
డీజీపీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఘటన
మర్మాంగంలో సైతం గాయాలు అయినట్లు అనుమానం
సెల్‌ఫోన్ ఆధారంగా వివరాలు సేకరిస్తున్న పోలీసులు
జనవరి 31న కూడా ఇదే తరహాలో మరో మహిళ హత్య
రెండు హత్యలు చేసింది ఒక్కరేనని పోలీసుల అనుమానం
తాడేపల్లి రూరల్: విజయవాడ–గుంటూరు జాతీయ రహదారి మధ్య డీజీపీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఓ మహిళ అత్యాచారం, ఆపై హత్యకు గురైంది. స్థానికుల కథనం మేరకు.. కొలనుకొండ జాతీయ రహదారి నుంచి గుంటూరు చానల్ మీదుగా ఇప్పటం వెళ్లే రహదారిలో జాతీయ రహదారికి 100 మీటర్ల దూరంలో ఈ దారుణం జరిగింది. మహిళ మృతదేహానికి ఎడమ చేతి వైపున గొంతుపై బలంగా పొడిచినట్లు గాయం కనిపిస్తోంది. మహిళ మొహంపై పూర్తిగా రక్తం ఉండడంతో ఆమె ముఖఛాయలు సరిగా కనిపించడం లేదు. మర్మాంగం వద్ద రక్తం కారుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
మహిళ రెండు కాళ్లూ మోకాలు నుంచి కిందకు వంచి ఉన్నాయి. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లే సరికి హత్య జరిగి సుమారు 40 నిమిషాలు అయ్యుండొచ్చని భావిస్తున్నారు. తాడేపల్లి సీఐ కల్యాణ్ రాజు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి అది హత్యగా నిర్ధారించారు. సంఘటన స్థలం వద్ద సెల్‌ఫోన్, హ్యాండ్ బ్యాగ్ లభించాయని.. వాటిని పరిశీలించి ఆ మహిళ ఎవరో గుర్తిస్తామని తెలిపారు.
కాగా, డీజీపీ కార్యాలయం సమీపంలో, జాతీయ రహదారి పక్కనే ఓ హోటల్‌లో నిత్యం పోలీసులు ఉంటున్నప్పటికీ ఈ సంఘటన జరగడం చర్చనీయాంశమైంది. జనవరి 31వ తేదీన కూడా గుంటూరు ఛానల్ నుండి నులకపేటకు వచ్చే రహదారిలో ఇదే గ్రామంలో డీజీపీ కార్యాలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఇదే తరహాలో ఓ మహిళ హత్యకు గురైంది. ఆ మహిళ ఎవరో ఇప్పటి వరకు ఆచూకీ లభించలేదు. ఈ రెండు హత్యలు ఒకేలా జరగడంతో ఒకే వ్యక్తి చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
వెలిగే ఉన్న సెల్ ఫోన్ టార్చిలైట్
సంఘటనా స్థలం వద్ద మహిళ మృతదేహం కనిపించేలా సెల్‌ఫోన్‌లో టార్చిలైట్ వెలిగే ఉంది. హత్య చేసిన వ్యక్తే ఈ పని చేసి ఉంటాడనే అనుమానం వ్యక్తమవుతోంది. మహిళ సెల్‌ఫోన్‌కు ఎటువంటి రక్తపు మరకలు కనిపించ లేదు. లేదా హత్య జరగక ముందే ఆ మహిళ సెల్ ఫోన్‌లోని టార్చ్ లైట్‌ను ఆన్ చేసి ఉంచిందా.. అనే దిశలో కూడా పోలీసులు ఆలోచిస్తున్నారు.
ఇప్పుడు ఈ సెల్‌ఫోన్ కీలకంగా మారడంతో పోలీసులు దానిని స్వాధీనం చేసుకుని ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. మరో కోణంలో.. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కేసులు నమోదైన నేరస్తుల ద్వారా కూడా వివరాలు సేకరించి ఆ మహిళను గుర్తించే ప్రయత్నం చేస్తామని సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment