హైకోర్టు కొత్త జడ్జీలుగా రేణుక, నర్సింగ్‌రావు, తిరుమలాదేవి, మధుసూదన్‌రావు ప్రమాణస్వీకారం
ప్రమాణం చేయించిన ఏసీజే జస్టిస్ సుజోయ్‌పాల్
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వహిస్తామని హైకోర్టు కొత్త జడ్జీలు రేణుక యార, నర్సింగ్‌రావు నందికొండ, తిరుమలాదేవి ఈద, మధుసూదన్‌రావు బొబ్బిలి రామయ్య ప్రమాణం చేశారు. హైకోర్టు ఆవరణలోని ఫస్ట్ కోర్టు హాల్‌లో శనివారం ఉదయం 10.45 గంటలకు నలుగురితో న్యాయమూర్తులుగా తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ సుజోయ్‌పాల్ ప్రమాణస్వీకారం చేయించారు. తొలుత వీరిని న్యాయమూర్తులుగా నియమిస్తూ రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులను రిజి్రస్టార్ జనరల్ ఎస్.గోవర్ధన్‌రెడ్డి చదివి వినిపించారు.
ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, అదనపు సొలిసిటర్ జనరల్ బి.నరసింహశర్మ, అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి, పీపీ పల్లె నాగేశ్వర్‌రావు, బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నర్సింహారెడ్డి, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ గాడి ప్రవీణ్‌కుమార్, హెచ్‌సీఏఏ అధ్యక్షుడు ఎ.రవీందర్‌రెడ్డి, రిజి్రస్టార్లు, ఏఏజీలు, కోర్టు సిబ్బందితోపాటు కొత్త న్యాయమూర్తుల కుటుంబసభ్యులు పాల్గొన్నారు.
వీరి నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరింది. ఇంకా 12 ఖాళీలున్నాయి. తెలంగాణ హైకోర్టుకు న్యాయమూర్తులుగా ఈ నలుగురి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం ఈనెల 11న సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. వీరంతా 2012లో జిల్లా జడ్జిగా ఎంపికైన వారే కావడం గమనార్హం. న్యాయాధికారుల కోటాలో వీరిని ఎంపిక చేశారు.
సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులకు ఈ నెల 22న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు. కాగా, జస్టిస్ తిరుమలాదేవి 2026, జూన్ 1 వరకు అదనపు న్యాయమూర్తిగా కొనసాగనుండగా, మిగతా ముగ్గురు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండేళ్లు అదనపు న్యాయమూర్తులుగా విధులు నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment