రూ.లక్ష దాటితే బ్రేకు!
► ఉపాధి కూలీల వేతనంపై ఆంక్షలు
► నిధులుదారి మళ్లిస్తున్న ప్రభుత్వం
► వలస వెళ్తున్న ఉపాధి కూలీలు
► పస్తుల్లో పేద కుటుంబాలు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఉపాధి కూలీలకు వేతనాలు కరువయ్యాయి. నెల రోజుల క్రితం చేసిన పనులకు బిల్లులు రావడం లేదు. ఏదైనా సంఘానిది రూ. లక్ష కంటే బిల్లు దాటితే బ్రేకులు వేస్తున్నారు. కేవలం రూ. లక్షలోపు బిల్లులకు మాత్రమే నిధులు విడుదల చేస్తుండటం గమనార్హం. ఉపాధి పనులకు కేంద్రం నిధులు మంజూరు చేస్తోంది. అయితే ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర పనులకు దారిమళ్లిస్తోంది. ఫలితంగా జిల్లాలో రూ. 10 కోట్ల బిల్లులు పెండింగ్ పడ్డాయి. దీంతో ఉపాధి పనులకు వెళ్లేందుకు ప్రజలు జంకే పరిస్థితులు నెలకొన్నాయి. చేసిన పనులకుకూలీ డబ్బులు కూడా రాకపోవడంతో కూలీలకు గత్యంతరం లేక మరో ప్రాంతానికి వలస బాట పడుతున్నారు.
ఉపాధి నిధులు దారి మళ్లింపు..
వాస్తవానికి ఉపాధి పథకం కింద కేంద్రం నిధులు విడుదల చేస్తుంది. గతంలో కూలీలకు నేరుగా కేంద్రమే వారి అకౌంట్లలో వేతనాలు జమ చేసేది. అయితే గత ఏడాది నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆయా పనులు చేపట్టేందుకు అధికారాలు కట్టబెట్టడంతో ఆ నిధులు దారి మళ్లించడానికి రాష్ట్ర ప్రభుత్వ తెరలేపింది. అసలే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీ నిధులను, నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి ఇచ్చిన నిధులను ఇప్పటికే దారిమళ్లించింది.
తాజాగా ఉపాధి నిధులను కూడా అదే పద్ధతిలో దారి మళ్లించి.. ఉపాధి కూలీల పొట్టగొడుతోంది. ఉపాధి నిధులను ఇతర పనులకు వినియోగిస్తున్న ప్రభుత్వం ఆర్థిక శాఖ ద్వారా ఆ నిధుల విడుదలకు కొర్రీలు వేయిస్తోంది. అందులో భాగంగానే రూ. లక్ష దాటిన బిల్లులను నిలిపివేయాలంటూ ఆంక్షలు విధించింది.
వలస బాటలో కూలీలు
సరైన పనులు లేక జిల్లాలో ప్రజలు వలస బాట పడుతున్నారనుకుంటే పొరపాటే అవుతుంది. గత ఏడాది మార్చి నెలలో 30 వేల మంది కూలీలకు పనులు కల్పిస్తే.. ఈ ఏడాది ఉపాధి పథకం కింద 1.40 లక్షల మంది కూలీలు పనిచేస్తున్నారు. అయితే మరో 2 లక్షల మంది కూలీలు వలస బాట పడుతున్నారు. సకాలంలో కూలి ఇచ్చే పరిస్థితి ఉంటే మీరంతా వలస వెళ్లకుండా సొంత ఊర్లలోనే పనులు చేసుకునేవారు. అయితే చేసిన పనులకు డబ్బులు చెల్లించకుండా సర్కారు కొర్రీలు వేస్తుండటంతో కూలీలు గుంటూరు, ప్రకాశం, బెంగళూరు, ముంబై పట్టణాలకు వలస బాట పడుతున్నారు. దీంతో వారి పిల్లల చుదవులు మధ్యలోనే ఆగిపోతున్నాయి.
నెలరోజులుగా పెండింగ్..
ఉపాధి నిధులతో జిల్లాలో ఫారం పాండ్లు, వాటర్ షెడ్లు ఇతర పనులు జరుగుతున్నాయి. రోజకు లక్షా 40 వేల మంది కూలీలు పనులు చేస్తున్నారు. వీరందరికీ నెలరోజులుగా వేతనాలు పెండింగ్‌లో పెట్టారు. అప్పుడిస్తాం.. ఇప్పుడిస్తామంటూ ఆశలు పెడుతున్నారు. దీంతో కూలీలు డబ్బులు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనులు చూపెట్టిన ఉపాధి సిబ్బందిపై వారు మండిపడుతున్నారు.