ఆయన... ఈయన... మధ్యలో పొరపొచ్చాలు
కొనసా...గుతున్న తాత్కాలిక ఈవో
పాత ఈవో, కొత్త ఈవో మధ్య పొరపొచ్చాలు
నేడు కృష్ణా పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష
విజయవాడ : రాజధాని ప్రాంతంలో అతి పెద్ద దేవాలయం దుర్గగుడి ప్రస్తుతం తాత్కాలిక ఎగ్జిక్యూటివ్ అధికారి పాలనలో ఉంది. శ్రీ దుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం ఈవో సీహెచ్ నర్సింగరావు మార్చి రెండో వారంలో పక్షం రోజులు సెలవు పెట్టి వెళ్లారు. ఆ పక్షం రోజులకు తాత్కాలిక ఈవోగా చంద్రశేఖర్ ఆజాద్‌ను నియమించారు.
నర్సింగరావు తిరిగి విధుల్లోకి చేరినా ఆయన్ను ఈవోగా నియమించలేదు. కనీసం చంద్రశేఖర్ ఆజాద్‌ను పర్మినెంట్ ఈవోగా ప్రకటించలేదు. ఈ ఇద్దరు కాకుండా మరొకరిని నియమించాలని ప్రభుత్వం భావించినా ఆ నిర్ణయం వేగవంతంగా తీసుకోవడం లేదు. దుర్గగుడి ఈవో నియామకంలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
త్వరలో మూడు ప్రధాన ఉత్సవాలు
ఆగస్టులో కృష్ణానది పుష్కరాలు, ఆ తరువాత అక్టోబర్‌లో దసరా ఉత్సవాలు, డిసెంబర్‌లో భవానీ దీక్షలు జరుగనున్నాయి. ఉత్సవాలకు కొద్ది రోజులు ముందుగా పర్మినెంట్ ఈవోను నియమిస్తే ఆయనకు దేవస్థానంపై అవగాహన ఏర్పడి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం సులభమవుతుంది. గురువారం కృష్ణా పుష్కరాలపై చర్చించేందుకు దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్, ఈవో, ఇతర ఉన్నతాధికారులు సమావేశం అవుతున్నారు. ఈ సమావేశంలో పర్మినెంట్ ఈవో నియామకంపై నిర్ణయం తీసుకుంటే మేలని పలువురు సూచిస్తున్నారు.
అభివృద్ధి పనుల్లో ఇన్‌చార్జీదే నిర్ణయం
కృష్ణా పుష్కరాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఇన్‌చార్జి ఈవో చంద్రశేఖర్ ఆజాద్ నిర్ణయాలు తీసుకుంటున్నా రు. ఇందులో కొన్ని వివాదాస్పదమవుతున్నాయి. ము ఖ్యంగా దేవస్థానం ఎదురుగా ఓ భక్తుడు లక్షలు వెచ్చిం చి నిర్మించిన షెడ్‌ను ఆ భక్తుడి చేతే తొలగించాలని తీసుకున్న నిర్ణయంపై భక్తుల నుంచి విమర్శలు వచ్చాయి. అలాగే అమ్మవారి కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలను భద్రపరిచే స్ట్రాంగ్‌రూం కొండ దిగువకు మార్చాలనే తాత్కాలిక ఈవో ఆజాద్ నిర్ణయాన్ని గత ఈవో సీహెచ్ నర్సింగరావు తిరస్కరించారు. అమ్మవారి విలువైన ఆభరణాలు భద్రత లేని చోట పెట్టేందుకు తాను సుముఖంగా లేనని తిరస్కరించారు. మల్లికార్జున మహామండంలో పనులు పూర్తి కాలేదు. నాణ్యత సరిగా లేదని గత ఈవో బిల్లులు నిలిపివేశారు. అన్నదాన భవ నం, ప్రసాదాల తయారీ భవనాలను తరలించాలనే నిర్ణయాలపై భక్తుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. పర్మినెంట్ ఈవో ఉంటే బాగుంటుందనే భావన అందరిలోనూ నెలకొంది. దీనిపై అధికార పార్టీ ప్రజాప్రతినిధులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.