సాక్షి, హైదరాబాద్: వైద్యుడు దేవుడితో సమానమంటూ... వైద్యో నారాయణో హరి అంటారు కదా! కానీ, ఓ కార్పొరేట్ ఆస్పత్రి వైద్యులు బతికుండగానే ఓ కరోనా బాధితుడిని ‘హరీ’మనించారు. కరోనా కాలంలో ఓ కార్పొరేట్ ఆస్పత్రి లీల ఇది.. కరోనా బాధితుడు బతికుండగానే చావుకబురు చల్లగా చెప్పారు. కుటుంబసభ్యులను కంగారు పెట్టించారు. బ్యాలెన్స్ బిల్లు చెల్లించి శవాన్ని తీసుకెళ్లాలని సమాచారమిచ్చారు. చివరిచూపు కోసం ఆస్పత్రికి చేరుకున్న భార్యాపిల్లలకు, ఇతర బంధువులకు ఐసీయూలో ఉన్న పేషెంట్‌లో కదలికలు కన్పించాయి. ఇదేమిటని నిలదీయడంతో ఆస్పత్రి వైద్యులు నీళ్లు నమిలారు. తాము అలా చెప్పలేదని ఆస్పత్రి యాజమాన్యం బుకాయిస్తుండటం గమనార్హం. ఈ సంఘటన గురువారం సికింద్రాబాద్‌లో వెలుగుచూసింది.
అసలేమైందంటే...: అంబర్‌పేటకు చెందిన బీజేపీ సీనియర్‌నేత సి.నర్సింగరావు(67) శ్వాస సంబం ధిత సమస్యతో బాధపడుతూ చికిత్స కోసం జూన్ 27న సికింద్రాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరారు. వైద్య పరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. నాల్రోజులపాటు ఐసీయూలో ఉంచారు. ఆరోగ్యం మెరుగుపడటంతో ఐసోలేషన్ వార్డుకు మార్చారు. ఆ తర్వాత శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది పడుతుండటంతో ఆయన్ను మళ్లీ ఐసీయూకు తరలించి వెంటిలేటర్ అమర్చారు. బుధవారంరాత్రి నర్సింగరావు ఇకలేరు.. తీసుకెళ్లాల్సిం దిగా ఆస్పత్రి నుంచి కుటుంబ సభ్యులకు ఫోన్ వచ్చింది. కోవిడ్ మృతదేహాన్ని ఇంటికెలా ఇస్తారని కుటుంబ సభ్యులు ప్రశ్నించగా, సారీ... ప్యాక్ చేసి జీహెచ్‌ఎంసీకి అప్పగిస్తామన్నారు.
చివరిచూపు కోసం వెళ్లగా...
ఒకవైపు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తూనే చివరిచూపు కోసం గురువారం ఉదయం ఆస్పత్రికి వచ్చిన కుటుంబ సభ్యుల సంతకాలను కూడా తీసుకు న్నారు. మృతదేహం తరలింపు కోసం అంబులెన్స్ సహా జీహెచ్‌ఎంసీ సిబ్బంది వస్తున్నట్లు చెప్పారు. అయితే నర్సింగరావు చనిపోలేదని, ఆరోగ్యం మెరుగవుతోందని, ఇదే ఆస్పత్రిలోని ఓ వైద్యుడి ద్వారా కుటుంబసభ్యులకు సమాచారమందింది. దీంతో ఐసీయూలోని వెంటిలేటర్‌పై ఉన్న నర్సింగరావును వీడియో కాల్ ద్వారా కుటుంబసభ్యులు పలకరించారు.
ఆయన శరీరంలో కదలికలు గమనించారు. ఆయన తలఊపుతూ తాను బాగానే ఉన్నట్లు సంకేతాలిచ్చారు. దీంతో బతికున్న మనిషి చనిపోయాడని సమాచారమెలా ఇస్తారని ఆస్పత్రి అధికారులను కుటుంబసభ్యులు నిలదీశారు. తప్పుడు సమాచారం ఇచ్చిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆయన సోదరుడు అంబర్‌పేట్ శంకర్ డిమాండ్ చేశారు. కాగా బీజేపీ సీనియర్ నేత నర్సింగరావు మృతి చెందారనే తొలి వార్త తెలిసి హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి సంతాపం తెలపడం గమనార్హం.
ఇంత మోసమా: సోనియా, బాధితుడి కోడలు
ప్రభుత్వవైద్యంపై నమ్మకంలేక మా మామయ్యను ఈ ఆస్పత్రికి తీసుకొచ్చాం. మామయ్య మా కుటుంబానికి పెద్దదిక్కు. ఆయన బతికుండగానే చనిపోయాడని చెప్పారు. అందరం చాలా బాధపడ్డాం. మా అత్తమ్మ స్పృహతప్పి పడిపోయింది. రూ.4 వేలు ఖరీదు చేసే ఇంజక్షన్‌కు రూ.40 వేలు చార్జీ చేశారు. రూ.8 లక్షలకుపైగా బిల్లు వేశారు. ఇప్పటికే రూ.6 లక్షలకుపైగా చెల్లించాం. ఇదో గొప్ప ఆస్పత్రి అంటారు. ఇంత చెత్త ఆస్పత్రిని ఎక్కడా చూడలేదు. ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలి.
చనిపోయాడని మేం చెప్పలేదు: ఆస్పత్రి వర్గాలు
నర్సింగరావు చనిపోయాడని తాము ఎలాంటి సమాచారాన్ని ఆయన కుటుంబ సభ్యులకు ఇవ్వలేదు. ఆస్పత్రి నుంచి ఎవరు ఫోన్ చేసి చెప్పారో తెలపాల్సిందిగా కోరితే వారి వద్ద సమాధానం లేదు. ఎవరైనా చనిపోతే ముందు ఈసీజీ తీసి డెత్ డిక్లరేషన్ ఇస్తాం. ఈ ఘటనలో అలా జరగలేదు. ఆస్పత్రి ప్రతిష్ట దెబ్బతీసేలా వారు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment