
మాట్లాడుతున్న ఏఎస్పీ దీపికా పాటిల్
రామభద్రపురం: సాలూరు పరిధిలో దొంగనోట్లు చలామనీ అవుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పార్వతీపురం డివిజన్ ఏఎస్పీ దీపికాపాటిల్ సూచించారు. స్థానిక పోలీసుస్టేషన్‌లో గురువారం ఆమె మాట్లాడారు. ఇటీవల సాలూరు ప్రాంతంలో దొంగనోట్లు చలామనీ చేసిన ముఠాను పట్టుకొన్నామని, వారి నుంచి కొంత మొత్తాన్ని రికవరీ చేశామన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. దొంగనోట్లలో వాటర్ మార్క్ కనిపించదని, అటువంటి నోట్లు ప్రజలు గమనించి తీసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ సమస్య ఉన్న అన్ని ప్రాంతాల్లో నియంత్రణ చర్యలు చేపడుతున్నామని చెప్పారు. రామభద్రపురం, సాలూరు, పి.కోనవలస వద్ద ఘాట్ రోడ్డు, పార్వతీపురం, తోటపల్లి ప్రాజెక్టు, కొత్తవలస రైల్వేగేట్ తదితర ప్రాంతాల వద్ద ట్రాఫిక్ సమస్య అధికంగా ఉందని ఈ సమస్యను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. రామభద్రపురంలో రహదారి విస్తరణపై ఎస్పీకి లేఖ రావామని, రోడ్లు భద్రతా కమిటీకి కలెక్టర్ చైర్మన్‌గా ఉన్నందున నిధులు సమకూర్చుతామని తెలిపినట్టు పేర్కొన్నారు. ఆమె వెంట ఎస్‌ఐ డీడీ నాయుడు ఉన్నారు.