సాక్షి, హైదరాబాద్: జాతీయ ఉపాధిహామీ చట్టం కింద ఉపాధి పొందాలంటే తప్పనిసరిగా ఆధార్ ఆధారిత చెల్లింపు బ్రిడ్జి సిస్ట మ్ (ఏబీపీఎస్)కు మారాల్సిందే. గతంలో మూడునాలుగు పర్యాయాలు ఈ డెడ్‌లైన్ మారినా, ఇకపై ఎలాంటి పొడిగింపులు ఉండవని కేంద్ర ప్రభుత్వవర్గాలు స్పష్టం చేస్తు న్నట్టు తెలుస్తోంది.
ఆగస్టు 31వ తేదీ వరకే బ్యాంక్ ఖాతా ఆధారిత, ఆధార్ ఆధారిత పద్ధతుల్లో పేమెంట్స్ చేస్తారు. ఇకపై ఆధార్–ఎనెబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (ఏఈపీఎస్) కాకుండా, సెపె్టంబర్ 1వ తేదీ నుంచి ఏబీపీఎస్ అనుసరిస్తున్నారనే విషయాన్ని గమనించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.
♦ ఈ కొత్త విధానంలో భాగంగా ఉపాధి హామీ జాబ్‌కార్డ్ హోల్డర్, తన జాబ్‌కార్డ్‌ను బ్యాంక్ ఖాతా, ఆధార్‌తో అనుసంధానం చేయడంతో పాటు దీనిని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) మ్యాపర్‌తో తప్పనిసరిగా కనెక్ట్ చేయాలి.
♦ ఆధార్‌తో బ్యాంక్ అకౌంట్ సీడింగ్, ఎన్‌పీసీఐ మ్యాపర్‌లో మ్యాపింగ్ చేయడానికి ఖాతాదారు కేవైసీ వివరాలు, బయోమెట్రిక్, స్థానికత, ఆధార్ డేటా బేస్–బ్యాంక్ ఖాతాల్లోని వివరాల్లో తేడాలు లేకుండా చూసుకోవడం వంటివి చేయాల్సి ఉంటుంది.
♦ ఉపాధిహామీ జాబ్‌కార్డు సమాచారంలో తేడాలున్నా వేజ్ పేమెంట్ అనేది స్తంభిస్తుంది.
♦ ఉపాధి కూలీలు బ్యాంక్ ఖాతాలను తరచుగా మార్చడం, దానిని ప్రోగ్రామ్ ఆఫీసర్లు అప్‌డేట్ చేయకపోవడం, తదితర కారణాల నేపథ్యంలో లబ్దిదారులకు నష్టం జరగకుండా ఏబీపీఎస్ అత్యుత్తమ ప్రత్యామ్నాయమని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ స్పష్టం చేసింది.
♦క్షేత్రస్థాయిలో వివిధ జిల్లాల్లో జాబ్‌కార్డును బ్యాంక్ ఖాతా, ఆధార్‌తో అనుసంధానం చేయడంలో సిబ్బందికి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి అధికారులు చెబుతున్నారు. ఈ డెడ్‌లైన్ మరికొంతకాలం పొడిగిస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని సూచిస్తున్నారు.
లిబ్‌టెక్ నివేదికలో ఏముందంటే...
♦కేంద్ర ప్రభుత్వం సాంకేతిక అంశాలకు ప్రాధాన్యం ఇచ్చి ఉపాధిహామీ చట్టం ఆశయాలు, లక్ష్యాలను నీరుగారుస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
♦ రాష్ట్రంలోని మొత్తం కోటీ ఐదు లక్షల మంది (ఇన్ యాక్టివ్ వర్కర్లతో సహా) ఉపాధి కూలీల్లో 42 లక్షల మంది ఏబీపీఎస్‌కి అనర్హులుగా ఉండిపోయారు.
♦ పనిచేస్తున్న 61 లక్షల కూలీల్లో (యాక్టివ్ వర్కర్స్) 5.33 లక్షల మంది ఏబీపీఎస్‌కి అర్హత సాధించలేకపోయారు.
♦ నరేగా పోర్టల్ నుంచి సమాచారాన్ని విశ్లే షించిన లిబ్‌టెక్ ఇండియా సంస్థ తన ని వేదికలో ఈ విషయాలను వెల్లడించింది.
పేమెంట్ మిస్ కాకుండా ప్రభుత్వాలే బాధ్యత వహించాలి
యాక్టివ్ వర్కర్స్ కేటగిరీలో ఏబీపీఎస్ అర్హత విషయంలో మొత్తం కార్మికుల సంఖ్యను పరిగణనలోకి తీసుకున్నపుడు గణనీయమైన సంఖ్యలో కార్మికులు దీనికి అర్హత సాధించలేదని అర్థమవుతుంది. దీంతో వారు ఉపాధి హామీ కింద పని పొందడానికి అనర్హులుగా చేస్తుంది. ఇది ఉపాధి చట్టం సూత్రాలకు స్పష్టమైన ఉల్లంఘనే.
అంతేకాకుండా, గత 18 నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా నికరంగా తొలగించిన దాదాపు 4 లక్షల మంది కార్మికులను ఏబీపీఎస్ అర్హత గణాంకాలు పరిగణనలోకి తీసుకోలేదు. తెలంగాణలో ఏ ఒక్క కార్మికుడు కూడా ఏబీపీఎస్ కారణంగా ఉపాధి హామీ చట్టం కింద పని, పేమెంట్ మిస్ కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. – చక్రధర్ బుద్దా,డైరెక్టర్, లిబ్‌టెక్ ఇండియా సంస్థ
Comments
Please login to add a commentAdd a comment