కేంద్రం కంట్రోల్‌లో ‘ఉపాధి’ | Payment of bills for any work under the Employment Guarantee Scheme will be made directly from the Centre | Sakshi
Sakshi News home page

కేంద్రం కంట్రోల్‌లో ‘ఉపాధి’

Published Mon, Dec 30 2024 4:29 AM | Last Updated on Mon, Dec 30 2024 4:29 AM

Payment of bills for any work under the Employment Guarantee Scheme will be made directly from the Centre

రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం పనుల మంజూరు, పర్యవేక్షణకే పరిమితం 

ఉపాధి హామీ పథకం కింద ఏ పనికి బిల్లుల చెల్లింపైనా నేరుగా కేంద్రం నుంచే 

ఇప్పటిదాకా కూలీలకు మాత్రమే నేరుగా వేతనాలు చెల్లిస్తున్న కేంద్రం 

మెటీరియల్‌ కేటగిరీ నిధులు రాష్ట్రాల ద్వారానే చెల్లింపు 

ఇకపై అన్నీ కేంద్రం ద్వారానే.. ఏడు రాష్ట్రాల్లో పైలెట్‌ ప్రాజెక్టుకు శ్రీకారం 

రాష్ట్రాల వాటా డబ్బులు ఎప్పటికప్పుడు ఉమ్మడి ఖాతాల్లో జమ చేయాల్సిందే 

సాక్షి, అమరావతి: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలును ఇకపై పూర్తిగా తన చేతుల్లోకి తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఏ రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం కింద పనులు జరిగినా వాటికి సంబంధించిన అన్ని రకాల చెల్లింపులను నేరుగా కేంద్రమే ఆయా వ్యక్తులకు, సంస్థలకు చెల్లించే ప్రక్రియకు శ్రీకారం చుడుతోంది. తొలుత ఏడు రాష్ట్రాల్లో పైలెట్‌ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేయాలని నిర్ణయించింది. నూతన విధానం అమలులోకి వస్తే ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపులో ఇక రాష్ట్రాల పాత్ర నామమాత్రం కానుంది.

రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం పనుల మంజూరు, పర్యవేక్షణకే పరిమితం కావాల్సి ఉంటుంది. ఉపాధి హామీ చట్టం నిబంధనల ప్రకారం పథకం అమలుకు రాష్ట్రాలు చేసే ఖర్చులో కనీసం 60 శాతం (ఏడాదిలో రూ.వంద కోట్లు ఖర్చు చేస్తే అందులో కనీసం రూ.60 కోట్లు) కూలీలకు వేతనాల రూపంలో చెల్లించేందుకు వ్యయం చేయాల్సి ఉంటుంది. 

ఉపాధి హామీ కింద రాష్ట్రం వాటాగా చెల్లించాల్సిన నిధులను ఎప్పుటికప్పుడు ఉమ్మడి ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. కూలీల వేతనాలు, మెటీరియల్‌ నిధులను రెండు వేర్వేరు కేటగిరీలుగా వర్గీకరించి 2006లో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.   

మెటీరియల్‌ కేటగిరీ నిధులు కూడా..
ఉపాధి హామీ పథకం కింద ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు దారి మళ్లించడంతోపాటు పలుచోట్ల అవినీతి చోటు చేసుకుంటోందన్న ఆరోపణల నేపథ్యంలో ఏడేళ్ల కిందట 2017–18లో కూలీలకు చెల్లించాల్సిన వేతనాలను వారి బ్యాంకు ఖాతాలకు కేంద్రమే నేరుగా చెల్లించే విధానాన్ని అమలులోకి తెచ్చింది. 

రాష్ట్రాల వారీగా కూలీల ద్వారా జరిగిన పనులకు అయ్యే మొత్తంలో గరిష్టంగా 40 శాతం మెటీరియల్‌ నిధులను కేంద్రం రాష్ట్రాలకు విడుదల చేస్తూ వస్తోంది. ఆయా నిధులతో రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామాల్లో వివిధ రకాల అభివృద్ధి  పనులు చేపడుతున్నాయి. ఇక మీదట మెటీరియల్‌ కేటగిరీ నిధులను కూడా రాష్ట్రాలకు ఇవ్వకుండా కేంద్రమే నేరుగా చెల్లించే విధానాన్ని తీసుకురానుంది.  

ఈ ఆర్థిక సంవత్సరం నుంచే  
ఈ ఆర్థిక సంవత్సరం నుంచే తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, రాజస్థాన్, చత్తీస్‌గడ్, జార్ఖండ్, అసోం రాష్ట్రాల్లో పైలెట్‌ ప్రాజెక్టుగా మెటీరియల్‌ కేటగిరీ నిధులను సైతం కేంద్రమే నేరుగా ఆయా వ్యక్తులు, సంస్థలకు చెల్లించే విధానాన్ని అమలు చేయనుంది. 

తొలుత మన రాష్ట్రంలో కూడా పైలెట్‌ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ భావించినా అనంతరం తొలగించినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. నూతన విధానానికి సంబంధించి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పది రోజుల క్రితమే రాష్ట్రాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించింది.  

రాష్ట్రం వాటా కూడాఉమ్మడి ఖాతాలో జమ! 
మెటీరియల్‌ కేటగిరీ నిధులను కూడా నేరుగా కేంద్రమే ఆయా వ్యక్తులు, సంస్థలకు చెల్లించే ప్రక్రియ మొదలైతే రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటాగా ఇవ్వాల్సిన 25 శాతం నిధులను ఉమ్మడి ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏటా దాదాపు రూ.90 వేల కోట్ల నుంచి రూ.లక్ష కోట్ల దాకా ఉపాధి హామీ పథకం కింద పనులు జరుగుతుండగా, మన రాష్ట్రంలో ఏటా రూ.9 వేల కోట్ల నుంచి రూ.10 వేల కోట్ల విలువైన పనులు నమోదవుతున్నాయి. 

ఇందులో దేశవ్యాప్తంగా మెటీరియల్‌ కేటగిరీ నిధుల వాటా ఏటా రూ.30 వేల కోట్ల దాకా ఉండగా, మన రాష్ట్రంలో దాదాపు రూ.ఐదు వేల కోట్ల దాకా మెటీరియల్‌ కేటగిరీ నిధులు ఉంటాయి. కేంద్రం కొత్త విధానాన్ని అమల్లోకి తెస్తే మన రాష్ట్రం ఏటా సుమారు రూ.1,250 కోట్ల వరకు ఎప్పటికప్పుడు ఉపాధి హామీ పథకం ఉమ్మడి ఖాతాకు నిధులు జమ చేయాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement