ఆసరా పథకంలో పంపిణీ చేసిన నోట్లు నకిలీవని ప్రచారం జరగడంతో తారామతిపేటలో కలకలం రేగింది.
హయత్‌నగర్: ఆసరా పథకంలో పంపిణీ చేసిన నోట్లు నకిలీవని ప్రచారం జరగడంతో తారామతిపేటలో కలకలం రేగింది. వివరాలు.. హయత్‌నగర్ మండలం తారామతిపేటలో ఈ నెల 12నుంచి ఆసరా పథకంలో భాగంగా పింఛన్ డబ్బులు పం పిణీ చేశారు. గ్రామ కార్యదర్శి నర్సింగ్‌రావు హయత్‌నగర్‌లోని ఎస్‌బీహెచ్ నుంచి రూ.10 లక్షలు డ్రా చేసి బండరావిరాల, చిన్నరావిరాల గ్రామాల్లో పంచేందుకు కొంత డబ్బును బిల్ కలెక్టర్‌కు అప్పగించారు.
కొంత డబ్బును తారామతిపేటలో పంపిణీ చేశారు. సుమారు రూ.5 లక్షల మేర పంపకాలు పూర్తయ్యాయి. డబ్బులను కొంతమంది లబ్ధిదారులు ఖర్చు చేసేందుకు దుకాణాదారుల వద్దకు వెళ్లగా అవి చెల్లవంటూ తీసుకోలేదు. దీంతో తమకు ఇచ్చినవి నకిలీ నోట్లు అని గ్రామస్తులు వాపోయారు. ఇది కాస్తా గ్రామంలో ప్రచారం జరగడంతో ఆదివారం పింఛన్లు తీసుకునేందుకు వచ్చిన వారు కూడా తమకు వద్దు అంటూ తిరిగి వెళ్లిపోయారు.
అవి నకిలీ నోట్లు కావు: కార్యదర్శి
ఆసరా పథకంలో భాగంగా గ్రామంలో పంపిణీ చేసిన నగదు నకిలీనోట్లు కావని, 2004 కంటే ముందు ముద్రించిన నోట్లు కావడంతో వాటిని ఎలక్ట్రానిక్ మిషన్ గుర్తించడం లేదని గ్రామ కార్యదర్శి నర్సింగ్‌రావు తెలిపారు. నోట్లను బ్యాంకు నుంచి ఎలా తీసుకొచ్చామో అలాగే పంచామని, చెల్లుబాటు కాని నోట్లను తిరిగి ఇచ్చేస్తే బ్యాంక్‌లో మార్పించి ఇస్తామని ఆయన వెల్లడించారు.