
సాక్షి, అమరావతి: ఉద్యోగుల సమ్మతితో పని లేదు.. సాధారణ బదిలీల్లో ఇచ్చే వెసులుబాట్లూ లేవు.. ఎప్పుడూ ఉండే.. వైకల్యం, భార్యాభర్తలు, అనారోగ్యం, స్థానికం ‘ఆప్షన్లు’ లేవు.. ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు బదిలీ..! విద్యుత్తు శాఖలో ఇప్పుడీ అంశం కలకలం రేపుతోంది. ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తోంది. ఏ ప్రభుత్వ విభాగంలోనూ ఇలాంటి నిర్భంధ బదిలీలు జరగలేదని, ఎందుకింత కఠినం అని ఉన్నతాధికారులను అడిగితే.. ‘మేం చెప్పిన చోటకు వెళ్లండి.. లేదంటే మానేయండి’ అనే సమాధానం వస్తోందని ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు.
విమర్శలు రావడంతో అనుమతి
పాలనా సౌలభ్యం కోసం గత ప్రభుత్వంలో 13 జిల్లాలను 26గా చేశారు. ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లలో దాదాపు 1.92 కోట్లమంది విద్యుత్తు వినియోగదారులకు సేవలందించేందుకు కొత్తగా ఏర్పడ్డ 13 జిల్లాలకు ఎలక్ట్రికల్ ఇంజనీర్ (ఈఈ) స్థాయి అధికారులను ఇన్‌చార్జులుగా నియమించారు.
కూటమి ప్రభుత్వంలో కొత్త జిల్లాల్లో సర్కిల్, డివిజన్, ఏఈ కార్యాలయాల ఏర్పాటుతో పాటు అధికారులు, సిబ్బందిని కేటాయించాల్సి ఉన్నా పట్టించుకోకపోవడంపై విమర్శలొచ్చాయి. దీంతో కొంతకాలం క్రితం కొత్త సర్కిళ్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిచ్చింది.
చెరో జిల్లాకు భార్యాభర్తలు..!
రాష్ట్రంలోని 3 డిస్కంలలో సుమారు 23 వేల మంది శాశ్వత సిబ్బంది ఉన్నారు. వీరినే పాత, కొత్త డివిజన్లకు సర్దుబాటు చేసుకోమని, కొత్త పోస్టులు ఇవ్వడం కుదరదని చెప్పింది. ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకుండా సర్కిళ్లు ఏర్పాటు చేయాలంది. డిస్కంలు దీనికితగ్గట్లు.. కమిటీలు వేసి ఉద్యోగుల బదిలీ ప్రక్రియకు శ్రీకారం చుట్టాయి. అయితే, సాధారణ బదిలీల్లో అనుసరించే నిబంధనలను పక్కనపెట్టాయి. ఈ కారణంగా ఒక డిస్కం పరిధిలో భార్యాభర్తలు ఉద్యోగులుగా ఉంటే వారు చెరో జిల్లాకు బదిలీ కావాల్సి వస్తోంది.
కొత్త సర్కిళ్ల పేరు చెప్పి ఇప్పటికే సగం సర్వీసులు తగ్గించేశారు. కొన్ని సర్కిళ్లలో సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ (ఎస్‌ఏవో) పోస్టులను తీసేశారు. జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ (జేఏవో) పోస్టులను ఎత్తేశారు. టెక్నికల్ పోస్టులను కుదించేశారు. ఒక్కో ఉద్యోగి రెండు మూడు విభాగాల పనిచేసే విధంగా భారం మోపుతున్నారు. వీటితోనే సతమతం అవుతున్న ఉద్యోగులు శాశ్వత కేటాయింపులపై ఆందోళనకు గురవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment