క్షణికావేశమే ఊపిరి తీసిందా...?
విద్యార్థి హర్షవర్థన్ మృతి నేపథ్యం...
సాక్షి,సిటీబ్యూరో: ఆ క్షణం వరకు వాళ్లు శత్రువులు కాదు... ఆ ఇద్దరి మధ్య పగ, ప్రతీకారాలు లేవు. హతమార్చేందుకు కుట్రలు పన్నినదాఖలాల్లేవు. కానీ క్షణికావేశమే నిండు ప్రాణాన్ని బలితీసింది. అమాయకుడైన హర్షవర్ధన్‌ను పొట్టనబెట్టుకుంది. ఒక్క ప్రగతి మహావిద్యాలయలో విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణే కాదు. చాలా సందర్భాల్లో ఇలాంటి అసహనం, క్షణికోద్రేకమే ఒకరినొకరు కొట్టుకోవడం, హత్యలకు పాల్పడటం వంటి ఘటనలకు దారితీస్తోంది. ఘర్షణకు దిగిన వారిలో ఏ ఒక్కరైనా కొద్దిగా సహనం పాటించినా ఇలాంటి దారుణానికి అవకాశం ఉండదు. సోమవారం హర్షవర్ధన్ మృతికి సంతాపంగా విద్యార్థులు శాంతి ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు స్పందించారు. జరిగిన ఘోరాన్ని తలచుకొని బాధపడ్డారు.
ఈ ర్యాలీ సందర్భంగా కళాశాలకు వచ్చిన హర్షవర్ధన్ తల్లిదండ్రులు నర్సింగ్‌రావు, జయశ్రీలు కన్నీరు మున్నీరుగా విలపించారు. వారు సైతం అదే సందేహాన్ని వ్యక్తం చేశారు. ఎవ్వరితోనూ ఎలాంటి గొడవలు, ఘర్షణలకు దిగని తమ కొడుకును ఎందుకు చంపాల్సి వచ్చిందో పోలీసులు దర్యాఫ్తు చేసి చెప్పాలని కోరారు. హర్షవర్ధన్ తల్లి జయశ్రీ మాట్లాడుతూ, ‘‘ ఎవ్వరితోనూ మాట్లాడడు. తన పని తాను చేసుకుంటాడు. ఉదయం 11 గంటలకు కాలేజీకి వెళ్లి మధ్యాహ్నం 1.30కి ఇంటికి వస్తాడు. భోజనం చేసి 2.30కి అపోలోకెళ్తాడు. తిరిగి రాత్రి 12 గంటలకు ఇంటికి వస్తాడు. అలాంటి మా బాబును అంత దారుణంగా కొట్టాల్సిన అవసరం అతనికి ఎందుకు వచ్చింది. వాళ్ల మధ్య ఎలాంటి పగ ఉన్నదీ మాకు తెలవాల్సి ఉంది.’’ అని అన్నారు.
యాజమాన్యం బాధ్యత వహించాలి
కాలేజీ ప్రిన్సిపాల్, లెక్చరర్‌ల నిర్లక్ష్యమే నా కొడుకును బలితీసుకుంది. పిల్లవాన్ని అలా కొడుతూంటే వాళ్లంతా ఏం చేశారు. ఎందుకు ఆపలేకపోయారు. మా కొడుకు చీమకు కూడా హానితలపెట్టని వాడు. అలాంటి వాన్ని చావబాదుతుంటే వాళ్లకు ఎట్లా చూడబుద్దయింది. మా వాడు అమాయకుడు. సంతాప ర్యాలీకి తరలి వచ్చిన విద్యార్థులే ఇందుకు నిదర్శనం. పోలీసులు, కాలేజీ యాజమాన్యం మాకు న్యాయం చేయాలి.
- నర్సింగ్‌రావు, తండ్రి
సతీష్ రిమాండ్
సుల్తాన్‌బజార్: హర్షవర్ధన్‌రావు హత్య కేసులో సీనియర్ విద్యార్థి సతీశ్‌ను సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు సుల్తాన్‌బజార్ ఇన్‌స్పెక్టర్ జి. శ్రీనివాస్ తెలిపారు. మృతుడు హర్షవర్ధన్ తండ్రి నర్సింగ్‌రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. సతీష్‌ను కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితుడిపై 302, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఉద్రిక్తతకు దారితీసిన శాంతి ర్యాలీ
సుల్తాన్‌బజార్: హర్షవర్ధన్ మృతికి సంతాపంగా తోటి విద్యార్థులు నిర్వహించిన శాంతి ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. సోమవారం హనుమాన్‌టేకిడీలోని ప్రగతి మహావిద్యాలయ కళాశాలలో శాంతి ర్యాలీ నిర్వహించేందుకు ఆ కళాశాలకు చెందిన విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. విద్యార్థుల ర్యాలీ నిర్వహించేందుకు వస్తున్నారని తెలిసి సుల్తాన్‌బజార్ పోలీసులు కళాశాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాలేజీ గేట్లు మూసివేసి, ర్యాలీకి అనుమతిలేదని అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు అక్కడే బైఠాయించారు.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు విద్యార్థులను అక్కడి నుంచి బొగ్గులకుంట వరకు తరిమికొట్టారు. కాగా, కళాశాలలో ఉన్న కొంత మంది విద్యార్థులతో కళాశాల అధ్యాపకులు సంతాపసభ నిర్వహించారు. హర్షవర్ధన్ చిత్రపటానికి కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ టీవీ రావు పూలమాలలు వేసి, రెండు నిముషాలు మౌనం పాటించారు. హర్షవర్ధన్ మృతికి సంతాపంగా కళాశాలకు రెండు రోజుల పాటు సెలవు ప్రకటించామని ప్రిన్సిపాల్ తెలిపారు. కళాశాలలో బీసీఏ పరీక్ష జరుగుతున్న నేపథ్యంలోనే శాంతి ర్యాలీకి విద్యార్థులను అనుమతించలేదన్నారు.