే ముగ్గురు వ్యక్తులు పట్టుబడ్డారు. వారిని పోలీసులు అరెస్ట్ చేసి విచారించగా సూర్య శశికుమార్(36) ఇంట్లో నకిలీ నోట్లు ముద్రిస్తున్న విషయం బయటపడింది. పోలీసులు సూర్య శశికుమార్ ఇంటిలో సోదాలు నిర్వహించగా రూ.57 లక్షల నకిలీనోట్లు, వాటిని ముద్రిస్తున్న కంప్యూటర్, ప్రింటర్ లభించాయి. దీంతో సూర్య శశికుమార్‌ను, ఆమె తల్లి రమాదేవి, చెల్లెలు శృతిలను అరెస్ట్ చేసి విచారించారు. సూర్య శశికుమార్‌కు బీజూ అనే దొంగ స్వామీజీ ద్వారా దొంగనోట్ల ముఠాతో సంబంధాలు ఏర్పడినట్లు విచారణలో తెలిసింది. ఆమెకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఉన్నట్లు వెల్లడైంది. సూర్య శశికుమార్ దొంగనోట్లను కేరళ రాష్ట్రంలోనే కాకుండా తమిళనాడులోనూ విస్తరింపజేయడానికి ఏజెంట్లతో ఒప్పందం కుదుర్చుకుందని తేలటంతో కేరళ పోలీసులు తమిళనాడులోనూ దర్యాప్తు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. -
ఏటీఎం కేంద్రంలో చెల్లని నోట్లు
నర్సీపట్నం: ఏటీఏం కేంద్రాల్లో చెల్లని నోట్లు వస్తుండటంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదంతా బ్యాంకు సిబ్బందికి తెలిసే జరుగుతుందని ఖాతాదారులు ఆరోపిస్తుండగా, దీనికి ఏటీఎం కేంద్రాల్లో నగదు పెట్టే ఏజెన్సీ నిర్వాహకులే బాధ్యులని బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. సోమవారం పట్టణంలోని చింతపల్లి రోడ్డులో ఉన్న సెంట్రల్ బ్యాంకు ఏటీఎం కేంద్రంలో నగదు డ్రా చేసిన వారు ఈ సమస్యను ఎదుర్కొన్నారు.ఉదయం 11 గంటల నుంచి డ్రా చేసిన వారందరికీ కాలిపోయిన, ఇంకు మచ్చలతో చిరిగిన రూ.2 వేల నోట్లు వచ్చాయి. డ్రా చేసిన వారందరికీ ఈ సమస్య ఎదురైంది. పట్టణంలో శివపురానికి చెందిన నందకిషోర్ తన భార్య నాగేశ్వరి ఏటీఎం కార్డు నుంచి రూ.10 వేలు డ్రా చేశారు. వీటిలో ఐదు రెండు వేల నోట్లలో నాలుగు నోట్లు చిరిగిన, ఇంకు మచ్చల నోట్లు ఉన్నాయి. పెళ్లి ఖర్చుల నిమిత్తం డబ్బులు డ్రాచే సేందుకు నర్సీపట్నం మండలం మొండిఖండి నుంచి వచ్చిన రామలక్ష్మికి ఇదే సమస్య ఎదురైంది. రూ.20 వేలు డ్రాచేస్తే రెండు రెండు వేల నోట్లు చెల్లనివి ఉన్నాయి. వీరికన్నా ముందు రూ.40 వేలు డ్రా చేసిన ఖాతాదారునికి మొత్తం చెల్లని నోట్లు రావడంతో కంగుతిన్నాడు. వీరంతా ఆందోళనకు గురవడంతో ఏటీఏం కేంద్రం సెక్యూరిటీ సిబ్బంది సూచన మేరకు కిలోమీటరు దూరంలోని సెంట్రల్ బ్యాంక్ బ్రాంచికి వెళ్లారు. బ్యాంకు మేనేజర్ నుంచి సరైన సమాధానం లేకపోవడంతో ఆగ్రహించారు. ఒక దశలో బ్యాంకుకు సంబంధం లేదని చెప్పిన మేనేజర్ మోహన్‌రాజ్ బాధితుల సంఖ్య పెరగడంతో మెట్టు దిగారు. ఏటీఏం కేంద్రంలో నగదు పరిశీలించారు. డ్రా చేసిన రశీదు ఆధారంగా నగదు చెల్లించారు. ఎందుకిలా... ఏటీఎం కేంద్రాల్లో చెల్లని నోట్లు రావడం వెనుక పెద్ద రాకెట్ ఉందని ప్రచారం జరుగుతోంది. సాధారణంగా ఏటీఎం కేంద్రాల్లో సంబంధిత బ్యాంకు అధికారులు లేదా ఏజెన్సీ నిర్వాహకులు నగదు ఏర్పాటు చేస్తారు. బ్యాంకు అధికారుల విషయానికొస్తే రిజర్వ్‌బ్యాంకు సూచనలకు అనుగుణంగా ఉన్న నోట్లను మాత్రమే కౌంటర్లలో ఖాతాదారులనుంచి తీసుకుంటారు. అందువల్ల ఏటీఎం కేంద్రాల్లో చెల్లని నోట్లు రావడం వెనుక కరెన్సీ ఏజెన్సీ ప్రమేయం ఉందన్న విమర్శలున్నాయి. నర్సీపట్నంలోని సెంట్రల్ బ్యాంకు ఏటీఏం కేంద్రంలో డైవోల్డ్ ప్రైవేట్ ఏజెన్సీ నగదు ఏర్పాటు చేసింది. చెల్లని నోట్లు రావడంతో బ్యాంకు మేనేజర్ ఏజెన్సీ ప్రతినిధిని రప్పించి ప్రశ్నించారు. తాము ఐసీఐసీఐ బ్యాంకు నుంచి తెచ్చిన నగదును ఏటీఎం కేంద్రంలో ఏర్పాటు చేశామని చెప్పారు. అయితే ఇందులో ఏమాత్రం నిజం ఉందనే దానిపై బ్యాంకు ఉన్నతాధికారులు పోలీసులతో విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఖాతాదారులు డిమాండ్ చేస్తున్నారు.