1 నుంచి ‘ఉపాధి’కి ఆధార్‌ చెల్లింపులు  | Job Card and Aadhaar and Bank Account Linking is mandatory | Sakshi
Sakshi News home page

1 నుంచి ‘ఉపాధి’కి ఆధార్‌ చెల్లింపులు 

Published Mon, Aug 28 2023 5:02 AM | Last Updated on Mon, Aug 28 2023 1:13 PM

Job Card and Aadhaar and Bank Account Linking is mandatory - Sakshi

సాక్షి, అమరావతి:  దేశవ్యాప్తంగా ఉపాధి హామీ కూలీలకు సెప్టెంబరు 1వతేదీ నుంచి పూర్తి స్థాయిలో ఆధార్‌తో అనుసంధానం చేసిన బ్యాంకు అకౌంట్లకు మాత్రమే వేతనాలు చెల్లింపులు చేస్తారు. ఉపాధి హామీ జాబ్‌ కార్డు నెంబరుతో పాటు ఆధార్, బ్యాంకు ఖాతాలను ఉమ్మడిగా అనుసంధానం చేసుకుంటేనే ఆయా ఖాతాలకు వేతనాలు జమ అవుతాయి.

ఈ మూడింటినీ అనుసంధానం చేసుకోని వారికి సెప్టెంబరు ఒకటో తేదీ తర్వాత ఉపాధి పథకం పనులకు హాజరైనా వేతనాలు జమ చేసే పరిస్థితి ఉండదని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం అమలులో అక్రమాలకు తావులేకుండా ఉండేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఈ మేరకు కీలక మార్పులు తెచ్చింది. దీన్ని ఈ ఏడాది ఫిబ్రవరి 1వతేదీ నుంచే అమలు చేయాలని తొలుత  భావించినా చాలా రాష్ట్రాల్లో (మన రాష్ట్రం కాదు) పెద్ద సంఖ్యలో కూలీల జాబ్‌కార్డులను ఆధార్, బ్యాంకు అకౌంట్లతో అనుసంధానించే ప్రక్రియ పూర్తి కాకపోవడంతో పలు దఫాలు వాయిదా పడుతూ వస్తోంది.

తాజాగా సెప్టెంబరు ఒకటి నుంచి ఖచ్చితంగా నూతన విధానంలోనే కూలీలకు వేతనాల చెల్లింపులు ఉంటాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్రాలకు స్పష్టం చేసినట్టు అధికారులు వెల్లడించారు. కేంద్రం ఈ ప్రతిపాదనలను తేకముందు నుంచే మన రాష్ట్రంలో ఉపాధి కూలీలకు పాక్షికంగా ఆధార్‌ అనుసంధానంతో కూడిన వేతనాల చెల్లింపులు కొనసాగుతున్నట్లు వివరించారు.

రాష్ట్రంలో పథకం అమలులో పారదర్శకత కోసం వీలైనంత మేర కూలీల జాబ్‌కార్డులను బ్యాంకు అకౌంట్లతో అనుసంధానించగా మిగతావారికి కూడా ఇప్పటివరకు వేతనాలను చెల్లిస్తున్నారు. అయితే సెప్టెంబరు ఒకటి నుంచి మాత్రం వందకు వంద శాతం తప్పనిసరిగా ఆధార్‌ అనుసంధానం విధానంలో వేతనాల చెల్లింపుల ప్రక్రియ ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.  

రాష్ట్రంలో 99.53 శాతం అనుసంధానం 
ఆంధ్రప్రదేశ్‌లో 69 లక్షల కుటుంబాలకు చెందిన 1.24 కోట్ల మంది కూలీలు ఉపాధి హామీ పథకంలో పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో ఏటా గరిష్టంగా 47.74 లక్షల కుటుంబాలకు సంబంధించి దాదాపు 79.81 లక్షల మంది కూలీలు ఉపాధి పనులతో లబ్ధి పొందుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు కలిపి గత ఐదేళ్లుగా ఏటా రూ.ఐదారు వేల కోట్లకు తక్కువ కాకుండా ప్రయోజనం చేకూరుతోంది.

వేతనాల చెల్లింపుల్లో కేంద్రం తెచ్చిన నూతన విధానంతో ఉపాధి హామీ కూలీలెవరూ ఇబ్బంది పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగానే అన్ని జాగ్రత్తలు తీసుకుంది. మొత్తం 1.24 కోట్ల మంది కూలీలలో 99.53 శాతం మంది జాబ్‌ కార్డులు ఆధార్, బ్యాంకు అకౌంట్లతో అనుసంధానం ప్రక్రియను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు.

గత మూడేళ్లలో ఒక్క రోజైనా ఉపాధి పనులకు హాజరైన క్రియాశీలక కూలీలలో 97.2 శాతం మందిని కూడా ఇప్పటికే అనుసంధానించారు. ఉపాధి పథకం కూలీల జాబ్‌కార్డులను ఆధార్, బ్యాంకు అకౌంట్లతో అనుసంధానించే ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ  గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

త్రిపుర, కేరళ, లడఖ్, పుదుచ్చేరి, చత్తీస్‌గఢ్, సిక్కిం, తమిళనాడు తరువాత స్థానాల్లో ఉన్నాయి. మన రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో పేర్లు నమోదు చేసుకున్న కూలీలలో ఇంకా కేవలం 60 వేల మందికి సంబంధించి మాత్రమే ఆధార్‌ అనుసంధానం ప్రక్రియ పూర్తి కావాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. వారు గతంలో పేర్లు నమోదు చేసుకున్నప్పటికీ ఉపాధి పనులపై పెద్దగా ఆసక్తి చూపని వారే కావచ్చని పేర్కొంటున్నారు.   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement