Employment labor
-
కూలీ డబ్బుల కోసం జాగారం
పోస్టాఫీస్ వద్దనే నిద్రిస్తున్న ఉపాధి కూలీలు సదాశివనగర్: మండుటెండలో ఉపాధి హామీ పనులు చేసిన కూలీలు.. చేసిన పనికి కూలీ తీసుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. కూలీ డబ్బుల కోసం పొద్దస్తమానం ఎండలో నిలబడడమే కాకుండా రాత్రి వేళ పోస్టాఫీస్ వద్దనే నిద్రపోతున్నారు. ఈ తంతు నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలో జరుగుతోంది. మండలంలోని 115 గ్రూపులకు సంబంధించి ఉపాధి హామీ కూలీలకు ఇక్కడి పోస్టాఫీస్‌లోనే అందించాల్సి ఉంది. పోస్టాఫీస్‌లో ఒకటే బయోమెట్రిక్ మిషన్ ఉండడం... ఒకేసారి వందల మంది డబ్బుల కోసం వస్తుండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలోనే పోస్టాఫీస్ సిబ్బంది రోజుకు 50 మందికి మాత్రమే డబ్బులు ఇస్తామని నిబంధన పెట్టింది. ఇదేమంటే ఇష్టమున్న చెప్పుకోమని బెదిరిస్తున్నారని కూలీలు ఆరోపిస్తున్నారు. దిక్కుతోచని స్థితిలో ఉపాధి హామీ కూలీలు తమ ఖాతా పుస్తకాలను పోస్టాఫీసు ముందు వరుసలో పెట్టి.. అక్కడే రోడ్డుపై నిద్రిస్తున్నారు. వారం సంది ఇక్కడే పడుకుంటున్నా... పోస్టాఫీస్ దగ్గర్నే వారం సంది పండుకుంటున్నా. ఇంకా పైసలు ఇయ్యలేదు. ఎవళ్లూ పట్టించుకుంటలేరు. నాలుగు వారాల పైసలు రావాలే. డబ్బుల కోసం గోస పడుతున్నం. -కువైట్ బీరయ్య, ఉపాధి కూలీ, సదాశివనగర్ రోడ్డు మీదనే పడుకుంటున్నం నాలుగు రోజుల సంది పొద్దుందాక వరుసలో నిలబడ్డ, రాత్రి ఇక్కడే పడుకున్న పైసలు అస్తలేవు. నాలుగు వారాల పైసలు రావాలే. రోజు గిదే తిప్పలు పడుతున్నం. ఈ పోస్టాపీస్ దగ్గర గీ రోడ్డు మీదనే పడుకుంటున్నం. ఇట్టబోయిన చిన్న బాలయ్య, ఉపాధి కూలీ సదాశివనగర్ కూలీల మీదికి కోపానికొస్తుండ్రు.. మా పైసలు మాకు ఇయ్యమంటే ఈ పోస్టాపీస్‌లో పని చేసేటోళ్లు కూలీలను ఇష్టమొచ్చినట్లు తిడుతుండ్రు. రోజు 50 మందికే పైసలిస్తాండ్రు. మధ్యాహ్నం ఒంటి గంటకు పైసలు ఇయ్యడం చాలు జేసి 3 గంటలకు తినడానికి పోతడు. మళ్ల అయిదు గంటలకు బందు జేస్తుండ్రు. -మర్రి ఆశిరెడ్డి, కూలీ, సదాశివనగర్ -
పేదలకు ఆసరా ఏదీ!
మూడు నెలలుగా అరకొరగా పింఛన్ల చెల్లింపులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పేదలకు ఆసరా పోతోంది.. పింఛన్లతోపాటు వివిధ పథకాలకు నిధులివ్వని ప్రభుత్వ నిర్వాకం అటు పేదలను, ఇటు ఉపాధి కూలీలనేకాదు ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యోగులనూ ఇబ్బంది పెడుతోంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో చివరి మూడు నెలలు అంటే జనవరి నుంచి మార్చి వరకు ప్రభుత్వం వివిధ పథకాలకు, శాఖలకు, విభాగాలకు నిధులు విడుదల చేయకుండా నిలిపేసింది. దీంతో వివిధ పద్దులకు చేయాల్సిన చెల్లింపులు దాదాపు రూ.5,000 కోట్లకు పైగా పెండింగ్‌లో పడ్డాయి. ‘ఆసరా పింఛన్లకు డబ్బుల్లేవు. ఆర్థిక శాఖ నిధులు విడుదల చేయలేదు. మూడు నెలలుగా పింఛన్ల పంపిణీ సరిగ్గా జరగడం లేదు. గత నెల సగం మందికి కూడా అందలేదు. ఈ సమయంలో పింఛన్ల పంపిణీ తీరును క్షేత్రస్థాయికి వెళ్లి తెలుసుకోవడం, లబ్ధిదారులను కలసి లోటుపాట్లపై సర్వే నిర్వహించడం మంచిది కాదు. క్షేత్రస్థాయికి వెళితే... ముందు పింఛన్లు ఇవ్వాలంటూ నిలదీసే పరిస్థితి ఉంది..’ అని రెండ్రోజుల కింద హైదరాబాద్‌లో జరిగిన ఒక శిక్షణ కార్యక్రమంలో జిల్లాల నుంచి వచ్చిన అధికారులు కుండబద్దలు కొట్టారు. దీంతో ఆసరా పింఛన్ల పంపిణీపై సర్వే చేయాలనుకున్న ప్రభుత్వం వెనక్కి తగ్గింది. వాస్తవానికి ఆసరా పథకం అమలు తీరు తెన్నులపై యూనిసెఫ్ ప్రతినిధుల సాయంతో ప్రణాళికా విభాగం క్షేత్రస్థాయి సర్వే చేయాలని ఇటీవల నిర్ణయించింది. ఈ సర్వేకు సంబంధించిన నమూనాలు, మార్గదర్శకాలపై ఈనెల 18న అన్ని జిల్లాల ప్రణాళిక విభాగం అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా గ్రామీణాభివృద్ధి శాఖ ఇచ్చిన సమాచారంతో పాటు క్షేత్రస్థాయి అధికారులు వెలిబుచ్చిన వాస్తవ పరిస్థితులను తెలుసుకున్న అధికారులు బిత్తరపోయారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే ఆసరా పథకానికి నిధులు ఎందుకు నిలిపేశారనేది చర్చనీయాంశంగా మారింది. ఉపాధి నిధులకూ గండం గత ఆర్థిక సంవత్సరం చివర్లో దాదాపు రూ.600 కోట్ల ఉపాధి హామీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర పద్దులకు మళ్లించింది. దీంతో ఉపాధి హామీలో పనిచేసిన కూలీలకు చెల్లించాల్సిన బిల్లులకు గ్రహణం పట్టింది. కరువు పరిస్థితుల్లో ఉపాధి హామీ డబ్బులెందుకు ఆగిపోయాయని ఇటీవల స్వయంగా గవర్నర్ నరసింహన్ పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ను ఆరా తీశారు కూడా. అదేరోజు హడావుడిగా ప్రభుత్వం రూ.683 కోట్లు విడుదల చేసినా బకాయిల సమస్య తీరలేదు. అసలేం జరిగింది? ఆసరా పథకం కింద రాష్ట్రంలో దాదాపు 35.85 లక్షల మంది పింఛన్లు అందుకుంటున్నారు. వీరికోసం ప్రతి నెలా దాదాపు రూ.394 కోట్లు అవసరం. ప్రతి ఏడాది నాలుగు నెలలకోసారి ఆర్థిక శాఖ ఈ బడ్జెట్‌ను గ్రామీణాభివృద్ధి శాఖకు విడుదల చేస్తుంది. కానీ గత ఆర్థిక సంవత్సరం చివరి మూడు నెలలు అంటే జనవరి నుంచే ప్రభుత్వం ఈ నిధులను పెండింగ్‌లో పెట్టింది. ఏదో పేరుకు బీఆర్వోలు ఇచ్చినా నిధులు మాత్రం విడుదల చేయలేదు. దీంతో ఆసరా పింఛన్లకు కటకట మొదలైంది. రెండు నెలల పాటు పెండింగ్‌లో పెట్టిన నిధులు ఇప్పటికీ సర్దుబాటు కాలేదని... అందుకే కొన్నిచోట్ల పింఛన్లు అందలేదని అధికారులు చెబుతున్నారు. నిధులు విడుదల చేయకున్నా... గత వారంలో 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆసరాకు సరిపడే రూ.4,000 కోట్లకుపైగా నిధులకు ఆర్థిక శాఖ బీఆర్వో ఇవ్వడం గమనార్హం. ఉస్మానియా ఉద్యోగులకు జీతాల్లేవు ఆర్థిక శాఖ ఆంక్షలతో ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీలోనూ ఉద్యోగులకు జీతాలివ్వలేని గడ్డు పరిస్థితి నెలకొంది. ఏటా యూనివర్సిటీలో ఉద్యోగుల జీతభత్యాలకు ప్రభుత్వం రూ.231 కోట్లు విడుదల చేస్తుంది. కానీ గత మూడు నెలలకు సంబంధించి రూ.58 కోట్లను ఆర్థిక సంవత్సరం ముగిసిందనే సాకుతో ఇవ్వకుండా ఆపేసింది. దీంతో యూజీసీ గ్రాంట్లు, పరీక్షల విభాగం నిధులను సర్దుబాటు చేసి జీతాలు చెల్లించేందుకు యూనివర్సిటీ ముప్పుతిప్పలు పడుతోంది. ఈ నెలలో ఉద్యోగులకు నికర వేతనం మాత్రమే ఇచ్చినట్లు తెలుస్తోంది. స్థూల వేతనం ఇవ్వాలంటే మరో రూ.18 కోట్లు తక్షణం మంజూరు చేయాలని అధికారులను స్వయంగా యూనివర్సిటీ రిజిస్ట్రార్ కలసి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. -
ఉపాధికెళ్తే.. ఊపిరిపోయింది
► ఐచర్ వాహనం బోల్తా ► వృద్ధురాలి దుర్మరణం, మరో ఆరుగురు కూలీలకు గాయాలు ► ఎర్రగుంటపల్లి సమీపంలో ఘటన తాడిపత్రి రూరల్: ‘ఉపాధి’ వేట ఒకరి ఉసురు తీసింది. మరో ఆరుగురిని ఆస్పత్రిపాలుజేసింది. ఈ ఘటన తాడిపత్రి రూరల్ మండలంలో మంగళవారం జరిగింది. తాడిపత్రి రూరల్ మండలం ఎర్రగుంటపల్లి సమీపంలో ఐచర్ వాహనం బోల్తా పడిన ఘటనలో ఎర్రగుంటపల్లికి చెందిన పుల్లమ్మ(60) అనే ఉపాధి కూలీ మరణించగా, నరసమ్మ(55), రత్నమ్మ(58), లక్ష్మీదేవి(45), తులసి(28), మల్లేశ్వరి(25), శివప్రసాద్(30) అనే కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. ఎలా జరిగిందంటే... నర్సరీ నుంచి మొక్కలను ఐచర్ వాహనంలో వేసుకుని పెద్దవడగూరు మండలం దిమ్మగుడి పాఠశాలలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో వాహనం అదుపు తప్పి బోల్తాపడటంతో ఈ సంఘటన జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు 108కు సమాచారం అందించారు. వారొచ్చి బాధితులను తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రంగంలోకి పోలీసులు ప్రమాద సమాచారం అందిన వెంటనే తాడిపత్రి రూరల్ ఎస్ఐ నారాయణరెడ్డి సిబ్బందితో కలసి అక్కడికి చేరుకున్నారు. ఘటన ఎలా జరిగిందనే విషయంపై ఆరా తీశారు. బాధితులతో మాట్లాడారు. వారి స్టేట్మెంట్ రికార్డు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నిప్పుల కొలిమిలో తెలుగు రాష్ట్రాలు
హైదరాబాద్ తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. సూర్యతాపం ధాటికి ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. భానుడి ఉగ్రరూపానికి పలువురు అపస్మారకస్థితికి జారుకుని మృతి చెందుతున్నారు. కొద్ది రోజులుగా ఉపాధి హామీ కూలీలు మృత్యువాత పడుతున్నారు. తలమడుగు(ఆదిలాబాద్) తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి పనులకు వెళ్లిన ఇద్దరు కూలీలు ఎండ తీవ్రతకు తాళలేక ప్రాణాలొదిలారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం బరంపూర్‌లో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సీతారాం(45), దేవరావ్(50) తోటి వారితో కలిసి పొలాల్లో ఉపాధి హామీ పనులు చేసేందుకు వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో ఎండ వేడిమికి తీవ్ర అస్వస్థతకు గురైన వారిద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. ధర్మవరం(అనంతపురం) ఆంధ్ర ప్రదేశ్ లోసైతం ఎండ వేడిమికి తాళలేక ఓ ఉపాధి హామీ కూలీ ప్రాణాలు కోల్పోయాడు. అనంతపురం జిల్లా ధర్మవరం మండలం కునుటూరు గ్రామానికి చెందిన వెంకటేశ్(65) మంగళవారం ఉపాధి పనులకు వెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో ఇంటికి వచ్చిన అతడు నీరు తాగిన కొద్దిసేపటికే చనిపోయాడు. అతడికి భార్య, కూతురు ఉన్నారు. -
రూ.లక్ష దాటితే బ్రేకు!
► ఉపాధి కూలీల వేతనంపై ఆంక్షలు ► నిధులుదారి మళ్లిస్తున్న ప్రభుత్వం ► వలస వెళ్తున్న ఉపాధి కూలీలు ► పస్తుల్లో పేద కుటుంబాలు సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఉపాధి కూలీలకు వేతనాలు కరువయ్యాయి. నెల రోజుల క్రితం చేసిన పనులకు బిల్లులు రావడం లేదు. ఏదైనా సంఘానిది రూ. లక్ష కంటే బిల్లు దాటితే బ్రేకులు వేస్తున్నారు. కేవలం రూ. లక్షలోపు బిల్లులకు మాత్రమే నిధులు విడుదల చేస్తుండటం గమనార్హం. ఉపాధి పనులకు కేంద్రం నిధులు మంజూరు చేస్తోంది. అయితే ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర పనులకు దారిమళ్లిస్తోంది. ఫలితంగా జిల్లాలో రూ. 10 కోట్ల బిల్లులు పెండింగ్ పడ్డాయి. దీంతో ఉపాధి పనులకు వెళ్లేందుకు ప్రజలు జంకే పరిస్థితులు నెలకొన్నాయి. చేసిన పనులకుకూలీ డబ్బులు కూడా రాకపోవడంతో కూలీలకు గత్యంతరం లేక మరో ప్రాంతానికి వలస బాట పడుతున్నారు. ఉపాధి నిధులు దారి మళ్లింపు.. వాస్తవానికి ఉపాధి పథకం కింద కేంద్రం నిధులు విడుదల చేస్తుంది. గతంలో కూలీలకు నేరుగా కేంద్రమే వారి అకౌంట్లలో వేతనాలు జమ చేసేది. అయితే గత ఏడాది నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆయా పనులు చేపట్టేందుకు అధికారాలు కట్టబెట్టడంతో ఆ నిధులు దారి మళ్లించడానికి రాష్ట్ర ప్రభుత్వ తెరలేపింది. అసలే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీ నిధులను, నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి ఇచ్చిన నిధులను ఇప్పటికే దారిమళ్లించింది. తాజాగా ఉపాధి నిధులను కూడా అదే పద్ధతిలో దారి మళ్లించి.. ఉపాధి కూలీల పొట్టగొడుతోంది. ఉపాధి నిధులను ఇతర పనులకు వినియోగిస్తున్న ప్రభుత్వం ఆర్థిక శాఖ ద్వారా ఆ నిధుల విడుదలకు కొర్రీలు వేయిస్తోంది. అందులో భాగంగానే రూ. లక్ష దాటిన బిల్లులను నిలిపివేయాలంటూ ఆంక్షలు విధించింది. వలస బాటలో కూలీలు సరైన పనులు లేక జిల్లాలో ప్రజలు వలస బాట పడుతున్నారనుకుంటే పొరపాటే అవుతుంది. గత ఏడాది మార్చి నెలలో 30 వేల మంది కూలీలకు పనులు కల్పిస్తే.. ఈ ఏడాది ఉపాధి పథకం కింద 1.40 లక్షల మంది కూలీలు పనిచేస్తున్నారు. అయితే మరో 2 లక్షల మంది కూలీలు వలస బాట పడుతున్నారు. సకాలంలో కూలి ఇచ్చే పరిస్థితి ఉంటే మీరంతా వలస వెళ్లకుండా సొంత ఊర్లలోనే పనులు చేసుకునేవారు. అయితే చేసిన పనులకు డబ్బులు చెల్లించకుండా సర్కారు కొర్రీలు వేస్తుండటంతో కూలీలు గుంటూరు, ప్రకాశం, బెంగళూరు, ముంబై పట్టణాలకు వలస బాట పడుతున్నారు. దీంతో వారి పిల్లల చుదవులు మధ్యలోనే ఆగిపోతున్నాయి. నెలరోజులుగా పెండింగ్.. ఉపాధి నిధులతో జిల్లాలో ఫారం పాండ్లు, వాటర్ షెడ్లు ఇతర పనులు జరుగుతున్నాయి. రోజకు లక్షా 40 వేల మంది కూలీలు పనులు చేస్తున్నారు. వీరందరికీ నెలరోజులుగా వేతనాలు పెండింగ్‌లో పెట్టారు. అప్పుడిస్తాం.. ఇప్పుడిస్తామంటూ ఆశలు పెడుతున్నారు. దీంతో కూలీలు డబ్బులు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనులు చూపెట్టిన ఉపాధి సిబ్బందిపై వారు మండిపడుతున్నారు. -
అక్రమార్కులకు రూ.లక్షలు సమర్పయామీ..!
దండుకున్నోళ్లకు దండుకున్నంత.. దోచుకున్నోళ్లకు దోచుకున్నంత.. దాచుకున్నోళ్లకు దాచుకున్నంత.. దిగమింగేవాళ్లకు దిగమింగినంత.. ఆగండి.. ఆగండి.. ఈ అవకాశం ఎక్కడనుకుంటున్నారా..? అదే నండీ..! చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వంలో! పల్లె..పట్టణం..నగరం.. ఎక్కడైనా మీరు యథేచ్చగా దోచుకోవచ్చు. అర్హత మీరు తెలుగు తమ్ముళ్లు కావడమే! - కాంట్రాక్టర్లు, అటవీ అధికారుల కుమ్మక్కు - కుంటలు, కందకాలు తీసిన జేసీబీలు - ఉపాధి కూలీల నోట్లో మట్టి - రూ.30 లక్షలు హాంఫట్ గుడ్లూరు : అటవీ అధికారులు.. కాంట్రాక్టర్లు కుమ్మక్కయ్యారు. పనులు జేసీబీతో చేయించి ఉపాధి కూలీల నోట్లో మట్టికొట్టారు. అందరూ కలిసి రూ.30 లక్షలు దిగమింగేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. గుడ్లూరు మండలం మోచర్ల, పోట్లూరు, నరసాపురం, అడవిరాజుపాలెం, గుడ్లూరు గ్రామాల్లో అటవీశాఖకు భూములున్నాయి. వాటిల్లో కుంటలు, కందకాలు తీసేందుకు ఎన్ఆర్ఈజీఎస్ (ఉపాధి పథకం) కింద రూ.30 లక్షలు అటవీశాఖకు మంజూరయ్యాయి. పంచాయతీల్లో తీర్మానాలు చేయించి ఆయా గ్రామాల్లో ఉన్న ఉపాధి కూలీలతో పనులు చేయించాలి. జేసీబీలను ఎట్టి పరిస్థితుల్లో వినియోగించ కూడదు. ఇది ప్రభుత్వ నిబంధన. అటవీ అధికారులు ఎవరికీ తెలియకుండా పనులను కందుకూరుకు చెందిన కాంట్రాక్టర్ (తెలుగు తమ్ముడు)కు అప్పగించి ఉపాధి కూలీల నోట్లో మట్టి కొట్టారు. ఈ వ్యవహారానికి సంబంధించి అటవీశాఖలో కిందిస్థాయి అధికారి నుంచి ఉన్నతాధికారుల వరకూ అందరికీ చేతులు తడిసినట్లు సమాచారం. అన్నీ అక్రమాలే అటవీ అధికారుల సహకారంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించి ఒక్క చోట కూడా కూలీలతో పనులు చేయించకుండా జేసీబీల ద్వారే కుంటలు, కందకాలు తీయించారు. ఐదు గ్రామాల్లో ఐదు రోజుల్లోనే పనులు ముగించారు. నిధులు నేరుగా డ్రా చేసుకునేందుకు అధికారులు, కాంట్రాక్టర్లకు వీల్లేదు. ఉపాధి కూలీల పేరుతో ఉన్న జాబ్‌కార్డుల ఆధారంగా పోస్టాఫీసుల్లో నగదు తీసుకోవాలి. నరసాపురంలో 4 కుంటలు, కందకానికి సంబంధించి మొదటి విడత రూ.4 లక్షలు గుడ్లూరు పోస్టాఫీసులో జమయ్యాయి. ప్రశ్నించిన కూలీలు తమ అకౌంట్లలో ఉన్న నగదును మీరు ఎలా తీసుకుంటారని కూలీలు మధ్యవర్తిని ప్రశ్నించారు. నగదు తమకు ఇచ్చినట్లు పేస్లిప్పులు ఇవ్వడం ఏమటని నిలదీశారు. ఫొటోకు ఫోజు ఇవ్వగానే డబ్బులు వస్తాయా.. అని కూలీలను మధ్యవర్తి ఎద్దేవా చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. తమకు తెలియకుండానే 18 రోజులు పని చేసినట్లు తెల్ల పేపర్లుపై సంతకాలు పెట్టించుకొని మోసం చేశారని పలువురు కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుంటలు పరిశీలిస్తాం : మందారావు, డీఆర్వో కుంటలు, కందకాలను కూలీలతోనే తీయించాలని చెప్పాం. జేసీబీలతో పనులు చేయించిన సంగతి నాకు తెలియదు. కొన్ని గ్రామాల్లో నగదు ఇంకా పోస్టాఫీసుల్లో జమ కాలేదు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం. తిమ్మిని బమ్మిని చేసి.. పోస్టాఫీసులో నగదు డ్రా చేసేందుకు కాంట్రాక్టర్లు రంగంలోకి దిగారు. 15 రోజుల క్రితం గుడ్లూరులోని 6 గ్రూపులకు చెందిన ఉపాధి కూలీలను ట్రాక్టర్లో నరసాపురం అడవికి తీసుకెళ్లి ఆ కుంటల వద్ద వారు పనులు చేసినట్లు ఫొటోలు తీయించారు. 60 మంది కూలీల అకౌంట్లలో పోస్టాఫీసులో నగదు జమ చేయించారు. ఒక్కో కూలీ 18 రోజులు పని చేసినట్లు చూపి రూ.2 వేలు నుంచి రూ.6 వేలు చొప్పున కూలీల అకౌంట్లలో నగదు జమ చేయించారు. కాంట్రాక్టరు పెట్టుకొన్న మధ్యవర్తి నాలుగు రోజుల నుంచి కూలీలను పోస్టాఫీసు వద్దకు తీసుకెళ్లి వారితో వేలిముద్రలు వేయించుకొని నగదు తీసుకున్నట్లు పేస్లిప్పులు ఇవ్వడంతో కూలీలు అవాక్కయ్యారు. ఇక్కడా.. అంతే గుడ్లూరులోనే కాకుండా మోచర్లలో కూడా కందుకూరు మండలానికి చెందిన కూలీలను తీసుకొచ్చి ఫొటోలు తీసినట్లు తెలుస్తోంది. పోట్లూరులో 2, మోచర్లలో 4, నరసాపురంలో 4, అడవిరాజుపాలెంలో 2, గుడ్లూరులో 2 కుంటలు జేసీబీతో తవ్వించారు. ఒక్కో కుంటకు రూ.1.50 లక్షలు లెక్కన 14 కుంటలకు రూ. 21 లక్షలు, కందకాలకు రూ.9 లక్షలు చొప్పున నిధులు మంజూరయ్యాయి. ఇవి తవ్వినందుకు జేసీబీలకు రూ.5 నుంచి రూ.10 లక్షలకు మించి ఖర్చు కాదని అంచనా. -
మనశ్శాంతికి మళ్లీ ఎసరు..
సాక్షి, కాకినాడ : లక్షలాది సామా న్యులకు ఆధార్ గుబులు మళ్లీ మొదలైంది. అన్ని సంక్షేమ పథకాల్నీ ఆధార్‌తో అనుసంధానిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించడంతో చెప్పులరిగేలా తిరుగుతున్నా ఆధార్ నంబర్లు జనరేట్ కాని వారిని ప్రభుత్వం ఇచ్చే లబ్ధికి ఎక్కడ దూరమై పోతామోనన్న గుబులు వెన్నాడుతోంది. సంక్షేమ పథకాలకు ఆధార్‌తో లంకె పెట్టవద్దన్న సుప్రీం కోర్టు తీర్పు తమకు వర్తించదన్న రీతిలో వ్యవహరిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం అన్ని పథకాలకూ ఆధార్‌ను వర్తింప చేసేందుకు సిద్ధమవుతోంది. సెప్టెంబర్ నుంచే పథకాల్ని ఆధార్‌తో అనుసంధానించాలని ప్రయత్నిస్తోంది. జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 51,51,549 మంది ఉండగా, ఇప్పటికే 56,77,024 మంది ఆధార్ నమోదు చేసుకున్నారని, వీరిలో 50,09,356 మందికి ఆధార్ నంబర్లు కూడా జనరేట్ అయ్యాయని అధికారులు లెక్కలేస్తున్నారు. జనాభా లెక్కన చూస్తే ఇంకా 1,42,195 మందికి, ఆధార్ నమోదు లెక్కన 6,67,668 మందికి ఆధార్ నంబర్ జనరేట్ కాలేదు. పొంతనలేని ఈ లెక్కల మాటెలా ఉన్నా జిల్లాలో వివిధ సంక్షేమ పథకాల వారీ ఆధార్ సీడింగ్ పరిస్థితి ఈ విధంగా ఉంది. ఉపాధి కూలీలు... జిల్లాలో7.10 లక్షల జాబ్‌కార్డుల పరిధిలో 14.29 లక్షల మంది ఉపాధి కూలీలు ఉన్నారు. 25,987 శ్రమశక్తి సంఘాలుండగా, వాటిలో 5.12లక్షల మంది కూలీలున్నారు. 14.29 లక్షల కూలీల్లో క్రమం తప్పకుండా ఉపాధి పొందే వారు 7.46 లక్షలమంది కాగా, వీరిలో ఇప్పటి వరకు యూఐడీ నంబర్లు జనరేట్ అయిన 6.52 లక్షల మందికి మాత్రమే ఆధార్ సీడింగ్ పూర్తయింది. ఉపాధి పొందుతున్న కూలీల లెక్కన చూస్తే 87 శాతం మాత్రమే ఇప్పటి వరకు సీడింగ్ పూర్తి కాగా, మొత్తం కూలీల సంఖ్యను బట్టి ఇంకా 50 శాతం కూడా కాలేదు. గ్యాస్ కనెక్షన్లు.. జిల్లాలోని 9,14,840 గ్యాస్ కనెక్షన్లలో ఇప్పటి వరకు 8,80,894 ఆధార్‌తో అనుసంధానం కాగా, అకౌంట్ సీడింగ్ మాత్రం 8,19,839 కనెక్షన్లకు మాత్రమే పూర్తయింది. 6,53,438 హెచ్‌పీసీఎల్ కనెక్షన్లలో 6,27,065 కనెక్షన్లకు ఆధార్, 5,81,534 కనెక్షన్లకు అకౌంట్ సీడింగ్ పూర్తయింది. ఐఓసీఎల్‌లో 1,34,451 కనెక్షన్లకు 1,29,371 కనెక్షన్లకు ఆధార్, 1,18,753 కనెక్షన్లకు అకౌంట్ సీడింగ్ జరిగింది. బీపీసీఎల్‌లో 1,26,951 కనెక్షన్లకు 1,24,458 కనెక్షన్లకు ఆధార్, 1,19,552 కనెక్షన్లకు అకౌంట్ సీడింగ్ పూర్తయింది. అంటే సగటు 89 శాతం మాత్రమే అకౌంట్ సీడింగ్ పూర్తయింది. సామాజిక పింఛన్లు.. జిల్లాలో 4,62,816 పింఛనుదారులుండగా ఇప్పటి వరకు 4,11,730 మందికి మాత్రమే ఆధార్ సీడింగ్ పూర్తయింది. మరో 51,086 మందికి సీడింగ్ జరగక గత నాలుగు నెలలుగా పింఛన్ల పంపిణీ నిలిపివేశారు. రేషన్‌కార్డులు.. జిల్లాలో తెలుపు, అన్నపూర్ణ, అంత్యోదయ, రచ్చబండలకు సంబంధించి 15,20,021 కార్డులు ఉన్నాయి. వీటి పరిధిలో 44,59,716 యూనిట్లు (కుటుంబసభ్యుల సంఖ్య) ఉంటే ఇంకా 2,23,501 యూనిట్లకు సంబంధించి సీడింగ్ కాలేదు. విద్యుత్ కనెక్షన్లు.. జిల్లాలోని 14,18,318 విద్యుత్ కనెక్షన్లలో 12,26,926 గృహ వినియోగ, 1,15,375 కమర్షియల్, 9,037 పారిశ్రామిక కనెక్షన్లున్నాయి. ప్రస్తుతం ఉ న్న కనెక్షన్లకు ఆధార్ సీడింగ్ ఇంకా చేపట్టలేదు. ఇవే కాకా సాంఘిక, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్సుమెంట్ పొందే విద్యార్థులకు సంబంధించి 85 శాతానికి మించి సీడింగ్ జరగలేదు. -
‘ఉపాధి’కెళ్తే కేసులా?
సాక్షి, సంగారెడ్డి: కాంగ్రెస్, టీఆర్ఎస్ వర్గీయుల మధ్య ఆధిపత్య పోరులో ఓ గ్రామ ఉపాధి కూలీలు నలిగిపోతున్నారు. పొట్టకూటి కోసం ‘ఉపాధి’ పనులు చేసిన పాపానికి ఆ గ్రామంలో 10 మంది కూలీలు కేసులు ఎదుర్కొంటున్నారు. అధికార పార్టీ నేతల కనుసన్నుల్లో నడుచుకుంటున్న అక్కడి పోలీసులు ప్రత్యర్థి వర్గాన్ని దెబ్బతీసేందుకే కూలీలపై కేసులు నమోదు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తొగుట మండలం వెంకట్రావుపేటలో పంచాయతీ ఎన్నికలు రగిల్చిన విభేదాలు ఇంకా ఆరలేదు. సర్పంచ్‌గా పోటీ చేసి గెలుపొందిన, ఓడిపోయిన వర్గీయుల ఆధిపత్య పోరుకు దిగుతుండడంతో గ్రామంలో తరచూ వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార పార్టీ వర్గీయులు 10 రోజుల కింద వెంకట్రావుపేట-చందాపూర్ మధ్య గల ఆర్అండ్బీ రోడ్డుకు అడ్డంగా మట్టిని పోసి మూసివేశారు. దీంతో టీఆర్ఎస్ మద్దతు గెలిచిన సర్పంచ్ వర్గీయులు మట్టిని తొలగించి మార్గాన్ని పునరుద్ధరించారు. మళ్లీ అధికార పార్టీ వర్గీయులు రోడ్డుకు అడ్డంగా సిమెంటు పైపులు వేసి మూసివేసే ప్రయత్నం చేయగా.. ప్రత్యర్థి వర్గీయులు పోలీసుల సహాయంతో తొలగించారు. ఈ వివాదం చినికి చినికి గాలి వానలా మారి ఉపాధి కూలీలపై కేసుల నమోదుకు దారితీసింది. గ్రామ పరిధిలో గల మల్లన్న గుట్ట చుట్టూ మట్టి రోడ్డు నిర్మాణానికి ఉపాధి హామీ కింద ఇటీవల రూ.7.34 లక్షల వ్యయంతో పనులు మంజూరయ్యా యి. ఈ నెల 16న దాదాపు 50 మంది కూలీలు ఈ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించగా కొంతమంది గ్రామస్థులు అడ్డుకుని తమ భూముల్లో రోడ్డు వేస్తున్నారని ఆరోపించడంతో పనులు నిలిపివేశారు. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ వర్గీయులు ఇచ్చిన ఫిర్యాదుపై తొగుట పోలీసులు అదే రోజు వివిధ సెక్షన్ల కింద 11 మందిపై కేసులు నమోదయ్యాయి. వీరిలో 10 మంది ఉపాధి కూలీలే ఉన్నారు. పొట్ట కూటి కోసం పనులు చేయడానికి వచ్చి కేసుల్లో చిక్కుకున్నారు. వాళ్లు ఉపాధి కూలీలే.. మల్లన్న గుట్ట చుట్టూ రోడ్డు నిర్మించాలని గ్రామ సభ ద్వారా చాలా కాలం కిందే తీర్మానం చేశారని తొగుట ఏపీఓ శైలజ తెలిపారు. పని ప్రారంభించిన తర్వాత కొందరు రైతులు అడ్డుకుని తమ భూముల్లో రోడ్డు వేస్తున్నారని ఆరోపించారన్నారు. తహశీల్దార్ సర్వే జరుపుతామని చెప్పారన్నారు. అందులో కొందరి పట్టా భూమి కూడా ఉన్నట్లు చెబుతున్నారని చెప్పారు. అదే విధంగా కేసు ఎదుర్కొంటున్న 10 మంది ఉపాధి కూలీ లే. ఉపాధి హామీ కింద పనిచేయడానికి వచ్చినవాళ్లేనని శైలజ తెలిపారు. పట్టా భూమిలో రోడ్డు వేసినందుకే కేసు: తమ భూముల్లో దౌర్జన్యంగా రోడ్డు వేశారని రైతులు ఫిర్యాదు చేయడంతో కేసు పెట్టాం. తహశీల్దార్ పంచనామా నిర్వహించి పట్టా భూమిగా ధ్రువీకరించారు. వెంకట్రావుపేట సర్పంచ్ కుమారుడు రాంరెడ్డి తన అనుచరులతో కలిసి గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండానే రోడ్డు వేశారు. జాబ్ కార్డులు అందరికీ ఇచ్చారు. వీటిని చూపించుకుని నిందితులు ఉపాధి కూలీలుగా చెప్పుకుంటున్నారు. - రమేశ్‌బాబు, తొగుట సీఐ