గురజాల: తాను చికిత్స పొందుతున్న ఆస్పత్రి బెడ్‌పై దిండు, కర్రల సంచి ఉంచి పైన దుప్పటి కప్పి.. పోలీసుల కళ్లుగప్పి సినీపక్కీలో ఓ దొంగ పరారయిన ఘటన గురజాల సామాజిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పల్నాడు జిల్లా చర్లగుడిపాడు గ్రామానికి చెందిన ఉద్దగిరి అలేఖ ఇంట్లో దొంగనోట్లు తయారు చేస్తున్నాడనే సమాచారం రావడంతో నవంబర్ 17వ తేదీ 2022న పోలీసులు సోదా చేస్తుండగా.. అతను గోడ దూకి పరారయ్యాడు.
ఈ నేపథ్యంలో అలేఖ రెండు కాళ్లు దెబ్బతిన్నట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో పోలీసులు ఈ ఏడాది జనవరి 3న అలేఖతో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరిచారు. కోర్టు అలేఖకు రిమాండ్ విధించగా సబ్ జైల్ అధికారులు అలేఖ రెండు కాళ్లకు చికిత్స నిమిత్తం గుంటూరు వైద్యశాలకు తరలించారు.
ఆపరేషన్ చేసిన అనంతరం గురజాల వైద్యశాలకు తరలించారు. అప్పటి నుంచి గురజాల సామాజిక ఆరోగ్య కేంద్రంలో అలేఖకు కాపలాగా ఏఆర్ కానిస్టేబుళ్లు పహారా కాస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 8 గంటలకు ఏఆర్ సిబ్బంది మంచం వద్దకు వెళ్లి చూడగా దిండు, కర్రల సంచి ఉంచి పైన దుప్పటి కప్పి అలేఖ పరారైనట్లు గుర్తించారు.
వీల్ చైర్‌తో సహా పరారీ..?
నిందితుడు ఉద్దగిరి అలేఖ వైద్యశాలలో ఉన్న వీల్ చైర్‌తో సహా పరారైనట్లు పోలీసులు తెలుపుతున్నారు. అలేఖ రెండు కాళ్లు దెబ్బతినడంతో నడవడం కష్టంగా ఉంటుందని వైద్యశాలలో ఒక వీల్ చైర్ కూడా కనిపించడం లేదని తెలిపారు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు పట్టణంలోని పలు కూడళ్లలో ఉన్న సీసీ పుటేజీని పరిశీలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment