సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ‘ఆసరా’ పథకం లబ్ధిదారులకు మొదటిరోజు పింఛన్లు మొక్కుబడిగా అందాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకు న్న ఈ పథకం ఇంకా సాంకేతిక అవరోధాలను అధిగమించలేక పోతోంది. ఫలితంగా, మలివిడత పంపిణీ కార్యక్రమాన్ని ఆర్భాటంగా నిర్వహించాలకున్న అధికారులు, ప్రజాప్రతినిధులకు అవస్థలు తప్పలేదు. సాంకేతిక ఇబ్బందులతోపాటు బ్యాంకుల నుంచి రూ.పది లక్షలకు పైబడిన డబ్బును డ్రా చేయలేని పరిస్థితి, సిబ్బంది కొరత తదితర కారణాలతో చాలా గ్రామాలలో మొదటిరోజు ఫించన్‌ల పంపిణీ జరగలేదు.
జుక్కల్, బోధన్ నియోజకవర్గాలలో గురువారం నుంచి పంపిణీ చేయనున్నట్లు ప్రకటించగా, ఎల్లారెడ్డి, కామారెడ్డి, బాన్సువాడ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాలలో నామమాత్రంగా పిం ఛన్లను అందజేశారు. నిజామాబాద్ పురపాలక సంఘం పరిధిలో 135 మందికే అందజేయగా, ఆర్మూరు, కామారెడ్డి, బోధన్ మున్సిపాలిటీల లో గురువారానికి వాయిదా వేశారు. బుధవారం ఫించన్లు పంపిణీ చేస్తారన్న అధికారుల ప్రకటన మేరకు లబ్ధిదారులు గ్రామపంచాయతీల ఎదు ట బారులు తీరారు. కానీ, చాలా గ్రామాలకు అధికారులు పగలు రెండు గంటల తర్వాతనే చేరుకున్నారు. ఫలితంగా లబ్ధిదారులు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చి ంది. ఫించన్ల పంపిణీ ప్రక్రియను కలెక్టర్ రొనాల్డ్‌రోస్ పర్యవేక్షించారు.
వడపోత అనంతరం
‘ఆసరా’కు జిల్లావ్యాప్తంగా మొత్తం 3,62,166 ద రఖాస్తులు వచ్చాయి. వివిధ ప్రక్రియల ద్వారా వడపోసిన అనంతరం అందులో 1,92,585 మం దికి మలివిడతలో పింఛన్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు నవంబర్, డిసెంబర్ మాసాలకు చెందిన రూ.40.52 కోట్లు ఎంపీడీఓల ఖాతాలలో జమయ్యాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు బుధవారం నుంచి ఐదు రోజులపాటు జిల్లావ్యాప్తంగా అర్హులైనవారికి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయాల ఎదుట ఈ విడతలో పంపిణీ చేసే అర్హుల పేర్లతో కూడిన జాబితాను కూడా అంటించారు. ఇంతవరకు బాగానే ఉన్నా, మొదటి రోజు ‘ఆసరా’కు బాలారిష్టాలు తప్పలేదు.
మొత్తం 1,92, 585 మంది లబ్ధిదారులకు గాను 21,157 మం దికే ఫించన్లు అందాయి. ఫించన్ పొందిన లబ్ధిదారులు శాతం 11.99గా నమోదైంది. బాన్సువాడ నియోజకవర్గం వర్ని మండలంలో మాత్ర మే పింఛన్ల పంపిణీ ప్రారంభమయింది. సుమారు 55 మంది వృద్ధులు పింఛన్ల కోసం వేచి చూసి వెనుతిరిగారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఒక్క ఎల్లారెడ్డి మండలం మినహా ఐదు మండలాలలో పంపిణీ వాయిదా పడింది. బోధన్ నియోజకవర్గంలోని నవీపేట, బోధన్ పట్టణంలోని ఫించన్ల పంపిణీ గురువారం నుంచి కొనసాగనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆర్మూర్ పట్టణంలో లబ్ధిదారులు సాయంత్రం వరకు నిరీక్షించారు. పింఛన్ కార్డుల రాకపోవడంతో అధికారులు, ప్ర జలు ఇబ్బందులు పడ్డారు. చివరకు కార్డులు లేకపోయినప్పటికీ జాబితాలో పేర్లుండటంతో కలెక్టర్, డీఆర్‌డీఏ పీడీ అనుమతితో పంపిణీ చేశారు. జుక్కల్‌లోని నిజాంసాగర్, ఇతర మండలాలలో నూ పింఛన్ల పంపిణీ వాయిదా పడింది.
మొదటి రోజు..మొక్కుబడి
Published Thu, Dec 11 2014 3:40 AM | Last Updated on Wed, Apr 3 2019 5:38 PM
Advertisement
Advertisement