పేదలకు ఆసరా ఏదీ!
మూడు నెలలుగా అరకొరగా పింఛన్ల చెల్లింపులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పేదలకు ఆసరా పోతోంది.. పింఛన్లతోపాటు వివిధ పథకాలకు నిధులివ్వని ప్రభుత్వ నిర్వాకం అటు పేదలను, ఇటు ఉపాధి కూలీలనేకాదు ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యోగులనూ ఇబ్బంది పెడుతోంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో చివరి మూడు నెలలు అంటే జనవరి నుంచి మార్చి వరకు ప్రభుత్వం వివిధ పథకాలకు, శాఖలకు, విభాగాలకు నిధులు విడుదల చేయకుండా నిలిపేసింది. దీంతో వివిధ పద్దులకు చేయాల్సిన చెల్లింపులు దాదాపు రూ.5,000 కోట్లకు పైగా పెండింగ్‌లో పడ్డాయి. ‘ఆసరా పింఛన్లకు డబ్బుల్లేవు.
ఆర్థిక శాఖ నిధులు విడుదల చేయలేదు. మూడు నెలలుగా పింఛన్ల పంపిణీ సరిగ్గా జరగడం లేదు. గత నెల సగం మందికి కూడా అందలేదు. ఈ సమయంలో పింఛన్ల పంపిణీ తీరును క్షేత్రస్థాయికి వెళ్లి తెలుసుకోవడం, లబ్ధిదారులను కలసి లోటుపాట్లపై సర్వే నిర్వహించడం మంచిది కాదు. క్షేత్రస్థాయికి వెళితే... ముందు పింఛన్లు ఇవ్వాలంటూ నిలదీసే పరిస్థితి ఉంది..’ అని రెండ్రోజుల కింద హైదరాబాద్‌లో జరిగిన ఒక శిక్షణ కార్యక్రమంలో జిల్లాల నుంచి వచ్చిన అధికారులు కుండబద్దలు కొట్టారు. దీంతో ఆసరా పింఛన్ల పంపిణీపై సర్వే చేయాలనుకున్న ప్రభుత్వం వెనక్కి తగ్గింది.
వాస్తవానికి ఆసరా పథకం అమలు తీరు తెన్నులపై యూనిసెఫ్ ప్రతినిధుల సాయంతో ప్రణాళికా విభాగం క్షేత్రస్థాయి సర్వే చేయాలని ఇటీవల నిర్ణయించింది. ఈ సర్వేకు సంబంధించిన నమూనాలు, మార్గదర్శకాలపై ఈనెల 18న అన్ని జిల్లాల ప్రణాళిక విభాగం అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా గ్రామీణాభివృద్ధి శాఖ ఇచ్చిన సమాచారంతో పాటు క్షేత్రస్థాయి అధికారులు వెలిబుచ్చిన వాస్తవ పరిస్థితులను తెలుసుకున్న అధికారులు బిత్తరపోయారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే ఆసరా పథకానికి నిధులు ఎందుకు నిలిపేశారనేది చర్చనీయాంశంగా మారింది.
ఉపాధి నిధులకూ గండం
గత ఆర్థిక సంవత్సరం చివర్లో దాదాపు రూ.600 కోట్ల ఉపాధి హామీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర పద్దులకు మళ్లించింది. దీంతో ఉపాధి హామీలో పనిచేసిన కూలీలకు చెల్లించాల్సిన బిల్లులకు గ్రహణం పట్టింది. కరువు పరిస్థితుల్లో ఉపాధి హామీ డబ్బులెందుకు ఆగిపోయాయని ఇటీవల స్వయంగా గవర్నర్ నరసింహన్ పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌పీ సింగ్‌ను ఆరా తీశారు కూడా. అదేరోజు హడావుడిగా ప్రభుత్వం రూ.683 కోట్లు విడుదల చేసినా బకాయిల సమస్య తీరలేదు.
అసలేం జరిగింది?
ఆసరా పథకం కింద రాష్ట్రంలో దాదాపు 35.85 లక్షల మంది పింఛన్లు అందుకుంటున్నారు. వీరికోసం ప్రతి నెలా దాదాపు రూ.394 కోట్లు అవసరం. ప్రతి ఏడాది నాలుగు నెలలకోసారి ఆర్థిక శాఖ ఈ బడ్జెట్‌ను గ్రామీణాభివృద్ధి శాఖకు విడుదల చేస్తుంది. కానీ గత ఆర్థిక సంవత్సరం చివరి మూడు నెలలు అంటే జనవరి నుంచే ప్రభుత్వం ఈ నిధులను పెండింగ్‌లో పెట్టింది. ఏదో పేరుకు బీఆర్వోలు ఇచ్చినా నిధులు మాత్రం విడుదల చేయలేదు.
దీంతో ఆసరా పింఛన్లకు కటకట మొదలైంది. రెండు నెలల పాటు పెండింగ్‌లో పెట్టిన నిధులు ఇప్పటికీ సర్దుబాటు కాలేదని... అందుకే కొన్నిచోట్ల పింఛన్లు అందలేదని అధికారులు చెబుతున్నారు. నిధులు విడుదల చేయకున్నా... గత వారంలో 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆసరాకు సరిపడే రూ.4,000 కోట్లకుపైగా నిధులకు ఆర్థిక శాఖ బీఆర్వో ఇవ్వడం గమనార్హం.
ఉస్మానియా ఉద్యోగులకు జీతాల్లేవు
ఆర్థిక శాఖ ఆంక్షలతో ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీలోనూ ఉద్యోగులకు జీతాలివ్వలేని గడ్డు పరిస్థితి నెలకొంది. ఏటా యూనివర్సిటీలో ఉద్యోగుల జీతభత్యాలకు ప్రభుత్వం రూ.231 కోట్లు విడుదల చేస్తుంది. కానీ గత మూడు నెలలకు సంబంధించి రూ.58 కోట్లను ఆర్థిక సంవత్సరం ముగిసిందనే సాకుతో ఇవ్వకుండా ఆపేసింది.
దీంతో యూజీసీ గ్రాంట్లు, పరీక్షల విభాగం నిధులను సర్దుబాటు చేసి జీతాలు చెల్లించేందుకు యూనివర్సిటీ ముప్పుతిప్పలు పడుతోంది. ఈ నెలలో ఉద్యోగులకు నికర వేతనం మాత్రమే ఇచ్చినట్లు తెలుస్తోంది. స్థూల వేతనం ఇవ్వాలంటే మరో రూ.18 కోట్లు తక్షణం మంజూరు చేయాలని అధికారులను స్వయంగా యూనివర్సిటీ రిజిస్ట్రార్ కలసి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.