పక్కా కక్షే... అక్రమ కేసే | TDP Govt Red Book Conspiracy Against Senior IPS Officer PSR Anjaneyulu In Kadambari Jatwani Case, Complete Details Inside | Sakshi
Sakshi News home page

పక్కా కక్షే... అక్రమ కేసే

Published Thu, Apr 24 2025 4:40 AM | Last Updated on Thu, Apr 24 2025 12:20 PM

TDP Govt Red Book Conspiracy against senior IPS officer PSR Anjaneyulu

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులును విజయవాడ జైలుకు తరలిస్తున్న సీఐడీ అధికారులు

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులుపై రెడ్‌బుక్‌ కుట్రే

కాదంబరి జత్వానీతో ఇప్పించింది అబద్ధపు ఫిర్యాదే 

అంతకు ముందే అక్రమ కేసుకు రంగం సిద్ధం 

జత్వానీ నేరాలపై దర్యాప్తులో ఉన్న అంశాల వక్రీకరణ 

ఎవెడెన్స్‌ యాక్ట్‌ను వక్రీకరిస్తూ అక్రమ కేసు 

రిమాండ్‌ నివేదిక సాక్షిగా కుట్రలు బట్టబయలు 

తాను ఎలాంటి తప్పూ చేయలేదని పీఎస్‌ఆర్‌ స్పష్టీకరణ 

కోర్టులో తన కేసు తానే వాదించుకున్న పీఎస్‌ఆర్‌ 

14 రోజుల రిమాండ్‌ విధించిన న్యాయస్థానం 

రఘురామరాజు కక్ష సాధింపు కేసులోనూ పీఎస్‌ఆర్‌ను ఇరికించేందుకు మెమో దాఖలు చేసిన సీఐడీ 

మరిన్ని అక్రమ కేసులకు కూటమి సర్కారు కుటిల పన్నాగాలు  

సాక్షి, అమరావతి: సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులుపై టీడీపీ కూటమి సర్కారు పక్కా పన్నాగంతో అక్రమ కేసు నమోదు చేసింది. సీఐడీ దాఖలు చేసిన రిమాండ్‌ నివేదికే ఆ కుట్రలను బహిర్గతం చేసింది. వలపు వల విసిరి బడాబాబులను బురిడీ కొట్టించే నేర చరిత్ర ఉన్న ముంబై నటి కాదంబరి జత్వానీతో అబద్ధపు ఫిర్యాదు ఇప్పించేందుకు ఎంతటి పన్నాగంతో వ్యవహరించారో బయటపడింది. ఆమెపై గతంలో నమోదైన క్రిమినల్‌ కేసులు దర్యాప్తు ఉండగానే వాటిని వక్రీకరిస్తూ... భారత సాక్ష్యాధారాల చట్టానికి విరుద్ధంగా కక్ష పూరితంగా అక్రమ కేసు నమోదు చేసినట్లు స్పష్టమైంది. 

తాను ఎలాంటి తప్పూ చేయలేదని... జత్వానీపై గతంలో విజయవాడ పోలీసులు నమోదు చేసిన కేసుతో నాడు ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా ఉన్న తనకు ఎలాంటి సంబంధం లేదని పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు తన వాదనలను న్యాయస్థానంలో స్వయంగా వినిపించారు. ఈ కేసులో ఆయనకు న్యాయస్థానం 14 రోజులు రిమాండ్‌ విధించింది. మరోవైపు ప్రస్తుత డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు గతంలో చేసిన ఫిర్యాదుతో నమోదు చేసిన అక్రమ కేసులోనూ పీఎస్‌ఆర్‌ పేరును చేరుస్తూ సీఐడీ మెమో దాఖలు చేయడంతోపాటు మరిన్ని అక్రమ కేసులకు ప్రభుత్వం సిద్ధమైంది.

జత్వానీ అబద్ధపు ఫిర్యాదు.. అక్రమ కేసు
టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పీఎస్‌ఆర్‌ ఆంజనేయులుపై అక్రమ కేసు నమోదు చేసేందుకు ఉపక్రమించింది. అందుకోసం కాదంబరీ జత్వానీని సాధనంగా చేసుకుంది. విజయవాడకు చెందిన పారిశ్రామికవేత్త కుక్కల విద్యాసాగర్‌కు చెందిన భూములను ఫోర్జరీ పత్రాలతో విక్రయించేందుకు యత్నించిన కేసులో ఆమె నిందితురాలు. 

చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాదంబరి జత్వానీ ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వ గౌరవ అతిథిగా మారిపోయారు. అక్రమ కేసు నమోదుకు రంగం సిద్ధం చేస్తూ ముందుగా 2024 ఆగస్టులో టీడీపీ అనుకూల చానల్‌తో ఆమెను మాట్లాడించారు. వెంటనే విజయవాడ పోలీసులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆమెతో మాట్లాడారు. 

ఈ క్రమంలో ఆమెను 2024 సెప్టెంబరు 5న విజయవాడకు రప్పించడంతో ఏసీపీతోపాటు విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ ఎస్వీ రాజశేఖర్‌బాబును కలిశారు. వారం రోజులు ఆమె విజయవాడలోనే ప్రభుత్వ అతిథి హోదాలో ఉన్నారు. ఈ కేసులో విచారణ అధికారిగా నియమించాలని అప్పటికే నిర్ణయించిన ఉమామహేశ్వరరావు ఆమెకు కుట్ర కేసు నమోదు కథను వివరించారు.  అనంతరం 2024 సెప్టెంబరు 13 అర్ధరాత్రి కాదంబరీ జత్వానీ ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిరా>్యదు చేయడం... వెంటనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం చకచకా జరిగిపోయాయి.

జత్వానీ ఫోర్జరీ పత్రాలపై కేసు విచారణలో ఉండగానే పోలీసులపై ఫిర్యాదా..!
పీఎస్‌ఆర్‌ ఆంజనేయులుపై అక్రమ కేసు నమోదు చేసేందుకే కాదంబరీ జత్వానీతో అబద్ధపు ఆరోప­ణలతో ఫిర్యాదు చేయించినట్లు సీఐడీ నివేదిక ద్వారా స్పష్టమవుతోంది. కుక్కల విద్యా సాగర్‌కు చెందిన భూములను విక్రయించేందుకు వాటిని 2018లో కొనుగోలు చేసినట్టు ఆమె 2023లో ఫోర్జరీ పత్రాలు సృష్టించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. 



ఆ కేసు ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో ఉంది. కానీ తనపై అక్రమ కేసు పెట్టారని జత్వానీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఫిర్యాదు చేయడం గమనార్హం. అవి ఫోర్జరీ పత్రాలో.. కావో అన్నది పోలీసుల దర్యాప్తులో నిగ్గు  తేలుతుంది. అంతిమంగా న్యాయస్థానం తుది తీర్పు ఇవ్వాలి. 

అంతేగానీ ఇంకా దర్యాప్తులో ఉన్న కేసులోని అభియోగాలు తప్పని చెబుతూ నిందితులు పోలీసులపైనే ఫిర్యాదు చేస్తే వెంటనే కేసు నమోదు చేయడం  నిబంధనలకు విరుద్ధం. అదే విధానంగా మారితే దేశంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్న అన్ని క్రిమినల్‌ కేసుల్లోనూ నిందితులు తిరిగి పోలీసులపై ఫిర్యాదు చేసి అక్రమ కేసులు పెట్టేందుకు అనుమతించినట్టే అవుతుంది.  

తప్పు చేయలేదు... జత్వానీ ఎవరో తెలియదు
తనపై నమోదు చేసిన అక్రమ కేసులో పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు న్యాయస్థానంలో స్వయంగా వాదనలు వినిపించారు. కాదంబరి జత్వానీపై గతంలో విజయవాడ పోలీసులు నమోదు చేసిన కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని విస్పష్టంగా ప్రకటించారు.  సివిల్‌  పోలీసులు పర్యవేక్షించే క్రిమినల్‌ కేసులు, ఇతర దర్యాప్తులతో ఇంటెలిజెన్స్‌ డీజీగా ఉన్న తనకు ఎలాంటి సంబంధం ఉండదని పోలీసు సర్వీసు నియమావళిని ఉటంకిస్తూ వివరించారు. 

జత్వానీ తనపై చేసిన ఆరోపణలన్నీ పూర్తిగా అవాస్తవాలన్నారు. అందుకే తాను కనీసం ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ కూడా దాఖలు చేయలేదని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. తనపై అబద్ధపు అభియోగాలతోనే పోలీసులు, సీఐడీ అధికారులు అక్రమ కేసు నమోదు చేశారన్నారు. ఈ కేసులో మరో నిందితుడు ఐపీఎస్‌ అధికారి విశాల్‌ గున్నీ న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇవ్వలేదనే విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. 

పోలీసుల ఒత్తిడితో ఆయన నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన వాంగ్మూలాన్ని పరిగణలోకి తీసుకోకూ­డదని కోరారు. తాను సదా అందుబాటులో ఉన్నానని... దర్యాప్తునకు పూర్తిగా సహకరించేందుకు సిద్ధమని చెప్పినా సరే సీఐడీ అధికారులు తనను అక్రమంగా అరెస్టు చేశారన్నారు.

అబద్ధపు వాంగ్మూలం కోసం పీఎస్‌ఆర్‌పై ఒత్తిడి
ఈ కేసులో అబద్ధపు వాంగ్మూలాల కోసం సీఐడీ అధికారులు సీనియర్‌ ఐపీఎస్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులపై ఒత్తిడి తేవడం గమనార్హం. ఆయన్ను హైదరాబాద్‌లో అరెస్టు చేసే సమయంలో తన వద్ద ఉన్న ఒకే ఒక్క ఫోన్‌ను సీఐడీ అధికారులకు అప్ప­గించారు. అదే విషయాన్ని అధికారులకు చెప్పడంతో వారు సమ్మతించారు. కానీ పీఎస్‌ఆర్‌ను విజయ­వాడకు తీసుకువచ్చిన తరువాత సీఐడీ అధికారులు మధ్యవర్తుల నివేదిక పేరుతో ఓ పత్రాన్ని తెచ్చి సంతకం చేయాలని పేర్కొన్నారు. 

అందులో ఆయన వద్ద ల్యాప్‌టాప్, ఐప్యాడ్, మరో సెల్‌ ఫోన్‌ ఉన్నా­యని అంగీకరించినట్లుగా పొందుపరిచారు. దీనిపై పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు అభ్యంతరం వ్యక్తం చేశా­రు. తన వద్ద లేని ఎలక్ట్రానిక్‌  పరికరాలు ఉన్నట్టుగా రాసేందుకు నిరాకరించారు. హైదరాబాద్‌లో తన ఇంటి వద్దే అన్ని విషయాలు చెప్పానని, ఇప్పుడు ఇలా అబద్ధపు వాంగ్మూలం రాయమని చెప్పడం ఏమిటని నిలదీశారు. తమపై ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడి ఉందని సీఐడీ అధికారులు నిస్సహాయత వ్యక్తం చేయడం గమనార్హం. ఇదే విషయాన్ని పీఎస్‌ఆర్‌ న్యాయస్థానం దృష్టికి తెచ్చారు.

సాక్ష్యాధారాల చట్టం వక్రీకరణ...
పోలీసులే తన చేతిలో ఫోర్జరీ పత్రాలు పెట్టి వెంటనే స్వాధీనం చేసుకున్నారని కాదంబరి జత్వానీ తన ఫిర్యాదులో పేర్కొనడం మరో అబద్ధపు అభి­యో­గం. విచారణ జరుగుతున్న కేసులో భారత సాక్ష్యా­ధారాల చట్టాన్ని వక్రీకరించేందకు తెగించడం గమ­నార్హం. డ్రగ్స్, గంజాయి, ఇతర స్మగ్లింగ్‌ నిరో­ధక కేసుల్లో దేశవ్యాప్తంగా పోలీసులు, కస్టమ్స్‌ అధికా­రులు అనుసరించే విధానాన్నే నాడు విజయ­వాడ పోలీసులు పాటించారు. ఆమె నివాసంలో సోదాలు నిర్వహించగా ఫోర్జరీ పత్రాలు లభించా­యి. పోలీసులే తన చేతిలో ఫోర్జరీ పత్రాలు పెట్టా­రని ఆమె ప్రస్తుతం తప్పుడు అభియోగాలు మోప­డం వెనుక కూటమి ప్రభుత్వ పెద్దల పన్నాగం ఉంది.

టిఫిన్‌ కూడా పెట్టకుండా.. 
సీఐడీ అధికారులు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు పట్ల మానవత్వం లేకుండా, అగౌరవంగా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. ఆయన్ని బుధవారం ఉదయం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చిన అనంతరం న్యాయస్థానానికి తరలించారు. ఆయనకు కనీసం టిఫిన్‌ కూడా పెట్టలేదు. అనంతరం మధ్యాహ్నం రిమాండ్‌ కోసం విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. పీఎస్‌ఆర్‌పై మరిన్ని అక్రమ కేసులు నమోదు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

ప్రస్తుత డిప్యూటీ స్పీకర్‌ రఘురామరాజు గతంలో ఇచ్చిన అబద్ధపు ఫిర్యాదులో పీఎస్‌ఆర్‌ ఆంజనేయులును ఇరికించేందుకు కుట్ర పన్నుతున్నారు. తనను సీఐడీ అధికారులు హింసించారని రఘురామ గతంలో ఫిర్యాదు చేశారు. సుప్రీంకోర్టు దీన్ని తోసిపుచ్చినప్పటికీ టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అక్రమ కేసు నమోదు చేసింది. 

ఈ కేసులో అప్పటి సీఐడీ డీజీ పీవీ సునీల్‌కుమార్‌తోపాటు ఇతర అధికారులపై ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసింది. ఈ కేసులో పీఎస్‌ఆర్‌ ఆంజనేయులును కూడా చేరుస్తూ న్యాయస్థానంలో సీడీఐ బుధవారం మెమో దాఖలు చేయడం గమనార్హం. అసలు ఆయనకు సీఐడీతో ఎలాంటి సంబంధం లేదు. ఆ సమయంలో ఆయన ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా కూడా లేరు. ఏసీబీ డీజీగా ఉన్నారు. అయినా సరే పీఎస్‌ఆర్‌ను ఆ కేసులో నిందితుడుగా చేర్చడం విస్మయం కలిగిస్తోంది.

⇒ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు గతంలో ఏపీపీఎస్పీ కార్యదర్శిగా వ్యవహరించారు. ఆ సమయంలో కొన్ని ఫైళ్లు కనపడకుండా పోయాయంటూ దాదాపు నాలుగేళ్ల తరువాత ఏపీపీఎస్పీ కార్యదర్శితో తాజాగా ఫిర్యాదు ఇప్పించడం కూటమి సర్కారు కుట్రలకు నిదర్శనం.

⇒ గతంలో పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు తనను బెదిరించారంటూ ఉద్యోగ సంఘం నేత సూర్యనారా­యణతో టీడీపీ ప్రభుత్వం ఇటీవల అబద్ధాలతో ఫిర్యాదు ఇప్పించింది. ఆ ఫిర్యాదును సీఐడీకి తాజాగా పంపించడం ప్రభుత్వ కుటిల పన్నా­గానికి నిదర్శనం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement