
ఖైదీలతో వివిధ ఉత్పత్తి విభాగాల నిర్వహణ
ఏడాదిలో కారాగారం నుంచి రూ 2 కోట్ల విలువైన ఉత్పత్తులు
జైలు కాలం...నవ జీవన రాగం
ఖైదీల్లో ఆర్థిక స్వావలంబన
పలు కర్మాగారాలతో ఉపాధి కల్పిస్తోన్న విశాఖ కేంద్ర కారాగారం
వారంతా ఏదో ఒక సందర్భంలో క్షణికావేశానికి లోనై నేరాలకు పాల్పడి శిక్ష పడిన వారే. కొందరికి కారాగారం నెలరోజులైతే..ఇంకొందరికి ఏడాది..మరికొందరికి మూడేళ్లు...ఇలా అయినవారికి దూరంగా..బాహ్య ప్రపంచానికి నోచుకోక..నాలుగుగోడల మధ్య అపరాధులుగా కాలం వెళ్లదీస్తున్న వారే. ఇలాంటివారిని జీవన స్రవంతిలో శిక్షాకాలం అనంతరం క్రమ శిక్షణ, స్వయం సాధికారత, ఆర్థిక స్వావలంబనతో ముందడుగు వేసేలా తీర్చిదిద్దుతోంది ఆ కారాగారం.
వారి కాళ్లమీద వారు నిలబడే రీతిలో నైపుణ్యాలను నేరి్పస్తోంది. పేరుకు జైలైనప్పటికీ..ఖైదీల జీవితాలకు మేలు తలపించే కార్యక్రమాలను చేపడుతూ వారి భావిజీవితానికి బంగారు బాటలు వేస్తోంది. ఇంతకీ ఎక్కడుందీ ఆ జైలు..అక్కడి ఖైదీలకు నేరి్పస్తున్న జీవన పాఠాలేంటీ?
ఆరిలోవ: విశాఖపట్నం.. కేంద్ర కారాగారం..ఖైదీలకు చెరసాలే కాదు...పలు రకాల కర్మాగారాల నిలయం. వీటిలో శ్రమించి, అందుకు తగిన ప్రతిఫలం పొందేది బయటివారు కాదు. ఇక్కడ శిక్షను అనుభవిస్తున్న ఖైదీలే. స్రత్పవర్తన అలవరిచేలా జైళ్ల శాఖ ఇక్కడి పరిశ్రమల్లో ఖైదీలకు చేతినిండా పని కల్పిస్తోంది. అటు ఖైదీలకు, ఇటు జైళ్ల శాఖ సంక్షేమ నిధికి ఆదాయ మార్గాలుగా ఈ కర్మాగారాలు నిలుస్తున్నాయి.
చీపుళ్ల నుంచి బేకరీ ఉత్పత్తుల దాకా...
ఇక్కడ ఇళ్లు ఊడ్చుకొనే చీపుర్ల నుంచి కుర్చీలు, టేబుళ్ల వరకు తయారవుతున్నాయి. స్టీల్ పరికరాలు, వ్యవసాయం, పాడి పరిశ్రమ, బుక్ బైండింగ్, చేనేత బట్టలు, బేకరీ ఉత్పత్తులను తయారుచేస్తుంటారు. కర్మాగారాల్లో ఖైదీలే కారి్మకులుగా కనిపిస్తారు. వారు జైల్లో శిక్ష అనుభవిస్తున్నామనే భావం లేకుండా, ఆడుతూ పాడుతూ పనిచేసుకుపోతున్నారు. ఆరోగ్యకరమైన పంటలు పండించడం, నాణ్యమైన వస్తువుల రూపకల్పనలో నిమగ్నమవుతారు.
జైల్లో ఉన్న కర్మాగారాలతో 2024–25 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.2 కోట్ల విలువైన ఉత్పత్తులను ఇక్కడి ఖైదీలు తయారు చేశారు. జైల్‌లో వినియోగించగా మిగిలిన వాటిని బయట విక్రయిస్తున్నారు. అలాగే రాష్ట్రం లోని ఇతర జైళ్లకు సరఫరా చేస్తున్నారు.
ఉత్పత్తులు.. ఆదాయమార్గాలు
ఇక్కడ సుమారు 200 మంది ఖైదీలు శిక్ష అనుభవిస్తున్నారు. వీరంతా వారి శక్తి సామర్థ్యాల మేరకు పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. పని ఆధారంగా వేతనాలు చెల్లిస్తారు. విడుదల సమయంలో ఆ నగదును వారికి అందిస్తారు.
» స్టీల్ యూనిట్‌లో బెంచీలు, కుర్చీలు, టేబుళ్లు, బీరువాలు, ఆస్పత్రుల్లో వినియోగించే పడకలు, ర్యాక్స్, పాఠశాల విద్యార్థులు కూర్చునే బెంచీలను తయారు చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు వాటిని ముందుగానే బుక్ చేసుకుంటాయి.
» ఇక్కడ సేంద్రియ పద్ధతిలో కూరగాయలు పండిస్తారు. మామిడి, కొబ్బరి ఉత్పత్తవుతోంది. వీటిని ఖైదీలకు వినియోగించగా మిగిలినవి సుధార్ కేంద్రంలో బయటి వ్యక్తులకు విక్రయించడం ద్వారా లాభం చేకూరుతోంది.
» పాడి విషయానికి వస్తే..మేలు జాతి రకాలకు చెందిన 14 ఆవులు, 10 గేదెలున్నాయి. వాటి నుంచి వచ్చిన పాలను ఖైదీలకు వినియోగిస్తున్నారు. –జైల్లో బేకరీ ఉత్పత్తులకు వీటి పాలే వాడతారు.
» చేనేత యూనిట్లో బెడ్ షీట్స్, తువ్వాళ్లు తయారు చేస్తారు. వీటిని ఖైదీలకు వినియోగించగా మిగిలినవి సుధార్ కేంద్రంలో విక్రయిస్తున్నారు.
» టైలరింగ్ యూనిట్‌లో టీ–షర్ట్స్, షార్ట్స్ తయారవుతున్నాయి.
» బుక్ బైండింగ్ యూనిట్‌లో పుస్తకాలకు ఎక్కువగా కోర్టుల నుంచి ఆర్డర్లు వస్తుంటాయి.
» డర్రీ యూనిట్లో తయారైన రగ్గులు, తివాచీలను ఖైదీలకు, గార్డింగ్ సిబ్బందికి సరఫరా చేస్తున్నారు.
» బేకరీ ఉత్పత్తులను ఖైదీలను కలుసుకునేందుకు వచి్చన వారికి విక్రయిస్తుంటారు.
ఆదాయార్జనలో అంతకుమించి..
జైలులో పలు రంగాల ఉత్పత్తుల ద్వారా ఆదాయార్జనలో ఏటికేడు కేంద్ర కారాగారం తనదైన శైలిలో ముందడుగు వేస్తోంది. 2006 నాటి ఆదాయంతో పోల్చి చూస్తే 19 ఏళ్ల కాలంలో పదిరెట్ల పురోగతితో దూసుకుపోతోంది.
ఆదాయార్జన గణాంకాలివీ..
సంవత్సరం ఆదాయం (రూ. లలో)
2006 20లక్షలు
2015 40లక్షలు
2016 1.30 కోట్లు
2017 1.40 కోట్లు
2020 1.60 కోట్లు
2024 2.01 కోట్లు
ఈ విభాగాల్లో అత్యధిక ఉత్పత్తి..
కారాగారంలో ఉన్న యూనిట్లలో అత్యధిక ఉత్పత్తిలో స్టీల్ పరికరాల యూనిట్ మొదటి వరసలో ఉంది. తర్వాతి స్థానాల్లో బేకరీ, చేనేత, వ్యవసాయ క్షేత్రాలున్నాయి. ఈ నాలుగు యూనిట్ల ద్వారా 2024–25 సంవత్సరంలో రూ 1.71 కోట్ల విలువైన ఉత్పత్తులు వచ్చాయి. విభాగం వారీ ఉత్పత్తి, వాటి విలువను చూస్తే...(కింది గణాంకాలను పట్టికలో వేసుకోవాలి)
విభాగం ఉత్పత్తుల విలువ జైలుకు సమకూరిన ఆదాయం (రూ.లలో) (రూ. లక్షల్లో)
స్టీల్ పరికరాలు 1.35 కోట్లు 17
బేకరీ 15.30 లక్షలు 20
చేనేత 15 లక్షలు 1.60
వ్యవసాయం 5.80 లక్షలు 1.20
ఇతరములు 28.90 లక్షలు 5.70
జైల్లో ఉన్నా.. కుటుంబాలకు అండగా..
జైల్లో శిక్ష అనుభవిస్తున్న కాలంలో ఖైదీలకు చేతినిండా పని ఉంటుంది. జైల్లో ఉన్నప్పటికీ వారి కుటుంబానికి ఆరి్థకంగా అండగా నిలిచేలా ఆదాయం సమకూరుస్తున్నాం. వారికి ఆదాయ మార్గాలను పెంచుతాం. తయారీ రంగాల్లో ఉత్పత్తులను మరింత పెంచే దిశగా ప్రణాళిక రచిస్తున్నాం. – ఎం.మహేష్ బాబు, పర్యవేక్షణాధికారి, విశాఖ కేంద్రకారాగారం