రాష్ట్రమంతా నకిలీ 500 రూపాయల నోట్లు (Fake 500 rupee notes) చెలామణి అవుతున్నాయని, అప్రమత్తంగా ఉండాలని బిహార్ (Bihar) పోలీస్ హెడ్ క్వార్టర్స్ అన్ని జిల్లాలను అప్రమత్తం చేసింది. ఈ మేరకు ఆ రాష్ట్ర పోలీస్ హెడ్‌క్వార్టర్స్ ఐజీ (స్పెషల్ బ్రాంచ్) డీఎంలు, ఎస్‌ఎస్‌పీలు, ఎస్పీలు, రైల్వే ఎస్పీలందరికీ లేఖ రాశారు.
నకిలీ నోటుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెల్లింగ్‌లో తప్పు ఉందని, స్మగ్లర్లు విడుదల చేసిన 500 రూపాయల నోటుపై ఇంగ్లిష్‌లో ‘Reserve Bank of India’ అని కాకుండా ‘Resarve Bank of India’ అని రాసి ఉంటుందని ఐజీ లేఖలో వివరించారు.
ఈ నేపథ్యంలో నకిలీ నోట్లను గుర్తించడంతోపాటు ప్రత్యేక పాలనాపరమైన నిఘాను నిర్వహించేందుకు ప్రత్యేక ప్రచారాన్ని నిర్వహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. లేఖతో పాటు నకిలీ 500 రూపాయల నోటు చిత్రాన్ని కూడా జత చేశారు.
నకిలీ నోటును ఎలా గుర్తించాలి?
అసలైన నోట్లు విలక్షణమైన ఆకృతిని, స్పర్శను కలిగి ఉంటాయి. నకిలీ నోట్లు అలా ఉండవు.
అసలైన నోట్లు మంచి రంగు, ప్రింటింగ్ నాణ్యతను కలిగి ఉంటాయి. కానీ నకిలీ నోట్లుపై రంగుల్లో తేడాను, అస్పష్టమైన ముద్రణను గమనించవచ్చు.
అసలైన నోట్లలో సెక్యూరిటీ థ్రెడ్ ఉంటుంది. ఇది నోటు చిరిగిపోయినప్పుడు కనిపిస్తుంది. నకిలీ నోట్లలో ఈ థ్రెడ్ ఉండదు.
అసలు నోట్లు వాటర్‌మార్క్‌ని కలిగి ఉంటాయి. నోట్‌ను నీటిలో ముంచినప్పుడు అది కనిపిస్తుంది. నకిలీ నోట్లలో ఈ వాటర్‌మార్క్ ఉండదు.
బ్యాంకులు, ఇతర వ్యాపారాల వద్ద నకిలీ నోట్లను గుర్తించగల నోట్-చెకింగ్ పరికరాలు ఉంటాయి.
అసలైన నోట్లు యూవీ-కాంతి ఉద్గార మూలకాలను కలిగి ఉంటాయి. నకిలీ నోట్లలో అవి ఉండవు.
ఇక నకిలీ నోట్లను గుర్తించే అనేక మొబైల్ యాప్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.
మీకు వద్ద ఉన్నది నకిలీ నోటని అనుమానం వస్తే బ్యాంక్‌కు వెళ్లి తనిఖీ చేయించుకోవచ్చు.
అసలు నోటు లక్షణాలు
- అసలు 500 రూపాయల నోటు మధ్యలో మహాత్మా గాంధీ ఫోటో ముద్రించి ఉంటుంది. దేవనాగరిలో 500 అని రాసి ఉంటుంది.
- అసలు 500 రూపాయల నోటులో కలర్ సెక్యూరిటీ థ్రెడ్ ఉంటుంది. నోటును వాలుగా చూస్తే ఆకుపచ్చ నుండి నీలం రంగులోకి మారినట్లు కనిపిస్తుంది.
- అసలు 500 రూపాయల నోటుపై ఎలక్ట్రోటైప్ వాటర్‌మార్క్ ఉంటుంది. ఈ నోటుకు కుడి వైపున అశోక స్తంభం గుర్తును కూడా చూడొచ్చు.
- ఈ నోట్‌లో మహాత్మా గాంధీ, అశోక చిహ్నం చిత్రాలను చేత్తో తాకితే తగిలేలా ముద్రించి ఉంటారు. దృష్టి లోపం ఉన్నవారి కోసం ఈ ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment