అమరచింత తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు (ఫైల్)
వనపర్తి: పింఛన్‌పైనే ఆధారపడిన పేదలు చేతిలో డబ్బుల్లేక ఇబ్బంది పడుతున్నారు.. ఊర్లో అప్పు పుట్టక.. మందులు కొనుక్కోవడానికి కూడా చేతిలో చిల్లిగవ్వలేక పింఛన్ ఎప్పుడు వస్తుంది దేవుడా.. అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.. రోజు కార్యాలయానికి వెళ్లడం ఏమైంది సారూ.. అని అడగడం.. ఏమో అని అధికారి చెప్పే సమాధానం విని నిరాశతో తిరిగిరావడం నిత్యకృత్యమైంది.
పక్షం రోజులుగా పరేషాన్
ప్రతినెలా బ్యాంకు ఖాతాలో జమయ్యే ఆసరా పింఛన్ మే మాసం పూర్తయి పక్షం రోజులవుతున్నా రాకపోవటంతో లబ్ధిదారులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పింఛన్‌పై ఆధారపడే వృద్ధులు, వికలాంగులు, ఇతర లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు. జూన్ మాసం నుంచి పింఛన్ పెరుగుతుందని ఆశ పడిన పేదలకు మే నెల పింఛన్ కూడా రాకపోవటంతో బ్యాంకుల వద్దకు వచ్చి ఖాతాలో డబ్బులు జమ అయ్యాయా అని అడిగి తెలుసుకుంటున్నారు. ప్రతీనెలా పింఛన్ వస్తుందనే ధైర్యంతో కిరాణం, టీకొట్టు, మెడికల్ షాపుల్లో అరుపు పెట్టే అలవాటు ఉన్న వారి పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. మే నెల పింఛన్‌లు ఎందుకు రాలేదన్న ప్రశ్నలకు ఇటు అధికారులు, అటు పాలకులు సరైన సమాధానం చెప్పకపోవటంతో మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
జిల్లాలో 71,589 మంది
జిల్లాలో మొత్తం ఆసరా లబ్ధిదారులు 71,589 మంది ఉండగా వృద్ధులు 28,020, వితంతువులు 27,546, చేనేత కార్మికులు 696, గీత కార్మికులు 456, బీడీ కార్మికులు 1003 మంది ఉన్నారు. వారికి ప్రతినెల రూ. వెయ్యి, 11,277 మంది వికలాంగులకు ప్రతి నెల రూ.1500ల చొప్పున జిల్లాలో ప్రతి నెల ఆసరా పింఛన్ల రూపేన ప్రభుత్వం రూ. 8.19 కోట్లు కెటాయిస్తోంది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న 2,591 మంది ఒంటరి మహిళలకు ప్రతినెల రూ. వెయ్యి చొప్పున నెలకు రూ.26 లక్షలు ఇస్తోంది.
రెట్టింపైనట్టేనా?
ప్రస్తుతం ఆసరా పింఛన్ అందుకుంటున్న లబ్ధిదారులకు ఎన్నికల హామీ మేరకు తెలంగాణ ప్రభుత్వం 2019 జూన్ మాసం నుంచి రూ.వెయ్యి పింఛన్ తీసుకునే వారికి రూ.2016, రూ.1500 పింఛన్ అందుకునే వికలాంగులకు రూ.3016 ఇస్తామని ప్రకటించింది. కానీ ఒకనెల ముందే అసలుకే పింఛన్ ఇవ్వకపోవటంతో వృద్ధులు, వికలాంగులు ఎంపీడీఓ కార్యాలయాలకు వెళ్లి అధికారులను నిలదీసేందుకు వెనకాడటం లేదు.
అమరచింత నిరసన
గురువారం జిల్లాలోని అమరచింత మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆసరా పింఛన్ల లబ్ధిదారులు మే, జూన్ మాసం పింఛన్లు వెంటనే ఇప్పించాలని నిరసన వ్యక్తం చేశారు. వారికి కమ్యూనిస్టు పార్టీలతో పాటు పలు రాజకీయ పార్టీలు మద్దతు తెలిపారు. పింఛన్లు పెంచుతామని చెప్పి మొత్తానికి ఇవ్వకుండా ఆపేస్తే వృద్ధులు ఇబ్బందులకు గురవుతున్నారని నినదించారు. వెంటనే ప్రభుత్వం స్పందించి పెంచిన ప్రకారం ఆసరా పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment