నేను చెప్పిన వారే కావాలి..!
పోలీస్ బదిలీల్లో నేతల హుకుం
ఏసీపీ బదిలీలపై రాజకీయ రంగు
మంత్రి, ఎమ్మెల్యేల హవా
నేను చెప్పిన వారినే వేయండి. నా పనులు చేసేవారు కావాలి. లేదంటే కుదరదు.. ఇదీ పోలీస్ అధికారుల బదిలీలపై నేతల మాట. విజయవాడ నగరంలో ఏసీపీల బదిలీలపై ఏం చేయాలో అర్థంకాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. నేరాలు అదుపు చేసే వారు అవసరం లేదు. చట్టాన్ని తమకు అనుకూలంగా మార్చే ఏసీపీలు ఉంటే చాలు. స్టేషన్ హౌస్ ఆఫీసర్లు కూడా ఇలాంటి వారే కావాలి. లేదంటే సీఎం వద్ద పంచాయితీ పెడతాం జాగ్రత్తంటూ హెచ్చరికలు..!
విజయవాడ : నగరం రాజధాని కావడంతో జనాభా పెరుగుతోంది. పల్లెల నుంచి ఉపాధి కోసం వస్తు న్న వారు ఎక్కువయ్యారు. చిన్న నేరాల నుంచి పెద్ద నేరాల వరకు జరుగుతున్నాయి. వీటిని అరికట్టాలంటే ఏసీపీలు మెరికల్లా ఉండాలి. స్టేషన్లలో సిబ్బందిని పరుగులు పెట్టించి పనులు చేసేలా తయారు చేయాలి. ఏసీపీలే సరైన వారు లేకుంటే పనులు ఎలా జరుగుతాయనేది ఉన్నతాధికారుల ప్రశ్న. ఈస్ట్ ఏసీపీ పోస్టు చాలా కాలంగా ఖాళీగా ఉంది. ఇక్కడ పని చేస్తున్న అభిషేక్ మహంతి చిత్తూరుకు ఏఎస్పీ గా వెళ్లారు. ఆ పోస్టును భర్తీ చేయడం ఉన్నతాధికారులకు చేతకాలేదు. ఎందుకంటే ఇక్కడ రాజకీయ జోక్యం ఎక్కువైంది. మంత్రులు, ఎమ్మెల్యేలు నేరుగా రంగంలోకి దిగుతున్నారు. తమకు అనుకూలంగా ఉండే అధికారులను వేయాలని ఉన్నతాధికారులపై ఒత్తిడి పెంచారు. ఏంచేయాలో దిక్కుతోచని ఉన్నతాధికారులు పోస్టును ఖాళీ పెట్టారు.
సెంట్రల్ ఏసీపీగా ప్రభాకర్‌బాబు ఉన్నారు. ఈయన కాస్త ముక్కుసూటి మనిషి. డెరైక్ట్ రిక్రూట్ కావడమే ఇందుకు కారణం. ఎవరు ప్రభావితం చేయాలన్నా పట్టించుకోకపోవడంతో నియోజకవర్గ నేతలకు కంటగింపు గా మారింది. దీంతో నేతలు ఈయనను రెండు నెలల క్రితం బదిలీ చేయించారు. ఈ స్థానంలో సీఐడీలో ఉన్న ఎన్.సత్యానందంను వేశారు. అయితే ఈయననూ నేతలు రానివ్వలేదు. జాయిన్ కాకుండా ఆగిపోవాల్సి వచ్చింది.
నెల రోజుల క్రితం వెస్ట్ ఏసీపీగా జి.రామకృష్ణను నియమించారు. రామకృష్ణకు ఇష్టం లేకపోయినప్పటికీ ఆయన ద్వారానే పనులు సులువుగా సాగుతాయని నేతలు మాత్రం కోరుకున్నారు. అయిష్టంగా పని చేస్తే ఏదీ సాధించలేరు. వెస్ట్ ఏసీపీ విషయంలో ఉన్నతాధికారుల వద్ద ఇదే రిపోర్టు ఉంది. అయితే జాయినై నెలరోజులే అయినందున త్వరలోనే నేరగాళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశం లేకపోలేదు. గతంలో ఇక్కడ శివరామశర్మ ఏసీపీగా పని చేశారు.
ఐపీఎస్‌లు ఉంటే బాగుంటుంది..
నగరంలో ఏసీపీలుగా ఐపీఎస్‌లు ఉంటే చురుకుగా పనులు సాగే అవకాశం ఉంటుందని ఉన్నతాధికారులు భావిస్తున్నా రు. రాష్ట్రస్థాయిలో చర్చకు వచ్చిన కేసులు వీరు సులువుగా చేధించే అవకాశం ఉంది. కొత్తగా ముగ్గురు ఐపీఎస్‌లు విజ యవాడ వచ్చారు. ప్రస్తుతం వీరు అవసరమైనప్పుడు సీపీ సూచనల మేరకు వెళుతున్నారు. వీరినే నేరుగా ఏసీపీలుగా వేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన ఉన్నతాధికారుల్లో ఉంది.
పోస్టింగ్‌లు అడ్డుకున్న వైనం
డీజీపీ స్థాయిలోనే ఏసీపీల బదిలీల పోస్టింగ్‌లు ఉంటా యి. ఆయనపైనే ఒత్తిడి తీవ్రంగా ఉందంటే రాజకీయం ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. రెండు నెలల క్రితం వీఆర్‌లో ఉన్న కనకరాజును ఈస్ట్ ఏసీపీగా వేశారు. అయితే నేతలు అడ్డు చెప్పారు. ప్రస్తుతం మహిళా పోలీస్‌స్టేషన్ల ఏసీపీ వి.వి.నాయుడు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఈస్ట్ ఏసీపీ బాధ్యతలు కూడా చూడాలి. ఈస్ట్ పరిధిలోని పెనమలూరులో ఇటీవల భారతీయుడు అనే వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. బాధ్యులపై కేసు కట్టాల్సిందిగా ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీంతో ఆయన హైకోర్టుకు వెళ్లి కోర్టు డెరైక్షన్ తెప్పించి కేసు నమోదు చేయించారు. ఇదే ఏసీపీ పర్యవేక్షణ ఉండి ఉంటే ఈ పరిస్థితులు వచ్చి ఉండేవి కాదని పోలీసు అధికారులు కొందరు చెబుతున్నారు.