మెదక్‌జోన్: ‘ఆసరా’ కోసం లబ్ధిదారులు ఎదురుచూపులు చూస్తున్నారు. నెలనెలా 5వ తేదీ లోపున అందాల్సిన పింఛన్లు నెలన్నర గడిచినా ఇప్పటివరకు అందలేదు. వచ్చిన పింఛన్ డబ్బులతో మందులు కొనుక్కునేవారు చాలామంది ఉన్నారు. పింఛన్ సకాలంలో రాకపోవడంతో వారంతా ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలో అన్ని రకాల పింఛన్లు కలిపి మొత్తం 1,03,213 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరికి ప్రతినెలా 5వ తారీఖు లోపల రూ.11.20 కోట్లు ప్రభుత్వం నుంచి అందుతున్నాయి. కొంతమందికి పోస్టాఫీసుల ద్వారా అందుతుండగా మరికొందరికి నేరుగా వారి ఖాతాల్లో జమవుతున్నాయి. మరికొంత మందికి గ్రామాల్లో సీఏలు అందిస్తున్నారు. ఇప్పటివరకు దివ్యాంగులకు నెలకు రూ.1,500 ఇస్తుండగా మిగతా వారికి రూ.వెయ్యి చొప్పున అందజేస్తున్నారు.
పింఛన్‌దారుల్లో 80 శాతం మంది వృద్ధులు, దివ్యాంగులతో పాటు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్నారు. వీరిలో బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులు పింఛన్ రాగానే నెలకు సరిపడా మందుగోలీలను కొనుగోలు చేస్తారు. మందుగోలీలు అయిపోయి పింఛన్ రాక వారు ఇబ్బంది పడుతున్నారు. వీరిలో ముఖ్యంగా కొడుకులు లేనివారు, అనాథల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. దివ్యాంగులకు వచ్చే రూ.1,500 పింఛన్‌పై వారి కుటుంబాలు ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. పింఛన్ డబ్బులు వస్తేనే రేషన్‌బియ్యం కొనుగోలు చేసి నెలంతా జీవనం సాగించే కుటుంబాలు చాలానే ఉన్నాయి. అలాంటి వారికి ఆసరా పైకం అందకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. ఏ అధికారి కనిపించినా సారూ మా పింఛన్ వచ్చిందా? అంటూ ఆరా తీస్తున్నారు.
రెట్టింపు ఎప్పుడో?
రెండోసారి ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ తాము తిరిగి అధికారంలోకి వస్తే పింఛన్లు రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చి ఆరునెలలు కావస్తున్నా పింఛన్ల పెంపుపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదని సంబంధిత అధికారులు చెబుతున్నారు. నూతనంగా 57 సంవత్సరాల లోపు ఎంతమంది ఉన్నారనే జాబితాను మాత్రం ఇప్పటికే గ్రామీణాబివృద్ధిశాఖ అధికారులు సర్వే చేసి ఉన్నతాధికారులకు పంపినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో 1,03,213 మంది మంది అన్ని రకాల పింఛన్‌దారులు ఉండగా 57 సంవత్సరాలు నిండిన వారు 38,978 మంది ఉన్నారు. వీరిలో పింఛన్‌కు అర్హులైన వారు 10,982 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కొత్తవారితో పాటు పాతవారికి పింఛన్ పెంచితే ప్రస్తుతం నెలనెలా ఇస్తున్న రూ. 11.20కోట్లకు బదులు మూడింతలు పెరుగుతుంది.
మందుగోలీలకు పైసల్లేవు
నాకు బీపీ, దమ్ము ఉన్నాయి. నెలనెలా పింఛన్ రాగానే మందుగోలీలు కొంటాను. ఈసారి ఇంకా పింఛన్‌రాలేదు. మందుగోలీలు అయిపోయి పదిరోజులు అవుతోంది. నాకు పింఛన్ వస్తదని నా కొడుకులు ఎవరూ మందుగోలీలు తేరు. గా పింఛన్ డబ్బులు ఎప్పుడొస్తయో ఏమో. పోచయ్య, వృద్ధాప్య పింఛన్‌దారుడు, జంగరాయి, చిన్నశంకరంపేట
పింఛన్ వస్తేనే పూట గడిచేది
మాది నిరేపేద కుటుంబం. నాకు పింఛన్ వస్తేనే పూట గడుస్తుంది. నెలనెలా వచ్చే పింఛన్‌తో రేషన్‌బియ్యం తెచ్చుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. ఈనెల ఇంకా పింఛన్ రాకపోవడంతో ఈనెల సరుకులు తీసుకోలేదు. త్వరగా వచ్చేలా చూడాలి. – బాల్‌రాజు, దివ్యాంగుడు పాల్వంచ, టేక్మాల్ మండలం
Comments
Please login to add a commentAdd a comment