employment scheme
-
కష్ట జీవుల కడుపు కొట్టారు!
పలమనేరు: కడుపుకాలే కష్ట జీవులపై కూటమి ప్రభుత్వం కక్షగట్టింది. ఉపాధిహామీ కూలీ పనుల్లోనూ పక్షపాతం చూపిస్తోంది. ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఓటేశారన్న కారణంతో పనులివ్వకుండా ఉపాధి అధికారులే వేధిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో జాబ్‌కార్డున్న కూలీలను కూడా పక్కన బెట్టారు. అయ్యా మాకు ఉపాధి పనులు కల్పించండి అంటూ వేలాది మంది కూలీలు మండల స్థాయి అధికారుల నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు బతిమలాడినా పనులు ఇవ్వడం లేదు. మరోవైపు చిత్తూరు జిల్లా పలమనేరు రెవెన్యూ డివిజన్లో సగానికిపైగా ఉపాధి ఫీల్ట్ అసిస్టెంట్లను విధుల నుంచి తొలిగించారు. తాము తప్పు చేయకున్నా విధుల్లో నుంచి ఎందుకు తొలగించారని, మా జీవనోపాధిని దెబ్బతీయవద్దని ఫీల్డ్ అసిస్టెంట్లు విన్నవించినా అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో తమకు న్యాయం కావాలంటూ పలువురు ఫీల్డ్ అసిస్టెంట్లు, జాబ్‌కార్డులున్న కూలీలు కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. విన్నవించినా ఫలితం లేదు ఉపాధి పనులు చేసుకునే తమకు రాజకీయాలతో సంబంధం లేదని, జాబ్‌కార్డులున్న తమకు పని కల్పించాలంటూ కూలీలు ఇప్పటికే మండల స్థాయి అధికారుల నుంచి జిల్లా కలెక్టర్ దాకా వినతిపత్రాలిచ్చారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిరసనలు చేసినా వారికి ఉపాధి పనులు కల్పించలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయా ప్రాంతాల నేతల హెచ్చరికలతో ఈజీఎస్ ఏపీవోలు, ఏపీడీలు నడుచుకుంటున్నారు. దీంతో జాబ్‌కార్డున్న కూలీలకు పనులు లేకుండా పోయాయి. ఈ విషయమై కుప్పం ఏపీడీని వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన స్పందించలేదు. బైరెడ్డిపల్లి ఏపీవో హరినాథ్ మాట్లాడుతూ.. తాము స్వతంత్రంగా ఏమీ చేసేందుకు వీలు కాదన్నారు. 60 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఔట్పలమనేరు, పుంగనూరు నియోజకవర్గాల పరిధిలో 132 మంది ఉపాధి పనుల ఫీల్డ్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహించేవారు. వీరిలో 60 మందికి పైగా ఫీల్డ్ అసిస్టెంట్లను కూటమి ప్రభుత్వం రాగానే విధుల నుంచి తొలగించింది. కూటమి నేతల ఆదేశాలతో కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండానే వారిని తొలగించేశారు. వారి స్థానంలో అధికారపా ర్టీకి అనుకూలమైన వారిని పెట్టుకున్నారు. వీరు ఉపాధి పనుల్లో జేసీబీలు పెట్టి పనులు చేసి, బినామీ కూలీల పేరిట బిల్లులు చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. వీరికి సంబంధిత ఏపీవోల సాయం ఉందని సమాచారం.30 వేల మంది కూలీలకు పనులు ఇవ్వని వైనంపలమనేరు రెవెన్యూ డివిజన్లో పుంగనూరు, కుప్పం క్లస్టర్ లైవ్లీహుడ్ రిసోర్స్ సెంటర్ (సీఎల్ఆర్సీ)లు ఉన్నాయి. పుంగనూరు క్లస్టర్లో పుంగనూరు, పెద్దపంజాణి, పలమనేరు, గంగవరం, చౌడేపల్లి, బంగారుపాళెం మండలాలున్నాయి. కుప్పం క్లస్టర్లో కుప్పం, గుడుపల్లి, శాంతిపురం, రామకుప్పం, వి కోట, బైరెడ్డిపల్లి మండలాలున్నాయి. ఈ రెండు క్లస్టర్లలో మొత్తం 132 పంచాయతీలకు కలిపి ఉపాధి జాబ్‌కార్డులు మొత్తం 216,603 మందికి ఉన్నాయి. ఇందులో ప్రస్తుతం 70,630 మంది పనులు చేస్తున్నారు. ప్రస్తుతం ఈజీఎస్‌లో ఫాంపడ్స్, ఫిష్ పాండ్స్, ఫీడర్ ఛానెల్స్, హార్టీకల్చర్ ప్లాంటేషన్స్, క్యాటిల్ పాండ్స్, రోడ్డు పనులు, ట్రెంచిలు, చెక్‌డ్యాం పనులు జరుగుతున్నాయి. అయితే గత ప్రభుత్వంలో పనులు చేసిన 30 వేల మంది దాకా ఉపాధి కూలీలకు ఇప్పటి ప్రభుత్వంలో పనులు ఇవ్వలేదు. దీంతో పనుల్లేక ఉపాధి కరువై కుటుంబ జీవనానికి ఇబ్బందిగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో వీరంతా వైఎస్సార్సీపీకి సానుభూతిపరులుగా ఉన్నారనే అక్కసుతో ఆయా మండలాల కూటమి నేతల సిఫారసులతో సంబంధిత ఏపీవోలు వీరికి ఉపాధి పనులు ఇవ్వకుండా వారి కడుపు కొడుతున్నారు.ఉపాధి పనులు ఇవ్వరంట.. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మాకు ఉపాధి పనులు ఇవ్వలేదు. ఏమిసార్ అని అడిగితే మీరంతా వైఎస్సార్సీపీకి ఓటేశారంటగా అంటున్నారు. మాకు రాజకీయాలు ఏంటికి సార్. కూలి పనులు చేసుకొని బతికేటోళ్లం. రెండునెలలుగా పనులు లేక ఖాళీగా ఉన్నాం. ఎక్కడ ఏ పనిచి్చనా కష్టపడి చేసుకుంటాం. అధికారులకు చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదు. – ఓ.నాగప్ప, ఉపాధి కూలి, బైరెడ్డిపల్లి, చిత్తూరు జిల్లాపనులివ్వకపోవడం న్యాయమేనా? ఉపాధి పనులకు చేసుకుంటూ మా కుటుంబానికి అండగా ఉంటున్నా. ఈ మధ్య మాకు పనులివ్వడం లేదు. మాలాంటి కూలీలకు రాజకీయాలకు ఏంటి సంబంధం. మేము కష్టపడి కూలి పనిచేస్తేనే కదా డబ్బులు వచ్చేది. అలాంటిది మాకు పనులివ్వకుంటే ఎలా.. ఇది న్యాయమేనా? నాయకులు మాట కాదుగానీ అధికారులైనా ఆలోచించాల. – రాజేష్, ఉపాధి కూలి, బైరెడ్డిపల్లి, చిత్తూరు జిల్లా నిష్కారణంగా విధుల్లోంచి తొలగించేశారు నేను ఫీల్డ్ అసిస్టెంట్‌గా మా పంచాయతీలో పనిచేస్తున్నా. కూటమి ప్రభుత్వం రాగానే నిష్కారణంగా నన్ను విధులనుంచి తీసేశారు. ఇదేంటి సార్ అంటే కూటమి నేతలు నిన్ను తీసేయమన్నారు ఏమన్నా ఉంటే వారితో మాట్లాడుకోమని చెబుతున్నారు. ఇదేమి న్యాయం. – సుబ్రమణ్యం, ఫీల్డ్ అసిస్టెంట్, జీసీపల్లి, బైరెడ్డిపల్లి మండలం, చిత్తూరు జిల్లా -
అక్రమంగా తొలగిస్తున్నారు
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఉపాధి హామీ పథకం అమలుకు క్షేత్రస్థాయిలో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్లను రెండు నెలలుగా రాజకీయ కారణాలతో రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా తొలగిస్తోందంటూ ఫీల్డ్ అసిసెంట్లు ఆందోళన వ్యక్తం చేశారు. రెండు నెలలుగా 2,360 మందిని తొలగించినట్లు తెలిపారు. వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలంటూ రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు శుక్రవారం తాడేపల్లిలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడుగంటల వరకు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఏపీ గ్రామీణ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ల యూనియన్ గౌరవాధ్యక్షుడు కె.ఉమామహేశ్వరరావు, అధ్యక్షుడు ఎం.పరంధామయ్య, ప్రధాన కార్యదర్శి బి.నరసింహులు, కోశాధికారి ఖాదర్‌బాషా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 2,360 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను ప్రభుత్వం తొలగించిందని చెప్పారు. 17 సంవత్సరాలుగా కేవలం గౌరవ వేతనంతో పనిచేస్తున్నవారిని అక్రమంగా తొలగిస్తున్నారని పేర్కొన్నారు. అన్ని జిల్లాల్లో ఇంకా అనేకమందిని తొలగించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు చెప్పారు. అక్రమ తొలగింపులు, రాజకీయ బెదిరింపుల కారణంగా రాష్ట్రంలో నలుగురు ఫీల్డ్ అసిస్టెంట్లు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. తమ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు తీసుకోదని, ఉద్యోగాల నుంచి తొలగించదని సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ చెబుతున్నా.. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లపై రాజకీయ బెదిరింపులు, అక్రమ తొలగింపులు కొనసాగడం విచారకరమని చెప్పారు. అక్రమంగా తొలగించిన వారందరినీ ప్రభుత్వం వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయ బెదిరింపులతో ఆత్మహత్య చేసుకున్న నలుగురి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని, ఆ కుటుంబాల్లో వారికి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగభద్రత కల్పించడంతో పాటు కనీస వేతనం రూ.20 వేలకు పెంచాలని వారు కోరారు.డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళతా: డైరెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్న ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ల ప్రతినిధులు కొందరిని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ కృష్ణతేజ తన చాంబర్‌కు పిలిపించుకుని మాట్లాడారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రతినిధులు తమ సమస్యలకు సంబంధించిన వినతిపత్రాన్ని ఆయనకు అందజేశారు. ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ల అక్రమ తొలగింపులపై డ్వామా పీడీలతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించి వివరాలు తెప్పించుకుంటానని కృష్ణతేజ హామీ ఇచ్చారని ఏపీ గ్రామీణ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ల యూనియన్ ప్రధాన కార్యదర్శి బి.నరసింహులు తెలిపారు.ఫీల్డ్ అసిస్టెంట్లు తెలిపిన వివరాలను ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్, శాఖ ప్రధాన కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు చేపడతామన్నారని చెప్పారు. ఈ ఆందోళనలో శ్రామిక మహిళా కన్వీనర్ కె.ధనలక్ష్మి, ఏపీ గ్రామీణ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ల యూనియన్ రాష్ట్ర నాయకులు వీరే‹Ùగౌడ్, మహే‹Ù, రవినాయక్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఉపాధి’ బడ్జెట్ 21.50 కోట్ల పనిదినాలకు పెంపు
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదన మేరకు 2024–25 ఆర్థి క సంవత్సరానికి గాను మహాత్మా గాంధీ జాయతీ గ్రామీణ ఉపాధి హామీ పథకం లేబర్ బడ్జెట్‌ను 21.50 కోట్ల పని దినాలకు పెంచడానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అంగీకరించిందని డిప్యూటీ సీఎం కె.పవన్‌కళ్యాణ్ ఒక మంగళవారం ప్రకటనలో తెలిపారు. పెరిగిన పని దినాల వల్ల ఉపాధి హామీ పథకంలో పని చేసే 54 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని పేర్కొన్నారు. కూలీలకు చెల్లించాల్సిన బకాయిల సత్వర విడుదలకు కేంద్రం సమ్మతించిందని ఆయన తెలిపారు. యూఎస్ కాన్సుల్ జనరల్ భేటీ కాగా.. పవన్‌కళ్యాణ్‌తో యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ మంగళవారం భేటీ అయ్యారు. మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకునే నైపుణ్యం గల యువత రాష్ట్రంలో ఉందని, వారి ప్రతిభకు తగిన అవకాశాలు అందించడంతోపాటు ఉన్నత విద్యకు అమెరికా వెళ్లేవారికి తగిన సహకారం, మార్గనిర్దేశం చేయాలని పవన్‌కళ్యాణ్ ఈ సందర్భంగా కోరినట్టు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. జెన్నిఫర్ లార్సన్ను పవన్ కల్యాణ్ సన్మానించారు. -
ఉపాధికి ‘హాని’!
సాక్షి, అమరావతి: కరోనా విపత్తు వేళ 2020–21లో గ్రామాల్లో కొత్తగా ఉపాధి హామీ జాబ్ కార్డుల జారీతో పాటు పనుల కల్పనలోనూ మన రాష్ట్రం దేశంలోనే ముందంజలో నిలిచింది. మహమ్మారి విరుచుకుపడ్డ వేళ దిక్కు తోచక పట్టణాలకు పట్టణాలే గ్రామాలకు తరలి వచ్చినా నిశ్చింతగా జీవనోపాధి లభించింది! విపత్తులోనూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మందగించకుండా పనులు కల్పిస్తూ, పథకాన్ని సద్వి నియోగం చేసుకుంటూ గత ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంది. ఇక వ్యవసాయ పనులు ఉండని వేసవి సీజన్లో పేదలకు ఉపాధి హామీ పనులు కల్పించి ఆదుకోవటంలో గత ఐదేళ్లూ ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలోనే కొనసాగింది. ఏటా ఉపాధి పొందిన కుటుంబాలు, లబ్ధి చేకూర్చిన మొత్తం పెరగడమే ఇందుకు నిదర్శనం. నిరుపేదల కడుపు నింపిన ఉపాధిహామీలో ఇప్పుడు రాజకీయాలు చొరబడ్డాయి. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో పెత్తనం కోసం టీడీపీ నేతలు రాజకీయ రంగు పులమడంతో పేదల ‘ఉపాధి’కి గండి పడింది. ఎన్నికల ఫలితాలు వెలువడ్డ మర్నాడే అత్యధిక గ్రామాల్లో ప్రస్తుతం పనిచేస్తున్న ఫీల్డ్ అసిసెంట్లను తప్పించాలని అధికారులపై ఒత్తిళ్లు తెచ్చారు. దీంతో మండల అ«ధికారులు వారితో పనులు చేయించలేక గ్రామాల్లో మొత్తం ఉపాధి పనులనే నిలిపివేశారు. అధికారిక గణాంకాలే దీనికి సాక్ష్యం. టీడీపీ నేతల నిర్వాకాలతో రాష్ట్రంలో సగానికి పైగా గ్రామాల్లో ఉపాధి హామీ పథకం పనులు నిలిచిపోయాయి. మరోవైపు డబ్బులు వసూలు చేసుకుంటూ తమకు నచ్చిన వారిని ఫీల్డ్ అసిస్టెంట్లగా నియమించుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఉపాధి హామీ పనుల తాజా వివరాలు ఎప్పటికప్పుడు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ వెబ్ పోర్టల్‌లో నమోదవుతాయి. రాష్ట్రవ్యాప్తంగా 13,387 గ్రామ పంచాయతీలు ఉండగా అధికారిక గణాంకాల ప్రకారమే 6,788 పంచాయతీల్లో ఈనెల 26వతేదీకి ముందు వారం రోజుల పాటు కనీసం ఒక్కరికి కూడా పనులు కల్పించకపోవడం గమనార్హం. ఈనెల 26వ తేదీన మాత్రం కేవలం 4,565 గ్రామ పంచాయతీల్లో మాత్రమే ఉపాధి హామీ పథకం పనులు కొనసాగినట్లు అధికారిక వివరాలు వెల్లడిస్తున్నాయి. అంటే రాష్ట్రంలో మూడింట రెండొంతుల గ్రామాల్లో పేదలకు ఉపాధి పనులే లేకుండా పోయాయి. సహాయకులు.. నిస్సహాయంగా గ్రామాల్లో ఉపాధి హామీ పనులు కోరే వారి వివరాలు నమోదు చేసుకోవడం, ఆయా చోట్ల ముందుగా అనుమతించిన పనులను కూలీలకు కేటాయించడం, పనులు చేసిన వారి వివరాలను మండల కంప్యూటర్ సెంటర్లో అందజేయడం ఫీల్డ్ అసిస్టెంట్ల ప్రధాన విధి. సాధారణంగా ప్రతి గ్రామ పంచాయతీలో ఒకరు చొప్పున ఫీల్డ్ అసిస్టెంట్లు ఉంటారు. ఫిక్స్డ్ టెన్యూర్ ఎంప్లాయి (ఎఫ్‌టీఈ) విధానంలో ఫీల్డ్ అసిసెంట్లకు రూ.10 వేలకు పైబడి, మిగిలిన వారికి రూ.7,500 నుంచి రూ.10 వేల మధ్య నెల వారీ వేతనాలను ప్రభుత్వం చెల్లిస్తుంది. వీరంతా ప్రస్తుతం గ్రామాల్లో అధికార పార్టీ నాయకుల అధిపత్య ఆరాటంతో నిస్సహాయంగా మారారు. పొలం పనులు లేక.. ఉపాధి దొరకక ఉపాధి హామీ పథకం ప్రధాన లక్ష్యం గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు దొరకని సమయంలో పేదలు వలస వెళ్లకుండా ఉపాధి పనులు కల్పించి ఆదుకోవడం. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయ పనులు ఇంకా జోరందుకోలేదు. వర్షాలు కురుస్తున్నప్పటికీ జలాశయాల్లో నీటి నిల్వలు అతి తక్కువగా ఉన్న నేపథ్యంలో పొలం పనులు అత్యధిక ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు. ప్రత్యేకించి ఉపాధి హామీ పనులకు ఎక్కువ డిమాండ్ ఉండే రాయలసీమతో పాటు ప్రకాశం, పల్నాడు తదితర జిల్లాల్లో వ్యవసాయ పనులు మందకొడిగా జరుగుతుండటంతో నిరుపేదలు ఉపాధి కోసం తీవ్ర అవస్థలు పడుతున్నారు. వలస వెళ్లాల్సి వస్తుందేమో.. గ్రామంలో నేను, నా భార్య, ఇద్దరు కుమారులు ఉపాధి పనులు చేసుకునేవాళ్లం. కొద్ది రోజులుగా ఉపాధి పనులు బంద్ చేశారు. వర్షాలు సరిగా పడక పోవడంతో గ్రామంలో వ్యవసాయ పనులు కూడా దొరకడం లేదు. గ్రామంలో పనులు కల్పిస్తే చేసుకుంటాం. లేకపోతే గ్రామం వదిలి ఇతర పట్టణాలకు పనుల కోసం వలస వెళ్లాల్సి వస్తుంది. – దావిద్, చిర్తనకల్లు, కోసిగి మండలం, కర్నూలు జిల్లాపేదల కడుపు కొట్టొద్దు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వ చి్చన వెంటనే మా గ్రామంలో ఉపాధి హామీ పథకానికి రాజకీయ గ్రహణం పట్టింది. టీడీపీ నాయకులు ప్రస్తుతం ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్‌ను తొలగించాలనే ఉద్దేశంతో గ్రామంలో పనులు ఆపేశారు. పనులు కల్పించాలని కోరుతున్నా, అధికారులు పట్టించుకోవడం లేదు. రాజకీయ ప్రయోజనాలు, ధన ప్రయోజనాల కోసం మాలాంటి పేదల కడుపులు కొట్టడం మంచి కాదు. – నల్లపనేని ప్రసాద్, ఏపినాపి, కలిగిరి మండలం, నెల్లూరు జిల్లాపనుల్లేక ఇబ్బందులు కొద్ది రోజులుగా ఉపాధి పనులు నిలిపేశారు. నేను ప్రతి ఏడాది ఉపాధి పనులకు వెళ్లేవాడిని. ఈ ఏడాది కూడా మొదట్లో పనికి వెళ్లాను. ఇప్పుడు పనులు నిలిపి వేయడం వల్ల అందరికీ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉపాధి పనుల వల్ల వచ్చే డబ్బు ద్వారానే జీవనం సాగిస్తున్న మాలాంటోళ్లకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. – సిహెచ్.శ్రీరాం, పెదవేమలి గ్రామం, గంట్యాడ మండలం, విజయనగరం జిల్లా నాలుగు వారాల కూలి రావాలి నేను, నా భార్య ఇద్దరం ఉపాధి పనికి వెళ్లేవాళ్లం. జూన్ నెల నుంచి పనులు జరగడం లేదు. నాలుగు వారాలకు సంబంధించిన ఉపాధి కూలి డబ్బులు రావాల్సి ఉంది. ఆ డబ్బులు రాకపోవడంతో కష్టంగా ఉంది. అధికారులు స్పందించి ఉపాధి పనులు కల్పిస్తే మా కుటుంబానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. – షేక్.ఇమామ్, కంభం, ప్రకాశం జిల్లా -
‘ఉపాధి’ నిధులను సద్వినియోగం చేసుకోవాలి
సాక్షి, అమరావతి: ఉపాధి హామీ పథకం నిధులను సద్వినియోగం చేసుకోవాలని.. ఇందులో భాగంగా గ్రామాల్లో పకడ్బందీగా సోషల్ ఆడిట్ చేపట్టాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ ఆదేశించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సోషల్ ఆడిట్ విభాగం అధికారులతో పవన్‌కళ్యాణ్ గురువారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఉపాధి హామీ పథకం సోషల్ ఆడిట్ జరిగే తీరును, పనుల పురోగతి, నిధులు దుర్వినియోగానికి సంబంధించిన కేసుల వివరాలను అధికారులు పవన్‌కు తెలిపారు. పవన్ మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకం నిధులను సద్వినియోగం చేసుకుంటేనే సత్ఫలితాలు వస్తాయన్నారు.ఈ విషయంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. సోషల్ ఆడిట్ పక్కాగా జరగాలని.. గ్రామాల్లో ప్రొటోకాల్‌ను అనుసరించి సోషల్ ఆడిట్ సభలు నిర్వహించాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం నిధులు దుర్వినియోగం కాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. చిన్నారుల్లో సైన్స్ పట్ల అవగాహన పెంచాలిగ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారులకు సైన్స్ పట్ల ఆసక్తిని పెంచే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను పవన్ కల్యాణ్ ఆదేశించారు. గురువారం విజయవాడలో సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖపై జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. వైజ్ఞానిక ప్రదర్శనలు గ్రామ స్థాయి నుంచి నిర్వహించాలన్నారు. రాజమండ్రి ఎస్ఆర్ఎస్సీ ప్రాంతీయ వైజ్ఞానిక కేంద్రం ప్రారంభానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని అధికారులు పవన్‌కు తెలియజేయగా.. త్వరలో ప్రజలకు అందుబాటులోకి తెద్దామని పవన్ అన్నారు. కాగా, తనకు కేటాయించిన శాఖలపై వరుసగా సమీక్షలు నిర్వహించిన పవన్.. అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించడంతో పాటు రక్షిత మంచి నీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. తుపాన్ల నుంచి తీరాన్ని రక్షించే మడ అడవులపై చర్చించారు. -
ఉపాధి కూలీలకూ ‘ఆధార్’ ఆధారిత హాజరు
సాక్షి, అమరావతి: ఉపాధి హామీ పథకంలో బోగస్ కూలీల నమోదును అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరే ఉపాధి కూలీలకూ ఆధార్ ఆధారిత ముఖ గుర్తింపు హాజరు ప్రక్రియను ప్రవేశపెట్ట్టనుంది. ఫీల్డ్‌అసిస్టెంట్ల వద్ద ఉండే మొబైల్ ఫోన్లోని యాప్ ద్వారా కూలీల హాజరును ఈ విధానంలోనే నమోదు చేస్తారు. కేంద్రం ప్రస్తుతం ఈ విధానాన్ని తప్పనిసరి చేయకుండా.. ఇప్పుడు అమల్లో ఉన్న విధానానికి అదనంగా డిసెంబర్ 4 నుంచి అన్ని రాష్ట్రాల్లో ఈ ప్రక్రియను ప్రారంభించనుంది. పనులు కోరిన వారి వివరాలను ఫీల్డ్ అసిస్టెంట్ సేకరించి, వారికి పని కేటాయించే ఒక్క రోజు ముందు వారికి ఎక్కడ, ఎన్ని రోజులు పని కేటాయించారన్న వివరాలను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ రూపొందించిన ఎన్ఎంఎంఎస్ యాప్‌లో నమోదు చేస్తారు. ఆ పని జరిగినన్ని రోజులూ ముందుగా నమోదు చేసిన కూలీల్లో రోజూ ఎవరెవరు పనికి వచ్చారో పని జరిగే ప్రదేశంలోనే యాప్‌లో వారి పేర్ల వద్ద హాజరైనట్టు టిక్ చేస్తారు. అంతేకాదు, కూలీలు పనిచేస్తున్నప్పుడు ఒక ఫొటో తీసి దానిని కూడా ఆ యాప్‌లో అప్లోడ్ చేస్తున్నారు. అయితే, ఆ ఫొటోలో పనిచేస్తున్న కూలీలు ఎవరన్నది వారి ముఖాలు స్పష్టంగా కనిపించినా, కనిపించకపోయినా.. కూలీల సంఖ్య మాత్రం స్పష్టంగా తెలిసేలా ఫొటోను అప్లోడ్ చేసేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే, కొత్త విధానంలో కూలీల హాజరును ఫీల్డ్ అసిస్టెంట్ మొబైల్ యాప్‌లో టిక్ రూపంలో నమోదు చేసే బదులు.. ఆ కూలీ ముఖాన్ని ఫొటో తీస్తారు. ఆ వ్యక్తికి సంబంధించిన ఆధార్‌లో నమోదైన ఫొటోతో ఈ ఫొటో సరిపోలాకే హాజరు పడేలా మొబైల్ యాప్‌లో సాఫ్ట్‌వేర్‌ను ఆధునికీకరించనున్నారు. ఇకపై అలా వీలుపడదు.. జియో కోఆర్డినేట్ల(ఆ ప్రాంత వివరాలకు సంబంధిచిన శాటిలైట్ ద్వారా నిర్దేశించిన కొలతలు)ను ఆ పనికి అనుమతి తెలిపే సమయంలో పని ప్రదేశంలోనే ఇప్పటి వరకు నమోదు చేస్తున్నారు. కొత్త విధానంలో పని ప్రాంతంలోనే ఫీల్డ్ అసిస్టెంట్లు ఆయా కూలీల ఆధార్ ఆధారిత ముఖ గుర్తింపు హాజరును యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. జియో కోఆర్డినేట్లు నమోదు చేసిన ప్రాంతంలో కాకుండా వేరొక ప్రాంతంలో హాజరు నమోదుకు ప్రయత్నించినా వీలుపడదు. ప్రస్తుతానికి రెండు విధానాల్లోనూనమోదుకు అవకాశం ఆధార్ ఆధారిత కూలీల ముఖ గుర్తింపు హాజరు ప్రక్రియకు సంబంధించి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ జాయింట్ సెక్రటరీ అమిత్ కటారియా ఇటీవల అన్ని రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పటిదాకా కూలీల హాజరు నమోదు ప్రక్రియకు అనుసరించే విధానానికి అదనంగా డిసెంబర్ 4 నుంచి యాప్ ద్వారా కూలీల ఆధార్ ఆధారిత ముఖ గుర్తింపు హాజరు నమోదు చేసేలా ఆధునికీకరించిన ఎన్ఎంఎంఎస్ యాప్ అందుబాటులోకి తెస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతానికి రెండు ప్రక్రియల్లో హాజరు నమోదుకు వీలున్నా.. రానున్న రోజుల్లో ఆధార్ ఆధారిత ముఖ గుర్తింపు హాజరు నమోదుకే ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్రాలకు సూచించారు. -
వేసవిలో ‘ఉపాధి’కి కసరత్తు
సాక్షి, అమరావతి: పేదలకు వచ్చే వేసవిలో కూడా సొంత ఊళ్లలోనే పెద్ద ఎత్తున పనులు కల్పి0చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉపాధి హామీ పథకం కింద కొత్త పనులను గుర్తించే ప్రక్రియను చేపట్టింది. 2024–25 ఆర్థి క సంవత్సరానికి సంబంధించిన ఉపాధి హామీ పథకం లేబర్ బడ్జెట్‌పై అన్ని గ్రామాల్లో కసరత్తు మొదలైంది. గత మూడేళ్లుగా గ్రామాల వారీగా ఉపాధి పథకం పనులకు వచ్చిన డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకొని.. వచ్చే ఆరి్థక సంవత్సరంలో ఎంత మందికి ఈ పథకం ద్వారా పనులు కల్పి0చాలన్న అంచనాలను సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఈ ప్రక్రియ సజావుగా పూర్తి చేసేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ సూర్యకుమారి ఇప్పటికే కలెక్టర్లతో పాటు డ్వామా పీడీలకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల్లో అక్టోబర్ 2 నుంచి ఈ ప్రక్రియ మొదలయ్యింది. గతంలో చేపట్టి ఇప్పటికీ పూర్తి కాని పనులను 20వ తేదీకల్లా ఉపాధి హామీ పథకం సిబ్బంది సందర్శించి సమీక్షిస్తారు. నవంబర్ 10కల్లా గ్రామాల్లో అదనంగా చేపట్టే కొత్త పనులను గుర్తిస్తారు. నవంబర్ 15కల్లా ఆయా గ్రామాల్లో ఎంత మందికి ఎన్ని పనిదినాలు కల్పించాలన్న వివరాలతో లేబర్ బడ్జెట్‌ను రూపొందించి సంబంధిత వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 మధ్య.. కొత్తగా గుర్తించిన పనులకు సంబంధించి గ్రామ సభలో చర్చించి అనుమతి తీసుకుంటారు. అవసరమైతే మండల, జిల్లా స్థాయిలో కూడా అనుమతులు తీసుకునే ప్రక్రియను చేపడతారు. 2024–25 ఆరి్థక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా ఎంత మందికి పనులు కల్పి0చాలనే వివరాలను గుర్తించి.. అందుకు అవసరమయ్యే పనులకు కలెక్టర్ల ద్వారా అనుమతి తీసుకునే ప్రక్రియను డిసెంబర్ నెలాఖరుకు పూర్తి చేస్తారు. గ్రామాల వారీగా తయారు చేసిన ఈ అంచనాలతో రాష్ట్ర స్థాయిలో ఉపాధి హామీ పథకం లేబర్ బడ్జెట్‌ను రూపొందించి.. దానిని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అనుమతికి పంపిస్తామని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు. కాగా, కొత్త పనుల గుర్తింపులో కనీసం 60 శాతం వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల పనులకు ప్రాధాన్యత ఉంటుందని అధికారులు తెలిపారు. గ్రామాల వారీగా కమిటీలు.. 2024–25 ఆరి్థక ఏడాదికి సంబంధించిన లేబర్ బడ్జెట్ అంచనాల తయారీ, కొత్త పనుల గుర్తింపు కోసం గ్రామాల స్థాయిలో ఉపాధి హామీ పథకం టెక్నికల్ అసిస్టెంట్ల ఆధ్వర్యంలో కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గ్రామ సచివాలయాల్లో పనిచేసే ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, విలేజ్ సర్వేయర్లు, వ్యవసాయ, ఉద్యానవన, సెరీకల్చర్ అసిస్టెంట్లు, గ్రామ వలంటీర్లు, పొదుపు సంఘాల గ్రామ స్థాయి లీడర్లు, ఉపాధి హామీ పథకం ఫీల్డు అసిస్టెంట్లను ఈ కమిటీల్లో సభ్యులుగా నియమించారు. మండల స్థాయి అధికారులు ఈ గ్రామ కమిటీలకు తగిన సహకారం అందజేస్తారు. -
రైతుల చూపు..పండ్లతోటల వైపు
పీలేరు రూరల్ : సన్న, చిన్నకారు రైతులకు ఆదాయ మార్గాలను సమకూర్చడం... జీవనోపాధులకు భద్రత కల్పించడం.. ఉత్పాదక ఆస్తులను పెంపొందిండం.. కరువుపీడత ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షన, శాశ్వత ప్రాతిపదిక భూ అభివృద్ధి, భూసార రక్షణ లక్ష్యంతో ప్రభుత్వం తీసుకొచ్చిన పండ్ల తోటల పెంపకం అన్నమయ్య జిల్లాలో లక్ష్యాన్ని అధిగమించింది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి గానూ మహత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా 2735 మంది రైతులకు లబ్ధి కలిగింది. జిల్లాలో 5050 ఎకరాల్లో పండ్ల తోటల పెంపకం లక్ష్యం కాగా 5266 ఎకరాల్లో సాగు చేసి లక్ష్యాన్ని అధిగమించినట్లు డ్వామా పీడీ ఎంసీ మద్దిలేటి తెలిపారు. లబ్ధిదారులు ఇప్పటికే 85 శాతం మొక్కలు నాటడం పూర్తయిందని, వర్షాలు కురిస్తే వందశాతం పూర్తి చేస్తామని చెప్పారు. ప్రభుత్వం ద్వారా సహకారం... ఎంపిక చేసిన రైతులకు పండ్లతోటల పెంపకం, 3 సంవత్సరాల వరకు వంద శాతం నిర్వహణ వ్యయం ప్రభుత్వం చెల్లిస్తుంది. భూమి దున్నేందుకు, గుంతలు తీసేందుకు, ముళ్ల కంచెల ఏర్పాటుకు, సేంద్రియ, రసాయన ఎరువులు, సస్యరక్షణ మందులకు, పాదుల్లో కలుపు తీసేందుకు, అంతర్‌పంటలకు, 30 శాతం డ్రిప్ పరికరాల ఏర్పాటుకు, మామిడి తోటల పెంపకానికి ఏడాదికి 20 పర్యాయములు నీరు పోయుటకు బిల్లులు మంజూరు అవుతాయి. పండ్ల తోటల పెంపకానికి ఎకరాకు నిర్వహణ ఖర్చు... మామిడికి రూ. 10,31,193, చీని రూ. 1,07,459, నిమ్మ రూ. 1,41,515, జామ రూ. 1,27,451, తైవాన్ జామ, రూ. 2,26,783, సపోట రూ. 90,027, కొబ్బరి రూ. 90,610, సీతాఫలం రూ. 59,217, సీతాఫలం (బ్లాక్) రూ. 1,82,840, దానిమ్మ రూ. 2,44,819, నేరేడు రూ. 41,292, చింత రూ. 66,500, ఆపిల్రేగు రూ. 1,08,338, 5 లేయర్స్ బహళ పంట రూ. 1,64,863, డ్రాగన్ ఫ్రూట్ రూ. 1,84,533, గులాబీ పూల తోట రూ. 10,795, మల్లెపూట తోట రూ. రూ. 10,295 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోంది. 85 శాతం మొక్కలు నాటడం పూర్తి... ఈ ఆర్థిక సంవత్సర పండ్ల తోటల పెంపకంలో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు 85 శాతం మొక్కలు నాటడం పూర్తి చేశాం. వర్షాభావ పరిస్థితులతో ఇంకా కొన్ని ప్రాంతాల్లో పూర్తి కాలేదు. వర్షాలు కురిస్తే వందశాతం పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. లబ్ధిదారులకు బిల్లులు పెండింగ్ లేకుండా చెల్లించడం జరుగుతోంది. – ఎం.సి. మద్దిలేటి, డ్వామా పీడీ. వందశాతం రాయితీ లభిస్తోంది... ఉపాధి హామీ పథకంలో 16 రకాల పండ్ల తోటలు సాగు చేసుకోవడానికి రైతులకు వందశాతం రాయితీ లభిస్తోంది. వివిధ రకాల పండ్ల తోటల తోపాటు పూల తోటలు పెంపకాన్ని ప్రోత్సహిస్తూ సకాలంలో బిల్లులు ఇస్తున్నాం. అంతర్‌పంటలకు కూడా బిల్లులు ఇవ్వడం జరుగుతోంది. గట్లపై టేకు, ఎర్రచందనం లాంటి మొక్కలు నాటుకోవడానికి బిల్లులు మంజూరవుతున్నాయి. – ఎస్. మధుబాబు, ఏపీడీ, కలికిరి ఉపాధి హామీతో ఎంతో ప్రయోజనం... ఉపాధి హామీ పథకంతో ఎంతో ప్రయోజనం పొందాం. ఆర్థిక స్థోమత లేక నాకున్న పొలం మొత్తం ఖాళీగా పెట్టుకున్నాం. అయితే ఉపాధి హామీ పథకంతో నా రెండు ఎకరాల్లో 150 మామిడి మొక్కలు నాటా. అందుకు సంబంధించి బిల్లులు మొత్తం నా ఖాతాకు జమ అయ్యాయి. చాలా సంతోషంగా ఉంది. – బి.డి. సిద్ధారెడ్డి, రైతు రామిరెడ్డిగారిపల్లె, పీలేరు మండలం. బిల్లులు చెల్లించారు ఉపాధి హామీ పథకంలో పండ్ల తోటలు సాగు చేసుకోవడానికి బిల్లులు అందించడం తోపాటు అధికారులు సలహాలు కూడా ఇస్తున్నారు. రెండు ఎకరాల పొలంలో మామిడి మొక్కలు నాటా. ఇప్పటి వరకు బిల్లులు పెండింగ్ లేకుండా చెల్లించారు. మా లాంటి పేద వారికి ప్రభుత్వం ఎంతో మేలు చేసింది. – జి. శ్రీధర్‌నాయుడు, భయ్యారెడ్డిగారిపల్లె, పీలేరు మంలం. -
‘ఉపాధి’తో పేదలకు అండగా ప్రభుత్వం
సాక్షి, అమరావతి: ఈ సీజన్లో వర్షాభావ పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో వ్యవసాయ పనులు ఆలస్యమయ్యాయి. దీంతో పనులు దొరక్క ఇబ్బందులు పడుతున్న పేదలకు ప్రభుత్వం ఉపాధి హామీ పథకంతో అండగా నిలిచింది. అవసరమున్న ప్రతి చోటా పెద్ద ఎత్తున పనులు చేపట్టింది. పని అడిగిన ప్రతి ఒక్కరికీ వారి సొంత ఊళ్లలోనే పనులు కల్పించింది. ఇలా ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి సెపె్టంబరు 4వ తేదీ మధ్య కేవలం ఐదు నెలల్లోనే 19.93 కోట్ల పనిదినాలు కల్పించింది. వ్యవసాయ పనులే దొరకని ఈ ఐదు నెలల్లో 43.48 లక్షల కుటుంబాలు సొంత గ్రామాల్లో ఉపాధి హామీ పనులు చేసుకొని రూ. 4,660.53 కోట్ల మేర లబ్ధి పొందాయి. ఈ పథకం కింద కూలీలకు రోజుకు సరాసరిన రూ. 247.46 చొప్పున ప్రభుత్వం చెల్లించింది. గ్రామాల్లో వ్యవసాయ పనులు లేని సమయంలో పేదలకు పనుల కల్పనలో గత నాలుగేళ్లుగా మన రాష్ట్రమే దేశంలో మొదటి స్థానంలో ఉంది. ఈ ఏడాది కూడా మండు వేసవి కారణంగా సాధారణంగా గ్రామాల్లో ఎక్కడా వ్యవసాయ పనులే ఉండని మే నెలలో ప్రభుత్వం రోజుకు సరాసరిన 28.73 లక్షల మంది పేదలకు పనులు కల్పించింది. సాధారణంగా గ్రామాల్లో వ్యవసాయ పనులు మొదలయ్యాక ఏటా జూలై, ఆగస్టు నెలల్లో ఉపాధి హామీ పనులకు పెద్దగా డిమాండ్ ఉండదు. అయితే, ఈ ఏడాది నాగార్జున సాగర్ పరిధిలో ఇంకా నీటి విడుదల చేయకపోవడం, రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు తక్కువగా ఉండటంతో ఈ ఏడాది ప్రభుత్వం ప్రత్యేకంగా ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. గ్రామాల్లో పనులు చేసుకొనేందుకు ముందుకొచ్చినా ప్రతి ఒక్కరికీ లేదు అనకుండా జూలై, ఆగస్టు నెలల్లోనూ ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పించింది. జూలై నెలలో సరాసరిన రోజుకు 8.57 లక్షల మంది, ఆగస్టులో రోజుకు సరాసరిన 2.23 లక్షల మంది ఉపాధి హామీ పథకం పనులకు హాజరైనట్టు అధికారులు చెప్పారు. పని కావాలని అడిగిన వారికి సొంత గ్రామాల్లోనే పనులిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే 12.49 లక్షల పనులు గుర్తించి, సిద్ధం చేసి ఉంచినట్టు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో వ్యవసాయ పనులు ఊపందుకొన్నాయి. అందువల్ల పది రోజులుగా ఉపాధి హామీ పనులకు డిమాండ్ తగ్గిందని అధికారులు తెలిపారు. ఈ నెల 1 నుంచి 4వ తేదీ మధ్య ఆదివారం పోను మిగతా మూడు రోజుల్లో 10,376 మంది మాత్రమే ‘ఉపాధి’ పనులకు వచ్చినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ గణాంకాలు వెల్లడించాయి. -
ఏబీపీఎస్‌కు మారితేనే ఉపాధి కూలి జమ
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఉపాధిహామీ చట్టం కింద ఉపాధి పొందాలంటే తప్పనిసరిగా ఆధార్ ఆధారిత చెల్లింపు బ్రిడ్జి సిస్ట మ్ (ఏబీపీఎస్)కు మారాల్సిందే. గతంలో మూడునాలుగు పర్యాయాలు ఈ డెడ్‌లైన్ మారినా, ఇకపై ఎలాంటి పొడిగింపులు ఉండవని కేంద్ర ప్రభుత్వవర్గాలు స్పష్టం చేస్తు న్నట్టు తెలుస్తోంది. ఆగస్టు 31వ తేదీ వరకే బ్యాంక్ ఖాతా ఆధారిత, ఆధార్ ఆధారిత పద్ధతుల్లో పేమెంట్స్ చేస్తారు. ఇకపై ఆధార్–ఎనెబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (ఏఈపీఎస్) కాకుండా, సెపె్టంబర్ 1వ తేదీ నుంచి ఏబీపీఎస్ అనుసరిస్తున్నారనే విషయాన్ని గమనించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ♦ ఈ కొత్త విధానంలో భాగంగా ఉపాధి హామీ జాబ్‌కార్డ్ హోల్డర్, తన జాబ్కార్డ్ను బ్యాంక్ ఖాతా, ఆధార్‌తో అనుసంధానం చేయడంతో పాటు దీనిని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) మ్యాపర్‌తో తప్పనిసరిగా కనెక్ట్ చేయాలి. ♦ ఆధార్‌తో బ్యాంక్ అకౌంట్ సీడింగ్, ఎన్పీసీఐ మ్యాపర్‌లో మ్యాపింగ్ చేయడానికి ఖాతాదారు కేవైసీ వివరాలు, బయోమెట్రిక్, స్థానికత, ఆధార్ డేటా బేస్–బ్యాంక్ ఖాతాల్లోని వివరాల్లో తేడాలు లేకుండా చూసుకోవడం వంటివి చేయాల్సి ఉంటుంది. ♦ ఉపాధిహామీ జాబ్‌కార్డు సమాచారంలో తేడాలున్నా వేజ్ పేమెంట్ అనేది స్తంభిస్తుంది. ♦ ఉపాధి కూలీలు బ్యాంక్ ఖాతాలను తరచుగా మార్చడం, దానిని ప్రోగ్రామ్ ఆఫీసర్లు అప్డేట్ చేయకపోవడం, తదితర కారణాల నేపథ్యంలో లబ్దిదారులకు నష్టం జరగకుండా ఏబీపీఎస్ అత్యుత్తమ ప్రత్యామ్నాయమని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ స్పష్టం చేసింది. ♦క్షేత్రస్థాయిలో వివిధ జిల్లాల్లో జాబ్‌కార్డును బ్యాంక్ ఖాతా, ఆధార్‌తో అనుసంధానం చేయడంలో సిబ్బందికి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి అధికారులు చెబుతున్నారు. ఈ డెడ్‌లైన్ మరికొంతకాలం పొడిగిస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని సూచిస్తున్నారు. లిబ్టెక్ నివేదికలో ఏముందంటే... ♦కేంద్ర ప్రభుత్వం సాంకేతిక అంశాలకు ప్రాధాన్యం ఇచ్చి ఉపాధిహామీ చట్టం ఆశయాలు, లక్ష్యాలను నీరుగారుస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ♦ రాష్ట్రంలోని మొత్తం కోటీ ఐదు లక్షల మంది (ఇన్ యాక్టివ్ వర్కర్లతో సహా) ఉపాధి కూలీల్లో 42 లక్షల మంది ఏబీపీఎస్‌కి అనర్హులుగా ఉండిపోయారు. ♦ పనిచేస్తున్న 61 లక్షల కూలీల్లో (యాక్టివ్ వర్కర్స్) 5.33 లక్షల మంది ఏబీపీఎస్‌కి అర్హత సాధించలేకపోయారు. ♦ నరేగా పోర్టల్ నుంచి సమాచారాన్ని విశ్లే షించిన లిబ్టెక్ ఇండియా సంస్థ తన ని వేదికలో ఈ విషయాలను వెల్లడించింది. పేమెంట్ మిస్ కాకుండా ప్రభుత్వాలే బాధ్యత వహించాలి యాక్టివ్ వర్కర్స్ కేటగిరీలో ఏబీపీఎస్ అర్హత విషయంలో మొత్తం కార్మికుల సంఖ్యను పరిగణనలోకి తీసుకున్నపుడు గణనీయమైన సంఖ్యలో కార్మికులు దీనికి అర్హత సాధించలేదని అర్థమవుతుంది. దీంతో వారు ఉపాధి హామీ కింద పని పొందడానికి అనర్హులుగా చేస్తుంది. ఇది ఉపాధి చట్టం సూత్రాలకు స్పష్టమైన ఉల్లంఘనే. అంతేకాకుండా, గత 18 నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా నికరంగా తొలగించిన దాదాపు 4 లక్షల మంది కార్మికులను ఏబీపీఎస్ అర్హత గణాంకాలు పరిగణనలోకి తీసుకోలేదు. తెలంగాణలో ఏ ఒక్క కార్మికుడు కూడా ఏబీపీఎస్ కారణంగా ఉపాధి హామీ చట్టం కింద పని, పేమెంట్ మిస్ కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. – చక్రధర్ బుద్దా,డైరెక్టర్, లిబ్టెక్ ఇండియా సంస్థ -
గిరిజనులకు అదనపు ‘ఉపాధి’
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 1.10 లక్షల గిరిజన కుటుంబాలకు ప్రతియేటా రూ.151 కోట్ల మేర అదనపు ‘ఉపాధి’ చేకూర్చేందుకు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నిబంధనల ప్రకారం అర్హత ఉన్న ఆయా కుటుంబాలన్నింటినీ ఉపాధి హామీ పథకంలో ఏటా 150 రోజుల చొప్పున పనులు పొందే వారి జాబితాలో చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నెలరోజులపాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది. ఉపాధి హామీ చట్టం ప్రకారం.. సాధారణ కుటుంబాలకు ఏటా గరిష్టంగా వంద రోజుల చొప్పున పనులు కల్పిస్తున్నప్పటికీ, అటవీ భూహక్కు పట్టాదారులకు కుటుంబానికి ఏటా 150 రోజులు పనులు కల్పించే వెసులుబాటు ఉంది. దీంతో.. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా ఆర్ఓఎఫ్ఆర్ లబ్దిదారులు మొత్తం 1,82,316 కుటుంబాలు ఉండగా.. నెలరోజుల క్రితం వరకు ఈ సంఖ్య 72,646 కుటుంబాలు మాత్రమే 150 రోజుల పనిదినాలు పొందేందుకు అర్హత ఉన్న జాబితాల్లో పేర్లు నమోదు చేసుకున్నాయి. నెలరోజులపాటు ప్రత్యేక డ్రైవ్.. ఈ నేపథ్యంలో.. అర్హత ఉన్న మిగిలిన కుటుంబాలను కూడా ఈ పరిధిలోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఒకటో తేదీ నుంచి నెలాఖరు వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా.. ఆయా గిరిజన గ్రామాల్లో పనిచేసే ఉపాధి హామీ పథకం ఫీల్డు అసిస్టెంట్లే తమ పరిధిలోని ఆయా అర్హులను గుర్తించి, వారి వివరాలను మండల కేంద్రంలో అప్డేట్ చేస్తారు. గత 15 రోజులుగా ఫీల్డ్ అసిస్టెంట్లే ఆయా లబ్ది దారుల ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. ఇలా ఇప్పటివరకు 54,424 కుటుంబాలను కొత్తగా 150 రోజుల పనిదినాలు పొందేందుకు అర్హుల జాబితాలోకి తీసుకొచ్చారు. ఇంకా 55,246 కుటుంబాలను ఈ పరిధిలోకి తీసుకురావాల్సి ఉందని.. ఈ నెలాఖరుకల్లా అర్హులందరినీ ఈ పరిధిలోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వివరించారు. ఇక ప్రస్తుతం గరిష్టంగా ఏటా వంద రోజుల చొప్పున ఉపాధి హామీ పథకం పనులు పొందుతున్న ఆయా కుటుంబాలు అదనంగా 50 రోజుల ఉపాధి పొందితే ఒక్కో పనిదినానికి గరిష్టంగా రూ.272 చొప్పున రూ.13,600ల వరకు అదనపు ప్రయోజనం చేకూరుతుంది. -
రోజూ 35 లక్షల మందికి ‘ఉపాధి’
సాక్షి, అమరావతి: వ్యవసాయపనులు ఉండని ఈ వేసవి రోజుల్లోను గ్రామీణ ప్రాంతాల్లో పేదలు పనుల కోసం పట్టణాలకో, నగరాలకో వలస పోవాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం ఉపాధిహామీ పథకం ద్వారా సొంత ఊళ్లలోనే పనులు కల్పిస్తోంది. ఇప్పుడు రోజూ 30 లక్షల నుంచి 35 లక్షల మంది ఈ పనులకు హాజరవుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ ఒకటోతేదీ నుంచి జూన్ పదోతేదీ వరకు గత 70 రోజుల్లో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 37.59 లక్షల పేద కుటుంబాలు ఈ పనులు చేసుకుని రూ.2,952.66 కోట్ల మేర లబ్ధిపొందినట్లు రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ అదికారులు వెల్లడించారు. శనివారం (ఈ నెల పదోతేదీ) కూడా 35.70 లక్షల మంది సొంత ఊళ్లలోనే ఈ పనులు చేసుకుని లబ్ది పొందారు. మరోవైపు ఈ పనులకు హాజరయ్యేవారికి ఒక్కొక్కరికి రోజుకు సరాసరిన రూ.245 చొప్పున గిట్టుబాటు అవుతోందని, పనులకు హాజరయ్యేవారిలో 60 శాతం వరకు మహిళలే ఉంటున్నారని అధికారులు తెలిపారు. వేసవి ఎండలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఉపాధి పనులకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య విరామం కల్పించింది. ఎండతీవ్రత తక్కువగా ఉండే ఉదయం, సాయంత్రం వేళల్లోనే ఈ పనులు చేయిస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ అన్ని జిల్లాల డ్వామాల పీడీలతో ప్రతి గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఈ వేసవిలో పేదలకు పనుల కల్పన కార్యక్రమాన్ని సమీక్షిస్తున్నారు. 11.62 లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు లబ్ధి ఈ వేసవిలో ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 37.59 లక్షల గ్రామీణ ప్రాంత కుటుంబాలు ఉపాధిహామీ పథకం పనులు చేసుకుని లబ్ది పొందినట్లు అధికారులు తెలిపారు. వీటిలో 8,36,826 ఎస్సీ కుటుంబాలు, 3,25,204 ఎస్టీ కుటుంబాలు (మొత్తం 11,62,030 ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు) ప్రయోజనం పొందినట్లు చెప్పారు. 12.06 కోట్ల పనిదినాలు గత నాలుగు సంవత్సరాల మాదిరే.. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు ఉండని వేసవి కాలంలోను ఉపాధిహామీ పథకం ద్వారా పేదలకు పనుల కల్పనలో ఈ ఏడాది కూడ మన రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి ఈ వేసవిలో ఇప్పటివరకు 73.52 కోట్ల పనిదినాల పాటు పేదలకు పనులు కల్పించారు. అందులో ఆరోవంతు (16 శాతానికి పైగా) మేర 12.06 కోట్ల పనిదినాల పాటు పేదలకు పనులు కల్పించిన మన రాష్ట్రం ఈ పథకం కింద పనుల కల్పనలో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. రెండోస్థానంలో ఉన్న తమిళనాడు 8.37 కోట్ల పనిదినాల పాటు పేదలకు పనులు కల్పించింది. -
‘ఉపాధి’లో మళ్లీ ఏపీనే టాప్
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు దాదాపు పూర్తిగా ఆగిపోయే వేసవి కాలంలో పేదలకు ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ ఈ ఏడాది కూడా మొదటి స్థానంలో నిలిచింది. పనులు దొరకక పేదలు నగరాలకు వలస పోయే దుస్థితి లేకుండా సొంత ఊళ్లలోనే వారికి పనులు కలి్పంచడంలో ఏపీ ఏటా ముందుంటోంది. ప్రత్యేకించి వేసవి రోజుల్లో ఉపాధి పనుల కల్పనలో గత నాలుగేళ్లగా మన రాష్ట్రమే దేశంలో తొలి స్థానంలో నిలుస్తోంది. ఈ వేసవిలో కూడా ఏప్రిల్ 1 నుంచి శనివారం (మే 20) వరకు 6.83 కోట్ల పనిదినాల పాటు రాష్ట్ర ప్రభుత్వం పనులు కల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 99 శాతం గ్రామ పంచాయతీలు అంటే.. 13,132 గ్రామ పంచాయతీల్లో కేవలం 50 రోజుల్లోనే మొత్తం 31.70 లక్షల కుటుంబాలకు పని దొరికింది. ప్రభుత్వం కల్పించిన పనులతో ఈ కుటుంబాలు రూ.1,657.58 కోట్ల మేర లబ్ధి పొందడం విశేషం. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిక వెబ్సైట్ ప్రకారం.. దేశంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో నిలిచిన తమిళనాడు 50 రోజుల కాలంలో 5.20కోట్ల పనిదినాలపాటు పనులు కలి్పంచింది. మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ ఉన్నాయి. ఒక్కొక్కరికి రోజుకు రూ.245 ఉపాధి హామీ పథకంలో పనిచేసిన కూలీలకు ఈ ఏడాది అధిక మొత్తంలో కూలి సైతం గిట్టుబాటు అయ్యింది. ఈ 50 రోజుల్లో కూలీలకు సరాసరిన రోజుకు రూ.245 చొప్పున కూలి లభించింది. మరోవైపు ఈ పనులకు 60 శాతానికి పైగా మహిళలే హాజరై ఉపాధి పొందారు. అలాగే మొత్తం 6.83 కోట్ల పనిదినాల పాటు ఉపాధి పొందిన వారిలోనూ దాదాపు 32% మేర ఎస్సీ, ఎస్టీలే ఉన్నారని గ్రామీణాభివృద్ది శాఖ అధికారులు తెలిపారు. -
రాష్ట్రంలో ఉపాధి కూలీల వేతనం రూ.15 పెంపు
సాక్షి, అమరావతి: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేసే కూలీలకు కేంద్ర ప్రభుత్వం వేతనాలను పెంచింది. రాష్ట్రంలో ప్రస్తుతం గరిష్టంగా రూ.257 చొప్పున వేతనం చెల్లిస్తుండగా, దానిని ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి రూ.272కు పెంచుతూ కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలో రోజువారీ గరిష్ట వేతనాన్ని రూ.15 పెంచింది. ఉపాధి హామీ పథకం కింద వేతనాలను ఈ పథకం ప్రారంభించిన నాటి నుంచే రాష్ట్రాల వారీగా వేర్వేరుగా నిర్ణయిస్తోంది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆర్థిక సంవత్సరం ప్రారంభం సందర్భంగా వేతన రేట్లను నిర్ణయిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఆయా రాష్ట్రాల్లో వ్యవసాయ రంగంలోని కూలీల కొనుగోలుశక్తి (కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్) ఆధారంగా వేతనాలను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు నిర్ణయిస్తారు. -
గ్రామాల్లో తాగునీటి వనరులకు పునరుజ్జీవం
సాక్షి, అమరావతి: గ్రామాల్లోని సంప్రదాయ తాగునీటి వనరుల పునరుజ్జీవానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. శ్రీసత్యసాయి, అన్నమ య్య, చిత్తూరు, పల్నాడు, వైఎస్సార్, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో ఈ పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఆయా ప్రాంతాల్లో వర్షపు నీరు వీలైనంత ఎక్కువ నిల్వ చేసేలా.. నీటి కొలనులు, మంచినీటి చెరువుల వంటి సంప్రదాయ తాగునీటి వనరుల్లో ఉపాధి హామీ పథకం ద్వారా పూడికతీత పనులు చేపట్టబోతోంది. ఉపాధి హామీ పథకం ద్వారా మొత్తం 8 రకాల పనులు చేపట్టను న్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు. అలాగే గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖల భాగస్వామ్యంతో ఆ ప్రాంతాల్లో భూమిలోని తేమ శాతం పెంచేందుకు విస్తృతంగా మొక్కల పెంపకం చేపట్టనున్నారు. ఉపాధి హామీ పథకం మెటీరియల్ కేటగిరిలో గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో రూ.240 కోట్లతో ఆయా ప్రాంతాల్లోని ప్రభు త్వ భవనాల వద్ద రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ నిర్మాణం తదితరాలు చేపట్టేందుకు ఆ శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మార్చి 4 నుంచి దేశవ్యాప్తంగా.. ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనుల తరహాలోనే దేశవ్యాప్తంగా మార్చి 4 నుంచి నవంబర్ 30 వరకు ‘జలశక్తి అభియాన్–క్యాచ్ ద రెయిన్ 2023’ పేరుతో కేంద్ర జలశక్తి శాఖ పలు కార్యక్రమాలు నిర్వహించబోతోంది. దేశం మొత్తం మీద నీటి ఇబ్బందులుండే జిల్లాలను గుర్తించి.. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక కార్యాచరణతో కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మార్చి 4న దీన్ని లాంఛనంగా ప్రారంభిస్తున్నట్టు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఇప్పటికే లేఖలు రాశారు. మరోవైపు.. కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్ సెక్రటరీ శనివారం వీడియో కాన్పరెన్స్ నిర్వహించి ఈ కార్యక్రమ లక్ష్యాలు, ప్రాధాన్యతల గురించి అన్ని రాష్ట్రాల అధికారులకు వివరించారు. కాగా, పట్టణ ప్రాంతాలో సైతం నీటి ఎద్ద డికి అవకాశమున్న ప్రాంతాల్లో.. వార్డు స్థాయిలో వర్షపు నీటిని నిల్వ చేసుకునేలా వివిధ కార్యక్రమాలు నిర్వహించుకోవాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. -
మిగిలింది రూ.135 కోట్లే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం అమలుపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ఈ పథకం కింద ఖర్చు చేసేందుకు కేవలం రూ.135 కోట్ల బడ్జెటే మిగిలింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు ఇంకా నాలుగున్నర నెలలు ఉండగానే ఈ పరిస్థితి తలెత్తడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. మిగిలిన మొత్తంతో కూలీలకు రెండు రోజులకు మించి పనిని కలి్పంచే అవకాశాలు లేవని నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో ఇకముందు దీనిని ఎలా అమలు చేయాలి?, ఉపాధి పనులు కోరే కూలీలకు పనుల కల్పన, వారికి వేతనాల చెల్లింపు ఎలా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 7 నెలల్లో 97% నిధులు ఖర్చు చేసిన రాష్ట్రం రాష్ట్రంలో ఈ ఏడాది ఉపాధి హామీ పథకం అమలు, మొత్తం బడ్జెట్, చేసిన వ్యయం, ఉపాధి కల్పన తదితర అంశాలపై గత ఏప్రిల్ నుంచి అక్టోబర్ చివరి వరకు అందుబాటులో (పబ్లిక్ డొమైన్) సమాచారాన్ని లిబ్ టెక్ ఇండియా సంస్ధ ఆధ్వర్యంలో పరిశోధకులు, నిపుణుల బృందం విశ్లేచింది. దీని ప్రకారం..ఈ ఏడాది ఈ పథకం కింద ఇప్పటివరకు జాతీయ స్థాయిలో 90% కంటే కాస్త అధికంగా నిధులు ఖర్చు కాగా, తెలంగాణకు కేటాయించిన బడ్జెట్లో సుమారు 97% ఇప్పటికే ఖర్చు అయ్యింది. రాష్ట్రానికి కేంద్రం రూ.3,671 కోట్ల బడ్జెట్ కేటాయించింది. ఇందులో గత 7 నెలల్లో (ఏప్రిల్–అక్టోబర్) రాష్ట్ర ప్రభుత్వం రూ.3,536 కోట్లు వ్యయం చేసింది. చేసిన పనులకు గాను గత నెల 10వ తేదీ వరకు రూ.2,278 కోట్లు కేంద్రం విడుదల చేసింది. ఇంకా రూ.1,258 కోట్ల మేర బకాయిలు రాష్ట్రానికి రావాల్సి ఉంది. ఒకవైపు చెల్లింపుల కోసం కూలీలు ఎదురు చూస్తుండగా, మిగతా నాలుగున్నర నెలలు పని కల్పన ఇప్పుడు సమస్యగా మారింది. ఉపాధి హామీ పనులకు అత్యంత డిమాండ్ ఉన్న రోజుల్లోనూ రాష్ట్రంలో 1.2 కోట్ల కంటే ఎక్కువ మంది పని కోరలేదు. కానీ ఈ ఏడాది అక్టోబర్ చివరి నాటికే అత్యధికంగా 1.8 కోట్ల మంది పని కావాలని కోరారు. దీనిని బట్టి కూలీలు పని కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో అర్ధమవుతోందని నిపుణులు పేర్కొన్నారు. కొరవడిన స్పష్టత ప్రస్తుత సమస్యను రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పరిష్కరిస్తుందనే అంశంపై స్పష్టత కొరవడింది. దీనిపై మాట్లాడేందుకు అధికారులెవరూ సముఖంగా లేరు. మరోవైపు ఇంతపెద్ద మొత్తంలో కేంద్రం నుంచి బకాయిలు రావాల్సి రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా కేంద్రాన్ని నిలదీయకపోవడం ఏమిటని నిపుణులు ప్రశి్నస్తున్నారు. ఉపాధి హామీ రంగంలో పనిచేస్తున్న వివిధ స్వచ్ఛంద, సేవాసంస్థలు, దళిత సంఘాల ప్రతినిధులు ఆయా ముఖ్యమైన అంశాలపై సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. ఇదిలా ఉంటే 2020–21లో రాష్ట్రానికి రూ.4,763 కోట్లు కేటాయించిన కేంద్రం ఈ ఏడాది (2021–22) రూ.3,671 (గతేడాదితో పోలి్చతే 33 శాతం తక్కువ) కోట్లే కేటాయించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉపాధి హామీ పనులకు రాష్ట్రంలో డిమాండ్ పెరుగుతున్నందున.. కేంద్రం బడ్జెట్ పెంచాల్సి ఉండగా తగ్గించడంపై విమర్శలు వ్యక్తమౌతున్నాయి. ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రానికి ఉపాధి బడ్జెట్‌ను పెంచాలనే డిమాండ్లు వస్తున్నాయి. కేంద్రం అదనపు బడ్జెట్ కేటాయిస్తే కానీ రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం కొనసాగే పరిస్థితి లేదని నిపుణులు పేర్కొంటున్నారు. కేంద్రం తక్షణమే బకాయిలు విడుదల చేయాలని కోరుతున్నారు. సీఎం లేఖ రాయాలి తెలంగాణకు రావాల్సిన బకాయిల్ని వెంటనే విడుదల చేయాలని కోరుతూ కేంద్రానికి సీఎం కేసీఆర్ లేఖ రాయాలి. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పనులకు ఆటంకం కలగకుండా అదనపు కేటాయింపుల కోసం కేంద్రాన్ని డిమాండ్ చేయాలి. తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను షరతులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం తిరిగి నియమించాలి. – పి. శంకర్ (దళిత్ బహుజన్ ఫ్రంట్), కురువ వెంకటేశ్వర్లు (ఉపాధి హామీ ఫోన్ రేడియో) డిమాండ్ మేరకు దొరకని పని పూర్తి చేసిన పనులకు సకాలంలో డబ్బులు చెల్లించక పోవడం, ఇతర కారణాల వల్ల కూలీల్లో కొంత నిరుత్సాహం ఉంది. అయినా డిమాండ్ మేరకు కూలీలు పని పొందలేక పోతున్నారనేది మా పరిశీలనలో వెల్లడైంది. కూలీలకు బకాయిలు వెంటనే చెల్లించాలి. అలాగే ఉపాధి హామీ బడ్జెట్‌ను మరింత పెంచాల్సిన అవసరముంది. ఈ పథకంలో కీలకంగా వ్యవహరించే ఫీల్డ్ అసిస్టెంట్ల వ్యవస్థను మళ్లీ పూర్తి స్థాయిలో ఉపయోగించాలి. – చక్రధర్ బుద్ధా (డైరెక్టర్, లిబ్ టెక్ ఇండియా), గజ్జలగారి ప్రవీణ్‌కుమార్ (పరిశోధకులు) -
మొక్కే గదా అని మింగేస్తే..!
కృష్ణాజిల్లా, గూడూరు (పెడన) : ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీల్లో వెలుగు చూసిన భారీ అవినీతి వ్యవహారం స్థానికంగా కలకలం రేపుతోంది. పదిహేను రోజుల పాటు ప్రతి పంచాయతీలో గ్రామ సభలు ఏర్పాటు చేసి బహిరంగ విచారణ ద్వారా సామాజిక తనిఖీలు చేపట్టిన రిసోర్స్ పర్సన్లు మండలంలో దాదాపు రూ.17 లక్షల మేర అక్రమాలు జరిగినట్లు తమ నివేదికలో తేల్చారు. అయితే అంత మొత్తంలో అవినీతి జరిగినట్లు బయటకు రానీయకుండా మండలస్థాయిలోని ప్రజా ప్రతినిధి వారిపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. అయినా వారు ఏ మాత్రం ఒత్తిడులకు లొంగకుండా ఖచ్చితమైన నివేదికను సమర్పించినట్లు సమాచారం. అయితే రికవరీ విషయంలో సదరు నేత ప్రయత్నాలు ఫలించినట్లు అర్ధమవుతోంది. అందుకే కేవలం రూ.5.58 లక్షల రికవరీతో సరి పెట్టినట్లు తెలిసింది. మొక్కే గదా అని వదిలేయకుండా వాటి మాటున రూ.లక్షలాది నిధులను మింగేసిన అక్రమార్కులను గుర్తించి వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు సామాజిక తనిఖీ రిసోర్స్ పర్సన్లు. రూ.25 లక్షల మేర పనులు.. 2017 అక్టోబరు నుంచి 2018 మార్చి 31 మధ్యకాలంలో మండలంలో దాదాపు రూ.25 లక్షల ని«ధులను జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి మళ్లించి వెలుగు శాఖ ఆధ్వర్యంలో రోడ్ల వెంబడి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. పండ్లు ఇచ్చే రకాల మొక్కలతో పాటుగా నీడను ఇచ్చే మొక్కలు నాటడం, వాటిని రక్షించడానికి చుట్టూ ట్రీ గార్డులు ఏర్పాటు చేయడం, వాటికి నీరు పోయడం వంటి పనులను వృక్ష మిత్రలకు అప్పగించారు. అయితే ఇక్కడే అక్రమాలకు తెర లేచినట్లు సమాచారం. మొక్కలు తీసుకురావడం నుంచి నాటడం వరకు అన్నిచోట్లా దొంగ లెక్కలతో మాయ చేసినట్లు తెలుస్తోంది. కేవలం వృక్ష మిత్రలు, నేతలు కుమ్మక్కు అవ్వడంతోనే ఈ స్థాయిలో అక్రమాలు చోటు చేసుకున్నట్లు సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఏ గ్రామంలో చూసినా రికార్డులపరంగా నాటిన మొక్కలకు వాస్తవానికి క్షేత్రస్థాయిలో ఉన్న వాటికి ఏ మాత్రం పొంతన లేకపోవడమే దీనికి నిదర్శనం. నాటని మొక్కలను నాటినట్లు చూపించగా... వాటికి ట్రీ గార్డులు అమర్చడం, అసలు లేని మొక్కలకు సైతం నీళ్లు పోసినట్లు నిధులు స్వాహా చేయడం విశేషం. అధికారుల బాధ్యతా రాహిత్యం.. ఉపాధి హామీ పథకం నిధులు కావడంతో సదరు పనులపై ‘వెలుగు’ అధికారులతో పాటుగా మండల పరిషత్ అధికారి, జాతీయ ఉపాధి హామీ పథకం అధికారులు పర్యవేక్షించాల్సి ఉంది. అయితే మూడు శాఖల అధికారుల బా«ధ్యతా రాహిత్యం కారణంగానే ఇంతటి భారీ స్థాయిలో అక్రమాలు వెలుగు చూసినట్లు తెలుస్తోంది. ఇదే విషయం తమ సామాజిక తనిçఖీలలో కూడా వెల్లడైనట్లు తనిఖీ బృంద సభ్యులు తమ నివేదికలో వెల్లడించడం గమనార్హం. కనీసం మూడు నెలలకు ఒక సారైనా క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి రికార్డులలో నమోదు చేయాల్సిన అధికారులు తమ బాధ్యతను పూర్తిగా విస్మరించడం కారణంగానే ఈ స్థాయిలో అక్రమాలు చోటు చేసుకున్నట్లు వారు వెల్లడించారు. -
వేతనదారులకు శుభవార్త
నెల్లిమర్ల:ఉపాధిహామీ పథకంలో పనిచేస్తున్న వేతనదారులకు తీపి కబురు. ఇప్పటివరకు అమలులో ఉన్న ఏడాదికి వంద పనిదినాల గండం గట్టెక్కింది. రోజుకు ఎంత కనిష్టంగా వేతనం వచ్చినా ఒకరోజుగా లెక్కించేవారు. ఇప్పుడు ఆ పద్ధతికి స్వస్తి పలకనున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన రోజుకు రూ. 197 గరిష్ట వేతనాన్ని దృష్టిలో ఉంచుకుని వేతనాన్ని బట్టి పనిదినాలను లెక్కించే విధానం అమల్లోకి వచ్చింది. దీంతో ఒకే జాబ్‌కార్డులో ఉండే ఒకే కుటుంబానికి చెందిన వేతనదారులకు ప్రయోజనం చేకూరనుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లా వ్యాప్తంగా ఉన్న 34 మండలాల్లో సుమారు నాలుగు లక్షల జాబ్‌కార్డులున్నాయి. ఈ జాబ్‌కార్డుల ద్వారా మొత్తం 6 లక్షల మంది వేతనదారులు పనులు చేస్తున్నారు. ప్రస్తుతం రోజుకు సగటున రూ. 125 వేతనంగా అందుతోంది. ప్రతి ఏటా ఏప్రిల్ నుంచి మార్చి వరకు సుమారు లక్ష జాబ్‌కార్డులకు వంద పని దినాలు పూర్తవుతున్నాయి. దీంతో సుమారు 1.5 లక్షల మంది వేతనదారులకు ఒకటి,రెండు నెలలు పని లేకుండా పోతోంది. వాస్తవానికి ఉపాధిహామీ వేతనదారులకు కేంద్రప్రభుత్వం నిర్ణయించిన సగటు వేతనం రూ 197. ఒక్కో జాబ్‌కార్డుకు ఏడాదికి వందరోజుల పనిదినాలు కల్పించి రూ. 20 వేలు వేతనంగా అందించాలనేది పథకం లక్ష్యం. అయితే గరిష్ట వేతనం అందకుండానే పనిదినాలు పూర్తవడంతో వేతనదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రప్రభుత్వం నూతన విధానం అమలుకు సన్నాహాలు ప్రారంభించింది. పనికి వెళ్లే రోజులను లెక్కలోకి తీసుకోకుండా గరిష్ట వేతనాన్ని దృష్టిలో పెట్టుకోవాలని సంబంధిత అధికారులు నిర్ణయించారు. ఈ విధానం ప్రకారం ఒక జాబ్‌కార్డులోని వేతనదారులకు 197 రూపాయల వేతనం వచ్చినప్పుడే ఒక పనిదినంగా లెక్కగడతారు. ఉదాహరణకు ఒక జాబ్‌కార్డులో ఒకే వ్యక్తి వేతనదారుగా ఉంటే ఆర్థిక సంవత్సరంలో వేతనంగా పొందే మొత్తం రూ 19,700 అయితేనే వంద పనిదినాలు పూర్తయినట్లు లెక్కిస్తారు. అదే గతంలో అయితే వేతనంతో గాకుండా పనిదినాలను మాత్రమే లెక్కించేవారు. దీంతో వేతనదారులు ఇబ్బందిపడేవారు. పూర్తిస్థాయిలో వేతనాలు అందుకోకుండా వంద రోజులు పూర్తయ్యే లక్ష కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే గరిష్ట వేతనం రూ. 197 వస్తేనే ఒక పనిదినంగా లెక్కించడం వల్ల మొత్తమ్మీద పనిది నాలు తగ్గిపోతాయని క్షేత్రసహాయకులు అంటున్నారు. ఎంతో ప్రయోజనం వేతనం కొలమానంగా పనిదినాలు లెక్కించడం వల్ల ఒకే జాబ్‌కార్డుతో పనిచేసే కుటుంబ సభ్యులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. గతంలో వేతనం ఎంత తక్కువగా వచ్చినా వంద రోజులు పూర్తవగానే పని కల్పించలేకపోయేవాళ్లం. అయితే ఈ విధానంతో ఒక జాబ్‌కార్డుకు ఏడాదిలో రూ. 20వేలు ఆదాయం కల్పించాలన్నది మా లక్ష్యం. కొత్త విధానంతో జిల్లాకు చెందిన సుమారు 1.5లక్షల మంది వేతనదారులకు ప్రయోజనం చేకూరుతుంది.–బొడ్డేపల్లి రాజగోపాలరావు, డ్వామా పీడీ ప్రచారం చేయాలి వేతనాలు కొలమానంగా పనిదినాలు లెక్కించే విధానం మంచిదే. అయితే వేతనదారులు ఈ విధానంతో గందరగోళానికి గురయ్యే అవకాశముంది. వారంలో ఆరురోజులు పనికి వెళ్లినా గరిష్టంగా వేతనం రాకపోతే పనిదినాలు తగ్గిపోతాయి. దీనిపై సంబంధిత అధికారులు ప్రచారం చేయాలి. క్షేత్రసహాయకులు కూడా వేతనదారులకు అవగాహన కల్పించాలి. –జీనపాటి శ్రీనివాసరావు, క్షేత్రసహాయకుల సంఘ జిల్లాఉపాధ్యక్షుడు. -
మండుటెండలో మాడిపోతున్నారు!
సీతంపేట:ఉపాధి హామీ పథకం పనులు జరుగుతున్నచోట మౌలిక సదుపాయాల్లేక ఇబ్బంది పడుతున్నామని వేతనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనులు చేసేచోట నిలువ నీడ కూడా లేకుండా పోయిందని, దీంతో ఒక్కోసారి అనారోగ్యం బారిన పడుతున్నామని వాపోతున్నారు. జిల్లాలో వేసవి ప్రారంభంలోనే ఎండలుమండిపోతున్నారు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉదయం 9 గంటలకే సూరీడు సుర్రుమంటున్నాడు. ఇలాంటి సమయంలో కూలీలకు వసతులు కల్పించాల్సిన అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో 5,65,650 వేల కుటుంబాలున్నాయి. వీటిలో 11,76,647 మంది కుటుంబసభ్యులు ఉన్నారు. వీరిలో ఎస్సీలు 58,860, ఎస్టీలు 46,762, ఇతరులు 4,64,028 మంది వేతనదారులకు జాబ్‌కార్డులు ఉన్నాయి. వీరిలో ఈ ఏడాది 5,57,923 మంది వేతనదారులకు ఉపాధి పనులు కల్పించాలని అధికారులు చర్యలు తీసుకున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఎస్టీ జనాభాకు43,318 కుటుంబాలకు జాబ్‌కార్డులు ఇవ్వగా టీపీఎంయూ (ట్రైబుల్ ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్) పరిధిలో సీతంపేట, భామిని, కొత్తూరు, హిరమండలం, మందస, మెళియాపుట్టి, పాతపట్నం మండలాల్లోని గిరిజన వేతనదారులు లక్ష మందికి పైగా ఉపాధి పనులకు వెళ్తున్నారు. పేరుకుపోయిన వేతన బకాయిలు ఉపాధి వేతనదారులకు గతేడాది జిల్లా వ్యాప్తంగా రూ.15 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయి.మూడు, నాలుగేసి నెలలు బకాయిలుంటే ఎలా బతుకుతామని వేతనదారులు ప్రశ్నిస్తున్నారు. చేసిన కష్టానికి సకాలంలో ప్రతిఫలం రాకపోతే ఎలా అని ఆవేదన చెందుతున్నారు. వేసవి కాలంలో అయితే రోజువారీ వేతనంతో పాటు అదనంగా 25 నుంచి 30 శాతం కలిపి వేతనం ఇవ్వాలి. ఇదికాకుండా పనులుచేసే చోట తాగునీటి సౌకర్యం లేని పక్షంలో కూలీలు తాగునీరు తెచ్చుకుంటే రోజుకు రూ.5 ఇస్తారు. పనులు చేసేందుకు అవసరమైన గునపం పదును చేసుకునేందుకు రూ.10 ఇవ్వాలి. ఒక్కో వేతనదారుకి రూ.194 వరకు కూలి గిట్టుబాటు కావాలి. కాని ఎండ కారణంగా పని ముందుకు సాగకపోవడంతో తక్కువ వేతనమే గిట్టుబాటు అవుతోందని వేతనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం మౌలిక సదుపాయాలు కూడా లేవంటున్నారు. టెంట్లు రాలేదు ఈ ఏడాది ఇంకా టెంట్లు రాలేదు. గత ఏడాది పంపిణీ చేశాం. మందుల కిట్లు కూడా రాలేదు. ప్రస్తుతానికి వేతనదారులకు గునపాలు పంపిణీ చేశాం.–శంకరరావు, ఏపీవో, ఉపాధి హామీ పథకం -
పల్లె పొమ్మంది.. పట్నం రమ్మంది!
ఉన్న ఊళ్లో పని లేక పోవడంతో పేదలు పొట్ట చేత పట్టుకుని పట్నాలకు వలస వెళ్తున్నారు. స్థానికంగానే పని కల్పించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఉపాధి పథకం కూడా వారిని ఆదుకోకపోవడంతో గ్రామాలకు గ్రామాలు ఖాళీ అవుతున్నాయి. నివారణ చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తుండటంతో ఇప్పటికే 50వేల మందికి పైగా సుగ్గిబాట పట్టారు. కర్నూలు(అర్బన్): జిల్లాలోని పత్తికొండ, ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరు తదితర ప్రాంతాల్లో వ్యవసాయ పనులు పూర్తి కావడంతో వేలాది మంది వ్యవసాయ కూలీలు పొట్ట చేతపట్టుకొని ఇళ్లకు తాళాలు వేసి ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. ఉపాధి కూలీ గిట్టుబాటు కాకపోవడం, ఏడాది క్రితం చేసిన పనులకే వేతనాలు అందకపోవడం వలసలకు కారణమని తెలుస్తున్నా అధికారులు చూసీచూడనట్లున్నారనే ఆరోపణలున్నాయి. బెంగళూరు, ముంబయి, హైదరాబాద్ వంటి నగరాలతో పాటు కడప, గుంటూరు, విజయవాడ పట్టణాల్లోని భవన నిర్మాణ, ఇతర వ్యవసాయ పనుల్లో జిల్లా వాసులు మగ్గుతున్నారు. ప్రస్తుతం చేపడుతున్న పనులు .. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ప్రస్తుతం జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో చేపట్టిన ఫారంపాండ్స్‌ను మార్చి నాటికి పూర్తి చేయాలనేది లక్ష్యం. జిల్లాలో 45 వేల ఫారంపాండ్స్‌ను ఈ ఆర్థిక సంవత్సరం నాటికి పూర్తి చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 12 వేలు మాత్రం పూర్తి కాగా, 20 వేలు వేర్వేరు దశల్లో కొనసాగుతున్నాయి. ఇంకా 13 వేల ఫారంపాండ్స్ పనులు నేటికీ ప్రారంభానికి నోచుకోలేదు. ఫీల్డ్ చానల్స్, ఫీడర్ చానల్స్ పనులతో పాటు భూమి అభివృద్ధి, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు, ఆట స్థలాలు, సాలీడ్ వేస్ట్ మేనేజ్మెంట్ షెడ్ల నిర్మాణాలపై సంబంధిత అధికారులు దృష్టి సారించారు. పెండింగ్‌లో రూ.15 కోట్ల వేతనాలు.. కేంద్ర ప్రభుత్వం ఉపాధి పనులకు సంబంధించి బడ్జెట్ సకాలంలో విడుదల చేయకపోవడం, విడుదల చేసినా అరకొరగా ఉండటంతో ఏడాది కాలంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోని కూలీలకు రూ.15 కోట్ల మేర బకాయిలున్నాయి. బ్యాంకు ఖాతా, ఆధార్ నంబర్ సక్రమంగా ఉన్న కూలీలకు రూ.9 కోట్ల వరకు వేతనాలు పెండింగ్‌లో ఉండగా, ఆధార్ నంబర్, బ్యాంకు ఖాతా నంబర్ అనుసంధానంలో దొర్లిన పొరపాట్లు, ఇతరత్రా సాంకేతిక కారణాల వల్ల రూ.6 కోట్లు ఆయా బ్యాంకుల్లోని సస్పెన్షన్ ఖాతాల్లోనే మూలుగుతున్నాయి. 145 గ్రామ పంచాయతీల్లోప్రారంభం కాని పనులు.. జిల్లాలోని 889 గ్రామ పంచాయతీలకు గానూ 145 పంచాయతీల్లో ఎలాంటి ఉపాధి పనులు ప్రారంభం కాలేదు. రుద్రవరం మండలంలో 17, బనగానపల్లె మండలంలో 10 పంచాయతీల్లో పనులు చేపట్టడం లేదు. జిల్లాలోని 10 క్లస్టర్లలో 95,977 మంది కూలీలకు పనులు కల్పించాలని అధికారులు లక్ష్యంగా నిర్ణయించుకోగా, ఇప్పటి వరకు ఆయా క్లస్టర్లలోని గ్రామ పంచాయతీల్లో కేవలం 30 వేల మంది కూలీలు మాత్రమే ఉపాధి పనులకు హాజరు కావడం గమనార్హం. ♦ కోసిగి మండలంలోని 17 గ్రామ పంచాయతీల్లో 69 వేల జనాభా ఉంది. ఈ మండలంలో 2,990 మంది ఉపాధి కూలీలు పనులు చేసేందుకు లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. అయితే గ్రామాలకు గ్రామాలు వలస వెళ్లడంతో ప్రస్తుతం 561 మంది మాత్రమే 12 గ్రామ పంచాయతీల్లో ఉపాధి పనులను చేస్తున్నారు. మిగిలిన 5 గ్రామ పంచాయతీల్లో కూలీలు లేకపోవడంతో ఎలాంటి పనులు నేటి వరకు కల్పించలేకపోతున్నారు. ఈ మండలం నుంచే దాదాపు 10 వేలకు పైగా వ్యవసాయ కూలీలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. మార్చి నాటికి 60 లక్షల పనిదినాలు పూర్తి చేసేందుకు చర్యలు ఈ ఏడాది మార్చి నాటికి 60 లక్షల పనిదినాలు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాం. క్లస్టర్ల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల్లో కూలీల సంఖ్య పెంచేందుకు చర్యలు చేపడుతున్నాం. నంద్యాల డివిజన్లో ఇంకా వ్యవసాయ పనులు ఉండటంతో ఉపాధి పనులు పుంజుకునేందుకు కొంత సమయం పడుతుంది. వలసలను నివారించేందుకు పడమటి ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించాం. వేతనాలు గిట్టుబాటయ్యేలా ఫారంపాండ్స్, ఫీల్డ్ చానల్స్, ఫీడర్ చానల్స్ పనులకు ప్రాధాన్యత ఇస్తున్నాం. – డాక్టర్ సీహెచ్ పుల్లారెడ్డి, డ్వామా పీడీ -
కలెక్టర్ కాదు.. ఎమ్మెల్యే చెప్పాలి..
విజయనగరం పూల్‌బాగ్: విధుల నుంచి తొలగింపునకు గురైన ఒక ఉద్యోగినిని తిరిగి చేర్చుకోవాలని కలెక్టర్ నెల రోజుల కిందట ఆదేశాలు జారీ చేసినా కింది స్థాయి ఉద్యోగులు పెడచెవిన పెట్టడంతో ఆ ఉద్యోగిని విధుల్లోకి చేరక ఇబ్బందులు పడుతోంది. జామి మండలం లొట్లపల్లి గ్రామ పంచాయతీకి చెందిన జన్నెల వాణీశ్రీ ఉపాధిహామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహించేది. అదే మండల ఉపాధి హామీ పథకం ఏపీఓ కామేశ్వరరావు లైంగిక వేధింపులకు గురి చేస్తూ ఆమెను విధులను తొలగించారు. దీంతో ఆమె తొమ్మిది నెలలు పాటు ఉద్యోగానికి దూరం ఉంది. ఎట్టకేలకు సాక్షిని ఆశ్రయించింది. సాక్షిపత్రికలో వెలువడిన కథనానికి స్పందించిన కలెక్టరు వాణీశ్రీని విధుల్లోకి తీసుకోవాలని జనవరి 3న ఆదేశాలు జారీచేశారు. అయితే అప్పటినుంచి నేటివరకూ విజయనగరం డ్వామా కార్యాలయం, జామి ఎంపీడీఓ కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉంది. అయినా ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకున్న పాపానపోలేదు. దీంతో ఆమెకు దిక్కు తోచని పరిస్థితి నెలకొంది. ఏం చేయాలో? ఎవరిని కలవాలో? అర్థంకాని పరిస్థితి. కలెక్టర్ ఆదేశాలే పట్టించుకోని అధికారులు ఎవరి మాట పట్టించుకుంటారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఏం జరిగిందో మాకు తెలియదు.. కలెక్టరు ఆదేశాల ప్రకారం జాయినింగ్ ఆర్డర్ ఇచ్చేశాము. అక్కడ ఏం జరిగిందో మాకు తెలియదు. ఎంపీడీఓ జాయిన్ చేసుకోవాలి. ఎందుకు జాయిన్ చేసుకోలేదో ఆయనకే తెలియాలి. ఇక్కడైతే ఏ సమస్యాలేదు. బొడ్డేపల్లి రాజగోపాల్, పీడీ, డ్వామా, విజయనగరం ఎమ్మెల్యే చెబితేనే... ఎమ్మెల్యేని కలిసి ఆయనతో నాకుచెప్పిస్తేనే జాయినింగ్ చేసుకుంటాము. లేకపోతే కుదరదు. ఇప్పటికే అదేమాట చాలా సార్లు చెప్పాను. ఇప్పుడు అదే చెబుతున్నాను. –ఎంపీడీఓ, జామి మండలం -
‘ఉపాధి’ పర్యవేక్షణలో తెలంగాణ భేష్
సాక్షి, అమరావతి: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో తెలంగాణ ప్రభుత్వం గ్రామ స్థాయిలోనూ మెరుగైన పర్యవేక్షణ కొనసాగిస్తోందని, పరిపాలన పరమైన ఉత్తమ విధానాలను ఆంధ్రప్రదేశ్‌తో సహా అన్ని రాష్ట్రాలూ ఆదర్శంగా తీసుకోవాలని కేంద్రం సూచించింది. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శి అపరాజిత సారంగి సోమవారం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాశారు. ఉపాధి పథకం మరింత పారదర్శకంగా అమలు చేసేందకు పథకంలో చేపట్టిన పనుల వివరాలను ఆయా గ్రామాల్లో ఒక గోడపై అందరికీ తెలిసేలా రాయడం.. ప్రతి గ్రామ పంచాయతీలో పనులపై ఏడు రిజిస్టర్లను నిర్వహించడం, జాబ్‌కార్డుల జాబితాను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవడం వంటి అంశాలపై స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని లేఖలో పేర్కొన్నారు. ఆయా అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో అమలు చేయాల్సిన విధానాలపై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కొద్ది రోజుల కిత్రం అన్ని రాష్ట్రాల అధికారులతో ఢిల్లీలో సమావేశం కూడా నిర్వహించింది. జిల్లా, బ్లాక్ లేదా మండల స్థాయిలో ఆయా అంశాలను సమర్ధవంతంగా అమలుకు కేంద్రం చేసిన సూచనలను పాటించడంలో తెలంగాణ ప్రభుత్వ చర్యలను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మెచ్చుకుంది. అన్ని రాష్ట్రాలూ తెలంగాణ చేపట్టిన చర్యలను పరిశీలించి, పాటించాలని సూచించింది. -
'మత్తు'కు దూరంగా మనుషులకు దగ్గరగా
ఎక్కడైనా నలుగురు కలిస్తే మద్యం తాగడం, మాంసాహారం తినడం ఓ ఫ్యాషన్‌గా మారిపోయిన రోజులివి. పండుగలొచ్చినా, పబ్బాలొచ్చినా.. మంచైనా, చెడైనా.. మద్యం, మాంసాహార వినియోగం తప్పనిసరిగా మారిపోయింది. మద్యం మహమ్మారి కారణంగా ఎన్నో ప్రాణాలు పోతున్నాయి. పేద కుటుంబాలు కకావికలం అవుతున్నాయి. ఇలాంటి సమయంలో నిర్మల్ జిల్లాలోని పలు గ్రామాలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయి. మద్యపానానికి, మాంసాహారానికి దూరంగా ఉండడమే కాదు సమష్టితత్వం, పరస్పర సహకారంతో అభివృద్ధి బాటన ప్రయాణిస్తున్నాయి. హంగులు, ఆర్భాటాలు వదిలేసి సేవాతత్వంలో నడుస్తూ సరికొత్త బాటను చూపుతున్నాయి. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో నిర్మల్ జిల్లాలోని కుభీర్, తానూరు, మామడ మండలాల్లో ఉన్న ఈ గ్రామాలపై ఈ వారం ‘ఫోకస్’.. – నిర్మల్ నిర్మల్ జిల్లాలోని కుభీర్, తానూరు, మామడ మండలాల పరిధిలోని ఆరేడు తండాలు/గ్రామాలు మద్యపానంపై స్వీయ నిషేధం విధించుకున్నాయి. ఈ ఊళ్లలో మందు సీసాలే కాదు.. కల్లు అమ్మే దుకాణం కూడా కనిపించదు. మేకలు, కోళ్లు కోయడమనే ముచ్చటే ఉండదు. మద్యం, మాంసాహారం గురించి మాట్లాడినా ఆ గ్రామాల ప్రజలు సున్నితంగా తిరస్కరిస్తారు. ఏ నిర్ణయమైనా సంఘటితంగా తీసుకుంటారు. సమష్టిగా గ్రామ అవసరాలు తీర్చుకుంటారు. ఎవరికీ భారం కాకుండా ఊరంతా కలసి సామూహికంగా తమ పిల్లలకు వివాహాలు చేస్తారు. ఇవే వారిని, వారి గ్రామాలను ప్రత్యేకంగా నిలుపుతున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా ‘మద్యం’ మహమ్మారి జాడ లేకపోవడంతో ఈ గ్రామాల్లో నేరాలు, ఘోరాలు దాదాపుగా లేకపోవడం గమనార్హం. వాస్తపూర్.. ప్రతి ఇల్లు దేవాలయమే చుట్టూ పచ్చని చెట్లతో ఎత్తయిన గుట్టలు, దట్టమైన అడవి మధ్య గ్రామం వాస్తపూర్. బాహ్య ప్రపంచానికి దూరంగా మామడ మండలంలోని తాండ్ర గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ఈ గ్రామ జనం.. ముప్పై ఏళ్లుగా మద్యమాంసాలకు దూరంగా ఉంటున్నారు. 450 మంది మాత్రమే ఉన్న ఈ గ్రామస్తులు మద్యం, మాంసాలను ఎప్పుడూ ముట్టకూడదని తమకు తాముగా ప్రతిజ్ఞ చేసుకున్నారు. ఇక ఈ గ్రామంలో ప్రతి ఇల్లూ ఒక దేవాలయమే. అడవిలో ఉన్నా తమ ఇళ్లలో పేడతో అలికి, ముగ్గులు వేసుకుంటారు. ప్రతి శనివారం ఊరంతా కలసి గ్రామంలోని హనుమాన్ ఆలయంలో సామూహికంగా భజన నిర్వహిస్తారు. గ్రామంలోకి ఎవరు వచ్చినా.. మర్యాద గా స్వాగతిస్తారు. చేలలో విత్తనాలు చల్లే సమయంలో, శివరాత్రి సమయంలో దీక్షలు చేపట్టి.. కఠిన నియమాలను అనుసరిస్తుంటారు. ఇక వాస్తపూర్కున్న మరో ప్రత్యేకత ఏమిటంటే... ఏ ఎన్నికలు వచ్చినా నిర్మల్ నియోజకవర్గ నాయకులు ఈ కుగ్రామం నుంచే ప్రచారం ప్రారంభించడం ఆనవాయితీ కావడం గమనార్హం. ఏళ్లుగా పాటిస్తున్నాం ‘‘మాది అడవిలో ఉండే ఊరైనా ముప్పై ఏళ్లుగా మద్యమాంసాలకు దూరం గా ఉంటున్నాం. ప్రకృతి ఒడిలో ఉండే తమ గ్రామంలో ఏ పండుగ వచ్చినా ప్రతి కుటుంబం పాలు పంచుకుంటుంది. ఉదయం గ్రామంలోని హనుమాన్ ఆలయంలో సామూహిక పూజలు చేశాక రోజూ పనులు ప్రారంభిస్తాం..’’ – గంగారాం పటేల్, వాస్తపూర్ పుట్టిన్నుంచి మందు చూడలె.. ‘‘నాకిప్పుడు తొంభయ్యేళ్లపైన ఉంటయ్. నేను పుట్టినప్పటి నుంచి మద్యం చూడలె. పాంగ్రాలో తరాల కిందనే మందు బంజేసిండ్రు. ఇప్పటికీ మా కొడుకులు, మనుమలు కూడా దూరంగనే ఉంటున్నరు. అదే మా ఊరికి మంచి పేరు తెస్తున్నది..’’ – కెర్భా పటేల్, పాంగ్రా మేం అదృష్టవంతులం.. ‘‘మా పాంగ్రా గ్రామపంచాయతీలోని బాకోట్, పాంగ్రా, సౌనా ఈ మూడు ఊళ్లూ మద్యం, మాంసానికి దూరంగా ఉంటాయి. ఇలాంటి గ్రామాల్లో పుట్టడం అదృష్టంగా భావిస్తున్నాం. మద్యానికి దూరంగా ఉండటం వల్లే ఇప్పటిదాకా గొడవలు, కేసులేవీ లేవు..’’ – ముక్తాబాయి, సర్పంచ్, కుభీర్ మండలం సౌనా యువకులు, మహిళలు ముందుకువచ్చి.. ‘‘ఒకప్పుడు మా ఝరి (బి) గ్రామం మద్యం కారణంగా ఇబ్బందులు పడింది. పరిస్థితి గొడవలు, హత్యల వరకూ వెళ్లింది. యువత, మహిళలు ముందుకువచ్చి పట్టుబట్టడంతో మద్యానికి దూరమైంది..’’ – ఆనంద్, నచికేత యూత్, ఝరి(బి) గ్రామం మూడు తరాల నుంచి పచ్చగా.. నిర్మల్ జిల్లా భైంసా పట్టణం నుంచి కుభీర్ వెళ్లే మార్గంలోని చిన్న గ్రామం పాంగ్రా. ఇక్కడ దాదాపుగా మూడు తరాల నుంచి మద్యం, మాంసం వినియోగం బంద్. ఇప్పటి యువత సైతం మద్యపానానికి దూరంగా ఉండటం విశేషం. గ్రామంలో ఉన్నా, చదువుకునేందుకు పట్టణాలకు వెళ్లినా వారు ఊరి పద్ధతిని వీడడం లేదు. వేరే గ్రామం నుంచి వచ్చిన కోడళ్లు, అల్లుళ్లూ ఈ ‘మర్యాద’ను పాటిస్తుంటారు. ‘‘మా తాత చెప్తుండె.. మన ఊళ్లో జమానా నుంచి మందు తాగుడు, మాంసం తినుడు లేదురా అని.. ఇట్ల మూడు పిడిల (తరాల) కెళ్లి మా ఊళ్లె తాగుడు తినుడు ముచ్చట్నే లేదు..’’ అని పాంగ్రా గ్రామ మాజీ సర్పంచ్ దిగంబర్ పటేల్ తమ ఊరి గొప్పదనాన్ని వివరించారు. ఎటు చూసినా పచ్చగా.. పత్తి, మొక్కజొన్న, శనగ, గోధుమ పంటలతో ఈ గ్రామం ఎటు చూసినా పచ్చగా కళకళలాడుతుంటుంది. గ్రామంలో వివిధ కులాల వాళ్లున్నా అందరూ ఒక్కటిగానే ఉంటారు. ఈ ఊరికున్న ప్రత్యేకత ‘ఏకముఖి దత్తాత్రేయుడు’గా పిలుచుకునే ఆలయం. గ్రామశివారులో నిర్మించిన ఈ దత్తాత్రేయ ఆలయమే పాంగ్రాను కలిసికట్టుగా నడిపిస్తోంది, వ్యసనాలకు దూరంగా ఉంచుతోంది. దత్తాత్రేయ బోధనలను పాటించే గురువు ‘మహానుభావు’ మార్గాన్ని ఈ గ్రామ ప్రజలు అనుసరిస్తున్నారు. మద్యమాంసాలకు దూరంగా ఉంటూ కలసికట్టుగా జీవించడమే తమ మహానుభావు మతమని వారు చెబుతుంటారు. గ్రామంలో దసరా నవరాత్రులు, దత్తపౌర్ణమి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. బాకోట్, సౌనా గ్రామాల్లోనూ.. పాంగ్రా గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామాలైన బాకోట్, సౌనా గ్రామాలు సైతం ఈ ఆదర్శాన్ని అందిపుచ్చుకున్నాయి. ఎంత పెద్ద పండుగైనా, ఏ వేడుకైనా సరే ఈ గ్రామాల్లోనూ మద్యమాంసాలను ముట్టుకోరు. అసలు ఇప్పటిదాకా తమ పంచాయతీ పరిధిలోని పాంగ్రా, బాకోట్, సౌనా ఊళ్లల్లో వాటి ముచ్చటే రాలేదని గ్రామ సర్పంచ్ ముక్తాబాయి చెబుతున్నారు. ఏదైనా కార్యం ఉంటే లడ్డూ, బూందీ వంటి తీపి పదార్థాలతోనే వేడుకలను నిర్వహించుకుంటామని అంటున్నారు. మద్యం లేనందునే తమ గ్రామాల్లో గొడవలు లేవని, ఇప్పటిదాకా పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన దాఖలాలు లేవని చెబుతున్నారు. అమృత నిలయం.. జామ్‌గావ్ కుభీర్ మండల కేంద్రం నుంచి కొండలు, గుట్టలు దాటుకుని వెళ్తే మహారాష్ట్ర సరిహద్దులో ఉంటుంది జామ్‌గావ్. ఇక్కడ మద్యమనే మాటే లేదు.. మాంసం వినియోగం తెలియని ఇళ్లు ఉన్నాయి. ముప్పై ఏళ్ల కిందే ఈ గ్రామం భక్తిని తమ మార్గంగా ఎంచుకుంది. ముంబై లో పాండురంగ అఠావలే ప్రారంభించిన స్వాధ్యాయ పంథాను జామ్‌గావ్ అందిపుచ్చుకుంది. ఉమ్మడి ఏపీ లోనే తొలిసారిగా 1996లో స్వాధ్యాయ ఆధ్వర్యంలో ఈ గ్రామంలో అమృతాలయం నిర్మించడం గమనార్హం. దీనిని కేంద్రంగా చేసుకుని.. ఆ ఊళ్లో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారు. నలభయ్యేళ్ల కిందటే ప్రతి ఇంటి కి మరుగుదొడ్డి నిర్మించుకోవడం గమనార్హం. గ్రామస్తులంతా ఉపాధి పథకంలో కలసి పనిచేసి, వచ్చిన డబ్బులతో హనుమాన్ ఆలయాన్ని నిర్మించుకున్నారు. పండుగలప్పుడు ఒకరింటికి మరొకరు వెళ్లి జరుపుకోవడం, మంచిని ప్రచారం చేయడం, ఏడాదికోసారి ఊరంతా కలసి ఒక చేనులో పంట పండించి ప్రత్యేక రోజుల్లో వినియోగించడం వంటివి జామ్‌గావ్ మరిన్ని ప్రత్యేకతలు. అందరం కలిసుంటాం.. ‘‘మా జామ్‌గావ్‌లో ఎలాంటి భేదభావాలు లేవు. అందరం ఒకటేనన్న భావన తో కలసి ఉంటాం. మద్యమాంసాల ముచ్చటే లేదు. రాజకీయం, ప్రచారం, హంగూ ఆర్భాటం లేకుండా భక్తి మార్గంలోనే నడుస్తాం. ఏళ్లుగా ఇలాగే కలసి ఉంటున్నం..’’ – పెద్దకాపు చిన్నన్న, జామ్‌గావ్ -
‘మరుగు’లో మేత
♦ లబ్ధిదారుల పేరుతో ఎన్జీఓల ఖాతాల్లోకి రూ.కోటి మళ్లింపు ♦ కొన్ని గ్రామాల్లో పాతదొడ్లకు రంగులు వేసి బిల్లులు స్వాహా ♦ ఎంపీడీఓ, జూనియర్ అసిస్టెంటే సూత్రధారులు..? ♦ స్వచ్ఛభారత్ మిషన్, ఉపాధిహామీ నిధులు కైంకర్యం చందర్లపాడు(నందిగామ) : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛభారత్ మిషన్ నిధులు భారీగా దుర్వినియోగమయ్యాయి. ఎన్జీఓ (నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్) అవతారమెత్తిన కొందరు అధికార పార్టీ నేతలు మరుగుదొడ్లు నిర్మించకుండానే లబ్ధిదారుల పేరుతో లక్షల రూపాయల మేర బిల్లులు పొందారు. చందర్లపాడు మండలంలో జరిగిన ఈ కుంభకోణంలో ఎంపీడీఓ కీలకపాత్ర వహించగా కార్యాలయ జూనియర్ అసిస్టెంటు తనవంతు సహాయ సహకారాలు అందించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై నేరుగా లబ్ధిదారుల పేరుతో ఎన్జీఓల ఖాతాలోకి డబ్బు జమచేశారు. ఒక్క తోటరావులపాడు సుమారు 120 మంది పేరుమీద రూ.18 లక్షలు డ్రాచేయగా కోనాయపాలెం, చందర్లపాడు, ముప్పాళ్ల, కాసరబాద, కొడవటికల్లుతో పాటు మిగిలిన పంచాయతీల్లోనే ఈ కుంభకోణం కొనసాగింది. పాత వాటికి బిల్లులు చెల్లించడంతోపాటు, అసలు మరుగుదొడ్లు నిర్మించకుండానే నిర్మాణం పూర్తయినట్లుగా నమోదుచేసి బిల్లులు చెల్లించేశారు. కొన్నిచోట్ల లబ్ధి దారుల ఖాతాల్లోకి డబ్బు జమచేసి, వారికి కొద్ది మొత్తంలో కమిషన్ ఇచ్చి మిగిలిన మొత్తాన్ని స్వాహాచేయగా, మరికొంతమందికి చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు. గడిచిన రెండేళ్లుగా స్వచ్ఛభారత్ మిషన్‌తోపాటు ఉపాధిహామీ పథకం కింద మరుగుదొడ్లు నిర్మించినట్లు తప్పుడు రికార్డులు సృష్టించి మండలవ్యాప్తంగా కోటి రూపాయల నిధులను స్వాహా చేసినట్లు సమాచారం. నిబంధనలకు పాతర మరుగుదొడ్ల నిర్మాణాల విషయంలో అధికారులు నిబం ధనలను తుంగలో తొక్కారు. గ్రామస్థాయి నుంచి మండల స్థాయి అధికారి వరకు పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహించారు. దొడ్డి నిర్మాణాలను పరిశీలించిన తరువాత గ్రామ ప్రత్యేకాధికారి (చెక్మెజర్మెంటు అధికారి) ఎంబుక్‌లో రికార్డు చేయాలి. దానిని మండల పరిషత్ కార్యాలయానికి అందజేయాలి. మరుగు దొడ్డి నిర్మాణం జరిగిందా లేదా, లేదా? అది ఏ స్టేజీలో ఉంది? అన్న విషయాన్ని కంప్యూటర్ డేటాలో పరిశీంచిన తరువాత ఎంపీడీఓ లబ్ధిదారుడి ఖాతాకు బిల్లుమొత్తం జమచేయాలి. అయితే ఈ విషయంలో ఎంపీడీఓ, జూనియర్ అసిస్టెంటు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. మరుగుదొడ్డికి రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు కమీషన్ తీసుకుని లబ్ధిదారుడి ఖాతాకు బదులు ఎన్జీఓ ఖాతాలోలో బిల్లులు మళ్లించారని సమాచారం. నిర్మించకుండానే బిల్లులు చెల్లింపు మండలంలో ఇప్పటి వరకు స్వచ్ఛభారత్ మిషన్ కింద 1,936 మరుగుదొడ్లను నిర్మించారని రికార్డుల్లో నమోదు చేశారు. అయితే 11 వేల వరుకు సక్రమంగా నిర్మించారని సమాచారం. అధిక మొత్తంలో మరుగుదొడ్లు నిర్మించకుండానే బిల్లులు చెల్లించరని సమాచారం. కొందరు టీడీపీ కార్యకర్తలకు చెందిన పాత మరుగుదొడ్లకే రంగులు వేసి, కొత్తవాటిగా చూపి బిల్లులు చెల్లించారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కోనపాలెం 2, 3 వార్డులో 100 పాత దొడ్లకు, చందర్లపాడు 4, 5, 9 10, 11, 12, 13, 14 వార్డులో మరో 200 దొడ్లకు బిల్లులు చెల్లించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. -
ఏమనీ చెప్పనూ..
► ఉపాధి పథకం సస్పెండెడ్ ఖాతాల్లో రూ.3.74 కోట్ల నిధులు ► బోగస్ ఖాతాలతో కాజేసేందుకు పథకం ► ఆధార్ అనుసంధానంతో అక్రమార్కులకు చెక్ సాక్షి, మచిలీపట్నం : ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న కూలీల పేరుతో సొమ్ము స్వాహా చేయాలని క్షేత్ర స్థాయి అధికారులు, సిబ్బందిలో కొందరు గుట్టుచప్పుడు కాకుండా ప్రయత్నించారు. ఈ మేరకు పథకం ప్రకారం జిల్లా వ్యాప్తంగా రెండున్నరేళ్ల వ్యవధిలో సస్పెండెడ్ అకౌంట్లకు రూ.3.74 కోట్లను మళ్లించారు. ఆ సొమ్మును 51,198 మంది కూలీలకు చెల్లించాలని రికార్డుల్లో చూపించారు. వాస్తవానికి రికార్డుల్లో చెబుతున్న కూలీల్లో 80 శాతం మంది బోగస్ అని సమాచారం. మిగిలిన 20 శాతం మంది ఆధార్ సమస్యల వల్ల నగదు తీసుకోలేదని తెలిసింది. అయితే, సస్పెండెడ్ అకౌంట్లలో ఉన్న సొమ్మును తమ ఖాతాలకు మళ్లించుకోవాలని అక్రమార్కులు భావించగా, ఎప్పటికప్పుడు ఇబ్బందులు రావడంతో వెనకడుగు వేశారు. గత ఏడాది డిసెంబర్లో కూలీల ఖాతాలు, జాబ్ కార్డులకు ఆధార్ అనుసంధానం చేయడంతో కథ పూర్తిగా అడ్డం తిరిగింది. అప్పటి నుంచి కూలీల ఖాతాల్లోకే నగదు జమ అవుతోంది. దీంతో బోగస్ కూలీల పేరుతో సస్పెండెడ్ అకౌంట్లలో జమ చేసిన నగదు తీయడం సాధ్యం కాలేదు. అయితే, ఈ ఏడాదికి సంబంధించి ఆధార్ సమస్య వల్ల వేతనం తీసుకోలేని వారికి మాత్రం డబ్బులు చెల్లించే అవకాశం ఉంది. సస్పెండ్ ఖాతాల్లో నిధులు ఇలా... గడిచిన రెండున్నరేళ్లలో జిల్లా వ్యాప్తంగా 51,198 మంది కూలీలకు సంబంధించి రూ.3.74 కోట్ల వేతనం సస్పెండ్‌లో ఉంది. అందులో 30 నుంచి 60 రోజుల్లోపు పని దినాలకు సంబంధించి 2,685 మంది కూలీలకు చెందిన రూ.22.17 లక్షలు సస్పెండ్‌లో ఉంది. 60 నుంచి 90 రోజులకు సంబంధించి 1,751 మందికి రూ.21.97 లక్షలు, 90 రోజులకు పైబడి 36,399 మందికి రూ.44.36 లక్షలు పెండింగ్‌లో ఉంది. ఇందులో 90 రోజులకు పైబడి 36,399 మంది కూలీలకు చెందిన రూ.285.43 లక్షలు సస్పెండ్ అయింది. ఈ సొమ్ములో 80 శాతానికి సగానికి పైగా బోగస్ అకౌంట్లలో ఉన్నట్లు తెలుస్తోంది. అందువల్లే సొమ్మును క్లెయిమ్ చేసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని సమాచారం. బోగస్ ఖాతాల మాయాజాలం జిల్లాలో 49 మండలాలు, 970 పంచాయతీలున్నాయి. 1,839 హ్యాబిటేషన్లు ఉన్నాయి. జిల్లాలో 6,06,583 మందికి ఇప్పటి వరకు ఉపాధి జాబ్‌కార్డులు మంజూరు చేశారు. అందులో 5,95,823 మంది కూలీలు ఉపాధి పనులు సద్వినియోగం చేసకుంటున్నారు. 37,008 మంది శ్రమశక్తి సంఘాల్లో నమోదు చేసుకున్నారు. ప్రతి రోజూ లక్షకు పైగా కూలీలు పనుల్లో పాల్గొంటున్నారు. గతేడాది జూన్ వరకు కూడా దాదాపు 500 పంచాయతీల్లో మాత్రమే కూలీలకు బ్యాంక్ ఖాతాలుండేవి. మిగిలిన పంచాయతీల్లో పోస్టాఫీసుల ద్వారానే చెల్లింపులు జరిగాయి. ఆ తర్వాత వేలిముద్రల ఆధారంగా బయోమెట్రిక్ విధానాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో ఎక్కడికక్కడ బోగస్ ఖాతాలు సృష్టించిన సిబ్బంది... పనులకు రాని కూలీల పేర్లతో సైతం మస్తర్లు సృష్టించి వేతన సొమ్మును ఖాతాల్లోకి వేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్ష నగదు బదిలీకి శ్రీకారం చుట్టింది. జాబ్‌కార్డు ఉన్న వారందరికీ పీఎంజేడీవై (ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన), వ్యక్తిగత పొదుపు ఖాతా ఏదో ఒకటి ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఖాతాలు ప్రారంభించి నేరుగా నగదు జమ చేస్తున్నారు. అప్పటి నుంచి సస్పెండ్ ఖాతాల్లో ఉన్న నిధులను ఎలా తీసుకోవాలనే విషయంపై అక్రమార్కులు మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలిసింది.