నర్సింగరావును సాగనంపేందుకు ఓ ఎమ్మెల్యే యత్నం
చెప్పిన పనులు చేయలేదన్న ఆగ్రహంతోనే..
బదిలీ చేయవద్దంటున్న కీలక మంత్రి
ఇంద్రకీలాద్రిపై వాడీవేడిగా చర్చ
విజయవాడ : అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆడింది ఆటగా.. పాడింది పాటగా మారింది. వారి గొంతెమ్మ కోర్కెలు తీర్చలేక అధికారులు నానా హైరానా పడుతున్నారు. ఎవరైనా తీర్చలేకపోతే వారిపై వేధింపుల పర్వం మొదలుపెట్టడంతోపాటు బదిలీ చేయించేందుకు కూడా వెనుకాడడం లేదు. తాజాగా శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈవో) సీహెచ్.నర్సింగరావు ఇదే తరహాలో ఒక ఎమ్మెల్యే బారిన పడ్డారు. ఆ డిమాండ్లను పరిష్కరించడం ఈవో స్థాయిలో లేకపోవడంతో తక్షణం ఆయన్ను ఇక్కడ నుంచి బదిలీ చేయించేందుకు ఆ ఎమ్మెల్యే తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. దీనికి జిల్లాకు చెందిన ఒక కీలక మంత్రి అడ్డుపడడంతో ఈవో బదిలీపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి.
ఎమ్మెల్యే కోర్కెల చిట్టా
ఎన్నికల్లో కోట్లు కుమ్మరించి పదవిని దక్కించుకున్న ఎమ్మెల్యే ప్రస్తుతం సొమ్ము రాబట్టుకునేందుకు దుర్గగుడిపై కన్నేశారు. ఇంద్రకీలాద్రి దిగువన, దుర్గాఘాట్, మల్లికార్జున మహామండపం వద్ద మొత్తం పదికి పైగా దుకాణాలు పెట్టుకునేందుకు అనుమతించాలని కోరారు. ఇవికాకుండా దేవస్థానంలో రెండు ఉద్యోగాలు కావాలంటూ ఈవోను డిమాండ్ చేసినట్లుగా కొండపై జోరుగా ప్రచారం జరుగుతోంది. తొలి విడతగా వీటిని తీర్చితే.. మరో చిట్టా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ ఎమ్మెల్యే కోర్కెలు ఆమోదిస్తే తాము కూడా ఇదే తరహాలో డిమాండ్ చేసేందుకు ఇంద్రకీలాద్రి సమీపంలోనే ఉండే మరో ముఖ్య నేత కూడా సమాయత్తమవుతున్నట్లు సమాచారం. దేవస్థానం ప్రతిష్ట రోడ్డున పడుతుందని భావిం చిన ఈవో ఎమ్మెల్యే ప్రతిపాదనలు పక్కనపెట్టడంతో ఆయన ఆగ్రహానికి గురయ్యారు.
కాంట్రాక్టర్లు రంగప్రవేశం
దుర్గగుడిలో కాంట్రాక్టర్లు ఎమ్మెల్యేకు అండగా నిలబడ్డారు. ఈవో తరువాత స్థానంలో ఉండే మరో అధికారి కూడా పూర్తి సహకారం అందించారు. వీరికి ఒకరిద్దరు అర్చకులు తోడుకావడంతో ఈవోను బదిలీ చేయించేం దుకు ఏకంగా లక్షల్లో ఫండ్ తయారుచేయిం చినట్లు ఆలయవర్గాలు చెబుతున్నాయి. ఈ ఫండ్‌ను హైదరాబాద్‌లోని కొంతమంది ముఖ్య అధికారులు, ప్రభుత్వ పెద్దలకు ముట్టజెప్పి ఈవోను తక్షణం బదిలీ చేయిం చేందుకు వేగంగా పావులు కదువుతున్నారు. ప్రస్తుత ఈవో స్థానంలో రాజమండ్రికి చెందిన స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారిని తీసుకొచ్చేందుకు ఒప్పందం కూడా చేసుకున్నారు.
అడ్డుపడుతున్న కీలక మంత్రి
తరచూ ఈవోను మార్చితే అభివృద్ధి పనులకు ఆటంకం కలగడంతోపాటు దేవస్థానం ప్రతిష్ట దెబ్బతింటుందని భావించిన జిల్లాకు చెందిన కీలక మంత్రి ఈవోను బదిలీ చేయాల్సిన అవసరం లేదని చెబుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొత్త ఈవో వచ్చి దేవస్థానంపై అవగాహన పెంచుకునేలోగానే తిరిగి ఆయన్ను బదిలీ చేయించేందుకు కొన్ని శక్తులు సిద్ధమవుతున్నాయని సమాచారం. కాగా సదరు మంత్రిని కూడా ప్రసన్నం చేసుకునేందుకు ఈవో వ్యతిరేక వర్గం ప్రయత్నిస్తోంది.
ఈవోకు ఎసరు!
Published Thu, Nov 19 2015 12:32 AM | Last Updated on Tue, Oct 30 2018 5:17 PM
Advertisement
Advertisement