narsing Rao
-
చికిత్స పొందుతూ కన్నుమూసిన నర్సింగ్‌రావు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ సీనియర్ నేత, అంబర్పేట్ శంకర్ సోదరుడు సి.నర్సింగ్‌రావు (67) సికింద్రాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న నర్సింగ్రావును కుటుంబ సభ్యులు గత నెల 27న ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆ మరుసటి రోజే ఆయనకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ నెల 8న ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న నర్సింగ్‌రావు చనిపోయాడని ఆస్పత్రి వర్గాలు చెప్పడంతో పెద్ద దూమారం చెలరేగిన సంగతి విదితమే. ఈ ఘటనపై నర్సింగ్‌రావు కుటుంబ సభ్యులతోపాటు వివిధ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే, హైబీపీ, మధుమేహం, లంగ్స్ ఇన్ఫెక్షన్, కిడ్నీ ఫెయిల్యూర్, న్యుమోనియా తదితర రుగ్మతలతో బాధపడుతున్న నర్సింగ్‌రావు ఆరోగ్యపరిస్థితి విషమించి సోమవారం కన్నుమూశారు. -
బతికుండగానే.. చావుకబురు చల్లగా చెప్పారు!
సాక్షి, హైదరాబాద్: వైద్యుడు దేవుడితో సమానమంటూ... వైద్యో నారాయణో హరి అంటారు కదా! కానీ, ఓ కార్పొరేట్ ఆస్పత్రి వైద్యులు బతికుండగానే ఓ కరోనా బాధితుడిని ‘హరీ’మనించారు. కరోనా కాలంలో ఓ కార్పొరేట్ ఆస్పత్రి లీల ఇది.. కరోనా బాధితుడు బతికుండగానే చావుకబురు చల్లగా చెప్పారు. కుటుంబసభ్యులను కంగారు పెట్టించారు. బ్యాలెన్స్ బిల్లు చెల్లించి శవాన్ని తీసుకెళ్లాలని సమాచారమిచ్చారు. చివరిచూపు కోసం ఆస్పత్రికి చేరుకున్న భార్యాపిల్లలకు, ఇతర బంధువులకు ఐసీయూలో ఉన్న పేషెంట్లో కదలికలు కన్పించాయి. ఇదేమిటని నిలదీయడంతో ఆస్పత్రి వైద్యులు నీళ్లు నమిలారు. తాము అలా చెప్పలేదని ఆస్పత్రి యాజమాన్యం బుకాయిస్తుండటం గమనార్హం. ఈ సంఘటన గురువారం సికింద్రాబాద్‌లో వెలుగుచూసింది. అసలేమైందంటే...: అంబర్‌పేటకు చెందిన బీజేపీ సీనియర్‌నేత సి.నర్సింగరావు(67) శ్వాస సంబం ధిత సమస్యతో బాధపడుతూ చికిత్స కోసం జూన్ 27న సికింద్రాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరారు. వైద్య పరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. నాల్రోజులపాటు ఐసీయూలో ఉంచారు. ఆరోగ్యం మెరుగుపడటంతో ఐసోలేషన్ వార్డుకు మార్చారు. ఆ తర్వాత శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది పడుతుండటంతో ఆయన్ను మళ్లీ ఐసీయూకు తరలించి వెంటిలేటర్ అమర్చారు. బుధవారంరాత్రి నర్సింగరావు ఇకలేరు.. తీసుకెళ్లాల్సిం దిగా ఆస్పత్రి నుంచి కుటుంబ సభ్యులకు ఫోన్ వచ్చింది. కోవిడ్ మృతదేహాన్ని ఇంటికెలా ఇస్తారని కుటుంబ సభ్యులు ప్రశ్నించగా, సారీ... ప్యాక్ చేసి జీహెచ్ఎంసీకి అప్పగిస్తామన్నారు. చివరిచూపు కోసం వెళ్లగా... ఒకవైపు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తూనే చివరిచూపు కోసం గురువారం ఉదయం ఆస్పత్రికి వచ్చిన కుటుంబ సభ్యుల సంతకాలను కూడా తీసుకు న్నారు. మృతదేహం తరలింపు కోసం అంబులెన్స్ సహా జీహెచ్ఎంసీ సిబ్బంది వస్తున్నట్లు చెప్పారు. అయితే నర్సింగరావు చనిపోలేదని, ఆరోగ్యం మెరుగవుతోందని, ఇదే ఆస్పత్రిలోని ఓ వైద్యుడి ద్వారా కుటుంబసభ్యులకు సమాచారమందింది. దీంతో ఐసీయూలోని వెంటిలేటర్‌పై ఉన్న నర్సింగరావును వీడియో కాల్ ద్వారా కుటుంబసభ్యులు పలకరించారు. ఆయన శరీరంలో కదలికలు గమనించారు. ఆయన తలఊపుతూ తాను బాగానే ఉన్నట్లు సంకేతాలిచ్చారు. దీంతో బతికున్న మనిషి చనిపోయాడని సమాచారమెలా ఇస్తారని ఆస్పత్రి అధికారులను కుటుంబసభ్యులు నిలదీశారు. తప్పుడు సమాచారం ఇచ్చిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆయన సోదరుడు అంబర్పేట్ శంకర్ డిమాండ్ చేశారు. కాగా బీజేపీ సీనియర్ నేత నర్సింగరావు మృతి చెందారనే తొలి వార్త తెలిసి హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి సంతాపం తెలపడం గమనార్హం. ఇంత మోసమా: సోనియా, బాధితుడి కోడలు ప్రభుత్వవైద్యంపై నమ్మకంలేక మా మామయ్యను ఈ ఆస్పత్రికి తీసుకొచ్చాం. మామయ్య మా కుటుంబానికి పెద్దదిక్కు. ఆయన బతికుండగానే చనిపోయాడని చెప్పారు. అందరం చాలా బాధపడ్డాం. మా అత్తమ్మ స్పృహతప్పి పడిపోయింది. రూ.4 వేలు ఖరీదు చేసే ఇంజక్షన్‌కు రూ.40 వేలు చార్జీ చేశారు. రూ.8 లక్షలకుపైగా బిల్లు వేశారు. ఇప్పటికే రూ.6 లక్షలకుపైగా చెల్లించాం. ఇదో గొప్ప ఆస్పత్రి అంటారు. ఇంత చెత్త ఆస్పత్రిని ఎక్కడా చూడలేదు. ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలి. చనిపోయాడని మేం చెప్పలేదు: ఆస్పత్రి వర్గాలు నర్సింగరావు చనిపోయాడని తాము ఎలాంటి సమాచారాన్ని ఆయన కుటుంబ సభ్యులకు ఇవ్వలేదు. ఆస్పత్రి నుంచి ఎవరు ఫోన్ చేసి చెప్పారో తెలపాల్సిందిగా కోరితే వారి వద్ద సమాధానం లేదు. ఎవరైనా చనిపోతే ముందు ఈసీజీ తీసి డెత్ డిక్లరేషన్ ఇస్తాం. ఈ ఘటనలో అలా జరగలేదు. ఆస్పత్రి ప్రతిష్ట దెబ్బతీసేలా వారు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. -
ఆయన... ఈయన... మధ్యలో పొరపొచ్చాలు
కొనసా...గుతున్న తాత్కాలిక ఈవో పాత ఈవో, కొత్త ఈవో మధ్య పొరపొచ్చాలు నేడు కృష్ణా పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష విజయవాడ : రాజధాని ప్రాంతంలో అతి పెద్ద దేవాలయం దుర్గగుడి ప్రస్తుతం తాత్కాలిక ఎగ్జిక్యూటివ్ అధికారి పాలనలో ఉంది. శ్రీ దుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం ఈవో సీహెచ్ నర్సింగరావు మార్చి రెండో వారంలో పక్షం రోజులు సెలవు పెట్టి వెళ్లారు. ఆ పక్షం రోజులకు తాత్కాలిక ఈవోగా చంద్రశేఖర్ ఆజాద్‌ను నియమించారు. నర్సింగరావు తిరిగి విధుల్లోకి చేరినా ఆయన్ను ఈవోగా నియమించలేదు. కనీసం చంద్రశేఖర్ ఆజాద్‌ను పర్మినెంట్ ఈవోగా ప్రకటించలేదు. ఈ ఇద్దరు కాకుండా మరొకరిని నియమించాలని ప్రభుత్వం భావించినా ఆ నిర్ణయం వేగవంతంగా తీసుకోవడం లేదు. దుర్గగుడి ఈవో నియామకంలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. త్వరలో మూడు ప్రధాన ఉత్సవాలు ఆగస్టులో కృష్ణానది పుష్కరాలు, ఆ తరువాత అక్టోబర్‌లో దసరా ఉత్సవాలు, డిసెంబర్లో భవానీ దీక్షలు జరుగనున్నాయి. ఉత్సవాలకు కొద్ది రోజులు ముందుగా పర్మినెంట్ ఈవోను నియమిస్తే ఆయనకు దేవస్థానంపై అవగాహన ఏర్పడి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం సులభమవుతుంది. గురువారం కృష్ణా పుష్కరాలపై చర్చించేందుకు దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్, ఈవో, ఇతర ఉన్నతాధికారులు సమావేశం అవుతున్నారు. ఈ సమావేశంలో పర్మినెంట్ ఈవో నియామకంపై నిర్ణయం తీసుకుంటే మేలని పలువురు సూచిస్తున్నారు. అభివృద్ధి పనుల్లో ఇన్చార్జీదే నిర్ణయం కృష్ణా పుష్కరాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఇన్చార్జి ఈవో చంద్రశేఖర్ ఆజాద్ నిర్ణయాలు తీసుకుంటున్నా రు. ఇందులో కొన్ని వివాదాస్పదమవుతున్నాయి. ము ఖ్యంగా దేవస్థానం ఎదురుగా ఓ భక్తుడు లక్షలు వెచ్చిం చి నిర్మించిన షెడ్‌ను ఆ భక్తుడి చేతే తొలగించాలని తీసుకున్న నిర్ణయంపై భక్తుల నుంచి విమర్శలు వచ్చాయి. అలాగే అమ్మవారి కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలను భద్రపరిచే స్ట్రాంగ్‌రూం కొండ దిగువకు మార్చాలనే తాత్కాలిక ఈవో ఆజాద్ నిర్ణయాన్ని గత ఈవో సీహెచ్ నర్సింగరావు తిరస్కరించారు. అమ్మవారి విలువైన ఆభరణాలు భద్రత లేని చోట పెట్టేందుకు తాను సుముఖంగా లేనని తిరస్కరించారు. మల్లికార్జున మహామండంలో పనులు పూర్తి కాలేదు. నాణ్యత సరిగా లేదని గత ఈవో బిల్లులు నిలిపివేశారు. అన్నదాన భవ నం, ప్రసాదాల తయారీ భవనాలను తరలించాలనే నిర్ణయాలపై భక్తుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. పర్మినెంట్ ఈవో ఉంటే బాగుంటుందనే భావన అందరిలోనూ నెలకొంది. దీనిపై అధికార పార్టీ ప్రజాప్రతినిధులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. -
ఈవోకు ఎసరు!
నర్సింగరావును సాగనంపేందుకు ఓ ఎమ్మెల్యే యత్నం చెప్పిన పనులు చేయలేదన్న ఆగ్రహంతోనే.. బదిలీ చేయవద్దంటున్న కీలక మంత్రి ఇంద్రకీలాద్రిపై వాడీవేడిగా చర్చ విజయవాడ : అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆడింది ఆటగా.. పాడింది పాటగా మారింది. వారి గొంతెమ్మ కోర్కెలు తీర్చలేక అధికారులు నానా హైరానా పడుతున్నారు. ఎవరైనా తీర్చలేకపోతే వారిపై వేధింపుల పర్వం మొదలుపెట్టడంతోపాటు బదిలీ చేయించేందుకు కూడా వెనుకాడడం లేదు. తాజాగా శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈవో) సీహెచ్.నర్సింగరావు ఇదే తరహాలో ఒక ఎమ్మెల్యే బారిన పడ్డారు. ఆ డిమాండ్లను పరిష్కరించడం ఈవో స్థాయిలో లేకపోవడంతో తక్షణం ఆయన్ను ఇక్కడ నుంచి బదిలీ చేయించేందుకు ఆ ఎమ్మెల్యే తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. దీనికి జిల్లాకు చెందిన ఒక కీలక మంత్రి అడ్డుపడడంతో ఈవో బదిలీపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే కోర్కెల చిట్టా ఎన్నికల్లో కోట్లు కుమ్మరించి పదవిని దక్కించుకున్న ఎమ్మెల్యే ప్రస్తుతం సొమ్ము రాబట్టుకునేందుకు దుర్గగుడిపై కన్నేశారు. ఇంద్రకీలాద్రి దిగువన, దుర్గాఘాట్, మల్లికార్జున మహామండపం వద్ద మొత్తం పదికి పైగా దుకాణాలు పెట్టుకునేందుకు అనుమతించాలని కోరారు. ఇవికాకుండా దేవస్థానంలో రెండు ఉద్యోగాలు కావాలంటూ ఈవోను డిమాండ్ చేసినట్లుగా కొండపై జోరుగా ప్రచారం జరుగుతోంది. తొలి విడతగా వీటిని తీర్చితే.. మరో చిట్టా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ ఎమ్మెల్యే కోర్కెలు ఆమోదిస్తే తాము కూడా ఇదే తరహాలో డిమాండ్ చేసేందుకు ఇంద్రకీలాద్రి సమీపంలోనే ఉండే మరో ముఖ్య నేత కూడా సమాయత్తమవుతున్నట్లు సమాచారం. దేవస్థానం ప్రతిష్ట రోడ్డున పడుతుందని భావిం చిన ఈవో ఎమ్మెల్యే ప్రతిపాదనలు పక్కనపెట్టడంతో ఆయన ఆగ్రహానికి గురయ్యారు. కాంట్రాక్టర్లు రంగప్రవేశం దుర్గగుడిలో కాంట్రాక్టర్లు ఎమ్మెల్యేకు అండగా నిలబడ్డారు. ఈవో తరువాత స్థానంలో ఉండే మరో అధికారి కూడా పూర్తి సహకారం అందించారు. వీరికి ఒకరిద్దరు అర్చకులు తోడుకావడంతో ఈవోను బదిలీ చేయించేం దుకు ఏకంగా లక్షల్లో ఫండ్ తయారుచేయిం చినట్లు ఆలయవర్గాలు చెబుతున్నాయి. ఈ ఫండ్‌ను హైదరాబాద్‌లోని కొంతమంది ముఖ్య అధికారులు, ప్రభుత్వ పెద్దలకు ముట్టజెప్పి ఈవోను తక్షణం బదిలీ చేయిం చేందుకు వేగంగా పావులు కదువుతున్నారు. ప్రస్తుత ఈవో స్థానంలో రాజమండ్రికి చెందిన స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారిని తీసుకొచ్చేందుకు ఒప్పందం కూడా చేసుకున్నారు. అడ్డుపడుతున్న కీలక మంత్రి తరచూ ఈవోను మార్చితే అభివృద్ధి పనులకు ఆటంకం కలగడంతోపాటు దేవస్థానం ప్రతిష్ట దెబ్బతింటుందని భావించిన జిల్లాకు చెందిన కీలక మంత్రి ఈవోను బదిలీ చేయాల్సిన అవసరం లేదని చెబుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొత్త ఈవో వచ్చి దేవస్థానంపై అవగాహన పెంచుకునేలోగానే తిరిగి ఆయన్ను బదిలీ చేయించేందుకు కొన్ని శక్తులు సిద్ధమవుతున్నాయని సమాచారం. కాగా సదరు మంత్రిని కూడా ప్రసన్నం చేసుకునేందుకు ఈవో వ్యతిరేక వర్గం ప్రయత్నిస్తోంది. -
చంద్రబాబు సర్కార్ దొంగ జీవో జారీ చేసింది
విశాఖపట్నం : విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలపై చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ... ఆంధ్రయూనివర్శిటీలో గిరిజన విద్యార్థులు చేపట్టిన రిలే దీక్షలు గురువారం నాలుగో రోజుకు చేరుకుంది. రిలే దీక్షలు చేపట్టిన విద్యార్థులను పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర్రావు ఈ రోజు పరామర్శించారు. అలాగే బాక్సైట్ తవ్వకాల జీవోపై అరకు సీపీఎం కార్యాలయంలో ఈరోజు రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీహెచ్ నర్సింగరావు హాజరయ్యారు. చంద్రబాబు ప్రభుత్వం దొంగ జీవో జారీ చేసిందని ఆయన ఆరోపించారు. 1/ 170 అటవీ హక్కుల చట్టంలో ఎక్కడా బాక్సైట్ తవ్వకాలను జరుపుకోవచ్చని పేర్కొనలేదని నర్సింగరావు స్పష్టం చేశారు. -
నిద్రిస్తున్న వారిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు
హైదరాబాద్: సికింద్రాబాద్‌లో బుధవారం అర్థరాత్రి దారుణం చోటు చేసుకుంది. పాత గాంధీ ఆసుపత్రి సమీపంలో ఆటోలో నిద్రిస్తున్న నర్సింగరావు అనే వ్యక్తిపై దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. అలాగే బాటా షోరూం వద్ద ఫుట్ పాత్‌పై నిద్రిస్తున్న ఆనంద్ అనే ఆటో డ్రైవర్‌పై పెట్రోల్ పోసి నిప్పటించారు. రెండు ఘటనల్లో తీవ్రంగా గాయపడని ఇద్దరు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇరువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మహంకాళీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘ఆసరా’లో నకిలీ నోట్ల కలకలం!
హయత్‌నగర్: ఆసరా పథకంలో పంపిణీ చేసిన నోట్లు నకిలీవని ప్రచారం జరగడంతో తారామతిపేటలో కలకలం రేగింది. వివరాలు.. హయత్‌నగర్ మండలం తారామతిపేటలో ఈ నెల 12నుంచి ఆసరా పథకంలో భాగంగా పింఛన్ డబ్బులు పం పిణీ చేశారు. గ్రామ కార్యదర్శి నర్సింగ్‌రావు హయత్‌నగర్‌లోని ఎస్బీహెచ్ నుంచి రూ.10 లక్షలు డ్రా చేసి బండరావిరాల, చిన్నరావిరాల గ్రామాల్లో పంచేందుకు కొంత డబ్బును బిల్ కలెక్టర్‌కు అప్పగించారు. కొంత డబ్బును తారామతిపేటలో పంపిణీ చేశారు. సుమారు రూ.5 లక్షల మేర పంపకాలు పూర్తయ్యాయి. డబ్బులను కొంతమంది లబ్ధిదారులు ఖర్చు చేసేందుకు దుకాణాదారుల వద్దకు వెళ్లగా అవి చెల్లవంటూ తీసుకోలేదు. దీంతో తమకు ఇచ్చినవి నకిలీ నోట్లు అని గ్రామస్తులు వాపోయారు. ఇది కాస్తా గ్రామంలో ప్రచారం జరగడంతో ఆదివారం పింఛన్లు తీసుకునేందుకు వచ్చిన వారు కూడా తమకు వద్దు అంటూ తిరిగి వెళ్లిపోయారు. అవి నకిలీ నోట్లు కావు: కార్యదర్శి ఆసరా పథకంలో భాగంగా గ్రామంలో పంపిణీ చేసిన నగదు నకిలీనోట్లు కావని, 2004 కంటే ముందు ముద్రించిన నోట్లు కావడంతో వాటిని ఎలక్ట్రానిక్ మిషన్ గుర్తించడం లేదని గ్రామ కార్యదర్శి నర్సింగ్‌రావు తెలిపారు. నోట్లను బ్యాంకు నుంచి ఎలా తీసుకొచ్చామో అలాగే పంచామని, చెల్లుబాటు కాని నోట్లను తిరిగి ఇచ్చేస్తే బ్యాంక్‌లో మార్పించి ఇస్తామని ఆయన వెల్లడించారు. -
క్షణికావేశమే ఊపిరి తీసిందా...?
విద్యార్థి హర్షవర్థన్ మృతి నేపథ్యం... సాక్షి,సిటీబ్యూరో: ఆ క్షణం వరకు వాళ్లు శత్రువులు కాదు... ఆ ఇద్దరి మధ్య పగ, ప్రతీకారాలు లేవు. హతమార్చేందుకు కుట్రలు పన్నినదాఖలాల్లేవు. కానీ క్షణికావేశమే నిండు ప్రాణాన్ని బలితీసింది. అమాయకుడైన హర్షవర్ధన్‌ను పొట్టనబెట్టుకుంది. ఒక్క ప్రగతి మహావిద్యాలయలో విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణే కాదు. చాలా సందర్భాల్లో ఇలాంటి అసహనం, క్షణికోద్రేకమే ఒకరినొకరు కొట్టుకోవడం, హత్యలకు పాల్పడటం వంటి ఘటనలకు దారితీస్తోంది. ఘర్షణకు దిగిన వారిలో ఏ ఒక్కరైనా కొద్దిగా సహనం పాటించినా ఇలాంటి దారుణానికి అవకాశం ఉండదు. సోమవారం హర్షవర్ధన్ మృతికి సంతాపంగా విద్యార్థులు శాంతి ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు స్పందించారు. జరిగిన ఘోరాన్ని తలచుకొని బాధపడ్డారు. ఈ ర్యాలీ సందర్భంగా కళాశాలకు వచ్చిన హర్షవర్ధన్ తల్లిదండ్రులు నర్సింగ్‌రావు, జయశ్రీలు కన్నీరు మున్నీరుగా విలపించారు. వారు సైతం అదే సందేహాన్ని వ్యక్తం చేశారు. ఎవ్వరితోనూ ఎలాంటి గొడవలు, ఘర్షణలకు దిగని తమ కొడుకును ఎందుకు చంపాల్సి వచ్చిందో పోలీసులు దర్యాఫ్తు చేసి చెప్పాలని కోరారు. హర్షవర్ధన్ తల్లి జయశ్రీ మాట్లాడుతూ, ‘‘ ఎవ్వరితోనూ మాట్లాడడు. తన పని తాను చేసుకుంటాడు. ఉదయం 11 గంటలకు కాలేజీకి వెళ్లి మధ్యాహ్నం 1.30కి ఇంటికి వస్తాడు. భోజనం చేసి 2.30కి అపోలోకెళ్తాడు. తిరిగి రాత్రి 12 గంటలకు ఇంటికి వస్తాడు. అలాంటి మా బాబును అంత దారుణంగా కొట్టాల్సిన అవసరం అతనికి ఎందుకు వచ్చింది. వాళ్ల మధ్య ఎలాంటి పగ ఉన్నదీ మాకు తెలవాల్సి ఉంది.’’ అని అన్నారు. యాజమాన్యం బాధ్యత వహించాలి కాలేజీ ప్రిన్సిపాల్, లెక్చరర్ల నిర్లక్ష్యమే నా కొడుకును బలితీసుకుంది. పిల్లవాన్ని అలా కొడుతూంటే వాళ్లంతా ఏం చేశారు. ఎందుకు ఆపలేకపోయారు. మా కొడుకు చీమకు కూడా హానితలపెట్టని వాడు. అలాంటి వాన్ని చావబాదుతుంటే వాళ్లకు ఎట్లా చూడబుద్దయింది. మా వాడు అమాయకుడు. సంతాప ర్యాలీకి తరలి వచ్చిన విద్యార్థులే ఇందుకు నిదర్శనం. పోలీసులు, కాలేజీ యాజమాన్యం మాకు న్యాయం చేయాలి. - నర్సింగ్‌రావు, తండ్రి సతీష్ రిమాండ్ సుల్తాన్‌బజార్: హర్షవర్ధన్‌రావు హత్య కేసులో సీనియర్ విద్యార్థి సతీశ్‌ను సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు సుల్తాన్‌బజార్ ఇన్స్పెక్టర్ జి. శ్రీనివాస్ తెలిపారు. మృతుడు హర్షవర్ధన్ తండ్రి నర్సింగ్‌రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. సతీష్‌ను కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితుడిపై 302, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఉద్రిక్తతకు దారితీసిన శాంతి ర్యాలీ సుల్తాన్‌బజార్: హర్షవర్ధన్ మృతికి సంతాపంగా తోటి విద్యార్థులు నిర్వహించిన శాంతి ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. సోమవారం హనుమాన్టేకిడీలోని ప్రగతి మహావిద్యాలయ కళాశాలలో శాంతి ర్యాలీ నిర్వహించేందుకు ఆ కళాశాలకు చెందిన విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. విద్యార్థుల ర్యాలీ నిర్వహించేందుకు వస్తున్నారని తెలిసి సుల్తాన్‌బజార్ పోలీసులు కళాశాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాలేజీ గేట్లు మూసివేసి, ర్యాలీకి అనుమతిలేదని అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు అక్కడే బైఠాయించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు విద్యార్థులను అక్కడి నుంచి బొగ్గులకుంట వరకు తరిమికొట్టారు. కాగా, కళాశాలలో ఉన్న కొంత మంది విద్యార్థులతో కళాశాల అధ్యాపకులు సంతాపసభ నిర్వహించారు. హర్షవర్ధన్ చిత్రపటానికి కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ టీవీ రావు పూలమాలలు వేసి, రెండు నిముషాలు మౌనం పాటించారు. హర్షవర్ధన్ మృతికి సంతాపంగా కళాశాలకు రెండు రోజుల పాటు సెలవు ప్రకటించామని ప్రిన్సిపాల్ తెలిపారు. కళాశాలలో బీసీఏ పరీక్ష జరుగుతున్న నేపథ్యంలోనే శాంతి ర్యాలీకి విద్యార్థులను అనుమతించలేదన్నారు. -
ఏసీబీ వలలో జీహెచ్ఎంసీ ఇంజినీర్
సుల్తాన్‌బజార్: కాంట్రాక్టర్ వద్ద రూ. 3 వేలు లంచం తీసుకుంటూ జీహెచ్ఎంసీ ఇంజినీర్ అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ ఎస్కె చంద్రశేఖర్ కథ నం ప్రకారం... చంపాపేటకు చెందిన బిశ్వానాయక్ కాంట్రాక్టర్. రోడ్డు పను లు పూర్తి చేసిన ఇతనికి జీహెచ్ఎంసీ నుంచి రూ. 4 లక్షల బిల్లు రావాల్సి ఉంది. ఈ బకాయి బిల్లు కోసం ఇతను గత జూన్ 6 నుంచి పుత్లీబౌలిలోని జీహెచ్ఎంసీ కార్యాలయంలోని క్వాలి టీ కంట్రోల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జె.నర్సింగ్‌రావు చుట్టూ తిరుగుతున్నాడు. తనకు రూ. 3 వేలు లం చం ఇస్తేనే బిల్లు మంజూరు చేస్తానని ఇంజినీర్ నర్సింగ్‌రావు స్పష్టం చేశా డు. దీంతో కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయగా.. వారు నర్సింగ్రావును పట్టుకొనేందుకు పథ కం వేశారు. బిశ్వానాయక్కు కెమికల్ పూసి న రూ. 3 వేలు ఇచ్చి ఇంజినీర్ వద్దకు పంపగా.. ఆయన ఆ డబ్బును తన డ్రైవర్ సయ్యద్ హుస్సేన్‌ను తీసుకోమని పురమాయించాడు. ఆ డబ్బు తీసుకున్న హుస్సేన్‌తో పాటు ఇంజినీర్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నర్సింగ్‌రావు టేబుల్ డ్రాయర్లో ఉన్న నగదుతో పాటు అతని కారులోంచి రూ. 1.54 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో ఏసీ బీ ఇన్స్పెక్టర్ పద్మనాగరాజు, శ్రీనివాసరావు, రాజేశ్, కాశయ్య తదితరులు పాల్గొన్నారు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యో గులు, అధికారులు లంచం అడిగితే ఫోన్ 9440446109, 9440446188 నెంబర్ల్కు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ చంద్రశేఖర్ కోరారు. ఇంట్లో తనిఖీలు... సంజీవరెడ్డినగర్/మోతీనగర్: మోతీనగర్ శ్రీహర్ష అపార్ట్మెంట్లోని నర్సింగ్‌రావు నివాసంలోనూ ఏసీబీ అధికారులు బుధవారం రాత్రి వరకూ సోదాలు చేశారు. ఇంట్లో రూ.10 లక్షల నగదుతో పాటు కూకట్పల్లి మెట్రో సమీపంలో 200 గజాల్లో మూడు అంతస్తుల భవనం ఉన్నట్టు గుర్తించారు. నర్సింగ్‌రావు భారీగా అక్రమ ఆస్తులు సంపాదించినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. బంగారు ఆభరణాలతో పాటు కుటుంబ సభ్యులు, బంధువుల పేర్లపై ఉన్న ఆస్తులు, బ్యాంక్ ఖాతాలను పరిశీలించాల్సి ఉందన్నారు. ఏసీబీ ఇన్స్పెక్టర్లు మల్లికార్జున్‌రెడ్డి, మంజుల ఆధ్వర్యంలో ఈ సోదాలు జరిగాయి.