టాప్–25లో 16 దక్షిణాది నగరాలే అవతార్ టీసీడబ్ల్యూఐ నివేదిక వెల్లడి
47.15 శాతం ఉపాధి అవకాశాలతో అగ్రస్థానంలో బెంగళూరు
తర్వాత స్థానాల్లో చెన్నై, ముంబై, హైదరాబాద్
విశాఖకు 25వ స్థానం
మహిళల జీవనోపాధికి భద్రత కల్పిస్తున్న నగరాలు
సామాజిక అవకాశాల్లో చెన్నైది అగ్రస్థానం
సాక్షి, విశాఖపట్నం: జీవనోపాధి రంగంలో దక్షిణాది మహిళలు అద్భుతంగా రాణిస్తున్నారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో మొదటి 25 నగరాల్లో 16 దక్షిణాదికి చెందినవే ఉండటం విశేషం. అవతార్ అనే ప్రముఖ ఎన్జీవో ఏటా విడుదల చేసే ‘టాప్ సిటీస్ ఫర్ ఉమెన్ ఇన్ ఇండియా (టీసీడబ్ల్యూఐ)’ సర్వేలో 47.15 శాతం మంది మహిళలు జీవనోపాధి పొందుతున్న బెంగళూరు అగ్రస్థానంలో నిలవగా.. విశాఖపట్నం 25వ స్థానంలో కొనసాగుతోంది.
చీకట్లను చీల్చుకుని..
పితృస్వామ్య భావజాల బంధన వలయాల్ని చీల్చుకుంటూ మహిళలు మరీ ముఖ్యంగా దక్షిణాది మహిళలు ముందడుగు వేస్తున్నారు. భవిష్యత్‌పై కోటి ఆశల కలల్ని నిజం చేసుకోవాలన్న తపనతో ఉన్నత లక్ష్యాల్ని నిర్దేశించుకుంటూ సరికొత్త ప్రపంచం వైపు పరుగులు తీస్తున్నారు. ఆంక్షల సంకెళ్లు దాటి.. ఆర్థిక పురోభివృద్ధి దిశగా పయనిస్తున్నారు. ఓ వైపు భారతావనికి సేవచేసే బాధ్యతాయుత పదవుల్లోనూ అతివల ప్రాతినిధ్యం పెరుగుతున్న తరుణంలో.. తమ జీవన ప్రమాణాలు పెంపొందించే రంగాల్లోనూ మహిళలు దూకుడు ప్రదర్శిస్తున్నారు.
జీవనోపాధిలో ప్రతి మహిళా సాధిస్తున్న విజయం.. మరో మహిళకు స్ఫూర్తిగా నిలుస్తోంది. క్రమంగా స్వసంపాదన దిశగా పయనిస్తూ విజయ శిఖరాల్ని చేరుకుంటున్నారు. కుటుంబ ఆదాయ, వ్యయ అంచనాతో పాటు ప్రణాళికలను వేసుకోవడం, వివిధ పథకాలను ఉపయోగించుకోవడం, ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం వంటి విషయాల్లో మహిళల ప్రత్యక్ష పాత్ర పెరుగుతూ వస్తోందని అవతార్ సంస్థ ప్రకటించిన టీసీడబ్ల్యూఐ–2024 నివేదిక స్పష్టం చేసింది.
బెంగళూరు బెస్ట్.. చెన్నై, ముంబై నెక్స్ట్
టీసీడబ్ల్యూఐ–2024 పేరుతో మిలియన్ ప్లస్ సిటీస్, లెస్ దేన్ మిలియన్ సిటీస్.. అని రెండుగా విభజించి సర్వే చేపట్టారు. సిటీ ఇన్‌క్లూజన్ స్కోర్ (సీఐఎస్) పరంగా.. మిలియన్ ప్లస్ సిటీస్ జాబితాలో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న నగరాల్లో బెంగళూరు 47.15 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా.. 46.31 పాయింట్లతో చెన్నై రెండో ర్యాంకు, 41.11తో ముంబై, 38.89తో హైదరాబాద్, 36.88తో పుణె తరువాత స్థానాల్లో నిలిచాయి. సామాజిక అవకాశాలు (ఎస్‌ఐఎస్) కల్పించే విషయంలో మాత్రం.. చెన్నై అగ్రస్థానంలో నిలవగా.. పుణె, బెంగళూరు, హైదరాబాద్, ముంబై తర్వాత స్థానాలు పొందాయి. పారిశ్రామిక అవకాశాలు కల్పించే నగరాల్లో మాత్రం బెంగళూరు మొదటి స్థానంలోనూ, ముంబై, చెన్నై, హైదరాబాద్, పుణె తర్వాత స్థానాల్లో నిలిచాయి. మొత్తంగా మొదటి 25 నగరాల్లో 16 నగరాలు దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలకు చెందినవే ఉండటం విశేషం.
ఏపీలో ఒకే ఒక్క నగరం
మహిళా స్నేహపూర్వక కెరీర్ అవకాశాలు, మౌలిక సదుపాయాలు, భద్రత, సాధికారత ఆధారంగా ఇచ్చిన ర్యాంకింగ్‌లో దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు అగ్రభాగంలో ఉంది. తమిళనాడుకు చెందిన 8 నగరాలు టాప్–25లో చోటు దక్కించుకున్నాయి. కేరళలో 3, కర్ణాటకలో 2 నగరాలు జాబితాలో ఉండగా.. తెలంగాణలో హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం మాత్రమే ఇందులో నిలిచాయి. మిలియన్ ప్లస్ సిటీస్‌లో విశాఖపట్నం 17.92 శాతంతో 25వ స్థానంలో నిలిచింది. 2022–2023లో విశాఖ 37వ ర్యాంకులో ఉండేది. రాష్ట్రంలో మహిళా సాధికారతకు గత ప్రభుత్వం పెద్దపీట వేయడంతో 2023–24కి ఏకంగా 12 స్థానాలు ఎగబాకి విశాఖ టాప్–25లో నిలవడం విశేషం. ఇక సామాజిక పరంగా అవకాశాలు కల్పిస్తున్న జాబితాలో విశాఖ 33వ స్థానంలో నిలవగా.. పారిశ్రామిక అవకాశాలు కల్పిస్తున్న జాబితాలో 20వ ర్యాంక్ సాధించింది.
120 నగరాల్లో సర్వే
దేశ జీడీపీలో ప్రస్తుతం మహిళల పాత్ర 18 శాతమే ఉన్నా.. భవిష్యత్‌లో మరింత దూసుకుపోయే సత్తా అతివలకు ఉంది. మహిళలు విజయం సాధిస్తే.. భారత్ సాధించినట్టేనని అవతార్ సంస్థ భావిస్తోంది. దేశ జనాభాల్లో 48 శాతం మహిళలు ఉండగా.. ఇందులో 35 శాతం మంది నగరాల్లో జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో నగరాలు ఎంతమేర పాత్ర పోషిస్తున్నాయనే అంశంపై అవతార్ సర్వే ద్వారా పరిశీలిస్తోంది.
మహిళల వృత్తిపరమైన వృద్ధి, శ్రేయస్సు, విద్య, ఆరోగ్య సంరక్షణ, మొదలైన వనరులను పొందే నగరాలను గుర్తించింది. ఉపాధిలో
లింగ అంతరాన్ని తగ్గించి, జీడీపీలో మహిళా సమానత్వాన్ని పెంపొందించి, ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్న నగరాలు ఏవి, మహిళలకు స్థిరమైన, సమ్మిళిత ఉపాధిని కల్పించడంలో నగరాలు, సంస్థలు చేపడుతున్న పాత్రపై అవతార్ సర్వే ఫలితాల్ని వెల్లడించింది. 2022 నుంచి మహిళల జీవనోపాధిపై సర్వే నిర్వహిస్తోంది. తొలి ఏడాది 112 నగరాల్లో చేపట్టగా.. ఈ సారి 120
నగరాల్లో మహిళల స్థితిగతులపై ఆరా తీసింది.
ప్రతి పరిణామంలో తమదైన పాత్ర
సమాజంలో మార్పులకు మహిళలు అంకురార్పణ చేస్తున్నారు. ప్రపంచంలోని ప్రతి పరిణామంలోనూ తమదైన పాత్రను పోషిస్తూ ప్రతిభ చాటుతున్నారు. అవకాశాలు లేవు అని అనుకోవడం కాకుండా.. నగరాలు, పట్టణాల్లో ఉన్న అవకాశాలను వినియోగించుకుంటున్నారు. పురుషులతో సమానంగా చదవడమేకాదు.. పోటీపడి పనిచేస్తున్నారు. ఏయే నగరాలు మహిళా సాధికారతకు ఎంతమేర అవకాశాలు కల్పిస్తున్నాయనే అంశంపై సర్వే చేసి నివేదిక అందించడం వల్ల.. ఆ ర్యాంకింగ్స్ ఆధారంగానైనా ప్రభుత్వాలు, సంస్థల తీరులో మార్పులు వస్తాయనే ఆశతోనే అవతార్ సంస్థ పరిశోధనలు చేస్తోంది. ఆర్థికంగా, సామాజికంగా, పారిశ్రామిక రంగంలోనూ ఎదుగుతూ ప్రతి మహిళ పెదవిపై చిరునవ్వుల వెలుగులు విరజిమ్మాలన్నదే మా సంస్థ ముఖ్య లక్ష్యం. ఆ దిశగా.. ఏటికేడూ విభిన్న రంగాల్లో సర్వేలు నిర్వహించనున్నాం. – డాక్టర్ సౌందర్య రాజేష్, అవతార్ వ్యవస్థాపకురాలు
Comments
Please login to add a commentAdd a comment